యెంకి పాటలు/ఉత్తమా యిల్లాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉత్తమా యిల్లాలు

ఉత్తమా యిల్లాలి నోయీ!
నన్నుసురుపెడితే దోస మోయీ!

నిదరలో నిను సూసి సెదిరెనేమో మనసు!
పొరుగు వోరంత నా సరస కురికారంట!
ఉత్తమా యిల్లాలి నోయీ!......
'ఏలనే నవ్వం'ట! 'ఏడుపేలే' యంట!
పదిమంది _ ఆయింత పగల బడి నారంట!
ఉత్తమా యిల్లాలి నోయీ!......
గాలెంట వోయమ్మ! దూళెంట వోయమ్మ!
యిరుగు పొరుగోరంత యిరగ బడి నారంట!
ఉత్తమా యిల్లాలి నోయీ!......
యీపూది వొకతెట్టె! యీపిం కొకతె తట్టె!
నీలు సిలికే దొకతె! నిలిపి సూసే దొకతె!
ఉత్తమా యిల్లాలి నోయీ!......
సాటునుండే యెంకి సబకు రాజేశావ?
పదిమంది నోళ్ళల్లొ పడమంట రాశాడ?
ఉత్తమా యిల్లాలి నోయీ!......