మహాపురుషుల జీవితములు/ద్వారకానాథ మితర్

వికీసోర్స్ నుండి
ద్వారకనాథ మితర్

ద్వారకనాథ మితర్

ఇతఁడు బంగాళాదేశములో హుగ్లీ మండలమునందలి అంగునిశీయను గ్రామమున 1833 వ సంవత్సరమునజన్మించెను. వానితండ్రి హుగ్లీకోర్టులో నొకన్యాయవాదిగా నుండెను. ద్వారకనాథుఁడు తక్కినపిల్లలతోడిపాటు గ్రామమునందలి బడిలోచదువనారంభించెను. అతఁడేడేండ్ల వయసువాడయినప్పుడు ఇంగ్లీషు చదువుటకు హుగ్లీ పాఠశాలలోఁ బ్రవేశించెను. 1846 వ సంవత్సరము కాలేజీస్కూలులో రెండవతరగతిలో జేరెను. అక్కడ చదువునప్పు డతఁడు బుద్ధికుశలతకు మిక్కిలి ప్రసిద్ధికెక్కి నెలకెనిమిది రూపాయలు జీతముగల విద్యార్థి వేతనము సంపాదించెను. తరువాత 1849 సంవత్సరమున రాణీ కాత్యాయనీ యను నామె యిచ్చిన నెలకు పదునెనిమిదిరూపాయలు జీతముగల విద్యార్థి వేతనము సంపాదించి ద్వారకనాథుడు 1850 వ సంవత్సరమున విద్యార్థి వేతనములకై ప్రయత్నము చేయువారందరిలో నగ్రగణ్యుఁడై నిలిచె. 1851 వ సంవత్సరమున సంవత్సరాంత పరీక్షయందుఁ గృతార్థుఁడై నెలకు నలువదిరూపాయలు చొప్పున విద్యార్థి వేతనముం బడసెను. 1853 వ సంవత్సరమున ఆంగ్లేయభాషలో మిక్కిలి ప్రశస్థమైన యుపన్యాసము వ్రాసినందు కతఁడు బంగారుపతకమును మరుసటి సంవత్సరమున మరి రెండు బంగారుపతకములను బహుమానములుగాఁ బడసెను. విద్యార్థిగానున్నపు డతనికి దేశచరిత్రములఁ జదువుటయందు మిక్కిలి యభిరుచియుండెను. అతనికి గణితశాస్త్రమునందమితప్రజ్ఞ యుండుటచే మిక్కిలి చిక్కుగల లెక్కల నవలీలగా నతఁడు చేయుటచూచి యుపాధ్యాయుఁ డొకనాడతఁనితో నిట్లనియె. "హిందువులలో స్వతస్సిద్ధమగు బుద్ధికుశలత గలవాఁడవు నే నెఱిఁగినంతవఱకు నీవొక్కడవే" యని పలికెను. ద్వారకనాథ మితర్ చదువు ముగించి పాఠశాల విడిచినతోడనే దైవయోగమునఁ దండ్రి పరలోకగతుఁడగుటచే నేదేని యుద్యోగమును సంపాదించి కుటుంబపోషణముఁ జేయవలసివచ్చెను. దొరతనమువారి చేతికింద నేదేని యుద్యోగముఁజేయు టతని కెంతమాత్రమిష్టము లేనందున నెటులైన శాస్త్రపరీక్షయందుఁ గృతార్థుఁడై న్యాయవాదిగా నుండవలయునని యతఁడు సంకల్పించుకొనెను. కాని దారి దారిద్రయముచేత దన మనోనిశ్చయమును మార్చుకొని కలకత్తాలో పోలీసు మేజస్ట్రీటుకచేరిలో నెలకు నూటయిరువది రూపాయలు జీతముగల యుద్యోగ మొకటి కాళీవచ్చినందున యతఁడు దానింగూర్చి ప్రయత్నించి యందుఁజేరె. చేరి యందు చిరకాల ముండక ద్వారకనాథుడు శాస్త్రపరీక్షకుఁ జదివి యందుఁ గృతార్థుఁ డై న్యాయవాది యయ్యెను. న్యాయవాదియై తనపనిలో మంచిపేరు సంపాదించుటకై చాల పరిశ్రమచేసెను. న్యాయవాదుల కెంత బుద్ధికుశలతయున్న నెంతప్రజ్ఞయున్న దమ సామర్థ్యముం జూపుటకుఁ దగిన సమయము రావలయునుగదా!

ద్వారకనాథుఁడు మొదటినుండియు నదృష్టవంతుఁ డగుటచే పని యారంభించిన యాఱుమాసములకే యొక పెద్ద వ్యాజ్యమున నొక గొప్ప న్యాయవాదికి సహాయుఁడుగా నేర్పరుపఁబడెను. అతని భాగ్యవశమున నావ్యాజ్యము విచారణకు వచ్చినప్పుడా పెద్దన్యాయవాది యూరలేకపోవుటచే ద్వారకనాథుని తెలివితేటలు గనబరచుటకు మంచియదను దొరకెను. తనవృత్తియందు మిక్కిలి యారితేరినవాఁడు గాకపోయినను ద్వారకనాథుఁడు న్యాయాధిపతుల (జడ్జీల) మనస్సులకు నచ్చునట్లు వ్యాజ్యమునందలి సంగతులెల్ల నరటిపండొలిచి చేతికిచ్చినట్లుచెప్పి బోధించి వాదించెను. దీనితో నతనికి మంచిపేరుగలుగఁ గీర్తిదేశమందు వ్యాపించెను. ఆతని సమకాలికుఁడె న్యాయవాదిగానున్న యొక దొర ద్వారకనాథుని యప్పటి తెలివితేటలఁ గూర్చి యిట్లు వ్రాసెను. ద్వారకనాథుఁడు వాదనకు దిగినప్పుడు నాతోఁ గలిసిపనిచేసినను నాకెదుటిపక్షమునం బనిచేసినను నాకును వినువారి కందఱకును మిక్కిలి యద్బుతమును గొలుపుచుండువాఁడు."

1862 వ సంవత్సరమున బంగాళాదేశమం దగ్రన్యాయసభ అనఁగా హైకోర్టు స్థాపింపఁబడెను. అది యేర్పడినది మొదలు ద్వారకనాథుని ఖ్యాతి యంతకంత కెక్కువయ్యెను. ఖ్యాతితోఁగూడ ధనార్జనము నతిశయించెను. ఏలయన నతఁడా న్యాయసభలోఁ బని నారంభించునప్పటికి వానికంటె నెక్కువ యభ్యాసము నెక్కు పేరు గల న్యాయవాదు లిరువు రుండిరి. వారిరువురిలో నొకఁడు మృతినొందుటయు రెండవయతఁడు న్యాయాధిపతి యగుటయుఁ దటస్థించెను. అందుచే నతఁడచ్చటి న్యాయవాదులికెల్ల నాయకుఁడయ్యెను. ఆకారణమున దేశస్థులందఱు బనివచ్చినప్పు డతని సహాయమునే కోరుచువచ్చిరి. న్యాయవాదిగా నున్నపు డతఁడు నిర్భయుఁడై స్వతంత్రుఁడై యుండి పేదల కేవియేని చిక్కులు సంభవించినపుడు ధనము గ్రహింపకయే వారిపక్షముబూని వాదించుటకు సిద్ధముగ నుండును.

మనదేశమున కింగ్లీషువర్తకులు కొందరువచ్చి బంగాళాపరిగణాలో నీలిమందు, కాపీవిత్తులు, తేయాకు మొదలగు సరకులు పండించి లాభ మపారముగ గ్రహించుచున్నారు. 1865 వ సంవత్సర మందా దొరలు కొందరును బంగాళాదేశపు జమీందారులు కొందఱును గలసి శిస్తుల నిమిత్తము రైతులను బాధించి వారిపై హైకోర్టులో గొప్పవ్యాజ్యము తెచ్చిరి. అప్పుడు ద్వారకానాథుఁడు దీనదశలోనున్న రైతులపక్షముఁబూని వాదించెను. ఆ వ్యాజ్యములు కలకత్తా హైకోర్టులో పదునైదుగురు జడ్జీలు విచారణచేసిరి. ఆవ్యాజ్యము విచారణ మనేకదినములు పట్టినందున ద్వారకనాథుఁడు ప్రతిదినము పదకొండు గంటలకులేచి సాయంకాల మైదుగంటలవఱకు నిలువంబడియే వాదనసేయుచు దేహమలసినను తనవాదనమాత్రము బలహీనము గాకుండునట్లుచెప్పి చూచువారి కందఱకు మహాద్భుతమును గొలిపెను. ఆవ్యాజ్యమున న్యాయసభలోని ముఖ్యన్యాయాధిపతి ద్వారకనాథునిపై యించుక కక్షఁబూని మాటిమాటికి యక్షప్రశ్నలవంటి ప్రశ్నలువేసి యీతనిం దడఁబడఁజేయుటకు బ్రయత్నముచేయుచువచ్చెను. కాని యాదిట్టరియొక్క ప్రశ్నకైనను దడఁబడక న్యాయాధిపతులందరు నివ్వెరపడునట్టు ప్రత్యుత్తర మిచ్చెను. ఈవ్యాజ్యమున నితఁడు చూపినఁ యసాధారణ ప్రజ్ఞచేత ననంతరము కొన్ని దినములలో దొరతనమువారిన్యాయవాది (గవర్నమెంటు ప్లీడరు) గా నేర్పరుపఁబడెను. దీనిలోనుండియే యతఁడు కొలది కాలమున హైకోర్టు జడ్జీగా నియమింపఁబడెను.

అదివరకు శంభునాథపండితుఁ డను నతఁడా హైకోర్టులో న్యాయాధిపతిగా నుండెను. ఆతఁడె బంగాళాహైకోర్టులో మొట్టమొదటి న్యాయాధిపతి. అతఁడు 1867 వ సంవత్సరమున జూనునెల యాఱవ తేదిని లోకాంతరగతుఁ డయ్యె. అప్పటికి ద్వారకనాథుఁడు ముప్పదిమూడేండ్ల వయసువాఁడు. ఇదివరకు హిందూదేశమున హైకోర్టుజడ్జీలుగా నియమింపఁబడిన స్వదేశస్థులలో నింతచిన్న వయసువారెవ్వరునులేరు. ఇంతటి పిన్నప్రాయమువాని నంతటి మహాపదవికి దొరతనమువారు నిశ్శంకముగా నియమించుటచేతనే యాతఁ డెంతటి బుద్ధిశాలియో యెంతటి ప్రజ్ఞావంతుఁడో మూహింపవచ్చును. ద్వారకనాథుఁ డారుసంవత్సరము లాహైకోర్టునందు న్యాయాధిపతిగా నుండెను. అప్పటి ముఖ్యనాయాధిపతియగు సర్ బార్నిసు పీకాకు దొరగారు తనతోడి జడ్జీయగు ద్వారకనాథుని యభిప్రాయములతో దరుచుగ నేకీభవించుచు నెప్పుడైన నభిప్రాయభేదము గలిగినప్పుడు మిక్కిలి జంకుతో భేదించుచుండునఁట. అతఁడు గడుసుపోకడలఁ బోయి మోసముపన్ని కువాదములు చేయువారినిఁ జూచిన మిక్కిలి యసహ్యపడి యట్టివారి గర్వభంజనము చేయుచువచ్చెను. అందుచే నతనిమీఁద కొందఱ కాగ్రహము ననిష్టముగలుగ వార్తాపత్రికలలో వారతని నిందింప నారంభించిరి. ద్వారకనాథుఁ డావ్రాతఁల నించుకేనియు సరకుసేయఁడయ్యెను. అయినను ముఖ్యన్యాయాధిపతియగు పీకాకుదొరగారు ద్వారకనాథుని పైఁగల యభిమానముచే జననిందా స్పదుడగుటకు నిష్టపడక వానినాయపవాదమునుండి తప్పింపవలయునని యొకమారు కచ్చేరిలో నున్నపుడే యిట్లనియె. "నేనీద్వారకనాథుని న్యాయవాదిగా నున్న కాలమునుండియు నెరుఁగుదును. కొంతకాలము నుండి యతనిసాటి న్యాయాధిపతినై యుంటిని. కాబట్టి యతని స్వభావమును గూర్చియు నతని నడతనుగూర్చియుఁ దక్కినవారి కంటె నా కెక్కువ దెలియుట కవకాశమున్నది. నేనిప్పు డాయన యెదుట మాటలాడుచున్నాను ద్వారకనాథుడు మిక్కిలి విద్యావంతుడనియు సమర్థుడనియు నిగర్వచూడామణి యనియు మంచిమనస్సు గలవాఁడనియు దయాళువనియు స్నేహపాత్రుఁ డనియు స్వతంత్రుఁ డనియు జెప్పవలయును. అతఁడు తనకు సరియని తోఁచిన యభిప్రాయ మెవరు భిన్నముగాఁ జెప్పినను విడువక దాని ననుసరించియే యుండును. అది తప్పనితోఁచినప్పు డెవరుచెప్పకయే దానిని విడుచును."

ద్వారకనాథుఁడు తీరికయున్నప్పుడు ఫ్రెంచి లాటిను భాషల యందు బరిశ్రమఁజేయుచువచ్చెను. ఫ్రెంచిభాషలో నతఁడు చదివిన గ్రంథములలో కోవిం (Comte) యను తత్త్వశాస్త్రజ్ఞుడు రచియించిన గ్రంథములపై నతనికిమిక్కిలి యభిమానము. అతని గ్రంథభాండారమున రమారమి వేయి మంచి ఫ్రెంచి గ్రంథము లుండెను.

అతనికి 1868 వ సంవత్సరమున విసూచిజాడ్యము తగిలెను. కాని యది యదృష్టవశమున గుదిరెను. 1872 వ సంవత్సరమున నతఁడు కీళ్ళనొప్పులు జ్వరమువలన కొన్నిదినములు బాధపడెను. తరువాత జ్వరము వదలినను దానిదోషములు విడువవయ్యెను. 1873 వ సంవత్సరము నవంబరు నెలలో నాయనకు కంఠములో కురుపువేసెను. అట్లుండియు నతఁడు కొంతకాలము పని చూడఁగలిగెను. కాని క్రమ క్రమంబుగ రోగము ప్రబలమగుటచే నతఁడు పనిమానుకొని ప్రాణమునం దాశవదలుకొని కలకత్తానగరమును విడిచి తన కడపటిదినములు పుచ్చుటకు స్వగ్రామముఁ జేరెను. అట్లు కొంతకాలము రోగపీడితుఁడై 1874 వ సంవత్సరం ఫిబ్రేవరు 25 వ తేదీని నలువదియవయేట కాలధర్మము నొందెను.

న్యాయాధిపతిగాఁ గూర్చునప్పు డతఁడు ప్రజలకు సరిగా న్యాయమునొసఁగి హిందువులుకూడ న్యాయాధిపత్యము చేయుటకుఁ దగు సామర్థ్యము జ్ఞానముగలవారని దొరతనమువారికిఁ దోచునట్లు ప్రవర్తించెను. అతని మరణమును గూర్చి విచారించుచు తోడి న్యాయాధిపతి యొకఁ డీవిధముగాఁ జెప్పెను. "అతని యధికవైదుష్యము యుక్తాయుక్త వివేచనజ్ఞానము న్యాయదృష్టి బుద్ధికుశలత యద్భుతమైన జ్ఞాపకశక్తి మంచితనము మొదలగుగుణములం బట్టి యతఁడు తోడిన్యాయాధిపతులకు సాటిలేని సహకారిగా నుండును. అతనితో గూర్చుండి పనిచేయుట మిక్కిలి సంతోషకరముగా నుండును. ఇంగ్లీషుభాష యందలి యతని పాండిత్యమును జూడ నాభాషయతనికి విధేయురాలై యున్నట్టు గనఁబడును. ఇంగ్లీషుభాషను మాతృ భాషగాఁ గలిగిన దొరలుసయితము ద్వారకనాథున కాభాషయందుఁ గల యభిరుచి ప్రవేశమును బట్టి మిక్కిలి యక్కజపడుచువచ్చిరి."

గొప్ప యధికారమును వహించినవారు తమ యధికార ప్రాబల్యమును జూపి తక్కువవారిని బాధపెట్టినప్పుడు ద్వారకనాథుడది చూచి సహింపక యట్టి యధికారులకు గట్టిగ మందలించు చుండును. ఇంటివద్ద యతఁడు మిక్కిలి వినయవృత్తి గలిగి సర్వజన సులభుఁడై యౌదార్యమునఁ బ్రసిద్ధికెక్కియుండెను. 1871 వ సంవత్సరమున నతని పెద్దభార్య మృతినొందెను. ఆమె కిరువురు బిడ్డలు. ప్రథమకళత్రముపోయిన మరుసటిసంవత్సరమున నతఁ డొక కన్యను వివాహమాడెను. కాని యామెను వివాహమాడిన యచిరకాలములోనే లోకాంతరగతుఁ డయ్యెను. ఆయనకు నిరంతరము చదువుకొనుటయందె మిక్కిలి యాసక్తి. చదివినది జ్ఞాపకముంచుకొనుటలో నంతవాఁడు సాధారణముగా నుండఁడు. ఒకమా రాయన కొన్ని సంపుటములు గల యూరపుదేశ చరిత్రమును పదునైదుదినములలో సమగ్రముగాఁ జదివి చదివినది తనకు జ్ఞాపకమున్నదో లేదో తెలిసికొనుట కాగ్రంథమునందు తన్నుఁ బరీక్షింపుమని యొకమిత్రునిఁ గోరెను. ఆమిత్రుఁడు పలుభాగములయందు పలుప్రశ్నలు వేయ నాప్రశ్నలకన్నిటికి తేలిపోక యుత్తరములు చెప్పుటయే గాక ద్వారకనాథుఁడు మూలగ్రంథము నందలి వాక్యములను సయితము కంఠపాఠముగ నప్పగించి మిత్రున కాశ్చర్యము గలిగించెను. యూరపుఖండమంతయు జయించిన శూరశిఖామణియగు నెపోలియన్ బోనపార్టి యందతనికి మిక్కిలి యభిమానముండుటచే నాతని ప్రతిరూపమును వానిగదిలోనుంచుకొనెను. హరిశ్చంద్ర ముఖర్జీ యనునతఁడు వాని బాల్యస్నేహితులలో నొకఁడు ఆముఖర్జీ 1868 వ సంవత్సరమున మృతినొందఁగా వానియకాల మరణమునుగూర్చి ద్వారకనాథుఁడు మిక్కిలి దుఃఖించెను. ద్వారకనాథున కొకచిత్రమైన యభ్యాసముగలదు. అతఁడు న్యాయవాదిగా నున్న కాలమున కోర్టువారియెదుట వాదముసేయునపుడొక పేనాకలమును రెండుచేతులతోఁ పట్టుకొని యది ముక్కలగువఱకు మెలివేయుచుండును. అతఁడాకలము నెంతవడిగా మెలివేయుచుండునో యతనినోటనుండి మాట యంతవడిగా హెచ్చి వాదము ప్రబలుచుండును. కలము క్రమక్రమముగా నలిగి విఱిగి చేతిలోనుండి పూర్తిగా జారిపడినప్పు డాయన యేమియుం దోచక వాదముసేయ లేక నిలువఁబడునఁట. అందుచే గుమాస్తా యొకడు పేనాకలముల కట్టయొకటి చేతితోఁ బట్టుకొని సిద్ధముగనుండి యజమానుని చేతికలము విఱిగిపడినతక్షణమే మఱియొకకలము నవ్య వథానముగాఁ జేతిలోపెట్టుచుండును.

ద్వారకనాథుఁడు గొప్పయుద్యోగములో నున్నను న్యాయము చెప్పవలసివచ్చినప్పుడు తనపై యధికారులకు సయితము జంకక స్వతంత్రుడై వ్యవహరించుచుండును. అంతటి విద్యయు; విద్యకుం దగిన సత్ప్రవర్తనము దానికిం దగిన మహోన్నతపదవియు గలిగిన యీ మహాపురుషుఁ డంతటి చిన్నతనమందు బోవుటచే నతని యకాలమరణమును గూర్చి దేశస్థులందఱు విచారించిరి.