యెంకి పాటలు/కాశీరాణి
స్వరూపం
కాశీరాణి
నామాట తెలపవే నారాజుతోటీ
మామనుసులను కలుపు మాకాశీరాణీ!
నాకళ్ళలో చూచు
ఏకాడొతలపుంచు
తల పచట వల పిచట
తగునటమ్మా తనకు? నామాట...
వనమంత వొంటిగా
దినమంత తిరుగునే
తన నీడ సాటైన
సనువు లేదేనాకు ! నామాట...
అలిసలిసి యిలుసేరి
అడగనీడే బాధ
మనసునైనా పాద
మంటనీడేనన్ను! నామాట...
నవనీతమేరాజు
అవలీల పనినీకు
వలపు మూటలకెంత
శిలలైన కరుగునే! నామాట...