యెంకి పాటలు/కనుపాప

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కనుపాప

అద్దమే లంటాది అందాలు తెలప
ముద్దుమాటల కెంకిదే ముందు నడక!
అద్దమే లంటాది అందాలు తెలప!......
కంటెదర నాకాడ కనిపాపలోనీడ
సూసుకొంటా నొసట సుక్కెట్టుకుంటాది!
అద్దమే లంటాది అందాలు తెలప
ముద్దుమాటల కెంకిదే ముందు నడక
కనిపాపలో నీడ గని నవ్వుకుంటాది
మొకము సిటిలిస్తాది రకరకము లవుతాది!
అద్దమే లంటాది అందాలు తెలప!
ముద్దుమాటల కెంకిదే ముందు నడక!
కంటిదరి నాకాడ కంట నీ రెడతాది
కనిపాపలో నీడ మన సదరగొడతాది!
అద్దమే లంటాది అందాలు తెలప!
ముద్దుమాటల కెంకిదే ముందు నడక!
*