మీఁగడ తఱకలు/వాఙ్మయపరిణామము
15
వాఙ్మయపరిణామము
శా|| భాషాదేవత సుస్వరూప మది విస్పష్టంబుగాఁ గానరా;
దీషద్‌జ్ఞానమ యెల్ల వారికిని, మా కీనాఁడు బహ్వర్ధముల్
భాషింపన్ వలసెన్, నిబంధముల నిర్బంధం బసంబద్ధ మన్
ఘోషం బేర్చడె; మార్పు తప్ప, దిట లగ్గుం గూర్పు మోయీశ్వరా!
పండితులదగ్గఱనుండి పామరులదాఁకఁ, బుట్టిననాఁటినుండి గిట్టిననాఁటిదాఁక నెల్లరకును, నెల్లపుడును లోకప్రవృత్తికి భాష పరమోపకారము; అత్యావశ్యకము. కాని చిత్తసంస్కారములలో నావశ్యకతలలో రుచులలో నర్హతలలో భిన్నలక్షణము లుండుటనుబట్టి వారివారిభాషలు కూడ భిన్నలక్షణములతోనే యుండును. పండితులభాష వేఱు; పామరులభాష వేఱు; బాలురభాష వేఱు; ప్రౌఢులభాష వేఱు. వారువారు వారి వారి భాషలలోఁ దమతమ యవసరములను దీర్చుకొనుచుందురు. పండితునకు రామకథ భవభూత్యాదిప్రౌఢకవినాటకములచే దర్శనీయము కాఁగాఁ బామరునకుఁ దోలుబొమ్మలాటచే దర్శనీయ మయ్యెను. పండితుఁడు తిక్కనభారతము చదివి భారతకథ తెలిసికోఁగాఁ బామరుఁడు "హరిహరీ నారాయణాదినారాయణా" మట్టు పదములు మొదలైనవి చదివి దానిని దెలిసికొనును. పండితుఁడు “వచ్చుచున్నా"నని "వస్తున్నా"నని యనఁగాఁ బామరుఁడు “వస్తుండాను" "వత్తుండాను" అని యనును. వారి రుచులు వేఱు; వీరి రుచులు వేఱు గదా! ఇట్లు భేదపరమావధులను జూపఁబూనినచో నొక్కొక్కని కొక్కొక్క తీరుభాష యున్న దన్నంతవఱకుఁ జూపవచ్చును. ఇందులో నెవ్వరు గాని సంఘమునుండి యెట్లు తొలఁగింప రానివారుగా నుందురో యట్లే వారిభాషయు నపరిహార్యమే యగును. కాని యింతవఱకుఁ గడచి చన్నకాలమం దట్లు జరుగలేదు. ఉన్నతసంఘములవారి యుత్కృష్టభాషయుఁ దత్ప్రయోజనములును, గొంతకొంత పరిరక్షింపఁ బడినవి గాని యధమసంఘములవారి యవనతభాషయు వారి భాషాప్రయోజనములును బరిరక్షింపఁబడలేదు. అందఱకు సమాన మయిన యర్హత సమ్మానము ప్రాచీన కాలమునం దెట్లేర్పడలేదో యట్లే వారివారి భాషలకును భాషాప్రయోజనములకును సమాన మయిన సమ్మానము, అర్హత కలుగదయ్యెను. ఇది సర్వలోక సర్వభాషాసామాన్య మయినవిషయమే.
ప్రస్తుత మగుటచే నిట మన తెనుఁగునాటిమాట తీసికొనుచున్నాను. ఇతరులచేఁ బ్రాజ్ఞు లని సత్కరింపఁబడినవారు, ఇతరులను దమ నిర్ణయము చొప్పున వినిపింపఁగల్గినవారు ఎవరో కొంద ఱాయాకాలములయం దేవో కొన్ని ఛందోవ్యాకరణాదివిధుల నేర్పఱచి, యా విధులచొప్పున గ్రంథరచనాదికము జరుగవలె నని నిబంధములు గల్పించుచు వచ్చిరి. అధమగతి నున్న తక్కినలోకము వారినిర్ణయములను గొన్ని ప్రయోజనము లందుఁగొంతకొంత పాటించుచు వారిని వెంటాడుచు వచ్చిరి. దేశకాల పాత్రములనుబట్టి యానిర్ణయములును మాఱుచు వచ్చినవి. మఱియు నిట్లింతకాలమువఱకు నా భాషాలక్షణ నియామకులు తమకుఁ బరిచిత మయినజనసంఘమును బ్రయోజనములను మాత్రమే లక్ష్యముగాఁ జూచుకొని నిబంధములఁ జేయుచువచ్చిరి. కాని యా భాష ప్రచారము గాంచినసర్వమానవసంఘమునుగూర్చియు భాషవలన వారివారికిం గలుగవలసినసర్వప్రయోజనములనుగూర్చియుఁ, జర్చించి, సర్వార్ధసాధక మగునట్లు నిబంధముల నేర్పఱిచినవారు కారు. కావ్యాలంకారచూడా మణికారునినుండి బాలవ్యాకరణకారునిదాఁకఁగలపండితులు చేసిననిబంధము లాంధ్రదేశమందలి పరిమిత మానవ సంఘమునకుఁ బరిమితభాషాప్రయోజన మైనకావ్యానంద మునకుమాత్రమే కొంత చాలియున్నవి. ఇంతదాఁకఁ గడచిన కాలముతీరు వేఱు. నేcటి కాలముతీరు వేఱు. పూర్వమువారు తలఁచి యైన నెఱుఁగనియావశ్యకత లెన్నో యీనాఁటివారికిఁ గల్గుచున్నవి. పూర్వమువారు మానవులుగాc గూడ గణింపనివా రెందఱో యిప్పుడు మహనీయు లగుచున్నారు. ఇట్టి స్థితిలోఁ బ్రాచీనుల నిబంధము లీకాలమునఁ బనికిఁజాలనివి, పనికి మాలినవి యగుచున్నవి. భాషావిషయముననే కాక సర్వవిషయములందు నిట్టిసంఘర్షమే సంఘటిల్లినది. నేఁ డొకయద్భుతశక్తి యఖిలప్రపంచము నావహించినది. భారతదేశము నది బలముగా నలముకొన్నది. ప్రతిమానవునకు "నేను బరతంత్రుఁడనుగా నుండరాదు. స్వతంత్రుఁడను గావలెను" అను నాత్మాభిమానము పొడముచున్నది. ఒకని నిబంధమున కింకొకఁడు లోపడకున్నాఁడు. బ్రాహ్మణుని యాధిక్యమును బ్రతిఘటించుటకు మాలవాఁడును, మహారాజుప్రాభవమును బ్రతిఘటించుటకు దరిద్రుఁడును బ్రయత్నించుచున్నారు. ఈ సంఘర్ష మనివార్యముగా నున్నది. నివారించుట కూడఁ గూడనిపనిగాఁ దలఁపఁబడుచున్నది. దీర్ఘదర్శులు కొందఱు పెద్ద లిందుకై చండాలాదుల యస్పృశ్యతాదులను దొలఁగింపవలె ననియు, దరిద్రులు సంపన్ను లగుటకు వలయు సాధనముల సమకూర్పవలె ననియు సంస్కారములు సేయ సమకట్టు చున్నారు. భాషావిషయమునఁ గూడ నట్టిదే జరుగుచున్నది. కొందఱు పండితులు, కొన్నిభాషాప్రయోజనములనే యుద్దేశించి చేసిన ని బంధములు నిలువరింపరాని వనియు, భాషవలన నంత కంటె హెచ్చు ప్రయోజనము లిప్పుడు పడయవలసినయావశ్యకత యేర్పడుచున్న దనియు, సర్వమానవసంఘమును భాషాప్రయోజన సర్వస్వమును సమముగాఁ బడయవలసి యున్న దనియు, నందులకై వాడుకభాషను గ్రంథరచనము జరుగవలె ననియు వాదించుచున్నారు. అట్లు గ్రంథ రచనములు చేయుచున్నారు. నేనును నట్టి సంస్కారము నభిమానించిన వారిలో నొక్కఁడను. కాని దానిఁగూర్చి యిటీవల నా యభిప్రాయము మఱింత విపులముగా విరిసి దిక్కు దోఁచనిదిగా నున్నది.
ఇదివఱకు మేము కొందఱము సంకల్పించినసంస్కారములు సంకుచితభావములు గలవిగా నే నిప్పడు తలఁచుచున్నాను. ఏలనఁగా, “వచ్చుచున్నాను" అను శబ్దరూపమువలెనే "వస్తున్నాను" అనురూపము కూడఁ బ్రాజ్ఞవ్యవహారమందుఁగలదు గనుక ప్రయోగార్హ మని యంగీకరింపఁదగు నంటిమి. కాని ప్రస్తుతకాలపరిణామమునఁ జూడఁగాఁ బ్రాజ్ఞ సంఘ మిది యని వేఱుపఱుచుట కిఁక వీలు కలుగనట్టున్నది. సర్వమానవసంఘమందును విద్యావిజ్ఞానములు విపులముగా వెలయు చున్నవి. అహమిక నిండారుచున్నది. బ్రాహ్మణాదుల వ్యవహారమందుఁ గల ‘వస్తున్నాడు' ప్రయోగార్హమయినప్పుడు చండాలాదుల 'వస్తుండాడు' మొదలగు రూపములు ప్రయోగార్షము లేల కావు? బ్రాహ్మణుల యాధిక్యమును జండాలురు వెన్నాడకున్నప్పుడు వారి భాషా ప్రయోగరీతిని మాత్ర మేల వెంటాడుదురు? ‘మా సంఘవ్యవహారమున నున్నరూపమునే మేము మా గ్రంథములం దుపయోగించుకొందు' మందు రేని "వస్తునారు" మాత్రమే ప్రయోగార్హమని తలంచువా రేమి బదులు చెప్పఁగల్గుదురు. ఇట్టి రూపములే ప్రయోగార్షము లని విధించుటకు వీరి కేమి యధికార మున్నది? నాకు నేనయి యింతవఱకు మాత్రమే సంస్కార మంగీకరించ దగు నని నిబంధింపఁ బూనితి నేని యా నిబంధమునకు లోఁబడువా రెవ్వరు? ఇట్టి చిక్కుభాషావిషయముననే కాక, సర్వవిషయములందును గూడ సంఘటిల్లినది. సాంఘికరాజకీయవిషయములందు--- సంస్కారములు మహాత్ములకుఁగూడఁ గొఱుకఁబడనివిగా నున్నవి. ఈ చిక్కుయొక్క పరమావధి యే మనఁగా ఒక్కొక్క మనుష్యుఁడును "నా భాషను నేను వ్రాయుదును. ఇంకొకరి నిబంధము నాకు విధాయకము గాదు. 'అన్నంతవఱకుఁ బోవచ్చును. కాని యట్టి సంఘర్షమునఁ జిదికిపోయెడిచింతనము లేవో బ్రదుకగల్గెడిభావము లేవో వీని పరిణామ మెట్టి దగునో నా యల్పబుద్ధికి గోచరము గాకున్నది. నేఁడు భాషా సంస్కారము నపేక్షించి చర్చించువారిలోఁగూడ నైకకంఠ్యము లేదు. “చూచినాడు, చూచాడు, చూసినాడు, చూశినాడు, చూశాడు, చూసేడు" అని యిన్నిరూపములును వ్రాయువా రున్నారు. ఇందుఁ గొన్నియే పరిగ్రాహ్యము లని వ్యవస్థాపించి యాఁచి పట్టుట కధికారులు లేరు. సంస్కారమే పనికిరా దని యడ్డుపెట్టుట కంతకంటె నధికారులు లేరు. ఆ సంస్కార మనివార్యముగా జరుగుచునే యున్నది. అయ్యో! ఎంత భయంకర మైనచిక్కు ఇట్టి చి క్కొక్క భాషావిషయమందేకాక సర్వ విషయములయందు సంప్రాప్త మయినదిగదా! మానవమాత్రుఁడు ప్రాభవముచేఁగాని, ప్రజ్ఞచేఁగాని యిఁక మీఁదికాలమున లోకమున నేవిషయముగాని యనుశాసింపఁజాలఁడేమో యని నాసంశయము. భగవంతుఁ డొకఁ డుండెనేని లోకమును బరమానందోద్దేశమునకుఁ జేర్చుటే తదుద్దేశమేని, యాయన కల్యాణమార్గ మేదో లోకమునకుఁ గల్పింపఁగలఁడు. అది యేదో యందువఱకును మనప్రయత్నములు గ్రుడ్డియెద్దు చేనఁ బడినలాగున సాగుచుండవలసినవే కాఁబోలును! అట్టి శుభసమయము లోకమునకు లభించు టెప్పడో!