మీఁగడ తఱకలు/మనుచరిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

10

మనుచరిత్ర

ఆనాcడు దిగ్విజయయాత్రలో కృష్ణదేవరాయలవారు విజయవాడలో విడిసి యున్నప్పుడు పెద్దనకూడ వెంట నుండెనఁట. అప్పుడు విజయవాడ విద్వాంసులకు తన మనుచరిత్రమును వినిపించికూడ నుండవచ్చును. కృష్ణదేవరాయలవారు

కం|| మనువులలో స్వారోచిష
       మనుసంభవ మరయ రససమంచితకథలన్
       వినిపింపు కలిధ్వంసక
       మనఘ! భవచ్చతురరచన కనుకూలంబున్.

కావున మార్కండేయపురాణోక్తప్రకారంబునఁ దానిఁ దన కంకితముగాఁజేయుఁ డనిరఁట!

ప్రపత్తిపరుఁ డయినపెద్దన కలిధ్వంసకము కానికథను చెప్పఁడుకదా!

ఇప్పుడు దొరకుట లేదు గాని శఠకోపయతి కర్పితముగ 'హరికథాసార' మని మఱియొక గ్రంథమును పెద్దన రచించినాఁడు. షట్చక్రవర్తుల, అష్టవసువుల, చతుర్దశమనువుల, షోడశమహారాజుల చరిత్రలు కలిధ్వంసకము లని పురాణోక్తి.

ఈ మనుచరిత్రలో కడపటిపట్టున స్వారోచిషమనువు పుట్టుక కలదు. గనుక దానితో ననుబంధము గలప్రబంధమంతయును కలిధ్వంసకమే యగునుగదా యని పెద్దన తనమనమును సమాధానపఱచుకొని యుండును,

కాని యథార్థమున కీకథ కలి యనెడి గంధర్వుని ధ్వంసము చేసినది గనుక కలిధ్వంసక మని చెప్పుకొనుట యుక్తము. మనుచరిత్రలో వరూధినికై తలమార్చుకొని, దొంగవేషము వేసికొనినగంధర్వునిపేరు కలి.

మేఘసందేశమున కాళిదాసు యక్షు ననామధేయునిగాఁ జేసినట్లే మనుచరిత్రమునఁ బెద్దన్న కూడ గంధర్వు ననామధేయునిఁ జేసినాడు. 'కలి' యన్న పేరు పేర్కొనలేదు.

ప్రధానముగ వరూధినీప్రవరుల సమాగమ కథను హృదయమున నునిచుకొనియే రాయలవారు పయి విధముగ మనుచరిత్రము రససమంచిత కథలలో నున్న దనియు, కలిధ్వంసక మనియు, పెద్దన్నచతురరచన కనుకూల మయిన దనియు పలికియుందురు.

రాయలవారి కోర్కి గావుననే పెద్దనామాత్యుఁడు, స్వారోచిషమను సంభవ కథను గ్రంథము కట్టకడపట నెక్కడనో రెండుముక్కలలో నెత్తుకొని ముగించినప్పటికిని, వారియవ్వాతాతలకథనుమాత్రము-అనఁగా వరూధినీప్రవరుల, వరూధినీ గంధర్వుల కథను-మూఁ డాశ్వాసముల పైదాఁకఁ బెంచి ప్రబంధీకరించినాడు.

నేఁడు మనుచరిత్ర మనఁబడునీప్రబంధమునఁ దొలినాలుగయి దాశ్వాసముల రచనను స్వరోచిస్సంభవ మనియు, నాతరువాత నాఱవ యాశ్వాసము తుదిదాఁకఁ గల రచనను స్వారోచిషసంభవ మనియు వేర్పఱచి రెండు ప్రబంధములుగా నేను పేర్కొందును. రెండు ప్రబంధములను రాయల కంకితముగా నొక కృత్యవతరణికతో నొకసంపుటముగా సంధానించినాఁడు గనుక మొత్తము సంపుటమును మనుచరిత్ర మని పేర్కొనుచుందును.

పయి రెండు ప్రబంధముల తీరులు పరిశీలనార్హములే యయినను ప్రస్తుతము నేను తొలిప్రబంధముగ పరిగణించుచున్న స్వరోచిస్సంభవమును గూర్చియు, నందులోని కథారసౌచిత్యమునుగూర్చియుమాత్రమే యించుక ప్రపంచింతును. ఈ కథలలో నాయిక వరూధిని. దేవయోని జాతులలో, ననఁగా-గంధర్వ, విద్యాధర, యక్ష, కిన్నర, కింపురుషాదులలో నొకటయినయప్సరోజాతిపడుచు. అప్సరసలు దేవవేశ్యలు. వారికిఁ బద్మసంభవ, వైకుంఠ, భర్గ, దేవేంద్రసభలు సంగీతనాట్యవిద్యల సాముగరిడీలు. కామకలావిలాసములు వెన్నతో నేర్పిన విన్నాణములు,

గంధర్వ విద్యాధరాదులతోడనే కాక భువినుండి దివికి విచ్చేసెడి జ్యోతిష్టోమాది యాజులతోఁగూడ శృంగారవిహారములు వీరి కులాచార ధర్మములు. వారు వీ రనుహద్దు లేక అందఱితోడను వినోదించెడివారు గనుక నీవేశ్యలు సామాన్యవనితలు.

భూలోకమున నెవ్వరైనc దీవ్రతపముచేయుచు నింద్రపదవికే ముప్పు దెచ్చున ట్లుండుచో వారితపమును జెఱుచుటకు దేవేంద్రుఁడు వీరినే ప్రయోగించుచుండును. వీరు నిత్యయౌవనలు, ఎప్పుడును ముప్పదేండ్ల వయోవిలాసముతో నుండువారు. వ్యాధులు, జరామరణాదులు వీరి కుండవు.

ఇట్టి యప్సరసను, వరూధినిని, వీరితోఁ గలసి మెలసి విహరించు జాతిలోనివాఁడే యయినగంధర్వుఁ డొకఁడు కలి యనువాఁడు వలచి, తత్కాలమునకు వలపించుకొనలేక ఉపాయములు వెదకుచు వెంటాడుచుఁ దంటాలు పడుచుండినాఁడు,

ఉII ఒక్కొకవేళఁ బద్మముఖు లొల్లమి సేయుదు రొకవేళఁ బె
     న్మక్కువ నాదరింతురు క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్
     పక్కున వేసఱన్ జన దుపాయములన్ దగు నిచ్చకంబులన్
     జక్కగఁ జేసి డాసి సతిచిత్తముcబట్టి సుఖింపగాఁ దగున్.

అనుకొనుచుండును. వరూధిని పురుషముఖ మెఱుగని, వివాహితగాని భారతీయార్యకుల నారీరత్నము కాదుసుమండీ! ఆమె సదా ముప్పదేండ్ల వయస్సుదే! కనుక ప్రస్తుతకథాసందర్భమునకు ముం దెందఱినో గంధర్వవిద్యాధరాది దివ్యపురుషులను, భువినుండి దివికి విచ్చేసిన శ్రోత్రియులను, వినోదపఱచి వారితో వినోదించినదే! మర్త్యలోకపు, మర్త్యవేషపు శ్రోత్రియులమీఁద మక్కువ రేగినదో యేమో! హిమాలయ పర్వతాగ్రమున ఠేవిణి వేసియున్నది. హిమాలయము భూలోక స్వర్గలోకముల సంధానస్థలము. దేవయోనుల కక్కడ దేవభూము లెన్నియో యున్నవి. వేడ్క పుట్టినప్పు డెల్ల దివ్యు లచట విడిసి విహరించుచుందురు. మన పెద్దలకు కొడైక్మానల్ ఊటీ సిమ్లాలలో నెట్టి సౌఖ్యపరికరము లుండునో యట్టివే వీరికిని అచట గలవు. ఆ పర్వతాగ్రముల కప్పుడప్పుడు సిద్ధపురుషులు, మహాయోగులు మొదలగువారు, భూలోకవాసులును వెళ్లఁగలుగుచుందురు.

గ్రహచారము చాలియో చాలకయో యార్యావర్తమున నెచ్చటనో యున్నయరుణాస్పదపుర వాస్తవ్యుఁ డొకఁడు శ్రోత్రియబ్రాహ్మణకుమారుఁడు, ప్రవరాఖ్యుడు పాదలేపము లభింపఁగనే వెనుకముందులు చూచుకొనక, ఫ్రీ టిక్కట్లు దొఱికినదే తడవుగా రైలుప్రయాణమునకు సిద్ధపడు నాత్రగాని వలె, హిమాలయమును దర్శింపఁ బోయినాడు! పాదలేపము కరఁగి పోఁగా నప్రయోజకుఁడై దిగుల్పడుచు వరూధిని యుండిన కోనలోని కేగినాఁడు.

వరూధినికి వంటయింటిలోఁ గుందేలు చిక్కినట్లైనది. ఆకలి గొన్నమాంసాహారి వంటయింటి కుందేటిని విడువనట్లే వరూధిని ప్రవరుని వలపుఁజూపుల వలలోఁ జిక్కించుకొని దక్కించుకోఁ దంటాలు పడినది. తన వలపుపొలుపులు దులపరించినది తుటారించినది. ఆదరించినది. బెదిరించినది. ప్రార్ధించినది. పైఁబడినది. కౌగిలిపట్టుగఁ బట్టుకొనినది. వెన్నతోఁ దినిన విద్య నంతయుఁ గ్రక్కినది. వెక్కివెక్కి యేడ్చినది. ఏమి చేసినను నెంత యేడ్చినను లాభము లేకపోయెను. ప్రవరుఁడు గురువులయొద్ద నేర్చినసదాచారసంపదను నిలువఁ ద్రొక్కుకొనినాఁడు. ఆమెచేష్టలకు చీదరించుకొనినాఁడు. బదుళ్లు చెప్పినాఁడు. కౌగలింపగా శ్రీహరీ యని యోరమోమిడి తదీయాంసద్వయం బంటి పో పొ మ్మంచుం దొలఁగఁ ద్రోచినాఁడు “అనయా యావజ్జీవం హోష్యామి" అను మాట దక్కించుకొనినాఁడు. తన బ్రహ్మ వర్చసమును ప్రజ్వలింపించుకొనినాఁడు. అగ్నిదేవుని నారాధించి, ప్రార్ధించి, యూ యజ్ఞేశ్వరుని యనుగ్రహముతో నాకాశమార్గమున నెగసి యరుణాస్పద పురమునకు వెళ్లిపోయినాఁడు.

వరూధినికిఁ దగిన పరాభవ మయినది. గంధర్వునికిఁ దనవలనఁ గలిగినయవమానమే ప్రవరునివలనఁ దనకు దాపురించినది. పొంచి గుర్తించుచుండినగంధర్వుఁ డిదే యద ననుకొని ప్రవరవేషమునఁ దయారయి వరూధినిని దక్కఁగొన్నాఁడు. ఈ వేశ్యావిషయికరతిలోని చమత్కారవిశేషమును గుర్తింపఁ జాలనిచో వరూధినీకథాసారస్యముఁ దెలియఁజాలము. వేశ్యలును, దదాసక్తులు నయిననాయికానాయకులు పరస్పర మొకరికొకరు వశులు కానిచో దబ్బఱలు, తాటోటులు, తబ్బిబ్బులు జరపి, మోసాలు చేసి, వేషాలు వేసి కార్యము సాధించుకొనుచుందురు. నాయికానాయకులు పొంది పొసఁగుట జరిగిన పిదప తొల్తటి దుష్కృత్యములు రసాభాసములు ప్రజ్ఞాప్రయోగములుగను, - రసోత్కర్షాదా యకములుగను మారి సామాజికులలో రససిద్ధిని గల్గించును. ఈ పద్ధతినే గంధర్వుని నడవడి యిచట సమర్థనీయము కాఁగలదు. కాని యిట్లు సమర్ధించుటకు గంధర్వుఁడు తన ప్రజ్ఞాప్రయోగములను వరూధినికిఁ దెలియఁ జెప్పి మెప్పుపొందు టత్యావశ్యకము.

ప్రేమలేనివరూధినిని దొంగవేషము వేసికొని, గంధర్వుఁడు కలసినట్లు కాదు-చెఱచినట్లు వర్ణించుట రోఁత! కాని కొందఱు సహృదయు లీవిషయమున నిట్లనవచ్చును. ప్రవరుని మర్యాద, వరూధిని కోరిక, గంధర్వుని బులుపాటము దక్కినది గదా! ఆ మువ్వరి హృదయములలో నెవ్వరి హృదయములోను కలుగని రోఁత మీ కేల కలుగవలెనండీ! అని.

రసానుభూతి కథాశ్రోతలకుc బ్రేక్షకులకు సంబంధించినది గాని కథాపాత్రలకు సంబంధించినది గాదు.

వరూధినికి వాఁడు వేషధారి యయినగంధర్వుఁ డను సంగతి తెలియదు గాని మనకుఁ దెలియును. కనుక యిది రసాభాసమే. రసాభాసమే కాదు-నేటి శిక్షాస్మృతిప్రకారము కొన్నియేండ్ల శిక్షకుఁ దగిన క్రిమినల్ కేసుకూడ!

గంధర్వుఁడు కొన్నాళ్ల తరువాత రహస్యము వెల్లడించి వరూధినిచే మెప్పు పొంది సత్కృతుఁ డయినాఁ డనియే సరి పుచ్చుకోవలెను. లేనిచో రసాభాసమే! కథావిధాన మంతయు రోఁతయే!

గంధర్వుఁ డిట్లు తనమాయాకృత్యము వరూధిని ముందఱ వెల్లడించుట సంభవించుచో దాని కామె మెచ్చుకొనుట తటస్థింప దేమో యనెడిసందియము పొడముట సహజమే! ఆమె నిజమునకు ప్రవరునే ప్రేమించినది గాని, యానాళ్లలో గంధర్వునిఁ బ్రేమింపలేదు. ఆమె మృచ్ఛకటికలోని వసంతసేననలె గుణానుకరక్తగఁ బ్రేమించినది.

ఇచట వరూధిని ప్రవరునిఁ బ్రేమించిననాళ్లలోఁ దదేకానురక్తగాఁ బతివ్రతగానే వర్తిల్లినది. అయినను నామె మాయా ప్రవరుఁడు మాయమైన తరువాత ధర్మశాస్త్రప్రకారము పండ్రెండేండ్లు ప్రతీక్షించి యాపై భర్తకు శ్రాద్ధము చేసి, కలకాలము విధవగనే యుండిపోయిన దనుకొనుట సరికాదు. ఆమె నిత్యయౌవన గాన కొన్నాళ్లకు మఱియొకనిఁ బ్రేమించితీరెడిదే అనుకొనక తప్పదు! నిన్నటివఱకు నామెతో మాయావేషమున విహరించిన గంధర్వుఁడు రత్నమువంటి బిడ్డ పుట్టిన తరువాత వానినిఁ జేరదీయఁ డనియు, వరూధినిపైనితనవలపులవిసరును-నం దామె చిక్కుపడుటను దెలిపియుండఁ డనియుc దలఁచుట సరికాదు.

నే నిట్లందును, వరూధిని యా గంధర్వుని ముం దెన్న డెఱుగనిది గాదు. ఇట్టి వారి నెందఱినో యింతకుముందు బుట్టను బెట్టినదే! గంధర్వుఁడుకూడ నిట్టి కుచోద్యము లెన్నియో చేసి యెందఱినో దక్కఁగొనినవాఁడే ఇట్టి వారికి సంబంధించి యుండును గనుకనే యాలంకారికులు కొందఱు వేశ్య సామాన్యవనిత యనియు, నామెకు సంబంధించిన శృంగారము రసాభాసమే కాని శృంగారము కా దనియు నందురు. అది కా దని వేశ్యలను విడనాడిన శృంగారరసమునకుఁ బరిపోషమే కలుగ దనియు, వారు శృంగారసర్వస్వ మనియు మఱికొంద ఱాలంకారికులు దానిని ప్రతిఘటింతురు.

గంధర్వుఁడు మాయాప్రవరుఁడుగా మాయమైనను వరూధిని నంటిపట్టి యున్నాఁ డనియు, నామె ప్రసవించి, స్వరోచి కొన్నినెలలో యేండ్లో పెరిగిన తరువాత ప్రవరునిరాక కెదురు చూచిచూచి చీకాకుపడు స్థితికి వరూధినిని రప్పించి, తన పంతమును చెలికత్తెలకుఁ జెప్పి, వరూధినికిఁ జెప్పించి, ప్రవరునిపై సన్నగఁ దాను జెప్పి, ఛీ ! ఛీ ! పో నాతోఁ గూడిన వాఁడు నిజప్రవరుఁడే యని యామె తిరస్కరింపఁగా తిరస్కరింపఁగా, తాను మాయావేషమునఁ గలసి యున్ననాళ్లలోనే ముందు జాగ్రత్తపఱచి వ్రాసి యుంచుకొనినయేకాంత రహస్యముల డైరీని వెల్లడించి, వీలగుచో నసలు ప్రవరుఁడే యబద్ధ మనియు నదియంతయుఁ దనవేషమే ననియుఁ జెప్పి తమ పరస్పర ప్రేమసాక్ష్య మయినకుమారుని స్వరోచిని గౌగలించుకొని (ఆ కుమారుడును శృంగారలోలుఁడై గంధర్వునిసంతానమే సుమా యనిపించుకొనినాఁడుగాని ప్రవరుని బిడ్డఁ డనిపించు కొనలేదు.) వరూధిని నబ్బురపుచ్చి, తన నేర్మిని మెప్పించి ద్విగుణీకృత ప్రేమతో మరల వరూధినీసన్మానమున వర్తిల్లినాఁ డనుకొననిచో వరూధినీప్రవరకథ రసాభాసాత్మకమై రోఁతగొల్పును.

పెద్దనగా రీసందర్భము నీవిధముగ నిర్వహింపకపోయినను సూచనగానైన నిట్టితీరున దెల్ఫియుండవచ్చును. తెల్పక పోయినను మన మట్టి కథను గట్టుకొనుట కవకాశ మేనిఁ గల్పించియుండవచ్చును.

కాని, మాయమై పోవుసమయమున మాయాప్రవరుని తలపుల నీవిధముగఁ దానే విప్పి చెప్పి తంటా తెచ్చినాఁడు!

క|| అంత వియచ్చరు డభిమత
     మంతయు సమకూఱుటయును నచ్చర గర్భ
     శ్రాంత యగుటయును గనుఁగొని
     యింతట నిచ్చోటు వదల కే నిఁక నున్నన్

క|| వంచన యెఱిగిన మఱి శపి
     యించునొ సురకాంత చెప్ప కేఁగినఁ బ్రేమం
     బంచ శరశరపరంపరఁ
     బంచత ప్రాపించి మీఁదఁ బాపం బిడునో.

వ. అని వితర్కించి యక్కపటవిప్రుం డెఱింగించి యనిపించుకొనియ పోవువాఁడై. - మనుచరిత్ర

ఏవేవో ప్రలాపించినాడు. ఆ యనిన వన్నియు వట్టి యబద్ధములే అబద్ధములే కాక మోసపునీతివాదములుకూడ! అమరుఁడైనగంధర్వుఁ డమరకాంత యైనవరూధినికిఁ 'బంచత' ప్రాపించునేమో యనుకొనుట విరుద్ధము. (వియచ్చరుఁ డని వాక్యమునఁ గర్తృపద ముండగా మరల "కపటవిప్రుఁ డనుట' యనన్వితముగనున్నది.)

ఈ విధమున ప్రవరవేషధారి యయినగంధర్వుని యంతరంగపు దలఁపులను వెల్లడించుట శ్రోతల హృదయములలో నిష్పన్నమయ్యెడి శృంగారరసమును జెఱుచుట యనిపించినది. వరూధినికిఁ బ్రవరునియందే గాని గంధర్వునియం దను రాగము లేదు. నిజప్రవరునికిఁ దనసోమిదమ్మయందేగాని వరూధినియం దనురాగము లేదు.

"యాం చింతయామి సతతం మయి సా విరక్తా
 సా చాన్య మిచ్ఛతి జనం స జన్యో న్యరక్తః
అస్మత్కృతే చ పరితప్యతి కాచి దన్యా
ధిక్తాంచ తం చ మదనం చ ఇమాం చ మాం చ."

అనినభర్తృహరిసుభాషిత మిచ్చట సరిపోవును.

ఈ విషయ మి ట్లుండినప్పటికిని వరూధినీ ప్రవర సంవాద వుట్టమునఁ బెద్దన నిర్వహించిననెఱజాణతనపుఁగవన మాంధ్ర సారస్వత మంతకు నద్వితీయ మయినది.

పెద్దన్నగారు శృంగారధర్మవీరముల కనుఁడు, శృంగారశాంతముల కనుcడు, ఎ ట్లన్నను నిక్కడ నడిపించినపోరాటము యుక్తిప్రయుక్తులు, రచనాచమత్కారము, శయ్యాసౌభాగ్యము, భాషాసౌందర్యము నిస్సామాన్య మయినవి. కృష్ణరాయలవంటి మహారాజు దగ్గఱనుండి, నేఁటి తెలుగు సహృదయు లందరిదాఁక నీ రచనాఘట్టము పెద్దనగారిపై నఖండ గౌరవమును, మనుచరిత్రకు నఖండప్రఖ్యాతిని గల్పించినది.

ఈ కథ కల్పించిన రసపారవశ్యమున, నాఁటినుండి నేcటిదాక సహృదయప్రపంచము దానిలోని లోపములను వేనిని వెదకి పట్టుప్రయత్నము సేయలేని దయినది.

వరూధినీకామాగ్నిలో మైనమై కరఁగి పోక వజ్రహృదయుఁడై నిలిచి శీలరక్షణ చేసికొన్నప్రవరుని మహనీయతను ప్రజ్వరిల్లఁ జేయుటలో పెద్దన నిర్వహించిననెఱజాణతన మాంధ్రసారస్వతమున మణి యన్యత్ర దొరకనిది. అద్భుతమైనది.

ఈ కథా ఘట్టమే రాయలసభలోఁ బెద్దన నష్టదిగ్గజములలోఁ దూర్పుదిగ్గజముగాఁ గావించినది. అగ్రహారము లిప్పించినది. రాయలరాజ్యములోఁ గడలూరి గవర్నరుగాఁ జేసినది. మనుచరిత్రను దెలుఁగురసికు లందఱుఁ జదువుచునే యుందురు. నాల్గాశ్వాసముల దాఁకనే, నూటికిఁ బదిమందియైనను దరువాత కథను జదువరు. చదివినను వరూధినీగంధర్వసమాగమము మరల నెక్కడ నయినను రాఁగల దేమో చూత మనునాశతోఁ జదువుచుందురు.

పయి విషయములే గాక, పెద్దన్న కవిత్వరచననుగూర్చి చెప్పిన యుత్పలమాలిక, కృష్ణరాయనిర్యాణానంతరము చెప్పిన సీసపద్యములు రెండు, మఱికొన్ని పెద్దన చాటుపద్యములు నాంధ్రసారస్వత మున్నంతదాఁక నిలిచి యుండఁగలవు.

పెద్దన్న సీసపద్యము నొకటిమాత్ర మిచ్చటఁ జదివి యాయన ఘనతను స్మరింపుఁడు-

సీ|| ఎదురైనచోఁ దన మదకరీంద్రము నిల్పి
               కేలూత యొసఁగి యెక్కించుకొనియె
      బిరుదైనకవిగండపెండేరమునఁ కీవె
               తగు దని తానె పాదమునఁ దొడిగె
      మనుచరిత్రం బందుకొనువేళఁ బుర మేఁగఁ
               బల్లకిఁ దన కేలఁ బట్టి యెత్తె
      కోకటగ్రామా ద్యనేకాగ్రహారంబు
               లడిగినసీమలయందు నిచ్చె

గీ|| నాంధ్రకవితాపితామహ యల్లసాని
     పెద్దనకవీంద్ర యని నన్నుఁ బిలుచునట్టి
     కృష్ణరాయలతో దివి కేఁగఁ లేక
     బ్రతికి యున్నాఁడ జీవచ్చవంబ నగుచు.

  • * *