మీఁగడ తఱకలు/కొలచెలమవారు

వికీసోర్స్ నుండి

12

కొలచెలమవారు

బహుమహాగ్రంథములకు వ్యాఖ్యాతయై సంస్కృతసారస్వత ముద్రను విప్పి చూపినమల్లినాథసూరి యింటిపేరు-కోలాచల, కొలచల, కోలచర్ల, కొలచలమ-అని యిన్ని తెఱుఁగులవ్రాఁతప్రతులలోను నచ్చులోను వాడుకలోను గానవచ్చుచున్నది. పలువురు పండితు లీపేళ్లు గలగ్రామములఁగూర్చి చర్చించియున్నారు. ఒకరు కోలాచలమును బురాణములందు వెదకి కనుcగొనిరి. ఇంకొకరు 'పందిపాడు' అను గ్రామనామమునకు గీర్వాణీకరణ మనిరి. మఱొకరు కన్యాకుమారికడ నున్న కొలచర్ల యనుగ్రామ మగునో యని యధికముగాఁ బరిశోధించిరి. ఇదమిత్థ మని యిదివఱకు జరిపినపరిశోధనలవలన నిర్ధారణ మేర్పడలేదు నామిత్రులు బ్రహ్మశ్రీ కొలిచిన అప్పాశర్మ, యం.ఎ.గారు ఈ విషయమును గూర్చి యాసక్తితో పరిశోధించియున్నారు. వారియింటిపే రగుకొలిచిన మల్లినాథసూరి యింటిపేరివికారమే యగు నని వారు తలంచినారు. కోలాచలము శ్రీనివాసరావుగారు మొదలగువారు దమయింటిపేరే మల్లినాథసూరియింటిపే రని తలంచిరి. వీ రిర్వురును తెలుగాణ్యులే యయినను గోత్రభేదము గలదఁట. ఒంగోలు ప్రాంతములందుఁ దెలుగాణ్యులలోనే కొలచెలమ యని యింటిపేరు గలవారుగూడఁ గలరని వినుచున్నాను. వీరిలో మల్లినాథసూరి వంశపరంపరలోనివా రెవ్వరగుదురో నిర్ణయింపఁదగిన యాధారములు కానరావు. మల్లినాథసూరిగోత్ర మేమో మనకుఁ దెలియరాలేదు.

చంపూరామాయణమునకుఁ బదయోజన మనుపేర మన మల్లినాథసూరివంశజుఁడు నారాయణపండితుఁడు వ్యాఖ్యాన మొకటి రచియించెను. పీఠికాశ్లోకములను బట్టి చూడఁగా నాతఁడు మనయెఱుకలో నున్నమల్లినాథసూరి నాధారపఱుచుకొని ప్రధానముగా నీ వ్యాసము వ్రాయుచున్నాను. ఆశ్లోకము లివి:

కొలచెల్మాన్వయాబ్దీందు ర్మల్లినాథో మహాయశాః
శతావధానవిఖ్యాతో వీరరుద్రాభివర్షితః
మల్లినాథాత్మజ శ్శ్రీమాన్ కపర్దీమంత్రకోవిదః
అఖిలశ్రౌతకల్పస్య కారికావృత్తి మాతనోత్
కపర్దితనయో ధీమాన్ మల్లినాథో౽గ్రజ స్స్మృతః
ద్వితీయ స్తనయో ధీమాన్ పెద్దిభట్టో మహోదయః
మహోపాధ్యాయ ఆఖ్యాత స్సర్వ దేశేషు సర్వతః
మాతులేయక్రతౌ (కృతౌ) దివ్యే సర్వజ్ఞే నాభివర్షితః
గణాధిపప్రసాదేన ప్రోచే మంత్రవరాన్ బహూన్
నైషధజ్యౌతిషాదీనాం వ్యాఖ్యాతా౽ భూ జ్జగద్గురుః
పెద్దిభట్టసుత శ్శ్రీమాన్ కుమారస్వామిసంజ్ఞకః
ప్రతాపరుద్రీయాఖ్యానవ్యాఖ్యాతా విద్వదగ్రిమః
తనయా స్తస్య చత్వారో మహాదేవ స్తదగ్రజః
మహాదేవాత్మజ శ్శంభు స్సప్తక్రతుభి రిష్టవాన్
తతో విశ్వజితం కృత్వా యజ్ఞం సర్వస్వదక్షిణమ్
శంభుయజ్వాత్మభూ ర్దీమాన్ భాస్కరో భాస్కరప్రభః
శ్రీనాగేశ్వరయజ్వాఖ్యా భాస్కర స్యాత్మసంభవః
పుత్రాః పౌత్రా శ్చ దౌహిత్రాః చత్వారో వేదవేదినః
జామాతరో౽పి చత్వార ఏతై ర్నిర్వర్తితాధ్వరః
సర్వతో ముఖపద్మానై స్సర్వక్రతుభి రిష్టవాన్
తస్యాత్మజః కొండుభట్టో ద్వితీయో వేదవిత్కవి:
శ్రీనాగేశ్వరయజ్వాఖ్యః కొండుభట్టసుత స్సుధీః
నరసక్కాఖ్యవధ్వాశ్చ శ్రీనాగేశ్వరయజ్వనః
నారాయణేన పుత్త్రేణ కొలచెల్మాన్వయేందునా
చంపురామాయణాఖ్యస్య ప్రబంధ స్యాఘహారిణః
వికృతిః క్రియతే ప్రేమ్ణా యథామతి సమాసతః

మీఁదిశోకములందు వారియింటిపేరు "కొలచెలమ"వా రని యున్నది. ఈవంశమువారికి ఓరుఁగల్లు రాజధానిగా రాజ్యమేలిన ప్రతాపరుద్ర చక్రవర్తితోను రాచకొండ రాజధానిగా రాజ్యమేలినసర్వజ్ఞసింగభూపాలుని తోను సంబంధము గల దని యీశ్లోకములు చెప్పుచున్నవి. వీరియింటిపే రగుకొలచెలమ గ్రామముకూడ నక్కడకుఁ జేరువగా నుండcదగును. కొలచెలమగ్రామనామ మని - యది యోరుఁగల్లు రాచకొండల చేరువను గల దని - యీ క్రింది వెలుగోటివారి వంశప్రశస్తిపద్యములు చెప్పుచున్నవి.

స్రగ్దర. వీరుం డా యాచపృథ్వీవిభుఁడు .......... ఘోరాజిన్ ధాటిఁ జెల్లం గొలచెలమపురీఘోటికాకోటిఁ దెచ్చెన్.

సీ|| కొలచెల్మకాడను బలియుఁడై తురకలఁ గొట్టి యశ్వములను బట్టినాఁడు

ఇట్లు చూడఁగాఁ బురాణములందలి కోలాచలమూగాని, శ్రీకోలాచలం శ్రీనివాసరావు మొదలగువారు నిశ్చయించిన పందిపాడుగాని,కన్యాకుమారి కడ నున్న కొలచెర్లకాని, మల్లినాథసూరి యింటి పేరుగా నేర్పడిన గ్రామము కా దనవచ్చును. ఇంటిపేరు కొలచెలమ యని నిర్ణయించుకొందము.

కొలచెలమ మల్లినాథుఁడు.

ఈయన శతావధానము చేసి విఖ్యాతిఁ గాంచినవాఁడు. నేఁటి కాలమున నస్మద్గురువర్యులు శ్రీ తిరుపతివేంకటేశ్వరు లఖండప్రతిభతో నాచరించుచున్నట్టియు నాంధ్రదేశమందే విపుల ప్రచారము గల్గినట్టియు నీశతావధాన మానాc డీమల్లినాథసూరి నిర్వహించినాఁడు. మనకుఁ దెలియవచ్చిన శతావధానచతురులలో నెల్ల నీతఁడే ప్రాచీనతముఁడు. అద్భుతప్రతిభాప్రదర్శక మైనయాశతావధానచాతుర్యమునకు మెచ్చి కాకతీయప్రతాపరుద్రచక్రవర్తి మనపండితపరమేశ్వరునకుఁ గనకాభిషేక సత్కారము గావించినాఁడు. సామ్రాజ్యలక్ష్మీపీఠికాతంత్ర మని యొక గొప్పతంత్ర గ్రంథము తంజాపురపు సరస్వతీపుస్తకభాండాగారమం దున్నది. రాజధర్మములు వారి దినచర్యాదులు మిక్కిలి చక్కఁగా బ్రశంసింపఁబడినవి. రాజాస్థానమునఁ బండితగోష్ఠి నెట్లు నెఱపవలయునో - విద్వద్వివాదము నెట్లు నడుపవలెనో - జయించినవారి కెట్టిసత్కారము కావింపవలెనో యం దున్నది. విద్వద్వివాదమందు విజయ మందినవారికిఁ జేయఁదగినసత్కారములలోఁ గనకాభిషేక మొకటి. అభిషేకించిన స్వర్ణముద్రికాదుల నప్పు డచ్చటికి విచ్చేసియున్న పండితులకుఁ గవులకుఁ దదితరులకుఁ బంచిపెట్టవలె నఁట! ప్రాచీనపండితగాథలను బరిశీలింపఁగా నీకనకాభిషేకసత్కారముఁ గాంచినవా రాంధ్రులే పెక్కు రగపడుచున్నారు. ఈ వంశమువాఁడే యగుపెద్దిభట్టు, శ్రీనాథుఁడు మొదలగువారు.

ఈ మల్లినాథునికొమారుఁడు కపర్ది, ఈతఁడు శ్రాతసూత్ర కారికావృత్తికారుఁ డని, మంత్రవేత్త యని చెప్పఁబడినది. కపర్దిస్వామి వైదికబృందమునకు సుపరిచితుcడు. ఆపస్తంబగృహ్యసూత్రాదులకు భాష్యములను రచించెను. కపర్దికారిక లని చెప్పఁబడెడుగృహ్యకారికలను రచించిన కపర్దిస్వామి యీతఁడే కావలెను. కపర్దిస్వామి గ్రంథము లివి తెలియవచ్చుచున్నవి. ఆపస్తంబగృహ్య సూత్రభాష్యము, ఆపస్తంబగృహ్య పరిశిష్టభాష్యము, ఆపస్తంబశ్రౌతసూత్రభాష్యము, దర్శపూర్ణమాసభాష్యము, భారద్వాజగృహ్య సూత్రభాష్యము, ఆపస్తంబగృహ్యకారికలు. ఇందు ఒకటి రెండుకంటె నెక్కువగ్రంథము లచ్చుపడలేదు. ఈతఁ డాంధ్రుcడు, కొలచెలమవంశమువాఁడు నగుట యిదివఱకుఁ బ్రఖ్యాతముగా నెఱుకపడిన విషయము కాదు. ఈయన కిద్దఱు కుమారులు. పెద్దవాఁడు మల్లినాథుఁడు. జ్యేష్ఠుఁ డగునీమల్లినాథుఁడు విద్వాంసుఁడుగాఁ జెప్పఁబడలేదు. కనిష్ఠుఁడు పెద్దిభట్టు. ఈతఁడు మహోదయుఁ డని- సర్వదేశములందును మహోపాధ్యాయుఁడుగా విఖ్యాతిఁ గాంచె నని - సర్వజ్ఞ (సింగ) భూపాలునిచేఁ గనకాభిషేకసత్కారము గాంచె నని - గణాధిపప్రసాదముచే ననేకమంత్రములను (?) జెప్పె నని - నైషధాదికావ్యములకు జ్యౌతిష గ్రంథములకు వ్యాఖ్యలు రచించె నని - చెప్పఁబడినది.

కోలచెలమల్లినాథకృతులుగా నానైషధాదివ్యాఖ్యలను వాని గద్యములనుబట్టి మన మిప్పుడు తెలిసికొనుచున్నాము. కాని యిప్పు డుదాహరింపcబడినశ్లోకము లాగ్రంథములు రచించినవాఁడు మల్లినాథుఁడు గాక యాతనితమ్ముఁడుఁ-పెదిభట్టారకుఁడని చెప్పుచున్నవి. లోకమునఁ గూడఁ బెద్దిభట్టే గ్రంథకర్త యనియు నాతఁడు తన గ్రంథముల నన్నగారగుమల్లినాథునిపేరఁ బ్రకటించె ననియు విద్వత్పరంపరనుండి యైతిహ్య మొకటి వినవచ్చుచున్నది. అట్లు ప్రకటించుటకుఁ గారణముగా నీక్రింది కథకూడ నున్నది.

“మల్లినాథుడును బెద్దిభట్టు నన్నదమ్ములు. మల్లినాథుఁడు మందబుద్ధి గలవాఁడు. పెద్దిభట్టు పెద్దబుద్ధి కలవాఁడు. వీరు నివసించు గ్రామముచేరువ నడవిలో నొకయోగీశ్వరుఁడు తపస్సు చేసికొనుచుండెను. మందబుద్ధి యగుమల్లినాథుఁడు తత్పరతతో నా యోగీశ్వరుని శుశ్రూషించు చుండెను. పెద్దిభట్టును సకృత్తుగా సందర్శించుచుండెడివాఁడు. మల్లినాథుఁ డొకప్పుడు కార్యవశమున గ్రామాంతరమున కరిగెను. అన్నగారిచే నాజ్ఞప్తుఁడై యప్పుడు పెద్దిభట్టా యోగి నారాధించుచుండెను. అది యా యోగికి నిర్యాణకాలమయ్యెను. మల్లినాథుఁడు దగ్గఱ లేఁ డయ్యెను. తన కిన్నాళ్లు చేసిన శుశ్రూషకై యాయోగి మల్లినాథునకు సారస్వతము నుపదేశించి యుద్ధరింపఁదలఁచెను. కాని యట్లు తటస్థింప దయ్యెను. అప్పుడు సేవించుచుఁ జెంత నున్న పెద్దిభట్టును జూచి మీయన్నకుఁ జేయఁ దలంచుకొన్నయుపదేశము నాతని యసన్నిధిచే నీకుఁ జేయుచున్నాను. దీనిఫలము మీయన్న గారికే చెందఁజేయుదువు గాక యని యొకమంత్ర ముపదేశించి యాయోగిసిద్ధిపొందెను. పెద్దిభట్టంతతో మహోపాధ్యాయుఁ డయ్యెను. గుర్వాజ్ఞ చొప్పున నాతఁడు తాను రచించిన గ్రంథముల నన్నింటిని నన్నగా రగుమల్లినాథునిపేరనే ప్రకటించెను". ఈ కథ మీఁది శ్లోకములకుఁ దోడుపలుకుచున్నది.

మల్లినాథుని వైదుష్యము

గ్రంథములందు మల్లినాథుఁ డని పేరున్నది. కావున నాపేరే పేర్కొనియెదను. ఈయన స్వతంత్రగ్రంథము లంతగా రచించినట్టు కానరాదు. హెచ్చుగా వ్యాఖ్యాన గ్రంథములే యగపడుచున్నవి. రఘువంశ కుమారసంభవ మేఘసందేశకిరాతార్జునీయశిశుపాలవధములకుఁ బంచకావ్యము లన్నపేరు కల్గుటయును, సంస్కృతభాష నభ్యసించు విద్యార్థు లీగ్రంథములనే ప్రధానముగా నారంభించి చదువుటయును, సుగమము లైనమల్లినాథవ్యాఖ్యలు వెలసినతర్వాతనే యేర్పడిన దని కొందఱు తలంచుట కలదు. కాని, తార్కికరక్షటీకలో మల్లినాథుఁడే "స్ఫుటీకృతం చైత దస్మాభిః పంచకావ్యటీకాసు" అనుటవలన నాయన నాఁటికే యాగ్రంథములకుఁ బంచకావ్యసంజ్ఞ కల దని యేర్పడుచున్నది. ప్రధానముగా విద్యార్థు లాగ్రంథములనే చదువుటకుఁ గారణము మల్లినాథ వ్యాఖ్యలు కావచ్చును. రఘువంశాదికావ్యములకు మల్లినాథునకుఁ బూర్వకాలమందే పదులకొలఁది వ్యాఖ్య లున్నవి. కాని యీయనవ్యాఖ్యలు వెలసినతర్వాత వానికిఁ బ్రచారము తగ్గినది. ముద్రణాదిసౌకర్యము లేనియాకాలముననే మనమల్లినాథుని గ్రంథము లాసేతుశీతాచలము వ్యాపించినవి. ఇట్టి వ్యాప్తికి వానిఘనతయే కారణము. ఇది యాంధ్రు లభిమానింపఁదగిన విషయము. "దుర్భోధ మయినపట్టును - స్పష్టార్ధమ్ - అని విడుతురు. స్పష్టార్ధ మగుపట్టును వ్యర్ధముగా దీర్ఘసమాసాదులతో నింపి విస్తరింతురు. అస్థానమున ననుపయోగము లగుజల్పములచే భ్రమము కలిగింతురు" అని కువ్యాఖ్యాతలను గర్హించిన భోజునిత్రోవ నీతఁడు చక్కఁగాఁ ద్రొక్కినాఁడు. "ఇహాన్వయముఖే నైవసర్వం వ్యాఖ్యాయతే మయా! నామూలం లిఖ్యతే కించి న్నానపేక్షిత ముచ్యతే' అన్వయముఖముననే సర్వమును వ్యాఖ్యానము చేయుదును. మూలములేనిది కొంచెముకూడ వ్రాయను. అనావశ్యక మయినది చెప్పను" - అని మల్లినాథునిశపథము. కాళిదాసాదిమహాకవుల కావ్యములకును నింక నితరశాస్త్రగ్రంథములకును సమర్థము లయినవ్యాఖ్యలు రచింపఁబూనువానికి ప్రాచీనము లగుసర్వ విద్యలందును సంపూర్ణ పరిజ్ఞానము కావలసియుండును. కణాదగౌతమ తర్కములందు - పూర్వోత్తరమీమాంసలందు - వ్యాకరణమందు - సాంఖ్యయోగములందు - జ్యౌతిషమందు - నింక నితరవిద్యలందు - మల్లినాథుఁడు మహాపండితుఁడు, పదవాక్యప్రమాణపారావారపారీణుఁ డని - మహోపాధ్యాయుఁ డని-యాయన బిరుదులు. "కోశవా నాచార్య" అన్నట్లుగా నెన్నివిద్య లభ్యసించినను బ్రసక్తి కల్గినప్పుడు పరిశోధించుటకుఁ దగినంత గ్రంథసంచయముకూడ నుండినఁగాని సర్వంకష మగు వైదుష్యము సమకూడదు. మల్లినాథుఁడు తనగ్రంథములందు ననేక ప్రాచీనగ్రంథముల నుదాహరించెను. అన్నిగ్రంథముల నాతఁ డెట్లు సంపాదించెనో యాశ్చర్యావహముగా నున్నది. పూర్వులు పరంపరగా గొప్పవిద్వాంసు లగుటచేత వారువా రార్జించిన గ్రంథసంచయము కొంత యింటనే యీయనకు లభించియుండును. అది గాక కాకతిరుద్ర సర్వజ్ఞసింగభూపాలురసంస్థానములతో సంబంధ ముండుటచేత నక్కడి సరస్వతీభండారములును దొరకియుండును. ఈయన తనవ్యాఖ్యలం దుదాహరించిన గ్రంథము లనేకము లిపుడు లభించుట లేదు. కొన్ని యిట్టివనికూడఁ దెలియరాకయున్నవి. ఉదాహరణముగా నొకటిరెండు తెల్పెదను. సంగీతశాస్త్రవిషయములు వచ్చినప్పు డీయన వ్యాఖ్యానములందు 'తధా చ మతంగః’ అని యుదాహరించినాcడు. తెలియక ముద్రాపకులు కొందఱు 'మాతంగః' అని ముద్రించిరి. మతంగుఁడో మాతంగుఁడో సంగీతశాస్రమున నేమిగ్రంథము రచించెనో నేఁ డెవ్వరికిని దెలియ రాకుండెను. ఈ నడుమ శ్రీమానవల్లి రామకృష్ణకవి, ఎం.ఏ. గారు తంజావూరి రఘునాథరాయని సంగీతసుధలో "గ్రంథం బృహద్దేశ్యభిధం మతంగముని ప్రణీతం నిపుణం విలోక్య" అని యుండుటను బరిశీలించి తిరువాన్కూరు మహారాజపుస్తకశాలవా రిటీవల సంపాదించినబృహద్దేశి గ్రంథభాగము మల్లినాథుఁ డుదాహరించినమతంగకృతగ్రంథముగా గుర్తించిరి. మఱియుఁ గొన్నిచోట్ల “తథా చ చాక్షుషః" అని యున్నది. చాక్షుషుఁ డెవరో ఏమిగ్రంథము రచించెనో తెలియ దయ్యెను. ఇది రాజనీతిగ్రంథ మని శ్రీకవిగారే గుర్తింపఁగల్గినారు. మల్లినాథుఁ డుదాహరించినమహాయాత్ర యను గ్రంథ మిట్టి దని యిదివఱ కెఱుఁగ రా కుండెను. అది యిప్పుడు ప్రాచ్యలిఖితపుస్తకశాలకు లభించినది. శాకునగ్రంథ మృగచర్మీయము రాజపుత్రీయము మొదలగుగ్రంథము లిప్పుడు దొరకకున్నవి. ఉభయమీమాంసలందును నుభయతర్కము లందును బ్రాచీనగ్రంథము లీయన యుదాహరించినాఁడు. చార్వాక బౌద్ధగ్రంథముల నుదాహరించినాఁడు. అందుఁ గొన్ని యిప్పడు కానరా కున్నవి. పంచకావ్యవ్యాఖ్యలం దీయన దక్షిణావర్తనాథుఁడను నొక ప్రాచీన వ్యాఖ్యాతను "నాథవచన మనాథవచనమేవ" ఇత్యాదివిధముల గర్హించినాఁడు. దక్షిణావర్తనాథునివ్యాఖ్య లిప్పుడు దొరకినవి.

మల్లినాథుఁడు రచియించినగ్రంథము లివి తెలియవచ్చుచున్నవి. రఘువంశ, కుమారసంభవ, మేఘసందేశ, కిరాతార్జునీయశిశుపాలవధము లను పంచకావ్యములకు వ్యాఖ్యలు, నైషధవ్యాఖ్య, భట్టికావ్యవ్యాఖ్య, ఏకావళివ్యాఖ్య తంత్రవార్తిటీక, సర్వమంజరీ వ్యాఖ్య (పరిమళము), తార్కిక రక్షటీక, జ్యౌతిషగ్రంథము, రఘువీరచరిత (?) రఘువీరచరితము మల్లినాథకృతి యగునో కాదో !

మీఁద నుదాహరింపఁబడిన చంపూరామాయణ వ్యాఖ్యాత శ్లోకములందుఁ బెద్దిభట్టు సర్వజ్ఞ సింగభూపాలునిచే (మాతులేయక్రతౌ? కృతౌ?) మేనమామ కుమారుని యజ్ఞమునఁ గనకాభిషేకసత్కార మందినట్టున్నది. సర్వజ్ఞసింగభూపాలకృతి యగురసార్ణవసుధాకరము నీతఁడు తనవ్యాఖ్యలం దుదాహరించినాఁడు. సర్వజ్ఞసింగభూపాలుని సమ్మానాభిమానము నిట్టు పెద్దిభట్టు చూపినాఁ డనుకొనుచున్నాను. పెద్దిభట్టు సర్వజ్ఞ సింగభూపతికాలమున నున్నవాఁ డనుటకు సాధకముగా నీ క్రింది.శ్లోకము నా కొకచోటఁ జేకూడినది.

శ్లో!! కిం వాససా చీకిరిబాకిరేణ కిం దారుణా వంకరటింకరేణ
      సర్వజ్ఞ భూపాలవిలోకనార్థం వైదుష్య మేకం విదుషాం సహాయమ్.

పెద్దిభ ట్టొకనాఁడు చీఁకిరిబాఁకిరిచినుఁగులప్రాఁత కట్టుకొని వంకరటింకరకఱ్ఱ చేతఁ బట్టుకొని సర్వజ్ఞసింగభూపతి విద్వత్సభకుఁ బోవుచుండఁ ద్రోవలో నెవరో యడిగిరఁట, తాతగారూ! రాజసభ కిట్టివేషముతోఁ బోవుచున్నారే మని. అప్పుడాయన పై శ్లోకము చెప్పెనఁట.

మఱియుఁ బెద్దిభట్టు గణాధిపప్రసాదముగలవాఁ డని చంపూరామాయణ వ్యాఖ్యాదిశ్లోకములం దున్నది. రఘువంశాది వ్యాఖ్యలందుఁ బ్రధానముగాఁ జేసిన గణపతిస్తుతిశ్లోకము లున్నవి.

పెద్దిభట్టుపేర నీక్రిందికథలను కొందఱు చెప్పుచున్నారు. "పెద్దిభట్టుతోడియల్లుఁడు ఘనాంతము వేదవిద్య నేర్చినవాఁడు. మంచి కండపుష్టి కలవాcడు. పెద్దిభట్టు మంచిసంస్కృత సాహిత్యము, శాస్త్ర పాండిత్యముఁ గలవాఁడుగదా! పెద్దయల్లుఁడగునావేదముగ్దుఁడును జిన్నయల్లుఁ డగునీశాస్త్రచతురుఁడును నత్తవారింటి కేకకాలమున నొకప్పు డేతెంచిరి. అత్తమామ లా పెద్దయల్లు నలక్ష్యముతో నగౌరవముతోను, నీపిన్నయల్లుని మన్ననతో మర్యాదతోను జూడసాగిరి. ఆతని వేదవైదుష్యమును వెక్కిరించి-యీతనిశాస్త్రచాతుర్యమును సన్నుతించిరి. ఆతనికి నడవలోఁ జాఁపమీఁదను, నీతనికిఁ బడుకగదిలోఁ బట్టెమంచముమీఁదను శయనవిధాన మేర్పఱచిరి. పె ద్దాతఁడు కోపమునఁ గుములుచుండెను. పిన్నాతఁ డుత్సాహమున నుప్పొంగు చుండెను. పడుకగదినుండి రాత్రి లఘుశంకకు బయలి కేఁగుచు నీపిన్నాతఁడు త్రోవలో నడవలోఁ బండుకొనియున్న తోడియల్లు నొకతన్ను తన్ని యెఱుఁగక ప్రమాదమునఁ దన్ని నట్టు నటించి "క్షమధ్వమ్" అని బుజ్జగించి పోవుచుండెను. ఒకనాc డాయెను. రెణ్ణా ళ్ళాయెను. అనుదినము నట్లే తన్నుచు "క్షమధ్వమ్" చెప్పుచుండ సాగించెను. ఒకనాఁడు రెణ్ణాళ్లు ఓర్చుకొనెను. కాని పెద్దయాతఁ డామీఁద నాగఁజాలఁ డయ్యెను. మూఁడవనాఁడు నట్లే యూతఁడు తన్ని క్షమధ్వము చెప్పెను. కోపాటోపముతో లేచి యా పెద్దయాతఁ డీపిన్న యాతని సిగ పట్టు కొని వంగలాగి "పొగరుఁబోతా! ప్రతిదినముఁ దన్నుచు నొకటే క్షమధ్వము చెప్పసాగించితివి. నీ కొకక్షమధ్వము వచ్చిన నాకు ముప్పదిరెండు శ్రయధ్వములు వచ్చును. ఏమనుకొన్నావో నా దెబ్బ చూచికొ" మ్మని "ప్రథమా ద్వితీయేషు శ్రయధ్వం, ద్వితీయా స్తృతీయేషు శ్రయధ్వం, తృతీయా శ్చతుర్దేషు శ్రయధ్వం", (ఇట్లు ముప్పది రెండు శ్రయధ్వములు గల వేదమంత్ర మున్నది.) అని సస్వరముగాఁ జదువుచు నొక్కొక్క శ్రయధ్వమున కొక్కొక గ్రుద్దుచొప్పున ముప్పదిరెండు గ్రుద్దులు వెన్నెముకలు విఱుగునట్లు వీఁపుమీఁదఁ దగిలించెను. అవమానితుఁడై పిన్నయల్లుఁ డడఁగియుండెను. అనేకు లీకథను పెద్దిభట్టుపేరఁ జెప్పుదురు. తన్నులు తగిలిన వనుటకు శ్రయధ్వము లయిన వనుట పారిభాషికముగా వైదికుల వాడుకలో నున్నది.

ఎల్లప్పుడును సుకవిసూక్తిరసాస్వాదనతత్పరుఁడుగా నుండు నీ పెద్దిభట్టు స్త్రీవర్ణనమున మంచిమంచిశ్లోకములను జదువుచుండఁగా వినుచున్న దై యాతనియిల్లా లొకనాc డిట్లు వేఁడుకొన్నదఁట ! వారిని వారిని వర్ణించినశ్లోకములను జదువుచుందురేగాని న న్నొకనాఁడైన వర్ణింపరైతిరి గదా" యని. నాఁ డిట్లు వర్ణించినాఁడు పెద్దిభట్టు !

శ్లో!! మేరుమందరసమానమధ్యమా తింత్రిణీదళవిశాలలోచనా
      అర్కశుష్కఫలకోమలస్తనీ పెద్దిభట్టగృహిణీ విరాజతే!

గ్రంథవ్యాఖ్యానదీక్షతోఁ గాల మెల్లఁ గడపుచుఁ బెద్దిభ ట్టింటిపని నంటించుకొనకుండెను. ఇత్యర్థః ఇతిభావః, అనుచు నీయన కూరుచుండుట వలన నిల్లాలికి గృహనిర్వాహము దుష్కర మగుచుండెను. ఒకనాఁ డొక యాప్తవిద్వాంసుఁ డతిథియై యింటికి రాఁగా నేఁ డేమికూరగాయలు వండెద వని పెద్దిభట్టు భార్య నడిగెను. ఆమె యిట్లు బదులు చెప్పెను. "ఇత్యర్ధముల కూర-ఇతిభావముల పులుసు"-వండెదను. మీ రింటినిండ నించుచున్న పదార్ధము లివేకదా! ఈతఁడు శ్రీహర్షనైషధమునకు వార్ధకమున వ్యాఖ్య గావింప నారంభించెను. జీవితసంశయముచేఁ దొందరతొందరగా రచించుటచేత నావ్యాఖ్య యపర్యాప్తముగా నుండెను. అది చూచి యొకపండితుఁ డింత లఘువుగా రచించుచున్నా రేమని యడుగఁగా "మాఫేు మేఫేు గతం వయః (మాఘమున, మేఘసందేశమున వయస్సు కడచెను.) అని పెద్దిభట్టు బదులు చెప్పెను. ఇట్టికథలు మఱికొన్ని యున్నవి.

ఈతఁడు విద్యానాథమహాకవికృతి యగుప్రతాపరుద్రయశోభూషణ మనునలంకారశాస్రగ్రంధమునకు వ్యాఖ్యాత. పెద్దిభట్టు మల్లినాథునకుఁ దనుజుఁ డని యీతఁడు తనగ్రంథమందుఁ జెప్పినాఁడు. చంపూరామాయణ వ్యాఖ్యానమునందు జనశ్రుతియందు ననుజుఁ డని యున్నది. ప్రతారుపద్రీయవ్యాఖ్యానమునం దున్నవిధము లేఖకాదిదోష జనితము కానిచో నదియే మనకు విశ్వాస్యతరము. ప్రతాపరుద్రీయవ్యాఖ్యాన పీఠికలోని శ్లోకము లివి. "వాణీం కాణభుజీమ్" - అన్నశ్లోకము తర్వాత

శ్లో!! త్రిస్కంధశాస్త్రజలధిం చుళుకీకురుతే స్మ యః
     తస్య శ్రీమల్లినాథస్య తనయో౽జని తాదృశః
     కోలచల పెద్దయార్యః ప్రమాణపదవాక్యపారదృశ్వా యః
     వ్యాఖ్యాతనిఖిలశాస్త్రః ప్రబంధకర్తాచ సర్వవిద్యాసు।

     తస్యానుజన్మా తదనుగ్రహాప్తవిద్యానవద్యో వినయావనమ్రః
     స్వామీ విపశ్చి ద్వితనోతి టీకాం ప్రతాపరుద్రీయరహస్య భేత్రీం

ఈ శ్లోకములు రఘువంశాది వ్యాఖ్యాత పెద్దిభట్టారకుఁడే యనునర్ధమును ధ్వనించుచున్నవి.

కుమారస్వామి సోమపీధికుమారుఁడు మహాదేవుఁడు. మహాదేవుని కుమారుcడు శంభువు. ఈతఁ డనేకయజ్ఞములు చేసెను. శంభుపుత్రుఁడు భాస్కరుఁడు. భాస్కరుని పుత్రుఁడు నాగేశ్వరయజ్వ ఈతcడు పుత్రులు నలుగురు - పౌత్రులు నలుగురు - అల్లుండ్రు నలుగురు - దౌహిత్రులు నలుగురు - ఆర్త్విజ్యము చేయcగా - సర్వతోముఖ పౌండరీకాంత యజ్ఞములు చేసినాఁడు. నాగేశ్వరయజ్వకొడుకు కొండుభట్టు, ఈతనికొడుకు నాగేశ్వరుఁడు, నాగేశ్వరుని కొడుకు చంపూరామాయణ వ్యాఖ్యాత నారాయణ పండితుఁడు అని చంపూరామాయణ వ్యాఖ్యాపీఠికా శ్లోకములం దున్నది.

కాలము

ఈ వంశమువారిలో సుప్రఖ్యాతుఁడు మల్లినాథుఁడుగదా! ఆయన వర్తిల్లినకాలమునుమాత్ర మిక్కడ నిర్ణయించుచున్నాను. ఇంతకుముం దీయనకాలమునుగూర్చి విస్పష్టపరిజ్ఞానము లేదు. మల్లినాథుని గ్రంథములలో సర్వజ్ఞ సింగభూపాలుని రసార్ణవసుధాకర ముదాహరింపcబడినది. కావున నాతcడు సర్వజ్ఞసింగభూపతికి సమకాలమువాఁడుగాని తర్వాతివాఁడు గాని యగును. సింగభూపాలుని కాలనిర్ణయము తగవులతో నిండి యున్నది. ఇద్దఱు సర్వజ్ఞసింగభూపాలు రున్నారు. స్థూలముగా నిక్కడ నింతమట్టు వ్రాయుచున్నాను. 1380-1450 ప్రాంతమువారు వా రిర్వురును. మల్లినాథుఁడు వారిలో మొదటి సింగభూపాలుకాలము వాఁడని నేను గొన్నియాధారములచే నిర్ణయించు కొన్నాను. మల్లినాథునితాత ప్రతాపరుద్రునిచే సమ్మానితుఁ డగుటచేత మల్లినాథుఁడు సింగభూపతికిఁ దర్వాతికాలమువాఁడు కానేరఁడు. మల్లినాథునికొడుకు కుమారస్వామి సోమపీధి తనప్రతాపరుద్రీయవ్యాఖ్యలోఁ బెద్దకోమటివేమభూపాలునిసాహిత్యచింతామణి నుదాహరించినాఁడు. పెద్దకోమటి వేమారెడ్డి 1400 మొదలు 1420 దాఁక రాజ్యపాలనము చేసెను. కుమారస్వామిసోమపీథి 1450 ప్రాంతమువాఁడు.


  • * *