మహాపురుషుల జీవితములు/రామకృష్ణపరమహంస

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రామకృష్ణ పరమహంస

ప్రాపంచ భోగములపై నేవగలిగి బాల్యమునందె విరాగులయి యీశ్వరభక్తులయి జీవయాత్ర గడపిన మహాత్ములు పూర్వకాలమునందేగాక యిప్పటికిని హిందూదేశమున నక్కడక్కడ గనఁబడుచున్నారు. స్వామి దయానంద సరస్వతి, మహర్షి దేవేంద్రనాథ టాగూరు, బ్రహ్మానంద కేశవ చంద్రసేనుఁడు, రామకృష్ణ పరమహంస మొదలగు వారందుకు దృష్టాంతములుగ నున్నారు. అందు దయానంద సరస్వతి కొంత ప్రాఁతపద్ధతిని కొంత క్రొత్తపద్దతిని నవలంబించిన మహాత్ముఁడు. దేవేంద్రనాధుఁడును గేశవచంద్ర సేనుఁడును బూర్వ పద్ధతినుండి విడివడి కేవలము క్రొత్తపుంతనే త్రొక్కి జనసామాన్యమున కనిష్టమయిన మతము నవలంబించిన విరాగులు. రామకృష్ణ పరమహంస కేవలము ప్రాచీనమార్గము ననుసరించి పరమభక్తుఁ డయి దేశస్థుల కందఱకు నిష్టుఁడయిన మహాయోగి. ఈతనిచరిత్ర మనేకాద్భుతములతో నిండియుండును. అ యద్భుతములలోఁబెక్కింటి నీకాలపువారు నమ్మఁజాలరు. అయినను పరమ హంసయొక్క శిష్యులలో నగ్రగణ్యుఁడగు వివేకానంద స్వాములవారు వ్రాసిన చరిత్రమునుబట్టి మేము వానిజీవితము నిచ్చట సంగ్రహముగా వ్రాసెదము.

రామకృష్ణ పరమహంస 1833 వ సంవత్సరమున పిబ్రేవరు నెల 20 వ తేదీని బంగాళాదేశమున హుగ్లీ జిల్లాలోని కమర్ప కారనుగ్రామమున జన్మించెను. ఆతనితండ్రిపేరు ఖుదీరామచటోపాధ్యాయులు, తల్లి పేరు చంద్రమణిదేవి. ఆతని తలిదండ్రు లిద్దఱు యోగ్యతకు మిక్కిలి ప్రసిద్ధికెక్కి గ్రామస్థులందరిచేత గౌరవింపఁబడుచు వచ్చిరి. ఖుదీరామచటోపాధ్యాయుల సత్యనిత్యతను దైవభక్తిని దెలుపుటకు రెండుదా
Mahaapurushhula-jiivitamulu.pdf
రామకృష్ణ పరమహంస


హరణల లిచ్చుచున్నాము, అతఁడుపూర్వము 'దేరీ'యను గ్రామమునఁ గాపురముండువాఁడు ఆయూరి జమీందారుఁ డొకవిషయమునఁ దప్పుసాక్ష్యమిమ్మనియు నీయకుండిన వానిం చిక్కులఁబెట్టెద ననియు బెదరించినందున నతఁ డబద్ధమాడజాలక యాయూరు విడిచి కమర్పకారునకు వచ్చి తనజీవిత శేష మచ్చటనే గడెపెను. ఒకనాఁడతడు తనకూతుంజూచుటకు బయనమయి పోవుచుండగా మార్గమధ్యమున నప్పుడే క్రొత్తగా బయలుదేరిన దళములుగల యొకమారేడు చెట్టు గనఁబడెను. మారేడుదళములతో శివపూజసేయుట యతనికి మిక్కిలి ప్రియమగుటచేఁ బ్రయాణ మింకొకయప్పుడు సేయవచ్చును. ఈయదను దప్పిన బిల్వదళములు మఱియొకప్పుడు దొరకునా యని పయనమును గట్టిపెట్టి చెట్టెక్కి మారేడు దళములఁగోసి యొడినిండ వేసికొని వెనుకకుం జని యిల్లుచేరి మనసార శివపూజఁ జేసెను. అతనివద్ద వాక్సుద్ధి గలదనియు శుభముకాని యశుభముగాని యతఁ డన్నట్లు జరుగుననియు జనులు నమ్మిరి. చటోపాధ్యాయుఁడు యాత్ర నిమిత్తము గయకు బోయి యుండ నందు గదాధరుఁడగు శ్రీమహావిష్ణు వతనికిఁ గలలోఁ గనఁబడి వానికడుపునగొడుకయి పుట్టుదునని చెప్పెనట. అందుచే నతనికిఁ దండ్రి గదాధరుఁడను పేరుపెట్టెను. కాని యిటీవల నెందుచేతనో యతఁడు రామకృష్ణుఁ డనుపేరంబరగె

రామకృష్ణుఁ డాఱవయేటఁనే పురాణములుచెప్పెడివారియొద్దకుఁబోయి భారతభాగవత రామాయణాది కథల నెఱింగెను. ఆతని కంఠధ్వని మధురమయి గంభీరమైనది. గానమునం దించుకప్రవేశము గలుగుటచే నతఁడు శ్రావ్యముగఁబాడ గలవాడట. దేవాలయముల యందలి విగ్రహములు చక్కగాఁజెక్కఁబడినవో లేవో తెలిసికొనుట కతనికి సహజనైపుణ్యము గలదఁట. అతఁడు ఒక బాలుఁడయినను గ్రామమునందలి పెద్దలు చుట్టుపట్టవాండ్రు దేవతావిగ్రహముల


ముందువానికిఁజూపియతఁడు మెచ్చిన తరువాతనే ప్రతిష్ఠలఁజేయుచు వచ్చిరి. రామకృష్ణున కద్భుతమయిన జ్ఞాపకశక్తిగలదు. ఒకమారు భాగవతు లాయూరికివచ్చి జలక్రీడ లాడఁగా నాబాలుఁడది చూచి కథయంతయు జ్ఞాపకముపెట్టుకొని తరువాతఁ దోడిబాలురచే నాకథ యాడించెను. ఆయన వసియించు గ్రామము జగన్నాధక్షేత్రమునకు బోవుదారిలో నుండుటచేత యోగులు సాధువులు సన్యాసులు వచ్చి యాయూరిసత్రములో బసచేయుచుండిరి. అప్పుడు రామకృష్ణుఁడు వారియొద్దకుఁబోయి వారివల్ల ననేకాంశములంగ్రహింపుచువచ్చెను.

తనయూరి జమీందారుఁడు మృతినొందఁగా నుత్తరక్రియల సమయమున చుట్టుప్రక్కల పండితులనేకు లచ్చట చేరిరఁట. ఆసమయమున వారికి వేదాంత విషయమయి సందేహముదోప వారు చర్చలుచేయుచుండ బాలుఁడగు రామకృష్ణుఁ డక్కడకుఁబోయి సందియ మవలీలగాఁ దీర్చెనట. పండితు లందఱు వానిని మహానుభావుఁడని కొనియాడిరి. రామకృష్ణునిపెద్దయన్న రామకుమార చటోపాధ్యాయులు సంస్కృతమున పండితుఁడై కలకత్తాలోనొకపాఠశాల బెట్టెను. తండ్రి రామకృష్ణునకుఁ బదియాఱవయేట నుపనయనము చేసి చదువునిమిత్తము వానిని బెద్దకొడుకున కప్పగించెను రామకృష్ణు డాబడిలోఁ గొన్ని నాళ్ళు చదివి యెంతకాలము చదివినను నాలుగు రూకలు సంపాదించుటకు వినియోగించు విద్యలేగాని మోక్షసాధన మయిన చదువులేదని విసువుఁజెంది యాబడిలోఁ జదువుకొనుట మానెను.

1853 వ సంవత్సరమున కలకత్తానగరమున కైదుమైళ్ళదూరమున రాణిరాసమణియనుజమీందారురాలొకర్తు దక్షిణేశ్వరస్వామి యాలయమును గట్టించెను. ఇది హిందూదేశమున శ్రేష్ఠమయిన


కోవెలలో నొకటి. ఆయాలయమునకు రామకృష్ణునియన్న యర్చకుడుగా నేర్పడెను. ఆలయప్రతిష్ఠజరిగినదినమున నిరువది వేలమంది కన్నప్రదానము జరిగెను. గుడికట్టించిన యామె శూద్రస్త్రీ యగుటచే నామె కట్టించిన యాలయమున భుజించుట యశాస్త్రీయమని రామకృష్ణుడంత యన్నప్రదానము జరుగుచున్న యా యాలయమున భుజింపక సాయంకాలమువఱ కుపవాసముండి కొంచె మటుకులు కొని తిని రాత్రి కలకత్తాకుఁ బోయెను. తరువాతఁ గొన్ని నాళ్ళకు సోదరుఁడు వచ్చి తనవద్ద నుండుమని బ్రతిమాలుటచేఁ దవయన్నము తాను గంగయొడ్డున వేరే యొండుకొందునని చెప్పి యన్న నొప్పించి యతనితోఁ గలసియుండుటకుఁ బోయెను. అట్లు కొంతకాలము జరుగ సోదరునకు శరీరమునం దనారోగ్యము గలుగుటచే రాణి రాసమణి యొక్క యల్లుఁడగు మథురనాథుఁడు రామకృష్ణునే కోవెల కర్చకుఁడుగా నియమించెను.

అతఁ డాపనింబూని యనుదినమును దక్షిణేశ్వర స్వామిని శ్రీ కాళికా దేవినిఁ బూజించుచుండఁ గాళియం దత్యంతభక్తి యాతనికి నెలకొనియె. పూజానంతరమున రామకృష్ణుఁడు దేవీ విగ్రహమువద్ద గూర్చుండి కొడుకు తల్లియొద్ద మా రాముచేసి యడిగినట్లు 'అమ్మా ! పలుకవే నాగతియేమి చెప్పితివే' యని పిలుచుచు నెడ తెగక ప్రార్థించు చుండును. ఆదేవి తన మాతయనియు జగన్మాతయనియు నతఁడెంచుచు తాను నివేదన చేసిన యాహార మామె నిజము గాభక్షించుచున్న దనుకొనెను. ప్రార్థించుటయేగాని యాతఁ డెన్నఁడు రెండవపని చేయ కుండుటచేఁ వాని బంధుగు లతఁడు వెర్రిధోరణిలోఁ పడినాఁడని నమ్మి పెండ్లి చేసినచోఁ గొంతవఱకు దృష్టి మరలు ననుకొని వివాహముఁ దలపెట్టిరి. పెండ్లి చేయుటకుఁ దనవారుఁ దలపెట్ట నతఁడు తనకు రామచంద్రముఖోపాధ్యాయుఁడను నొక బ్రాహ్మణుని కూఁతురు శారదా


మఱిదేవి యను నుత్తమ బాలిక భార్యయగునట్లు విధింపఁబడిన దనియు వానియొద్దకుఁబోయి యడుగుమనియు దనవారితోఁ జెప్పెను. వారామాటల కద్భుతపడి వెంటనే ముఖోపాధ్యాయుని యొద్దకుఁ బోయి యడుగ నతఁ డంగీకరించి యైదేండ్లు వయస్సుగల తన కూఁతును వానికిచ్చి వివాహము చేసెను. వివాహ మయిన పిదప మరల రామకృష్ణుఁడు వచ్చి యాలయంబున నర్చకత్వము చేయఁ బూనెను.

వివాహము జరిగినదిగాని చుట్టము లనుకొన్నట్లు వాని మనోవైకల్యముమాత్ర మించుకయుఁ దగ్గక మఱింత హెచ్చెను. ఈపర్యాయ మతఁడు ప్రార్థనము సేయుటయె గాక యహోరాత్రము లోక్క మచ్చున నెడతెరపిలేక తల్లీ నాకుఁ బ్రత్యక్షము గావేమి యని పెద్ద పెట్టున నేడ్వసాగెను. ప్రతిదినము సాయంకాలమయిన తోడనే "అయ్యో! దల్లీ ! మరల నొకదినము గడచిపోయినది. ఇఁకఁ బ్రత్యక్ష మగుటయెన్నఁడే" యని విలపించును. చూచిన వారిలోఁ గొందఱు పిచ్చియెత్తినదనిరి. మఱికొంద ఱాయేడుపుఁ జూచి వానికి దారుణముగబాధ కలదనిరి. మధురనాథుఁడు నది రోగమే యనుకొని తగుచికిత్స చేయించుటకు గొప్పవైద్యులవద్దకుఁ దీసికొనిపోయి చూపెను. వైద్యు లెవ్వరు వానిరోగము కనుఁగొనఁ జాలరయిరి. తుదకొక మహావైద్యుఁడు వానికది రోగము కాదనియు నతఁడు మహాయోగి యనియుఁ జెప్పెను. అతఁ డొకప్పుడు భక్తిపారవశ్యముచేత దేవీకి సమర్పింపఁ దలఁచిన పూలదండలు తానే మెడలో వైచుకొనును. మధురనాథుఁడది మొట్టమొదటఁ జూచి వానిపైఁ గౌపించెను; కాని పిమ్మట వానిమహిమ నెఱిఁగి యూరకొనెను. రామకృష్ణుఁడు గుడిలో నర్చనసేయుటకు వీలులేని యవస్థలో నుండుటచే


నతని నాపనిలోనుండి తప్పించి మధురనాథుఁ డతని మేనయల్లుని నియమించెను.

ఇట్లుండ నెంతకాలమునకుఁ దనకు దేవి ప్రత్యక్షము కాలేదని నిరాశఁజెంది రామకృష్ణుఁడు మృతినొందఁ దలఁచుచుండఁగా నొడలు తెలియక పడిపోయెను. ఇది కొందఱు మూర్ఛయనుకొనిరి. కాని యది మూర్ఛగాక సమాధియయ్యెను. ఈసమాధిలో వానికి కాళికాదేవి ప్రత్యక్షమై వానిననుగ్రహించెను. అంతట నతఁడించుకయూరడిల్లియుండెను. అది మొద లతఁడు మరణమునొందువఱకుఁ బలుమారులు సమాధిప్రవేశముఁ జేయుచునే యుండెను. అతఁడు సమాధిలో నున్నపు డెంతఘనవైద్యులు వచ్చి చేయిచూచినను నాడి గనఁబడదయ్యె. ఈ యద్భుతమున కెవ్వరుఁ గారణముఁ జెప్పజాలరయిరి. సమాధిలోఁ దనకు దేవి తరుచుగాఁ బ్రసన్నురాలగుచుండుట నిజమో లేక తనమనోభ్రమయో యని యొక్కొక్కమారతఁడు సందియంపడుచు దానియదార్థ్యమును గనుంగొనుటకయి యదివఱ కెన్నఁడును జరుగని యొకకార్యము జరిగినచో దేవీప్రత్యక్షముమాట నమ్మెదనని యతఁడు దేవితోఁ చెప్పుచుండును. ఎట్లన రాణి రాసమణియొక్క కొమార్తె లిద్దఱు దమయంతఃపురము విడిచి యాలయము ముందు మఱ్ఱిచెట్టుక్రిందకు వచ్చి తనతో మాటలాడినచో దేవి ప్రత్యక్షమగుట నమ్మెదనని దేవితోఁ బలికెను. రాచమణికూఁతు లిద్ద ఱెన్నఁ డంతఃపురము విడువని గోషాస్త్రీలు అదివఱ కెన్నఁడాలయము త్రొక్కిచూచి యెఱుఁగరు. అది యేమి చిత్రమోకాని యాశుద్ధాంత కాంతలిద్దఱు గుడిచూచుటకుఁ దల్లి యనుమతి నంది యాలయమునకువచ్చి మఱ్ఱిచెట్టునీఁడ నున్న రామకృష్ణుని బలుకరించి "దేవి నిన్ననుగ్రహించెను. భయపడకు" మని


చెప్పిపోయిరి. ఈతెఱంగుననే యతఁడు కోరినట్లనేకాద్భుతములు దేవీ ప్రసాదమువలన జరుగుచు వచ్చెను.

ఇట్లు నిరంతరప్రార్థనములఁ జేయుచు సమాధులం బ్రవేశించుచు రామకృష్ణుఁడు పండ్రెండుసంవత్సరములు తపస్సు చేసెను. ఆకాలమునం దొకనాఁడు రాత్రియు నతనికి నిద్రలేదు. కన్నులు బలవంతముగా నతఁడుమూయఁదలచినను మూయఁబడవయ్యె, అప్పుడప్పు డతఁడు "దేవీ! నేను మృతినొందుదును గాఁబోలునని భయపడుచుండ నతనికి "వత్సా! శరీరమునం దభిమానము విడువ వేని నీకు ముక్తి యెట్లుగలుగు" నని యొకశబ్దము వినఁబడెను. ఒకమారతఁడు తల్లీ నేనీకిం చిజ్ఞు లగు మనుష్యులవద్ద చదువు నేర్చికొనను నీవే నేర్పుమని యడుగ "వత్సా! నేను నీకు నేర్పెదనులే" యని యొకమాట వానికి వినఁబడెను. అప్పుడప్పు డతఁడు సర్వసమానుడయి "నేను బ్రాహ్మణుఁడను గొప్పవాఁడను, తక్కినజాతులవా రల్పులను దురభిమానము నామనసునుండి తొలఁగింపు"మని దేవిని బ్రార్థించి వెంటనే తక్కువజాతివాండ్రగు సేవకులయిండ్లూడ్చి వారికి విధేయుఁడయి మెలఁగును. మఱియొకప్పు డతఁడొకచేత రూపాయిలను రెండవచేత చిల్ల పెంకులను బట్టుకొని గంగయొడ్డునఁ గూర్చుండి "ఇది ధనము దీనిచే బియ్యము పప్పు మొదలగువస్తు లన్నియు లభించును. దీని నందఱు గౌరవింతురు. ఇవి చిల్ల పెంకులు. వీని మొగ మెవ్వరుఁ జూడరు. నాకివి రెండు సమానములే"యని రెండును గలిసి గంగలో బారవేయును. ఒకనాఁడు రాసమణి యల్లుఁడు మథురనాథుఁడు పదునైదువందల రూపాయిలు విలువగల యొక గొప్ప శాలువ వానికిం గప్పెను. రామకృష్ణుడు మొదట దానికి సంతసించినట్లె కనఁబడి నాలుగు నిముసములలో నాశాలువందీసి


నేలపైవైచి కాలరాచి దానిపై నుమిసి "ఇది గర్వమును హెచ్చించును. దీనికన్న ప్రాతఁగుడ్డపేలికలు మే"లని దానితో నేలయూడ్చి పారవైచెను. ఆదినములలో నతనికి నిరంతరము శరీరమంతయుమంట లెత్తెచు వచ్చెను. అందుచేత నతఁడు గంగలోఁ గంఠములోతు నీళ్ళలో దిగి తరుచుగ నిలుచుచు వచ్చెను.

ఇట్లుండ నామహాత్మునియొద్ద కొకయోగిని వచ్చెను. ఆమె యూరెయ్యదియో యెవ్వరెఱుంగరు. ఆమె కనేకపురాణంబులు కంఠపాఠముగ వచ్చును. వాదములుచేసి యెంతెంతపండితులనైన నవలీలగ గెల్చెడు ప్రజ్ఞ గలది. ఒకయాఁడుది వచ్చి తనకుఁ గొంత విద్య నేర్పునని దేవిసమాధిలో నతనితో నొక్కమారు చెప్పెను. చెప్పిన చొప్పున దీర్ఘ కాయము స్ఫురద్రూపముగల యా యోగిని వచ్చి రామకృష్ణు నానవాలుపట్టి "నేను నీకొరకే వెదకుచున్నాను. కనఁబడితివా" యని వానిం బలుకరించి యాతనితోఁ గలిసి కొంత కాల మచ్చట నుండెను. రామకృష్ణుని శరీరమంతయు భగభగ మండుచుండుటచే నతఁడామెను కారణ మడుగ నామె భగవద్భక్తుల కందఱకు శరీర మట్లే మంటలెత్తు ననియు నిట్లే నాలుగువందల యేండ్లక్రిందట శ్రీచైతన్యునకును బూర్వకాలమున రాధాదేవికిని భగవంతునిపైఁ గల యనురాగముచే దేహతాపము గలిగె ననియును జెప్పి తనమాటలు సత్యములని ఋజువుచేయుటకు వైష్ణవ పురాణములందుప్పించి యందుఁబ్రమాణములం గనఁబరచి నమ్మించి రామకృష్ణునిమేన మంచిగంధము మూఁడుదినములు పూయించి పూలదండలు మెడనువేయించి యట్లే చైతనుని యొక్కయు రాధయొక్కయు తాపమడఁగెనని చెప్పెను. ఈశ్యైత్యోపచారముచే నద్భుతముగరామకృష్ణుని మేనుచల్లఁబడెను. ఈమంటలడఁగిన వెనుక నతనికిమితి లేనియాఁకలిబాధ కలిగెను. ఎంతయన్న మెన్ని మారులుతిన్న నతని


కాఁకలి యుపశమిల్ల దయ్యె. అప్పుడాయోగిని చైతన్యుఁడు రాధ మొదలగువారికిఁ గూడ నిట్లే వింతయాఁకలి కలిగెనని చెప్పి, కొన్ని గ్రంథ దృష్టాంతములఁ జూపి పలుపిండివంతలు కూరలు నన్నము కుప్పకుప్పలుగా నతనియెదుటఁ బెట్టించెను. రాసులకొలఁది పదార్థములఁ జూచుటచే నతనియాఁకలి క్రమక్రమంబుగ నుపశమిల్లి ప్రకృతిలోఁ బడెను. ఈయోగిని యతనికి యోగశాస్త్రము సమగ్రముగాఁ దానున్న కాలమున నేర్పెను.

ఇవ్విధంబున యోగిశాస్త్రమునఁ బరిపూర్ణుఁడై రామకృష్ణుఁడు వేదాంతము నభ్యసింపవలయునని తలంచుచుండఁగా నతనివద్దకు మహానుభావుఁడగు దిగంబర యోగి యొకఁడువచ్చెను. అతఁడుబీరెండ గాయునపుడును గొండ చిల్లివడ వానలు గురియునపుడును జెట్ల క్రిందనే కాని యిండ్ల తల దాఁచుకొనఁడు. ఊరబైటనేగాని గ్రామమున వసింపడు. పండ్లుపాలెగాని యన్నముతినడు. రామకృష్ణుఁడొకనాఁడు గంగయొడ్డునఁ గూర్చుండ నాయోగివచ్చి వానిని గుర్తెఱిఁగి బ్రహ్మజ్ఞానోపదేశము చేయవచ్చితినని చెప్పి యతనితోఁ గలిసి పదునొకండు మాసములుండెను. రామకృష్ణుఁడు సాటిలేని బుద్ధినిపుణత గలవాఁడగుటచే నాతఁ డుపదేశించిన బ్రహ్మవిద్య నతిస్వల్ప కాలమున నవలీలగా గ్రహించె. యోగి యాతనితెలివి కక్కజపడి "వత్సా! నేను నలువదియేండ్లుకష్టపడి నేర్చినదానిని నీవు నాలుగుదినములలో నేర్చితివి" యని యాదినము మొదలు వానిని శిష్యుఁడుగా నెంచక మిత్రుఁడుగా భావించెను. ఆయోగి తనవద్ద నిరంతరము నగ్నిహోత్రము నిలుపుకొని యదియె పరమపావనమని తలంచుచుండెను. ఒకనాఁ డాయగ్నిహోత్రమున నొకఁడు చుట్ట కాల్చుకొనపోగా యోగి తనయగ్ని మైలపడినదని వానిపైఁ గోపించెను. అప్పుడు రామకృష్ణపరమహంస యోగినిట్లని మందలించె. "అయ్యా! యీ


యగ్నియు దీనిని మైలపరచిన మనుష్యుఁడు పరబ్రహ్మస్వరూపములే కదా. నీకీభేదబుద్ధి యేలకలుగవలె? ఆపలుకులు విని యోగి పరమహంసతో "ఇఁకమీఁద నేనెన్నడు నెవరిపైఁ గోపపడ"నని తెలివిం దెచ్చుకొనియె.

రామకృష్ణుఁ డీవిధమున బ్రహ్మజ్ఞానమునేర్చి జ్ఞానమొక దారి నడత యొకదారి గాకుండ నద్వైతసిద్ధి నొంది పిమ్మట యోగాబ్యాసము చేయనారంభించెను. ప్రాణాయామముఁబట్టి యూపిరి బంధించి యాహారంబుఁ దినక యతఁ డొక్కకసారి కొన్నిదినములు గడపుచు వచ్చెను. ఆదినములలో నెక్కడనుండియో యొకసాధువువచ్చి యతనితోఁ గలిసియుండి ప్రాణాయామము బట్టినప్పు డాహారము లేమిచే నతఁడు మృతినొందునేమో యనుభయమున బలవంతముగ నాహారమును మింగించుటకుఁ బ్రయత్నించుచువచ్చెను. ఒకమారు రామకృష్ణున కెంతకు మెలఁకువ రానందున సాధువు దుడ్డుకఱ్ఱతో వానిం గట్టిగా కొట్టి మెలకువ దెప్పించి రెండు కబళములయన్నము నోట గ్రుక్కి బ్రతికించెను. ఈ తెఱంగున నాఱుమాసములు యోగాభ్యాస మగునప్పటికి రామకృష్ణున కాహార నిద్రాసుఖములు లేమి గ్రహణి రోగము సంభవించెను. ఈరోగము యోగమును మాన్పించి వానికి జాల మేలొనరించెను. స్వదేశ వైద్యులు వానిరోగము కొన్నిరోజులలో మాన్పిరి. ఆయభ్యాసముచేత సామాన్యయోగులకు దుర్లభమైన నిర్వికల్పక సమాధిని దాను బ్రవేశింపఁగలిగితిననియు దృఢమయిన మనస్సును శరీరమును గలిగియుండుటచేత తానట్టిసమాధిని ప్రవేశింప మరల బ్రతుకనయ్యెను. కాని సామాన్యులు బ్రతుకుట యరిదియనియు నతఁడిటీవల చెప్పుచువచ్చెను. ఆరోగ్యము కలిగిన నతఁడు వైష్ణవుల భక్తిమార్గము నవలంబింపవలయునని తలంచెను. వైష్ణవులు భగవంతు నైదువిధములుగా సేవింతురు. 1. సేవకులు యజమానుని గొలిచినట్లు 2. మిత్రులొండొరులఁ బ్రేమించునట్లు 3. తల్లిదండ్రులు బిడ్డలఁ బ్రేమించునట్లు 4. బిడ్డలు తలిదండ్రులఁ బ్రేమించునట్లు 5. భార్య భర్తను వలచునట్లు ఈయైదిఁంటిలోఁ గడపటి విధమే యుత్కృష్టమయిన దనియు నామార్గమునే పూర్వము గోపికలు రాధాదేవియు ననుసరించి ముక్తులైరనియు నమ్మి రామకృష్ణుఁడు కొన్ని దినములు స్త్రీ వేషముదాల్చి తాను భగవంతుని భార్యయగు రాధనని యెంచి తత్సంయోగమునకై పలుమారు ప్రార్థించెను. ఒకనాఁడు సమాధిలో నతనికి ముద్దుమొగముతో గోపాలకృష్ణదేవుఁడు సాక్షాత్కరించినందున నతఁడు గృతార్థుఁడయ్యె. రాధ పరమభాగవతోత్తమురాలనియు నామె గోపాలదేవునియందు వలపు నిలుపుట భక్తిచేతనేగాని సంభోగార్థము గాదనియు జ్ఞానవంతులేకాని పామరు లాగ్రంథములఁ జదువఁ గూడదనియు రామకృష్ణుని యభిప్రాయము. భక్తియోగమునందిట్లు సిద్ధిని గాంచిన పిదప నతఁడు మహమ్మదీయ పద్ధతి ప్రకారము కొన్నిదినములు భగవంతుని ధ్యానించెను. ఆవల క్రైస్తవసిద్ధాంత ప్రకారము కొన్ని దినము లీశ్వరుని సేవించెను. ఆదినములలో నతనికి యేసుక్రీస్తొకమారు కనఁబడి వానిని ధన్యునిజేసెను. రామకృష్ణుఁడేమత మవలంబింప దలఁచునప్పు డామతస్థుఁ డొకఁడతని వద్దకువచ్చి తద్రహస్యములన్ని యునతనికిఁజెప్పునఁట. అన్ని మతముల నవలంబించుటచే ప్రతిమతము మంచిదేయనియు నేమత మవలంబించినను మనుష్యులకు ముక్తిదొరకుననియు నొకొక్క మతమఖండ సచ్చిదానంద స్వరూపుండగు భగవంతుని గుణములు దెలుపుననియు నతఁడభిప్రాయపడెను.

అతఁడు సంకల్పసిద్ధుఁడని వాడుక. ఒకనాఁడాయన గంగయొడ్డునఁగూర్చుండి తనయోగాభ్యాసమున కనువుగా నొకకుటీరమునునిర్మిం


చుకొనఁ దలంచుచుండ నప్పు డద్భుతముగాఁ గొన్ని వెదుళ్ళు తాటియాకులు నార మొదలగు గుడిసెకు గావలసిన పరికరములు గొట్టుకొనివచ్చి వానికంటఁ బడెను. ఆపరికరముల నతఁడు వెంటనేగ్రహించి కొందఱు సేవకుల సాయమునఁ గుటీరము నిర్మించుకొనియె.

ఇవ్విధంబునఁ బరమయోగియై రామకృష్ణుఁడుండ నతనిభార్య పుట్టినింట నీడేరి పదునెనిమిదేండ్లు ప్రాయముగలదయ్యె తలిదండ్రులామెతో నీమగఁడు పిచ్చివాఁడయ్యె నమ్మా యనిరి. కొందఱు లోకులతఁడు పరమయోగియయ్యెనని చెప్పవిని శారాదామణిదేవి యట్టిమగని నొక్కసారి కన్నులారఁజూడ వేడుకపడి తల్లిదండ్రుల సెలవు పొంది వాని యొద్దకుం బోయి తన్నెఱిఁగించుకొనియె. రామకృష్ణుఁడామెనాదరించి యిట్లనియె. "పూర్వపు రామకృష్ణుఁడు మృతినొందినాఁడు. నేను క్రొత్తవాడను. లోకమునందలి యాడువాండ్రందఱు నాకెట్లు తల్లులో నీవునునాకు తల్లివిగాని భార్యవుగావు. "అని యామెపాదములకుమ్రొక్కి యాశీర్వదింపుమని ప్రార్థించి పువ్వులతోఁ బూజించి వెంటనే సమాధిగతుఁడై యొడలెఱుఁగకఁ బడియె. మగనికిం దెలివి వచ్చినపిదప నాయిల్లాలు "స్వామీ నేను మీతపమున కంతరాయము గలిగింపను. మీపాదసేవ సేయుచు నిచ్చటనే పడియుండెద. నాకందుకు సెలవి"మ్మని వేడిన నతఁడామె వేడికోలంగీకరించె. ఆమెయు భర్తవలెనే నిస్పృహ గలిగి విరాగియైయుండె. మధురనాథుఁ డొకనాఁడామెనుంబిలిచి "తల్లీ నీకు నేను పది వేల రూపాయలిచ్చెదను. నీవు బోయి సుఖముగా నుండుమనిచెప్ప శారదామణిదేవి నవ్వి "నాయనా! నాభర్త ధనము నిరాకరించియే మహాత్ముఁడయ్యె. నేనును వాని ననుసరించెద, నాకు ధనమెందు" కని నిరాకరించె.

అనంతరము కొన్నినాళ్ళకు మధురనాథుఁఁడు తీర్థయాత్రలకుఁ బోవుచు రామకృష్ణుని వెంటగొనిపోయి ఆయాత్రలలో రామకృష్ణుడు


కాశికిఁబోయి జగత్ప్రసిద్ధ సన్యాసియగు త్రైలింగస్వామిని సందర్శించి గోకులబృందావనమున గంగామాతయను మహాత్మురాలిని సేవించి ధన్యుఁడయ్యె. మరల వారింటికివచ్చుచున్న మధ్యమార్గమున నొక పల్లి యలో జనులు దారిద్ర్యమున బాధపడుచుండుటఁ జూచి పరమహంస వారిదైన్యమునకు వగచి యా యూరందరి నాదరించినఁ గాని నేనిచ్చటనుండి కదలనని కూర్చుండె. అప్పుడు మధురనాథుఁడు చాల సొమ్ము వెచ్చబెట్టి కొన్ని నాళ్ళన్నప్రదానము చేసి కట్టగుడ్డలిచ్చి యాదరించె ఈతడు పరమపావనుఁడు. వాని దర్శనము చేసినవారందఱు వెంటనే పవిత్రులగుదురు. అతని సాన్నిధ్యవిశేషమున కొందఱు సమాధిగతులయి యీశ్వరుని గనువారు కొందఱు తమ దురాలోచనల విడిచి యిండ్లకు నిష్కలుషచిత్తులయి పోయెడువారు. వేయేలఁ ఆయన నొకసారి చూచినపిదప జారులకు కాంతాసక్తియు లోబులకు ధనాసక్తియుఁ బోయెడునవి; ధనముపేరు చెప్పిన నతని కెంతరోతయో యీ క్రింది సంగతినిబట్టి తెలిసికొనవచ్చును.

వెండి బంగారునాణెముల నతఁడు స్పృశించినమాత్రమునఁ జేతులు గజగజ వణకును, చరమకాలమునం దతఁడు వెండి బంగారమునే గాక యినుమును సయితము తాకజాలఁడయ్యె. అతనివద్ద మహిమ లనేకములు కలవు? కాని ప్రజ్ఞం బ్రకటించుటకై యామహిమల నెన్నడు నతఁడు ప్రదర్శింపఁడయ్యె. ఆయన యాగతానాగతములను జెప్పఁగలఁడు. తన పరోక్షమున జరగు కార్యములఁ బేర్కొనఁగలఁడు. తన యెదుటనున్న వారి మనసులో యాలోచన యెరుఁగగలఁడని యనేకులు చెప్పుదురు. కొందఱు మనుష్యులు దేవగుణములతోఁడను గొందఱు మనుష్యులు రాక్షస గుణములతోడను జనింతురనియు నట్టివారిని జులకఁగ గనిపెట్టవచ్చుననియుఁ బూర్వజన్మమునఁ జక్రవర్తులై సకల సౌఖ్యములఁ దనివితీర ననుభవించినవా రీజన్మమున


విరాగులయి సన్యాసులగుదు రనియు నతఁడు చెప్పుచుండు. అనేక మహామహిమలుగల యీమహానుభావుఁడు కలకత్తానగరమున సమీపమందున్నను తత్పురవాసులు చాలకాలమువఱ కతని నెఱుఁగనే యెఱుఁగరు.

బ్రహ్మసమాజ మతాచారుఁడగు కేశవచంద్రసేనుఁడు పరమ భాగవతుఁడై యొకతోటలో విరాగియై ప్రొద్దులు పుచ్చు చున్న వాఁడని విని రామకృష్ణుఁడాతనిఁజూడఁ బోయెను. అదిమొదలు వారికిరువురకు దృఢమయిన స్నేహము గలిగెను. కేశవచంద్రసేనుఁడు రామకృష్ణుని ప్రభావమెఱిఁగి వాని నాశ్రయించి సందియము లడిగి తెలిసికొని పరమభక్తిచె నతని పాదములు తన కన్నుల నద్దుకొని పలుమారు వాని దర్శించి బ్రహ్మజ్ఞానవంతుఁడై తుదకాయన సిద్ధాంతము లన్నిఁటి నవలంబించెనని చెప్పుదురు. ఈచంద్రసేనుఁడు రామకృష్ణుని బోధలఁ గూర్చియు చిత్రచరిత్రలను గూర్చియు నొక గ్రంథమువ్రాసి ప్రకటించెను. ఆపుస్తకము బయలువెడలిన పిదప కలకత్తా పురజనులు రామకృష్ణు నెఱిఁగిరి. అది మొదలు కలకత్తానుండియు బంగాలా దేశమునుండియు జనులు వందలకొలఁది వచ్చి సందియము లడిగి యతనిచేత బోధితులై బోవుచు వచ్చిరి. అప్పు డతనికి యీశ్వరావేశము సయితము వచ్చువాడుకఁ గలదు. ఆ యావేశము లేనప్పుడు సేవకులకయిన విధేయుఁడుగ నుండినట్టి యా మాహాత్ముఁ డదివచ్చినతోడనే తాను భగవంతుఁ డనియు దనవంటివారు లేరనియు పూర్వము రాముఁడు కృష్ణుఁడు బుద్ధుఁడు యేసుక్రీస్తు మొదలగువారై పుట్టినది తానేయని చెప్పుచుండును. అతని బోధనలు విని యందఱు సంతసించి తృప్తినొందుచు వచ్చిరి.

ఈ పరమ హంసకు 1886 వ సంవత్సరమున గంఠమునగురుపు వైచెను. ప్రజలకు మతబోధ మానుమని వైద్యు లెంతచెప్పినను


వినక కంఠములోనుండి మాటవచ్చువఱ కతఁడు మతబోధ చేయదొడఁగెను. ఆరోగ్యము క్రమక్రమముగ వృద్ధియగుటచే రామకృష్ణ పరమహంస 1886 వ సంవత్సరమున ఆగష్టునెల 16 వ తేదిని రాత్రి యొంటిగంటకు యఖండ సచ్చిదానంద పరబ్రహ్మమును గలసిపోయెను.

ఇతఁడు శరీరమునం దభిమానము లేని మహాయోగి సార్థక నామముగల పరమహంస, నిజమయిన మహర్షి. ధనమును జిల్ల పెంకును సమానముగఁ జూచిన నిస్పృహుఁడు. చండాలుని యందును బ్రాహ్మణునియందును కుక్కయందును గోవునందును ప్రపంచమునందలి సమస్తపదార్థమునందును పరమాత్మ యున్నదని గ్రహించి తత్ప్రకారము నడచిన ఋజువర్తనుఁడు. మతవిషయమున నితనితో భిన్నాభిప్రాయములు గల పురుషుడు సయితము వాని సత్ప్రవర్తనకుఁ గడుంగడు మెచ్చి కొనియాడిరి. బంగాళీభాష దక్క సంస్కృతముగాని మఱియే యితరభాషగాని యతనికి రాకపోయినను దాని బోధనలం జదువునప్పు డతఁడు సకలశాస్త్ర సంపన్నుఁ డనుకొనవలసి వచ్చును. ఈపరమహంస సహజజ్ఞాని యని యనేకుల యభిప్రాయము.