యెంకి పాటలు/నమిలి మింగిన నాయెంకి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నమిలి మింగిన నాయెంకి

యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
మెళ్లో పూసలపేరు,
తల్లో పూవులసేరు,
కళ్లెత్తితే సాలు
కనకాబిసేకాలు!
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
సెక్కిట సిన్నీమచ్చ,
సెపితే సాలదులచ్చ!
వొక్కనవ్వే యేలు
వొజ్జిర వొయిడూరాలు!
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
పదమూ పాడిందంటె
పాపాలు పోవాల!
కతలూ సెప్పిందంటె
కలకాల ముండాల!
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!

తోటంతా సీకట్లె!
దొడ్డీ సీకటిమయిమె!
కూటికెళితే గుండె
గుబగుబమంటా బయిమె!
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
రాసో రింటికైన
రంగు తెచ్చే పిల్ల!
నా సొమ్ము__నా గుండె
నమిలి మింగిన పిల్ల!
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!