మహాపురుషుల జీవితములు/వివేకానందస్వామి
వివేకానందస్వామి
ఆసేతు హిమాచలమగు భరతఖండమునందంతటకీర్తి వ్యాపించియున్న నీమహాత్ముని చరిత్ర మెక్కడ మాకు సమగ్రముగాలభింపలేదు. అందుచేతనీతని చరిత్రము సంగ్రహముగా వ్రాయవలసివచ్చినది.
ఈయన బంగాళాదేశస్థుఁడగు శూద్రుఁడని కొందఱు క్షత్రియుఁడని కొందఱు జెప్పుచున్నారు. పూర్వాశ్రమమునం దీయన పేరు నరేంద్రనాధదత్తు. సన్యసించిన వెనుక నీయన వివేకానందస్వామియని పేరుపెట్టుకొనెను. నరేంద్రనాధదత్తుయొక్క తల్లిదండ్రు లెవ్వరో వారెట్టివారో యీతనిబాల్య మేవిధముగా గడుపబడినదో మనము తెలిసికొనుటకు దగినయాధారము లేవియు లభింప లేదు. కాని యీతనితండ్రి కలకత్తానగరవాసుఁడే యనియు నరేంద్రనాధదత్తు తత్పట్టణమునందే పుట్టి పెరిగి యింగ్లీషువిద్య చదువుకొని తుదకు పట్టపరీక్ష యందనగా బి. యే. పరీక్షయందుఁ గృతార్థుఁడయ్యెనని కొన్ని గ్రంథములం జదివినారము. ఈయన ప్రధమమందు బ్రహ్మసమాజ మతాచార్యుఁడగు కేశవచంద్రసేనునితోఁ గలసి యామతాభిమానముగలిగి యుండెనఁట. అనంతరము శ్రీరామకృష్ణ పరమహంసయొక్క మహిమలు విని యతనిశిష్యుఁడై నరేంద్రనాధదత్తు వానియనుగ్రహము వలన వేదాంతవిద్యోపదేశమునొంది బ్రహ్మజ్ఞానసంపన్నుఁడై గురువు గారి మరణానంతరమున లౌకికవ్యాపారములపై విరక్తిపొడమ సన్యసించి వివేకానందస్వామి యనుపేరం బ్రసిద్ధుఁడై తన జీవిత శేషమంతయు లోకోపకారార్థమై గడపియుపనిషన్మతమును భరతఖండమునందే గాక యమెరికా ఖండమునందును యూరపు ఖండమునందును బోధించెను. ఈయన సన్యసింపక మునుపును సన్యసించిన వెనుక కొంత కాలమును మన దేశమందేయున్నను వానిపే రెవ్వరికిం దెలియ రాదయ్యె. అమెరికాఖండమునకుఁ బోయినవెనుకనే యీతనియం దణగియున్న జ్ఞానవిశేషమంతయు బయలుపడుటయు నందుమూలమున లోకమంతయు నతని నెఱుఁగుటయు సంభవించెను.
అమెరికాఖండమున యునైటెడుష్టేట్సను దేశము గలదు. అందు షికాగోయను గొప్పనగరమున్నది. ఆ దేశస్తులందఱు కోట్లకొలఁది ధనము చందామూలమున జేర్చి షికాగోనగరమున 1893 సంవత్సరమున గొప్పప్రదర్శనము జరిగించిరి. ఆప్రదేశమునందే దేశపు మనుష్యులు మున్నెన్నఁడు జూచియుండని చిత్రములు చూచునట్లును విని యెఱుగని సంగతులు వినునట్టును తత్కార్య నిర్వాహకు లేర్పరచిరి. ఆ ప్రదేశమునందే సర్వమతములఁగూర్చియు జర్చలు జరపఁదలంచి మతమహాసభ (Parlament of Religions) నొక దాని నచ్చటివారు కూర్చిరి. ఆమతమహాసభకు వివిధదేశములవారు తమతమ మతములయందలి మేలిసంగతుల ప్రపంచమునకు దెలియునట్లచ్చట నుపన్యసింప దలంచి యా నగరమునకుం బోయిరి. వివేకానందస్వామియు బవిత్రమైన యుపనిషన్మతమును బ్రహ్మవిద్యను నాగరికతతో దులతూఁగుచున్న పశ్చిమఖండ వాసులకు నమెరికాఖండవాసులకుఁ దెలుఁపగోరి యా మతమహాసభకుఁ బోవ సమకట్టెను. గాని ప్రయాణము ధనమూలముగదా. అదివఱకె సన్యసించియున్న యామాహాత్మునకు ప్రయాణమునకుఁ గావలసిన ధనము చిక్కకపోవుటచేతను తనదేశస్థులెవ్వరు దనపూనికకుఁ దోడుపడకపోవుట చేతను వివేకానందుఁడు చెన్న పట్టణము వచ్చి తన యుద్యమ మచ్చటి పెద్దమనుష్యుల కెఱిఁగించెను. నివురుగప్పిన నిప్పువెలెనున్న యాతనిజాడ నెఱిఁగి చెన్న పురివారు కొంత ధనమిచ్చి యాయన నమెరికాఖండమునకుఁ బంపిరి.
స్వమతములంగూర్చి యుపన్యసించుటకు షికాగోనగరమునకు మన దేశమునుండి వెళ్ళిన పురుషుఁడొక్కఁడేగాడు. బ్రహ్మసమాజ మతపక్షమున ప్రతాపచంద్రముజుందారును, బౌద్ధమతపక్షమున ధర్మపాలుఁడును మన దేశమునుండియే వెళ్ళిరి. కాని వీరిద్దరికంటెను మత సంబంధములగు చర్చలుజేయుటకు వెళ్ళిన తక్కిన పురుషులకంటెను వివేకానందస్వామి కొక్కనికే యధికఖ్యాతి గలిగెను. చూపరుల మనస్సుల నాకర్షించు మూర్తియు మంచి ముఖవర్చసును గంభీరమైన కంఠనాదమునుగలిగి కాషాయాంబరములు ధరించిన యాహిందువును జూచినది మొదలమెరికావాసులకు వానియం దొకవిధమైన యునురాగ ముదయించుటచే నాతఁడు చేయు నుపన్యాసముల వారు శ్రద్ధతో నాలకింప జొచ్చిరి. వివేకానందస్వామి యమెరికాకు పోక మును పచ్చటి జనులకు మతమును గూర్చియు మన నాగరికతను గూర్చియు నంతగా దెలియదు, మనలను బాగుచేయునెపమున మన దేశమునకుఁ బోయినప్పుడు హిందువులమతము దుర్మత మనియు వారు మనుష్యజాతిలో నెంచఁబడఁ దగినవారు కారనియు నప్పుడప్పుడు చెప్పుచుందురు. గావున నచ్చటిజను లామాటనువిని మనవిషయమున నెంతయు దురభిప్రాయమును గలిగియుండిరి.
వివేకానందస్వామి బోధనలు వినినవారి కందఱకు నట్టి యభిప్రాయములు పోయినవి. ఈయన యాదేశమున బోధించినది వేదాంత మతము. అనగా నుపనిషత్తులలోని మతము. ఆయనకు శంకరాచార్యుని యందును రామానుజా చార్యునియందును మిక్కిలి గౌరవము గలదు. వేదాంతమతము సర్వోత్కృష్ట మయినదనియు నిది తక్కిన మతములవంటిది గాదనియు మహామ్మదీయ మతము క్రైస్తవమతము మొదలగునవి యొక్కొక్క పురుషునిమీఁద నిలిచి యున్నవనియు నాపురుషుఁడు లేడని గాని యా పురుషునియం దట్టి మహిమలు లేవనిగాని నిద్ధారణ చేయఁబడినప్పుడు తప్పక యామతములు నశింపవలసి యున్నవనియు వేదాంత మత మెవరొ యొక పురుషునిమీఁద నిలిచియుండలేదు గావున నది సర్వకాలములయందు సర్వదేశములయందు సకలజాతులవారికి నవలంబనీయమనియు నతఁడు బోధించెను.
పీఠములమీఁద నెక్కి మనకుగురుస్వాములమని చెప్పుకొనుచు సన్యాసులయ్యు జమీందారులకంటె నెక్కువభోగముల ననుభవించు మతగురువులు నశించునప్పుడుగాని మన దేశ మభివృద్ధి పొందదని యాయన పలుచోట్ల నొక్కి చెప్పెను. వేదాంతవిద్య జాతిభేదము లేక సకలజనులకు నుపదేశింప, దగినదనియును చండాలాది నీచజాతులకు గూడ విద్యాబుద్ధులు చెప్పి బాగుచేయవలసిన భారము మనమీఁద నున్నదనియు నీచజాతులు హీనస్థితిలో నుండుటచేతను మన దేశము చెడిపోయిన దనియుఁ గావున వారిస్థితిని జక్కఁజేయుటకు మనమందఱము పాటుపడవలసినదనియు వివేకానందస్వామి యనేకొపన్యాసములలో ప్రసంగించుచు వచ్చెను. అంతియగాక తాను చనిపోవు లోపుగ పదిమంది మాలవాండ్రనయిన నుత్తమబ్రాహ్మణులుగఁజేసి మృతి నొందుదునని చెప్పెను. కాని యీకార్యము నెరవేరక ముందే యాయన మృతిపొందెను. తక్కువజాతులవారి నున్నతస్థితికి దెచ్చుట కీయన కిష్టమే. ఆవిషయమున నొక యుపన్యాసమందాయన యిట్లు చెప్పియున్నారు. "బ్రాహ్మణులు మొదలగు నగ్రవర్ణములవారు తమ యాచార వ్యవహారములు వదలుకొని తక్కువ జాతులలో కలియగూడదు. కాని మాలవాండ్రు మొదలగు తక్కువ జాతుల వారికి వేదశాస్త్రములు మొదలగు విద్యలుచెప్పి వారి నగ్రవర్ణజులతో సమానులుగఁ జేయవలయును. ఇదియే నీచజాతుల నున్నత స్థితికిఁ దెచ్చుట.
అమెరికాఖండమునందు మత మహాసభ ముగిసిన వెనుక వివేకానందుని యుపన్యాసముల నెంతవినినం దనివితీరక యచ్చటివా రనేకులు కొంతకాలము తద్దేశమున నుండి యుపన్యాసముల నింక నిమ్మని ప్రార్థించిరి. అందుచేనాయన మరిరెండు సంవత్సరములచ్చట నుండవలసి వచ్చెను. ఆకాలమునందాయన ప్రతిదిన ముదయము మధ్యాహ్నము సాయంకాలము వేరు వేరు స్థలములయందు ప్రజలడిగిన మతవిషయములగూర్చి యుపన్యసించుచు స్థలాంతరములనుండివచ్చిన పెక్కు జాబులకుత్తరములు వ్రాయుచు నిమిషమయిన వ్యవధి లేక యుండెను. అమెరికాఖండమునందున్న యనేక సంఘములు సమాజములుసభలు నొకదాని నొకటి మించునట్లు గౌరవపురస్సరముగా వానిని రావించి యాతఁడు చేసిన యుపన్యాసముల విని సంతసించెను. ఆదేశమునందు నాస్తికులుండుటచేత వారందఱు స్వామిని తమతమ సమాజములకు బిలిపించి యీశ్వరుఁడున్నాడని ఋజువుచేయుమని యాయన నడిగి యనేక విషమ ప్రశ్నలువేసి పెక్కుచిక్కులం బెట్టిరి. కాని యతఁడు వారి కాధారములయిన ప్రకృతి శాస్త్రముల చేతనే వారి నోళ్లడచి యీశ్వరాస్థిక్యమునుస్థాపించి యాసమాజములలో నెగ్గి వచ్చెనఁట. అమెరికాఖండమునం దతఁడున్న కాలములో కొందఱు నాస్థికులాస్థికు లయిరి. కొందఱు క్రైస్తవులు స్వమతముల విడిచి వివేకానందస్వామికి శిష్యులై తమ పూర్వనామములఁ గూడ మార్చుకొనిరి. ఒకదొరగారు యోగానందస్వామియని పేరుపెట్టుకొనిరి. ఒకదొరసాని తనతొల్లిటి పేరువిడిచి నివేదితయను పేరంబరగుచున్న యది. ఆమెయే హిందూదేశమునకు వచ్చి కలకత్తా కాశీ మొదలగు నగరములలో మన మతవిషయములగు నుపన్యాసములనిచ్చి కొన్ని గ్రంథములను గూడ రచియించినది.
వివేకానందుఁ డింక కొంతకాలము వఱకు జీవించియున్న పక్షమున నమెరికాలో కాలిఫోర్నియా యనుమండలమున నొక దేవా లయమును గట్టింపవలయునని సంకల్పించుకొనియె. ఇట్లమెరికా ఖండములో నతఁడు వేదాంతమునుగూర్చి రెండు సంవత్సరములు గొంతపనిచేసి స్వదేశమును జూడవలయునని బయలుదేరి ముందుగా సింహళద్వీపమునకు రాజధానియైన కొలంబో నగరమున దిగెను. ఆనగరమున నతఁడు దిగినాడనువార్త వినినది మొదలు మన దేశస్థులు జగత్ప్రసిద్ధిగాంచిన యామహాత్ముని దమతమ పట్టణముల కెప్పుడు రావించి వాని వాక్యామృతము నెప్పుడు గ్రోలుదుమాయని యువ్విళ్ళూరుచు వానిని గౌరవపూర్వకముగాఁ బిలిచిరి. వివేకానందస్వామి కొలంబోనుంచి బయలుదేరి పూర్వము తనకు సహాయము చేసి తన్నమెరికాఖండమునకు బంపిన చెన్నపురివాసులయెడ గృతజ్ఞుండయి వారిని జూడవచ్చెను. ఆసమయమున జెన్నపురివాసు లాయనకుఁ గావించిన మహాగౌరవముఁ జూచితీరవలయును; కాని వర్ణింప నలవికాదు. అతఁ డచ్చటఁ గొన్ని యుపన్యాసములనిచ్చి యనంతరము కలకత్తానగరమునకుఁ బోయెను. తమదేశములో నున్నంతకాలమాయన ప్రజ్ఞల నించుకయు నెఱుంగని బంగాళాదేశస్థులు విదేశములలో మిక్కిలి పేరువడసిన యాసన్యాసిని మిక్కిలి గౌరవించి వాని యుపన్యాసములవలన లాభము పొందిరి. పిమ్మట వివేకానందుఁడు బొంబాయి, అలహాబాదు మొదలగు ప్రదేశములకుఁ బోయి దాదాపుగ హిందూదేశ మంతయుఁ దిరిగి వేదాంతమత మందఱ కుపదేశించి యనంతర మింగ్లాండు దేశమునకుఁ బోయెను.
అక్కడ చతుర్వేదముల సారమును జూచిన వాఁడును శాస్త్రముల రహస్యమెఱిఁగినవాడును స్మృతుల ధర్మమును తెలిసినవాఁడును సంస్కృతభాష కూలంకూషముగ నేర్చినవాఁడును విద్యాసముద్రుఁడు నగు మాక్సుముల్లరు పండితుఁడు నివసించియుండుటచే వివేకానందు డామహాపురుషుని దర్శించుటకుఁ బోయెను. వేదాంతవిద్యాభిమానులగు నాపండితు లిరువురు నొండొరుల గౌగలించుకొని హిందూదేశమును గూర్చి చాలాసేపు ముచ్చటించి యొకదినము సంతోషమున గడపిరి. వివేకానందుఁడు మాక్సుముల్లర్ పండితునితో గలసి యాతనియింటనున్నపుడు మహర్షితో గలసి యొకయాశ్రమమున నున్నట్టె యున్నదని చెప్పెను. వివేకానందస్వామి యింగ్లాండులో నున్నపుడు తద్దేశస్థులు వాని యుపన్యాసములను మిక్కిలి శ్రద్ధతోను గౌరవముతోను వినిరి. వివేకానందస్వామికి సంఘసంస్కారమునం దిష్టము లేదనియు హిందువులందఱు పూర్వాచారప్రకారము తప్పక నడచుకొనవలసినదని యాయన యభిప్రాయ మనియుఁ గొందఱు చెప్పుచున్నారు. కాని వారి మాటలు సరికావు.
వివేకానందస్వామి తానుస్వల్పసంస్కారముల జేయువాడను కాననయు సంస్కర్తలకంటె నెక్కువసంస్కర్తననియు గొన్నికొన్ని యుపన్యాసములలో జెప్పెను. ఆయన చరిత్రమును జక్కగాపరీక్షించిన వారికి మొదటినుండియు నాయనసంస్కర్తయేయని తోఁచకమానదు. కలియుగమందు సన్యాసము బ్రాహ్మణులకే నిషిద్ధమని యున్నది. అట్లుండగా తాను బ్రాహ్మణేతరుఁడయ్యు వివేకానందస్వామి సన్యసించుటయే యొక సంస్కారము. అట్లుసన్యసించి సన్యాసి ధర్మముల నెఱపుచు కర్మభూమియగు భరతఖండమునందుండక మహాసముద్రము దాఁటి నౌకాయాత్రలు చేసి కర్మబాహ్యమునగు మ్లేచ్ఛదేశములకుఁ బోయి జాతిమత భేదములులేని క్రైస్తవులతోఁ గలసి మెలసి చిరకాలమునుండి వారిఇండ్ల భోజనములుచేసి మనవారి యభిప్రాయ ప్రకారముగ బ్రాహ్మణులకొక్కరికే యుపదేశింపఁబడఁదగిన వైదిక ధర్మములను బ్రహ్మవిద్యను ననార్యులగు మ్లేచ్ఛుల కుపదేశించి మనమతమునకు విరుద్ధముగా చరించిన వివేకానందస్వామి సంస్కారమునకు విరోధియని పలుకుట కేవలం హాస్యాస్పదముగాదా! ఆయనచేసిన యుపదేశమిది. "ఇంగ్లీషువారుచేయు చున్నారను కారణముచేతనే పని చేయవలదు. అది మంచిదేయైన పక్షమునఁ జేయవలయును. మనశాస్త్రములఁ జదువకుండ నిరాకరింపవద్దు. మన మతగ్రంథములన్నియుం జదివి యందులోనున్న మంచి గ్రహింపవలయును. మనశాస్త్రములలో దేశాభివృద్ధికి భంగకరములైన సంగతు లనేకములున్నవి. వానిని మంచివానిఁగ మార్చుకొని మనమభివృద్ధి పొందవలయును. మనమందఱము మూఢ విశ్వాసములోఁ బడియున్నారము. ఆమూఢ విశ్వాసము నశించినప్పుడుగాని దేశము బాగుపడదు. విదేశప్రయాణములు హిందువులందఱు యధేచ్ఛముగా చేసి యాయాదేశములందున్న క్రొత్త విద్యలు నేర్చుకొని మన దేశమును బాగుచేయవలసినదేకాని దేశమును విడిచిపోవుట తప్పుగాదు". ఈమొదలగు సంగతులే యతఁడు తన యుపన్యాసములలోఁ దరుచుగఁజెప్పుచు వచ్చెను. మతమునందు సంఘమునందు ననేకసంస్కారముల నాయన చేయన సంకల్పించెను. విదేశప్రయాణము మొదలగు సంస్కారములం దాయనకు మిక్కిలి యిష్టమని తెలియజేయుటకై యాయన జపాను దేశమునుండి వ్రాసిన జాబును యుపన్యాసములలో కొన్ని భాగముల నీక్రింద తెలిగించి యుదహరించుచున్నాము.
"జపానుదేశస్థులు ప్రస్తుతకాలమున కనుగుణముగా నడచుకొనుట యావశ్యకమని తెలిసికొనిరి. వారు తమ దేశస్థులలో నొకఁడు కనిపెట్టిన క్రొత్తరంగులతో సన్నాహముచేయఁబడిన యొక మహాసేనను సిద్ధముచేసియున్నారు. ఆ ఫిఱంగులు తక్కిన దేశముల వానికిఁ దీసిపోవు. అగ్గిపుల్లల యంత్రశాలలు చూచువారికి మిక్కిలి వినోదమును కలిగించుచున్నవి. జపానువారు ప్రతివస్తువును తమదేశమునందే చేసికొనుటకు ప్రయత్నించుచున్నారు. ఈకాలపు నాగరికత నిచ్చటి మతగురువులుకూడ నేర్చి యవలంబించినారు. జపానువారి గొప్పతనమంతయు నేనొక్కజాబులో వ్రాయఁజాలను. కాని మనవాండ్రలో పడుచువాండ్రు సంవత్సరమునకుఁ గొందఱు చొప్పున వచ్చి యీదేశమును జూతురుగాక యని కోరుచున్నాను. వారిట్లున్న వారు. మీరెట్లున్నవారు. యావజ్జీవము శుష్కప్రియములు పలుకుచు కాలము పాడుచేయుచున్నారు. ఒకమారువచ్చి యీదేశస్థులనుజూచి సిగ్గుపడి తలలువంచుకొనుఁడు. కూర్చుని ముసలివాండ్రవలె కదలలేక యిల్లువిడిచిన జాతిపోవునని భయపడుచున్నారా! వేయియేండ్లనుండి మూఢవిశ్వాసములో మునిఁగితేలుచు నీయన్నము ముట్టవచ్చునా యన్నము ముట్టఁగూడదను కుశ్శంకలతోఁ గాలమంతయు గడపుచు భూతదయనంతను జంపుకొని మీరిప్పుడున్నారు. చచ్చి చెడి పుస్తకములను వర్ణనవేసి పెద్దపరీక్షలయందుఁ దేరి యే కచ్చేరీలోనో ముప్పది రూపాయల గుమస్తాపనికి దేవులాడుటయో లేక ప్లీడరగుటయో మీపురుషార్థముగానున్నట్టు గాఁనబడుచున్నది. మీపుస్తకములను మీ బి. యే. గౌనులను మీ పట్టాలను మిమ్ములను ముంచివేయుటకు సముద్రములో నీరులేదా, రండి పౌరుషము దెచ్చుకొనుండి. మీకూపములు విడిచి బైటికి రండి. ఇతరజాతు లేవిధముగా మహాభి వృద్ధిని బొందుచున్నవో చూడుఁడి. వెనుకకుఁ జూడక ముందడుగే వేయుఁడి.
వివేకానందస్వామి వర్ణముల విషయమున నొక యుపన్యాసము సేయుచు నిట్లనియె. ఒకవర్ణమునకుఁ దక్కిన వర్ణములకంటె నెక్కువ యధికారము గౌరవమునిచ్చు దినములు గతించిపోయినవి. అవి మరల రావు. వానినగురించి మనము పోరాడుచున్న పక్షమున మనము క్రమ క్రమంబున బలహీనుల మగుదము. ఈ వర్ణవిషయమున మహమ్మదీయ మతముగూడ కొంతపనిజేసినది. మహమ్మదీయ పరిపాలన యధమ జాతులకును బీదలకును విముక్తి గలుగజేసినది. అందుచేతనే హిందువులలో నైదవవంతు జనులు తురకలైరి. ఇది యంతయుబలవంతముగా ఖడ్గముతోనే వారుచేసిరని మన మనరాదు. అట్లనుట కేవలము పిచ్చి. మనమేమియుసేయక యూరకున్న పక్షమున నీ చెన్నపురి రాజధానియందలి జనులలో సగము క్రైస్తవులగుదురు. నేను మలబారు జిల్లాలో నొకచిత్రమయిన యాచారమును చూచితిని. మాలవాఁడు బ్రాహ్మణులు నడచునట్టి దారిని నడువరాదు. ఆ మాలవాఁడే క్రైస్తవుఁడో మహమ్మదీయుఁడో యైనవచ్చినపుడు మనము వానిని స్పృశియించుటకయిన సందేహింపము. దీనినిబట్టి మనమేమి తెలిసికొనవలయును? ఆ మలబారులో నుండు వారందఱు పిచ్చివాండ్రనియు వారియిండ్లు పిచ్చివాండ్ర వైద్యాశాలలనియు గ్రహింపవలయును. ఇట్టి దురాచారములు గల జాతుల వారుండుట తలవంపులు గావా? శూద్రుఁడు వేదము విన్న పక్షమున వానిచెవిలో సీసము కరిగించి పోయవలయునఁట! వాఁడు వేదముచర్చించిన నాలుక కోయవలయునఁట ! ఇట్టి భయంకరవాక్యములుగల గ్రంథము లనేకములు మనపూర్వులు వ్రాసినవి వున్నవి. అట్లువ్రాసిన పాపాత్ములనేకులు ప్రతిస్థలమునందు ప్రతికాలమందు నుండుచువచ్చిరి.
ఈకాలమునందు వర్ణభేదములగూర్చి యెన్నో వివాదములు పొడముచున్నవని నేను విచారించుచున్నాను. ఇట్టివాదము లుండఁగూడదు. ఇవి యుభయులకు నందుముఖ్యముగ బ్రాహ్మణులకు మంచిదిగాదు. ఏలయన, అగ్రవర్ణములకుఁగల ప్రత్యేక గౌరవము లడుగంటినవి. కావున బ్రాహ్మణుఁడు తక్కిన వర్ణముల వృద్ధికొఱకు పాటుపడవలయును. అట్లు చేసినవాఁడు దానినెంతకాలము చేయునో యంతవఱకు బ్రాహ్మణుఁడు. అట్లుచేయక ధనార్జనముచేసి కొన్నవాఁడు బ్రాహ్మణుకాఁడు.
శూద్రులకు నేనొక్కమాట చెప్పుచున్నాను. మీరు తొందరపడక వేచియుండుఁడు. వంక దొరకినప్పుడల్ల బ్రాహ్మణులతో వివాదములాడవద్దు. ఏలయన యింతకాల మణగియుండుట మీలోపమే. బ్రహ్మవిద్యయు సంస్కృతమును మిమ్మెవరు నేర్చుకొనవద్దనిరి? ఇంతకాలము మీరేమిచేయుచుంటిరి? ఇన్నాళ్ళు సోమరులైయుండి యెవ్వరో మీకంటె నెక్కువ తెలివితేటలు నెక్కువ చాక చక్యము నెక్కువ యదృష్టము గలిగియున్నారని యిప్పుడు మొగము ముడుచుకొనిన నేమిలాభము? మీరు సంస్కృతము మొదలయినవి చదువుకొని బ్రాహ్మణులు గండు. మనమందఱ మొక్కయాలోచనమీఁద నడచినప్పుడు బలవంతుల మగుదుము. మరోనిశ్చయమే బలము. దీనికొక్క తార్కాణము చెప్పెద వినుఁడు. నాలుగుకోట్లమంది ఇంగ్లీషువారు ముప్పదికోట్ల మంది హిందువుల నెట్లు పరిపాలించు చున్నారు? ఆనాలుగుకోట్ల జనులు నొక్క యాలోచనపై నడుచు చున్నారు. అందుచే నపరిమితమైన బలము వారికిఁ గలిగినది. మీ ముప్పదికోట్ల జనులు నొకరొకొకరి సంబంధములేకుండ ముప్పదికోట్ల విధముల నడుచుచున్నారు. అందుకే మీగతి యిట్లున్నది.
వివేకానందుని గ్రంథములలో నిట్టిసంగతులనేకము లున్నవి. చోటుచాలమి నిచ్చట వ్రాయుటకు వీలులేదు. వివేకానందస్వామి యత్యంతమైన దేశాభిమానముగల సత్పురుషుఁడు. మనయార్యుల గొప్పతనమును మనమతముయొక్క ప్రాశస్త్యమును లోకమునకు వెల్లడిచేయవలయునని బాల్యమునందె సన్యసించి ఖండాంతరములకు బోయి చక్కగా పనిచేసెను. ఈయన సంకల్పములన్నియు నెరవేరకమున్నె మన దురదృష్టమున బాల్యమునందె పరలోకగతుడయ్యెను. ఈయన శిష్యులగు నభేదానందస్వామి శారదానందస్వామి మొదలగువారు వానిమార్గము ననుసరించియే పనిచేయుచున్నారు.