యెంకి పాటలు/తోటవూసు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తోటవూసు

తోటవూసంటే సికాకూ,
యెంకి
తోటి యెల్లే దాని సోకూ!

బంతి సేమంతంట్ల
పరువంతా మాసింది;
మల్లెంటు మెల్లంగ
మారుమొగ మేసింది!

తోటవూసంటే సికాకూ,
యెంకి...
తూర్పేపు మళ్లేటి,
దుబ్బు దుట్రాయేటి;
అంటు మామిళ్లేటి.
ఆవొరస పళ్లేటి!
తోటవూసంటే సికాకూ,
యెంకి...

గొడ్డూగోదా బెంగ
గొని సిక్కిపోనాయి;
గడ్డిమేటిని సూత్తె
కడుపే సెరువౌతాది!
తోటవూసంటే సికాకూ
యెంకి...
నూతికాడే సోకు
యేతాముదే సోకు;
పోయి 'పాడో' యంటె
'వో' యంట పలికేవి!
తోటవూసంటే సికాకూ
యెంకి...
బలము సీదాపోయి
బడుగునై పోనాను;
కృష్టా రామా యంట
కూకోవలి సొచ్చింది
తోటవూసంటే సికాకూ
యెంకి...