మహాపురుషుల జీవితములు/సర్. కె. శేషాద్రి అయ్యరు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సర్. కె. శేషాద్రి అయ్యరు

ఈయనబొమ్మ దొరక లేదు. శేషాద్రయ్యరు చెన్నపురి రాజధానిలో మలబారు జిల్లాలోనున్న పాలఘాటునకు సమీపమందున్న కుమరాపురము గ్రామమున 1845 వ సమవత్సరము జూనునెల యొకటవ తేదీని జన్మించెను. ఆయన కళ్ళికోటలోనున్న దొరతనమువారి పాఠశాలలో మొట్టమొదట విద్యాభ్యాసముఁ జేసెను. ఆపాఠశాల గోడలమీఁద నిప్పటికి నీయనపేరు బంగారువర్ణములతో వ్రాయఁబడి మెఱయుచున్నది. అక్కడ చదువు ముగిసినపిదప నతఁడు చెన్నపురికిఁ బోయి ప్రసిడెన్సీకాలేజిలోఁజేరి 1866 వ సంవత్సరమునఁ బట్టబరీక్ష యందుఁ గృతకృత్యుఁ డయ్యెను. తరువాతఁ గొన్ని యేండ్ల కాయన బి. యల్. పరీక్షలోఁగూడ కృతార్థుఁడయ్యెను. విద్య ముగిసిన పిదప శేషాద్రియయ్యరు మలబారు జిల్లాకలక్టరగు బేలర్డుదొరచేత నతని కచ్చేరీలో భాషాంతరీకరణముఁ (తర్జుమా) జేయు నుద్యోగస్థుఁడుగా నియమింపఁబడెను. కాని శేషాద్రి చిరకాల మాయూద్యోగములో నుండలేదు.

శేషాద్రి చదువుకొనుచున్న కాలమునందే రంగాచార్యులతో స్నేహముచేసెను. అందుచేత రంగాచార్యులు మైసూరు సంస్థానమున నుద్యోగము సంపాదించినప్పుడు శేషాద్రినిఁ బిలిపించి యష్టగ్రామమండల మండలాధికారివద్ద శిరస్తాదారుగ నేర్పరచెను. శేషాద్రి మైసూరుసంస్థానమున గొప్పపేరు సంపాదించుటకు మిక్కిలి యవకాశముండెను. సహజముగ బుద్ధిసూక్ష్మతయు మంచిపూనికయుఁ గలవాఁడగుటచే నయ్యరు తన పాలఁబడిన కృత్యములెల్ల నతిశ్రద్ధతో నెఱవేర్చుచువచ్చెను. ఆయన ప్రవేశించు నప్పటికి మైసూరు ప్రభువు బాలుఁడైనందున నాంగ్లేయ దొరతనమువారి పాలనలో నుండెను.


ఈయన చేరిన పదమూడేండ్లకు యుక్తవయస్సు ప్రాప్తించి నందున సంస్థానము మహారాజున కప్పగింపఁ బడెను. ఈ పదమూడేండ్లలో శేషాద్రయ్యరు చాల డిపార్టుమెంటులలోఁ బనిచేసి పరిపాలన విధాన మంతయు నేర్చుకొనెను. 1873 వ సంవత్సరమునందు మైసూరులో జ్యూడిషల్ కమీషనరుగానుండిన సర్. జేమ్సు గార్డనుదొర శేషాద్రిని తన కోర్టులోఁ బెద్ద శిరస్తదారుగ నియమించెను. అనంతర మతఁ డాసంస్థానమున నశిష్టాంటు కమీషనరుగా నేర్పరుపఁబడెను. ఆ యుద్యోగమున మూడేండ్లున్న పిదప నాయన మహారాజుగారి మందిరమునకు కంట్రోలరుగా నేర్పరుపఁబడెను. ఈయుద్యోగములో నుండి యతఁడు తుముకూరుజిల్లా డిప్యూటికమీషనరుగారు జిల్లా మేజస్ట్రీటుగాను మార్పఁబడెను. ఈ యుద్యోగమునందు శేషాద్రయ్యరు దేశపరిపాలనమునందు తనకుఁగల సామర్థ్యమును జూపుటకు విశేషముగా నవకాశము గలిగెను. ఆ సామర్థ్యమునుజూచి పై యధికారులు శేషాద్రి జిల్లాకలక్టరు పదవియందేగాక దానికంటె నెక్కువ పదవులయందు నిలుపఁబడఁదగిన వాఁడని గ్రహించిరి.

సంస్థానము మహారాజుగారి కప్పగింపబడిన తరువాత రంగాచార్యులు మంత్రియయ్యెను. మంత్రి యైనతోడనే యాయన చట్టములు శిక్షాస్మృతులు నిబంధనలు మొదలగునవి వ్రాయుటకు బుద్ధిశాలియగు శేషాద్రయ్యరు నేర్పరచెను. రంగాచార్యులు సుఖించుటకు మంత్రి కాలేదు. ఆతఁడు చేయవలసిన కార్యములు విశేషముగా నుండెను. రంగాచార్యుఁడు మిక్కిలి సమర్ధుఁడు. విశేషించి సత్పరిపాలనముఁ జేసి సత్కీర్తి సంపాదింప వలయునను కోరిక కలవాఁడు కావున నెంతోఁ జేయవలయునని కొండంత యాశతోఁ బరిపాలన నారంభించెను. దేశముయొక్క ధనస్థితి బాగుచేయుట కాయన యెన్నో యేర్పాటులఁ జేసెను. మంత్రిగా నున్న


రెండేండ్లలోనే తాను బ్రతికియున్న పక్షమున జనులకుఁ గలుగు సౌఖ్యము లెట్లుండునో కొంతవఱకు రుచిచూపెను. కాని మైసూరు సంస్థాన వ్యవహారములను నడపుటకు మిక్కిలి గడతేరిన దిట్టరి కావలసిన సమయమందే దేశస్థుల దురదృష్టమున రంగాచార్యుఁడు కాలధర్మము నొందెను. రంగాచార్యుఁడు బ్రతికియున్నప్పుడే శేషాద్రయ్యరు ముందు మిక్కిలి కాగలవాఁడని యాతనిమీఁద నెంతో యాసపెట్టుకొనియుండెను. రంగాచార్యుఁడు పోయిన పిదప శేషాద్రి యాస్థానమున గూర్చుండుట కర్హుడగునా కాఁడా యని గొప్ప సందేహము కలిగెను. కాని కాలమే యెల్ల సందేహములను బాపి శేషాద్రియయ్యరు మొదట జనులనుకొన్న దానికంటె నెక్కువసమర్థుడని నిరూపించెను. 1883 వ సంవత్సరము ఫిబ్రేవరు 12 తారీఖున శేషాద్రయ్యరు మైసూరు సంస్థానమునకు మంత్రిగా నియమింపఁ బడెను.

మంత్రి యగునప్పటికి కతఁడు పడుచువాఁ డగుటచేతను వెనుకటి మంత్రిచేయవలసిన మార్పులవల్ల దారిఁజూపించుటచేత నీతనికి బరిపాలనము సులభమయ్యెను. అప్పటికాయన ముప్పది యెనిమిదియేండ్లవాఁడు. కావున తానుచేసిన మార్పుల ఫలములు కన్నులారఁ జూచుటకు ననుభవించుటకు జిరకాలము జీవించెను. ఆకస్మికముగా గొప్పరాజ్యమును నావయొక్క చుక్కానును ద్రిప్పవలసిన వాఁడగుటచే నతడు క్రొత్తదారులం బోవక రంగాచార్యుడు చూపిన మార్గములనేనడచి యతఁడు వేసినపద్ధతులనే యవలంబించి పరిపాలింపఁ దొడగెను. సంస్థానము మహారాజు కప్పగింపఁబడక పూర్వము 1877 వ సంవత్సరమున దేశమున గొప్పకాటకము సంభవించెను. ఆకఱవుబాధల నివారించుటకు సంస్థానమునకు ముప్పదిలక్షలరూపాయ లప్పయ్యెను. ఈయప్పు నింగ్లీషు దొరతనమువారే యిచ్చిరి. అందు


చేత నేఁ టేఁట దాని వడ్డి నిచ్చుకొను భారమేగాక మఱియొక సారి కాటకము సంభవించునప్పుడు జనక్షయము కాకుండుట కేర్పాటులు చేసికొనవలసిన భారముగూడ సంస్థానముపై బడెను. కాటకముల నివారించుటకు రంగాచార్యులు దేశమున నినుపదారి ప్రబలముగా వేయింప నారంభించెను. శేషాద్రయ్యరు గూడ నాతని మార్గమే యవలంబించి యినుపదారులను వేయింపసాగెను. ఆయన మంత్రియైన రెండు సంవత్సరములలోపున దేశమున రమారమి నూటనలువదిమైళ్ళపొడవుగల యినుపదారి వేయబడెను. దానినిమిత్తమైన కర్చులలో నిరువదిలక్షలు మాత్రమే ఋణమయ్యెను. తక్కిన ధనము సంస్థానపు టాదాయమునుండియే వ్యయము చేయఁబడెను. ఈ యినుపదారి వలనఁ బోగుపడిన ధనము నతఁడు మఱికొన్ని మండలములలో నినుపదారులు వేయించుటకుగా వినియోగించెను. నాలుగేండ్ల తరువాత బెంగుళూరు హిందూపూ రినుపదారి సమాప్త మయ్యెను. అదివఱకు క్షామములకు మిక్కిలి జడిసిన మండలము లన్నియు నినుప దారులచేత జుట్టువడి యెన్ని కఱవులు వచ్చినను భయము లేనిస్థితిలో నుండెను. ఆయన యధికారమును బూనునప్పటికి దేశమున రమారమి యేఁబది యెనిమిదిమైళ్ళ యినుపదారి యుండెను. 1901 వ సంవత్సర మందాయన యుద్యోగము మాను నప్పటికి నాలుగువందలమైళ్ళ యినుపదారి వేయఁబడియుండెను.

ఈయన చేసినపని యొక్క యినుప దారియేకాదు. పొలములకు జక్కని నీటిపారుదలఁ గలిగించుట కీయన విశేష శ్రమపడెను. ఆయన పరిపాలన మారంభించిన మొదటి పన్నెండు సంవత్సరములలో రమారమి కోటిరూపాయలను ఖర్చు పెట్టించి మూడువందల యేఁబదియైదు చదరపుమైళ్ళభూమిని దంపశాగుబడిక్రిందకిఁ దెచ్చెను. ఇట్లు తెచ్చుటవల్ల సంస్థానమునకు సంవత్సరమున కెనిమిది లక్షల


రూపాయల శిస్తులధికముగాఁ జెల్లుచువచ్చెను. ఖర్చుల తగ్గించుట, కొత్తమార్పులు చేయుట, యేక కాలముననే జరుగుచు వచ్చెను. అందుచేత సంస్థానము ధనవిషయమున దినదినము మహాద్భుతముగా వృద్ధిపొందెను. ఆయన యధికారమును బూనునప్పటికి సంస్థానమున కున్న ముప్పదిలక్షల ఋణము 1888 వ సంవత్సరమున ననఁగా నై దేండ్ల నాఁటికి సంపూర్ణముగఁతీర్చి వేయఁబడెను. తరువాతనేడేండ్లకనఁగా 1895 వ సంవత్సరమున శేషాద్రియయ్యరు జనప్రతినిధి సభను బిలిపించి యాసభికులతో సంస్థానముయొక్క స్థితిగతులఁ జెప్పునవసరమున నప్పటికి సంస్థానపు ఖజానాలో నొకకోటి డెబ్బదియాఱులక్షల రూపాయలు నిలువయున్నవని జెప్పెను. 1883 వ సంవత్సరమున ననఁగా నీతఁడు క్రొత్తగా మంత్రియైన సంవత్సరము సంస్థానమునకు వచ్చిన శిస్తొక కోటి మూడులక్షలు. శేషాద్రయ్యరు మంత్రిపదవి మానుకొని నప్పుడు సంస్థానముయొక్క శిస్తొకకోటి యెనుబది లక్షలు. ఇట్లతిశయమైన శిస్తుపన్ను లెక్కువకట్టుట వలన గాని ప్రజలంబీడించుట వలనంగాని రాలేదు. శేషాద్రయ్యరు నిరంతర మభివృద్ధిమీదనే దృష్టినిలిపి, పన్నుల యొత్తుడు బ్రజలకు గలుగ నీయక సంస్థానమునకు ధనలాభము కలుగు నుపాయములు వెదకుచు యట్టిపనులందు జొరవతో బ్రవేశించుచు వచ్చెను. ఇంజనీరింగు డిపార్టుమెంటువారిని జాలప్రోత్సాహముజేసి క్రొత్త జలాధారములు దేశమునకు గల్పించెను. ఎక్కువ జాగ్రత్తయు దక్కువ ధైర్యము గల మంత్రులు సాధారణముగా బ్రవేశింప నొల్లని దుర్ల భ కార్యములలో నీతడవలీలగా బ్రవేశించెడువాడు. ఈయన చొరవజేసి ప్రవేశించుట చేతనే బెంగుళూరు జనులు హాయిగా ద్రాగుటకు మంచినీరు లభించెను. ఈయన చొరవ చేయనిచో హగారినదిమీద నానకట్టు కట్టబడక యుండును. ఈ యానకట్టువలన ముప్పదియైదు మైళ్ళ


చతురముగల చెరువేర్పడెను. ఈచెరువువలన నెన్నో యకరముల నేల సాగుబడి యగుచున్నది. ఇవిగాక యీయన యుద్యోగము చాలించుకొనక మునుపు మరియొక పెద్దయెత్తునెత్తెను. కావేరీనది కొండలనుండి క్రిందికి దిగుచోటనుండి యంత్రాది సాధనములవలన నదీజలమును మైసూరు సంస్థానమునకు జక్కగా బ్రవహింప జేయవలయునని యాయన సంకల్పించెను. దీనివలన మైసూరు సంస్థాన మిప్పటికంటె రెట్టింపు భాగ్యవంతమగును. ఈయన మంత్రిగా నుండిన పదునెనిమిది సంవత్సరములలోను నీటు పాఱుదలం గూర్చి యీయన ఖర్చుచేసిన సొమ్ము రమారమి నాలుగుకోట్ల రూపాయలు, కాలమున కనుగుణముగా నుండునట్లు శేషాద్రయ్యరుగూడ నెన్ని యో క్రొత్తడిపార్టుమెంటుల గల్పించి వాటిలో బనిచేయుటకు దన దేశమున సమర్థులు లేనపుడు విదేశములనుండి ప్రకృతి శాస్త్రజ్ఞానము లోకానుభవముంగల సత్పురుషులం బిలిపించుచు వచ్చెను. మునుపున్న డిపార్టుమెంటులంగూడ బై నుండి క్రిందవఱకు సంపూర్ణముగా మార్చివేసెను. మైసూరు సంస్థానమున కోలారు జిల్లాలో బంగారపు గనులు కలవు. ఈగనులను యూరోపియనులు కౌలుకు బుచ్చుకొని పూర్వము సంవత్సరమున కేబది వేల రూపాయల చొప్పున మహారాజువారి కిచ్చుచుండువారు. శేషాద్రయ్య రా గనులను ద్రవ్వుటలో మఱింత ప్రోత్సాహము గలిగించి యిపుడు సంవత్సరమునకు బదునైదులక్షల రూపాయలు రాబడి వచ్చునట్లు చేసెను. ఎంతబుద్ధిశాలియైన నెంతబలవంతుడైన మనుష్యుడుమితజ్ఞుడే కానిసర్వజ్ఞుడుకాడుగదా! అందుచే శేషాద్రయ్యరు రాజ్యపరిపాలనములో బెక్కులోపములు చేసియుండవచ్చు. రైతులకుపయోగకరముగా నుండుటకీయన కృషినిధులను స్థాపించెను. కృషినిధులనగా రైతులకు మిక్కిలి తక్కువ వడ్డిని యప్పులిచ్చెడు బ్యాంకులు. పంట కాపులు


సాధారణముగా నూటికి రూపాయియెనిమిదణాలు, రెండురూపాయలు వడ్డికి సొమ్ముపుచ్చుకొని యాఋణము దీర్చ లేక నానాటికి దుస్థితిలోనికి వచ్చుటజూచి వారిస్థితి బాగుచేయుట కీయన యీనిధుల గల్పించెను. కాని యవి యనుకొన్నంత కార్యకారులు కాలేదు. ఇంత నతడు చేసిన ప్రయత్నములలో నెర వేరనివి కొన్ని యున్నవి, కాన నెఱవేఱిన కార్యము లనంతరములుగా నుండుటచే జెడిపోయిన వానిని మన మెత్తుకొన నక్కఱలేదు. మైసూరు నిప్పుడున్న స్థితికి దెచ్చిన మహానీయు డీయనయేయన నిశ్చయముగా జెప్పవచ్చును. శేషాద్రయ్యరుయొక్క సత్పరిపాలనము మైసూరు ప్రభువువద్దనుంచి ప్రజలవద్దనుంచి మెప్పులు దెచ్చుటయేగాక యాంగ్లేయప్రభుత్వము వారివద్దనుంచికూడ యాయనకు మెప్పులు తెచ్చెను.

1887 వ సంవత్సరము ఫిబ్రేవరు నెలలో గవర్నరు జనరలుగారగు డఫ్రిను ప్రభువుగారు మైసూరు సంస్థానమునకు బోయి మంత్రికి సి. యస్. ఐ. యన్. బిరుదమిచ్చిరి. అనంతరము 1893 వ సంవత్సరమున గవర్నరు జనరలుగారగు సెలిజిను ప్రభువుగా రాయనకు కె. సి. యన్. ఐ. యను బిరుద మిచ్చిరి. వెనుకటి మైసూరు మహారాజుగారు శేషాద్రయ్యరుకు రాజ్యధురంధరుడను బిరుదమిచ్చిరి. ఆమహారాజుగారు 1894 వ సంవత్సరమున మృతినొందగా, గుమారుఁడు బాలుఁడయి నందున నిండియాగవర్నమెంటువారు దేశపరిపాలనము జరుపుటకు కవున్సిలు ఆఫ్ రీజన్సీయను నొకసభ నేర్పరచి యాసభకు శేషాద్రయ్యరుకు నధ్యక్షునిగ నేర్పఱచిరి. చెన్నపురి యూనివరిసిటీవారు 1887 వ సంవత్సరమున నాయన నొక ఫెల్లోగా జేసిరి. నిరంతరమగు కార్యభారముచేత నాయన శరీరారోగ్యము క్రమక్రమంబునం జెడుటంజేసి యాయన 1900 సంవత్సర ప్రారంభమున నుద్యోగము మానుకొనెను. మొత్తముమీఁద నీతఁడు మైసూరు


సంస్థానములో ముప్పదిరెండేండ్లు పనిజేసెను. అందుఁ బదునేడేండ్లు మంత్రిపదవియందే యుండెను. చిరకాలమునుండి యాయన శరీరమునకు గావలసిన విశ్రాంతి యప్పుడు లభించుటచేత శేషాద్రయ్యరు చాలకాలము జీవించుననియు నాయన జీవితములో భుక్త శేషము గూడ లోకోపకారార్థమే వినియోగ పడుననియు నెల్లవారలుదలంచిరి కాని దైవమది యోర్వఁడయ్యె సరిగా రెండు సంవత్సరములైనను విశ్రాంతి సౌఖ్యము లనుభవింపక ముందె 1901 సెప్టెంబరు పదమూడవ తారీఖున మిత్రమండలమునకును బంధుకోటికి నపారదుఃఖము కలుగునట్లు శేషాద్రయ్యరు స్వర్గస్థుడయ్యెను.

శేషాద్రయ్యరు మిక్కిలి ప్రసిద్ధుఁడు. ఆయన చరిత్ర మంతకన్న ప్రసిద్ధము. దక్షిణ దేశము మంత్రులకుం బుట్టిన యిల్లని భరతఖండమున వాడుక కలదు. ఏలయన నీదక్షిణ దేశముననేగదా ! దివాను రంగారావు. రాజా మాధవరావు. వెంబాకం రామయ్యంగారు, దివాను రంగాచార్యులు, మహామంత్రి శేషాద్రయ్యరు మొదలగువారు పుట్టిపెరిగి మహాధికారముఁ జేసినది. పైనుదహరింపఁబడిన వారందఱు మంత్రులుగా నుండినను వారి యందరికంటె శేషాద్రయ్యరునకు రెండులాభము లెక్కువ కలిగెను. అందు మొదటి దేదన శేషాద్రయ్యరు మైసూరు సంస్థానమున జిరకాలము పనిజేయుట కవకాశము కలిగెను. తక్కినవారి కీయవకాశము కలుగ లేదు. రంగాచార్యులు రెండుసంవత్సరములు మాత్రమే మంత్రిపని జేసెను. మాధవరావు తిరువాన్కూరునందుఁ గొంతకాలము బరోడాలోఁ గొంతకాలము మంత్రియై యుండెను. కాని నిరంతరాయముగ నొక్కచో నింతకాలము పనిఁజేయ లేదు. శేషాద్రయ్యరు పదునేడు సంవత్సరములు వేరు వేరు పదవులలో నుద్యోగిగాను మైసూరునందే యుండుటచేత సంస్థానముయొక్క గుట్టుమట్టులు దేశస్థులు యాచార్య వ్యవహారములు


దెలిసికొనుటకు, తెలిసికొనవలయునెడల దేశకాలపాత్రముల ననుసరించి మార్పులఁ జేయుటకు నవకాశము కలిగెను. రెండవలాభమిది. హిందూ దేశమునందు మంత్రులైన మహానీయులు విద్యావిషయమున ముత్తెగలుగ నున్నారు. అది యెట్లన నాంగ్లేయవిద్యజక్కగానేర్వక మంత్రులై యనంతర మాబాస నేర్చుకొని మొత్తముమీఁద స్వభాషతోనే వ్యవహారము నడిపించినవారుకొందఱు. ఇందులో గ్వాలియరు మంత్రియైన దినకరరావు హైదరాబాదునకు మంత్రియైన సలారుజంగును జేరుదురు. బి. యే. బి. యల్ మొదలగు పరీక్షలయందుఁ గృతార్థులు కాకపోయిన దమ కాలమునాటికున్న యాంగ్లేయవిద్య నభ్యసించి వ్యవహార మింగ్లీషుతోనే కట్టుదిట్టముగ నడిపినవారు కొందఱు మాధవరావు రంగాచార్యులు రామయ్యంగారు మున్నగు వారీ తెగలోనివారు. బి. యే. బి. యల్ మొదలగు పరీక్షలయందు గృతకృత్యులై మంత్రులై నవీన పద్ధతుల ననుసరించి వ్యవహారముల నడిపినవారు కొందఱు. శేషాద్రయ్యరీ తెగలోజేరును. సకృతి శాస్త్రాదుల నేర్చికొన్న ఫలము శేషాద్రయ్యరు తన పరిపాలనమునం గనబఱచెను.

ఎవరి మంత్రిత్వ మేవిధముగనున్నదో పోల్చిచెప్పుట చాల కష్టము కాని శేషాద్రయ్యరుకు దక్కిన మంత్రులకు నెందైన భేదమున్న పక్షమున నది ముఖ్యముగ నొక దానియం దగపడుచున్నది. దినకరరావు మాధవరావు మొదలగు ప్రాచీన మంత్రులు తమ యధికారము క్రిందికివచ్చిన దేశములలో గ్రమస్థితిలేనిచోట్ల గ్రమస్థితి నెలకొలుపుచు జెడియున్న తావులను జక్కజేయుచు వచ్చిరి. శేషాద్రయ్యరన్ననో యతడు వచ్చునప్పటికి దేశము క్రమస్థితిలోనే యున్నందునఁ జేతిపనులు వాణిజ్యము మొదలగునవి వృద్ధిచేసి సంస్థానముయొక్క ధనస్థితి బాగుపఱచి రాజ్యమును ధనవంతముగ జేసెను. శేషాద్రయ్యరు స్థిరమనస్సుగలవాఁడు. ఎవరైన నెదిరించిన కొలఁది నాతనిపట్టుదల యధికమయ్యెడిదఁట. ప రేంగితజ్ఞాన యాయనకున్నట్లు మరెవ్వరికి లేదని చెప్పుదురు. అందుచేతనే లక్షణములం గనిపెట్టి తగినవారినే తనక్రింద యధికారులుగా నేర్పఱచుకొనెను. ఒకరిమీఁద క్రోధము మఱి యొకరిమీఁద దయ యను పక్షపాతము లాయనకడ లేవు. అన్నియుఁ దెలిసినవాఁడయ్యు నీతఁ డొకచిన్న పొరపాటుఁ జేసెను. గొప్పయుద్యోగములలో మైసూరులోఁ బుట్టిన జనులను బ్రవేశపెట్టక యాతఁడు తఱచుగా జెన్నపురి రాజధానిలోని వారినే తెచ్చి ప్రవేశపెట్టెను. ఆదేశస్థులనే బ్రవేశ పెట్టినచో వారు జాతిమత పక్షపాతముగలిగి వర్తింతురనియు విద్యలో విశేషముగ నారితేఱినవారు గాకపోవుటచే ననర్హులనియుఁ దలంచి యాయన విదేశస్థులఁదెచ్చినచో వారు పక్షపాతము లేక ప్రజ్ఞాఢ్యులై యుందురని తలంచి యట్లుచేసెననియు నది పొరపాటు కాదనియు నాయన పక్షమువారు తలంతురు. కారణ మే మయినను శేషాద్రయ్యరు మైసూరుజనుల కిష్టుఁడుగాకపోయెను. ఇందతఁడు సంస్థానముయొక్క క్షేమమునే గోరెను. స్వలాభము జూచుకొని పని చేయ లేదని శత్త్రువులైన నొప్పుకొందురు.

ఆయన యెల్లప్పుడు నీతిపరుడై వ్యవహరించెను. రాజకార్యములతో స్వకార్యముల నెన్నఁడు నాయనకలిపి యెఱుఁగడు. తన సొంతసొమ్మయినఁ జెన్నపురములో నున్న బ్యాంకులో వేసికొనెనే కాని మైసూరు సంస్థానపు బ్యాంకులో నెన్నఁడు వేసికొనలేదు. చిరకాలము వేలకొలది రూపాయల జీతములుగల యుద్యోగములు చేసినను శేషాద్రయ్యరు పనిమానుకొను నప్పటికి దనపదవి వహించిన వారియందఱికంటె పేదవాఁడుగనుండెను. అందుచేత మైసూరు మహారాజుగా రాయనకు నాలుగులక్షల రూపాయలు రొక్కమును


నెలకు రెండువేల రూపాయ లుపకార వేతనమును దయచేసిరి. మాధవరావు మొదలగువారు తాము మంత్రులై యున్న దేశములలో జీవితకాల శేషమును గడపక స్వదేశములకుఁ బోవుచువచ్చిరి. శేషాద్రయ్య రట్లుచేయక యేదేశపుసొమ్ము తానుతినెనో యాదేశమునందే తన ధనమంతయు ఖర్చుపడవలయునని యుద్యోగమును మానిన వెనక గూడ స్వదేశమునకుఁబోవక మైసూరులోనే గాఁపుర ముండెను. ఈయన గొప్పపరీక్షలయందుఁ దసెఱినను మతవిషయమునఁ బ్రాచీనులలోఁ జేరినవాఁడు. ఇంటివద్ద పరమనిష్ఠుఁడై వ్యాఘ్రచర్మముఁ గప్పుకొని విభూతిపిండికట్లుబెట్టుకొని మహేశ్వరధ్యానము సేయుచుండును. మృతినొందునప్పుడు సయిత మీయన తన శరీరము బులితోలుతోఁగప్పి దహనము జేయుమని బంధువులను బ్రార్థించెనఁట. మతవిషయమునందింత పట్టుదల కలదని యీతఁడు వ్యవహార విషయములలో నెన్నఁడు జాతిమత భేదములను బాటించినవాఁడు కాఁడు. వ్యవహారములలోఁ దురక, క్రైస్తవుఁడు, మాలవాఁడు, బ్రాహ్మణుఁడు గూడ నాయన దృష్టికి సమానులే.