మీఁగడ తఱకలు/ఉద్భటారాధ్య చరిత్రము
9
ఉద్భటారాధ్య చరిత్రము
ఉద్భటారాధ్య చరిత్ర మపూర్వసత్ప్రబంధములలో నొక్కటి. దీనికి
కర్త - తెనాలిరామలింగకవి
అనఁగానే దీని సత్ప్రబంధత్వము గొంత సమర్ధిత మగును గదా! తెనాలిరామలింగకవి యని తెనాలి రామకృష్ణకవి యని యొక్కనినే యటు నిటు గూడ లోకము పేర్కొనుట గలదు. తొలుత నాతఁడు శైవుఁ డనియు, నప్పుడు రామలింగఁ డని పే రయ్యె ననియుఁ, దర్వాత వైష్ణవము పుచ్చుకొనె ననియు, నప్పుడు రామకృష్ణుఁ డని మార్పురే రయ్యె ననియుఁ బ్రతీతి. దీనిని వీరేశలింగము పంతులుగారు మొదలగువారు గొందఱు నమ్మిరి. మఱికొందఱు నమ్మరయిరి.[1] ఆ రేండు పేళ్లు నొక్కనివే యని నేనును విశ్వసించుచున్నాఁడను. అట్లు విశ్వసించుట కిదివఱకున్న యాయైతిహ్యము మాత్రమే కాక యపూర్వముగాఁ గొన్నియాధారములును నా కగపడినవి. తెలుపుచున్నాఁడను.
రామలింగఁడే - రామకృష్ణుఁడు
రామకృష్ణకవికృతములుగా నిదివఱకు దొరకి ప్రకటితములయియున్న గ్రంథములు రెండు, అవి పాండురంగమాహాత్మ్యమును, ఘటికాచలమాహాత్మ్యమును. రామలింగకవికృతిగా నిప్పుడు క్రొత్తగా దొరకి ప్రకటిత మయినది - యుద్భటారాధ్య చరిత్రము. తొల్త నాతఁడు శైవుఁ డుగా నుండి తర్వాత వైష్ణవుఁడుగా మాఱె ననియే నే నిందు ముందు నిరూపింపనున్నాఁడనుగాన యుద్భటారాధ్యచరిత్రము మునుపటి గ్రంథముగాను తక్కిన రెంటిని దర్వాతివానిఁగాను దెలుపుచున్నాఁడను. ఉద్భటారాధ్య చరిత్రమున రామలింగకవి స్వవిషయ మిట్లు తెల్పుకొన్నాఁడు
సీ|| కౌండిన్యమునిరాజమండలేశ్వరవంశపాథోధినవసుధాభానుమూర్తిఁ
బాలగుమేలేశ పదపయోజద్వయీధ్యానధారణసముదాత్తచిత్తు
మానితాయాతయామానామభావితవిపులమహాయజుర్వేదవేది
రామేశ్వరస్వామిరమణీయకరుణావిశేషపోషితవిలసితసమగ్ర
గీ|| సహజసాహిత్య మాధురీసంయుతాత్ము
లక్కమాంబకు ఘనయశోలక్ష్మి వెలయు
రామధీమణికిని బుత్త్రు రామలింగ
నామవిఖ్యాతుఁ గావ్యనిర్ణయధురీణు.
గద్యమునందును, "ఏలేశ్వర గురువరేణ్యచరణారవింద షట్చరణ సకలకలాభరణ రామనార్యసుపత్ర సుకవిజనమిత్ర కుమారభారతీబిరుదాభిరామ రామలింగయప్రణీత" మని యున్నది.
పాండురంగమాహాత్మ్యమున రామకృష్ణకవియిట్లు చెప్పుకొన్నాడు.
సీ|| ..........శైవవైష్ణవపురాణావళీనానార్ధ
ములు నీకుఁ గరతలామలకనిభము
గీ|| లంధ్రభూమికుచాగ్రహారాభ మైన
శ్రీ తెనాల్యగ్రహారనిర్ణేత వగ్ర
శాఖికాకోకిలమ వీవు సరసకవివి
రమ్యగుణకృష్ణ ! రామయరామకృష్ణ!
క|| కౌండిన్యసగోత్రుఁడ వా
ఖండలగురునిభుఁడ వఖిలకావ్యరససుధా
మండనకుండలుఁడవు భూ
మండలవినుతుఁడవు లక్ష్మమావరతనయా !
"శా-రదనీరూపము రామకృష్ణ కవిచంద్రా ! సాంద్రకీర్తీశ్వరా”
క|| వాక్కాంతాశ్రయు భట్టరు
చిక్కాచార్యుల మహాత్ము శ్రీగురుమూర్తిన్
నిక్కపుభక్తి భజించెద
నిక్కావ్యకళాకలాప మీడేఱుటకున్.
గద్యమున-ఇది శ్రీమత్పరమపదనాథనిరవధికకృపాపరి పాకపరిచితసరసకవితాసనాథ రామకృష్ణకవినాథ ప్రణీతం బైన-అని యున్నది.
రామలింగకవి | రామకృష్ణకవి |
కౌండిన్యగోత్రుఁడు | కౌండిన్యగోత్రుఁడు |
శుక్లయజుర్వేది | శుక్లయజుర్వేది |
తండ్రి - రామయ్య | తండ్రి - రామయ్య |
తల్లి - లక్ష్మమ్మ | తల్లి - లక్ష్మమ్మ |
కుమారభారతీబిరుదాభిరాముఁడు | శా-రదనీరూపము రామకృష్ణ కవిచంద్రా ! |
ఉద్భటచరిత్రము బాల్యమున రచించినది గాన 'కుమార భారతి' యని బిరుదు చెప్పుకొన్నాఁడు. పాండురంగమాహాత్మ్యము ముదివయసున రచించినదిగాన 'శారదనీరూపము' అని కృతిపతి తన్ను సంబోధించినట్టు చెప్పకొన్నాడు, కాన యీభేదము సంగతమే. ఇన్ని సరిపడి యున్నను నుద్భటచరిత్రమున రామలింగయ యని గ్రంథకర్తపేరును పాలగుమి యేలేశ్వరుఁ డని గురునిపేరును, పాండురంగమాహాత్మ్యమున రామకృష్ణుఁ డని గ్రంథకర్తపేరును, భట్టరు చిక్కాచార్య లని గురునిపేరును గానవచ్చుట, గద్యములరీతులు భిన్నములుగా నుండుట, రెండు నొకనిపేళ్లే యనుసిద్ధాంతమునకుఁ గొంత బాధకముగాఁ గానవచ్చును. ఈభేదములు మతము మాఱుటచే నేర్పడినవే యని నే ననెదను.
అందుకు సాధకములు
ఇందుమతీపరిణయ మని తెనాలిరామభద్రకవికృతి యొకటి కలదు. అందిట్లున్నది.
.................కవితాఘనతామహు మత్సితామహున్
రామయ రామకృష్ణకవిరాజుఁ దలంచి నుతించి మొక్కెదన్.
గీ|| తదనుసంభవమణిని సుదక్షిణాప
రిణయముఖకావ్యరచనాధురీణు నాంధ్ర
కవికదంబములోనఁ బ్రఖ్యాతి గన్న
యన్నపకవీంద్రు ధీసాంద్రు నభినుతింతు.
సీ|| ప్రౌఢి మీ పెదతాత పాండురంగాదిస
త్కృతులు చేసెను రామకృష్ణసుకవి
యనుజుఁ డన్నప్ప మీపినతాత రచియించెఁ
బరఁగ సుదక్షిణాపరిణయంబు
మీతాత శ్రీగిరి చాతురీవిఖ్యాతి
శ్రీశైలమాహాత్మ్యకృతి యొనర్చె
కడిమి మీతండ్రి యిమ్మడి రామకృష్ణాఖ్యుఁ
డనఁగీర్తి గనె సంస్కృతాంధ్రములను
గీ|| నౌర యనిపించె మీయన్న వీరరాఘ
వాఖ్యకవి సర్వకవితామహత్త్వమునను
ని న్ననూచానసంతాను నెన్నఁదరమె?
ప్రాజ్ఞహృదయాబ్జరవి రామభద్రసుకవి!
__________________________________________________________________
- ఇది తంజాపురపు సరస్వతీపుస్తక భాండాగారమునఁ గలదు. శ్రీమానవల్లి రామకృష్ణకవి, యం.ఎ. గారు దీనివిషయము 1914 సంవత్సరాది సంచికలో "తెనాలికవులు" అను వ్యాసమునఁ దెలిపినారు. వారే దీనిప్రతిని చెన్నపురి గవర్నమెంటు లైబ్రరికిని నొసంగినారు. దీనింబట్టి చూడఁగాఁ బాండురంగమాహాత్మ్యాదులను రచించిన తెనాలిరామకృష్ణకవియును, సుదక్షిణాపరిణయము రచించిన తెనాలి యన్నయ కవియును నన్నదమ్ము లని యేర్పడు చున్నది. దీనికి సరిగానే సుదక్షిణాపరిణయమున
గీ|| నవ్యసుగుణాభిరామ తెనాలిరామ
పండితాగ్రణిసత్పుత్త్రు భవ్యమిత్రు
హరపదాంభోజసౌముఖ్య నన్న పాఖ్యు
నన్నుఁ బిలిపించి యాదరోన్నతి వహించి,
గద్యము "ఇది శ్రీమత్తెనాలి రామేశ్వరశాశ్వతకృపాకటాక్షలక్షిత కవితాభిరామ రామయపండితకుమార సహజ శైవాచారసంపన్నధీమదన్న యనామధేయప్రణీతం బైనసుదక్షిణాపరిణయమందు" అని యున్నది.
ఈ సుదక్షిణాపరిణయపద్యములవలనఁగూడఁ దెనాలి రామకృష్ణుఁడు, తెనాలియన్నయ, యన్నదమ్ము లగుట యితర ప్రమాణ నిరపేక్షముగానే యేర్పడుచున్నది. ఇర్వురును రామయపండితుని కొడుకులే, తెనాలివారే, ఒకకాలమువారే. (అదిముందు తెలియనగును.) అంతేకాక రామలింగఁడే రామకృష్ణుఁ డయ్యె ననుటనుగూడ నీసుదక్షిణాపరిణయమే స్వతంత్రముగా సాధించుచున్నది. ఉదాహృతగద్య పద్యముల వలన నన్నయ సహజశైవాచారుఁ డనియుఁ దెనాలిలో వెలసిన రామేశ్వరస్వామి యనుగ్రహమునఁ గవిత నేర్చినవాఁ డనియు, మఱియు,
గీ|| కాళిదాసాది సంస్కృతకవులఁ దలఁచి
యాంధ్రభాషావిశేషభాషాధిపతుల
నన్న పార్యాదులను బుద్ధి సన్నుతించి
పాలగుమిభీమగురుని సద్భక్తిఁ గొలుతు.
అనుపద్యమువలనఁ బాలగుమిభీమయశిష్యుఁ డనియు నెఱుక పడుచున్నది. దీనినిఁబట్టి యన్నయకుటుంబము వారును సహజముగా శైవాచారసంపత్తికలవా రనియు, తెనాలిరామలింగస్వామిభక్తులనియు, బాలగుమివారిశిష్యు లనియుఁ దలఁపఁ గూడును.[2] మనప్రస్తుత గ్రంథ మగునుద్భటచరిత్రమును రచించిన రామలింగకవి యిట్టిలక్షణములు గలవాఁడు. ఆతని శైవాచారనిరతి యుద్భటచరిత్రమున స్పష్టముగాఁ గన్పట్టుచన్నది. మఱియు నాతఁడు 'రామేశ్వరస్వామి రమణీయకరుణా విశేషపోషిత విలసిత సమగ్ర, సహజసాహిత్యమాధురీసంయుతాత్ముఁడు' ననియు 'పాలగుమేలేశపదపయోజద్వయీధ్యానధారణసముదాత్త చిత్తుఁడ' ననియుఁ జెప్పకొన్నాఁడు. పాలగుమియేలేశ్వరుఁడును బాలగుమి భీమేశ్వరుఁడును నన్నదమ్ములో తండ్రికొడుకులో యయి యుందురు.
మఱి యన్నయ తనయన్న యని రామలింగనిఁ (లేక రామకృష్ణుని) బ్రస్తుతింపకున్నంతమాత్రాన వారి సౌదర్యవిషయము సందేహింపఁ దగిన దేమో యనరాదు. తెనాలిరామభద్రకవి తనతాత లన్నదమ్ములు ముగ్గురనియు, మొదటివాఁడు పాండురంగమాహాత్మ్యకర్త రామకృష్ణుఁ డనియు, రెండవవాఁడు తన తండ్రితండ్రి శ్రీగిరి యనియు, మూఁడవవాఁడు సుదక్షిణాపరిణయకర్త యునియు స్పష్టముగాఁ జెప్పినాఁడు గాన యిట్టిసందేహమునకు సందు లేదు.
అన్నయకవి మతము మార్చుకొన్నాఁ డన్నయనాదరముచే నన్నగారిని బ్రస్తుతింపకపోయెనేమో! 'సహజశైవాచార' యన్నపద మాయన్న నడుమఁ దెచ్చుకొన్నవైష్ణవాచారముమీఁది వైమనస్యముచేఁ జేర్చుకొన్నదేమో! రామకృష్ణకవి తనమతముమార్పును దెలుపుకొనకున్నను, బాండురంగమాహాత్మ్యమున 'శైవవైష్ణవపురాణావళీ నానార్థరచనా పటిష్ఠైకరమ్యమతివి[3] అని తన శైవప్రబంధరచనమును దెలుపకొన్నాఁడు.
తెనాలిలోనుండుచేతనే తర్వాత తెనాలివారని యింటిపే రేర్పడినది గాని యంతకుముందు వారియింటి పేరు గార్లపాటివా రని ప్రాఁతవ్రాఁతలలో నున్నది. గురుజాడ శ్రీరామమూర్తి పంతులుగారును వీరేశలింగము పంతులుగారును దీనిని జెప్పిరి. తెనాలిలో నున్నరామయ పండితుఁడు శైవాచారపరుఁడుగాన యక్కడ వెలసియున్న రామలింగస్వామిపేరే తనప్రథమపుత్త్రునికిఁ బెట్టుకొనె నని నేను దలంచుచున్నాఁడను. అన్నయ చెప్పుటచేతనేకాక యీక్రిందిసాధనముచేతఁ గూడ నాతఁడు శైవాచారపరుఁడని రామలింగేశ్వరస్వామిభక్తుఁ డని యేర్పడుచున్నది.
తెనాలిలో రామలింగేశ్వరస్వామి యాలయమున నొక యుత్సవ విగ్రహముపీఠముమీఁద నీశ్లోక మున్నది.
శ్లో|| శ్రీ తెనాలినగరే వ్యరాజయ ద్గార్లపాటిపురరామపండితః
శుక్లమాఘసిత పంచమీ గురౌ రామలింగ ముమయోత్సవాకృతిమ్.[4]
రామలింగని యింటిపేరు గార్లపాటివా రని యిదివఱకు వ్రాసినవా రెవ్వరు గాని యీశ్లోకము నునికి నెఱిఁగినట్లు తెలియరాలేదు. రామలింగని యింటిపేరు తొల్త గార్ల పాటివా రనుట నీశాసనశ్లోకము స్థిరపఱచుచున్నది. ఉద్భటారాధ్యచరిత్రలో రామలింగఁడు తన యింటిపేరేదో పేర్కొననే లేదు. రామకృష్ణుఁడై పాండురంగమాహాత్మ్యమునను బేర్కొనలేదు. 'శ్రీతెనాల్యగ్రహారనిర్ణేత' నని మాత్ర మందుఁ జెప్పుకొన్నాఁడు. అప్పటికిఁ దెనాలివా రని యింటిపేరు స్థిరపడకుండవచ్చును. అన్నయ సుదక్షిణా పరిణయమునఁ 'దెనాలి' యింటిపేరు చెప్పకొన్నాఁడు.
మనుమఁ డగురామభద్రకవి చెప్పుటచేతను, దల్లిపేరు మొదలగునవి సరిపోవుటచేతను రామకృష్ణుఁడును, నన్నయయు నన్నదమ్ము లని స్పష్టపడినది. ఉద్భటచరిత్రమందుఁ గానవచ్చు రామ (లింగే)శ్వరస్వామి యనుగ్రహము, పాలగుమివారిశిష్యత్వము,శైవాచారము మొదలగునవి సరిపోవుటచేతను, లోకమందుఁ బారంపర్యముగా వచ్చుచున్నప్రతీతికిఁగూడ నిర్వాహ మేర్పడుటచేతను, నుద్భటారాధ్యచరిత్ర కర్తయగురామలింగయయే వైష్ణవమతము పుచ్చుకొని రామకృష్ణుడై పాండురంగమాహాత్మ్యము రచియించినాఁ డని, వారు వేఱుపురుషులుగారని, నిర్ణయించుట ప్రమాణదూరము కాదు.
పోలికలు
రామలింగకవియే రామకృష్ణుఁ డయ్యెననుట కింకను మఱియొక బలవత్ప్రమాణము చూపెదను. పాండురంగ మాహాత్మ్యమున శైవవైష్ణవ పురాణావళీనానార్థరచనాపటిష్ఠైకరమ్యమతివి' యని చెప్పఁబడుటచేనాతఁ డేవో శైవపురాణ కథల రచియించి యుండవలె ననియు నీయుద్భటారాధ్య చరిత్రము వానిలోనిది యగు ననియు ననుకొంటిమి. తొలుతఁ దాను శైవుఁడై యున్నపుడు రచియించిన యుద్భటారాధ్యచరిత్రములోని పద్యములే మార్చీ మార్చకుండఁ దర్వాత వైష్ణవుఁడై రచించిన ఘటికాచల మాహాత్మ్యమున నాతఁడు చేర్చుకొన్నాడు. ఇవిగో చూడుఁడు.
సీ|| అచలసుతాభర్త కర్పించి మఱి కాని
మృగములు లేఁ బూరి మేయ వచట
నసమలోచనునకు నర్పించి మఱి కాని
యళులు క్రొవ్విరితేనె లాన వచట
నంధకధ్వంసికి నర్పించి మఱి కాని
కోయిల లిగురాకుఁ గొఱుక వచట
నంగజారాతికి నర్పించి మఱి కాని
చిలుకలు పండ్లు భుజింప వచటఁ
గీ|| దక్కుఁ గలజంతువులు శంభుఁ దలఁచి కాని
యుచితవర్తనములఁ గోరి యుండ వచట
వదనములు వేయుఁ గలయంతవానికైన
నాయరణ్యంబుఁ గొనియాడ నలవి యగునె?
మ|| హరిణంబున్ బులి వెంచు సింగ మొగి సయ్యాటంబు లాడున్ గరిన్
బురినీడన్ ఫణిడింభజాలముల నిల్పుం గేకి, చిట్టెల్కలన్
గరుణన్ బిల్లులజాలముల్ బెనుచుఁ గాకంబుల్ నిశావేళ భీ
గరఘూకంబులపాంతఁగన్ను మొగుచున్ గాంక్షించి తద్భూములన్
గీ|| తబిసి మొత్తంబు ఱేపాడి తానమాడి
డిగ్గియల చేరువలను బూదియ యలందు
కాలమునఁ బల్కును "ద్రియంబకం యజామ
హే” యటంచును జలపక్షు లెల్లయెడల.
ఉ|| సామగుణంబుఁ గ్రోల్చుఁ బికశాబకపంక్తులు శైవధర్మముల్
ప్రేమ నుపన్యసించు శుకబృందము లీశ్వరయోగశాస్త్రముల్
కోమలరీతి శారికలుగూడి పఠించు వినోదలీలలన్
గామవిరోధిఁ బాడు నధికంబుగ నచ్చట భృంగపోతముల్
సీ|| అభ్రగంగాప్రవాహమ్ము లెన్నియొ కాని
తల ధరియింతు రందఱును నదులు
పదినూఱుపడగలపాము లెన్నియొ కాని
యందఱు నురగేంద్రహారయుతులు
డాలొందుచంద్రఖండంబు లెన్నియొ కాని
యందఱు ధరియింతు రమృతకరుని
విషరాశిఁ బుట్టినవిషము లెన్నియొ కాని
యందఱు హాలాహలాంకగళులు
గీ॥ గంధగజదైత్యు లెందఱో కాని యంద
ఱతులగజచర్మపటధారులైనవారు
కర్మ బంధంబు.......................
క్రాలుకొనకుండ నిద్రింపఁజాలుఘనులు.
-ఉద్భట చరిత్ర
సీ|| మొకరితేఁటులు మూతి ముట్టవు తేనియల్
శ్రీమధుశాసి కర్పించి కాని
కోకిలమ్ములు చివురాకులు గొఱుకవు
శ్రీవనమాలి కర్పించి కాని
లేcబచ్చికల్ గబళింపవు హరిణముల్
శ్రీనీలమూర్తి కర్పించి కాని
ఫలభుజిక్రియలకుఁ జిలుకలు దలఁపవు
శ్రీమాధవునకు నర్పించి కాని
గీ|| యితరజంతవులును హరి మతిఁ దలంచి
కాని యేవర్తనమునకుఁ బూన వనిన
నాతపోవనమాహాత్మ్యమభినుతింప
నలవియే వేమొగంబులచిలువ కైన||
మ|| పులు లేదున్ మృగశాబకంబుల హరుల్ వోషించు నత్యాదృతిన్
గలభానీకముఁ గాకముల్ మెలఁగు ఘూక శ్రేణితోఁ బిల్లు లె
ల్కలఁ గాచున్ శిఖికోటి లేఁజిలువలన్ లాలించు నుత్పుల్లబ
ర్హలసచ్చాయల నుంచి యచ్చటియరణ్యానీప్రదేశంబులన్
క|| ఒక చిత్ర మచటి జటిపా
ళికి మున్ సంజలను గ్రుంకి లేచి సమాధిన్
సకలశకుంతంబులు తా
రకమంత్రోచ్చారణాభిరతి మతిఁ బొదలున్.
మ|| శుకముల్ ప్రామినుకుల్ గుణించు గణియించున్ ధర్మమర్మేతిహా
సకథల్ శారిక లీరిక ల్గొను మనీషన్ శేషభాషావిశే
షకళాశాస్త్ర ముపన్యసించు బకముల్ సాత్రాజితీప్రాణనా
యకనామాళి నళుల్ పఠించు సతతోద్యద్గీతికాచాతురిన్
సీ|| నునుగాలిదూదిపానుపు లెన్నియో కాని
యందఱు శయనీకృతాహివరులు
సురలోకవాహిని ర్ఘరము లెన్నియొ కాని
యందఱు దివ్యతీర్ధాంబుపదులు
నీట జనించుమానికము లెన్నియొ కాని
యందఱు కౌస్తుభహారయుతులు
చలివేఁడి వెలుఁగులసాము లెందఱొ కాని
యందఱు నిందుకంజాప్తదృశులు
గీ|| ఖగకులాధీశు లెందఱు కలరొ కాని
యందఱును బుల్గురాటెక్కియములవారు
నారు వోసినరీతి నున్నారు ధీరు
లన్నగరియందుఁ గాపురం బున్నవారు
-ఘటికాచలమాహాత్మ్యము. [5]
ఉద్భటారాధ్య చరిత్రపద్యముల ఛాయ గలపద్యములు పాండురంగ మాహాత్మ్యమునఁగూడ లేకపోలేదు కాని ప్రౌఢతర మయినరచన మగుటచేఁ బాండురంగమాహాత్మ్యమున నీవిధముగాఁ బాడినపాటయే యునఁ దగుపద్యములు గానరావు. ఈ సాధనము లన్నియు రామలింగఁడే రామకృష్ణుఁ డయ్యె ననుసిద్ధాంతమును నిర్వివాదముగా నెలకొల్పఁగల వని నానమ్మకము.
ఇంకొకసాధకము
ఇన్ని సరిపడినను నుద్భటారాధ్యచరిత్రరచనాకాలమును, బాండురంగమాహాత్మ్యరచనాకాలమును నొక్కపురుషుని జీవిత పరిమాణము నందుఁ బొందనివిగా నుండినచో నిఁక నీ వాదమెల్ల వమ్మయి పోవలసినదే యగును. ఆచిక్కులేకుండ నదియుఁ గుదురుచున్నది. ఒక్కనికే రెండుపే ళ్లనుసిద్ధాంతము నిర్వివాదముగా నిల్చుచున్నది.
ఉద్భటచరిత్రరచనాకాలము
కొండవీడుదుర్గాధ్యక్షుఁడుగా నున్ననాదిండ్లగోపమంత్రికడ ముఖ్యోద్యోగి యయినయూరెదేచమంత్రి యుద్భటారాధ్యచరితము కృతి గొన్నాఁడు. అది యెల్లఁ గృత్యవతరణికలోఁ జూడఁదగును. శ్రీకృష్ణదేవరాయఁడు క్రీ. 1515 సం!! కొండ వీడు జయించెను. అది మొదలుగాఁ గృష్ణరాయల యేల్బడి కది లోపడినది. రాయలమంత్రి యగుసాళ్వ తిమ్మరసు కొండవీటి పాలనమును దన మేనల్లుఁ డగునాదిండ్ల గోపమంత్రి కప్పగించెను. నాదిండ్ల గోపమంత్రి సుప్రఖ్యాతుఁడు. గోపమంత్రి క్రీ. 1517న దేచమంత్రి కొక యగ్రహారము నొసఁగెను.
దేచమంత్రి శైవాచారపరాయణుఁడు. ప్రోలనారాధ్యునివంశమువాఁ డగుచంద్రశేఖరవాచంయముని శిష్యుఁడు. మఱియు మహావిద్వాంసుఁ డగులొల్ల లక్ష్మీధరపండితునకును శిష్యుడు. ఆలక్ష్మీధరుఁడు కటాక్షింపంగా శివపంచస్తవి కీతడు వ్యాఖ్యానము రచించెను.
అందు-
శ్లో|| "నాదిండ్ల గోపనృపతే రూరేదేచప్రధానతా
క్వచి దర్ధః క్వచి న్మైత్రీ క్వచి ద్ధర్మ క్వచి ద్యశః
..........యస్మా దస్త్రే మదా దఖిలమనుపతిం దేచయామాత్యవర్య
స్సో౽ యం శ్రీచంద్రమౌళి ర్జయతి గురువరః ప్రోలనారాధ్యవంశ్యః
సచాయం దేచయామాత్యో మాహిమస్తవపంచకామ్
లక్ష్మీధరకటాక్షేణ కురుతే గురు తేజసా. "
(ఈగురునిఁగూర్చి యుద్భటారాధ్య చరిత్రమునవతరణికను గ్రంథావసానమును గూడఁ జూచునది.)
దేచమంత్రి గోపమంత్రిచే నగ్రహారాది సమ్మానముcబడసి ప్రఖ్యాతుఁ డయినపిదపనే యుద్భటచరిత్రము కృతి నంది యుండును. ఆకాల మించుమించుగా క్రీ.1525 అని తలఁప వచ్చును. దీనిచేఁ దెనాలి రామలింగకవి కృష్ణదేవరాయలసభలో నున్నాఁడన్నలోకప్రతీతి సదాధార మయి సంరక్షిత మగుచున్నది.
[6]పాండురంగమాహాత్మ్య రచనాకాలము
పాండురంగమాహాత్మ్యము విరూరి వేదాద్రిమంత్రి కంకిత మయినది. ఆవేదాద్రిమంత్రి కందాళ యుప్పలాచార్యుల శిష్యుఁడు. మంగయ గురువరాజు కుమారుఁ డగుపెదసంగ భూపాలునొద్ద వ్రాయసకాcడు. చిత్రభారతకృతిపతితండ్రి పెద్దతండ్రులును, వైజయంతీ విలాసకర్తయగు సారంగుతమ్మకవియు నీ కందాళ యప్పలాచార్యులకు శిష్యులు. క్రీ. 1542 పరాభవవత్సరమున గండికోట ప్రభువు కందాళప్పలాచార్యులకు భూదాన మొసగినశాసనము గలదఁట. దీనిఁబట్టి పాండురంగమాహాత్మ్య రచనాకాల మించుమించుగా క్రీ. 1550, 1560 అగునని తలంప వచ్చును. మఱియుఁ బాండురంగమాహాత్మ్యమున రామకృషునిచే
భట్టరు చిక్కాచార్యుఁడు
తన గురుఁడుగా స్తుతింపఁబడినాఁడు. ఈచిక్కాచార్యునికిఁ బలువు రాంధ్రకవులు శిష్యులయి యుండిరి. చాతుర్వాటికామాహాత్మ్యము, ఆనందకాననమాహాత్మ్యము మొదలగు ప్రబంధములను రచియించిన లింగమకుంట రామకవి (ఈతఁడు తెనాలి రామకృష్ణకవి యల్లుఁడు) యు నాతనితమ్ముఁ డగులింగమకుంట తిమ్మకవియు నీ చిక్కాచార్యులకు శిష్యులు
క|| గురురాయపట్టభద్రుని
నరిహరు శ్రీరంగనాయకాంశభవున్ భ
ట్టరు చిక్కాచార్యుల మ
ద్గురులఁ దలఁచి యడుగులకు నతుల్ గావింతున్
-లింగమకుంట రామకవి.
సీ|| శ్రీవైష్ణవహితుండ జిక్కయభట్టరు
శిష్యుండ. - లింగమకుంట తిమ్మకవి[7].
మఱియు రామకృష్ణకవులచేఁ గామందకము కృతిగొన్న వాcడు కొండ్రాజు తిమ్మరాజుకొడు కగు వేంకటాద్రియు నీయాచార్యుని శిష్యుఁడే,
క|| శ్రీచంచద్బట్టరుచి
క్కాచార్యవరార్యశిష్య యతులితశౌర్య
ప్రాచుర్యవర్య గుణర
త్నాచల జయలలిత ధైర్యనయతత్త్వనిధీ.
(కామందకము కృతిపతి సంబోధనమున)
మఱియు నీకామందక కృతిపతి, పాండురంగమాహాత్మ్య కృతిపతి యగువిరూరివేదాద్రిమంత్రి నేలినప్రభు వైన పెదసంగభూపాలునకుఁ జెల్లెల కొడుకు. శా.1505, క్రీ. 1584 స్వభానువత్సరమున వేంకటరామకృష్ణ కవులచే నా కొండ్రాజు తిమ్మరాజు కొడుకగువెంకటాద్రి కామందకకృతి నందుకొన్నాఁడు.
మ|| రమణీయంబుగ శాలివాహశకవర్షంబుల్ గతంబై సహ
స్రము నేనూఱను నాఱునై వెలయఁగాఁ బ్రౌఢిం దెనింగించి రౌ
ర మహిం దిమ్మయ వేంకటాద్రివిభుపేరన్ వేడ్కఁ గామందకీ
యము వేంకటరామకృష్ణులు స్వభాన్వబ్దంబునన్ రూఢిగాన్,
వీనిఁబట్టి చూడఁగాఁ బాండురంగమాహాత్మ్యరచనాకాలము క్రీ. 1565 ఇంచుమించుగా నగు నని యేర్పడుచున్నది. అనఁగాఁ దెనాలి రామలింగకవి యించుమించుగా క్రీ.1525 ఉద్భటచరిత్రమును, మఱి ముప్పది యేండ్లకుఁ బాండురంగ మాహాత్మ్యమును రచించి యుండునని చెప్పనొప్పుచున్నది. మనకవితమ్ముఁ డగునన్నయకవి సుదక్షిణా పరిణయరచనాకాలముకూడ నిందుకు సరివచ్చుచున్నది. మఱి పెక్కుమార్గములచేఁ గూడ మన కవివర్యుని కాలమును నిర్ణయింపవచ్చును గాని యామార్గములు కొంత డొంకతిరుగుడుగా నుండుటచేతను, నిప్పుడు చెప్పినకాలమునకే చేరునవిగా నుండుటచేతను విడనాడినాఁడను.
కవిస్తుతులు
నేఁ జూచినంతవఱకుఁ గవిస్తుతులలో 'రామలింగకవి' యన్న పేరే కానవచ్చినది. నడుమఁ దెచ్చి పెట్టుకొన్న రామకృష్ణనామము ప్రాచీనకాలమునఁ బ్రఖ్యాతము కాలేదు కాఁబోలును! పాండురంగ మాహాత్మ్య ప్రౌఢిమ ప్రఖ్యాత మైనతర్వాత రామకృష్ణనామముగూడ రహి కెక్కినది.
ఉ|| రంగుగఁ బాండురంగని తెఱం గలరంగ రచించి వేడ్క మీ
ఱంగ ఛలోక్తులన్ నృపుఁ గరంగ నొనర్పుహొఱంగు నింగి ము
ట్టంగ మెలంగు నేరుపుఁ గడంగి చెలంగునభంగసద్యశో
లింగుని రామలింగ శశలింగకళానిధినిన్ గణించెదన్
(నాగ్నజిత్తీపరిణయము-వల్లూరి నరసింహకవి)
క|| శృంగారరసాలింగిత
రంగత్కవితానదీతరంగము హృదయ
త్వంగద్భుజంగ మాంగద
లింగమ్ము తెనాలిరామలింగముఁ దలంతున్
(పృథుచరిత్రము-సరస్వతీ సోమయాజి)
పై పద్య మాతcడు లింగధారి యనికూడఁ జెప్పుచున్నది.
“రంగనాథుని రామలింగకవిని"
(కూర్మపురాణము - రాజలింగకవి)
"రామ, లింగకవి రామభద్రుల లీలఁ దలఁతు"
(అధ్యాత్మరామాయణము -శరభనకవి)
"భీమకవి రామలింగని"
(చంద్రరేఖావిలాసము-జగ్గన)
ప్రబంధరత్నావళిలోఁ దెనాలి రామలింగకవికృతులు కందర్ప కేతువిలాసము, హరిలీలావిలాసము ననువానినుండి కొన్ని పద్యము లుద్ధరింపఁబడినవి. వానిఁగూర్చి ముందుఁ దెలుపుదును. అందును రామలింగనామమే యున్నది. మఱియు నీచాటుపద్య మున్నది.
ఉ|| లింగనిషిద్ధుఁ గల్వల చెలిం గని మేచకకంధరుం ద్రిశూ
లిం గని సంగతాళి లవలిం గని కర్ధమదూషిత న్మృణా
లిం గనిఁ గృష్ణచేలుని హలిం గని నీలకచన్ విధాతృనా
లిం గని రామలింగకవిలింగనికీర్తిహసించు దిక్కులన్,
అప్పకవి మొదలగువారు మఱియుఁ బెక్కురు రామలింగండనియె పేర్కొనిరి. అయినను అతనియల్లుఁ డగులింగమకుంట రామకవియు, మనుమఁ డగురామభద్రకవియు రామకృష్ణనామమును బేర్కొనిరి.
చతుర్వాటికామాహాత్మ్యము, ఆనందకాననమాహాత్మ్యము ననుకృతులలో
సీ|| శ్రీరామసేవాప్రసిద్ధుఁ గాశ్యపగోత్రు
శుభదకాత్యాయనసూత్రపాత్రు
లలితచారిత్రుఁ గాళయమంత్రికిని గోన
మకును దౌహిత్రు సర్వకవిపౌత్రు
తిరుమలాంబాగర్భవరవార్ధి పూర్ణేందు
ధన్యాత్ము లక్ష్మప్రధానపుత్రు
నిజపాలకజనకనిష్ఠాగరిష్ఠ రా
మసచివలబ్ద రామజపధుర్య
గీ|| రామకృష్ణాఖ్యు జామాతఁ బ్రకటవిభవు
శుక్లయజురధ్యయనుఁ బేర సూరిమాచ
యానుజునిఁ దిమ్మధేనిధి కగ్రజాతు
ననఘు లింగమకుంట రామార్యునన్ను.[8]
ఇట్లు అల్లు డగురామకవియుఁ, బూర్వోదాహృత పద్యమున మనుమఁ డగురామభద్రకవియు, రామకృష్ణ నామము పేర్కొనుటకు వారు వైష్ణవమతమం దెక్కువగా నభినివేశముగలవా రగుట కారణము గావచ్చును. వారికి వైష్ణవమతాభినివేశ మాయాగ్రంథములఁ జూడవచ్చును.
మఱికొన్ని కృతులు
తెనాలి రామలింగనికృతులు మఱిరెండు తెలియవచ్చుచున్నవి. వానిపేళ్లు కందర్పకేతువిలాసము, హరిలీలావిలాసము. ఆప్రబంధము లిప్పుడు కానరావుగాని, వానినుండి కొన్నిపద్యములు ప్రబంధరత్నావళిలో నుద్దృతము లయినవి. వాని నాగ్రంథమునఁ జూడఁదగును. ఇవి గాక పాండురంగవిజయ మని మఱియేమో అని యీకవికృతు లున్నట్లు కొందఱు పేర్కొందురుగాని వానివిషయము నమ్మఁదగినది గాదు.
కథలు
తెనాలిరామలింగనికథ లని దక్షిణహిందూదేశమెల్లఁ బ్రఖ్యాతికెక్కి పెక్కుకథ లున్నవి. వానిగూర్చి మన మేమియుఁ జెప్పఁజాలము, అతఁడు హాస్యచతురుఁడై యుండవచ్చును. నిజముగాఁ గొన్నికథ లాతనికి సంబంధించినవే కావచ్చును. లోకులు మఱియు ననేకాద్భుతకథ లాతని తలకుఁ దగిలించియు నుందురు. పెక్కుకథలు శ్రీకృష్ణదేవరాయల గోష్ఠిలో జరిగినవిగా వినవచ్చును. రామలింగఁడు రాయల సమకాలము వాఁడే, కావున నవి సంభావ్యములుగావచ్చును. చాటుపద్యమణిమంజరిలో నాతని కథలకు సంబంధించిన చాటుధారలఁ గొన్నిటిని జేర్చినాఁడను. క్రొత్త దొక్కటి యిక్కడ చూపుచున్నాడను.
క|| ఓయమ్మలార! మందులు
వేయేల మకారకొమ్ము విషకవిగానిన్
వాయెత్తకుండఁ జేసిన
వాయెత్తదు రామరాయవసుధేశునకున్
అళియరామరాయనికి వాయురోగము వచ్చెనఁట! అంతఃపుర స్త్రీ లాతనికి మందుల నిప్పింపఁ దంటాలు పడుచుండగా రామలింగఁ డీపద్యమును జెప్పినాఁడఁట. మకారకొమ్ము విషకవిగాఁ డనఁగా మూర్తికవి. ఆతని వాయి = నోరు, ఎత్తకుండఁజేసినచో రామరాయలకు వాయి = వాయురోగము, తలచూప దని పద్యార్ధము. మూర్తికవి విషకవిత్వ ప్రయోగముచే రాయలకు రోగమువచ్చె నని స్త్రీలను నమ్మించి యాతని యుద్యోగవైభవము నూడఁగొట్టించుట కెత్తిన యెత్తుగాcబోలునిది! ఇఁకఁ గవివిషయమును విడిచి ప్రస్తుతగ్రంథమును గైకొందును. శైవారాధ్యులలో నొక్కఁ డయినయుద్భటారాధ్యుల చరిత్ర మిందు వర్ణిత మయినది.
పాల్కురికి సోమనాథకవి రచియించిన బసవపురాణములో సప్తమాశ్వాసమున నీయుద్భటుని చరిత్రము వర్ణితమైనది. ఆకథనే మనకవి ప్రపంచించి ప్రబంధముచేసినాఁడు. తెలుఁగున మలికార్డున పండితా రాధ్యుఁడును, నన్నిచోడఁడును నుద్భటుని స్తుతించిరి.
క|| హరలీలా స్తవరచనా
స్థిరనిరుపమభ క్తిఁ దనదుదేహముతోడన్
సురుచిరవిమానమున నీ
పురమున కుద్భటుఁడు ప్రీతిఁ బోవఁడె రుద్రా!
-శివతత్త్వ సారము
క|| క్రమమున నుద్భటుఁడు గవి
త్వము మెఱయఁ గుమారసంభవము, సాలంకా
రము, గూఢవస్తుమయ కా
వ్యముగా హరు (ర?) లీల, చెప్పి హరు మెప్పించెన్||
-కుమారసంభవము,
పయిపద్యములబట్టి యుద్భటుఁడు హరలీల, కుమారసంభవము, అలంకారగ్రంథము (కావ్యాలంకారసంగ్రహము) రచించినాఁ డని తెలియనగుచున్నది. ఇందుఁ గావ్యాలంకార సంగ్రహ మొక్కటితక్కఁ దక్కిన విప్పుడు కానరాకున్నవి. అతని కుమారసంభవమునుండి కొందఱాలంకారికులు కొన్ని శ్లోకముల నుద్ధరించిరి. [9]ఉద్భటుఁడు కాశ్మీరరాజగు జయాపీడునిసభలో విద్యాపతిగా నుండెనని (క్రీ. 779 నుండి 813 వఱకు) రాజతరంగిణిలో నున్నది.
ఆంధ్రకవు లీతని శివకవులలోఁ బేర్కొనుట మనకథానాయకుఁ డీతఁడే యనుటకు సాధకముగాని యీకథలో నాగ్రంథముల స్మరణము లేకపోవుటయుఁ గాలముసరిపడకపోవుటయుఁ గొంతబాధకమగుచున్నది. ఈప్రబంధమున నుద్భటుఁడు ముంజభోజునికి శైవదీక్ష నొసఁగిన గురువుగాఁ జెప్పఁ బడినాఁడు. ముంజభోజుఁడు దశమ శతాబ్దివాఁడు. ఉద్భటుని గ్రంథము లీభోజుని కింకను బూర్వకాలముననే పుట్టినవి. ఈయుద్భటారాధ్యచరిత్రలో ముంజభోజుని పేరున్నను దీని కాకరమయిన బసవపురాణమున భోజుఁ డనిమాత్రమే యున్నది. పలువురు భోజు లున్నారుగాన యీతఁ డాకాలమువాఁ డయినను గావచ్చును. ముంజభోజుఁ డనుట రామలింగకవి స్వకల్పితముగాన యది యప్రమాణ మని త్రోసివేయవచ్చును. ముదిగొండవా రని యిప్పు డాంధ్రదేశమునఁ బ్రఖ్యాతులుగా నున్నయారాధ్యబ్రాహ్మణుల కీయుద్భటారాధ్యుఁడు మూలపురుషుఁ డని యీప్రబంధమందుఁ గలదు. ఆయుద్భటుని దగ్గఱనుండి ముదిగొండవారివంశక్రమముగూడఁ గొంత గ్రంథాంతమున గానవచ్చుచున్నది. ఈవంశక్రమము పాల్కురికి సోమనాథుని గ్రంథమునఁ గానరాదు. [10]కర్ణాటభాషలోగూడ నుద్భట చరిత్రములు గలవు. సోమరాజకవి బసవాంకకవి యనువా రిర్వురు వానిని రచించిరి. పాల్కురికి సోమనాథుఁడు కుమారపాలఘార్జరునిదిగాఁ జెప్పిన కథనే కర్ణాటక కవు లుద్భటుని కథగాఁజెప్పిరి. ఆ కర్ణాటక కవులకంటె మన సోమనాథుఁడు పూర్వఁడు. కుమారపాలున కుద్భటదేవుఁ డని నామాంతరముగా నా యుద్భటదేవచరిత్ర పీఠికలో శ్రీశ్యామాచార్యులు గారు వ్రాసిరి. అదియెట్లో? మల్లికార్జున పండితారాధ్యుడు, సోమనాథుఁడు వారినిర్వురను వేర్వేఱుగాc బేర్కొనిరి. కుమారపాలుని చరిత్రమున నాతని కానామాంతర మున్నట్టు చెప్పరయిరి. పాల్కురికి సోమనకథ చొప్పున రచియింపఁబడిన యీ యుద్భటారాధ్యచరిత్రమునకును, నాకర్ణాట ప్రబంధములకును నేమియు సంబంధమును గానరాదు.
- * *
- ↑ విశ్వకర్మవంశ్యుఁడు, ధీరజనమనోరంజనకర్త, తెనాలిరామలింగకవి యొకఁడున్నాఁడు. ఆతఁడు వేఱు.
- ↑ పాలగుమివా రారాధ్యులు గాఁబోలును రామలింగకవి కింకను నూఱేండ్లకు ముం దొకఁ డాయింటిపేరివాఁడు శైవాచార్యుఁడు కొండవీటి రెడ్డిరాజ్యమున నున్నట్టు శాసనమున్నది. శ్లో. పాల్గుమిశ్రీకంఠగురో పంచాక్షరీమంత్రపౌనరుక్త్యస్య శిష్యాయ శిష్యపరిషద్రక్షా దాక్షిణ్యసత్కటాక్షస్య శక 1336 నాఁటిది పెదకోమటి మాచారెడ్డిశాసనము. శృంగార శ్రీనాథము కనుబంధము చూచునది.
- ↑ శైవవైష్ణవ పురాణావళీ నానార్ధములు నీకుఁ గరతలామలకనిభము లని పాఠాంతరము కలదు. పాండురంగమాహాత్మ్యమున నీపద్యము పాఠభేదములతో నున్నది.
- ↑ ఈ శ్లోకమునుగూర్చి గుంటూరిలో శ్రీమల్లాది సోమయాజులుగారు నాకుఁ జెప్పిరి. పిదపఁ గొంతకాలమునకు దాని నేను జూచితిని, ఇప్పు డొకమిత్రుఁడు చూచి వ్రాసి పంపెను. శుక్ల సం!! మాఘ శుద్ధ పంచమీ గురువారము స్వామికణ్ణుపిళ్లగారిపుస్తకమునుబట్టి చూడఁగా సరిపడకున్నది.
- ↑ ఘటికాచలమాహాత్మ్యము తెనాలిరామకృష్ణకవిరచిత మయినను నది యాతని మనుమనికాలమున (ఆమనుమని పేరు లేదు) ఖండోజిరాయఁడను మహారాష్ట్రునకుఁ గృతి యీయఁబడినది. కాన యందుఁ గృత్యవతరణిక రామకృష్ణుని రచనము గాదు. రామకృష్ణుని విషయ మం దేమియు లేదు. అది కలావతీ ముద్రాక్షరశాలలో 1902 సం|| ముద్రిత మయ్యెను.
- ↑ శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు 'తెనాలికవులు' అను పేర 1914 ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో వ్రాసినవ్యాసమునఁ బాండురంగమాహాత్మ్యరచనా కాలమును జక్కఁగా నిర్ణయించినారు. దానిసారమే యిక్కడఁ జూపఁబడినది.
- ↑ సులక్షణసారకర్త (లింగమకుంట తిమ్మకవి) అప్పకవికంటెఁ దర్వాతివాఁ డని కం.వీ.గారు వ్రాయుట ప్రామాదికము.
- ↑ ఆనందకానన మాహాత్మ్యములో 'నిజపాలకజనక' అనుచోట 'నిజజనకాగ్రజ' అనియున్నది. దీనిచే నాతఁడు తనపెద్దతండ్రికి దత్తుఁడయ్యెనని తెలియనగును. లింగమకుంట రామకవి తెనాలి రామకృష్ణకవి యల్లుఁడని లింగమకుంటవా రెల్లరు నేఁటికిని జెప్పుచున్నారు. నేఁడు లింగమ కుంటవారి యల్లురగు శ్రీకొండ వెంకటప్పయ్యపంతులుగారివల్ల తొల్త నిది విని తర్వాత లింగమకుంటలో విచారించి రామకవికృతుల సంపాదించి యందును జూచి, నే నిది తధ్యమని నమ్మితిని.
- ↑ నన్నిచోడని కుమారసంభవము పీఠిక చూడము.
- ↑ చంద్రశేఖరగురునివఱకు నావంశక్రమ మున్నది. ఈచంద్రశేఖరుఁడే దేచయమంత్రి గురుఁ డగునని నే ననుకొనుచున్నాను.