మీఁగడ తఱకలు/పండితరాధ్య చరిత్రము

వికీసోర్స్ నుండి

3

పండితరాధ్య చరిత్రము

శ్రీమల్లికార్డునపండితారాధ్యుని

జన్మాదిక వృత్తాంతములు - గ్రంథరచనా విశేషములు

శ్రీమల్లికార్జునపండితారాధ్యుఁడు ఆంధ్రశైవాచార్యులలో పండిత త్రయ మని యెన్నికగన్న శ్రీపతి, మంచెన, మల్లికార్జున పండితులలో మూcడవవాcడు.

జన్మాదికము

గోదావరి మండలమందలి దాక్షారామ మీయన జన్మస్థలము. ఆయూర వెలసియుండు భీమేశ్వరస్వామివారి కీతనివంశమువారు పూజారులు. పురోహితు లని సోమనాథుఁడు చెప్పినాఁడు. అర్చకులు, ఒండె స్థానపతులు కాఁదగుదురు. శివతత్త్వసారమునుబట్టి చూడంగా నర్చకులే యగుదు రని తోఁచును. ఆనాఁడు కర్ణాటాంధ్రదేశములందుఁ బేరెన్నికగన్నవాణసవంశమున నీతఁడు జన్మించెను. చాళుక్య రాజులకు మంత్రులు, ఆస్థానకవులు నయి వన్నె కెక్కినవారు వాణసవంశము వారు. శాసనములలోఁ బలుచోట్ల తద్వంశ్యప్రశంస యుండును.

ఆంధ్రభారతకర్తయగు నన్నియభట్టారకుని సహాధ్యాయుఁడు నారాయణభట్టు వాణసవంశమువాఁడు. మడికిసింగన పాద్మోత్తరఖండకృతికిఁ బతి కందనామాత్యుఁడు వాణసవంశమువాఁడు.

తే|| కశ్యపబ్రహ్మ యన జగత్కర్త పుట్టె
     నతని తనువున నుదయించె నఖిలజగము
     నతనిగోత్రజులందుఁ బెం పతిశయింప
     వాణసాన్వయ మొప్పారె వసుధమీఁద.

అని మడికిసింగన చెప్పినాఁడు. పండితారాధ్యునిచరిత్రము రచించిన సోమనాథుఁడు వాకొనలేదుగాని, వాణసవంశ్యులు కాశ్యపగోత్రులు గాన నారాధ్యదేవరకూడఁ గాశ్యపగోత్రుఁడే యనవలెను. 'చతుర్మఠనిర్ణయ' మని యిటీవల ఓరుగంట ముద్రితమయిన యొక చిన్నిపుస్తకమున నాతఁడు గౌతమగోత్రజుఁ డని కలదు. గౌరాంబా, భీమనపండితు లీతనితలిదండ్రులు. భీమనపండితుఁడు తాను శ్రీశైలమునఁ బంచాక్షరీమంత్రము జపముచేసి పడసిన సంతానముగాన, ఈ పుత్రునికి మల్లికార్జునుఁ డని పేరుపెట్టెను. దాక్షారామముచేరువనే కోటిపల్లిలో నున్న యారాధ్యదేవరదగ్గఱ నీతఁడు శైవమంత్రదీక్షఁ బడసినాఁడు. పండ్రెండవశతాబ్దియత్తరార్ధమున, 1150 నుండి 1180 దాఁక నీమహనీయుఁ డాంధ్రదేశమునఁ బ్రఖ్యాతుఁడై యుండెను. గుంటూరు మండలమందలి ధనదుపురమున (నేఁటి చంద్రవోలు) వెలనాటి చోడని యాస్థానమున నీతఁడు బౌద్ధాచార్యులతో మతవివాదము నెఱపెను.

బౌద్ధాచార్యులపై కక్ష

శ్రీకాకుళక్షేత్రమునఁ*[1] గల మల్లేశ్వరాలయమున (ఈయాలయము నేఁడును శ్రీకాకుళమునఁ గలదు) గల 'దివియకంబమును' (దీపములు వెలిఁగించు లోహస్తంభమును) బౌద్ధాచార్యులు పెల్లగించి కొనివచ్చి వెలనాటిచోడని వివాదసభలో నిలిపిరఁట. మల్లికార్జునపండితారాధ్యునితో వాదములందు శివనింద చేసినదోషమును, దీపార్చనాసాధనమునుహరించిన దోషమును సైపఁజాలక పండితారాధ్యులశిష్యులాబౌద్ధాచార్యులను జంపిరి. ఆబౌద్ధాచార్యులు ప్రతిదినము సముద్రమధ్య ద్వీపమునఁగల బుద్దప్రతిమను బూజింప నరుగుచుండువారఁట! ధనదుపురమునకు సమీపమునఁగల సముద్రద్వీపము నేఁటి దీవిఖండము. అక్కడ బౌద్ధస్తూప ముండెడిది గాఁబోలును. కాదేని ధనదుపురమునకుఁ జేరువనేకల బుద్దాము మొదలగు గ్రామములు గావచ్చును. కాని యవి సముద్ర ద్వీపస్థములుగావు. బౌద్ధాచార్యు లాసముద్ర ద్వీపమునకు బుద్ధపూజ జరపనేఁగినపుడే పండితారాధ్యుల శిష్యులు వారిని జంపిరి. అట్లు వారిని జంపుటకుఁ బండితారాధ్యుఁ డాశిష్యుల కనుజ్ఞ యిచ్చెనఁట. శివదూషకులను జంపుట పాపముగా దని పండితారాధ్యుఁడు శివయోగ సారమునఁ జెప్పినాఁడు.

క|| శివనిందావిషయం బగు
     నవమానము సెప్పునట్టి యప్పుస్తకముల్
     అవిచారంబునఁ గాల్పఁగ
     నవుఁ జెప్పెడివానిఁ జంపనగు నీశానా!

క|| శివనిందారతుఁ జంపిన
     జవమఱి తత్కారణమునఁ జచ్చిన నీరెం
     డువిధంబుల నీకారు
     ణ్యవశంబున ముక్తిఁ బొందు నరుఁ డీశానా!

రాజుగారి ఆగ్రహము

ఈ ఘోరకార్యమునకుఁ గోపించి రాజు పండితారాధ్యులవారి కనులు దోడించెను. శివానుగ్రహమున నారాధ్యులవారికి మరలఁ గనులు వచ్చినవఁట! రాజును, దద్రాజ్యమును నాశ మగునట్లు శపించి, యారాధ్యులవా రక్కడనుండి సశిష్యులై, కల్యాణకటకమున వీరశైవమత ప్రతిష్ఠాపనాచార్యుఁడై ప్రఖ్యాతిఁగనుచున్నబసవేశ్వరుని దర్శింపఁ బయన మయిరి. బసవేశ్వరుని శివభక్తిపరాకాష్ఠకుఁ బరమాదరమును, వైదికవర్ణధర్మపరిత్యాగమునకు నప్రీతియుఁ గలవారై యాయనతోఁ జర్చించుటకే పండితారాధ్యు లట్లు వెడలి రందురు. 'భక్తిమీఁదివలపు, బ్రాహ్మ్యంబుతోఁ బొత్తు, పాయలేను నేను బసవలింగ' యని బసవేశ్వరుని కారాధ్యులవారు వార్త పంపిరఁట! అమరావతి, నడుగుడుములు (నేcటి నడుగూడెము-మునగాల పరగణాలోనిది) పానగల్లు పురములమీఁదుగాఁ గల్యాణమునకుఁ బోవుచు వనిపుర మనుగ్రామమున నుండఁగా బసవేశ్వరుఁ డప్పటి కెనిమిదిదినములకు ముందు లింగైక్య మందుట పండితారాధ్యులకు తెలియవచ్చెను. పండితుఁడు చాల విలపించి యక్కడనుండి శ్రీశైలమునకు వెడలి, యల్పకాలమునకే యక్కడఁ దానును లింగైక్యమందెను. ఇది పండితారాధ్యుల చరిత్రసారము. దీనిని బెంచి పెద్దచేసి పాల్కురికి సోమనాథుఁ డయిదు ప్రకరణముల ద్విపద గ్రంథముగాఁ బండితారాధ్యచరిత్రము రచియించెను. సోమనాథుని ద్విపదగ్రంథమున పండితారాధ్యుల శివతత్త్వసారము చాలఁగా ననువాదముఁబడసినది. సోమనాథుని ద్విపదపండితారాధ్యచరిత్రము ననుసరించి కవిసార్వభౌముఁడు శ్రీనాథుఁడు పద్యకావ్యముగాఁ బండితారాధ్య చరిత్రమును శృంగారనైషధకృతిపతియగు మామిడిసింగమంత్రియన్నకు ప్రెగ్గడయ్యకుఁ గృతిగా రచించినాఁడఁట! అది యిప్పుడు గానరాదు.

పండితారాధ్యుని గ్రంథములు

శివతత్త్వసారము, శతకము, రుద్రమహిమ, భీమేశ్వరగద్యము, లింగోద్భవదేవగద్యము, స్తుతిశ్లోకపంచకము, అమరేశ్వరాష్టకము, పర్వతవర్ణన అన్న గ్రంథములు పండితారాధ్య రచితములుగా సోమనాథుఁడు పేర్కొన్నాఁడు. ఇందు భీమేశ్వరగద్యము 'యత్సంవిత్తి' అని యారంభ శ్లోకముగలదిగాను, స్తుతిశ్లోకపంచకము తస్మై నమ శ్రీగిరివల్లభాయ' అని మకుటముగలదిగాను సోమనాథుఁడే పేర్కొన్నాఁడు. పైగ్రంథములలో శివతత్త్వసారము, శతకము = తెల్గుగ్రంథములు. తక్కిన వెల్ల సంస్కృతగ్రంథములే కాఁబోలును. ఇవిగాక, సంసారమాయాస్తవము, శంకరగీతము లని పదములు, ఆనందగీతము లని పదములుకూడ మల్లికార్జునపండితారాధ్యరచితము లనుకొనఁదగినట్లు సోమనాథుఁడు పేర్కొన్నాఁడు. ఈగ్రంథములు గాక మద్రాసుప్రాచ్యలిఖితపుస్తకశాలలో మల్లికార్జున పండితారాధ్య కృతి 'శ్రీముఖదర్శనగద్య' మని సంస్కృత గ్రంథ మొకటి గలదు. బసవపురాణ పీఠికలో దాని నేను వెల్లడించితిని. ఆరాధ్యదేవరమల్లికార్జునశతకము లోనిదిగా నీక్రిందిపద్యము లక్షణ గ్రంథములందుం గలదు.

ఉ|| లోకములెల్ల నీతనువులోనివ, నీవట యెంత కల్గుదో
      నాకపపద్మసంభవ జనార్ధను లాదిగ నెల్లపెద్దలున్
      నీకొలఁ దింతయంత యన నేరక మ్రొక్కఁ దొడంగి రన్న ని
      న్నేకరణిన్ నుతింతుఁ బరమేశ్వర!శ్రీగిరి మల్లికార్జునా!

సోమనాథుఁడు పేర్కొన్న శతక మీశ్రీగిరి మల్లికార్జునశతకము గాcబోలును. ఇది సమగ్రముగా దొరకవలసియున్నది. సోమనాథుఁడు తన పండితారాధ్యచరిత్రమునఁ జాలగాఁ దనద్విపదకృతిలోనికి మార్చుకొన్నది, ఆంధ్రకందపద్యాత్మకము తిక్కనసోమయాజులవారి కింకను నూఱేండ్ల ప్రాఁతకాలపు దగుటచే భాషాచరిత్రాదిపరిశీలకుల కత్యంతోపకారము, తత్కాలపు టాంధ్రదేశపు టారాధ్యశైవమతసంప్రదాయనిరూపకము  నగుటచే, పండితారాధ్యుని గ్రంథములలో శివతత్త్వసారము ముఖ్యమయిన దనవచ్చును. ఇర్వదియేండ్లకు ముందు నరసాపురమున నొకజంగముదేవర యింట దాని నేఁ గనుఁగొంటిని. చెన్న పురిప్రాచ్యలిఖితపుస్తకశాలకు సేకరించితిని. కీర్తిశేషులు శ్రీలక్ష్మణరావుగారు దాని నప్పుడు సాహిత్య పరిషత్పత్రికలోఁ బ్రకటించిరి. తర్వాతఁ బుస్తకముగాను బ్రకటించిరి. కాని యప్పు డాదొరకిన పుస్తకముగూడ నసమగ్రమే. అందు నన్నూట యెనుబది తొమ్మిదిపద్యములు మాత్రమే కలవు. అం దింక నెన్నిపద్యము లుండవలెనో అప్పుడు తెలియ నశక్యమయ్యెను. లక్షణగ్రంథములందు పండితారాధ్యదేవరశివతత్త్వసారములోనివిగా నుదాహృతము లయిన పద్యములు గొన్ని యీముద్రిత గ్రంథమునఁగానరావు. ఆపద్యము లివి

క|| జడ లల్లి భూతి పూయని
     పొడవులఁ బొడగాన మాది పురుషులలోనన్
     నడుమంత్రపు సమయంబులు
     జడమతు లలరించుకొనిరి చంద్రాభరణా!

క|| ఆయెడఁ ద్రిపురాంతకదే
     వా యని పిలుచుటయుఁ గటకమంతయు వినఁగాఁ
     బాయక కిన్నర బ్రహ్మయ
     కోయని యెలుc గీవె తొల్లి యురగాభరణా!

క|| పతి! సదృశాధికతాప
     త్రితయ, గుణత్రితయ, జన్మమృతి సుఖదుఃఖ
     క్షతివృద్ధిబంధమోక్ష
     స్తుతినిందాదులును లేవు ధూర్జటి ! నీకున్||

క|| అంచితమతి నెవ్వరు ని
     ర్మించిరి వంచితులు సురలు కృత్యాదికళా
     భ్యంచితమై తనరారు ప్ర
     పంచము నీయట్ల వరద ! పరమానందా!

ఈ పద్యములఁబట్టి చూడఁగా నింక నెంతో గ్రంథము దొరకవలసియున్న బ్లేర్పడును. ఈపద్యము లిప్పుడు దొరకకున్న గ్రంథభాగములోని వగు ననcదగును.

కన్నడ గ్రంథము

ఆంధ్రపద్యాత్మకమగు శివతత్త్వసారము విషయ మిట్లుండఁగా నాకు కన్నడమునగూడ నీకృతి గనుగొన నయ్యెను. చెన్నపురిప్రాచ్యలిఖిత పుస్తకశాలలో నేదోకర్ణాటకగ్రంథముతో పాటు, ఆద్యంతశూన్యమై యనామధేయమై కన్నడకందపద్యముల గ్రంథభాగ మొకటి కానవచ్చెను. కన్నడపండితు లాపద్యములఁ జదువుచుండగా వింటిని. తెలుఁగు శివతత్త్వసారపద్యములే యనిపించును. ఆనుపూర్వితోఁ బరిశీలించితిని. తెలుఁగుపద్యములవరుసనే కన్నడపద్యము లున్నవి. తెల్గుకృతిలో మల్లికార్జునపండితారాధ్యుఁడు తనపేర నీక్రిందిపద్యము చెప్పికొన్నాఁడు

క|| ఒండేమి మల్లికార్జున
     పండితుఁ డననుండుకంటెఁ బ్రమథులలో నె
     న్నండొకొ నీయాజ్ఞోన్నతి
     నుండం గాంతు నని కోరుచుండుదు రుద్రా !

ఇట్లే పండితారాధ్యునిపేరనే కన్నడపద్యము నున్నది.

క|| ధరయొళగె మల్లికార్జున
     వరపండిత నెనిసుతి హుదఱిం నిన్నాజ్ఞా
     భరమె సెయల్ ప్రమథరొళా
     నిరలెం దీక్షిసువె నిమ్మ బయసువె నీశా!

ఈ కన్నడకృతినిగూడ పండితారాధ్యుఁడే రచించెనో, మటి యిటీవలివా రెవరైన కన్నడీకరించిరో గుర్తింపవలెను. పండితారాధ్యుఁడు కన్నడమునఁ గూడఁ బండితుఁడయినట్లు పండితారాధ్యచరిత్రమునఁ గలదు. కాన యాతఁడును రచించియుండవచ్చును. ఈ కన్నడగ్రంథమున గ్రంథాదిపద్యములు 183 లోపించినవి. 184 నుండి 491 దాఁక సరిగాఁ బద్యము లున్నవి. తర్వాత 725వ పద్యముననుండి 740వ పద్యముదాఁక గ్రంథము గలదు. ఈ పద్యసంఖ్యనుబట్టి చూడఁగా శివతత్త్వసారము వేయిపద్యముల గ్రంథమయియుండు నని తోఁచుచున్నది. సంస్కృతమున నుద్భటుఁడు 'హరలీల' యని వేయిశ్లోకముల స్తుతిగ్రంథమును రచించెనcట! మన పండితారాధ్యుఁడుగూడ నీవిషయము చెప్పినాఁడు.

క|| హరలీలా స్తవరచనా
     స్థిరనిరుపమభక్తిఁ దనదు దేహముతోడన్
     సురుచిరవిమానమున నీ
     పురమున కుద్బటుఁడు ప్రీతిఁ బోవఁడె రుద్రా !

మఱియు బ్రహ్మదేవకవి యని కర్ణాటకవియు, పాల్కురికి సోమనాథుఁడును నీహరలీలఁ బేర్కొనిరి. ఇది మూకపంచశతి, పాదుకాసహస్రము, లక్ష్మీసహస్రము మొదలగు స్తుతిగ్రంథములఁ బోలినది కాcబోలును. ఉద్భట గ్రంథచ్చాయను మనపండితారాధ్యుఁడు శివస్తుతి రూపముగా వేయి యాంధ్రపద్యములతో నీశివతత్త్వసారము రచించి యుండును. కన్నడ గ్రంథమును పండితారాధ్యుఁడో, మఱి యింకొకఁడో రచించినను తొలుతటి గ్రంథము తెలుఁగు గ్రంథమే యనఁదగిన ట్లున్నది.

క|| మానిసిపైఁ దో ల్గప్పిన
     యీనెపమున నున్న రుద్రు లీశ్వరభక్తుల్
     మానుసులె వారు లోకహి
     తానేకాచారు లీశ్వరాజ్ఞాధారుల్ ||.

క|| మానుషచర్మం పుదుగి
     ర్దీ నెవదిందిప్ప రుద్ర రీశ్వరభక్తర్
     మానుషరె యివరు లోకహి
     తానేకాచార రీశ్వరాజ్ఞాధారర్

క|| స్ఫుటశివతాంత్రికుఁ దపగత
     కుటిలాత్మకుఁ డుద్ధరించు గోత్రము నెల్లన్
     బటుగతి "రజ్ఞః కూపాత్
     ఘటం యథా" యనినసూక్తి కారణ మగుటన్ ||

క|| స్ఫుటశివతాంత్రిక నపగత
     కుటిలాత్మక నుద్ధరిపను గోత్రమ నెల్లం
     పటుగతి "రజ్జుః కూపాత్
     ఘటం యథా" యెంబసూక్తి తథ్యమ హుదఱిం. ||

క|| నిర్మలపదార్ధ మగుటను
     నిర్మాల్యం బనఁగ నెగడు నీనిర్మాల్యం
     బర్మిలిఁ గుడుతురు భక్తులు
     కర్మక్షయమగుట మోక్షకాంక్షులు రుద్రా !

క|| నిర్మలవస్తువహుదఱిం
     నిర్మాల్య మెనల్కె నెగళు నిర్మాల్యమదం
     కూర్మెదు నుంబర్ భక్తరు
     కర్మక్షయమహుదఱిం ముముక్షుగళభవా!

క|| పురుషప్రతికూలత్వ
     స్థిరదోషము సతికి దుర్గతిం జేయదు త
     త్పురుషుం డభక్తుఁడ యేనిన్
     బురుషుని మీఱియును శివునిఁ బూజించునెడన్

క|| పురుష ప్రతికూలత్వం
     స్థిరదోషం సతిగె దుర్గతీయ నీయదు త
     త్పురుషన భక్తినెయాగళ్
     పురుషననం మీఱి శివన నోలై పడియో ||

ఆంధ్రకర్ణాటపద్యములఁ బరిశీలింతుమేని యతిప్రాసములు రెండును గల తెలుఁగు రచనము తొలుతటి దగుట తెలియనగును. కర్ణాటకపద్యములకు యతినియమము తెలుఁగున కున్నట్టిది లేదు. కాని యిందు నేను జూపిన కర్ణాట పద్యములు ప్రాయికముగా నాంధ్రయతి సంగతి గలవే. యతిసంగతి గల తెలుఁగు పద్యములు ముందు రచించిన వగుటచే, నది కన్నడ పద్యములకుఁగూడఁ బరివర్తనమునఁ బొందుపడినది. ఈ యాంధ్ర కర్ణాట పద్యముల జోడించి శివతత్త్వసారమును నేను మరలఁ బ్రకటింపనున్నాఁడను.


  • * *
  1. *శ్రీకాకుళక్షేత్రమునుగూర్చి యింతకుముందు నేను గొన్నివ్యాసములు వ్రాసితిని. శ్రీముఖశాతకర్ణి పేరఁగాని, 'సిరిక' యన్న బౌద్ధోపాసిక పేరఁగాని ఆయూరు వెలసియుండవచ్చును. సిరిక-పేరు బౌద్ధప్రాకృతశాసనములలోఁ గాన నగును, కాఖంది, కాక తేయ, కాకాంది - కావూరు - కావలి - పేళ్లు బౌద్ధశాసనములలోని "సిరిక" పేర వెలసియుండవచ్చుననుట సంగతతరము. కాకతీయులుకూడ ఈ పేర వెలసినవారేయని నాతలంపు. బౌద్ధశాసనములలోని కాకతేయులే యిటీవల కాకతీయు లయియుందురు. సిరికపేర కొలనితో వెలసిన యూరుగాన సిరికాకొలను, శ్రీకాకొలను, కాకోలను' అను పేళ్లు పుట్టి, క్రమముగా వైష్ణవము ప్రబలినతర్వాత కొలను 'కోళమ్' అయి శ్రీకాకొళము, కాకొళము, కాకుళము రూపములు పుట్టినవి. ఈ శ్రీకాకుళము తర్వాత ఉత్తరశ్రీకాకుళము దక్షిణశ్రీకాకుళము గ్రామములు వెలసినట్టున్నవి. దక్షిణశ్రీకాకుళము నందివర్మపల్లవుని శాసనమునఁ గాననగును. అది యెక్కడిదో గుర్తింపవలెను.