యెంకి పాటలు/కటిగ్గుండెల నాయెంకి
స్వరూపం
కటిగ్గుండెల నాయెంకి
నీవెల్లిపోయినావంటే,
పచ్చినై,
నేనేటొ కొట్లాడుతుంటే;
యిరగమ్మలక్కలతొ నీవా
నా యెంకి,
యెకసక్కె మాడుతున్నావా !
నిన్ను రచ్చించ మంటానే
పద్దాక,
యెన్నొ దణ్ణాలు పెట్టేనే!
వొన్నెసీరలు గట్టి నీవా,
నా యెంకి,
వోసుగా తిరుగుతున్నావా!
పొద్దత్తమానాలు కాదే
నీవూసె,
వొద్దన్ననూ మరుపురాదే!
అమ్మలక్కలతోటి నీవా,
నా యెంకి
సెమ్మసె క్కాడుతున్నావా!
రేతిల్లొ మనతోటకాడా,
వొక్కణ్ణి,
నా తిప్పలీశ్శరుడు లేడా!
సీకు సింతాలేక నీవా,
నా యెంకి,
పోకల్లె పొండుకున్నావా!