మీఁగడ తఱకలు/ఆoధ్రభాషావతారము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search14

ఆoధ్రభాషావతారము

అమ్మ-అబ్బ-శబ్దరూపనిష్పత్తి

సాధారణముగా వాడుకలో నుండుదేశభాషలలో మాతాపితరులు, అగ్రజులు, పితృవ్యమాతృవ్యులు, పితృమాతృష్వసలు, పితామహమాతామహులు పసిబిడ్డ లుగ్గుపాలనాఁటి బోసినోటితో తమ్ముఁ దా మెఱుఁగ నేరనినాఁటికే, పరిచితులై పలుకరించువారు, పలుకరింపఁబడువారు నగుదురు గాన వారిచుట్టఱికపుఁబిలుపు పదములు నిర్ధంతముగ్ధాస్యములతో నుచ్చరింపఁబడునవై యుండును.

నోరు తెఱచునపుడు వచ్చుధ్వని - అ.

నోరు మూసి తెఱచునపుడు వచ్చుధ్వని -మ్మ

నిసుఁగులు నోరు మూయుచుఁ దెఱచుచు ధ్వని సేయుచుండుటలో అమ్మ-శబ్ద మేర్పడును. అది మాతృవాచక మయ్యెను - అట్లే కొంచపుమార్పులతో అ-బ్బ, అ-ప్ప, అ-న్న అ–క్క అ-త్త . పథములేర్పడెను. శిశువునకు నిత్యసన్నిహితులగు తలిదండ్రులకు, అన్నలక్కలకు అవి వాచకము లయ్యెను. -ప్ప ఒక్క యక్కరమే యగునపుడు పూర్వమున్న అ-ప్ప-ప్ప పలికినపుడు - పాప, బాబ, అయినది. -మ్మ -మామ అయినది. అత్త-తాత అయినది. -క్క-కాక అయినది. ఇట్లు చూడఁగా:

అమ - అమ్మ - మామ - మామ్మ - అమ్మమ్మ
అన - అన్న - నాన - నాన్న
అక - అక్క - కాక - కక్క
        అత్త - తాత
        అబ్బ - బాబ
        అప్ప - పాప - రూపము లేర్పడినవి.

అరవమున 'త' తాయ్, - అది ద్విరుక్తము కాఁగాఁ దండ్రి పేరై - తందాయ్ - తందై - అయినది - తాన+తాన తందాన అయినట్లు. ఈ పదము లన్నిటికి తుద 'ఆయ్‌' ఉండుట ద్రవిడోచ్చారసంప్రదాయము. దానిఁబట్టి అమ్మ-అమ్మాయి, మామ-మామయ, అన్నాయ్, అక్కయ, అక్కాయ్, అక్కయ్య, అబ్బాయి, పాపాయి, బాబాయి రూపము లేర్పడినవి. తాయ్+తాయ్ ద్విరుక్తిచే నేర్పడిన 'తందై' శబ్దమునుండియే - ప్రౌఢులభాషలో - 'తండ్రి' శబ్దము పుట్టినది. ఎ ట్లనఁగా తెల్గుభాషలో ప్రథమావిభక్తి తర్వాతికాలమున బహువచనరూపముతోనే యుప్పతిల్లినది. ఒన్‌ఱు, ఇరన్‌ఱు, మూన్‌ఱు-ఇందు 'ఱు' (బహువచన) ప్రత్యయము ఏకవస్తువాచక మయిన - ఒన్ పదము మీఁద కూడ నిది వచ్చినది. ద్వివచనము ద్రవిడభాషలలో లేదు గాన ఇరన్+ఱు అనుచో నా (బహువచన) ప్రత్యయ ముండఁగూడును. మూన్+ఱు లోను నుండవచ్చును. తెలుఁగు భాషలో నకారపొల్లు రేఫము సంధించినపుడు ఆయక్షరద్వయ సంధి సంఘర్షమువలన నడుమ డకార మవతరించును. పన్+రెండు-పండ్‌రెండు - పండ్రెండు, అవన్(వాన్)+ఱు-వాన్‌డ్‌ఱు-వాండ్ఱు; ఇందలి బహువచన రూపము 'ఱు’ లోపింపఁగా 'ఒండు' అయినది. అట్లే రెండు, మూండు రూపముల నిష్పత్తి కూడ. ఈ పద్ధతి చొప్పున 'తందై' తొలిరూపము. 'తందె' తర్వాత రూపము (కన్నడము). తందె తంది అయి దానిపై బహువచనపు 'ఱు' చేరఁగా తందిఱు ప్రాతిపదికపు తుది ఇకారమునుబట్టి 'రి'గా మాఱినది. ఒక్క ప్రత్యయమే యయినను (చేతు+రు, చేసి+రి అయినట్లు) తంది+రి-తందిరి, తండిరి అయినది. తుదకు ఉండిరి-ఉండ్రి యయినట్లు తండిరి-తండ్రిగా మాఱినది.

మగఁడు- సర్వభాషలలోఁ దదర్థకపదము కృత్రిమమే. అది ముగ్ధశిశుభాషలో నుప్పతిల్లవలసినపదము కాదు. అది 'మహాన్‌' వికృతి కావచ్చును. అక్కడ మహత్త్వము వీర్యవత్త్వరూపము. మగన్ (హన్) ఘన్ (ఘన్) పదమునకు వీర్యవంతుc డనుటయే ముఖ్యార్ధము. ఆయర్ధముననే యది యౌపచారికముగా వివక్షాయత్తముగాఁ గొన్ని దేశములలోఁ గొన్ని కాలములలోc- బెనిమిటికిని, భర్త ముసలివాఁ డైనపుడు యువకుc డుగా నున్న కుమారునికిని వాచక మయినది. నేఁటికినిగూడ నిట్టి పురుషసామాన్యార్ధమున నీ పదము తెల్గువ్యవహారమునఁ గలదు.

ఇంట మగదిక్కు లేదు-మగకొడుకు=పురుషుఁడు (భర్తయే, యొండె, కొడుకే అనికాదు అర్థమిక్కడ) మగమొల్క (కళాపూర్ణో-) మగలరాజు - (కుమార). ఈ పదము నేఁడు పెనిమిటి యన్నయర్ధమున వ్యవహృత మగుచున్నట్లే ప్రాచీన వ్యవహృత మగుచుండెడిది.

‘అన్న' యన్న పదము అగ్రజునకుఁ దండ్రికిఁగూడ నేఁ డాంధ్ర దేశమున భిన్నస్థలములలో వ్యవహృత మగుచున్నది. అట్లే. బాబు' అన్న పదముకూడఁ దండ్రికిని, దండ్రితమ్మునికి, లేక పినతల్లి భర్తకు వ్యవహారమున నున్నది.

అప్ప = తండ్రికిని - అక్కగారికిని

అక్క= తల్లికిని - అక్కగారికిని

మఱియు నీ పదము లెల్లఁ బూజ్యార్ధమున నెల్లరియెడఁ గూడ వ్యవహృత మగుచునవి. వీనినిఁబట్టి ప్రాచీనకాలపు వింతసంబంధముల లెక్కింపరాదు.


★ ★ ★