యెంకి పాటలు/ముందుగతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ముందుగతి

ఎక్కవే! కొండ నెక్కవే!
నా సక్క నెంకీ యెక్కవే!
కొండ నెక్కవే!
పక్క సూపులు మాని
పయి కెల్లి పోదాము!
యెక్కవే! కొండ నెక్కవే!
నా సక్క నెంకీ యెక్కవే!
ముందు నువ్వుంటేనే
కిందా నిలబడగలను
నీ నీడనే తొక్కు
కొని సులువుగ రాగల
నెక్కవే! కొండ నెక్కవే!
నా సక్క నెంకీ యెక్కవే!
నాలు గడుగు లేసి
నవ్వుతో పిలు యెంకి!
పిలుపు నవ్వే నాకు
ములుగఱ్ఱ కాగలదు!
యెక్కవే! కొండ నెక్కవే!
నా సక్క నెంకీ యెక్కవే!

తెల్లన్ని నీ పైట
సల్లంగ యిసురోలె!
ఆగాలి నాకాలి కట్టే
బగబగమండు
నెక్కవే! కొండ నెక్కవే!
నా సక్క నెంకీ యెక్కవే!
పదిమెట్లు పయికెల్లి
పల్లకుండా సూడు__
పగబట్టు పామల్లె
పయికి సర్రున వత్తు
నెక్కవే! కొండ నెక్కవే!
నా సక్క నెంకీ యెక్కవే!
యెల్లెల్లి పయికెల్లి
యిద్దరము కలిసి
మూట లివతల పెట్టి
మునిగి పోదము పైనే
యెక్కవే! కొండ నెక్కవే!
నా సక్క నెంకీ యెక్కవే!
*