మహాపురుషుల జీవితములు/తండాళం గోపాలరావు

వికీసోర్స్ నుండి

తండాళం గోపాలరావు

తండాళం గోపాలరావుగారు కావేరీ నదీతీరమున కుంభకోణమునకు సమీపమందున్న గణపతి యగ్రహారమున 1832 వ సంవత్సరమున జన్మించెను. ఈయన మహారాష్ట్ర బ్రాహ్మణుఁడు. పదునేడవ శతాబ్దమందు మహారాష్ట్రులు స్వదేశమువిడిచి తంజావూరునకువచ్చినప్పుడు వీరికుటుంబముగూడ దక్షిణదేశమునకు వచ్చి యచ్చట స్థిరముగ నుండెను. ఈయన తాతపేరు తండాళము జీనన్న. ఆయనకు రామచంద్రపండితుఁడని నామాంతరముఁ గలదు. ఆయన కొంతకాలము తంజావూరు మహారాజువద్ద పనిచేసి పిదప నింగ్లీషు దొరతనమువారివద్ద తహసిల్ దారయ్యెను. ఆయన కుమారుఁడు గోపాలరావు తండ్రియు రాఘవపండితులను నామాంతరముగల బావాపండితుఁడు. సుప్రసిద్ధుఁడైన శరభోజీ మహారాజువద్ద కొన్నినాళ్ళు పని చేసెను. ఆయన కైదుగురు కుమారులు. గోపాలరావందుఁ గడపటివాఁడు. బావాపండితుఁడు గణపతి యగ్రహారమున మూడుసంవత్సరము లుద్యోగవశమునుండి పిమ్మట తిరువడియను గ్రామమున గొంతకాలముండి యాకాలమున తిరువాన్కూరు సంస్థానమున మంత్రియు రాజా మాధవరావుగారి తండ్రియగు నగు దివాను రంగారావుగారి యాదరణమునఁ దిరువాన్కూరునకుఁ బోయెను. బావాపండితుని కుమారుల కిద్దఱకు వెంటనే యాసంస్థానమున నుద్యోగములయ్యెను. తిరువాన్కూరులో నున్నపుడె బావాపండితుఁడు కాలధర్మము నొందెను. కాలధర్మము నొందుటచే వాని కుటుంబము తంజావూరునకుఁ దిరిగి వచ్చెను.

గోపాలరావు తక్కిన సోదరులవలెనే తండ్రివద్ద బాల్యమున సంస్కృత మహారాష్ట్ర భాషలనేర్చుకొనెను. ఆకాలముననింగ్లీషులోఁ
గొంత ప్రవేశముగల దేవాజీరా వనునతఁడు గోపాలరావున కింగ్లీషులోఁ బ్రవేశముఁ గలిగించెను. కాలచక్రమమున నాంగ్లేయభాష నితఁడు తన వశము చేసుకొనుటకు స్వయంకృషివల్ల నేగాని పరసహాయము చేతగాదు. ఆతఁడు మరణమొందుటకు నాలుగేండ్లక్రిందట నొకరితో నిట్లు చెప్పెను. 'నాచదువొక పాఠశాలలోఁగాని కళాశాలలోఁగాని నేర్చుకొన్నదికాదు. నేనుపదునై దేండ్ల వాఁడనైనప్పుడు నాపాట్లు నేఁబడి నేర్చికొన వలసినవాఁడనైతిని. ఆభాషాప్రవేశము మొట్టమొదట నాకొకపల్లెటూరిలోనైనది. ముప్పదియై దేండ్లక్రిందట పల్లెటూళ్ళలో నెంతపాటి యింగ్లీషు విద్య యుండునో మీరే యూహించుకొనుఁడు. పశ్చిమఖండ భాషలు ప్రకృతిశాస్త్రములు నేనునేర్చికొనుట పరసహాయ మెంతమాత్రములేని నాస్వయంకృషి వల్ల నేః స్వయంకృషి యనినచో నందతిశయోక్తి యేమియు లేదు. నాపుస్తకములు మాత్రమే నాగురువులు."

పదునేడేండ్లు ప్రాయమువాఁ డైనప్పుడు గోపాలరావు తంజావూరు కలక్టరుకచ్చేరిలో నుద్యోగముసంపాదించుకొని రెండుసంవత్సరములు ముగియకమునుపె యొక యింజనేరు కచ్చేరిలో మేనేజరయ్యెను. ఈయుద్యోగమున నతఁడు మూడు సంవత్సరము లుండెను. ఆకాలములో నట్టి యుద్యోగస్థుల కెంతెంత లాభముండెడిదో విస్తరించి వ్రాయనక్కర లేదు. గోపాలరావు తానున్న మూడేండ్లలో శక్యమైనంతవఱకు లంచగొండుతనము నణచుటకుఁ బ్రయత్నము చేసెను. చెన్నపట్టణపు హైకోర్టులో జడ్జియై చాల ప్రసిద్ధికెక్కిన హాలోవే దొర యాకాలమున దంజావూరుజిల్లాలో నసిస్టంటు కలక్టరుగానుండి గోపాలరావుయొక్క ధర్మతత్పరత సామర్థ్యము గనిపెట్టి చాలమెచ్చి తానుచెన్నపట్టణమునకు వచ్చినపిదప గోపాలరావునకుఁ జాల సహాయము చేసెను. 1854 వ సంవత్సరమున గోపాలరావు విద్యాశాఖలోఁ బ్రవేశించి కుంభకోణమందలి దొరతనమువారి పాఠశాలలో సహాయోపాధ్యాయుఁ డయ్యెను. 1857 వ సంవత్సరమున చెన్నపట్టణపు యూనివరిసిటీ స్థాపింపఁబడెను. ఆ సంవత్సరమే గోపాలరావు ప్రవేశపరీక్ష (మెట్రిక్యులేషను) కుఁ బోయి యందుఁ గృతార్థుఁ డయ్యె. తరువాత రెండేండ్లకే యనగా 1859 వ సంవత్సరమందే యతఁడు పట్టపరీక్ష (బి. ఏ.) కుఁ జదివి యందు మొదటితరగతిలో మొదటివాఁడుగఁ గృతార్థు డయ్యెను. అట్లు గోపాలరావు పరీక్షలోఁ బ్రధమగణ్యుఁడై వచ్చుట, మిక్కిలి కష్టసాధ్యము. ఏలయన నతఁ డుపాధ్యాయుఁ డగుటచేఁ బ్రతిదినము బాఠశాలలో నాఱు గంటలు పనిజేసి యలసి యింటికిఁబోయి గృహకృత్యములు నెరవేర్చుకొనుచుఁ దీరికయున్నప్పుడు స్వయముగాఁ గ్రంథములఁ జదువుకొనుచు వచ్చెనేగాని యొకపాఠశాలలోఁ జేర లేదు. ఒక గురువువద్ద పుస్తకముఁబట్టి చదువలేదు. ఆహాహా స్వయంకృషిసహజ పాండిత్యమునను శబ్దములు గోపాలరావునందే సార్థకములైనవి గదా! అప్పుడు గవర్నరు జనరలుగారి యాలోచనసభలో సభికుఁడైన ఫోర్సుదొర కలకత్తానగరమందుండగా నీతడుఁ పట్ట పరీక్షం దేరినట్లు విని గోపాలరావున నీక్రిందివిదమున జాబువ్రాసెను.

"నీవు నాకు వ్రాయకపోయినను బి. ఏ. పరీక్షలో నీనడుమ మొదటివాఁడుగ గృతార్థుఁడ వైనవాఁడవు నీవే యనుటకు నాకు సందేహము లేదు. నేను నీయభివృద్ధియం దిష్టముగలవాఁడనిని నీవు తలంపక పోయినందుకు నాకు విచారముగ నున్నది. ఈ పరీక్షలో దేరినందుకు నిన్ను నేను బహూకరించుచున్నాను ఈ కృతార్థత నీ బుద్ధికి దగియున్నది. ఈవిజయము పునఃపునః ప్రయత్నములకు నిన్ను బురిగొల్పుగాక" హాలోవేదొర యాసమయమున నీ క్రింది లేఖ వ్రాసెను. "నేను చాల జాబులు వ్రాయజాలను. అయినను నీ సంతోష సమయమున నాయానందమును దెలియజేయకుండుటకు నీపురోభివృద్ధి గోరకుండుటకు నామనసొప్పినది కాదు".

అది మొదలు గోపాలరావుయొక్క జీవిత మంతయు విద్యాశాఖలోనే గడుపబడెను. అందు జాల భాగము కుంభకోణ కళాశాలలోనే జరిగెను. కుంభకోణ కళాశాలయొక్క కీర్తి యిద్దఱివల్ల దేశమంతట వ్యాప్తమైనది. అందొకడు పోర్టరుదొర రెండవ యతడు గోపాలరావు. ఆకళాశాలలో నింగ్లీషుభాష గణితశాస్త్రము విద్యార్థులకు బోధించుభారము చాలవరకు గోపాలరావుమీదబడెను. దక్షిణ హిందూస్థానమున నాంగ్లేయ విద్యా ప్రాబల్యమునకు బ్రథమ పురుషుడైన పవెలుదొర గోపాలరావును మించినవారు సాధారణముగ నుండరని పలుమారు చెప్పెను. 1870-71-72 సంవత్సరములలో దొరతనమువారును గోపాలరావును గొంతకాలముపాఠశాల పరీక్షాధికారి (ఇనస్పెక్టరు)గా నియమించిరి. ఈ యుద్యోగము తెల్లవారికేగాని నల్లవారి కిచ్చెడు వాడుక పూర్వము లేదు. అట్టిగొప్ప యుద్యోగము స్వదేశస్థులలో మొట్టమొదట గోపాలరావునకే యిచ్చిరి. ఆయుద్యోగములోనుండి గోపాలరావు పాఠశాలలో నేర్పబడు విద్య మిక్కిలి యుపయుక్తముగా నుండునట్లు చేయుటకై పాటుపడెను.

చెన్నపురి దొరతనమువారు కూడ స్వదేశస్థుడు పాఠశాలా పరీక్షాధికారిగా నుండదగునో లేదో యని మొదట సంశయించి యాయుద్యోగము మాయన కిచ్చిరి. ఆయన మూడేండ్లు యధికారము జేయునప్పటికి దొరతనమువారు సంశయ నివృత్తులై గోపాలరావు పని మిక్కిలి నేర్పుతో జేసెననియు స్వదేశస్థు లీ యుద్యోగమునకు దగుదురనియు వ్రాసిరి. చెన్నపట్టణపు యూనివరిసిటీవారు వాని సామర్థ్యమును మెచ్చి యాయననొక ఫెల్లోగా జేసిరి. 1872 మొదలు 74 వఱకు గోపాలరావు కుంభకోణము కాలేజీకి బ్రధానోపాధ్యాయుడై (ప్రిన్సిపలు) యుండెను. ఆ సంవత్సరములలో కుంభకోణ కళాశాలయొక్క పరీక్షాఫలితములు వెనుక పోర్టురుదొరగారి కాలములోకంటె నెక్కువ తృప్తికరములుగా నుండెను. ఆనాటిడైరక్టరు గవర్నమెంటు వారికి వ్రాయు సంవత్సర చర్యలో గోపాలరావు గూర్చి యీ క్రింద విధమున వ్రాసెను. "మన రాజధానిలో రెండవ కళాశాలకు బ్రథానోపాధ్యాయుడై గోపాలరావు తత్పదవికి దన యర్హతను సంపూర్ణముగ స్థాపించి యున్నాడు. కావున కాళీ వచ్చినప్పు డాయన కీయక తప్పదు. ఆయన సామర్థ్య మెట్టిదైనను పరీక్షాఫలితము లెంత తృప్తికరములుగా నున్నను మెచ్చవలసిన యధికారు లెంతగా మెచ్చినను దొరతనమువారు మాత్రము వానికా కళాశాలలోఁ బ్రథానోపాధ్యాయత్వము ఖాయముగ నీయజాలరైరి. 1878 వ సంవత్సరమున దొరతనము వా రాయనను కుంభకోణమునుండి చెన్నపట్టణ కళాశాలకు మార్చి యర్థశాస్త్రమందు దేశచరిత్రమందుఁ బండితునిగఁ జేసి తెల్లవారితో సమానమైన జీతముగల గౌరవస్థితికిఁ దెచ్చిరి. అంతటి విద్యావంతునకు నంతటి సమర్థునకు గవర్నమెంటువారా యుపకారముఁ జేసినందుకు జనులు సంతసింపక యదివరకే కుంభకోణము కళాశాలలోఁ బ్రథమ పండితోద్యోగ మీయ నందుకు జాల వగచిరి. తెల్ల వారితో సమానమైన యుద్యోగమీయక పోయినను జీతము వారితో సమముగ నిచ్చి మరియు గన్నీళ్ళుదుడుచుటకు దొరతనమువారు వానికి 'రాయబహుదూర'ను బిరుదమునిచ్చిరి.

గోపాలరావుయొక్క కటపటిదినములు చెన్నపట్టణము రాజకీయకళాశాలలోనె గడుపఁబడెను. 1883 వ సంవత్సరమున నతఁడు శక్తికి మించినపని చాలకాలమునుండి చేసినందున దారుణజ్వరపీడి తుఁడై బాధపడెను. అతని శరీరస్థితి తృప్తికరముగా నుండనందున 1885 వ సంవత్సరమున నతఁ డాఱుమాసములు సెలవుపుచ్చుకొని కుంభకోణమునకుఁ బోయెను. ఈసెలవునుండి యాయన తిరిగి యెన్నఁడు బనిలోఁ జేర లేదు. కుంభకోణమునఁ గొన్నినాళ్ళుండునప్పటికి రోగము క్రమక్రమముగ తగ్గుటకుమారు ప్రబలముకాఁగా తగిన చికిత్సకొఱకు బంధువులు వానిని జెన్నపురికిఁ దోడ్కొనివచ్చిరి. గోపాలరావు చెన్నపట్టణమందె 1886 వ సంవత్సరం మేనెల 11 వ తారీఖునఁ గాలధర్మ నొందెను.

ఆయనమరణ మెల్లవారిని దుఃఖింపఁజేసెను. చెన్నపురి రాజకీయ కళాశాలాధికారులు వానిశక్తికి వానిచేసిన పనికి మెచ్చుచు మరణమునుగూర్చి మిక్కిలి విచారించిరి. అప్పటిడైరక్టరగు డాక్టరు డంకను వానిమరణముంగూర్చి దొరతనమువారికి వ్రాయుచు నీక్రింది విధమున వానింగూర్చి ప్రశంసించెను. "గోపాలరావు విద్యా శాఖలో 1854 వ సంవత్సరమునఁ బ్రవేశించి యిప్పటికి ముప్పది రెండేండ్లు సేవ చేసెను. ఈదీర్ఘకాల మతఁడు దొరతనమువారికి లోకమునకుఁ జాల మేలుచేసెను. అతఁడు గొప్పశాస్త్రజ్ఞుఁడయ్యు నాంగ్లేయభాషా పాండిత్యమునకుఁ మిక్కిలి ప్రశంసచేయబడుచు వచ్చెను. ఇంగ్లీషు భాషాగ్రంథావళి బోధించుటలో గొప్పయూరపియనులతో బోల్చునపుడు గూడ నతఁడు ప్రథమగణ్యుఁడై యుండువాఁడు. కొన్ని సంవత్సరముల నుండి ప్రెసిడెన్సీ కాలేజీలోను యూనివరుసిటీలోను వానితో గలిసియుండు భాగ్యము నాకులభించినందున వానిమరణము వలన గలిగిన విశేషనష్టమును నేను తెలిసికొన గలిగితిని." ఆ సంవత్సరమే మేనెల 26 వ తారీఖున డాక్టరు డంకను గోపాలరావు జ్యేష్టపుత్రున కీక్రిందిజాబు వ్రాసెను. "నేను ఆయనను చాలసంవత్సరముల నుండి యెఱుఁగుదును. వాని సద్గుణములకు నీతికిఁ జాల సంత సించువాఁడను. ఇటీవల ప్రెసిడెన్సీకాలేజీలో నాయదృష్టమువల్ల వానికిఁ బరిచితుఁడ నైతిని. ఒక్కసారియైన మామైత్రికి భంగము గలిగినట్లు నేఁ దలఁపను. ఏదాని కతఁ డలంకారమై యుండునో యట్టి విద్యాశాఖలోనున్న యుద్యోగస్థు లందఱు మీతో సమానదుఃఖితులై మీదుఃఖము వారిదుఃఖముగ నెంచుకొనుచున్నారు.

ఈ విధముగానే గోపాలరావు కుమారునకు విద్యావంతు లనేకులు పరామర్శ జేయుచు జాబుల వ్రాసిరి. "మీతండ్రి యకాలమరణమునకు గలిగినంత దుఃఖము మఱియొకరికిఁగలుగ" దని రంగనాథము మొదలియారు వ్రాసెను. హైకోర్టు జడ్జీయైన ముత్తుస్వామి యయ్యరుగూడ నీక్రిందివిధమున జెప్పెను. "నేను మొట్టమొదట వానిని 1854 వ సంవత్సరమున గలిసికొంటిని. అది మొదలు చివరవరకు నొక్కవిధముననే వానియందు గౌరవము భక్తియు గలిగియుంటిని. ఆయనబుద్ధి మిక్కిలిగొప్పది. దానినిముప్పదియేండ్లు కృషిచేసి వృద్ధి బొందించెను. ఆయన విద్యాసామర్థ్యము పాఠశాలలోఁ జదువుకొనుట వలనగాక స్వపాండిత్యమువలనను బరిశ్రమవలనను గలిగెను. ఆబుద్ధికి నాపాండిత్యమునకు నిష్కళంకమైన సత్ప్రవర్తనముం దోడుచేసి తన విధికృత్యమును శ్రద్ధతోనెరవేర్చెను ఆయన మహావిద్యావంతు లెట్లుండవలయునో యట్లుండెను" చెన్నపురి క్రిష్టియన్ కాలేజీ ప్రధానోపాధ్యాయుఁడగు రెవరెండు డాక్టరుమిల్లరు తనకాలేజీ పక్షమున బ్రకటింపఁబడు క్రిష్టియన్ కాలేజీ పత్రికలో గోపాలరావును గూర్చి ప్రశంసించెను. దక్షిణహిందూస్థానవాసుల యభిప్రాయమున మిక్కిలి గొప్పవాఁడగు గోపాలరావు మరణమునుగూర్చిన విచారములో నే నితరులలో గలియుచున్నాను. కీర్తి శేషుఁడైన యాతడు తనదేశస్థుల ప్రవర్తనమును సరిగా బోతబోయుటలోఁ జాలకృషి చేసెను. పాఠశాలాపరీక్షకుఁడుగాను మంచి యుపాధ్యాయుఁడుగాను గోపాలరావు తాను చేయఁ దలఁచిన పని సంపూర్ణముగ జేయుటయె గాక యితరులచేతఁ జేయింపవలసి వచ్చినప్పుడుకూడ మిక్కిలి పట్టుదలఁతో జేయించెను. పూనికతో బనిచేయుటయె యాతనివంతుగాని ఫలితములను బహుమానములను ముందు లెక్కజూచుకొనుట వాని పనిగాదు. తన విధికృత్యము దాను చేయుటయె వానికిఁ బ్రథమ కార్యము. ఏపనినైన నెరవేర్చుటలో నతని కతఁడె యాలోచించుకొనునుగాని రెండవవానితో నాలోచింపఁడు. తన చేయఁదలచిన పని న్యాయమని తోఁచెనా యాయన యది జనసమ్మత మైనను గాకపోయినను దానిని నెరవేర్చితీరును.

అతనిమార్గమును దక్షిణహిందూస్థానమందలి విద్యావంతు లందఱు నవలంబింపవలయు" ఆయన జీవితకాలమంతయు నుపాధ్యాయత్వమునందె గడపుటచేత వాని నెఱిఁగినవారందఱు వానిబోధనాశక్తి, సామర్థ్యమును గూర్చియే పలుకుదురు. ఆయనను గూర్చి యాయన శిష్యుఁ డొకఁడు కుంభకోణము నగర మందిరమున నీక్రింది విధమున బలికెను. "ఆతండు సంపూర్ణుడైన యుపాధ్యాయుఁడు. పాఠకపుస్తకమును విద్యార్థులకు బోధించు నప్పుడు పుస్తకములలో నున్న సంగతులనేగాక వాటికి సంబంధించిన విషయములనేకములు దెచ్చి లోకానుభవము గలిగించుచుండును. ఆవిషయము లెవ్వి యనగా నుత్సాహము గలిగించు ప్రాచీనకవిత్వములు జిత్రకథలు మహాత్ములయొక్కయు యోగులయొక్కయు చరిత్రములు అప్పు డప్పు డతఁడు చెన్నపురిరాజధానిలో మహావిద్వాంసులైన సుబ్రహ్మణ్యం అయ్యరు రంగనాథం మొదలియారు మొదలగువారింగూర్చి వారిమార్గము ననుసరించి ప్రవర్తింపుఁడని విద్యార్థులం బురికొలుపు చుండును. పక్షి తనకుఁ బుట్టినపిల్లలు గ్రమక్రమంబున నాకాశము మీఁది కెగురునట్లు చేయుట కెంతశ్రమపడునో యావిధముననే తన విద్యార్థులను లోకయాత్రలో నిరపాయముగ నడుచువారిగఁజేయుట కతఁడు పాటుపడుచుండును", ఆయనకు మహారాష్ట్రభాషలో మంచి ప్రవేశము గలుగుటచేఁ జిన్న తనమునుండియు నతఁడందుఁ గవిత్వము చెప్పెను. బాల్యమునం దాయన వ్రాసిన పద్యములు దొరకలేదు. మరణమునకుఁ గొన్ని మాసములక్రిందట నాంగ్లేయభాషలో గోల్డుస్మిత్తు మహాకవివ్రాసిన వానప్రస్థుఁడని యర్థమువచ్చు "హెర్మి" ట్టను పద్య కావ్యమును మహారాష్ట్రమునకు తర్జుమాచేసెను. అది యిప్పటికిని మహారాష్ట్రజనులచేత సంతోషపూర్వకముగా జదువఁబడుచున్నది. ఆయనకు సంస్కృతమునుండియు మహారాష్ట్రము నుండియుఁ బ్రాచీన మహాకవులు రచియించిన శ్లోకములెన్నియో గంఠపాఠముగఁ జదువఁ గల శక్తియుండెను. స్వకుటుంబములోనున్న వారి నీగోపాలరావప్పుడప్పుడు చిత్రచిత్రశ్లోకములు చదివి సంతోషపెట్టుచుండును. గోపాలరావునకు సంగీతశాస్త్రమునందును గొంత ప్రజ్ఞ గలదు. మంచిపాటను వినియాయన మిక్కిలి మెచ్చువాఁడు. గోపాలరావు పాఠశాలలో బాలురకు విద్య చెప్పి వారి మనస్సుల నెంత వికసింపఁజేసి జ్ఞానవంతములుగ జేసెనో యావిధముగా బడి లేనప్పుడు గృహమందు గూర్చుండి తనతో మాటలాడ వచ్చిన పరిచితులను మిత్రులను విజ్ఞానగర్భితములగు తనసంభాషములచేత వచ్చినప్పటికంటె నెక్కువ వివేకులుగఁజేసి బంపుచుండును. ఆయనతో మాటలాడుటయెంతో లాభకరముగా నుండును. ఆయనయేదిమాటలాడినను ముందుగయోచించి యుక్తియుక్తముగ సర్వజనగ్రాహ్యముగ నుండునట్లు మాటలాడును. జ్ఞానమితరులకునుపదేశించుట వారి కెంతయిష్టమో నేర్చికొనవలసిన యంశములుండిన నితరులవద్దనుండి యవి నేర్చికొనుటయు వారి కంతయిష్టము. నిరంతరము గ్రంథపఠనమందాసక్తి యుండుటచేతను నూతన జ్ఞాన మార్జింప నభిలాష గలుగుటచేతను గోపాలరావు యావజ్జీవము విద్యార్థియే యని చెప్పవచ్చును.

గోపాలరావు బుద్ధి యెంతసూక్ష్మమైనదో నడత యంత పవిత్రమైనది. జనులాయన ప్రజ్ఞ కెంతసంతోషించిరో యోగ్యతకు నంతియె సంతోషించిరి. పాండిత్యమునకుఁ బావనచరిత్రము తోడగుట బంగారునకు దావి యబ్బుటగదా ! సత్యమునందు ధర్మమునందు నాయనకు గల యధికప్రీతిచేత నతఁ డొకప్పుడు కఠినముగ భయంకరముగ మాటలాడుచుండును. అందువలన దోషములుచేయువారు వాని యెదుటకు వచ్చుటకు భయపడి గడగడ వడంకుచుందురు. ఇట్లనుటచేత నతఁడు సర్వజన సులభుఁడు కాఁడనియు గఠినస్వభావుఁ డనియుఁ దలఁపగూడదు. ఆయన యందఱకు సులభుఁడు దయానంతుఁడు, తత్వజ్ఞుడు.

గోపాలరావు గొప్ప సంఘసంస్కర్తలలో జేరినవాఁడుకాడు. గాని వాని యభిప్రాయము లన్నియు సంఘసంస్కారమున కనుకూలముగానే యున్నవి. ఆయన మతమున సంస్కారమునకు గావలసిన ముఖ్యవిషయములు నాలుగున్నవి. స్త్రీవిద్య దేశమునందు విశేషముగా వ్యాపింపవలయుననియు, బాల్యవివాహము లడగిపోవలయుననియు నిర్బంధవైధవ్యము లుండగూడదనియు ప్రతివర్ణములోనున్న యంతశ్శాఖ లణగిపోవలయుననియు నాయన తలంచెను. అన్నిటిలో బాల్యవివాహమే మిక్కిలి నష్టకరమని యాతఁడు తలంచెను. అదియే హిందూసంఘవృక్షమును నాశనముచేయు వేరు పురుగు. అది యే వర్ణములో మిక్కిలి వ్యాపించి యున్నదో యావర్ణము ననగా బ్రాహ్మణులను నానాఁటికి క్షీణదశకుఁ దెచ్చుచున్నది. ఆ యగ్రవర్ణమున నీ కాలమున జనించెడు బాలికాబాలకులు తమ పూర్వులట్లు దేహ దార్ఢ్యము గలిగియుండక పొట్టివాండ్రై దుర్బలులై స్వల్పరోగముల కైన నాగలేక యకాలమృత్యువుల పాలగుచుండుటచే నిట్టిదురాచారము ప్రపథమమున నివారింపఁబడవలసినదనియు నదియే సంస్కారములలోకల్ల సంస్కారమనియు గోపాలరావు కంఠోక్తిగఁ జెప్పుచు వచ్చెను. ఈనాటిబ్రాహ్మణులలో పడుచువాండ్రు మనఃపరిశ్రమమును గాని దేహపరిశ్రమముగాని చేయలేక చేసినమాత్రమున సొక్కి సోలి పోవుచుండుటయు పదునాఱు పదునేడేండ్లు వయసువరకు గట్టిగా కృషిచేసి విద్యాభ్యాసముచేసిన బాలురు రోగులగుటయు నాతఁడు కన్నులార జూచి యిట్లు దలంచెను. "వ్యవసాయము చేయువాఁడు తన విత్తులు మిక్కిలిమంచివై మందమశాగత్తులతో నేల సారము గలదై యున్నపుడె నాటును. బుద్ధిసూక్ష్మతగల హిందువుఁడు తన శరీరమునకీ పోలిక సరిపోవునని గ్రహింపలేక పోవుట మిక్కిలియాశ్చర్యముగా నున్న"దని యాయన చెప్పును. నిర్బంధ వైధవ్యము పాపహేతు వనియు దుస్సహమనియు గోపాలరావు మతము. బాలికలకాలమున వితంతులగుటకతిబాల్య వివాహమే ముఖ్య కారణమనియు నట్టి వివాహములు బాలికాబాలకుల యిష్టములు బడయకుండఁ దలిదండ్రులే చేయుచుండుటచేత వథూవరు లుత్తరవాదులు కారనియు నాయన వాదించుచువచ్చెను. సంఘసంస్కారమందు గోపాలరావు నేటి విద్యాధికులలో ననేకుల కంటె స్థిరాభిప్రాయములు కలిగి యుండెను. దక్షిణ హిందూస్థానమను నాకాశమండలమున సూర్యచంద్ర మండలములవలె గోపాలరావు రంగనాథ మొదలియారను వారిద్దరు నుదయించి చాలకాల మజ్ఞానాంధకారమును బారదోలి దేశస్థులభాగ్యదోషమున నకాలమున నస్తమించిరి.