Jump to content

మహాపురుషుల జీవితములు/సెట్టిపాణియం వీరవలి రంగాచార్యులు

వికీసోర్స్ నుండి

సెట్టిపాణియం వీరవలి రంగాచార్యులు

ఈరంగాచార్యులు 1831 వ సంవత్సరమున చెంగల్పట్టుజిల్లాలో నొకగ్రామమున జన్మించెను. ఈయనతండ్రి రాఘవాచార్యులు. చెఁగల్పట్టుకలెక్టరు కచ్చేరీలో నొక గుమాస్తాగా నుండెను. రంగాచార్యులు పసిబిడ్డయైనపుడు గొప్పగండ మొకటితప్పెను. తల్లితోఁగలసి పయనము చేయుచుండ దారిలో బండి బోల్తపడెను. బండి పడిపోవుటకు సిద్ధముగా నున్నపుడు రంగాచార్యునియన్న వేగముతోఁ దల్లి యొడి నున్న తమ్ముని నీవలకు లాగి యాతని ప్రాణములు కాపాడెను. కానిచో రంగాచార్యు లేమయియుండునో ! ఆతని తండ్రికి సర్కారు జీతముతప్ప మఱియేయాస్తియు లేదు. కుమారున కింగ్లీషు విద్య జెప్పింపవలయునని రాఘవాచార్యులు తలంచెనుగాని సంసార స్థితి చక్కగా నుండకపోవుటచేఁ జదువు మాన్పింపఁ జూచెను. అంతలో రాఘవాచార్యుని సోదరులలో నొకఁడు రమారమి యెనిమిది వందల రూపాయలు బాలుని చదువునిమిత్తమిచ్చి మృతినొందెను. ఏ యాధారములేని రాఘవాచార్యున కిది కొంతసహకారిగా నుండెను. కాని కొమరునిఁ జెన్నపురికిఁ బంపి విద్యాభ్యాసము సంపూర్ణముగఁ జేయించుటకిది చాలదయ్యెను. ఏమి చేయనగునని రాఘవాచార్యు లాలోచించుచుండ వానిబంధువుఁడు, చెన్నపట్టణమున మేజస్ట్రేటుగా నియమింపబడిన మొదటి హిందువుఁడునగు, వి. రాఘవాచారుల లనునతఁడు బాలుని విద్యాభ్యాసమునఁ గొంతసహాయముఁ జేయునట్లు వాగ్దానము చేసెను. అంతట రంగాచార్యులు చెన్న పట్టణమునఁ జదువ నారంభించెను.

విద్యార్థిగానున్న కాలమున రంగాచార్యులు వయసునకుఁదగని తెలివిగలవాఁడని పేరుపడెను. పెద్దవాండ్రు చదరంగ మాడుచుండ


నీబాలుఁడు నిశ్శబ్దముగ వారిసమీపమునఁ గూర్చుండి మెలఁకువతో నయ్యాటలోని చమత్కృతులన్నియు గ్రహించి యల్పకాలములోనే దానియందు మిక్కిలి ప్రౌఢుఁడయ్యెను. ఆతని ప్రౌఢిమ మెఱిఁగి చదరంగమాడు పెద్దలు మంచియెత్తులు తమకుఁ దోచనప్పుడు, తమ యాట చిక్కులలోఁ బడినప్పుడు పలుమాఱు బాలుఁడగు రంగాచార్యుని సాయ మపేక్షించుచు వచ్చిరి. అడగుటయే తడవుగ నీ కుశాగ్రబుద్ధి యసమానములగు నెత్తులుచెప్పి వారి యాటచిక్కుల విప్పుచువచ్చెను. రంగాచార్యునకువిద్యమీఁదకంటె నాటపాటలయం దెక్కువ తమక ముండెను. అట్లున్నను స్వల్పపరిశ్రమముమాత్రము చేసి చదువులో తోడిబాలుర మించుచువచ్చెను. ఆతఁడు మొట్ట మొదట పచ్చెయ్యప్పపాఠశాలలోఁ బ్రియజ్ఞాన మొదలియారి యను నాతనివద్ద చదివెను. పెద్దవాఁడైన తరువాత సైతమీయాచార్యులు తన చిన్న నాఁటియుపాధ్యాయునియెడ గౌరవము, ప్రేమయుఁ గలిగి చిన్న బిడ్డలకు మొదటితరగతులలో నుపాధ్యాయులుగా నుండగోరు వారాయనవలె నుండవలెనని చెప్పుచువచ్చెను. ప్రియజ్ఞాన మొదలియారి వయోవృద్ధుడయి యుద్యోగము మానుకొని యింట నిబ్బందులు పడవలసివచ్చినప్పుడు ప్రాఁత శిష్యుఁడైన రంగాచార్యులు గురుభక్తిఁ గలిగి ద్రవ్యసహాయము చేయుచువచ్చెను. పచ్చెయ్యప్ప పాఠశాలలోఁ జదువు ముగిసిన పిదప రంగాచార్యులు చెన్న పట్టణపు హైస్కూలులోఁ బ్రవేశించెను. దాని ప్రధానోపాధ్యాయుఁ డగు పవెలుదొర బాలుని మేథాశక్తికి సంతసించి నెలకుఁ బదునాలుగు రూపాయల విద్యార్థివేతనముగ వాని కీయఁదొడఁగెను. పవెలుదొర వద్ద బుద్ధిసంపూర్ణముగ వికసింప నతఁడుప్రజ్ఞలోఁ దక్కినవిద్యార్థుల నంతఱ మించుటఁజేసి వారు వానితో సమానముగ నుండఁగోరక వాని తరువాత వారుగానైన నుండినం జాలునని కోరవలసినవా


రయిరి. ఆహైస్కూలులో నతఁడు 1840 వ సంవత్సర ప్రారంభము వఱకు విద్యాభ్యాసముచేసి యప్పుడు ప్రోఫీషెంటె పరీక్షలో మొదటి తరగతిలోఁ గృతార్థుఁడయి గౌరవాస్పదుఁ డయ్యెను. తరువాత రంగాచార్యులు దొరతనమువారి కొలువులోఁ బ్రవేశించుటకు మఱియొక పరీక్షకుఁ జదువుచుండుట విని పవెల్‌దొర వానియెడ మంచి యభిప్రాయముఁ గలవాఁడు కావున వాని కీక్రింది విధమున వ్రాసెను. "నీవు పరీక్షారంగమునఁ బ్రవేశించుచున్నాఁడవనియు మాపాఠశాల పరువు నిలువఁబెట్టఁ బ్రయత్నింతువనియు విని చాల సంతసించితిని. నీయందు సామర్థ్యము, దానికిందోఁడు చాకచక్యము, వివేకముఁ గలవు. కావున నీవు తప్పక జయము నొందెదవు".

విద్యార్థి దశలో నతనికిఁ గలిగిన యద్వితీయ విజయమువలన వానికీర్తి చుట్టుప్రక్కల వ్యాపించుటచే నతఁడు విద్యముగింపఁగానే చెన్న పురమం దప్పుడు కలెక్టరుగానున్న యెల్లిసుదొర వానికిఁ దన కచ్చేరిలోఁ నొకనికి బదులుగా కొన్నాళ్ళు గుమస్తాపని యిచ్చెను. అనంతర మతఁడు చెంగల్పట్టుజిల్లా కలెక్టరు కచ్చేరిలో ఖాయపు గుమాస్తాగా నియమింపఁ బడెను. అక్కడ కొన్నాళ్ళుండినతరువాత నతఁడు సేలంజిల్లా కలెక్టరుగారి కచ్చేరిలో హెడ్‌క్లర్కుగా హెచ్చుజీతముమీఁద బంపఁబడెను. ఈకాలమునఁ నతఁడు రెండు చిన్న పుస్తకములను వ్రాసెను. అందొకటి రివిన్యూ డిపార్టుమెంటులోని యుద్యోగస్తులు లంచములను పుచ్చుకొనుటఁగూర్చి. రెండవది యాకాలములోఁ నందఱుఁ దీవ్రముగాఁ జెప్పుకొనుచున్న సేలము తంజావూరు జిల్లాలోని మిరాసీహక్కులను గురించి పిమ్మట నతఁడు సైదాపేట తహసీలుదారుగా వెళ్ళి యాపనిలో రెండేండ్లుండెను. అక్కడ నుండి నెల్లూరు జిల్లా సిరస్తాదారుగాఁ బోయెను. 1859 వ సంవత్సరమున గవర్నమెంటువారు చెన్నపురిరాజధానిలో నేర్పరచిన యీనాము


కమీషనుయొక్క ప్రెసిడెంటగు టెయిలరు దొరవారివద్ద స్పెషల్ అసిస్టెంటుగా నియమింపఁబడెను. రంగాచార్యులు తన వివేక సామర్థ్యములవల్ల టెయిలరు దొరకు విశ్వాసపాత్రుఁడై యేడుసంవత్సరములా డిపార్టుమెంటులోఁ బనిచేసెను. ఈనాముల పరిష్కారము ముగిసిన పిదప దొరతనమువారు మన దేశములోనున్న యినుపదారుల (Railways) పద్ధతి యెట్లు జరుగుచున్నదో తెలియజేయవలయునని టెయిలరు దొరవారిని నియోగించిరి. ఈ పనికి బాగుగ లెక్కలు తెలిసినవారు కావలసివచ్చినందున టెయిలరుదొర రంగాచార్యునిఁ దనకు సహకారిగాఁ దీసికొనెను. రంగాచార్యులు ప్రధాన మంత్రులతోను, ముఖ్యబంధువులతోను గలసి యాలోచింపకుండ నీ యుద్యోగములోఁ బ్రవేశించుట కొడంబడెను. గృహమునకుఁబోయి యావార్త చుట్టముల కెఱిగింప వారు టెయిలరుదొరతో నతఁడు చేసిన వాగ్దానమునుండి వానిని మరల్పఁ బ్రయత్నించిరి. ఏలయన నతఁడు కలకత్తాకు సముద్రముమీఁద నోడప్రయాణము జేయవలసి వచ్చెను. ఆనాఁటి పూర్వాచార ప్రియులగు బ్రాహ్మణులు రంగాచార్యులవంటి యగ్రకులజుఁడు సముద్రముమీఁద నావికా యాత్ర చేసినపక్షమున బ్రాహ్మణ్యము చెడిపోవుననియు నటుమీఁదనందఱు నదే మొదలుపెట్టి వర్ణాశ్రమధర్మములు పాడుచేయుదురనియు గోలపెట్టిరి. కాని రంగాచార్యులు నాగరికతా విషయమునఁ దనసాఁటి వారి తలదాటినవాఁడగుటచే వారుపెట్టిన గోలు సరకుసేయక వెలికి జంకక టెయిలరుదొరతోఁ గలసి యోడమీఁద కలకత్తాకును, బనియున్న యితర స్థలములకునుఁ బోయెను. పోయి చాల యోపికతో నీతితో దనపని నిర్వర్తించుకొని తన పై యధికారి నమ్మికకు మునుపటికంటెను మిక్కిలిగా పాత్రుడయ్యెను. తనకు నధికారులకు సంతుష్టి కలుగునట్లు కార్యనిర్వాహముచేసి రంగాచార్యులు స్వదేశము


నకు మరలెను. టెయిలరుదొరకు రంగాచార్యునిమీద నెంతగౌరవమున్నదో వాని స్వహస్తలిఖితమైన యీ జాబువలన దెలియును. "అతడు (రంగాచార్యులు) పాఠశాలను విడిచి, 1849 వ సంవత్సరములో దొరతనమువారి కొలువులో బ్రవేశించినది మొదలుకొని మేమిరువుర మెడతెగని సంబంధము గలిగియుంటిమి. మా కొండొరుల యెడగల గౌరవము రవ్వంతయు డిందుపడలేదు. ప్రప్రథమమున నేనతనికి బని నేర్పుటలోను, బిమ్మట గొప్పయుద్యోగము లిప్పించి వృద్ధికి దెచ్చుటలోను కొంతసహాయము చేసినను రంగాచార్యుడు నా యెడల జూపిన భక్తివిశ్వాసముల చేత నాఋణమంతయు దీర్చెను. మాయిరువురకు నుద్యోగ సంబంధ మున్న కాలమంతయు రంగాచార్యులు స్వదేశస్థుల ప్రవర్తనలగూర్చి యతనికిగల జ్ఞానము, వాని యుత్కృష్టవివేకము, యద్భుతమైన యతనికార్య నిర్వాహక సామర్థ్యము విసుగుకొనక యతినిపుణముగా నానిమిత్తమె వినియోగించెను. నేయేల, మాకిరువురికి సంబంధముగల సమస్త వ్యవహారములలోను నేను కృతకృత్యుడ నగుట యెల్ల రంగాచార్యుని సహాయ సంపత్తిచేతనే యని దృఢముగా జెప్పగలను" అనంతరము కొంత కాలమునకు టెయిలరుదొర చెన్నపురిరాజధాని పక్షమున గవర్నరు జెనరలుగారి శాసన నిర్మాణసభలో సభికుడై, చట్టములు నిర్మించినపుడు రంగాచార్యుని యాలోచన మడుగుచు నీతడిచ్చిన సలహాలను విస్పష్టముగ గవర్నరు జెనరలుగారి సభలో జెప్పుచువచ్చెను. కలకత్తానుండి చెన్న పట్టణము తిరిగివచ్చిన తరువాత రంగాచార్యులు మదరాసు రెయిల్వే కంపెనీకి కమీషనరయ్యెను. దొరతనమువారు కాకితపునాణెములు (అనగా కర్రెన్సీనోట్లు) క్రొత్తగా వ్యవహారములోనికి దెచ్చి, 1864 వ సంవత్సరమున రంగాచార్యుని పశ్చిమదేశముననున్న కల్లికోట జిల్లాలో ట్రెజరీ డిప్యూటీ కలెక్టరుగా వేసిరి.


అ కాలమున నచ్చటి జిల్లాకలక్ట రగు బాలర్డుదొరకు రంగాచార్యుని యెడ జాల నమ్మిక కలిగెను. ఆదొరయే యవ్వల కొంతకాలమునకు తిరువాన్కూరు, కొచ్చెన్ సంస్థానములలో దొరతనమువారి పక్షమున రెసిడెంటయ్యెను.

ఈనడుమ మైసూరు సంస్థానస్థితి చాల శోచనీయముగా నుండెను. దొరతనమువారు వెనుకటి మహారాజగు కృష్ణరాజయొడయరును గద్దెమీదినుండి దింపి వాని దత్తపుత్రుడు యుక్తవయస్కుఁ డయిన పిదప రాజ్యము స్వీకరింప వచ్చునని శాసించిరి. స్వదేశ సంస్థానములతో నేకాడికైన సంధినేజేసికొని, వాటిజోలికి బోక నెమ్మదిగా దేశమును బాలింపవలయునను తలంపుగల లార్డు విలియంబెంటింకువంటి మంచిగవర్నరుజనరలు కూడ తన నియమమునకు విరుద్ధముగా జోక్యము కలిపించుగోవలసినంత దుర్దశకు మైసూరు సంస్థానము మరల నెన్నడు రాకుండజేయదలచి యేబదిలక్షల జనులకు రాజుకాదలచియున్న చిన్న మహారాజునకు నిరంతరము ప్రజాను రంజనముగా, ప్రజాక్షేమకరముగ పరిపాలనము జేయించునట్టి విద్యనుం జెప్పింప నిగ్లాండులోని దొరతనమువారు నిశ్చయించుకొనిరి. హిందూదేశ కార్యదర్శిగా రింగ్లాండునుండి పంపిన యీ యుత్తరువు అమలులోనికిఁ దెచ్చుటకు మైసూరులోఁ గొన్నిమార్పులు జరుగ వలసి వచ్చెను. అప్పుడు మైసూరులో నింగ్లీషు దొరతనమువారి పక్షమున నధికారము చేయుచున్న బౌరింగుదొర మహారాజుగారి యంతఃపురపు లెక్కలు పరీక్షించుటకు నమ్మికయుంచఁదగిన చెన్న పట్టణ మనుష్యునొకని సిఫారసు చేయుమని యెల్లిసు దొరకు వ్రాసెను. ఎల్లిసు రంగాచార్యుని బంపెను. 1868 వ సంవత్సరమున రంగాచార్యుఁడు మైసూరు కొలువులోఁ జేరెను. ఈ పనిలో జేరిన యచిరకాలముననే వానికి మఱియొక పనిగూడ యధికారు లప్పగిం


చిరి. ఆరెండవపని యిది. మైసూరు మహారాజుగారి యంతఃపురమున నున్న చరాస్థి కంతకు జాబితా తయారుచేసి, ప్రతివస్తువు యొక్క విలువ దాని కెదురుగావ్రాసి యట్టిజాబితా సంపూర్ణమైన పిదప మహారాజుగారి రత్న సువర్ణాభరణములు మొదల్గు గొప్ప సరకులు నిరపాయముగ నుండున ట్లేర్పాటు చేయుట, ఈ రెండు కార్యము లతఁడు మెలఁకువతో నిర్వహించెను.

అనంతర మాచార్యుఁడు మహారాజుగారి కోటలో జరుగుచున్న దురభ్యాసముల నివారింపఁ దొడగెను. కోట నాశ్రయించి పనిపాటలు లేక మహారాజుగారి డబ్బుతిని క్రొవ్వి స్తోత్రపాఠములు చేసి కాలక్షేపముచేయు సోమరిపోతుల ననేకుల రంగాచార్యుఁడు తీసివేసెను. ఆకాలమున జిన్న మహారాజునకు మాలిసన్ దొర చదువు జెప్పుచుండెను. అతఁడు రంగాచార్యుని యార్జనము, మనస్థైర్యముఁ జూచి సంతసించి వానియం దిష్టముకలవాఁ డయ్యెడు.

1874 వ సంవత్సరమున రంగాచార్యుఁడు "మైసూరులో నాంగ్లేయ పరిపాలన" మనుశీర్షికతో నొక చిన్న పుస్తకమునువ్రాసి దానిని లండను పట్టణములో నచ్చు వేయించి యచిర కాలములోనే యట్టిగ్రంధము మఱొకటివ్రాసి సంస్థానములో జేయవలసిన మార్పుల నందుదహరించునట్లు వాగ్దానము చేసెను. కాని రెండవ గ్రంథ మెన్నఁడు వెలువడ లేదు. ఏలయన యాగ్రంథము వ్రాయకమునుపే యాచార్యుఁడు మైసూరు సంస్థానమున గొప్పపదవినొంది యేమార్పు లావశ్యకములని తాను రెండవ గ్రంథమునందు వ్రాయఁదలెంచనో స్వయముగాఁ జేయుటకు నితరుల చేతఁ జేయించుటకుఁ దగిన యధికారమును వహించెను. మొదటి గ్రంథము వెలువడిన తోడనే రంగాచార్యుఁ డసాధారణబుద్ధిశాలి, శక్తిమంతుడనని మొదటికమీ


షనరుగా నుండిన గార్డనుదొర రంగాచార్యునిఁ దనకు రివిన్యూ సెక్రటరీగాఁ దీసికొనెను. అది మొదలు వారిరువురు గలసి సంస్థానము నందు జాల మార్పులంజేసి యనేక నూతనపద్ధతులం జొనిపి సంస్థాన వ్యయములు తగ్గించిరి. అదివఱకు కమీషనర్లుగా నున్న ముగ్గురు తెల్లవారినిఁ దొలఁగించి వారిబదు లిద్దఱు స్వదేశస్థుల నియమించిరి. అంతకుమున్ను వేయిరూపాయలు మొదలు పదునాఱువందలవఱకుఁ గల డిప్యూటీకమీషనరు పదవి నిప్పు డేడువందలు మొదలు వేయి రూపాయల వఱకుఁగల యుద్యోగముగఁజేసిరి. ఇరువదియే డసిస్టాంటుకమీషనరు పనులలో నెనిమిది దనావశ్యకమని తగ్గించి యామిగిలిన పందొమ్మిదిపదవులనైన మునుపటివలెఁ దెల్లవారికీయక సమర్థులయిన స్వదేశస్థులకుఁ దక్కువజీతములమీదఁ నిచ్చిరి. ప్రాఁతజీతములమీద నలుగురు డిప్యూటీకమీషనరుల మాత్రమునిలిపి తక్కినయందఱిని దక్కువ జీతములమీద నల్లవారినే వేసిరి. అడవి, చదువులు, రివిన్యూమొదలగు నెల్లడిపార్టుమెంటులలోనుఁ దెలివి తేటలలోఁ సామర్థ్యములోఁ దెల్లవారికి రవ్వంతయుఁ దీసిపోని స్వదేశస్థులు తక్కువ జీతములమీఁద దొరకుచుండగా నెక్కువజీతముల మీఁద దెల్లవారి నేల నియోగింపవలయునను నియమముమీఁద దక్కువజీతముల మీఁద నెక్కువ సామర్థ్యముగల స్వదేశస్థులనే నియోగించుచు వచ్చెను. ఈ మార్పులచేత నీ మితవ్యయముచేత నా సంవత్సరము రెండులక్షల యేఁబదివేల రూపాయలు మొత్తము ఖర్చులో తగ్గెను.

ఈ మహాకార్యములకు వానిని మెచ్చి 1880 వ సం||న దొరతనమువారు వానికి సి. ఐ. ఇ. బిరుదము నొసంగిరి. మైసూరునకు విదేశీయుఁడయి యుండియు నాసంస్థానమున మహోన్నత పదవుల నందుటచే నా దేశస్థులకు రంగాచార్యునిమీఁద నసూయపొడమెను. అందుచేత వారు వానిమీఁద గొన్ని చెడువాడుకలం బుట్టించిరి.


అందు ప్రధానమైన దిచ్చట నుదహరించుచున్నాను. వెనుక రంగాచార్యుఁడు రాచనగరు నందలి యాభరణముల లెక్క వ్రాయ నియమింపఁ బడెనుగదా ! ఆపని ముగిసిన యెనిమిదేండ్ల తరువాత నమూల్యాభరణములుకొన్ని రాచనగరులోఁ గానఁబడుట లేదనియు, నందుకు వెనుక పనిజేసిన రంగాచార్యుఁడే జవాబు చెప్పవలయు ననియు వార్తాపత్రిక లాక్రోశింపఁజొచ్చెను. వాని విరోధు లావ్రాత లాధారముచేసికొని వానిని నిందింపసాగిరి. ఈవిషయమున మైసూరు దేశమంతయు నట్టుడికి నట్లుడికెను. ఇది వానివిరోధులు చేసిన కల్పనమేకాని సత్యముకాదు. అతఁ డపుడు మేజరు యిలియట్ అనుదొరచేతిక్రిందఁ బనిచేసెనేకాని స్వతంత్రముగా బనిచేయఁ లేదు. ఆదొరకు, గార్డను మొదలగు తక్కినదొరలు వాని యార్జవమును వేనోళ్ళ గొనియాడిరి. ఈనగలు కానఁబడక పోవుట యబద్ధమనియు, గుమాస్తాల వ్రాత పొరపాటువలన జాబితాలోఁ గనబడలేదు. గాని నిజముగా నగలుండెననియు, నట్టిపొరపాటున కా గుమాస్తాలేకాని రంగాచార్యుఁ డుత్తరవాది కాఁడనియు, నతని ప్రవర్తనము నిర్దుష్ట మనియు మైసూరు సంస్థానములో నప్పుడుండిన విల్సన్ మొదలగు గొప్పదొరలు నొక్కి వ్రాసిరి.

1881 వ సంవత్సరం మార్చి 25 వ తేదీన రంగాచార్యుఁడు మైసూరునకు మంత్రి యయ్యెను. అమాత్యుఁడై రంగాచార్యుఁడు చేసిన కార్యముల గొప్పతనమును మనము తెలిసికొన వలయునన్న నతఁడాయుద్యోగమునఁ బ్రవేశించు నప్పటికి సంస్థానస్థితి యెట్లుండెనో యించుక తెలియవలయు. సరిహద్దుల నున్న యింగ్లీషురాజ్యముననున్నట్లె యన్ని డిపార్టుమెంటులలోని యుద్యోగస్థుల జీతములు మితిమీఱి యుండుట చేతను. 1877 వ సంవత్సరమందు (అనగా ధాతసంవత్సరమందు) గొప్పకాటకముచేతను, దేశము, సంస్థాన


మందలి ధనాగారము గూడ వట్టిపోయెను. ఆ దేశమునందున్న యేఁబదిలక్షల జనములోఁ బదిలక్షలను క్షామదేవత తనపొట్టఁ బెట్టుకొనియె. ఆచచ్చిన వాండ్రందఱు చేతిపనులు మొదలగు కాయకష్టముల వలన జీవించువారగుటచే నట్టిపనులుఁ గూడ నశింప దేశము మఱింత పేదయయ్యెను. అతిభయంకరమైన యాక్షామమునఁ బనులకుఁ బంటలకు గలిగిన నష్టము రమారమి పదునైదుకోట్ల రూపాయలని యంచనా వెయ్యఁబడెను. అంతకుమున్ను చేసిన మార్పులవలన మిగిలిన స్వల్పధనము కుమార మహారాజుగారి పట్టాభిషేక మహోత్సవమునకు, నంతఃపుర వ్యయములకు విధిగాఁజేసికొన వలసి వచ్చిన కొన్ని మార్పులకు వెచ్చింపఁ బడెను. కాటకమునకు ముందు మైసూరు గవర్నమెంటున కేఁటేఁటవచ్చు శిస్తొకకోటిపదిలక్షల రూపాయలు. అది నృద్ధిచేయుటకుఁ గాలస్థితి యనుకూలముగ లేకపోయెను. క్షామము వలన వర్తకము, చేతిపనులు మొదలగునవి క్షీణించెను. ఆంగ్లేయ గవర్నమెంటువారికి మైసూరు దొరతనమువా రివ్వవలసిన యెనుబదిలక్షల రూపాయలకు నేఁటేఁట నాలుగు లక్షలరూపాయలు వడ్డి రూపకముగాఁ బోవుచుండెను. సంస్థాన మివ్విధమున దుస్థితిలో నున్నపుడు రంగాచార్యుఁడు మంత్రిగావలసి వచ్చెను. ఆ స్థితిపాఱఁ జూచిన నెంతధైర్యవంతుని మనసైన చెదిరిపోవునుగదా ! కీడులో మేలగునట్లు రంగాచార్యుని కీయవస్థలో నొక్క సంతోషము మాత్రము గలుగుచు వచ్చెను. క్రొత్తగా గద్దెయెక్కిన కుమార మహారాజునకు స్వయముగా నాలోచనముఁ జెప్పి రాజ్యతంత్రము నడపుట శక్తిలేకపోయినను మంత్రిచెప్పిన యాలోచనము గ్రహించి యతఁడు చేసిన మంచిపని మెచ్చుకొనుటకైన సామర్థ్యము గలవాఁడగుటచే రంగాచార్యుని ప్రయత్నములన్నియు నిర్విఘ్నములుగ సాగెను. రంగాచార్యుడు మంత్రియైన తోడనే వెనుక గార్డనుదొర మొదలు పెట్టిన మార్పులను గొనసాగింప బూనుకొనెను. హస్సాను, చిత్రదుర్గ మండలములు సివిలు క్రిమినలు వ్యవహారముల నిమిత్తము వేఱు వేఱు జిల్లాలుగ బరిగణింపబడెను. 9 తాలూకాలు డిప్టీ తహసీలుదారుల యదికారముక్రింద నుంచబడెను. మూడు మునసబుకోర్టులు 4 సబుకోర్టులు తీసివేయఁబడెను. 8 జిల్లాల చెఱసాలలలో నైదు తీసివేయఁబడెను. బాటసారులు బసలుదిగు బంగాళాలమీద నదిఁవఱ కేర్పడిన జీతగాండ్రు చాలమంది తగ్గింపఁబడిరి. ఈ తగ్గింపుల వలన సంస్థానమునకు సంవత్సరమునకు రమారమి రెండు లక్షల రూపాయలు మిగిలెను. ఆమార్పులు ముగిసిన పిదప రంగాచార్యులు సంస్థానములోని యడవి డిపార్టుమెంటువైపు తనదృష్టిని మరల్చెను. ఆసంస్థానములో నడవులు చాలభూమి నాక్రమించియుండెను. కలప విశేషము జనులకుఁ గావలసియుండెను. అందు నియోగింపబడిన యుద్యోగస్థులదుర్నీతివలన, సరకువచ్చుటకు సుళువైన మార్గములు దేశమున లేకపోవుటవల్ల, మహారాజున కా డిపార్టుమెంటులో రావలసినంత సుంకమువచ్చుటలేదు. ఆరాజ్యములో దొరకెడు మంచిగంధపుఁ గఱ్ఱల జనులెవ్వరమ్మగూడదు. కొనగూడదు. దొరికిన మంచిగంధపు దారులన్నియు రాచనగరులలోనే యేదోవిధముగ నుపయోగింపఁ బడుచువచ్చెను. రంగాచార్యుఁ డాపద్ధతిమాన్పి చందనమందఱకు సులభసాధ్యముచేసెను. ఈపనులవలన నడవులనుండి సంస్థానమునకు హెచ్చుసుంకము రాజొచ్చెను. ఈవిధమునఁ గొంతద్రవ్యముమిగిల్చి యామంత్రిపదునొకండు లక్షల రూపాయలు పెట్టుబడిపెట్టి మైసూరు ప్రభుత్వమువారు చిరకాలము క్రిందట తల పెట్టి నెర వేర్ప లేకపోయిన యినుపదారిని కొనసాగించెను. పొగబండ్లునడచు నినుపదారి నలవలె దేశమంతటనలముకొనునట్లె వేయించవలయునని యతని సంకల్పము


ఏలయన నవిజనులకుఁ బ్రయాణ సౌకర్యము గలిగించునని వాణిజ్యము నభివృద్ధిజేయుననియు నింగ్లీషువారి రాజ్యముతో మైసూరురాజ్యము కలసి విశేషలాభప్రదమగుననియు నాతఁడునమ్మెను. మైసూరురాజ్యమునందు, నీటిసాగుబడికిఁ జాలవీలున్నను భూమి విశేషభాగము సాగుబడికి రాక, వచ్చిన జక్కగా సాగుబడి చేయఁబడకయుండెను. దానికిఁ గారణము వ్యవసాయము చేయువారికిఁ దగిన సహాయము లేకపోవుటయేయని రంగాచార్యులు నిశ్చయించి యినుపదారులు దేశమున బ్రబలిన నీలోపము నివారింపబడునని తలచి తత్ప్రయత్నముల జేసెను. సంస్థానము లేమిలోనున్నను రంగాచార్యులు దానికి భారములేకుండ నినుపదారి విశేషముగా వేయించెను.

మైసూరు ప్రభువు లింగ్లీషుదొరతనమువారి కీయవలసిన యెనుబదిలక్షల రూపాయల ఋణమును దీర్చుటనుగూర్చి యతఁడు పిమ్మట ప్రయత్నించెను. సంస్థానముయొక్క ధనస్థితినిబట్టి చూడగా నీయప్పు తరతరములవఱకు దీఱునట్లు కనఁబడలేదు. ఆ ఋణము మీఁద నేఁటేటఁ బెరుఁగువడ్డీయే పెద్ద మొత్తమై యసలు మాటయటుండగా నీవడ్డియైన దీఱినంజాలుననుపించు చున్నట్లుండెను.అప్పటి స్థితులంబట్టి చూడగా నిండియా గవర్నమెంటువారు వారికిదోఁచినప్పుడు ఋణము దెమ్మని మహారాజును నిలువదీసి యడుగవచ్చును. అట్టి చిక్కు సంభవించెనా, ఋణవిమోచనమునకై సంస్థానమునకు భంగకరములైన పనుల జేయవలసివచ్చునని దూరదృష్టిగల రంగాచార్యుడు గ్రహించి, యాపప్పును గురించి యేవోస్థిరమైన యేర్పాటులు చేయఁదలచి, యిండియా గవర్నమెంటుతో లేఖాప్రసంగ మారంభించెను. ఈ జాబులలో నతఁడు మైసూరు దరిద్రదశలో నున్నదని వ్రాయుటయేగాక వెనుకటి మహారాజుల దౌర్బల్యము కతమున సంస్థాన మాంగ్లేయుల యేలుబడిలో నున్నపుడు జరిగిన


దుష్పరిపాలనమువలన జెడిపోయి యాదశకువచ్చెనని నిర్భయముగా వ్రాసెను. అందలి విషయము లప్పటి గవర్నరుజనరలగు లిట్టను ప్రభువుకూడ నొప్పుకొనియె. ఈయుత్తర ప్రత్యుత్తరము వలన నింగ్లీషు గవర్న మెంటువారు మైసూరువారి ఋణముమీద కొంతవడ్డీ తగ్గించిరి. అనగా మునుపు సంవత్సరమునకు నూటికైదురూపాయలున్న వడ్డీ నాలుగురూపాయల జేసి ఋణము నలువదియొక్క సంవత్సరములలో దీర్చుకొనుట కంగీకరించిరి. రంగాచార్యుఁడు తెచ్చిన కొత్తపద్ధతులన్నిఁటిలో నుత్కృష్టమైనది జనప్రతినిధిసభ. స్వదేశ సంస్థానములలో నిట్టిసభ యపూర్వము. ఈసభాస్థాపనకీర్తి మన దేశమున రంగాచార్యునకే దక్కెను. ఆతఁడీ సభకు రాజ్యపరిపాలనాధికార మిచ్చుటకుఁ గాక సర్కారువారి యుద్దేశములఁ ప్రజల కెఱిఁగించుట కున్ను సర్కారు చేయఁబోవు చట్టములవారికి ముందుగాఁ దెలుపుటకును రాజునకుఁప్రజలకు నెడ తెగనిసంబంధము గలిగించుటకును రాజుక్షేమమే ప్రజాక్షేమము, ప్రజాక్షేమమే రాజుక్షేమము. ననుమాటలు వారి మనంబున నాటించుటకు నీసభ సృష్టించెను. ఈ సభ క్రొత్తగా బెట్టినప్పుడు దాని ననేకులు గ్రహించి రంగాచార్యులదివఱకు దేశస్థులనేకులకు విరోధియైనందున నెట్లైన వారి యనురాగము బడయుట కీ పనిజేసెనేకాని యది నిలుచునది కాదని జనులు గోలపెట్టిరి. కాని యిప్పటికీ నీసభ సాగుచునేయున్నది. అతఁడింకనూ చాలమార్పులు దెచ్చి దేశమునకు మేలు చేయఁదలఁచెను. కాని 1882 వ సంవత్సరాంతమున జబ్బుపడి చెన్నపురికిఁబోయి యచ్చట మృతినొందెను. అతని నెఱిఁగిన తెల్ల వారు నల్లవారు వాని మరణము మైసూరునకే గాక దేశమున కంతకు నష్టకారియని వగచిరి. బ్రతికియుండగానతని మీఁద నెన్నోయపనిందలుమోపి వేధించిన మైసూరు జనులు తరువాత వాని సుగుణసంపద తెలిసినవారై బిట్టు వగచిరి.