మీఁగడ తఱకలు/త్యాగరాజు

వికీసోర్స్ నుండి



13

త్యాగరాజు

ఆంధ్రదేశము కర్మఠప్రచుర మయినది. ఆంధ్రబ్రాహ్మణులు శ్రౌతస్మార్తకర్మపరాయణులు. తక్కినవర్ణములవారును వీరి ననువర్తించిన వారే. పాశుపతకాలాముఖశైవములు, జైనబౌద్ధములుగూడ నాంధ్రులలో సురూఢము లయినవి. శంకరుల తర్వాత పైమతముల యెగుపును తగ్గించి యధికముగా నద్వైతమతమును, రామానుజులతర్వాత రెండు మూఁడుశతాబ్దులకుఁ గొలఁదికొలఁదిగా వైష్ణవమును దెలుఁగుదేశమున నభివ్యాపించినవి. ఆంధ్రదేశమునందు ద్వైతమతప్రచారము చాల నర్వాచీనము. ఇన్నిమతములు వ్యాపించి సాగుచున్నను నాంధ్రులలో బ్రాహ్మణులు, నితరవర్ణములవారు యోగప్రభేదము లగు మంత్ర, భక్తి, లయ, హఠ, తారకరాజాదియోగప్రభేదముల యోగవిద్య నధికముగా నభ్యసించుచు వచ్చిరి. శైవులు, శాక్తులు, వైష్ణవులు నధికముగా మంత్ర యోగము నభ్యసించిరి. వేమన, పోతులూరి వీరబ్రహ్మాదులు హఠ యోగమును సాధించిరి. పోతన, రామదాసు, ప్రకాశదాసు మొదలగువారు భక్తిలయయోగపరాయణు లయిరి. దక్షిణదేశమున నెలకొన్నను,త్యాగరాజు కూడ నక్కడి యాంధ్రులయిననారాయణతీర్ణులవలె భక్తిలయయోగముల ద్వారమున సంగీతరూప మగునాదబ్రహ్మానందరసము ననుభవించిరి. బాహ్యమయినమూర్త్యారాధనముకంటె త్యాగరాజుగా రధికముగా నంతర్యామ్యర్చనమునే కావించిరి. త్యాగరాజుగారి కీర్తనలలోఁ బెక్కింట నీవిషయము ప్రవ్యక్త మగును. బాహ్యము లయిన తీర్ధములను గంగాధనుష్కోట్యాదులను దిరిగి యారాధించుటకంటె నంతరంగమునఁ గలగంగాధనుష్కోట్యాదుల నర్చించుటలో బాహ్యము లయినకోటితీర్ధముల నర్చించుఫలము లభించు నని యీక్రిందికీర్తనమున త్యాగరాజుగారు వెల్లడించిరి. ధను వనఁగా వెన్నెముక. దాని కోటి యగ్రము నాసాగ్రము గాని మూలాధారకుండలినీస్థానముగాని యగును. ఈకీర్తన మీయర్ధమును నిరూపించుచున్నది.

             తోడి - ఆది
కోటినదులు ధనుష్కోటిలో నుండఁగా
ఏటికి తిరిగేవే ఓమనసా ! ||కోటి||

సూటిగ శ్యామసుందరమూర్తిని
మాటిమాటికిఁ జూచేమహారాజులకు ||కోటి||

గంగ నూపురంబునను జనించను
రంగనిఁ గావేరి గని రాజిల్లను
బొంగుచు శ్రీరఘునాథుని ప్రేమతోc
బొగడేత్యాగరాజమనవి వినవే ||కోటి||

వెన్నెముక నడిమి దగుసుషుమ్నకు రెండుపార్శ్వములను ఇడాపింగళానాడులు సాగుచున్నవి. మూఁడు నాడులును ధనుష్కోటిలో నాసాగ్రము గాని, కుండలిని గాని, రెండింటిలో నేస్థల మయినను, నక్కడ నేకీభవించుచున్నవి. శ్రుతితాళగేయములు సంగీతారంభమునను నవసానమునను నట్లే ముక్తాయింపులో నేకీభవించుచున్నవి. ఈ యేకీభావమునకే లయ మని నామాంతరము. త్యాగరాజుగా రీలయ బ్రహ్మానందరసమును సర్వదా యనుభవించుచు ధనుష్కోటిలో నానంద సాగరమున నోలలాడుచునుండిరి.

పై యర్ధమునే త్యాగరాజుగా రీసంకీర్తనమున మఱియు వివరించిరి.

                 గరుడధ్వని - దేశాది
ఆనందసాగర మీదనిదేహము భూభారమె రామ
శ్రీనాయకాఖిలనైగమాశ్రితసంగీతజ్ఞాన మనుబ్రహ్మా
శ్రీవిశ్వనాథ శ్రీకాంతవిధులు పావనమూర్తు లుపాసించలేదా
భావించి రాగలయాదుల భజియించే శ్రీత్యాగరాజనుత II ఆII

ఈ విషయమునే నారాయణతీర్ణులవా రిట్లు ప్రస్తుతించిరి.

                భైరవి-ఆది
రామకృష్ణగోవిందేతి నామసంప్రయోగే
కామ మిహ స్నాతవ్యం సర్వోత్తమప్రయాగే
రామనామగంగాసమ్మిళితకృష్ణనామ
యామునే గోవిందనామసరస్వతీ ప్రథితే
యోగిమానసపరమహంసకులకలితే
వాగీశవిష్ణురుద్రాదివాగ్లహరీలలితే
స్నానసంధ్యాజపహోమతర్పణా నపేక్షితే
హానివృద్ధ్యాదిరహితాఖండసుఖఫలదే
యాగయోగరాజభోగత్యాగసంబంధం వినా
భక్తివిరక్తివిజ్ఞానద్వారాముక్తిఫలదే
సర్వపాపౌఘతిమిరదండసూర్యమండలే
సాధునారాయణతీర్థతీర్ధరాజవిమలే

యోగప్రభేద మగునాదోపాసనమహిమను త్యాగరాజుగా రిట్లు వర్ణించిరి.

          బ్యాగడ -దేశాది
నాదోపాసనచే శంకర
నారాయణవిధులు వెలసిరి యోమనసా ||నా||
వేదోద్ధరులు వేదాతీతులు
విశ్వ మెల్ల నిండియుండేవారలు ||నాII

మంత్రాత్ములు యంత్రతంత్రాత్మలు మటి మ
న్వంత్రము లెన్నో గలవారలు
తంత్రీలయస్వర గానవిలోలురు
త్యాగరాజవంద్యులు స్వతంత్రులు ||నా||

లయవియోగములలో నాదానుసంధానమే యుత్తమోత్తమ మైన దని యోగీశ్వరుఁ డైనగోరక్షనాథుఁ డిట్లు ప్రశంసించినాఁడు.

శ్రీయాదినాథేన సపాదలక్ష
లయప్రకారాః కథితాః పురా వై
నాదానుసంధానక మేక మేవ
మన్యామహే ముఖ్యతమం లయానామ్!!

శ్రీత్యాగరాజస్వామివారి భక్తియోగపరాకాష్ఠ నీసంకీర్తనమున గుర్తింపవచ్చును.

             ముఖారి-రూపకం
ఎంతని నే వర్ణింతును శబరీభాగ్య ||మెం||

దాంతులు వరకాంతలు జగమంత నిండియుండఁగ ||నెం||

కనులార సేవించి కమ్మనిఫలముల నొసఁగి
తనువు పులకరించఁ బాదయుగములకు మ్రొక్కి
ఇనకులపతిసముఖంబున పునరావృత్తిరహితపద
మును పొందినత్యాగరాజనుతురాలి పుణ్యమ్మును ||ఎం||

త్యాగరాజుగారు మనోలయయోగము లేనిబాహ్యతంత్రపరాయణుల నిట్లు పరిహసించిరి.

         ఆభోగి-ఆది
మనసు నిల్ప శక్తి లేకపోతే
మధురఘంటవిరుల పూజేమి జేయును ||మ||
ఘనదుర్మదుఁడై తా మునిఁగితే
కావేరి మందాకిని యెటు బ్రోచును ||మ||

సోమిదమ్మ సొగసుగాండ్రఁ గోరితే
సోమయాజి స్వర్గార్హుఁ డౌనో
కామక్రోధుcడు తపం బొనర్చితే
గాచి రక్షించునే త్యాగరాజనుత ||మ||

త్యాగరాజుగారు మంత్రజపయోగపరాయణుల నిట్లు మహనీయులనుగా స్తుతించిరి.

          శ్రీరాగం-దేశాది
నామకుసుమములచేఁ బూజించే
నరజన్మమే జన్మము మనసా ||నా||

శ్రీమన్మానసకనకపీఠమున
చెలఁగఁ జేసికొని వరశివరామ ||నా||

నాదస్వర మనేవరనవరత్నపు
వేదికపై సకలలీలావి
నోదుని పరమాత్ముని శ్రీరాముని
పాదములను త్యాగరాజహృద్భూషణుని ||నా||

భగవత్ప్రాప్తికి సూటి యైనదగ్గఱిమార్గ మగుహఠేతర యోగప్రభేద ప్రకారము ఆంధ్రదేశమున సర్వదా అభ్యుదయము నందుచుండునుగాక. త్యాగరాజుగారివంటి మహనీయులు ఆంధ్రదేశమున తనరారుచుందురు గాక!

- 2 -

త్యాగరాజస్వామి! మీయద్వైతానుభూతి మా కానందము గొల్పుచున్నది. మీరు శివ దేవీ రామ కృష్ణ లక్ష్మీ సరస్వత్యాదిదేవతలను నాయాపుణ్యస్థలముల యర్చామూర్తులను స్తుతించుచుఁ గృతులను రచించితిరి గాని, యన్నింటను నీశ్వరాద్వైతానుభూతినే భగవంతుని సచ్చిదానందాత్మకతనే వ్యక్తపఱిచితిరి!

మీకృతులలో భావరాగతాళములు పరస్పరము సమేళమై యానుకూల్యముతో నైక్యముతోఁ బ్రస్తారము చెంది చెంది, యాహ్లాద వినోదములలరార్చి ముక్తాయింపుముగింపులో మూఁడును చరమానందమున సమన్వితము లగుతీరులు మామనసుతలఁపును, నోటిపలుకును, మేనిచెయిదమును నైక్యపరిపాకమునకుఁ దార్చి, మాజీవితములనే దివ్యసంగీతములఁ గావించి, మమ్ముఁగూడ సుకృతులఁగా వెలయించుఁ గాక! బండుదుండగము లాడువాఁడు “పలుకు తేనెలతల్లి" పాటలఁ బాడఁజాలడు. కట్టెలు గొట్టువాఁడు వీణ మీఁటజాలఁడు. సంగీతము సుకుమారకళ ఇది భక్తిజ్ఞానపర మగుచో సుకుమారాతిసుకుమారము, మధురాతిమధురము నయిన యాత్మానుభూతికిఁ ద్రోవత్రొక్కించు ననుట మీయనుభవము. శ్రుతిస్థాయి తప్పనిగానము నేర్చినట్టే మీరు భగవత్పరమే యయినరచననుగూడ నేర్చితిరి. మీ గేయరచనాగానవిధానములు మానవలోకోద్ధారకములు. దివ్యప్రజ్ఞాస్ఫోరకములు.

భగవంతుని కభిముఖముగా మనజీవయాత్ర సాగించుచు నాయనతో నన్వయము చెందునట్లు చేయుట గానమునకుఁ బరమార్ధము. ఈ జీవశ్రుతిస్థాయిని సదా హృదయమునఁ గుదుర్చుకొని మనము గానానందము ననుభవింతము గాక!

ఈ యర్ధమునకుఁ దార్కాణగా త్యాగరాజప్రసక్తమగు నొకకథ నిక్కడ వివరింతును.

త్యాగరాజుగారి తాతలకాలమునఁ దెల్లుదేశమున భయంకరక్షామ పీడ కల్గె నఁట. ఒకపల్లెటూర వీరితాతలతాతగారు భగవత్సంకీర్తనము జరుపుకొనుచుఁ బలువుర నాకట్టుకొని పూజ్యలుగా నుండెడివారఁట! ఆయన యాయూర నాహారపదార్ధములఁ గొంద ఱిండ్లనున్నవాని నందఱకుఁ బంచి పెట్టించి, నేఁటి రేషన్ విధానమునఁ గొన్నాళ్లు తక్కువతిండితో నూరివారిప్రాణములు నిలిపెనఁట. ఏయింటను జిట్టెడుగింజలుకూడ లేని దుస్పితి వచ్చెను. ఎండలు మండుచున్నవి. మరణయాతన వచ్చినది. ఈ ముసలిబాపఁ డీశ్వరుఁ డున్నాడు, రక్షించును అని సంకీర్తనము చేయుచుండెను. ఆయూరి కైదాఱుమైళ్ల దూరమున. నీరు లేని యిసుకయెడారియేఱును, దాని కావలిగట్టున నొకగ్రామమును, నాయూరి రెడ్డియింటఁ జాల నిలువధాన్యమును నుండుట విన వచ్చెను. వానలు లేకున్నను నాయేటిచలువకు బావులలో నీళ్లుండుటచే నాయూరఁ గొంతపంట పండెను. ఈభక్తబ్రాహ్మణుని ననుసరించి యూరివా రయిదుగు రారెడ్డిని యాచింపఁ బయనమైరి. ఈ బ్రాహ్మణుఁడును బయనమయ్యెను గాని రక్షకుఁడు భగవంతుఁ డనుచు బాటలోఁ బాటలు సాగించెను. ఇసుకయేటిలో నడక - మట్టమధ్యాహ్నము మండుటెండ - ప్రాణాపాయ స్థితిలో నందఱు నుండిరి. చింపిరిబట్టలు కాళ్లకుఁ జుట్టుకొనికూడ నిలువను నడుగు సాగింపను జాలకుండిరి. నోళ్లు పిడుచ కట్టుకొని పోవుచుండెను. ఇట్టిచోఁ గొన్నిగజముల దూరమున, జీబుకొన్న చిగురాకు జొంపములతో నిండారిననీడతో నొక గొప్పవృక్షము గాన వచ్చెను. భక్తబ్రాహ్మణుఁడు దానిని జూచి తనిసి యటు చేరఁబోవుద మనెను. అం దొకఁడు మనకనులు తిరిగి మతిచెడి యట్టు చెట్టుగానవచ్చినది. నే నెఱుఁగుదును. ఇక్కడ చెట్టెన్నఁడును లేదు. చావో బ్రదుకో నేను మీఁ దియూరికే యడుగు సాగించెద నని బండతనముతో నడువసాగెను. కడమవారు కళవళపడసాగిరి. భక్తుఁడు నేను ముందు చేరఁబోయి నిజ మయినచో మిమ్మఁ గేక వేసి పిలుతును రండని చెట్టును జేర నడచెను. చల్లనినీడచె ట్టాతని కుల్లాసము గొల్పెను. కడమవారు ముగ్గురు నాయన పిలుపునఁ జేరఁజనిరి. అందొకఁడు మాయో నిజమో చల్లనినీడ దొరకినది. నోరు పిడుచ కట్టుకొని పోవుచున్నది. స్వామీ! చెట్టునీడ నిప్పించినట్టు నీరుకూడ నిప్పింపుఁడు అనెను. భక్తుఁడు ప్రార్థించెను. అంత నా చెట్టు చిగురుజొంపముల నుండి చల్లని తియ్యనీరు చెంబులతోఁ బోసినట్లు ధారలుగా జారసాగెను. కనులు మొగము కడుగుకొని కడుపాఱ వాచాఱతో నీరు ద్రావి తల యొడలు కాళ్లు గడిగికొని హాయి హాయి మని యందఱు నానందించిరి. ఇదేమి వింతో అనిరి! ఒకఁ డిట్లనెను. “మండుటెండలలోను, బాడుగుళ్లలోను, నీరులేని పాడునదులలోను దేవతలో పిశాచములో విహరించుచుందు రందురు. వా రెన్ని వింతలయినఁ గొంతకాలము చేయఁగలరు. ఇదేదో అట్టివారి పని. ఏదైనఁ గానిండు. ఇది మాయము కాకముందే మన మంచి జరుపుకోవలెను. అయ్యా! మీరు ప్రార్ధింపుఁడు. వచ్చినది తిండిగింజలకై-ఇంట, ఊర, అందఱు చచ్చుచున్నారు. వారికి నేఁటికి వలసిన బియ్యము, పప్పువగైరాపదార్ధములు కావలెను" అనెను, పండ్లు రాలినట్లు బియ్యపుమూటలు, పప్పులు వగైరాల మూటలు రాలెను. తనవంతు గైకొని యూరివారిని బంపుదు నని కాళ్లు కాలకుండుటకుఁ గూడఁ బ్రార్ధింపుఁ డని భక్తుని వేఁడి యాతఁ డింటికిఁ బర్వెత్తెను.

ముగ్గు రున్నారు. ఇదేదో ముసలిబ్రాహ్మణుని మంత్రమహిమ. మంత్రాలకుఁ జింతకాయలు రాలునా యన్నమాట తలక్రిందైనది. ఉచ్చిష్టగణపతిమంత్రమో యట్టి దింకేదో యీతcడు జపించుచున్నాఁడు. అట్టి క్షుద్రదైవత లిట్టి ఫలములు కూర్పఁగలవు. మహామంత్రములు పరదేవతలు పరలోకమున ఫలప్రాప్తిని కలిగించునే కాని తుచ్చమైనయిహసుఖముల నీయవు. ఏమైనఁ గానిమ్ము ఇప్పుడుచచ్చుచున్నాము గాన కోరకతప్పదు. అయ్యా! మాయూరికరవు తీరుదాఁక నూర నందఱికిఁ గావలసినయాహార మాయిండ్లనే వేయునట్లు మీ దేవతనో, దయ్యమునో ప్రార్ధింపుఁడు అనెను. భక్తుఁడు ప్రార్థించెను. ఆతఁడు మరల ననెను. ఏమో! యిండ్లకడ లభించియుండ వచ్చును. నా కిక్కడఁ గడుపార మంచి పండ్లు పాలు తిండ్లు దొరకవలెను. అవి తిని నే నింటికి వెళ్లుదు ననెను. వానికోరిక లభించెను. ఆరగించి వాc డింటి కరిగెను.

ఇద్ద ఱున్నారు ! ఒకఁడు మీభక్తికి మెచ్చి కల్పవృక్ష మిక్కడ వెలసినట్లున్నది. ఏమి కోరవలెనో తెలియఁజాలకున్నాను. నా కేమి కావలెనో వాని నన్నిటిని మీరే యీకల్పవృక్షముచే నిప్పింపుఁడు అనెను. భక్తుఁడు ప్రార్థించెను. కాని చెట్టునుండి యేవియు రాల వయ్యెను. ఏల రాలకున్నవో బదులు చెప్పు మని భక్తుఁ డావృక్షమును వేఁడెను. చెట్టు గజగజ వణఁక సాఁగెను. కొంత కిట్లు చెట్టు నుండి బదులువచ్చెను. ఇంత దాఁక నేను నన్నుఁ గోరినవారికి వలసినవస్తువులనే యియ్యఁ గల్లుచుంటిని గాన ప్రశ్నములకు బదు లెఱుఁగుట పలుకుట యెఱుఁ గను. మీ ప్రార్ధనవల్ల నాకొఱఁత తెలిసికొని, నాయంతర్యామినిఁ బరమాత్ముని వేఁడి నేఁ డాప్రజ్ఞను బడసి మీకు బదులు చెప్పఁ గల్గుచున్నాను. ఇది నాకుఁ గావలె నని యడుగనేరనివానికి, దానిలేవడి వలని యిబ్బందిని గుర్తింపనివానికి నేది గాని లభింపదు. అట్టివాని కేది యిచ్చినను దానిని వాఁడు సరిగా ననుభవింపఁజాలఁడు. కాన యీతని కేదియు నీయవీలు లేదు. తనకొఱఁతల నాతఁడు గుర్తించి యర్ధించుఁ గాక యనెను. ఆతఁడు యోచించుచుండెను. భక్తుఁడు ప్రార్థించెను. నీ వెవరవమ్మా! కల్పవృక్షము నీవేనా? నేను కల్పవృక్షమనే. నీ ప్రార్ధన లాలకించి, నాయంతర్యామిని సర్వాంత ర్యామి యీశ్వరుడు కోరికలు దీర్పఁబంపెను. కోరుము అనెను. ఆనందపరవశుఁడై "అమ్మా! ఇఁక నిన్ను విడువఁజాలను. మునుముందుగా ఈపని గావింపుము. నన్ను నమ్మక మీఁది గ్రామమునకు దూకినవాc డేమి సంకటములో నున్నాఁడో, వాని నిటకు దెప్పింపుము". కల్పవృక్షము మీఁదియూరు చేరలేక స్మృతిదప్పి త్రోవలోఁ బడియున్న వానిని రాల్చెను. స్మృతి లేదు. వానికిఁ బ్రాణము పోయు మని భక్తుడు వేఁడెను. అయ్యా! ఇది నావల్లఁ గాదే యని వణఁకుచు నంతర్యామి నర్ధించి దానిని గొని తెచ్చివాని కిచ్చెను. పాలలోఁ బంచదార కలసిపోయినట్లు నీవు నాలోఁ గలసి పోయి నారూపముననే నెలకొనుము, కల్పవృక్షము అన్ని కోరికలను దీర్చినది యన్న ప్రసిద్ధి నిలుపుకొనుమా యని భక్తుఁ డనెను. ఎన్నఁడు నెవ్వరును గోరనిగోరికలు కోరుట జరుగుచున్నదే యని యచ్చెరువు చెంది యది యంతర్యామి నడిగి యిట్లు బదులు చెప్పెను. "నేను నీలో నైక్య మందుదును గాని నీవు ప్రపంచ ప్రాణికోటితో నైక్య మందవలెను. మానవతలో నేప్రాణినిగాని నీవు వేఱుపఱుపరాదు. ఏభాగమున నీవు వేర్పాటు పాటింతువో ఆభాగమున నే నుండ వీలుండదు" సర్వపరిపూర్ణత గోచరించి భక్తుఁడు వల్లె యని పరమానందభరితుఁడై చెట్టును గౌఁగిలించుకొనెను. చెట్టు మాయ మయ్యెను. చెట్టు మాయమగుట చూచి చావు దప్పించుకొన్న తొల్లిటివాఁ డిది యంతయు మాయయని నే నన్నట్టే యయ్యె ననెను. కడమవారుకూడ వారు తొలుత ననుకొన్నట్లే యనుకొనిరి గాఁబోలును! భక్తుని తర్వాతి తీ రెట్లుండఁబోలునో మీరే పర్యాలోచించి నిర్ణయించు కొందురుగాక! ఈకథనో, ఆచెట్టునో కడుపునఁ బెట్టుకొని త్యాగరాజుగా రీపాట పాడిరి!

తరము గాని యెండవేళా కల్ప
           తరునీడ దొరకిన ట్టాయె యీ వేళ
నన్ను విడిచి కదలకురా, రామ!
           ని న్నెడబాసి యరనిమిష మోర్వనురా!
           నన్ను విడిచి కదలకురా !

త్యాగరాజుగారి కీర్తన లన్నియు లోఁతు తఱచి చూచినచో నిట్టి యనుభవముల నాదబ్రహ్మావతారములే!

★ ★ ★