యెంకి పాటలు/పిల్లోడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పిల్లోడు

యెంకితో తీర్తాని కెల్లాలి,
సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె!
యెంకితో తీర్తాని కెల్లాలి!

నెత్తిమూటల నెత్తుకోవాలి!
కొత్తమడతలు దీసి కట్టాలి!
అడవిదారులయెంట నడవాలి!
బరువు మారుసుకొంట పక్కున్న నవ్వాలి!
యెంకితో తీర్తాని కెల్లాలి!
సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె!
యెంకితో తీర్తాని కెల్లాలి!
తాతనాటీ వూసు తలవాలి!
దారిపొడుగున కీసు లాడాలి!
'తప్పునీదే' యంట దెప్పాలి!
దైభ మున్నాడాని దడిపించుకోవాలి
యెంకితో తీర్తాని కెల్లాలి
సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె
యెంకితో తీర్తాని కెల్లాలి

కతకాడ కూసింత నిలవాలి!
కతగాడు మావూసె జెప్పాలి!
నను జూసి పిల్లోడు నవ్వాలి!
మా లోన మామేటొ మతులిరుచుకోవాలి!
యెంకితో తీర్తాని కెల్లాలి!
సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె!
యెంకితో తీర్తాని కెల్లాలి!
కోనేటిలో తాణ మాడాలి!
గుడి సుట్టు ముమ్మారు తిరగాలి!
కోపాలు తాపాలు మానాలి!
యిద్దరము పిల్లోణ్ణి యీశుడికి సూపాలి!
యెంకితో తీర్తాని కెల్లాలి!
సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె!
యెంకితో తీర్తాని కెల్లాలి!