మహాపురుషుల జీవితములు/కృష్ణదాస్ పాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Mahaapurushhula-jiivitamulu.pdf

కృష్ణదాస్‌ పాలు

హిందూదేశమున వార్తాపత్రిక కధిపతియైయుండి మహా ప్రఖ్యాతిగాంచిన పురుషులలో నితఁ డగ్రగణ్యుఁడు. ఇతఁడు 1838 వ సంవత్సరమున జన్మమొందెను. అతనితండ్రియగు నీశ్వరచంద్రపాలుఁడు మిక్కిలి బీదవాఁడు. కృష్ణదాసు మొట్టమొదట నొకపాఠశాలలోఁ బ్రవేశించి యచ్చట బంగాళాభాషను జదివి యాభాషలో నతనికిఁ గల ప్రవీణతకు నొకవెండి పతకమును బహుమానముగఁ బడసెను. అతఁడు పదేండ్ల ప్రాయముగలవాడయినప్పు డింగ్లీషుఁ జదువ నారంభించి 1853 వ సంవత్సరమున నాయింగ్లీషు పాఠశాలను విడిచెను. బడిమానిన వెనుక కృష్ణదాసుపాలుఁడు కొన్నినాళ్ళు క్రైస్తవమతబోధకుఁడై కలకత్తాలోనున్న రివరెండు మిన్నిదొరగారివద్ద విద్యనభ్యసించెను. అనంతర మతఁడు కలకత్తాలో విద్యావిషయములగు చర్చలను స్వేచ్ఛగా జరుపుటకు స్తాపింపఁబడిన యొకసమాజములో జేరి యచ్చట రివరెండుమార్గన్ దొరగారు మొదలగు గొప్పవారు జేయు నుపన్యాసములను విని యందువలనఁ గలిగినలాభములను బొందుచువచ్చెను.

1854 వ సంవత్సరమున నతఁడు మరల జదువదలచి రాజేంద్రుదత్తుగారిచే స్థాపింపబడిన హిందూ మెట్రాపాలిటన్ కాలేజీ యను కళాశాలలోఁజేరి యచ్చట మూఁడు సంవత్సరములవఱకుఁ జదివెను. విద్యార్థిగానున్ననాడు మొదలుకొని యతనికి రాజకీయవ్యవహారముల యందు మిక్కిలియభిమానము. అతఁడు వ్రాసినవ్రాతలు నతడిచ్చిన యుపన్యాసములుచూడ నంతచిన్న వయసువాని కింతశక్తి యెట్లుగలిగెనాయని తోచును. పెద్దలెవరితోనైనఁ దనకభిప్రాయభేదము కలిగినప్పుడు మొగమోటముచేత నూరుకొనక తనయభిప్రాయమునిర్భయ ముగఁజెప్పు ధైర్య మతనియొద్దనుండెను. అంతధైర్యముండుటచేతనే యొకమా రతఁడు బంగాళాదేశమం దంతట ప్రసిద్ధికెక్కిన మహా పండితుఁడు డాక్టరు డఫ్‌దొరగారి మాటలనేఖండించి పూర్వపక్షము చేసెను. ఆకాలమున బంగాళాదేశమందు జార్జి తాంసన్ అనుదొర గలఁడు. ఆయన రాజకీయ వ్యవహారములను గూర్చి దిట్టమయిన యుపన్యాసముల నియ్యఁదొడఁగెను. అతఁడు వాగ్నైపుణికిఁ ప్రసిద్ధి కెక్కెను. ఆదొరగారిని కృష్ణదాస్‌పాలుఁ డొకనాఁడు తన సమాజములో జరుగు నొకసభకు నధ్యక్షుఁనిగా నుండుమనిపిలిచెను. ఆదొరగారు విద్యావిషయములగు చర్చలను జేయునట్టి చిన్న సమాజములలోఁ దనవంటివాఁ డుపన్యసింపఁదగదనియు విశేషించి తన రాజకీయ వ్యవహారములను గూర్చియే కాని యితరవిషయములను గూర్చి యుపన్యసింపననియుఁ జెప్పి హిందూపేట్రియేటను వార్తాపత్రికనుదీసి చూపి యీ పత్రికాధిపతి యొక్కఁడే హిందువులలో రాజకీయ విషయములనుగూర్చి గ్రహింపఁగల సమర్థుఁడనియుఁ దక్కినవారికిఁ జెప్పినను దెలియవనియు గర్వోక్తిగాఁ బలికెను. ఆమాటలు విని కృష్ణదాసాదినము మొదలుకొని తానుగూడ హరిశ్చంద్ర ముకర్జీ యంతవాఁడు కావలయునని నిశ్చయించుకొనెను. అది మొద లతఁడు పేట్రియేటు పత్రికను తప్పక చదువుచు వచ్చెను. ఆతఁడు కడుబీదవాఁడగుటచే పత్రిక తెప్పించుకొనుటకు ధనము లేక సమాజకార్యదర్శి నడిగికొని చదువవలసివచ్చె. ఈపత్రికగాక యింగ్లీషుభాషలో ప్రకటింపఁబడు నితర పత్రికలనుగూడఁ జదువుచు వాని కప్పుడప్పుడు తనకుఁదోఁచిన సంగతులనువ్రాసి పంపుచు నితరగోష్టిని విడిచి యతఁడు విద్యాగోష్టియందె కాలము పుచ్చు చుండెను.

ఆతఁడు హిందూపేట్రియేటుపత్రికకుఁగూడ కొన్ని సంగతులు వ్రాసి పంపెను. తానువ్రాసిన వ్రాత యాపత్రికలో ప్రకటింపఁ బడి నప్పుడు వానికిఁ గలిగిన యానంద మింతింతయని చెప్ప నలవిగాదు. కళాశాలలో విద్యాభ్యాసము ముగించిన వెనుక కృష్ణదాసొక జిల్లాజడ్జీ గారి కచ్చేరీలో ట్రాన్సులేటరు (అనఁగా ఇంగ్లీషునుండి స్వభాషకును స్వభాషనుండి యింగ్లీషునకును తర్జుమాచేయు నుద్యోగస్థుఁడు) గా నియమింపఁబడెను. కొన్నిదినము లతఁడు పని చేసిన వెనుక కృష్ణదాసు డాయుద్యోగమునకుఁ దగఁడని జిల్లాజడ్జివానిని తీసివేసెను. తరువాత సర్ విలియంగ్రె దొరగారు వానికిమంచి యుద్యోగము నొకటి యిచ్చిరి గాని యతఁడందుఁ బ్రవేశింపఁడయ్యె. అతఁడు గ్రంథములు వార్తాపత్రికలు మితిమీరునట్లు మిక్కిలి యాసక్తితోఁజదివియెక్కువ ప్రజ్ఞ గలవాఁడయినను వాని దారిద్ర్యము తెలివి తేటలను పైకి రానీక యణచిపెట్టెను. తానుచేరియున్న సమాజమునకు నెల నెల కియ్యవలసిన చందానైన నతఁడియ్య లేక పోవుటచే సమాజమువారు వానిం గరుణించి నెల చందా నియ్యనక్కర లేకుండఁ జేసిరి. ఆకాలమునం దతని యవస్థనెఱిగిన యతనిమిత్రుఁ డొకఁడు వానిఁగూర్చి యిట్లు వ్రాసియున్నాఁడు. కృష్ణదాసుఁడు కలకత్తాలో మారుమూల సందులో కూలిపోవుచున్న యొకపాడుకొంప యరుగుమీఁద చింకిరి చాపమీద గూరుచుండి పైచిల్లులలోనుండి సూర్యకిరణములు శరీరమునఁ దగులుచున్నను లెక్క సేయక పుస్తకములం జదువుకొనుచు పత్రికకు వృత్తాంతములు వ్రాయుచుఁ పెక్కుసారులు గనఁబడియె. అతఁడు పేదయయ్యు నున్నతస్థితికి వచ్చుటకు మిక్కిలి పాటుపడియె.

1857 వ సంవత్సరమున నతఁడుకొందఱు స్నేహితులసహాయమునఁ గలకత్తాలో నొకమాసపత్రికనుప్రకటింపఁజొచ్చెను, కానివాని దారిద్ర్యదోషమున నది యారుమాసములకే యంతరించెను. కాన్పూరునగరమున సెంట్రల్‌స్టార్ (మధ్యనక్షత్రము అని అర్థము) అనునింగ్లీషుపత్రికయొకటి బయలుదేరి కృష్ణదాసుఁడు దానికుప విలేఖకుఁడుగా నుండి కలకత్తానుండియే వ్రాయుచునుండెను. అప్పుడప్పుడు హిందూ పేట్రియాట్ పత్రికకుఁగూడ నతఁడు సంగతులనువ్రాసిపంపుటఁగలదు కనుక 1857వ సంవత్సరమున హిందూదేశమున బయలుదేరిన సిపాయి పితూరీని గురించి యెన్నో సంగతుల నతఁడు వ్రాసి పంప నాపత్రికాధిపతియగు హరిశ్చంద్రముకర్జీ వానివ్రాతనేర్పును జూచి దైవానుగ్రహమున నతఁడు చిరకాలము బ్రతికియుండె నా దేశమునకు మహోపకారము గలుగఁ గలదని తెలిసికొనెను.

పత్రికలకు వృత్తాంతములు వ్రాయుటయేగాక బంగాళాదేశ బాలకుల యోగ్యతాస్థాపన యను నంశమును గూర్చియు నీలిమందు వ్యవసాయమును గూర్చియు మఱికొన్ని యంశములఁ గూర్చియు నతఁడు చిన్న చిన్న గ్రంథముల వ్రాసెను. ఇందు మొదటి యుపన్యాసము కలకత్తా స్మాల్ కాజుకోర్టులో జడ్జీగారగు హరిశ్చంద్రగోషు గారి కంకితముచేయఁబడినందున నతఁడే కావలసినధనమిచ్చి దానిని ముద్రింపించెను. ఆ యుపన్యాసము బంగాళాదేశస్థుల మనస్సుల నాకర్షించుటచే నది మిక్కిలి బాగున్నదని కొన్ని పత్రికలును బాగులేదని కొన్ని పత్రికలును విమర్శింప నారంభించెను. తరువాత నా యుపన్యాసము వ్రాసిన యతఁడు 19 సంవత్సరముల వయస్సుగల విద్యార్థియని వార్తాపత్రిక మూలమున దేట పడినప్పుడు జనులంద ఱాశ్చర్యము నొందిరి. 1860 వ సంవత్సరమున హిందూపేట్రియేటు పత్రికాధిపతియగు హరిశ్చంద్రముఖర్జీ మృతినొందెను. అతని వెనుక నాపత్రిక యనేకుల చేతులలోఁబడి తిన్నగ జరుపఁ బడక యెట్ట కేలకు కృష్ణదాస్ పాలుని యధీనమయ్యెను. హిందూపేట్రియాట్ అనఁగా హిందూదేశభిమాని యని యర్థము. ఆపత్రిక కృష్ణదాస్ పాలు నాధిపత్యమునందు హిందువులచేఁ బ్రకటింపఁ బడునన్ని పత్రికలకంటె నెక్కువపేరు నెక్కువ చందాదారుల సంఖ్యగలదైవర్థిల్లెను. హరిశ్చంద్రముఖర్జి చనిపోయినతోడనే కృష్ణదాసు బ్రిటిషు యిండియన్ సంఘమునకు సహాయకార్యదర్శియై పిమ్మటఁ గొంతకాలమునకు ముఖ్యకార్యదర్శి యయ్యెను. హిందువులచే ప్రకటింపఁబడు పత్రికలలో ప్రధానమగుదాని కధిపతియగుట చేతను గొప్ప సంఘమునకు కార్యదర్శి యగుటచేతను కృష్ణదాస్ పాలుఁడు కొలఁది కాలములోనే యున్నతస్థితికి లేచెను.

1863 వ సంవత్సరమున నతఁడు మునిసిపల్ కమీషనరుగా నేర్పరుపఁబడెను. 1872 వ సంవత్సరమున నతఁడు బంగాళాదేశపు శాసన నిర్మాణసభకు సభ్యుఁడుగా దొరతనమువారివలన నియమింపఁ బడెను. 1877 వ సంవత్సరమున శ్రీవిక్టోరియారాణిగారు చక్రవర్తిని బిరుదము వహించినప్పుడు ఢీల్లీ నగరమున జరిగిన గొప్పదర్బారులో కృష్ణదాసుపాలునకు దొరతనమువారు రావుబహద్దరు బిరుదము నిచ్చిరి. మరుచటి సంవత్సరమున నతనికి సి. ఐ. యి. యను బిరుదము వచ్చెను. 1883 వ సంవత్సరమునం దాయన బ్రిటిషు యిండియన్ సంఘమువారిచేత గవర్నర్‌జనరల్ గారి శాసననిర్మాణసభకు సభ్యుఁడుగా పంపఁబడెను. ఈ యుద్యోగము లన్నిఁటిలోను కృష్ణదాసుపాలుఁడు మిక్కిలి పాటుపడి మంచిపేరు సంపాదించెను. కొంతకాలము దీర్ఘ వ్యాధిచే పీడింపఁబడి 1884 వ సంవత్సరము జూలై 24 వ తేదీని మృతినొందెను. పత్రికాధిపతిగా నున్న కాలమున విమర్శనము లేమియైన చేయవలసివచ్చినప్పు డతఁడు పక్షపాతము లేక మర్యాద నతిక్రమింపక చేయుచువచ్చెను. అట్టున్నను వానికొకసారి యధికారులతో వివాదము రాకతప్పినదిగాదు.

1866 వ సంవత్సరమున బంగాళా దేశమునకు గవర్నరుగా నున్న సర సిన్ డెన్ బీ దొరగారు కృష్ణదాసుపాలుఁ డప్పటి కరువును గురించి తన పత్రికలో వ్రాసిన కొన్నిసంగతులకు బహిరంగ మైన సభలో ప్రత్యుత్తరములు చెప్పిరి. 1874 వ సంవత్సరమున నప్పటి గవర్నరగు సర్ జార్జికెంబెల్ దొరగారు హిందూపేట్రియేటు దొరతనమువారియెడల ననిష్టముగల పత్రిక యని స్పష్టముగా వ్రాసిరి. అందుకు కృష్ణదాసుఁ డూరకొనక తగిన ప్రత్యుత్తరము వ్రాసి పంపెను. ఇట్లొకరిద్ద రధికారులు పత్రికపై నలుకబూనినను క్రమక్రమంబున దొరతనమువారా పత్రికపై నభిమానము వహించి హిందువుల యభిప్రాయము తెలుసుకొనుటకు తత్పత్రికయే ముఖ్యాధారమని యెఱింగిరి. కృష్ణదాసుఁడు గట్టి సామర్థ్యముతో పత్రిక నిరువదిమూడు సంవత్సరములు నడిపెను. గవర్నరు జనరలుగారి యాలోచన సభలో సభ్యుఁడుగా నుండిన యిల్బర్టు దొరగారు కృష్ణదాసుపాలుని పత్రికాధిపత్యమును గూర్చి యొకసారి యిట్లుచెప్పిరి. "తనతోటివారు పాఠశాలల విద్యార్థులుగా నుండునట్టి యీడుననే దేశమందు పురాతనమైన పత్రిక కధిపతియై కృష్ణదాసుపాలుఁడు సర్వతో ముఖమగు పాండిత్యముచేతను మిక్కిలి శాంతముచేతను నిష్పక్షపాత బుద్ధిచేతను 23 సంవత్సరములు పాటుపడి దక్షతలేక యణగిపోవుటకు సిద్ధముగానున్న పత్రికను మంచి యున్నతస్థితిలోనికి దెచ్చెను" ఆనాటి హిందువులలో నెవరికి నింగ్లీషుభాషయొక్క మర్మము కృష్ణదాసుపాలునకు దెలిసినంతగాఁ దెలియదని జనుల యభిప్రాయము. కలకత్తారివ్యూ యను పత్రికయొక్క యధిపతి కృష్ణదాసునిగురించి యిట్లు వ్రాసెను. "స్వచ్ఛమై మృదువై మనోహరమై యింగ్లీషువ్రాయను మాటలాడను నేర్చిన ప్రాచీనహిందువుల తెగ కృష్ణదాసుపాలునితో నంతరించినది. ఉపన్యాసము లిచ్చుటలోను వెనుదీయక వాదించుటలోను యితనికి మిక్కిలి సామర్థ్యము కలదు. హిందువులనేకు లింగ్లీషుభాషను చక్కగమాటలాటఁగలరు. కాని సందర్భసిద్ధియందును భాషాసౌష్టవమునందును హేతుకల్పము నందును కృష్ణదాసుపాలునివంటివారు మిక్కిలి తక్కువగానున్నారు. ఇంగ్లాండులోనే పుట్టిపెరిగి యింగ్లీషునే స్వభాషగా నభ్యసించిన పెక్కుదొరలకంటె కృష్ణదాసుపాలునకే యింగ్లీషుభాష యెక్కుడు వశమైనట్లు కనఁబడునని యింగ్లీషువార్తాపత్రికలే కొన్నివ్రాసినవి.

కృష్ణదాసుపాలుని మరణమును గూర్చి దేశస్థులందఱు విచారించిరి. అప్పటి గవర్నరు జనరల్ గారగు రైఫన్ ప్రభువుగారు శాసన నిర్మాణసభలో కృష్ణదాసుని మరణమును గూర్చి యిట్లనిరి. "అతని బుద్ధికుశలత యసాధారణమైనది. ఈసభలో నతఁడు మాటలాడుచున్నప్పుడు వినినవారందఱు వానిపాండిత్య విశేషము నంగీకరించియే యున్నారు. కృష్ణదాస్ పాలునియొద్ద మూఁడు మంచిగుణములుండినవఁట. 1. సమమైనయాలోచనశక్తియు 2. తానునమ్మిన పనిచేయుటలో ధైర్యము 3. కోపము లేకపోవుట యీమూడుఁ నుండుటచే నతఁడు దేశస్థుల యొక్కయు నధికారుల యొక్కయు మెప్పువడసెను" సర్ ‌రిబాడున్ టెంపిదొరగారు నాకాలపు మనుష్యులు కార్యములు యనుగ్రంథము రచియించి యితనిని గూర్చి యిట్లువ్రాసిరి. "గవర్నరు జనరలుగారి సభలోనున్న హిందువులలో కృష్ణదాస్‌పాలను నతఁడె సమర్థుడు. రాజా మాధవరావుగారి తరువాత హిందువులలో నిన్నిసంగతులు తెలిసిన యతఁ డితడొక్కడే శాసన నిర్మాణ సభలో దొరతనమువారి కతఁడు మిక్కిలి సహాయునుగా నుండెను.

కృష్ణదాసపాలునకు కుటుంబ సౌఖ్యము సరిగా నుండలేదు. అతనికి మొట్టమొదట 1856 వ సంవత్సరమున వివాహమయ్యెను. ఆభార్యవలన నతని కిరువురు కొడుకులు గలిగి బాల్యమునందే మృతినొందిరి. పిదప 1872 వ సంవత్సరమునందా భార్య మృతినొందఁగా నతఁడు 1874 వ సంవత్సరమున మరల వివాహము చేసికొనెను. ఈ రెండవ భార్యవలన నతనికి కుమారుఁడు కలిగెను. గాని వాఁడును శైశవమునందే మృతినొందెను. అతఁడు నిగర్వియై డంబములేక సామాన్యునివలెనే జీవితకాలము గడపెను. అతఁడు స్వమతాభిమానముగల హిందువుడైనను సంఘసంస్కారమునకు విరోధికాఁడు. సంస్కారము మెలకువగాను నెమ్మదిగాను జరుపవలయునని యతని యభిప్రాయము. అతఁడు న్యాయదృష్టిగల స్వతంత్రుడు. బిరుదుల నిమిత్తము దొరతనమువారి నెన్నఁడు నాశ్రయింపలేడు. అయాచితముగా బిరుదులు వచ్చినప్పుడు వానిని గ్రహింపకపోలేదు. అతఁడు తనకు రావుబహద్దరు బిరుదము వచ్చినప్పుడు పత్రికలలో నిట్లు వ్రాసెను.

"మాపేరు రావుబహద్దరులలో నగపడుటచే మేము మిక్కిలి యాశ్చర్యము నొందినారము. మే మేనేరము చేసినామని మాకీశిక్ష విధింపఁబడినదో తెలియఁ జాలము. మాకు బిరుదులు పొందవలయునని యాసలేదు. మేము చేసిన సేవకు సంతసించి దయామయులై యధికారులు మాకీ గౌరవమును దయచేసి నందుకు కృతజ్ఞులమై యున్నారము. మాకీసంగతి ముందు తెలిసిన మా మాట సాగెడు పక్షమున మేము మా జోలికెవరు రావలదనియు బిరుదులు గిరుదులు మాకవసరము లేవనియు వానిందప్పక వేఁడుకొని యుందుము."

ఈ పైవాక్యములఁ బట్టియు యింకఁ దక్కిన సంగతులఁ బట్టియు కృష్ణదాస్‌పాలుడు 19 వ శతాబ్దమునఁ బుట్టిన దేశాభిమానులలో నొకఁ డనియు వాని మార్గము ననుసరించుటకు మన మందఱముఁ బ్రయత్నము చేయుచుండవలయు ననియు జదువరు లీతని చరిత్రమువలనఁ గ్రహింతురుగాక !


Mahaapurushhula-jiivitamulu.pdf