మహాపురుషుల జీవితములు/సేలము రామస్వామి మొదలియారి

వికీసోర్స్ నుండి

సేలము రామస్వామి మొదలియారి

రామస్వామి మొదలియారి 1852 వ సం||రము 6 వ సెప్టెంబరు తారీఖున సేలములో జన్మించెను. అతఁడు సేలములో మిక్కిలిగౌరవముగల కుటుంబములోఁ జేరినవాఁడు. ఈతని ముత్తాతయగు వెంకటాచలము మొదలియారి మన దేశమును పూర్వము పాలించిన యీస్టిండియా కంపనీవద్ద దుబాసిగా నుండెను. ఈయన తండ్రి గోపాలస్వామి మొదలియారి. గొప్ప యీనాందారై యుండుటచే గాక చాలకాలము తహసిలుదారుగనుండి 1867 వ సంవత్సరమందు ఫించను పుచ్చుకొనెను.

రామస్వామి మొదలియారి యాఱవయేఁటనే విద్యాభ్యాసము నిమిత్తము చెన్న పట్టణమున కంపబడెను. ఈతడు మొట్టమొదట చెన్న పట్టణపు హైస్కూలులోఁ జేరి చదువ నారంభించి యా పాఠశాలలోఁ గ్రిందితరగతులు తీసివేసినందున పచ్చయప్ప పాఠశాలలో జేరి చదివెను. అక్కడకొంతకాలము చదివి రామస్వామి ప్రెసిడెన్సీ కాలేజీలోఁ జేరి విద్య ముగియువరకు నక్కడనే చదివెను. ఆకాలమున నతఁడు మిక్కిలి చుఱుకుతనముఁ గలవాఁడై యుపాధ్యాయుల దయకుం బాత్రుఁడై బుద్ధికుశలతవల్ల ననేక బహుమానముల నందెను. ప్రవేశపరీక్షలోఁ గృతార్థులైన మొదటి పదునైదుగురిలో నొకడై యుండుటంజేసి యతనికి దొరతనమువారు విద్యార్థి వేతనము నిచ్చిరి. ప్రథమశాస్త్రపరీక్షయం దతఁడా సంవత్సరము మొదటి వాఁడుగఁ గృతార్థుఁడయ్యెను. అనంతరము పట్టపరీక్షయందుఁ గూడ నతఁడు మొదటితరగతిలో మొదటివాడుగఁ దేఱెను. రామస్వామి యొక్క పూనికకు బుద్ధికుశలతకు సత్ప్రవర్తనమునకుఁ బ్రధానోపాధ్యాయుఁడగు థామ్సనుదొర మిక్కిలి సంతసించి పట్టపరీక్ష


యందుఁ గృతార్థుఁడైన వెంటనే యాతనికిఁ దన కళాశాలలో నింగ్లీషు పండితోద్యోగ మిచ్చెను. కాని తనకంటె తక్కువగా అనగా రెండవ వాడుగ బట్టబరీక్షయందు గృతార్థుడైన యొక మిత్త్రుడు చాలపేదతన మనుభవించుచు నుద్యోగమునకు బ్రయత్నించుట యెఱింగి రామస్వామి దయాళువగుటచే దనకాయుద్యోగ మక్కఱ లేదని చెప్పి యామిత్త్రున కిప్పించెను.

ఇట్లు 1871 వ సం||న నతడు పట్టపరీక్షయందు గృతార్థుడై విద్యాసక్తి యప్పటికిని బోనందున నాకళాశాలలోనే యుండి యం. యె. (అనగా సర్వకళాధికారి) పరీక్షకు జదివి యందు 1873 వ సంవత్సరమున గృతార్థుడయ్యెను. అనంతరము బి. యల్. పరీక్షకుం జదివి 1875 వ సంవత్సరమున దానియందును మొదటివాడుగా దేఱెను. 1876 వ సం||ము హైకోర్టు వకీలుగా జేయబడి రామస్వామి మొదలియారి స్వగ్రామమగు సేలములోనే న్యాయవాదిగ నుండ దలిచి యక్కడ పనిచేయ నారంభించెను. నిగర్వియై పని జేయుటలో మిక్కిలి పూనిక గలిగియుండినందున రామస్వామి జిల్లాజడ్జి కిష్టుడగుటయేగాక సేలములోనున్న స్వదేశస్థుల కందఱకు మిక్కిలి యిష్టుడయ్యెను. అతడక్కడ కొన్ని మాసములు మాత్రమే పనిజేసి దొరతనమువారి కొలువులో జేర నిచ్చగలవాడై డిస్ట్రిక్టు మునసబు పనికి బ్రయత్నముజేయ నిశ్చయించుకొని జిల్లాజడ్జీద్వారా దరఖాస్తు పంపగా నాదరఖాస్తుమీద జడ్జి యాతని నిరుపమాన బుద్ధికుశలతనే గాక సత్ప్రవర్తనముం గూడ శ్లాఘించి యన్నివిధములచేత నతడా యుద్యోగమునకు దగినవాడని వ్రాసెను. అనంతరమతఁడు 1876 వ సం||ననే తిరుచునాపల్లిలో డిస్ట్రిక్టు మునసబుగా జేయబడెను. ఈయన నిష్పక్షపాతబుద్ధికి సత్యసంథతకు బేరుపడెను. వ్యవహారములలో స్వతంత్రముగాను మనసునకు దోచిన విధముగాను పక్షపాత


రహితముగాను వర్తింపవలయుననియే యాతని సంకల్పముకాని యితరుల సిఫారసులుచేసి తనవ్యవహారములలోను జోక్యము గలుగ జేసికొనుట యాతని కెంతమాత్రము నిష్టములేదు. ఈయన నిష్పక్షపాతబుద్ధిందెలుపుట కొకచిన్న కథ గలదు. ఒకనాడీయన కోర్టులో నొక వ్యవహారమునం దగులుకొనియున్న యొక మనుష్యుడు రామస్వామి మొదలియారి కెవనియెడమిక్కిలి గౌరవముగలదో యట్టిగొప్ప గృహస్థునివద్దనుండి యొక సిఫారసు జాబుదెచ్చి వ్యాజ్యము తన బక్షము జేయుమని కోరెను. మొదలియారి యామనుష్యుని సగౌరవముగ నాదరించి తనయింటనే బసయిచ్చి తనబండిమీదనే గూర్చుండబెట్టికొని కోర్టునకు దీసికొని పోయెను. ఆగౌరవము నా యాదరణముంజూచి జాబుదెచ్చిన మనుష్యుడు వ్యవహారము తనపక్షముగానే తీర్పు చేయబడునని యది యెప్పుడు విందునాయని యూటలూరు చుండెను. అంతలో మునసబు బెంచి యెక్కి యామనుష్యున కాశాభంగము గలుగునట్లు వ్యతిరేకముగా దీర్పుజెప్పెను. అదివిని యా మనుష్యుడు సిగ్గుపడి రామస్వామి మొదలియారి మొగమైనంజూడక పారిపోయెను. ఇట్లుచేయుటయేగాక మొదలియారి యొకటి రెండు సారులు బెంచి మీదనుండి వ్యవహారములం జిక్కువడినవారు పెద్ద మనుష్యులవద్దనుండి సిఫారసులందెచ్చి న్యాయాధిపతుల మనస్సుల ధర్మమార్గములనుండి త్రిప్ప ప్రయత్నించుట ఘోరమనియు దూష్య మనియు నొక్కి పలికెను. ఈవిధముగా నతడు మంచిగంథములో నొకయడుగు, నగ్నిహోత్రములో నొక యడుగు బెట్టెనను సామెత నిజముగా నెడమప్రక్క కొరుగక కుడిప్రక్కకొరుగక న్యాయమార్గమున ముక్కుకు సూటిగ బోయెను.

ఒకసారి తనకచ్చేరీలో సర్కారుసొమ్ముకొంతపోగా గుమాస్తాలలో నెవరికే ఇబ్బందిరాకుండ దనచేతిసొమ్మిచ్చి యాసొమ్ముబూర్తి


చేసెను. అటు లాఱుసంవత్సరములు మునసబుగా నుండి దొరతనము వారి కొలువులో దన తెలివితేటలు విశేషముగా బ్రకాశించుట కవకాశము లేదని గ్రహించి యాకొలువు మానుకొనెను. అతని కాశాభంగము కలిగినను దొరతనమువారి కొలువుసేయుటవలన నతని సామర్థ్యము న్యాయదృష్టి మొదలగునవి పై యధికారులకు లోకులకు తెలియుటవలన గీర్తిలాభముకలిగెను. అతడుద్యోగము రెండుసారులు మానుకొనదలచినను దమకట్టి యుద్యోగస్థుడు దొరకడని పై యధికారు లాతని విడువరైరి. ఎట్ట కేల కతఁడు దృఢనిశ్చయుఁడై మూడవసారి యుద్యోగమును విడిచి 1882 వ సంవత్సరమునఁ జెన్నపట్టణమున హైకోర్టులో వకీలుగాఁ బనిచేయుటకు బోయెను. ఆయన హైకోర్టులో సాధారణముగ నప్పీళ్ళు పుచ్చుకొని వాదము చేయు చుండెను. ఆయనకుఁ దెలిసినట్లు ధర్మశాస్త్రము (లా) మరియొకరికిఁ తెలియదని యా కాలమున ననేకు లభిప్రాయ పడిరి. ఆయన తన పొట్టపోసికొనుటకు మాత్రమే ధర్మశాస్త్రముల నభ్యసింపక యాశాస్త్రమర్మములను సమూలముగాను సమగ్రముగాను దెలిసికొన నభిలాషగలవాఁడై చదివి లా పత్రిక నొకదానిని స్థాపించి దానికి తానే ప్రధాన ప్రవర్తకుడుగా నుండి 1891 వ సంవత్సరము వఱకునడపెను. చెన్నపట్టణము యూనివరిసిటీవారు రామస్వామి మొదలియారి యొక్క ధర్మశాస్త్ర పాండిత్యమును ద్రవిడభాషా పాండిత్యమును దెలిసికొని యాయనను బి. యల్. పరీక్షకు, యం. యల్. పరీక్షకు ద్రవిడభాషలో బి. యే. పరీక్షకుఁ బరీక్షకుఁడుగా నియమించిరి.

1887 వ సంవత్సరమున యూనివరిసిటిలో నతఁడు ఫెల్లోగా నియమింపఁబడెను. న్యాయవాదిగ నుండి ధనమార్జించుటతోఁ దనివి నొందక మొదలియారి దక్షిణహిందూస్థాన రాజకీయ వ్యవహారములలో బ్రవేశించి దేశాభివృద్ధికి జాల కృషిజేసెను. ఈవ్యవహారము


లలోఁ నతఁడెంత ధైర్యశాలియో యీక్రింది పనివల్లఁ దెలిసికొన వచ్చును. 1883 వ సంవత్సరమునఁ జెన్నపురి గవర్నరుగారి యాలోచన సభలోని సభికుఁడొకఁడు ఫించనుపుచ్చుకొని యింగ్లాండునకుఁ బోవ నుద్యుక్తుడై యుండ చెన్నపురవాసు లాయనను గౌరవించి యుత్సవములఁ జేయ దలంచిరి. అట్టి యుత్సవములఁ జేయుటకూడదని రామస్వామి మొదలియారి నిరాఘాటముగాఁ బలికెను.

చెన్న పట్టణములో స్థాపింపఁబడిన మహాజనసభ, తెల్లవారు నల్లవారని మునుపటియ ట్లనాదరముసేయక గౌరవముతోఁ జూచునట్లు చేయుటకు దక్షిణ హిందూస్థానమున స్వదేశస్థుల మొరలు ధైర్యముతో దొరతనమువారికి విన్న వించుటకు ముఖ్యాధారమయ్యెను. ఆమహాజనసభలో రామస్వామి మొదలియారి ప్రధాన పురుషుఁ డన్నమాట యెల్ల వారికి విదితమే.

హిందూదేశ పరిపాలనమునుగూర్చి నిజమయిన స్థితిగతుల నెఱుఁక యింగ్లాండులోనుండు నాంగ్లేయులకు, యధార్థస్థితినిఁ దెలియజేయుటకు మన దేశస్థులలో గొందఱింగ్లాండునకుఁ బోవుట యుచిత మని మనదేశాభిమాను లనేకులు తలంచి చెన్నపట్టణమునుండి రామస్వామి మొదలియారిగారిని మనరాజధానికిఁ బ్రతినిధిగాఁ బంప నిశ్చయించుకొనిరి. ఈపనినిమిత్తమే బంగాళమునుండి బాబుసురేంద్రనాథ బెనర్జీగారును బొంబాయినుండి మఱియొకరును బంపఁబడిరి. రామస్వామియు సహప్రతినిథులుఁ గలసి యింగ్లాండులోఁ జాల సభలుచేసి హిందూదేశ వ్యవహారములను వారికి సుబోధకములుగ జెప్పిరి. ఇతఁ డక్కడనున్న దినములలో నాదేశస్థులలోఁ గొందఱీతని సహాయమున హిందూదేశ రాజకార్యములను గూర్చి చర్చలు సలుపుట కొక సభ స్థాపించిరి. ఈతఁడును దక్కిన ప్రతినిధులుఁ జేసిన యుపన్యాసములనుబట్టి యా కాలమున హిందూదేశ పాలనమును


గూర్చి యెక్కువపని జేయవలయునని యాంగ్లేయులకుఁ దోఁచెను. తక్కినవారి యుపన్యాసము లటుండఁగా రామస్వామి మొదలియారి యుపన్యాసములు విశేషప్రీతి నింగ్లాండుజనుల కొసగెను. యేలయన నాయనమొగము కాటుక కన్నులు గలిగి మంచి తేజస్సు గలిగి యెంతో సుందరమై చూచినంత మాత్రముననే యెల్లవారలకు నాతనిమీఁద నాదరము గలుగఁ జేయునట్లుండెను. అతని సంభాషణ మాకారమునకు దగినట్లే గంభీరమై యుండెను. ఇంగ్లాండులోఁ గొంతకాల ముండుటచేత రామస్వామి మొదలియారి యాంగ్లేయ భాషాప్రవీణతయు వాగ్ధోరణియు మిక్కిలి యధికము లయ్యెను. హిందువులయెడల నమ్మికయుంచి యాదరముతో రాజ్యపరిపాలనము జేయుడని యాతఁడు కృపారస ముట్టిపడునట్లుజేసిన యుపన్యాసములు వారి హృదయములమీఁద ముద్రితము లైనట్లుండెను.

రామస్వామి మొదలియారి సముద్రయానముం జేసి విదేశముల గొంతకాలము గడపినను హిందూధర్మములకు విరుద్ధములుగ నెన్నడు నాచరింపక మనదేశపు సేవకునొక్కని వెంటబెట్టుకొనిపోయి వానిచేతి యన్నమే తిని కాలక్షేపము జేసెను. ఇంగ్లాండు దేశస్థులనేకు లతనిని విందునకు పిలువగా నతఁడట్టి విందులకు దఱుచుగాబోవక పోకతప్పనప్పుడు పోయి వారిచేత మాంసాదులు భక్షింపక కాయగూరలు పండ్లు మొదలగువానిని భక్షించుచువచ్చెను. అతని కులస్థులు గూడ నాతని నియమము లిట్టివని యెఱింగి సణుగుకొనక గొణుగుకొనక యనుచితములై యర్థము లేని ప్రాయశ్చిత్తముల విధీంపక రాగాఁనే యతనిం గులములోఁ జేర్చుకొనిరి. రామస్వామి మొదలియారి తిరిగి స్వదేశమునకు వచ్చినప్పుడు చెన్నపురవాసు లాయనయెడ జూపిన సన్మాన మిట్టిదియని వర్ణింపరాదు. సేలములో జరిగిన సన్మానము జెన్నపురిలో జరిగినదానికంటె విశేషముగా నుండెను. ఇంగ్లాండు


నుండి స్వదేశమునకు వచ్చినతోఁడనే యాతనిపై మఱియొక కార్య భారము బడెను.

1886 వ సంవత్సరమున గవర్న మెంటువారు పబ్లికు సర్విసు కమీషన్ అనేపేర నొకసభ నేర్పరచిరి. ఆసభలోఁ గొందరు తెల్లవారు మేటికెక్కిన స్వదేశస్థులు కొందఱు సభ్యులుగా నియమింపఁబడిరి. సర్ రొమిశ్చంద్రమిత్తరు బంగాళమునుండియు సార్కారను నతఁడు బొంబాయినుండియుఁ జెన్నపురమునుండి రామస్వామి మొదలియారియు మరియొకచోటనుండి భీంగారాజు సభికులుగానియుక్తులైరి. ఈసభ చేయవలసిన పనియేమనగాఁ దొరతనమువారి కొలువులో నదివఱకు స్వదేశీయు లెందఱున్నారో విశేషముగా వారిని గొలువులోఁ జేర్చుకొనవలయునా లేదా యెట్లుచేర్చుకొనవలయు ననువిషయములుగూర్చి విచారణచేసి దొరతనమువారికి రిపోర్టు పంపుట. రామస్వామి మొదలియారి యప్పటికి ముప్పదియా రేండ్ల వయసుగల వాడైనను మిక్కిలి లోకానుభవము గల పెద్దలతో సమానముగ గార్యనిర్వాహము జేసెను. ఎంతో గొప్పబుద్ధిశాలియైనంగాని దొరతనమువారంత చిన్నవానినంత గొప్ప కమీషనులోఁ గూర్చుండ బెట్టరు. పెట్టినందు కతడు తీసిపోక తగినట్లు బనిచేసెను.

ఈయన దేశీయ మహాసభమీదకూడ చాల నభిమానము కలిగి పనిజేసెను. ఒక సంవత్సరమీయనను దేశీయమహాసభ కధ్యక్షుడుగా నుండవలయునని తత్సభానిర్వాహకులు కోరగా నీతడా గౌరవముకుం దగినవారు తనకంటె పెద్దలున్నారని నిరాకరించెను. అంత దేశాభిమానము నంతవిద్య నంతయోగ్యత యంతధైర్యము గల యీసత్పురుషుని నలువదియేండ్లు నిండినతోడనే మృత్యు దేవత 1892 వ సంవత్సరమున దనబొట్ట బెట్టుకొనియె. ఇందుచేత దక్షిణ హిందూదేశము దురదృష్టవంతమని చెప్పనొప్పు.