Jump to content

మహాపురుషుల జీవితములు/కేశవచంద్ర సేనుడు

వికీసోర్స్ నుండి
కేశవచంద్ర సేనుడు

కేశవచంద్ర సేనుడు

కేశవచంద్రసేనుఁడు 1838 వ సంవత్సరమున నవంబరు 19 వ తారీఖునఁ గలకత్తా నగరమున జన్మించెను. అతనిపూర్వులు హుగ్లీ నదీతీరమున నున్న గరీఫాగ్రామమున వసియించెడివారు. ఈకుటుంబమువారు పూర్వము బంగాళమును బాలించిన సేనరాజుల సంతతిలోఁ చేరినవైద్యకులస్థులు ఈతనితాత యగు రామకమలసేనుఁడు స్వగ్రామమును విడిచి కలకత్తాకు వచ్చి మొదట నొకయచ్చుకూటములో నెనిమిదిరూకలు జీతముగల చిన్న యుద్యోగములోఁ జేరి క్రమక్రమమున తనబుద్దికుశలతచేతను స్వయంకృషి చేతను బాగుపడి నెలకు రెండువేలరూకలు జీతముగల బ్యాంకు దివానుపనిచేసి సుప్రసిద్ధుడై బంగాళా దేశమునం దంతటదనకుటుంబమునకు మహాఖ్యాతిఁదెచ్చెను. అతఁడు విద్యావిశారదుఁడయి యింగ్లీషు బంగాళి నిఘంటువు నొక దాని నొనరించి స్వభాషకు మహోపకారముఁ జేసెను. ఆయనకు నలుగురు కొడుకులుండిరి. వారిలో పేరీమోహనుడు రెండవ యతఁడు.

ఆ పేరీమోహనుఁడు కలకత్తా టంకశాలలోఁ కొంతకాలము దివానుగాఁబనిజేసి తనతండ్రి గతించినమూడేండ్లకు (అనగా 1848 వ సంవత్సరమున) కాలధర్మము నొందెను. ఆయన ముప్పదినాలుగేండ్ల చిన్న ప్రాయముననే మృతినొందినను జనులచే మంచివాఁడనుచు నెన్నఁబడుచువచ్చెను, మొత్తముమీఁద తనస్వప్రసిద్ధికన్న రామకమల సేనుని కొడుకగుట చేతను కేశవచంద్రసేనుని తండ్రి యగుట చేతను నధిక ప్రసిద్ధివచ్చెను. ఆయనకుమారులుముగ్గురిలో కేశవచంద్రసేనుఁడు మధ్యముఁడయి తండ్రిపోవునప్పటికి పదియేండ్లప్రాయము గలిగియుండెను. తండ్రిబాల్యమున గతించినను వానియదృష్టవశమునఁ దల్లి మిక్కిలి తెలివిగలదగుటచే నెక్కుడు జాగరూకతతో వానింబెంచెను.


కేశవచంద్రసేనుఁడు చిన్న తనమున నన్నియు మంచివస్తువులె కావలయు నని కోరి మంచిబట్టలు మంచిపెట్టెలు పుచ్చుకొని యవి యెవ్వరు ముట్టుకొనకుండ జాగ్రత్త పెట్టుకొనుచుండువాడు. అతఁడు స్వభావముచేతనే శాంతుఁడును సాధువునై దుశ్శీలము లేక చులకనగఁ గోపము దెచ్చుకొనక సౌమ్యుఁడయి యుండెను. కొంత కాలమింటివద్ద స్వభాష నేర్చుకొనినపిదప పదునొకండేండ్లప్రాయమున వానినింగ్లీషువిద్యనిమిత్తము హిందూకళాశాలకుఁ బంపిరి. విద్యార్థిగా నున్నపు డతఁడు మిక్కిలిపాటుపడుచు ప్రతి సంవత్సర పరీక్షాంతమున నొకటి రెండు బహుమానముల నందుకొనుచు 1850 సంవత్సరమునఁ బరీక్షలోఁ గృతకృత్యుఁడయి పెద్దగణితశాస్త్రగ్రంథము నొక దానిని బహుమానముగ బడసెను. అప్పటినుండియు వాని నెఱిఁగినవారు పెద్ద పుస్తకమును బుచ్చుకొన్న చిన్న పిల్ల వాఁడని చెప్పుకొనుచు వచ్చిరి. చిన్ననాఁట నితనియందుఁ బొడగట్టినబుద్ధిసూక్ష్మతను బరిశ్రమను సౌజన్యమును జూచి యితఁడు గొప్ప పరీక్షలం దేరు నని యొజ్జలు తలంచిరి; కాని వారికోరికలు కొనసాగినవికావు. ఏలయన 1852 వ సంవత్సరమున హిందూకళాశాలాధికారులకును దత్పోషకులకును వివాదములు పొడమినందున వేరొకకళాశాల యచ్చట స్థాపింపఁబడగాఁ గేశవచంద్రు డానూతనపాఠశాలకుఁ బోయి యా వఱకుఁ జదువుకొన్న దానికంటె పైతరగతిలోఁ జేరెను. రెండేండ్లలో నీక్రొత్తకళాశాలయెత్తి వేయఁ బడగాఁ గేశవుఁడు మరల హిందూకళాశాలకేవచ్చి చేరెను. ఈ మార్పులవలన విద్యాభంగము గలుగుటచే నతఁడటుమీఁదఁబెద్దపరీక్షలలోఁ దేఱఁజాలడయ్యె, అయినను తత్కళాశాలలో 1858 వ సంవత్సరమువఱకు నతడు విద్యాభ్యాసముచేసి చివర రెండేండ్లలోఁ


దర్క వేదాంతశాస్త్రములలో గట్టికృషిచేసెను. ఇంగ్లీషుకవులలో వానికి షేక్స్పియరు, మిల్టనుకవులపై నెక్కువ యభిమానము.

చిన్న తనమునుండియు వానికి దైవప్రార్థనమువలన లాభము గలదని గట్టినమ్మకముండెను. మొదటినుండియు నితనికి క్రైస్తవమత బోధకులతోఁ బరిచయ మెక్కుడుగఁగలదు. వారి సహాయమునను దక్కిన మిత్రుల బ్రోత్సాహమునను నితఁడు 'బ్రిటిషు యిండియా సంఘ' మనుపేర నొకసమాజమును నాంగ్లేయభాషాభివృద్ధికొఱకును ప్రకృతిశాస్త్రజ్ఞాన సంపాదనకొఱకును స్థాపించెను. ఇదిగాక జ్ఞానాభివృద్ధి కొఱకు యింక నెన్నియో సమాజములను సంఘములను స్థాపించెను. 1855 వ సంవత్సరమునఁ జంద్రసేనుఁడు సాయంకాల పాఠశాల నేర్పరచి యక్కడకు వచ్చువారికి నీతులుగూర్చియు మతముంగూర్చియు నింగ్లీషుభాషలోని గొప్పగొప్ప సంగతులు గూర్చియు నుపన్యసించుచువచ్చెను. అతనికి షేక్స్పియరు వ్రాసిన నాటకములపైఁగల యభిమానముచే వానిం బ్రయోగించునిమిత్త మొక నాటకసంఘ మేర్పరచి వానిలోఁ దానుగూడ నుత్తమ పాత్రలఁ గయికొని జనరంజకముగ నభినయించెనని చెప్పుదురు. సాయంకాల పాఠశాల మూడునాలుగేండ్లలో నంతరించఁగాఁ గేశవుఁడు వేదాంత చర్చలు సలిపి ప్రార్థనాదికములు సలుపుటకు 'పరస్పర భ్రాతృభావసమాజము' (GOOD WILL FRATERNITY) నేర్పరచెను. ఆసమాజమునఁ బలుమారు కేశవుఁడు పరమేశ్వరుఁడు మన కెల్లరకుఁ దండ్రియనియు మనుజులందఱు సోదరులనియు నింగ్లీషున బోధించుచు వచ్చెను. ఆసంవత్సరమందే కేశవచంద్రసేనుఁడు బ్రహ్మసమాజ మతమందుఁ జేరి తత్ప్రతిజ్ఞాపత్రికలమీఁద సంతకముఁ జేసెను. అందుతాను జేరిన విషయమునుగూర్చి యతఁడిట్లు వ్రాసియున్నాఁడు. "దేశమునం దిప్పుడున్న తెగలు, దేవాలయములు మొదలగు వానిపై నమ్మకములేక మంచిమత మేదని నేను విచారించుచున్న సమయమునఁ గలకత్తాబ్రహ్మసమాజ గ్రంథ మొకటి నాచేఁబడెను. అందు 'బ్రహ్మసమాజమన నేమి' యను ప్రకరణమును జదువఁగా నది నామనస్సునం దున్న మతమునకు సరిపడియె. ప్రపంచమునందలి యేగ్రంథముగాని యాత్మావబోధమునకు సరిరాదనియు భగవంతుఁ డంతరాత్మకు స్వయముగ గోచరుఁడగునపుడు వెలుపలనుండు నుప దేష్టలతోఁ బని లేదనియుఁ బ్రతిమనుష్యుఁడు నాత్మైక వేద్యుఁ డగు నాపరబ్రహ్మమునకే మ్రొక్కవలయుఁగాని తదన్యవస్తువులకు మ్రొక్కఁ గూడదనియు నాయభిప్రాయము. అట్లు తోఁచినతోడనే నేను హిందూ దేశమునఁ బరిశుద్ధాస్థిక మతమును బోధించు బ్రహ్మసమాజమునఁ జేరితిని."

1859 వ సంవత్సరమున బ్రహ్మమతపాఠశాల స్థాపింపఁబడఁగాఁ గేశవచంద్రుఁడు దేవేంద్రనాథునితోఁ గలసి భగవదాస్తిక్యమునుగూర్చి వరుసఁగాఁ కొన్ని యుపన్యాసముల నిచ్చెను. అటు పిమ్మట నతఁడు తనచేత నిదివఱకు స్థాపితమయిన నాటక సంఘముచే విధవావివాహ మను నాటకమును బ్రయోగింపఁ జేసెను. అది ప్రదర్శింపఁబడినప్పుడు పౌరులనేకులు వచ్చినందున నగరమం దంతట పెద్ద సంక్షోభము కలిగెను.

కేశవుని బంధువులు వాని నేఁదైన దగిన యుద్యోగములోఁ ప్రవేశపెట్టఁదలఁచి యతని కిఱువది రూకలజీతము గల గుమస్తా పనిని బంగాళాబ్యాంకులో నిప్పించిరి. ఒకసంవత్సరములోనే వాని జీతము ద్విగుణమయి యింకనువృద్ధిపొందునట్లు గనిపించెను. ఇట్లుండ బ్యాంకుపై యధికారి యగుదొర తనబ్యాంకు సంబంధమగు నేసంగతులును క్రింది యుద్యోగస్థు లెవ్వరికిఁ జెప్పఁగూడదని యానతిచ్చి

యానిబంధన కొడంబడినట్లందఱు నొక కాగితముపై వ్రాలు చేయవలయునని యాజ్ఞాపించెను. ఉద్యోగస్థులలోఁ బెద్దలు చిన్నలు నిస్సంశయముగ వ్రాలుచేసినను గేశవచంద్రుడు సంతకముఁ జేయఁడయ్యె. ఆదొర యీమాటవిని మండిపడి వానిం దనవద్దకుఁ బిలిపించె. ఆయధికారి చండశాసనుఁడగుటచే కచేరీవారందఱుఁ గేశవచంద్రునిపని యేమగునోయని గడగడ వడంగఁజొచ్చిరి. దొరవానిం బిలిచి యేలవ్రాలు చేయవైతివని యడుగఁ జంద్రసేనుఁడు సింగపుఁ బిల్ల వలె వానియెదుట నిలిచి యిట్లనియె. 'ఇతరులతో నేసంగతులు చెప్పదగినవో యేర్పరుపక మీరు వ్రాలు చేయమనుట మంచిది కాదు. ఏసంగతులు చెప్పకుండుట యసాధ్యము. వ్రాలుచేసిన పిదప ప్రతిజ్ఞఁదప్పుట యనుచితమని నేను మొదటనే సంతకము చేయనైతిని." ఆమాటలువిని దొర వానిపరిశుద్ధ మనస్సునకును సత్యమునందలి గౌరవమునకు సంతసించి శిక్షించుటకుమారు మెచ్చుకొని పంపి యది మొదలు అతనియందు మిక్కిలి గౌరవమును దయయును జూపుచువచ్చెను. అయినను 1861 వ సంవత్సరమున నతఁడాయుద్యోగమును మానుకొనెను. పిమ్మట కొన్ని మాసములు తప్ప తక్కిన జీవిత కాలమంతయు బ్రహ్మసమాజ మతబోధనమందె గడపెను. బంధువుల ప్రోద్బలముచే నతఁ డాయుద్యోగమునఁ జేరెను. కాని మొదటినుండియు వాని మనస్సున నీసత్కార్యముఁ జేయవలయు ననియే తలంపుండెను.

1860 వ సంవత్సరమునం దాయన "బంగాళ దేశపు బాలకులారా ! ఇదిమీనిమిత్తమే" యను శీర్షికగల చిన్నగ్రంథము నొక దానిం బ్రకటించి దాని వెనువెంటనే యట్టి గ్రంథముల మఱీ పండ్రెండింటిని గూడ బ్రచురించెను. ఆసంవత్సరముననే యతఁడు మతబోధన నిమిత్తము ప్రప్రథమమునఁ గృష్ణనగరునకుఁ బోయెను.


ఆయన యక్కడ క్రైస్తవ మతబోధకులతో వాదముసలిపి వారి నోడించినందున నచ్చటి పండితులందఱుఁ దమ మతమున నిలిపిన మహాత్ముఁడని వానిం గొనియాడిరి. పిదప దేవేంద్రనాధుఁడు సకుటుంబముగా సింహళద్వీపమునకు నావికాయాత్రజేయఁ గేశవచంద్రుడుఁ తనవారికిఁ దెలియకుండగనే వారితోఁ బయనమయి పోయెను. ఆ పయనమునందె వారి కిరువురకును మైత్రి యధికమయ్యెను. అచ్చటి నుండి వచ్చిన పిదప సంగీతసేవ లనుపేర కలకత్తానగరమున భజన సమాజము లేర్పరచి యతఁడచ్చట మతచర్చలు సేయుచువచ్చెను. 1861 వ సంవత్సరమున హిందూ దేశదర్పణమని యర్థమువచ్చు 'ఇండియను మిర్ర' రను పత్రికను కొందఱు మిత్రుల సాయమున బయలుదేరదీసి పక్షమున కొకసారి ప్రకటించుచు వచ్చెను. ఈపత్రిక క్రమంబున దినపత్రికయై కేశవ చంద్రసేనుని పెదతండ్రి కుమారుడగు నరేంద్రనాథసేనుగారిచే నిప్పటికిని కలకత్తా నగరమున మిక్కిలి ప్రసిద్ధముగఁ బ్రకటింపఁ బడుచున్నది. మరుసటి సంవత్సరమున నతఁడు దేవేంద్రనాథుని సాయమునఁ గలకత్తాగళాశాలను స్థాపించి యందు తాను నీతిని గూర్చియుఁ బరిశుద్ధాస్తిక మతమును గూర్చియు బోధించుచు వచ్చెను.

1862 వ సంవత్సరమందే దేవేంద్రనాథుఁడు కేశవ చంద్రసేనుని బ్రహ్మసమాజ మతమునకు బ్రధానాచార్యునిగ నేర్పరచి యొక పెద్ద సభఁజేసి యందతని నభిషిక్తుఁజేసెను. ఆ యుత్సవము మహావైభవముతో నిర్వర్తింపఁబడినది. ఆ యభిషేక సమయమునఁ గేశవ చంద్రుడు తనభార్యను సభకు రమ్మని పిలువ జుట్టములందఱు నట్టిపని వలనుపడదని పెద్దపెట్టున గోలపెట్టిరి. అయిన నతఁడు పట్టిన పట్టు వదలక తనభార్యను సభకుం దీసికొనిపోయెను. వెంటనే తత్ఫలముగ సోదరులును పెదతండ్రియు వాని నింటికి రానీయక బహిష్కరిం చిరి; కాని కేశవచంద్రునకు దేవేంద్రనాథ మహర్షి తనయింట బస యిచ్చి యాదరించి వెల్తి లేకుండజేసె. అది మొదలు బ్రహ్మసమాజ మతస్థులకు భార్యలు సహచారిణులుగ నుండి సభలకు వచ్చి ప్రాముఖ్యతను గాంచుచు వచ్చిరి. కాలక్రమమున సఖ్యతకుదురఁ గేశవచంద్రుఁడు పితృగృహము బ్రవేశించుటకుఁ బెద్దలు సమ్మతించిరి.

అనంతరము కేశవచంద్రసేనుఁడు స్వమతబోధనమునకై బొంబాయి చెన్న పట్టణము మొదలగు మహానగరములకుఁ బోయెను. ఆస్థలములయం దతని కమిత గౌరవము జరిగెను. ఆ పురములయందు బ్రహ్మసమాజమతము స్థాపింపబడియె అక్కడనుండి యాతడు కలకత్తాకు వచ్చిన పిదప దేవేంద్రనాథునకును గేశవచంద్రునకును నభిప్రాయ భేదములుగలిగి యవి తుదకు వివాదముగ బరిణమించెను. ఆభేదకారణ మిది. కేశవచంద్రునకు స్త్రీపునర్వివాహములు సలుపుట నన్యజాతులతోడి వివాహసంబంధములు చేయుట న్యాయమనియు కర్తవ్యమనియుఁ దోఁచ వానికి బ్రోత్సాహము చేసెను. దేవేంద్రనాథున కీరెండును బొత్తుగఁ గిట్టవు. అంతియ కాక కేశవచంద్రుఁడు బ్రహ్మమతస్థులు యజ్ఞోపవీతము ధరింపఁగూడదనియు నది తీసి వేయవలయుననియు పట్టు బట్టెను. కాని దేవేంద్రనాథుఁడేమార్పును లేశము నంగీకరింపడయ్యె. ఈవివాదములు క్రమక్రమముగ వృద్ధినొంద కేశవచంద్రుడును వాని మిత్రులు కొందఱును 1866 సంవత్సరమున నాది బ్రహ్మసమాజము నుండి విడిపోయి 11 వ నవంబరు 1866 వ సంవత్సరమున తమ సమాజమునకు హిందూ దేశ బ్రహ్మసమాజమని పేరుపెట్టి యంతటి నుండియుఁ దామునమ్మిన యామతమును బోధింప నారంభించిరి. ఆయేడు మార్చినెలలో నతఁడు యేసుక్రీస్తు జీవితమును గూర్చి యద్భుతమగు నుపన్యాసమునుఁజేసి యం దేసుక్రీస్తుయొక్క సద్గుణములు గొనియాడి యతఁడు సామాన్య మనుష్యునివంటి వాఁడుగాక దివ్యపురుషుఁడని


యొప్పుకొనెను. ఈయుపన్యాసములు కలకత్తలో సంక్షోభమును గలిగించెను. కేశవుఁడు కొద్దికాలములో తన మతమునఁ గలియునని క్రైస్తవులు తలంచి యుప్పొంగిరి. అతఁడు క్రైస్తవుఁడై మతభ్రష్టు డగుచున్నాడని హిందువులు నిందించిరి. కాని యచిర కాలములోనే యతఁడు చేసిన మఱియొక యుపన్యాసములో యేసుక్రీస్తు దక్కిన మతోద్ధారకుల తోటిపాటివాఁడేగాని యంతకంటె నెక్కువవాఁడు గాఁడని చెప్పినప్పుడు క్రైస్తవులు తెల్లబోవుటయు హిందువులు సంతసించుటయు సంభవించెను. పిమ్మట కేశవచంద్రుడు మతబోధ సేయుటకై తూర్పు బంగాళాదేశమంతయుఁ దిరుగ పూర్వాచార ప్రియులగు పండితజనుల కతనియందుఁ గలిగిన గౌరవమునుజూచి తమ మతమును గాపాడుకొనఁ జొచ్చిరి. ఆప్రదేశమునుండి వచ్చిన పిదప బ్రహ్మమతస్థులీశ్వరో పాసనముఁ జేయుటకుఁ దగిన తావు లేకుండుటఁ జూచి 1866 వ సంవత్సరమున 24 వ జనేవరు దినమున బ్రహ్మ మందిరము నిర్మించుటకు శంఖుస్థాపన చేయించెను.

ఇది కట్టించిన వెనుక నతనియొడ జనులకు గౌరవమధికమయ్యె, తరువాత రెండుమాసములకు బ్రయాగ, బొంబాయి మొదలగు ననేక నగరముల కరిగి సంఘమత సంస్కారములఁగూర్చి వినువారి మనస్సులు పరవశములగు నట్లుపన్యసించి మాన్ఘీరు నగరమును జేరెను. ఇక్కడనుండగా నితఁడు బ్రహ్మమతములో గొప్పమార్పును దెచ్చి పెట్టెను. ఇంతవరకు బ్రహ్మమతస్థులు సాధారణముగ బ్రార్థనము చేసితమలోదాము భగవధ్యానము చేసికొనుటయే కాని యుత్సవము లెఱుఁగరు.

అది మొదలు బ్రహ్మమతస్థులు పాటలు పాడుచు భజనలు సేయుచు నగరమున నుత్సవములు చేసి జనసామాన్యమున కీమతముపై నిష్టమును భక్తియుఁ గలుగునట్లు చేసిరి. ఇందుచేఁ గేశవుని


యెడల జనుల కనురాగ మతిశయమై యాయనురాగము భక్తిగాఁ బరిణమించి తుదకు వానిని భగవంతుఁడని జనులు పూజించు నంత వఱకు వచ్చెను. కేశవ చంద్రునియందు జనులకాకస్మికముగఁ గలిగిన యాయమిత గౌరవము భక్తియు వాని యనుచరులకే కొందఱకు వానిపై ద్వేషమును గలిగించును. నాడు మొదలు వాని యనుచరులు రెండు కక్షలుగా నేర్పడి యొక తెగవారాతనిని భక్తిశ్రద్ధలతోఁ బూజించుటయు రెండవ తెగ వారాతను చేష్టల ననుమానించి యట్టి బూజల కనర్హుఁడని చెప్పుటయు సంభవించెను.

హిందూ దేశమున కప్పటి గవర్నరుగారగు లారెన్సు ప్రభువుగారితో కేశవచంద్రుని కప్పటి కొక్క సంవత్సరముక్రిందట పరిచయము గలిగెను. అందుచే నితఁడు మాన్ఘీరులో నుండఁగా నా ప్రభువు సిమ్లా నగరమునకు రమ్మని వానిని సన్మార్గపూర్వకముగ పిలువ నక్కడ కరిగెను. ఆ కాలమున రాజ ప్రతినిధిగారితో మాట లాడి ఇతఁడు బ్రహ్మమతస్థుల వివాహములను శాస్త్రీయములుగఁ జేయుటకొకశాసనమును నిర్మించుట యావశ్యకమని కనఁబరిచెను. గవర్నరుజనరలుగారు కేశవచంద్రుని యాలోచన మంచిదని యొప్పు కొని యట్టిశాసనము నొక దానిని నిర్మింపఁ బూనుకొనెను. తరువాత నతఁడు కలకత్తాకువచ్చి బ్రహ్మమందిర నిర్మాణమును వేవేగ ముగించి 1869 వ సంవత్సరము 7 వ ఆగష్టున తద్గృహప్రవేశోత్సవమును జేసెను.

1870 వ సంవత్సరము ఫిబ్రేవరు 15 వ తారీఖున కేశవచంద్రుఁ డింగ్లాండుదేశమునకు బ్రయాణమైపోయి 21 వ మార్చిని లండనునగరముచేరి యక్కడ నున్న లారన్సు ప్రభువుగారివలనను మఱికొందఱి వలనను సగౌరవముగ నాదరింపఁబడెను. ఆయన యేపట్టణమునకుఁ బోయిన నాపట్టణమున జనులందఱు వానినమిత గౌరవముచేసి మిక్కిలి


ఉత్సాహముతో వాని ఉపన్యాసముల వినిరి. అతఁడా దేశమున పదునాలుగు ముఖ్యపట్టణములకుం బోయి యచ్చటి జనులకు వీనుల విందుగా మతము వేదాంతము నీతి హిందూదేశ పరిపాలనము మొదలగు నంశముల గూర్చి మహోపన్యాసముల నిచ్చి యందఱిచేతఁ గొనియాడఁ బడియె. అతని కీర్తి విని యాంగ్లేయ తత్వశాస్త్రజ్ఞుఁ డగు మిల్లుదొరయు సంస్కృతపండితశిఖామణియు వేదాంగ వేద్యుడు నగు మాక్సుమల్లరు దొరయు మఱియు ననేకులు వాని దర్శనము చేసి సంతుష్టాంతరంగులైరి. ఇంగ్లాండు దేశపు మంత్రులలో నగ్రగణ్యులగు 'గ్లాడుస్టను' గారిని 'డిసురైలి' గారిని జూచి కేశవచంద్రుఁడు వారితో మన దేశ వ్యవహారములను గూర్చి ప్రసంగించెను. ఆదేశమందంతట నతని యశము వ్యాపించుటచే నలువది పట్టణముల సమాజములవారు తమయూళ్ళువచ్చి యుపన్యాసము లిమ్మని వానిం బ్రార్థించిరి. కాని తీరిక లేమి యతఁడు వారి యభిలాషఁ దీర్ప జాలఁడయ్యె. మొత్తముమీద నతఁడక్కడ నున్న కాలములో రమారమి డెబ్బది సభలలో మాటలాడి నలువదివేల జనుల కుపన్యసించెను.

ఈగౌరవము లన్నిఁటికంటె వేయిరెట్లెక్కువ గౌరవమువానికి జరిగెను. ధర్మస్వరూపిణియుఁ గాంతాజనమతల్లియు భరతఖండ ప్రజలకుఁ దల్లియు నగు శ్రీ విక్టోరియా రాణీగారితనికి దర్శనమిచ్చి సంభాషించి వాని ప్రతిబింబమును వానిభార్య ప్రతిబింబమును (ఫొటోగ్రాపు) వారి వలనం గ్రహించి తన ప్రతిబింబమును తనభర్త యగు నాల్బర్టుప్రభువువారి ప్రతిబింబమును వానికిచ్చి గౌరవించెను. కేశవచంద్రసేనుని గౌరవించుటకు 'మిస్‌కార్పెంటరు' యను నామె బ్రిష్టలునగరమున హిందూదేశ క్షేమకరములైన ప్రసంగములు చేయుటకు 'నేషనల్ ఇండియన్ అస్సోసియేష' ననుపేర నొ


సమాజము నేర్పరచెను. బ్రిష్టలు నగరమున కతఁడు పోయినప్పు డప్పటికి రమారమి నలువదేండ్ల క్రిందట స్వదేశమువిడిచి యింగ్లాండునకు బోయి దేశొపకారార్థమై ప్రాణములు విడిచి కీర్తి శేసుఁడైన రాజరామమోహనరాయల సమాధిని జూడఁబోయి మృత జీవుఁడైన యామహాత్ముని యందలి గౌరవముచే మోకాళ్ళపయిం బడి నమస్కరించి యాబ్రహ్మసమాజ స్థాపనాచార్యుని యాత్మకు మోక్ష మొసంగుమని భగవంతుని బ్రార్థించెను. బాల్యమునుండియు నితనికి కవికులసార్వభౌముఁడగు షేక్స్పియరుమీద నత్యంతాభిమాన ముండుటచే నాతనిజన్మస్థానముఁజూడ నభిలాషకలుగ 'నావను'నది మీదనున్న స్ట్రాటుఫరుడు గ్రామమునకుఁ బోయి యాతఁడు కాపుర ముండిన కుటీరమును వానిపుట్టిన చిన్న గదియు నతఁడు నాటకములు వ్రాసికొన్న బల్లయుఁ జూచి సంతసించి పిమ్మట నాతని సమాధి యొద్దకుఁబోయి ముప్పదియెనిమిది నాటకములు రచియించి నాగరికులగు సకల జగజ్జనులచేఁ కొనియాడఁబడు నాకవిరాజు నుద్దేశించి వినయమున నమస్కరించి తనకుఁ గల గౌరవమును వెల్లడించెను.

అనంతర మతఁ డింగ్లండు దేశమునుండి 1870 వ సంవత్సరము సెప్టెంబరు 17 వ తేదీని బయలుదేరి అక్టోబరు 15 వ తేదీని బొంబాయి నగరముఁ జేరెను. చేరినతోడనే యచ్చటి జనులతని కపూర్వమయిన గౌరవముఁ జేసిరి. అచ్చటినుండి యతఁడు కలకత్తానగరమునకుఁ బోవ స్వదేశస్థులందఱు బొంబాయి నగరమునందు జరిగిన యుత్సవముకంటె గొప్ప యుత్సవముఁ జేసి వానిని సన్మానించిరి. ఇంగ్లాండునుండి వచ్చిన స్వల్ప కాలములోనే కేశవచంద్రుఁడు మన దేశస్థుల సంఘవృద్ధికి నీతివృద్ధికిన్నీ హిందూసంస్కరణ సమాజము నొకదానిని నేర్పరచెను. ఆసంస్కార మీక్రింది యైదువిధములుగఁ జేయుటకుఁ బ్రారంభించెను. జ్ఞానము బీదలకు సయితము గలుగు


టకు గ్రంథముల వ్రాసి తక్కువ వెలకు వానినమ్ముట. 2. తగిన వారికి దానము చేయుట. 3 స్త్రీల యభివృద్ధికయి పాటుపడుట. 4. దేశమునందంతట విద్య వ్యాపింపఁ జేయుట 5 మద్యపానాది దురాచారములు దేశమునఁ బ్రబలకుండునట్లు పనిచేయుట. ధన హీనులకుఁ దక్కువవెలకుఁ బత్రిక లందజేయవలయునను తలంపుతో సులభ సమాచార మనుపేర వారమునకొకసారి పైస చందాతోఁ బత్రికనొకటి ప్రకటింపఁజొచ్చెను. స్త్రీలకొక బోధనాభ్యసన పాఠశాల (నార్మల్‌స్కూలు) స్థాపించి యతఁడు స్త్రీవిద్యాభివృద్ధిఁ గాసించెను. కొంతకాలము గడచిన పిదప 'భామాహితార్థినీ సభ' యొకటి స్థాపింపఁబడి దీనితోఁ జేర్పఁబడెను. ఇదిగాక చేతిపనులు మొదలగు నవి నేర్పి యనేకులకు మంచివృత్తులు కల్పించుట కొక పాఠశాలను గూడ నీయన స్థాపించెను.

దేశమునందున్న బ్రహ్మమతావలంబుల నందఱ నొక్క దారిని దెచ్చుటకయి ప్రయత్నించి 1874 వ సంవత్సరమున భరతాశ్రమమును స్థాపించెను. కేశవచంద్రుఁ డిందునిమిత్తము పెద్ద దొడ్డియుఁ దోఁటయు గల యిల్లుకొని యితరపట్టణములనుండి బ్రహ్మమతస్థుల భార్యలు బిడ్డలు వచ్చి యచ్చటనే భుజియించుచు విద్య నేర్చుకొనుటకుఁ దగిన యేర్పాటులఁ జేసెను. ఆసంవత్సరమునందే మార్చి నెలలో గవర్నరు జనరలుగారు బ్రహ్మమతస్థుల వివాహములనుగూర్చి కేశవచంద్రుని యభిప్రాయప్రకార మొక శాసనము నిర్మించెను. భరత ఖండమున సంస్కర్తగాఁ దాను చేసిన కృషికి ఫలము నేటికి గలిగినదని యా శాసనము నిర్మింపఁ బడినపు డతఁడు సంతోషించెను.

1875 వ సంవత్సరము మొదలు 1878 వ సంవత్సరమువఱకు నతఁడు బ్రహ్మసమాజ మతమును దగినస్థితిలో నుంచుటలో పరిశ్రమఁ జేసెను. అది మొద లతఁడు తనమతస్థులకు వై రాగ్యమును బోధించి


కలకత్తానగర సమీపమున నొకతోటంకొని తానును విరాగియయి యందుండెను. తరువాత కలకత్తానగరముననే పెద్దయిల్లు నొకదానిఁ గొని 'పద్మకుటీర' మని దానికిం బేరుపెట్టెను. ఆ యింటిలో నొక పెద్దగది బ్రహ్మమతస్థుల నిమిత్తము ప్రత్యేకముగ వదలి వేయఁబడెను. క్రమక్రమమున తనమిత్రులను శిష్యులను దనయింటి సమీపముననే బసలుకొని కాపురముండునట్లు ప్రోత్సాహపఱచి బ్రహ్మమతస్థుల యగ్రహార మొకటి యేర్పరచెను. పద్మకుటీరమున నున్న కాలమున నీతఁడు ధనవంతుఁడు గాకున్నను గొప్పయుద్యోగస్థుఁడు గాకున్నను నెంతెంతవారికి దర్శనము లీయని మహారాజులు గవర్నరులు గవర్నరుజనరలు వానియింటికి స్వయముగా వచ్చి దర్శనముచేసి మాటలాడి పోవుచువచ్చిరి. ఈతఁడేకార్యము చేసినను నది యీశ్వరాదేశమని నమ్మి యట్లు చెప్పుచు వచ్చెను. వయసు ముదిరిన కొలఁది నితనికి లోకమున గౌరవము హెచ్చసాగెను. తాను గావించిన యవివేక కార్యములుగూడ భగవాదేశమున జరిగినవని యతఁడు చెప్పు చుండుటచే నతని యనుచరులలోఁ గొందఱి కతనిపయి నసూయ పొడమెను.

ఇట్లుండ నతఁడు కుమార్తెకుఁ బెండ్లి చేయఁదలంచి కూచిబిహారు మహారాజును వరునిగా నంగీకరించెను. పెండ్లికుమార్తెకు పదునాలుగేండ్లయిన నిండలేదు. పెండ్లికుమారుఁడు రమారమి పదునేడేండ్లవాఁడు. బ్రహ్మమత నిబంధనం బట్టియు కేశవచంద్రుని ప్రోత్సాహముచేతనే దొరతనమువారు నిర్మించిన చట్టముఁ బట్టియుఁ బెండ్లి కూఁతురు పదునారేండ్లకుఁదక్కువగాను పెండ్లికొడుకు నిరువది యేండ్లకు దక్కువగ నుండరాదు. అదియెగాక కూచిబిహారు రాజు బ్రహ్మమతస్థుఁడుకాడు. వివాహము బ్రహ్మధర్మప్రకారము గాక బ్రాహ్మణ ధర్మప్రకారము జరెగవలసివచ్చెను. ఈకారణమునం బట్టి యతని


యనుచరు లావివాహమునకు సమ్మతించవలదని కేశవచంద్రునితో నొక్కి చెప్పినను వారిమాటలను వినక యతఁడది యీశ్వరాదేశమని చెప్పి దాటఁజూచినను దన కుమార్తెకు మంచి సంబంధము దొరికినది గదా యను కక్కురితిచేత స్వమత ధర్మములు సరకుసేయక యనుచరుల హితోపదేశముల లెక్క గొనక లోకనింద కొడిగట్టి నిర్మల మగు తన వర్తనమున కొక మచ్చ దెచ్చుకొనెను.

కేశవచంద్రసేనుఁడు మొదట తన యల్లుఁడు బ్రహ్మమతస్థుఁడు గాకున్నను క్రమక్రమమున నతఁడు తన మతమునఁ గలియవచ్చుననియు ధనవంతుఁడగుటచే నతని కలయికవలన స్వమతము ప్రబలము కావచ్చుననియుఁదలఁచి యీవివాహమున కంగీకరించెనని కొందఱి యభిప్రాయము. అట్లయినచో నతని యుద్దేశ్యము కొంతవఱకుమంచిదనియే యొప్పవచ్చును. అతని యనుచరుల కిదివఱకే లోలోపల రవులుచున్న యసూయాగ్ని యీవివాహమూలమున పెద్దమంటయై ప్రబలెను. అప్పుడు పండిత శివనాథశాస్త్రి మొదలగువాని యనుచరులు కోపించి కేశవచంద్రసేనుఁడు బ్రహ్మసమాజమునకుఁ ప్రధానాచార్యుఁడుగ నుండఁదగఁడనివానిం దొలగింపఁ బ్రయత్నించిరి. కేశవచంద్రుఁడు పోలీసువారి సహాయమును గైకొని ప్రతిపక్షులఁ బారదోలి స్వస్థానమును బలపరచుకొనెను. వెంటనే శివనాధశాస్త్రి ప్రముఖులు కేశవచంద్రుని హిందూదేశ బ్రహ్మసమాజమునుండి విడిపోయి సాధారణ బ్రహ్మసమాజమును 15 వ మేయి 1878 వ సంవత్సరమున స్థాపించుకొనిరి.

1880 వ సంవత్సరము మొదలుకొని కేశవచంద్రుఁడు నవీన సిద్ధాంతమని మతమునందు మునుపున్న దానికంటె క్రొత్తపద్ధతుల కొన్నిఁటిఁజేర్చెను. ఈసిద్ధాంతమునుబట్టి మనుష్యు డధికవైరాగ్యమును బూని లోకమును సంబంధ సాధ్యమైనంత వఱకు విడచి పరమే


శ్వర భజన ధ్యానాదులయందుఁ గాలము గడపవలయును. ఈనవీన పద్ధతులఁజక్కగ జనులకు బోధించుట కతనికవకాశము లేకపోయెను. ఏలయన 1883 వ సంవత్సరము మొదలు కేశవచంద్రుఁడు రోగపీడితుఁడై కొంతకాలము బాధపడి తుదకు 1884 వ సంవత్సరమున జనవరి 8 వ తారీఖున లోకాంతర గతుఁడయ్యెను. మతవిషయమున నభిప్రాయభేదము లెట్లున్నను నీదేశోపకారి యకాల మరణమునకు వగవని వారు లేరు. అతని మరణవార్త యింగ్లండు దేశమునందు దెలసినపుడు శ్రీవిక్టోరియారాణిగారు వాని మరణమునువిని చింతిలి తత్కుటుంబము నోదార్చుచు తమ ప్రతినిధియగు రవను ప్రభువుద్వారా వర్తమాన మంపిరి. గవర్నరు జనరలుగారగు రైపన్ ప్రభువుగారును కేశవచంద్రుని మరణము హిందూదేశమునందంతట విషాదము గలిగించెనని వాని కుటుంబమున కుత్తరమువ్రాసిరి. హిందువు లొక్కరు గాక యింగ్లీషువారును వానిసుగుణములఁగూర్చి యొండొరులమించు నట్లు స్తోత్రముఁజేసిరి. ఆసంవత్సరము 30 వ జనవరు సాయంకాలము కలకత్తామందిరమున కేశవచంద్రుని జ్ఞాపకార్థమొక గొప్పసభచేయబడెను. దానికి దొరతనమువారియాలోచన సభలో, నగ్రగణ్యులగు సర్ విలియం హంటరు దొరగా రగ్రాసనాధిపతులైరి. అన్ని మతములను వారలన్ని తెగలవారు వానిమతము గూర్చి శోకించి యుపన్యాసముల నిచ్చిరి. బి. యే. మొదలగు శాస్త్రపరీక్షలయందుఁ గృతార్ధులైన విద్యార్ధులకుఁ బట్టము లొసఁగు కాలమున వారికి హితోపదేశముఁ జేయుచు ఆనరబిల్ రెయినాల్డ్సుదొరగారు సందర్భవశమున కేశవచంద్రుని పేరెత్తి వానియోగ్యతనుగ్గడించి వాని మార్గము నవలంబించి యంతవాండ్రు గ్రమ్మని నొక్కి చెప్పెను.

అంద దన్నివిధములఁ గొనియాడుటకు నాతనియందలి సద్గుణములె కారణములు గాని వేరొకటిగాదు. అతఁడన్న దమ్ములతోబంచు


కొన్న ధనమంతయు బీదలగు బ్రహ్మసమాజ మతస్థులకై వ్యయముఁ జేసెను. ఇంతకంటె నౌదార్యవంతులఁ జూడఁగలమా ; హిందూదేశమునఁ బూర్వ మహర్షులయొక్క పరిశుద్ధాస్తిక మతమును నిర్మల వర్తనమును వైరాగ్యమును నెలకొలుపుటకై జీవితమునంతయు నతఁడు ధారవోసెను. అంతియెగాని కొందఱనుకొనునట్లు తమ స్వమతాభిమానము లేనివాఁడు గాఁడు. మంచియెచ్చటనున్నను గ్రహించుట మనుష్యధర్మమని నమ్మి యాయన యితర మతములయందలి శ్రేష్ఠధర్మములపైసైతము గౌరవముఁ జూపెడివాఁడు. త్రాగుబోతు తనము తలయెత్తకుండ నడచుటకును దిక్కుమాలిన వితంతువుల నొక్కకడ జేర్చుటకును నథోగతినున్నస్త్రీల నున్నతదశకుఁ దెచ్చుటకును భగవంతునియెడ నిజమైన భక్తి నెలకొల్పుటకును నాయన మిక్కిలిపాటుపడియెను. దొరతనమువారిచ్చు బిరుదము కెన్నఁడతఁ డాసపడఁడయ్యె. బంగాళా గవర్నరురొకమారతని కలకత్తాకు మ్యునిసిపల్ కమీషనరుగా నియమింపఁదలంప నత డాగౌరవము నంగీకరింపడయ్యె. విక్టోరియా రాణీగారు హిందూదేశ చక్రవర్తిని యైననడుమ ఢిల్లీలోజరిగిన దర్బారులో దొరతనమువారతనికి బంగారు పతకము నీయరాఁగా దాని స్వీకరింపఁడయ్యె.

ఇందూరుసంస్థాన ప్రభువగు హోల్కారు మహారాజుగారు జయపూరు మహారాజుగారు మొదలగు మూర్థాభిషిక్తులు తన్ను ప్రాణస్నేహితునిగాఁ జూచుకొని యాదరించు నాఁడును గేశవచంద్రుడు నిగర్వియై యనేక సేవకులున్నను దనయన్నము దాను వండుకొనుచు సామాన్యులతోఁ గలసి మెలసి వారిసుఖ దుఃఖములు తనవిగా ననుభవించుచుండె. అతని విగ్రహ మాఱడుగుల పొడగుగలది. బాహువులు దీర్ఘములు, వక్షస్థలము విశాలము అతని ముఖవర్చసు జనుల నాకర్షించునదియై రాజకళను గలిగియుండును. బ్రహ్మసమాజ మొక మతముగా హిందూదేశమున వ్యాపించుటకితఁడే కారణము. ఈతని యుపన్యాసము లసాధారణములు. కుంభవృష్టులు నేలఁగురిసినట్లతి చాక చక్యముతో నుపన్యసించుటకును వినువారి సమ్మోహనాస్త్రముచే గట్టబడునట్లు నిశ్చేష్టితులుగ జేయుట కతఁడే సమర్థుఁడు. ఇంతటి మహావక్త హిందూదేశమున నదివఱకెన్నఁడు నుద్భవింప లేదు. స్వల్పలోపము లొకటి రెండున్నను గేశవచంద్రుఁ డనేక సద్గుణసంపన్నుఁ డగుటచే సర్వసజ్జనస్తవమునకుఁ బాత్రుఁడు.