మీఁగడ తఱకలు/శివకవులు

వికీసోర్స్ నుండి

2

శివకవులు

వీరశైవులు నాస్తికు లనఁబడు జైనబౌద్ధమతములవారినే కాక శ్రాతస్మార్త కర్మము లాచరించు వైదికమతముల వారినిగూడ గర్షించిరి. వారు వీరవ్రతులు. భవులతో దర్శనస్పర్శన సంభాషణాది సాంగత్యము వారికిఁ దగదు. (భవు లనగా శైవేతరులు). శైవులలోఁ గవీశ్వరులగువారు శివునిమీదను దద్భక్తులమీదను దక్కనితరులగుభవులమీద నెప్పడును గృతులు చెప్పెడివారు కారు. కావున వారికి శివకవులని పేరు కల్లెను. కర్ణాటకాంధ్రగ్రంథములలో భవికవులను గర్షించిరి. కవితలోగూడ శివకవులు వేఱుమతము వారైరి.

శివకవులగ్రంథములు

మల్లికార్డునపండితారాధ్యుని శివతత్త్వసారమును, బాల్కురికి సోవునాథుని బసవపురాణాది గ్రంథములును, నన్నిచోడని కుమారసంభవమును నప్పడు మన కుపలబ్ధము లయిన శివకవుల గ్రంథములలో బ్రాచీనములు. మల్లికార్డునపండితుని కృతులు మటికొన్ని దొరకవలసియ న్నవి. మల్లికార్డున పండితునికంటెఁ బూర్వుడు శ్రీపతి పండితుండుకూడC గవియcట! ఆయన బెజవాడలో నున్నవాఁడు. ఆయన తెనుగుకృతు లేమేని రచించెనేమో యెఱుంగ రాదు. పండితారాధ్యచరిత్రలో నీక్రింది గ్రంథములు పేర్కొనఁబడినవి.

"అంచిత బాణగద్యాక్షరగద్య
పంచగద్యాదులు పటుగణాడంబ
రంబు వర్ణాడంబరంబు వ్యాసాష్ట
కంబును శ్రీనీలకంఠస్తవంబు
శ్రీరుద్రకవచంబు శారభంబును మ
యూరస్తవము హలాయుధ మనామయము

మలహణమును మహిమం బనుస్తవము
మలయరాజీయంబు మౌనిదండకము
స్తుతిమూలమగు మహాస్తోత్ర సూత్రములు
శతకంబు శివతత్త్వసారంబు దీప
కళిక మహానాటకము నుదాహరణ
ములు రుద్రమహిమయు ముక్తకావళులు
గీతసూక్తములు భృంగిస్తవంబులు పు
రాతనమునిముఖ్యరచితాష్టకములు
హరలీల -”

శివతత్త్వసారము తెలుఁగుకృతిగాన పైవానిలో నింక నొకటి రెండేవయినఁ దెలుఁగుకృతు లయియుండవచ్చునేమో కాని తక్కిన వన్నియు సంస్కృతగ్రంథములే. సోమనాథు డింకను దుమ్మెదపదములు, ఆనందపదములు, నివాళిపదములు, దండనాయకగీతములు, మొదలగు పదకృతులను దెలుఁగువానిని బేర్కొన్నాడు. దీనినిబట్టి చూడగానాశివకవుల తెలుగుకృతులు పద్యరచనముగలవి మల్లికార్జునపండితారాధ్యునికంటెఁ బూర్వకాలమున లేవేమో యని సంశయము కలుగుచున్నది. ఉన్నచో సోమనాథుఁడు పేర్కొనియుండునుగదా! సోమనాథునికంటె నర్వాచీనులగు శివకవుల కృతు లనేకము లున్నవి. శివకవుల రచనా రీతులను పరిశోధింపఁగా వీరిగ్రంథములకును, నన్నయ తిక్కనాదులగు (భవి) కవుల గ్రంథములకును బెక్కుబేదములు గానవచ్చుచున్నవి. ఈ విషయ మించుక వివరించి తెల్చెదను.

రచనాభేదములు

ఛందస్సు:- ద్విపదరచనలో శివకవుల విధమువేఱు. తాళ్లపాక తిరువేంగళనాథుఁడు ద్విపదలక్షణము నిట్లు నిర్వచించినాడు.

"వాసవుల్ మువ్వురు వనజాప్తుఁ డొకఁడు
 భాసిల్ల నదియొక్క పదము శ్రీకాంత

క్రమమున నవి నాల్గుగణముల నడచుc
గ్రమదూరముగఁ బ్రయోగము సేయరాదు
ఆపాదమునకు మూcడవగణం బాది
దీపించుయతి యంబుధి ప్రియతనయ
యుపమింప నవి ప్రాసయుతములై రెండు
ద్విపదనా విలసిల్లె వికచాబ్జపాణి
ద్విపదకు ద్విపదకుఁ దెగఁజెప్పవలయు
నెపుడు - సంస్కృతమున నితరభాషలను
యతులలోపలఁ బ్రాసయతి దక్క సకల
యతులుఁ జెల్లును బ్రయోగానుసారమున
ద్విపదతో ద్విపద సంధిల నేకశబ్ద
మపుడు ప్రయోగింప నది యయుక్తంబు
మఱియు సంస్కృతపు సమాసరూపమున
నెఱయ నెన్నిటినైన నిర్మింపఁదగును
...................................................
అనులక్షణమ్ముల ననువొంది సుకవి
జనసుప్రయోగైకశరణమై-"
                                               - అష్టమహిషీకల్యాణము.

రంగనాథుని రామాయణము, గౌరనహరిశ్చంద్రచరిత్ర మొదలగు ద్విపదలందుఁ గానవచ్చు విధమునే యీ లక్షణము చెప్పచున్నది. శివకవుల ద్విపదరచన మిందులకు విరుద్ధముగా నున్నది. రంగనాథ రామాయణాదులందుc గానరాని ప్రాసయతి బసవపురాణము మొదలగు శివకవుల గ్రంథములం దున్నది. మఱియు, ద్విపదయు ద్విపదయుc గలయునప్పు డొక్కపదమే యిటుకొంత యటుకొంత యగునట్లు రంగనాథాదు లెక్కడను గూర్పరయిరి. పాల్కురికి సోమనాధాదులగు శివకవులు పదమధ్యమందే ద్విపదము ముగియునట్లు పెక్కుచోట్ల రచనము నెఱపిరి. సోమనాథుండు “జాతులు మాత్రానుసంధానగణవి, నీతులు గాన 'యనియతగణై', రనియును 'ప్రాసోవా' యనియు 'యతిర్వా' యనియుఁజెప్పు ఛందో వినిహితోక్తిగాన, ప్రాసమైనను యతిపై వడియైన, దేసిగా నిలిపి యాదిప్రాసనియతి, తప్పకుండఁగ ద్విపదలు రచియింతు" నని మాత్రాగణ ఘటిత మగుటచే ద్విపదలో ప్రాసయతి చెల్లు ననుటను సంస్కృతసూత్రములనుగూడ నుదాహరించి చెప్పినాడు. ద్విపదము ప్రాసయతి గలిగియుండుటయు, రెండేసిచరణములకుఁ దునుకలుగాక ద్విపదమునుండి ద్విపదమునకు దూఁకునట్లు పదమధ్య సంధిగలిగి జడవాఱి యుండుటయు శివకవుల కృతులలోనే కానవచ్చును.

మఱియు నన్నయాదుల కృతులలోఁ బ్రాసములందుహల్సామ్యము దప్పక కానవచ్చును. అనఁగా మొదటిచరణము ద్వితీయాక్షరముననెన్ని హల్లులు సంయుక్తములుగా నున్నవో యన్ని సంయుక్తహల్లులును, దక్కిన మూఁడు చరణములందునుగూడఁ బ్రాసస్థానమున నుండును. శివకవు లీనియమము నంతగాఁ బాటింపరైరి. కతిపయ హల్సామ్య మున్నఁ జాలు నని వీరు తలంచిరి. ఒక్కహల్లు హెచ్చోతక్కువో యయినను బ్రాసమును వీరు పరిగ్రహించిరి.

క|| నమ్మినభక్తుఁడు గన్నడ
     బమ్మయ సద్భక్తి మహిమ పరికింపఁగ లో
     కమ్ములఁ జోద్యము గాదె య
     ధర్మంబును ధర్మమయ్యెఁ దత్త్వాతీతా!
                                             -శివతత్త్వసారము

ప్రాఁత వ్రాఁతలలో “ధమ్మ౯" యని యుండును.

   "మర్త్యలోకమునకు మఱి వేఱె యొకఁడు,
     కర్త యున్నాఁడె లోకత్రయవరద, -
     తత్రిపురాంతక స్థానవాస్తవ్యుఁ
     డై త్రిపురాంతకుఁ డభినుతిఁ బేర్చు
                                              -బసవపురాణము.

ఇత్యాదులు పెక్కు లున్నవి. మఱియు, నన్నయాదికవీశ్వరులు ప్రాసములం దెక్కడను బూర్ణబిందువును నర్థబిందువును బొందింపరయిరి. శివకవుల గ్రంథములలో నది కానవచ్చుచున్నది.

క|| పోఁడిగ నగజతపశ్శిఖి
     మూఁడు జగమ్ములను దీవ్రముగఁ బర్విన బ్ర
     హ్మాండము గాఁచిన కాంచన
     భాండము క్రియదాల్చెఁ దత్ప్రభాభాసితమై,
                                            -కుమారసంభవము
 
     పాండురాంగంబైవ పడఁతిగర్భమునఁ
     బోఁడిగా వెలుఁగుచుఁ బుత్రుం డీక్రియను.
                                            -బసవపురాణము
     ఇత్యాదులు పెక్కు లున్నవి.

ಇట్టి ఛందోలక్షణవిశేషములుగాక, శబ్దప్రయోగములందునుగూడ శివకవులకు నితరకవులకుఁ బెక్కు భేదము లున్నవి.

శబ్దప్రయోగములు

తెఱఁగువోలె, వడువువోలె, - ಇట్టి ప్రయోగములు శివకవుల గ్రంథములందే నాకుc గానవచ్చినవి.

"తెరువు దాఁ దీర్చిచూపెడు తెఱఁగువోలె
 బలసికొలువున్న సురగిరిభంగివోలె
 నందనవనము గాపువచ్చు వడువువోలె
 పాలకడలిలో నిల్చిన భంగివోలె-"
                                    -కుమారసంభవము

"వచ్చువహిత్రంబు వడువునుబోలె
 కరమర్ధి నందిచ్చుకరణియుcబోలె-"
                                      -బసవపురాణము

పూంచు, పూన్చు,-ఈధాతువు నన్నయాదికవీశ్వరుల గ్రంథములందుc బెక్కుచోట్లఁ బ్రయోగింపఁబడియున్నది. అది పూను ధాతువప్రేరణరూపము. పూనఁజేయుట దాని యర్ధము. ‘అరదము పూంచి' ఇత్యాది ప్రయోగము లున్నవి. శివకవుల గ్రంథములందెల్ల నీధాతు వింకొక యర్ధమునఁ బ్రఖ్యాతముగాఁ గానవచ్చుచున్నది. పూన్చు = పూజించు. ఈ ధాతువు నీయర్ధమున నన్నయాదులు ప్రయోగించినట్లు కానరాదు.

క|| కన్ను వడిఁబుచ్చి పూన్చిన
     వెన్నుని భక్తికి వరంబు వెదచల్లుక్రియన్

క|| మొఱటద వంకయ దనతల
     లఱిమెల్వడఁ దఱిగి నీపదాంబుజములఁ గ్ర
     చ్చఱఁ బూన్చి మగుడఁ బడయఁడె.

క|| ఉన్నతభక్తి శిరంబులఁ
     బన్నుగ శివుఁ బూన్చి కరుణcబడసినభంగిన్
     ము న్నేవిధులం గొలిచియుc
     జన్న దశాననుఁడు వడయఁజాలెనె చెపుమా,
                                             -శివతత్త్వసారము.

చ|| హరి వికచామలాంబుజ సహస్రము పూన్చి
                                           - కుమారసంభవము.

    -ద్విపదాంబురుహముల ధృతిఁ బసవేశు
    ద్విపదాంబురుహము లతిప్రీతిఁ బూన్తు
    ఈపద్మములఁగాదె యింతి యాకుంతి
    పాపారిఁబూజించి బడసెఁ బాండవుల
    చెండి యీపద్మముల్ శివుఁ బూన్చి కాదె
    సుందరి భృగుపత్ని శుక్రునిఁబడసె
    అదిగాక యీపూల హరుఁ బూన్చి కాదె
    సుదతి కౌసల్య సత్సుతు రాముఁ బడసె.
                                             - పండితారాధ్యచరిత్ర.

పూజించుట యందుఁ బూన్చు ప్రయోగము శివకవుల గ్రంథములలోc బెక్కు చోట్లఁ గలదు. మఱియు సమూహి, దాసి (దాసుఁడనుటకు) ముల్లోకనాథుఁడు, పుడమీశ్వరుఁడు, సర్వాంగకచ్చడము, దీపగంభములు, తవనిధి, మొదలగు ప్రయోగము లెన్నో శివకవులు తఱచుగాఁ బ్రయోగించినవి కలవు. ఇట్టి పదములు కొన్ని యితరకవుల కృతులలోఁగూడఁ గ్వాచిత్కముగాc గానవచ్చునుగాని శివకవులే వీనిని తఱచుగాఁ బ్రయోగించిరి. ఇటీవలి లాక్షణికులు కఱకంఠుఁడు, ప్రాణగొడ్డము, దినవెచ్చము మొదలగు పదములను గొన్నింటినిమాత్రము త్రోసిపుచ్చఁజాలక, యనింద్యగ్రామ్యములని పేరుపెట్టి ప్రయోగార్హము లనిరి. శివకవుల కృతులలో లాక్షణికు లనుగ్రహింపనివి యిట్టివి కుప్పతెప్పలుగా నున్నవి. మఱియు నిప్పటి వ్యాకరణమును దలక్రిందులొనర్చు ప్రయోగము లనేకము లున్నవి. మరియు నపూర్వశబ్దములు శబ్దరత్నాకరమందుc గానరానివి యనేకము లున్నవి. శివకవుల కృతులలోని వింతప్రయోగములను వేఱొకచోట వివరించి తెల్పుదును.

ఇతరకవులు వీరిని గర్హించిరి

ఇట్టి రచనావిధానము లితరాంధ్రకవులకు సమ్మతములు గావయ్యెను. వారు పాటించిన ఛందోనియములను భాషా నియమములను వీరు సరకుసేయక కొంత సడలింపఁజాగిరి. పాల్కురికిసోమనాథుని కాలముననే దీనిఁగూర్చి యోరుcగంటిలోఁ దగవు నడచినది.

సీ|| ఒకనాడు శివభక్తు లోcరుగంటను స్వయం
                 భూదేవుమంటపంబున వసించి
      బసవపురాణంబు పాటించి వినువేళ
                 హరునిఁగొల్వఁ బ్రతాపుఁ డచటి కేఁగి
      యాసంభ్రమం బేమి యనుడు భక్తులు బస
                 వనిపురాణం బర్థి వినెద రనిన
      విన నాపురాణంబు విధ మెట్లొకోయన్న
                 ధూర్తవిప్రుఁ డొకండు భర్తఁ జేరి

గీ|| పాలకుర్కి సోమపతితుc డీనడుమను
     బెనచె మధ్య (ప్రాస?) వళ్లు పెట్టి ద్విపద
     నప్రమాణ మిది యనాద్యంబు పద మన్న
     నరిగె రాజు-"

తర్వాత సోమనాథుఁ డోరుcగంటికి వచ్చి యద్భుతచర్యలచే స్వరచనమును సమర్ధించుకొన్నట్టు పద్యబసవపురాణమం దున్నది. ఈకారణముచేతనే యీశివకవుల కావ్యములనుండి ప్రాచీనలాక్షణికులు ప్రయోగముల నంతగాఁ గయికొనరయిరి. గ్రంథారంభమున దుష్టగణ ప్రయోగముచేసి యుద్ధములోఁ జచ్చెనని నన్నిచోడని నధర్వణుఁ డాక్షేపించెను.

  • [1]క|| మగణమ్ము గదియ రగణము

       వగవక కృతిమొదట నిలుపువానికి మరణం
       బగు నిక్కమండ్రు మడియఁడె
       యగు నని యిడి తొల్లి టెంకణాదిత్యుఁ డనిన్.

బమ్మెరపోతరాజుగారి గ్రంథములనుగూడ లాక్షణికులు కైకొనమి కిది కారణము గావచ్చును. ఆయన వీరభద్రవిజయరచనమును శివకవి సంప్రదాయము ననుసరించియేయున్నది. (వీరభద్రవిజయము భాగవతకర్త యగుపోతరాజుగారు రచించినది కావచ్చు నని నాతలపు).

ఒక శివకవి యిట్లు చెప్పుచున్నాడు.

ఇలఁ బాలకురికి సోమేశుండు మున్ను
తొలంగక ప్రాసయతుల్ ద్విపదలను
లలి రచించుట యది లక్ష్యంబుగాను
అలమి రేఫ రకారములు శివకావ్య
ములయందుఁ జెల్లుఁ దప్పులుగావు, గాన
ఆపాల్కురికిసోము ననుమతి నేను

దీపితప్రాస యతిచ్ఛద సరణి
నామహాగురుదేవు ననుమతియట్లు
శ్రీ మెఱయంగ రచించితి నిట్లు
                                 - మఱి బసవపురాణము.

ఇతరకవులు గర్హించినను దర్వాతి శివకవులు సోమనాథాదుల మార్గమును వెన్నాడిరి. ఇప్పటికి రెండువందల యేండ్లకు ముందున్న కవులు, అత్తలూరి పాపకవి మొదలగు వారుకూడ నాసంప్రదాయమునే పాటించిరి. పాల్కురికి సోమనాథుని గ్రంథములలో నితరకవులకు విరుద్ధములయిన ప్రయోగము లేవికలవో యవి పాపకవి మొదలగువారి గ్రంథములలోఁ గూడ నున్నవి. మఱియుఁ బాల్కురికి సోమనాథుఁడు చూపిన త్రోవయగుటచేఁ గాఁబోలును శివకవు లనేకులు ద్విపదకృతులను రచియించిరి.

వీరు తెనుఁగనే ప్రేమించిరి

ద్రవిడదేశమున శైవులును, వైష్ణవులును సంస్కృతభాషకంటెఁ దమ తమిళభాషనే పూజ్యమయిన మతభాషగాc జేసికొన్నట్టుగా నీ తెనుఁగుదేశమునఁగూడ వీరశైవులు తెలుఁగుభాషనే మతభాషగాఁ జేసికొనఁ దలంచిరి. మల్లికార్జున పండితారాధ్యుఁడు శాస్త్రార్ధములతోఁ గూడిన మతగ్రంథమును శివతత్త్వ సారమును దెనుఁగుననే రచియించెను.పాల్కురికి సోమనాథుఁడుకూడc దాను గ్రొత్తగా వెలయించిన బసవపురాణము, పండితారాధ్యచరిత్రము, చతుర్వేదసారము మొదలగు గ్రంథములను దెనుఁగుననే రచియించెను. వీరు సంస్కృతమునఁగూడ గొప్పవిద్వాంసులే! బసవపురాణమును, బండితారాధ్యచరిత్రమును సోమనాథుఁడు తెనుఁగుననే రచియింపఁగాఁ దర్వాతివారు వానిని గర్ణాటమునకును, సంస్కృతమునకును బరివర్తించుకొనిరి. బసవపురాణపండితారాధ్య చరిత్రాదిగ్రంథములను శైవులు భారతరామాయణాదులవలెc బవిత్ర గ్రంథములుగాఁ బూజించుచుందురు. ఇది తెనుఁగున కొక గొప్ప గౌరవము. తన గ్రంథములు సర్వసామాన్యములుగా నుండవలె ననియు, నట్లుండుటకుఁ దెనుఁగు ద్విపదయే తగిన దనియు, గద్యపద్యాదిపూరిత మయిన సంస్కృతప్రాయరచన సర్వసామాన్యము కా దనియు సోమనాథుఁడు చెప్పినాడు.

"తప్పకుండఁగ ద్విపదలు రచియింతు
 నొప్పదు ద్విపద కావ్యోక్తి నావలదు
 ఆరూఢగద్య పద్యాది ప్రబంధ
 పూరితసంస్కృత భూయిష్ఠరచన
 మానుగా సర్వసామాన్యంబుగామి
 జానుదెనుఁగు విశేషము ప్రసన్నతకు.
                                     - పండితారాధ్య చరితము.

మఱియు -

ఉరుతర గద్యపద్యోక్తులకంటె
సరసమై పరఁగిన జానుదెనుంగు
చర్చింపఁగా సర్వసామాన్య మగుటఁ
గూర్చెద ద్విపదలు కోర్కిదైవాఱఁ
దెలుఁగుమాట లనంగవలదు వేదముల
కొలఁదియకాc జూడుc డిల నెట్టు లనిన
                                          - బసవపురాణము,

తెలుఁగు మాటలుగాదాయని తేలఁ దలంపవలదు. వేదములవలెఁ జూడుc డని చెప్పినాఁడు!

జాను దెనుఁగు

మఱియు జానుదెనుఁగు మిక్కిలిప్రసన్నమయిన దనియు, సర్వసామాన్యమయిన దనియుఁ జెప్పినాఁడు. నన్నిచోడఁడుకూడ నీ జానుదెనుఁగును బ్రశంసించినాఁడు,

చ|| బలుపొడతోలు సీరయును పాపసరుల్ గిలుపారుకన్ను వె
      న్నెలతల సేఁదు కుత్తుకయు నిండిన వేలుపుటేఱు వల్గుపూ
      సలుగల ఱేనిలెంక వని జానుఁ దెనుంగున విన్నవించెదన్
      వలపు మదిన్ దలిర్ప బసవా! బసవా! బసవా! వృషాధిపా!
                                                   - వృషాధిపశతకము.

చ|| సరళముగాఁగ భావములు జానుదెనుంగున నింపు పెంపుతో
                                                   - కుమారసంభవము.

ఆకాలమున నీజానుదెనుఁగు మిక్కిలి ప్రసన్నమై సర్వసామాన్యమై యుండెను. తర్వాతి మనకవీశ్వరులు సంస్కృత ప్రాయమైన రచనను దెనుఁగునఁ జొప్పించి, జానుదెనుఁగును సన్నగిలఁజేసిరి. ఇటీవలఁ దెనుఁగు రచనలలో రుచ్యములయిన తెలుఁగు పలుకుబళ్లు మిక్కిలి తక్కువ కాcజొచ్చెను. పాల్కురికి సోమనాథుని గ్రంథములలోను, నన్నిచోడని కుమారసంభవములోను మన కిప్పు డర్థముగాని తెలుఁగు పలుకు లనేకము లున్నవి. సంస్కృత ప్రాయమగు రచనకు మన మలవడుటయే దీనికిఁ గారణము.

ఆంధ్రకవిత శివకవులమూలమున గొప్పయభ్యుదయము గాంచిన దన్నవాస్తవవిషయము వారిగ్రంథములను జాగ్రత్తగ చదివినప్పుడే మనకు ప్రవ్యక్తముగాఁగలదు.

  • * *
  1. *ఈ పద్యమును శ్రీరామకృష్ణకవిగారు కుమారసంభవపీఠికలో నుదాహరించిరి.