మీఁగడ తఱకలు/దక్షిణదేశమందలి ఆంధ్రవాఙ్మయము

వికీసోర్స్ నుండి

11

దక్షిణదేశమందలి ఆంధ్రవాఙ్మయము

క్రీ.శ. 1400 తరువాతినుండి తురుష్కులయు, గజపతులయు నలజడి యంధ్రదేశము నత్యధికముగ నలముకొన్నది. క్రీ.శ. 1430 ప్రాంతపుటలజడిని చూడలేక తాళ్లపాక యన్నమాచార్యుఁ డిట్లు సంకీర్తన రూపమున విలపించినాఁడు.

రామక్రియ

పల్లవి

తతిగాని యీపాటు దైవమా విచారించవే
కతలాయఁ జెప్ప నేఁడు కలికాలమహిమా!!

చరణములు

తుటుములై భూసురుల తుండెములు మొండెములు
నిటువలె భూతములు యెట్టు మోcచెనో
అటు బాలుల రొదలు ఆకాశ మె ట్లోరిచెనో
కటకటా యిట్లాయc గలికాలమహిమా!!
అంగలార్చే కామినుల యంగభంగపు దోcపు
లింగితాన మింట సూర్యఁ డెట్టు చూచెనో
పొంగు నానాజాతిచేత భువన మె ట్లానెనో
కంగి లోక మిట్లాయఁ గలికాలమహిమా!!

అరుదు గోహత్యలు సేయఁగ దూడ లంగలార్వంగ
సరిధర్మ దేవ తెట్టుసమ్మతించెనో
పరధనచూర కెట్టు పట్టాయెనో లక్ష్మి
కరుణ యెం దణఁగెనో కలికాలమహిమా!!

దేవాలయాలు నానాదేశము లెల్లాఁ జొచ్చి
దేవఁగా నె ట్లుండిరో దేవతలు
తావు లేలేరాజులకు దయ గొంత పుట్టదాయ
కావరమే ఘనమాయc గలికాలమహిమా!!

నిరపరాధులఁ జంపి నెత్తురు వారించcగాను
తెరల కెట్లుండిరో దిక్పాలులు
విరసవర్తను లుండే విపరీతకాలమున
గురువాలుం గపటాలే కలికాలమహిమా!!

ఉపమించి దంపతులు వొకరొకరినిం జూడ
చపలదుఃఖములతో సమయగాను
తపములు జపములు ధర్మము లెం దణఁగెనో
కపురుంబాపాలు నిండె కలికాలమహిమా!!

తలలు వట్టీడువఁగాను తల్లులు బిడ్డల వేయ
తలపె ట్టుండెనో యంతర్యామికి
మలసి ముక్కులు గోయ మరుఁ డెట్టు వోరిచెనొ
కలకలే ఘనమాయఁ గలికాలమహిమా!!

దీనతలోఁ బడి గుండెదిగు లసురుసురులు
వాని నెట్లు లోcగొనెనో వాయుదేవుండు
గూను వంచి తల్లి చూడఁ గొడుకుఁ గుత్తికఁ గోయc
గానంబడె నింతేసి కలికాలమహిమా!!

పలుమారు , నమ్మించి ప్రాణములు గొనగాను
యిలఁ దమలోఁ బ్రాణా లెట్లుండెనో
నెలవై శ్రీ వెంకటేశ నీవే యెరుంగుదువు
కలుషమే ఘనమాయఁ గలికాలమహిమా!!

(అన్నమాచార్యుల అధ్యాత్మసంకీర్తనములు 373 టేకు 1వ పాట)

క్రీ. 1500 నుండి 1565 దాఁక నష్టదిగ్రాయభయంకరుఁడయిన కృష్ణదేవరాయఁడు మొదలగురాజులు దక్షిణాపథమును సురక్షితపఱిచి భాగ్యలక్ష్మిని, సాహిత్యసరస్వతిని చాలఁగ సంవర్ధిల్లఁ జేసిరి, గాని విద్యానగరవినాశము తరువాత అంధ్రరాజ్య లక్ష్మి, ఆంధ్రసాహిత్య సరస్వతి, దక్షిణదేశమును అనగా అరవదేశము నధికముగ నాశ్రయింపవలసెను. కారణ మాదేశము రాజ్యోపప్లవము, దౌర్భాగ్యము లేక రాజన్వంతముగా నుండుటయే. తంజావూరిలో చెవ్వప్ప నాయకాదులు, మధురలో నాగమనాయకాదులు, పుదుక్కోటలో కోటవారు, రాజ్యము లేలుచు నాంధ్రదేశమునుండి కవులను, గాయకులను, గాయనులను, అభినేత్రులను, శిల్పకారులను, వ్రాయసగాండ్రను, నింకను రాజ్యాంగమునకు వలసిన విద్యావ్యవహార, వినోద, ముఖ్యతంత్రములవారి నెల్లను వెంట గొనిపోయిరి. అరవదేశమున విఖ్యాతులుగా నున్న విద్వాంసులను, గాయకులను, వ్యవహారదక్షులను సంపూర్ణముగఁ దమకు సహాయపఱచుకొని సర్వ సామరస్యముతో రాజ్య రక్షణము గావించిరి.

తొలుత చాళుక్యరాజ్యమునను, దర్వాత కాకతీయరాజ్యమునను సంప్రదాయపరంపరాగతము లగుచుండు గ్రంథసంచయమునుగూడఁ దమతో వా రాయారాజ్యములకుఁ గొనిపోయిరి. అట్లు కొనిపోయిన గ్రంథసంచయము తంజావూర మహనీయముగఁ బెంపొందినది. ద్రవిడదేశమున నెలకొన్న నాయకరాజులు తమపాలనతంత్రమును దమపూర్వులు కృష్ణదేవరాయాదులు నిర్వహించినతీరుననే నిర్వహించిరి. శ్రీకృష్ణదేవరాయాదులు తమ పూర్వపుసంగమవంశపురాజుల తీరును, వారు తమపూర్వపుఁ గాకతీయుల తీరును, వారు తమ పూర్వపుఁ జాళుక్యులతీరును ననువర్తించి రాజ్యతంత్రముల సాగించిరి. విద్యానగరమున నుండి తంజావూరికిఁ జేరిన గ్రంథములలో నట్టి రాజ్యపరంపరాయాతము లనేకము లున్నవి. చాళుక్యుల యభిలషితార్థచింతామణి, సంగీత చూడామణులు సామ్రాజ్యలక్ష్మీపీఠికాతంత్రము మొదలగుగ్రంథము లీ రాజ్యపారంపర్య సంప్రదాయములను వెల్లడించునవిగా గుర్తింప నగుచున్నవి ప్రధానముగఁ బై మూడు గ్రంథములు శ్రీకృష్ణరాయల రాజ్యనీతి, రాజ్యతంత్రవిధానములకును, నట్లే తంజావూరిరాజుల రాజ్యతంత్రరాజ్యనీతి విధానములకును సరిపోలునవిగా నిరూపణ కెక్కుచున్నవి. రాయ వాచకమునను, నాముక్తమాల్యదలోను నున్న రాజ్యనీతివిషయములు చాల సామ్రాజ్యలక్ష్మీపీఠికాతంత్రమునను, నభిలషితార్థచింతామణిలోను నున్నవి. రాయవాచకమున కృష్ణరాయల దినచర్యాది విధానమునే తంజావూరిరాజులును బాటించిరి. నేఁటికిని మైసూరురాజ్య మావిధానమును గొంత పాటించుచున్నది. తంజావూరిలో నాట్యశాలాది నిర్మాణములు అభిలషితార్థ చింతామణి, సామ్రాజ్యలక్ష్మీ పీఠికాతంత్రాది గ్రంథోక్తరీతుల ననువర్తించుచున్నది. ఆయా విషయముల నెల్ల సరిపోల్చి చూపుటకు ప్రత్యేక పరిశీలనము చాల గావలెను.

తంజావూరిలో చెవ్వప్పనాయకుడు, అచ్యుతప్ప నాయకుడు, ప్రధానముగ రాజ్యపాలన స్వాస్థ్యములయం దధికముగా నాదరము చూపిరి. కాని రఘునాథ, విజయరాఘవ నాయకులు క్రీ.శ.1650 ప్రాంతములనుండి రాజ్యవైభవానుభవములతో పాటు దేవాలయాది నిర్మాణములు, తదుత్సవాదివిశేషములు, సంస్కృతాంధ్రదవిడరచన ప్రోత్సాహములు, తత్కవిసత్కారములు, సంగీతవినోదములు, నాట్య వినోదములు, అందు నధికముగ నాంధ్రకవితాగాననాట్య వినోదములు గలవారై యఖండానంద మనుభవించి, ప్రజాసామాన్యమునుగూడ ననుభవింపఁజేసిరి. ఏవంవిధవినోదమునం బాల్గొనువారికి నిరంతరాన్న దానసత్రములను వెలయించిరి. ఆనాఁ డాంధ్రదేశమునుండి సత్కారముఁ బడయుట కెందఱో తంజాపూర్యాదిస్థలముల కరిగి, రాజాదరము పడసి, యక్కడనే నెలకొనిపోయిరి. వారు రచించిన గ్రంథము లనేకము లున్నవి. ఆయాకవుల గ్రంధముల జాబితాల నిక్కడ ప్రకటించుట నాపని కాదు. అది సుందరమును గాదు. లభించిన యన్నిగ్రంథములనుగూర్చి విమర్శము వెలయించుటయు నల్పవ్యవధిలో నంత సుకరము గాదు.

తంజావూరిగ్రంథములలో విశిష్టయోగ్యత గల గ్రంథములను గొన్నింటినిగూర్చిమాత్రమే, విశేషాంశములనే, క్రొత్తవానినే యిక్కడ వివరింపఁ బూనితిని, తంజావూరిలో రఘునాథనాయని విద్యావినోదము భోజమహారాజు విద్యావినోదమును, గృష్ణదేవరాయనివిద్యావినోదమును దలపించనంతటిది. స్వయము రఘునాథరాయఁడు భోజునంత మహావిద్వాంసుఁడు ఆతని కుమారుఁడు విజయరాఘవనాయకుఁడు మహారసికుఁడు, కవి, మహాదాత, గాయకుcడు, పరమవైష్ణవుఁడు.

రాజసభలో నారితేరిన కవిచౌడప్ప రఘునాథరాయని రాజసభలో

"నేరుతు నని మాటాడను,
వారిజభవునంతవాని వశమా తంజా
వూరి రఘునాథరాయని
గారి సభను గుందవరపుఁ గవిచౌడప్పా!"

"తముఁ దామె వత్తు రర్థులు,
క్రమ మెఱిగినదాతకడకు రమ్మన్నారా
కమలంబు లున్నచోటికి
భ్రమరంబుల నచ్యుతేంద్రు రఘునాథనృపా!"

అనెను. ఈతఁడు విజయరాఘవనాయనిరసికతను మెచ్చి యాతనిపై గొన్నిపదముల రచించెను. అవి శృంగారరసగుళికలు.

రఘునాథనాయకఁడు సంస్కృతమునఁగూడ గొప్పవిద్వాంసుఁడు. యజ్ఞనారాయణదీక్షితు నంతవానికి కావ్యాలంకృతి నాటకాది సాహిత్య విద్యలో గురుత్వము నెఱపినవాఁడు, అనేకులచే సంస్కృతగ్రంథములఁ గృతు లందినవాఁడు, తన చరిత్రమునే యనేకులు, ఒకరే యనేకవిధముల రచింపగా విని తనిసినవాcడు నయినను దాను కవీశ్వరుఁడయి సంస్కృతమునకంటెఁ దెలుఁగుననే పలుగ్రంథములను రచించెను. అందు రామాయణభాగము, వాల్మీకిచరిత్ర, నలచరిత్ర ముద్రితము లయి యున్నవి.

రఘునాథరాయఁడు సంగీతమున గొప్ప విద్వాంసుc డగుటచే నందుఁగూడ గొప్పగ్రంథము రచించెను. రచింపించెను. రఘునాథనాయని సంగీతసుధ, వెంకటమఖిచతుర్దండిప్రకాశిక నాఁటి సంస్కృతగ్రంథములు, రఘునాథనాయనినాఁటి గ్రంథములెల్ల సంస్కృతాంధ్రములలో శాశ్వతప్రతిష్ఠ గాంచదగినవే కాని తేలికపాఱురచనవి గావు.

ఆంధ్రమునఁ జేమకూర వెంకటకవిగ్రంథములు సర్వసహృదయ విదితములేకదా, ఆతఁడు

"తా రసపుష్టిమైఁ బ్రతిపదంబును జాతియు వార్తయుం జమ
 త్కారము నర్ధగౌరవము గల్గ ననేకకృతుల్ ప్రసన్న గం
 భీరగతిన్ రచించి మహి మించినచో నిక నన్యు లెవ్వర
 య్యా! రఘునాథభూపరసికాగ్రణికిం జెవి సోక జెప్పఁగాన్"

అన్నాఁడు. రఘునాథరాయఁడు కృతిగొన్నగ్రంథములలో నైషధ పారిజాతీయ మొక్కటి. తద్గ్రంథకర్త కృష్ణాధ్వరి సంస్కృతాంధ్రములలో గొప్పకవి. ఆంధ్రమునకంటె సంస్కృతమున మఱీ గొప్పకవి. రఘునాథ రాయలపేర నాతడు సంస్కృతమున నైదుగ్రంథముల రచించినాడు.

"నవరస శ్రీరఘునాధభూపాలీయ"
           నామభామాభీష్టనాయకుండు
 సరస 'నైషధపారిజాత' కాహ్వయకావ్య
          వర్యాస్వయంవరవల్లభుండు
 కల్యాణ 'కౌముదీకందర్ప' నాటక
          కన్యోద్వహనబద్ధకంకణుండు
 అమరుకాహంకారహరి భంగీకశృం
          గారసంజీవనీకాముకుండు
 తాళచింతామణీవధూతత్పరుండు
 మంచిజామాత రఘునాథమనుజనేత!
 తెలియ (తెలుఁగు?) నైషధపారిజాతీయకృతియు
 నేవు రక్కలచెల్లెలై హెచ్చుననుచు.

 పరదోషా ౽ పరయోషా
 పరభాషారహితభూమిపాలకఋషికిన్
 మరుదుర్వీధరదర్వీ
 కరగుర్వీడ్యప్రతాపఘనశేముషికిన్,

వాణీనిపుణసభాంత
ర్వాణి హితసువస్తుమహితవాదాన్యకయు
క్పాణికిఁ బరగిరి బిరుదకృ
పాణికి రఘునాథభూమిపాలాగ్రణికిన్. "
                         -నైషధపారిజాతీయము.

వర్ణ్యవస్తువు మంచిదైనపుడు కవి యెట్టివాఁడయినను వర్ణనము ప్రశస్తముగానే యుండు ననుటకు రఘునాథరాయనిఁగూర్చి వర్ణనలు చేసినసంస్కృతాంధ్రకవులరచన లన్నియు సాక్షులే - విజయవిలాస కథారచన మొక పెడ, దానికృత్యవతరణిక యొక పెడగాఁ ద్రాసులోఁ దులదూcపc దగిన యోగ్యత కలది రఘునాథరాయవర్ణన.

కృష్ణాధ్వరి రఘునాథరాయనిగూర్చి చెప్పినపద్యముల నుదాహరింపక విడనాడcజాలను.

నైషధపారిజాతహరణద్వికథార్థసమర్ధనధ్వని
శ్లేషగతిప్రబంధము రచించిన మారఘునాథశౌరి సం
తోషము నందునన్ కణcకతో దశదిగ్జయశోభితద్యశో
భూషణ మైనయీకృతికిఁబూనితి, బ్రౌఢి నిరూఢి చెందగాన్.

ఫణితి ఫణీంద్రులార రసభావవశంవదభావనాఘణం
ఘణితమదుక్తిధోరణుల గల్గిన తప్పులు దిద్దరయ్య త
ద్గుణ మగుణంబు దూషణ మదూషణ మౌ ననువారు గాక త
ద్గుణము గుణంబు దూషణము దూషణ మా ననువార లాప్తులే.

ఆలంకారికహర్షమత్కృతివరం బాజానసారస్వత
శ్రీలుం డౌరఘునాథశౌరిఁ గని హర్షింపంగ నన్యుల్ వృథా
స్థూలంభావుకు లైనకొందఱు దృఢస్యూతోష్ఠతాసూచితో
పాలంభు ల్గనకున్న నేమి కుహనా హల్లోహలుల్ లోహలుల్

ఆజి జితారికోటినతి నన్వహ మన్న సువర్ణదానసం
పూజిత విప్రకోటినుతిఁ బొందుచు నార్గురు చక్రవర్తులన్
రాజులఁ జేయునట్టిరఘునాథనృపాలుఁడె చక్రవర్తి యౌ
నీజగమందు నేడు మొద లిర్వదియిద్దఱు రాజు లెన్నగన్

ఆయతకీర్తిధౌతహరిదంచలు డంజనలక్షణాభిధో
పాయదృఢప్రయోగపరిపాటి గృతుల్ రఘునాథభోజభూ
నాయకు డందుగాక విగుణస్ఫుటదోషము లౌ ఘుణాక్షర
న్యాయజడప్రబంధముల నందు మనం గలనైన నందునే

స్వయముక్తాత్మకృతిస్తుతుల్ జడులు భాషామంజరిన్ లింగని
ర్ణయమున్ గొంత సమాసచక్రము క్రియల్ నైఘంటుకాఖ్యల్ నిర
న్వయతం గూర్చి కవిత్వమంచు సభలన్ వర్ణింప విద్వత్కవి
ప్రియమౌ నాపదవాక్యమానసువచ శ్శ్రీమత్కృతుల్ దక్కఁగాన్
                                                      -నైషధపారిజాతీయము.

కావ్యములలో నాశ్వాసాద్యంతపద్యము లున్నను వానిని బాఠకులు, శ్రోతలు నంతగా బాటించి చదువుట, వినుట యుండదు. ఈగ్రంథమున నా కవి చవిగొల్పుచు జదువను, వినిపింపను సముత్సాహపఱచుచుండును.

కృష్ణాధ్వరి రచించినరఘునాథభూపాలీయాది గ్రంథములయిదును సంస్కృతగ్రంథములు. అందు రఘునాథభూపాలీయ మలంకారశాస్త్రగ్రంథము. దాని వ్యాఖ్యాన మొక యతీశ్వరుఁ డానాఁడే రచించినాఁడు. కడమగ్రంథము లిప్పుడు గానరావు. సంస్కృతమున గొప్పగ్రంథకర్త యగుకృష్ణాధ్వరి రఘునాథరాయఁ డాంధ్రకవిత నధికముగా నభిమానించునని యాతని వినోదపఱుచుటకై పరమోత్సుకతతోఁ బ్రయత్నించి యతి ప్రౌఢముగా నాంధ్రకవితారచన నలవఱుచుకొని యీగ్రంథము రచించినాఁడు. నైషధపారిజాతీయ మాముక్తమాల్యదరచనమును దలఁ పించుచు గూఢప్రౌఢశబ్దార్ధశ్లేషాలంకారచిత్రితమై యొప్పారుచున్నది. రాఘవ పాండవీయము, హరిశ్చంద్రనలోపాఖ్యానము నీగ్రంథమునకు మేలుబంతులే యయినను నా గ్రంథముల నీతఁడు గ్రంథరచనోపక్రమమున మాత్రమే యనుకరించె ననవచ్చును. కవి తానే దీనిని వ్యాఖ్యానించి యుండిన బాగుగా నుండెడిది. పెక్కేండ్లకు ముందే యథామాతృకముగా దీని ప్రతి వ్రాయించుకొని సవ్యాఖ్యానముగాఁ బ్రకటింప నుత్సాహపడితిని గాని పెక్కుచోట్ల శ్లేషచమత్కృతి దుర్గ్రహముగా నుండుటచే నింతదాఁక దానిని ముగింపఁజాలకుంటిని. కుదిరినంత వఱకయిన లఘుటీక గూర్చి ప్రకటింపవలెను. దీనిని ప్రకటించుటలో కృష్ణాధ్వరిమీఁది గౌరవముగాని, శ్లేషకవితమీఁది యాదరముగాని, యముద్రితగ్రంథప్రకటనముమీఁది యౌత్సుక్యముగాని కారణములు గావు. మహనీయుc డయిన రఘునాథరాయల మీఁది యాదరమే యేతద్గ్రంథ ప్రకటనమునకు న న్నుత్సాహపఱచు చున్నది.

ఈతనిగ్రంథములోని రచనాచమత్కారములు గొన్ని చూపుదును. కథారంభపద్యము.

"బలభద్రస్థితి వైరివర్గము నడం పన్ సత్యభామాదులు
 జ్జ్వలసామ్రాజ్యభరార్హతం దెలువఁగా శౌర్యాఖ్యచే మాగధా
 దులు దీర్ణానతవర్ణతం జెలఁగ సం తోషశ్రితశ్రీకుఁడౌ
 నలభూమీపతి గారవించె మహినిన్ న్యాయంబునన్ రుక్మిణిస్"
                                                 -నైషధపారిజాతీయము

ఇందు నాల్గవ చరణమున రెండర్థములకు సరిపడునట్లు నల-అల, 'న్యా' యతి కలదు. బలభద్ర, సత్యభామాదులు, శౌర్యాఖ్య, మాగధాదులు దీర్ణానతవర్ణత, ఔనలభూమీపతి, మహినిన్ రుక్మిణిన్-పదములు రెండర్థములకుఁ గుదురుపడునవి.

“ఆకార నున్నమణిగిరి
 రాకన్నెల చూచు సొంపు రా భీమజన
 వ్యాకుల నప్పురిఁ బుణ్య
 శ్లోకుఁడు గనె భావికుశలసూచిశకునఁడై."

"పాద మూనినచోటఁ బగడాలధగధగ
            లింపారఁ బుటికెల నింపవచ్చుఁ
 గేలు సోకినచోటఁ గెంపులచకచకల్
            సొంపార గంపల ముంపవచ్చు
 నంగ మంటినచోట నపరంజిధళధళల్
            పొంగార గాదెలఁ బోయవచ్చు
 నిక్కి చూచినచోట నీలాలనిగనిగల్
           నిండారఁ గణజాల నింపవచ్చు

 నాత్మభూయత్న రుచిత మోహారివిభవ
 పూర మాటోప మేజాడc బొగడువాcడ
 నింద్రజాలంబొ మాయయో యెఱుఁగ నైనఁ
 జూడఁగలుగుట మామకసుకృతఫలము."

“వచ్చినాఁ డమ్మ నీ వాంఛితాఖిలపూర్తి
            వైభవంబున దేవవల్లభుండు
 చనుదెంచె నమ్మ నీ సౌభాగ్యమలరింప
            వరతేజమున హవ్యవాహనుండు
 వేంచేసె నమ్మ నీ వేడుక లీడేర
            దాక్షిణ్యవర్తన ధర్మరాజు
 ప్రాపించె నమ్మ నీ భాగ్యంబు ఫలియింప
           రత్నసంపద సింధురా జటంచు

 వలపు దెలియంగ నమరశంభళులు దెలుప
 విప్రవరసూక్తి విధృతజీవితఫలంబు
 న్యాయవర్తనమహిమ నన్నలవిభుండు
 హరిదయావహమూర్తి గా కన్యుఁ డగునె?"

రఘునాథరాయని కుమారుcడు విజయరాఘవనాయcడు చాల రసికుఁడు. సంగీతసాహిత్యకవితాగాననాట్యనాటక వినోదపరాయణుఁ డగుటే కాక వైష్ణవమతైకాభిమానమహితుఁడై విష్ణ్వాలయములకే విశేష వైభవము గల్పించుచు వెలుఁగొందెను.అతనికాలమున నంధ్రకవితారచన శృంగారరసైకమయమై పలుచబడినది. గుజిలీపుస్తకములలోఁ బెద్దిదాసు చరిత్ర మని యొక లఘుగ్రంథము ముద్రితమై దొరకుచున్నది. అందుఁ గథానాయకుఁడు పెద్దిదాసు. విజయరాఘవనాయకుని నాఁటివాడు. అతఁడు మహాభక్తుఁడు. విజయరాఘవనాయకుఁ డాతని గేలిచేసి యాతని వేషమును గాడిదకుఁ గల్పించి యూరేగించి, యవమానపఱిచెనఁట! ఆభక్తుని సంకీర్తనములు, రాయని యువకరపుజెయ్దమును నాలఘుకృతిలోఁ గననగును. భక్తు నొకని నట్లు పరిహసించుటచేతనే యాతని రాజ్య మంతరించె ననికూడ నందున్న ట్లున్నది. అం దెంత సత్యము గలదో కాని యాతడు సంగీతసాహిత్యాదిలోలుఁ డగుట తథ్యము. ఆతనినాఁటి కృతులు చాల యక్షగానములు. రఘునాథనాయనిచరిత్రము నాతఁడు ద్విపదకావ్యముగా రచించినాఁడు. ఇప్పటి కించుమించుగా నలువదియేండ్లకు ముందు నే నాయాగ్రంథము లెల్లను బరిశీలించి ముఖ్యాంశములు వ్రాసికొని వచ్చితిని. రఘునాథరాయచరిత్రమందలి తంజావూరి రాచనగరి వర్ణనాదులఁ బట్టి యాయా రాజసభాదిస్థానములను గుర్తించి యప్పు డక్కడి పండితులకుఁ బ్రజలకు వాని నెఱుకపఱిచి వచ్చితిని. 'తంజావూరి యాంధ్రరాజల' చరిత్ర మని పుస్తకమగా నాయావిషమముల సంగ్రహమును బ్రకటించితిని. అప్పటిసేకరణములోని విశేషములనే యిందు వెల్లడించు చున్నాను. విజయ రాఘవనాయనినాఁ టి యక్షగానములలో రచనా చమత్కృతులు కొన్ని:

విజయరాఘవుపట్టంపుఁగవి యైనకామర్సువెంకటపతి సోమయాజి 'విజయరాఘవచంద్రికావిహారము'న

చోళదేశవర్ణన

కవు లెంతురు చోళదేశము, దివ్య
         కావేరీవారిప్రకాశము;
నవరత్నము లున్నకోశము, సుర
         నాయకరాజ్యసంకాశము;
చెఱకురాజనంపబైరులు, కాపు
         సేమము గలిగినయూరులు,
తిరముగాఁ బ్రహించు నేఱులు, చోళ
         దేశంబున వెయ్యాఱులు.

ఆ రాజ్యరమకు మంజీరము, అల్ల
         అమరావతికన్న సారము
భూరమణీమణిహారము, తంజ
         పురము సంపదలకొటూరము.
నవరత్నంబుల పేటలు, దివ్య
         నారికేళంబుల తోటలు,
సవరణ సేసినకోటలు, వీట
         సరసులు నూఱాఱుకోటులు.

వలరాయనిమీఁది యేలలు, చాల
         వర్ణింప నేర్చినబాలలు
విలసిల్లునాటకశాలలు, అందు
         వింతవింతలు కృష్ణలీలలు
పరులను గెల్చినపౌజులు, మెచ్చ
         పాలింతురు దినరాజులు
సరిలేని విద్యాభోజులు, వీట
         సడిసన్న రాజాధిరాజులు,

ఆ రాజధానికి రాజై రాజిల్లురాజచంద్రుని నాతనిపట్టంపుఁగవి యేమని కొనియాడుచున్నాడు

శ్రీ రామగోపాల సేవచేc జాల
బేరు గాంచినఱేడు బిరుదుమన్నీఁడు
లక్షణాన్వితుఁడు కళావతీసుతుఁడు
దాక్షిణ్యశాలి యుత్తమరాజమౌళి
రణముల జగజెట్టి రఘునాథువట్టి
గుణరత్నమలదీవి గురుజన సేవి
బహుదానపరుఁడు భూపాలశేఖరుఁడు
సహజకీర్తిస్పూర్తి సర్వజ్ఞమూర్తి
రతులకు రతిరాజు రాజల రాజు
వితరణగుణహారి విభవజంభారి
జగదుపకారి వైష్ణవమతోద్ధారి
తగవుల వీడు చింతామణి జోడు
నీతికి మాంధాత నియమసంధాత
జాతివార్తల మేటి శౌర్యకిరీటి
సరసుండు నెఱజాణ చక్కనివాఁడు
పరమవైష్ణవులచేపట్టుకుంచంబు
బాహువిక్రమశాలి భరతకోవిదుఁడు
సాహిత్యభోజండు సంగీతవేది
కోరినవారికిఁ గొంగుబంగారు
చేరువమేరు వాశ్రితవర్గమునకుఁ
బేదలపాలింటి పెన్నిధానంబు
వేదకోవిదులకు వెలలేని సొమ్ము
పలికి బొంకనిరాజు పరమవివేకి
నిలుకడ గలవాఁడు నిత్యాన్నదాత
పట్టభద్రుండు కృపాసముద్రుండు
చుట్టలసురభి రాజుల మేలుబంతి
వరశరణాగతవజ్రపంజరుఁడు
నరులపాలింటిపున్నమచందమామ
ఏకవీరుండు జగదేకవదాన్యుఁ
డాకారమన్మథుం డసమసాహసుఁడు

మానినీనూతనమకరకేతనుcడు
భానుసమానుండు పరతత్త్వవేది
అనుమానమునఁ దేలి యావనమాలి
చనవరి యిల్లాలిచనుబాలుఁ గ్రోలి
పెరిగినయన్నగోభిలమౌనికన్న
        పరతత్వరుచి గన్న ప్రాయంపుమిన్న
విజయరాఘవశౌరి విద్యావిహారి
        భుజబలకంసారి పూర్ణసంహారి
అన్నిట నవధాని యారాజధాని
        మన్ననతో నేలు మహి మేలు మేలు.

(విజయరాఘవ నాయకుని విప్రనారాయణచరిత్రమున పదము)

హరిభక్తి దప్పింతునా నాపై
         ననురక్తి రప్పింతునా
పరమపావను డీబాపడు నిను జూచి
         పడసేవాడు గాడే, ఓ చెల్లె
విటునిగా నడిపింతునా దాసరి
         నటనలు విడిపింతునా,
కటకట నీ కింత గర్వమేలె వీ
         డటువంటివాడు గాడె, ఓ చెల్లె
గీతము వినిపింతునా మరునికై
         జీతము కెనయింతునా
నాతిరో హరికీర్తనకు జొక్కువాడు నీ
         గీతమునకు దక్కునా, ఓ చెల్లె
అడపము గట్టింతునా వానిచే
         మడుపులు చుట్టింతునా
గడిదేరి పలికేవు కైంకర్యపరుడు నీ
         కడపము గట్టునట్టె, ఓ చెల్లె

(పదం, కాంభోజరాగం, ఆటతాళం)

చదివేది దివ్యప్రబంధము, మాకు
         సైపదు సంసారబంధము

ఎద నుండు హరిభక్తిగంధము యో
         గీంద్రులతోనే సంబంధము
మాతో మీ కేటి మాటలు, విన
         బ్రాతి గాదు మీ పాటలు
భవనంబులు పర్ణశాలలు మా
         పాటలు హరిమీదియేలలు
తగిలి యుందురు ముక్తిబాలలు మా
         దాపురములు హరిలీలలు
మే మున్నయూరు శ్రీద్వారకా ముక్తి
         కామినిపైనె మా కోరిక
స్వామిభక్తి మాకు చేరికె వో
         కోమలి నీ విక వూరకే పోవే
ఆలుబిడ్డల పొందు కోరము మేము
         కోరేది హరిభక్తిసారము
నీలవర్ణుని గొల్చువారము మీ
         యాలాపములు విన నేరము
పరమాన్నములు కాయగూరలు మా
         పరిధానములు నారచీరలు
సరిసోవు మీకు మా మేరలు మా
         సంగడివాండ్రు పకీరులు.

శంపాలతలు నటింపఁగఁ
దుంపురులై చినుకు లగుచుఁ దోరణ లగుచున్
జంపకగంధి చలింపఁగ
నంపాజాలంపువాన లప్పుడుగురిసెన్,

తాటోటు బాపనదాసరి నీవు
తోటపనుల్ సేసి తొడు సెల్ల మాని
వోరి మాయింటి కెందుండి వచ్చితివి
వూరకె నా బిడ్డ యోజలు చెఱిచి.

తిరుమణి యేమి నీ తిరుచూర్ణ మేమి
కరమున శంఖచక్రంబు లివేమీ
దాసరితన మేమి తావడా లేమి

నీసరివా రెల్ల నినుఁ జూచి నవ్వ
జడియక రావణసన్యాసి వగుచు
నడుచుచున్నావు వైష్ణవుఁడవా నీవు.

(పదం, కాంభోజ, ఆటతాళం)

ద్రావిడవేదము చదివినవాడనే
          ధవళాక్షి నీవు న న్నేలవే
ద్రావిడవేదము చదివినవారు కం
          దర్పుని వేదము విందురా
అంగన మన్నారు దళిగె ప్రసాదమౌ
          పొంగలి చవిగొన్నవాడనే
పొంగలి చవిగొన్న వానికి వనితల
          యెంగిలి చవి మనసాయనా
ఆరామకైంకర్య మాచరించి మ
          న్నారుని గొలిచినవాడనే
ఆరామకైంక్రర్య మాచరించువాని
          కీరామకైంకర్య మేలయా
చెలువ మన్నరుపాదతులసీదళములు
          శిరసున ధరియించు వాడనే
తులసీదళములు ధరియించువానికి
          తొలుతటి ముడిపువ్వు లేలయా.

        (పదం, శంకరాభరణం)

అయ్యయ్యొ నిను నమ్మవచ్చునా, యి
          ట్లైతే దైవము మెచ్చునా
నీయందు వేఱు లేనైతిగా, నేను
          నిను నమ్మి యిటు బేలైతిగా
బాస లిచ్చి తప్ప నంటివి, నా
          భావ మెల్ల జూఱగొంటివి
ఆస జూపి వద్ద నుంటివి, ఇంత
          దోస మేల కట్టుకొంటివి
బెల్లించి యెడబాయ నంటివి, అట్టు
          తల్లిమాటలే వింటివి
తెల్లని వెల్లా పా లౌనా, ఇట్లు
          కల్ల లాడితే మే లౌనా.

పై విధమున విజయరాఘవనాయనిరచనలు, నాఁటికవ యిత్రులయు, కవులయు రచనలు, పలుకుపొంకము, సౌలభ్యము, మృదుపాకము గల వయినను, బరువము దప్పిన పచ్చి శృంగారముతో గోవాళ్లను ద్రోవ దప్పించునవిగా నున్నవి. యక్షగానములే యం దనేకములు. తంజావూరి నాటకశాలలో నా యక్షగానములను బిరుదుపాత్ర లభినయించు వారు. విజయరాఘవనాయనిగా రాయా బిరుదుపాత్రలకు శారదాధ్వజాదు లొసఁగి సత్కరించుచుండువారు. అంతయు నాటలమయము, పాటల మయముగా విజయరాఘవనాయని గోష్ఠి విరాజిల్లినది. నాయకరాజుల తర్వాత వచ్చినమహారాష్ట్రరాజులుగూడ నీయక్షగానవినోదములలో మునిఁగి తేలుచుండువా రనుటకు వారినాళ్లలోఁగూడ వెలసినయక్షగానము లనేకములు తార్కాణ.

రఘునాథరాయలవారినాఁటిరచనలే తంజావూరిరచనలలోc బ్రశస్తమయినవి. రఘునాథరాయలు, చేమకూర వెంకటకవి, కట్టా వరదరాజు, ముకుందయోగి, కృష్ణాధ్వరి, చెంగల్వ కాళయ, చల్లపల్లి రంగన్న వెంకటాచలవిలాసకర్త మొదలగువారి రచనలు తంజాపురాంధ్ర రచనలలో మెచ్చఁదగినవి.

అన్నింటిలోనూ కట్టా వరదరాజు ద్విపదరామాయణము[1] ముద్రితమై ముందర వెలయఁదగినది. అతని శ్రీరంగమాహాత్మ్య మొక్కటే ముద్రిత మయినది. పరమభాగవతచరిత్రము సమగ్రముగా దొరకకున్నను ముద్రింపఁదగినదే.

కవిత లంటే విసువు పుట్టే కాలమున శృంగారరచనల
దవిలి యేదే వ్రాయబోతే తారుమారు లవున్
అవకతవకలు నౌ నికేమో అవును, గావున రసికయువకులు
సవరణలతో సయిరణలతో జదువుకొనవలయున్,

  • * *
  1. తంజావూరి లైబ్రరీవా రిటీవలనే దీనిని ముద్రించిరి.