యెంకి పాటలు/పడవ
Appearance
పడవ
ఆపలేనే యెంకి యీ పడవ యిసురు!
పాడలేనే యెంకి పదము లీ రొదలో!
పడవ సల్లగ నడిపి
పదము సదు వంటావు!
కస్సుమంటా యేరు
గాలి నెగబోసింది!
ఆపలేనే యెంకి యీ పడవ యిసురు!......
వోరుగాలే పాట
దారి కడతావుంది!
బేటి కురికే పాట
నోట గొడతావుంది!
ఆపలేనే యెంకి యీ పడవ యిసురు!......
తలమలుపుకొని పాట
తరలింది కామోసు!
దేముడల్లే లోన
తిరుగుతున్నా దేటొ!
ఆపలేనే యెంకి యీ పడవ యిసురు!......
యెన్నెలంటే పాట
కెంత మనసవుతాదో!
పాట సాగేతలికి
పయనమే మవుతాదొ!
ఆపలేనే యెంకి యీ పడవ యిసురు!......