Jump to content

మహాపురుషుల జీవితములు/సర్. తిరువఱ్ఱూరు ముత్తుస్వామి అయ్యరు

వికీసోర్స్ నుండి

సర్. తిరువఱ్ఱూరు ముత్తుస్వామి అయ్యరు

తిరువఱ్ఱూరు ముత్తుస్వామి అయ్యరు గారు తంజావూరు జిల్లాలోని ఉచువడి గ్రామములో 1832 వ సంవత్సరం జనవరి 28 వ తారీఖున నొక బీదబ్రాహ్మణ కుటుంబమున జన్మించెను. ఆతని దురదృష్టముచేతఁ దండ్రియగు వెంకటనారాయణశాస్త్రి స్వల్పకాలములోనే మృతినొందుటచే బాలకుని పెంచు భారమంతయు నిరాధార యగు తల్లిమీఁద బడెను. అప్పటికి ముత్తుస్వామి కొక తమ్ముడు గూడ నుండెను. తల్లి బాలకుల నిరువురిఁ దోడ్కొని తిరువఱ్ఱూరు గ్రామమునకుఁబోయి విద్యాభ్యాసము చేయింపసాగెను. అక్కడ బడిలో బాలకు లిద్దఱు స్వల్పముగ నఱవము నేర్చికొనిరి. ఆ చదువైనఁజాలకాలము చెప్పించుటకుఁదల్లికి శక్తి లేనందున ముత్తుస్వామి కుటుంబపోషణార్థము మిక్కిలి పిన్న వయసుననే యుద్యోగము సంపాదించుకొనవలసివచ్చెను. అందుచేత నతఁడు గ్రామకరణమువద్ద నెలకొక రూపాయ జీతముమీఁద లెక్కలువ్రాయుటకు గుదిరెను. కొడుకు సంపాదించునట్టి యా స్వల్పజీతమునైనఁ దిని బ్రతుకుటకుఁ దల్లికి ప్రాప్తము లేకపోయెను. ఈ చిన్న యుద్యోగమైన స్వల్ప కాలములోనే యామె మృతినొందెను. ఆమె బ్రతికియున్న కాలమున గుమారునకు విద్యమీఁద నధికాసక్తి గలిగించెనఁట. ఆమె చేసిన ప్రోత్సాహము చేతనే తా నంతటివాఁ డయ్యెనని ముత్తుస్వామి యయ్యరు పలుమా రిటీవల చెప్పుచు వచ్చును. ఆ యుద్యోగమున నతఁడు పదునాలుగు వత్సరముల వయసు వచ్చువఱకుండెను. దైవము గొప్పవారు కావలసినవారిని జిరకాలము హీనస్థితిలో నుంచడుగదా!

1846 వ సం|| ముత్తుస్వామి తన తాలూకా తహసీలుదారగు ముత్తుస్వామినాయకన్ననువాని ప్రాపకము గాంచెను. ఈతనికి బట్లరు


తహసిల్‌ దారను పేరుగూడ గలదు. తంజావూరు కలక్టరుగారగు మాంటుగొమనీ దొరగారికి ముత్తుస్వామి నాయకన్ కొంతకాలము బట్లరుగానుండి తరువాత తహసిల్ దారయినందున బట్లరు తహసిల్ దారని పేరుగలిగెను. చిన్నముత్తుస్వామి తహసిల్ దారు ముత్తుస్వామియొక్క ప్రాపకము సంపాదించుకొనుటకు నీ క్రింది కారణము చెప్పుచున్నారు.

ఒకనాడా తహసిల్‌దారునకు సమీపమందున్న నదిగట్టు వరదచేత గండి పడినదని వర్తమానము తెలిసెను. తోడనేయతఁడు కచేరీకిబోయి దానివిషయమున గొన్నిసంగతులు కనుగొనుటకు గుమస్తాను రమ్మని వర్తమాన మంపెను. గుమస్తాలెవరు నప్పుడు కచేరీలో లేనందున బాలుఁడగు ముత్తుస్వామి తహసిల్‌దారు కడకుబోయి యేమి సెలవని యడిగెను. తహసిల్‌దారు తనకు వచ్చిన కాగితము ముత్తుస్వామి చేతిలోఁబెట్టి యా గండి విషయమున గొన్ని సంగతులు గావలయునని చెప్పెను. ముత్తుస్వామి తానది కనుగొని వత్తునని చెప్పి తక్షణమే యా నదియొడ్డునకుఁబోయి గండి కొలుచుకొని దానిని పూడ్చుటకుఁ గావలసిన మట్టి మొదలగునవి యెంత కావలయునో తెలిసికొని మరల తహసిల్ దారువద్దకు వచ్చెను. తహసిల్ దారు మొట్టమొదట ముత్తుస్వామికట్టిన లెక్క నమ్ముట కిష్టము లేనివాఁడయ్యు నవసరమున యతఁడు వ్రాసిన కాగితముమీఁద వ్రాలుచేసి పంపెను. పంపి యాతహసిల్‌దారు ముత్తుస్వామి వ్రాసిన లెక్క సరియగునో కాదో తెలిసికొనుటకు తన హెడ్ గుమాస్తాను గండివద్దకు పంపెను. అతఁడదిచూచివచ్చి ముత్తుస్వామి వ్రాసినలెఖ్క సరిగా నున్నదని చెప్పెను. మఱియొకనాడు మిరాశీదారుఁ డొకఁడు తహసిల్ దారుకడకు బోయి తాను సర్కారుకీయవలసిన పన్నెంత యని యడిగెను. అతని కిరువదియూళ్ళలో భూములుండుటచేత


తహసిల్ దారు వెంటనే వానిప్రశ్న కుత్తరము చెప్పుటకు వీలులేక లెక్కలు చూడవలయునని చెప్పి దాపున నిలువబడియున్న ముత్తుస్వామిని జూచి యా విషయమున నీ వేమైన నెఱుఁగుదువా యని యడిగెను. ముత్తుస్వామి యే లెక్కలు చూడకయే మిరాశీదారు డీయవలసిన పన్ను మొత్తము చెప్పెను. తహసిల్ దారు డది సరియగునో కాదో ఋజువు చూపించి సరియేనని గ్రహించెను.

పై నుదహరింపబడిన రెండు సంగతులంబట్టి ముత్తుస్వామి యద్భుతమగు బుద్ధిసామర్థ్యము గలవాడని తహసిల్‌దారు కచ్చేరీలోను మేజువారుగా నుండెనని తోఁచుచున్నది. ముత్తుస్వామి తన తెలివికిఁ దగని యీ యుద్యోగముతోఁ దనివినొందక యాగ్రామమున చొక్కలింగ మను నతఁడు పెట్టినబడికి మధ్యాహ్నము పదునొకండు గంటలు మొదలు రెండుగంటల వఱకుఁ దనకు పనిలేదుగావున నా సమయమున నక్కడకుఁ బోవుచు పోయి యూరకొనక యింగ్లీషు చదువుకొనవలెనని కుతూహల ముండెఁగాని స్థితిగతులు బాగులేక పోవుటచే నట్లు చేయుటకు వీలు లేకపోయెను. తహసిల్ దారునకు మేనల్లు డొకడుండెను. అతని నెట్లయిన బాగుచేయవలెనని మేనమామ వానికి స్వయముగా జదువు చెప్ప నారంభించి ముత్తుస్వామిని గూడ వానితో జేర్చి యిరువురకు నింగ్లీషు మొదటి పాఠపుస్తకము చెప్పెను. పుస్తకము ముగిసిన పిదప తహసిల్ దారు వారి నిరువురఁ బరీక్షింపఁదలచి యొక వారము గడువిచ్చి గడువు లోపల పుస్తక మంతయు జదువుడని వాని కానతిచ్చెను. వారం గడచిన పిదప తహసిల్‌దారు పరీక్షించు నప్పటికి బ్రాహ్మణ బాలుడు గ్రంథము సమగ్రముగ నప్పగించెను. తహసిల్‌దారు మేనల్లుడు కొన్ని పుటలు మాత్రమే చదువ గలిగెను. బ్రాహ్మణ బాలుని బుద్ధికుశలత కచ్చెరువడి తహసిల్ దారు వానిని జదివించి వృద్ధికిఁ దేవలయునని


నిశ్చయించుకొని నాగపట్టణమును మిషను స్కూలులోఁ జదువుకొనుట కిష్టపడుదువా యని ముత్తుస్వామి నడిగెను. అందుకు ముత్తుస్వామి సమ్మతించి నందున తహసిల్ దారు వానిని నాగపట్టణము పంపించి బడిలోఁబ్రవేశ పెట్టించి వానికిసంరక్షకుఁడుగ నాగపట్టణములో నున్న తన తమ్మునే నియమించెను. ముత్తుస్వామి నాగపట్టణములో బదునెనిమిది మాసములు చదివి యాకాలములలో దన్ను గురించి యందఱకు మంచియభిప్రాయము కలిగించెను. అందు చేత దయాళువగు తహసిల్ దారు ముత్తుస్వామిని విద్యాభ్యాసము నిమిత్తము చెన్నపట్టణము హైస్కూలున కంపెను. అప్పటికి రాజా మాధవరావుగారు విద్యాభ్యాసము ముగించి యా పాఠశాలలోనే యుపాధ్యాయుడుగనుండెను. వెనుక తంజావూరు కలెక్టరుగానుండిన మాంటుగొమని దొరగారు గూడ గొప్ప యుద్యోగముమీద జెన్నపట్టణములో నుండిరి. బట్లరు తహసిల్ దారు మాధవరావుగారి కిమ్మని యొక యుత్తరమిచ్చి ముత్తుస్వామిని జెన్నపట్టణ మంపినందున మాధవరావుగా రాయుత్తరము జూచుకొని బాలుడగు ముత్తుస్వామి యం దభిమానముగలిగి శ్రద్ధతో విద్యాభ్యాసము చేయింప దొడగెను. మాంటుగొమనీ దొరగారు తంజావూరు జిల్ల జనులమీద మహాభిమానము గలవా డగుటచే నాజిల్లానుండి వచ్చి చెన్నపట్టణమున జదువుకొనుబాలుర క్షేమము స్వయముగా గనుగొనుచు వచ్చెను. ముత్తుస్వామియు దంజావూరువాఁ డగుటచే దొరగారి యనుగ్రహమునకుఁ బాత్రు డయ్యెను. ఆ యిరువుర దక్షతలోనుండి ముత్తుస్వామి యద్భుతముగ విద్యాభ్యాసము చేసెను.

అప్పుడు చెన్నపట్ణము హైస్కూలునకు పవెలుగారు ప్రథమోపాధ్యాయులై యుండిరి. దక్షిణహిందూస్థానమునకు విద్యావిషయమున నితడు చాల యుపకారముచేసెను. ఆయన శిష్యుడైన ముత్తుస్వామి


దినదినాభివృద్ధినొంది యేటేట బహుమానములను విద్యార్థి వేతనములను బడయుచువచ్చెను. వానిబుద్ధి గణితశాస్త్రమందు మిక్కిలి ప్రవేశించెను. అందులో జ్యోతిశ్శాస్త్రమునందు వానికి మహాభిమానము. విద్యార్థులకు నుపాధ్యాయులకు నీదినములలో నుండెడి పరస్పర సంబంధముగంటె నాదినములలో సంబంధ మెక్కుడుగనుండెను. ఈకాలమున విద్యార్థులు పాఠశాలలో నున్నంతసేపేకాని యవ్వల నుపాధ్యాయులను దరుచుగ కలిసికొనరు. ఆకాలమున అట్లుకాదు. పవెలుగారు పాఠశాలలో నొడలు దాచుకొనక యెంతో శ్రమపడి బాలురకు విద్యజెప్పుటయేగాక శిష్యుల నింటికి దీసికొనిపోయి వారికి గావలసిన శాస్త్రములు చెప్పుచు వచ్చెను. ముత్తుస్వామి మిక్కిలి చదువు తమకములుగలవాడగుటచే బలుమారు పవెలుగారి యింటికిబోయి రాత్రి తొమ్మిదిగంటలవఱకు జ్యోతిశ్శాస్త్రము మొదలగునవి నేర్చికొనుచు వచ్చెను. చీకటి రాత్రులలో శిష్యుడొక్కడు గృహమునకుఁ బోలేడని పవెలుగారు ముత్తుస్వామిని దనబండిమీఁద నెక్కించుకొని వాని నింటికి తీసుకొనిపోయి దిగవిడుచుచుండును. తన శిష్యుడు ప్రతి నెలకు వ్యయముచేయు సొమ్ము సరిగా వ్యయముచేయుచున్నాడో లేదో యని వాని లెక్కలు సయిత మాదొర నెల నెలకు జూచుచు వచ్చెనట. ముత్తుస్వామి బుద్ధిసూక్ష్మతకుఁ దోడుగ మిక్కిలి పాటుపడుచు వచ్చినందుల నెన్నో బహుమానములఁ బడసెను.

1856 వ సంవత్సరమున విద్యాధికారు లింగ్లీషులో మంచి వ్యాసము వ్రాసిన వానికి నైదువందల రూపాయలు బహుమాన మిచ్చుటకు బ్రతిజ్ఞ చేసిరి. చెన్నపురి రాజధానిలోనున్న విద్యార్థు లందఱు దానికి బ్రయత్నింపవచ్చునని వారు సెలవిచ్చిరి. అప్పు డనేకులు వ్యాసములు వ్రాసిరి. అప్పుడు బహుమానము ముత్తుస్వామికే వచ్చెను. ఆవ్యాసములో వ్రాసినవిషయము 'మనజాతిలోగల దుర్గుణ


ములు వానిని సవరించుకొనవలసిన విధములు' అతడు వ్రాసిన వ్యాసమును బరీక్షించిన వారిలో నప్పుడు హైకోర్టు జడ్జీగా నుండిన హాలోవేగా రొకరు. ఆయన ముత్తుస్వామి వ్రాసిన యావ్యాసమును మిక్కిలి మెచ్చెను. బహుమాన ధనమగు నైదువందల రూపాయల ధన మొత్తము ముత్తుస్వామి కిచ్చునప్పుడు పవెలుగా రీక్రిందివిధమున బలికిరి. "ఈ రూపాయలు నీవు ముందు ముం దదృష్టవంతుఁడవై సంపాదించు ధనరాసులను విత్తనములై యుండుగాక" ముత్తుస్వామి యారూపాయలను మిక్కిలి జాగ్రత్తగాదాఁచి మృతునొందువఱకు నెన్నడు నందులో నొకరూపాయియైన దీసి వాడుకొనలేదు. అప్పుడు దొరతనమువారు ముత్తుస్వామిపేరు గెజటులో బ్రకటించి యతఁడేయుద్యోగమునకైనఁ దగినవాఁడని వ్రాసిరి. శిష్యుని వై దుష్యముఁ జక్కగ నెఱింగి పవెలుగారు వాని నింగ్లాండు పోయి సివిలు సర్వీసు పరీక్షకు జదువుకొమ్మని పురికొల్పిరి. అందఱు విద్యార్థులవలెనే ముత్తుస్వామియు నప్పటికి వివాహమాడి కాలిసంకెళ్ళు తగిలించు కొన్నందున సముద్రయానమువలన వర్ణ భ్రష్టత గలుగునను భయమునను దేశమువిడిచి బోవడయ్యె. అందుచేత విద్య ముగిసినతోడనే ముత్తుస్వామి యఱువదిరూపాయల జీతముఁమీద నుపాధ్యాయుఁ డయ్యెను. అందులోనుండగా మాంటుగొమనీగారు తంజావూరు కలక్టరు కచేరీలో వానికి రికార్డుకీపరుపని యిచ్చిరి. అందులోనుండగా నప్పటివిధ్యాధికారి (డైరక్టరు) యగు నర్బతునాటుగారు వానిని డిప్యూటి యినస్పెక్టరు (పాఠశాల పరీక్షకుఁడు) గా నియమించిరి. ఈయుద్యోగమున నెలకు నూటయేఁబదిరూపాయలు జీతము కాని ముత్తుస్వామి యయ్యరు చిరకాల మందుండలేదు. ఏలయన నాకాలమున గవర్నమెంటువారు ప్లీడరుపరీక్షం గ్రొత్తగ బెట్టిరి. అందుఁ గృతార్థులైనవారు చెన్న పట్టణపు సాదరుకోర్టులో తక్కిపయన్ని


జిల్లాకోర్టులలోను బనిచేయ నర్హులని బ్రకటించినందున ముత్తుస్వామి యాపరీక్షకుఁ జదివెను. ఆ సంవత్సరము పరీక్ష కుంభకోణములో జరిగెను. అనేకులు పరీక్షకువచ్చిరి. అందఱిలో ముత్తుస్వామి యయ్యరు మొదటివాఁడుగ గృతార్థుడయ్యెను. రెండవయతఁడుగ దివానుబహద్దరు రఘునాథరావు కృతార్థుడయ్యెను.

అప్పటి ప్లీడరుపరీక్ష యిప్పటివలెగాదు. ఆకాలమున బరీక్షితులు (పరీక్షకు వచ్చినవారు) కోర్టులోనుండి తెచ్చిన ప్రాతరికార్డు నెవరో యొకరు చదువగా విని తాము విన్న యాసంగతులం బట్టి యావ్యాజ్యములో నొకతీర్పు నక్కడనే వ్రాయవలయును. కుంభకోణములో జరిగిన యాపరీక్షకును తంజావూరుజిల్లాజడ్జీ స్వయముగా వచ్చి నడపి పరీక్షితులు తీర్పు వ్రాయవలసిన విషయమున నొక ప్రాఁతవ్యాజ్యము రికార్డు దెప్పించి యది చదువుమని సిరస్తదారున కాజ్ఞాపించెను. సిరస్తదారు మిక్కిలి వడివడిగా జదివినందున ముత్తుస్వామి విస్పష్టముగా జదువుమని వానితో ఘర్షణము పడెను. జడ్జీ యదివిని సిరస్తదారును మెల్లిగా జదువుమని మందలించి తానుగూడ పరీక్షింపఁబడ వచ్చిన వారిలో నొకడుగా భావించుకొని బల్ల వద్ద గూర్చుండి సిరస్తదారు చదివిన యంశమునకు తానుగూడ నొక తీర్పు వ్రాయ సమకట్టెను. ఆ యంశములమీఁద ముత్తుస్వామియయ్యరు వ్రాసిన తీర్పు జడ్జీవ్రాసిన తీర్పు సరిగా నుండెను.

ఆతని శాస్త్రజ్ఞానమునకుమెచ్చి యీజడ్జి స్వల్ప కాలములోనే ముత్తుస్వామి యయ్యరును ట్రాంక్వెబారు పట్టణములో డిస్ట్రిక్టుమునసబుగా నియమించెను. ఆయుద్యోగములో ముత్తుస్వామి యయ్యరు చూపిన బుద్ధికుశలత నెల్ల వారుమెచ్చి పొగడిరి. ఆ జడ్జీ యొకసారి యీమునసబుగారి కచ్చేరి యాకస్మికముగా పరీక్షింపవలెనని తన రాక వానికిఁ దెలియఁబరచకుండ ట్రాంక్వెబారునకుబోయెను. ఆతని


రాక విని మునసబు వాని దరిశనముచేసి తనకోర్టు శోధించి పరీక్షింప వలయుననియుఁ దాను వ్యాజ్యములు విచారణచేయుచుండగా దగ్గర కూర్చుండి వినవలయుననియు నధికారిని గోరెను. అతని కోరికప్రకారము జడ్జీకోర్టు పరీక్షించి వాని ప్రక్కను గూర్చుండి వ్యాజ్యముల విచారణ విని చాల సంతోషించి తంజావూరువెళ్ళి ముత్తుస్వామి యయ్యరు తనతో సమానముగ జడ్జీపని చేయదగినవాఁడనియు వాని తెలివి యసాధారణ మైనదనియు వ్రాసెను.

ముత్తుస్వామియయ్యరు చిరకాల మాయుద్యోగమునం దుండ లేదు. ఆకాలమున దొరతనమువారు మనరాజధానిలో నున్న యీనాములనుస్థిరపరచి యీనాముదారులకు సర్వాధికారమునీయవలయునని యాపనిచేయుట కీనాము కమీషనరు నేర్పరచి వానికి సహాయముగా కొందఱు డిప్యూటీకలక్టరుల నేర్పరచిరి. అందులో ముత్తుస్వామి యయ్య రొక్కఁడు. ఆయీనాము కమీషనులో నతఁడు దేశస్థులకు దన యధికారులకు సంతుష్టి కలుగునట్లు బనిచేసెను. తరువాత దొరతనమువా రతనికి డిప్యూటి కలక్టరుపని స్థిరపరచి మేజస్ట్రీటు నధికార మిచ్చిరి. ఈయుద్యోగమం దుండగా నొకసారి యొక గొప్ప షాహుకారు మోసముచేసినాడని నేరస్థుఁడుగఁ జేయఁ బడెను. అది ముత్తుస్వామి యయ్యరు విచారణ సేయవలసివచ్చెను. షాహుకారుపక్షమున న్యాయవాదులలో నగ్రగణ్యుఁ డగు నార్టనుగారు వచ్చి పనిచేసిరి. ముత్తుస్వామి యయ్యరు పదునైదుదినములు విచారణచేసి యానేరమును జిల్లాజడ్జీగారు విచారణ చేయవలసినదని యాకోర్టులకు బంపెను. నార్టనుగారు చెన్నపట్టణమునకుఁబోయి తన మిత్రుఁడు హైకోర్టుజడ్జియు నగు హాలోవేగారిని గలుసుకొని ముత్తుస్వామి యయ్యరువంటి మేధావంతుని రివిన్యూ వ్యవహారములలో నిలుపుటచే వాని తెలివి వ్యర్థమగుచున్నదని చెప్పెను. ఆకాలమున దక్షిణకన్నడపు జిల్లాలో ధర్మశాస్త్రములో జక్కనిప్రవేశముగల సబుజడ్జీయొకఁడు కావలసివచ్చెను. ఆయుద్యోగమునకు ముత్తుస్వామి యయ్యరుకంటె దగినవాఁడు లేఁడని దొరతనమువా రతనినే నియమించిరి. ఈయుద్యోగము మూడేండ్లు చేసిన పిదప 1868 వ సంవత్సరమున దొరతనమువారు ముత్తుస్వామినిఁ జెన్నపట్టణమున పోలీసు మేజస్ట్రీటుగా (ప్రెసిడెన్సీ మేజస్ట్రీటుగా) నియమించిరి. ముత్తుస్వామి యయ్యరు వద్దనున్న ముఖ్యగుణ మేమనగా నతఁడు భయముగాని, పక్షపాతముగాని లేక శ్రద్ధాళువై తన విధికృత్యములఁ దీర్చుచువచ్చెను. దీని కుదాహరణముగా నొక కథగలదు. ఒక హిందువుఁడు హైకోర్టుజడ్జీలలో నొకని గృహావరణములోఁ బ్రవేశించినాఁడని యాజడ్జీ వానిం దిట్టముగఁ గొట్టెను. ఆహిందువుఁడు మన యయ్యరుగారివద్ద నాజడ్జీమీఁద నభియోగము తెచ్చెను. గొప్పవారిమీఁద నిటువంటి నభియోగములు వచ్చినప్పుడధికారులు ముందుగా వారికిసమనులు చేయక "మీకు సమను లేల చేయఁగూడదో తెలియఁజేయు" డని ముందుగా వ్రాయుదురు. అయ్య రట్టిపనిచేయక యాజడ్జీగారికి ముందుగా సమనుచేసెను. హైకోర్టు జడ్జీయంతవాని నంతస్వల్పనేరముమీద దనకోర్టుకురప్పించుట భావ్యముగాదని తనపైయధికారి హితోపదేశము చేసిననను వినక యయ్యరు వానిని దనయెదుటకు రప్పించుటయేగాక నేరస్థుని జేసి మూడురూపాయలు ధనదండన విధించెను. ఈయుద్యోగమునందున్నపుడే ముత్తుస్వామి యయ్యరు బి. యల్. పరీక్షకుఁ జదివి యందు మొదటితరగతిలోఁ గృతార్థుఁ డయ్యెను.

అనంతరము దొరతనమువారు ముత్తుస్వామిఅయ్యరును స్మాలుకాజుకోర్టు జడ్జీగా నియమించిరి. ఈ పదవిలోనుండి యాయన దొరతనమువారికి గలుగ జేసిన సంతుష్టి యింతింత యనరాదు. అప్పుడు


గవర్నరుగా నుండిన సర్ అలగ్జాండరు అర్బతునాటు ముత్తుస్వామి అయ్యరునకు తంజావూరుజిల్లా జడ్జిపనినీయదలచెను. కాని కలకత్తాలోఁ జెన్నపట్టణములో నుండిన తెల్లవారు వలనుపడదని చెప్పినందున మానవలసివచ్చె. 1878 వ సంవత్సరము జనవరినెలలో జరిగిన ఢిల్లీ దర్బారునకు దొరతనమువారు ముత్తుస్వామి అయ్యరు నాహ్వానముచేసి జ్ఞాపకార్థముగా వానికొక పతకమును బహుమానమిచ్చిరి. ఆ సంవత్సరమే వానికి సి. ఐ. యి. అను బిరుదము నిచ్చిరి. అప్పటికి చెన్నపట్టణపు గవర్నరుగారగు బకింగుహాంప్రభువుగారు వానికాబిరుదచిహ్నములను స్వయముగా నిచ్చి శ్లాఘించిరి. 1878 వ సంవత్సరమందే దొరతనమువారు ముత్తుస్వామి అయ్యరును హైకోర్టు జడ్జీని చేసిరి. చెన్నపురిరాజధానిలో స్వేదేశస్థులు హైకోర్టు పీఠ మెక్కుట కదియే ప్రథమము. ఆగవర్నరుగారు ముత్తుస్వామి అయ్యరునుగూర్చి యొక యుపన్యాసములో నీక్రిందివిధముగ జెప్పిరి. "ఆనరబుల్ శేషయ్యగారిని గవర్నర్ జనరల్‌గారి యాలోచనసభలో సభికునిచేయుటయు, ఆనరబుల్ ముత్తుస్వామి అయ్యరుగారిని హైకోర్టు పీఠ మెక్కించుటయు వారిని దగనిపదవిని నిల్పుటగాదు. తగనిగౌరవముచేయుట గాదు. అట్టివా రనేకులు కావలయు గావున వారి నవలంబించుటకు మీరు ప్రయత్నము జేయుఁడు"

ముత్తుస్వామి అయ్యరు హైకోర్టు పీఠమెక్కిన క్రొత్తలో దన సామర్థ్యముఁ దానెఱుఁగక కార్యనిర్వహణము గూర్చి కొంతకాలము భయపడజొచ్చెను. అతని భయమునకుదోడుగ మొదటనెతెల్లవారి వ్యాజ్య మొకటి విచారణకు వచ్చెను. ఒక తెల్లవాఁడువాగ్దానమును దప్పినాఁడని వానిమీఁదనభియోగముతేఁబడెను. ఇంగ్లీషువారి ఆచారవ్యవహారము లెఱుఁగనివాడగుటచేఁ బ్రమాదవశమున నెట్టి గొప్ప తప్పులుచేసి యపనిందపాలు కావలసివచ్చునో యని భయపడి జాగ్ర


త్తతో విచారణచేసి తీర్పు రెండు మూడు సారులు వ్రాసి చింపివేసి మరల వ్రాసి కోర్టులోఁ జదివెను. చదివినతోడనే యెల్లవారు తీర్పు మిక్కిలి యుక్తి యుక్తముగా నుండినదని శ్లాఘించిరి. అది మొదలుకొని అతనిప్రతిష్ఠ క్రమక్రముముగా హెచ్చెను. హైకోర్టుజడ్జిపదివికెక్కిన స్వదేశస్థులలో నింతవాడు లేఁడని యిప్పటికీ జనులు చెప్పుచున్నారు. ఆయనశాంతము నిష్పక్షపాతము మేనుదాఁచని పరిశ్రమ సత్యమును గ్రహించు సూక్ష్మబుద్ధి విశేషించి ధర్మశాస్త్రజ్ఞానము వానికి శాశ్వతమైన సత్కీర్తిం దెచ్చినవి, విస్తారము బుద్ధిపరిశ్రమగావలసిన చిక్కు వ్యాజ్యము లన్నియు సాధారణముగా నాతనివద్ద కేవిచారణకు వచ్చుచుండెడివి. న్యాయాధిపతియొక్క కృత్యము మిక్కిలి పవిత్రమైనదని యతఁడు నమ్ముచు వచ్చెను. ఆనమ్మికనే యొకసారి కాన్వోకేషను మహాసభలో నతఁడీక్రిందిమాటలతో వక్కాణించెను. "న్యాయస్థానము (హైకోర్టు) పవిత్రమైన దేవాలయము, అక్కడ కూర్చుండు న్యాయాధిపతులు (జడ్జీలు) మనుష్యులైనను సత్యదేవతయొక్క సేవకులు. ఆపవిత్ర దేవాలయమును దురాచారములతోను దుష్కార్యములతోను ప్రవేశించువారు తప్పక యీశ్వరద్రోహులు, మీలో నెవరైన నట్టిపీఠమెక్కి మీరాజుపక్షమున న్యాయము జేయవలసివచ్చినప్పుడు దైవముఖమును జూచి చేయుఁడు".

ఆయనతో సమానముగఁబీఠముమీఁద గూర్చుండిన యూరోపియనుజడ్జీలు వానిని మిక్కిలిగౌరవముతోఁజూచుచు ధర్మశాస్త్రములయందు వానిని మహాధికారిగా భావించిరి. వాని తీర్పులు మిక్కిలి పెద్దవిగానుండిన శాస్త్రాంశములను సమగ్రముగా చెరిగి వేయుచుండును. కోర్టులలో జరుగు వ్యవహారధర్మశాస్త్రముల సంబంధమగు గ్రంథములకు వానితీర్పులు మంచి అలంకారములని చెప్పవచ్చును. ఈప్రకారము స్వదేశస్థులయు దొరలయు మెప్పులుబడయుచు ముత్తుస్వామి అయ్యరు


పదునాఱుసంవత్సరములు హైకోర్టుజడ్జిగ నుండి యానడుమ 1893 వ సంవత్సరమం దొకసారి ప్రధాన న్యాయాధిపతిత్వమునందు మూడు మాసములు ప్రతిష్టింపఁబడి యాదొరతనమువారి యేలుబడిలో స్వదేశీయుఁడధిష్ఠింపఁదగిన మహోన్నతపదవిని బ్రాప్తించెను. దొరతనమువారు వాని రాజభక్తికి మెచ్చి కె. సి. ఐ. యి. అనుబిరుదముగూడ నిచ్చిరి. అంతటి కీర్తి తేజముతోఁ బ్రకాశించుచుండిన యాతని జీవిత కాలము 1895 వ సంవత్సరమున జనవరి నెలలో ముగిసెను.

ఆయన జడ్జీగా నుండుటచేత నితర లౌకిక వ్యవహారములలోఁ బ్రవేశించుటకుఁ దగిన వీలు లేకపోయెను. గాని యూనివర్సిటీ యని పిలువఁబడు విద్యాపరిషత్తునందు సభికుఁడైవిద్యాభివృద్ధివిషయమునఁ జాల పాటుపడుచు వచ్చెను. విద్యార్థులు బి. యే. బి. యల్., యం. యే. యం. యల్. మొదలగు పరీక్షలలోఁ గృతార్థులైనపిదప వానికి విద్యా పట్టము లిచ్చుటకు బ్రతి సంవత్సర మొక సభ జరుగును. ఆసభ పేరు "కాన్వో కేష" నందురు. అప్పుడు విద్యాభ్యాసము ముగించిన యా శాస్త్రబ్రహ్మచారులకు శాస్త్రాధిపతులకు రాజధానిలోనున్న గొప్ప వాఁడొకఁడు హితోపదేశము చేయుట యాచారముగ నున్నది. అట్టి యుపదేశమదివరకు తెల్ల వారే చేయుచు వచ్చిరి. స్వదేశస్థులను గూడ కొందఱి నిటీవల తత్కార్యమునకు నియమింపఁబడుచు వచ్చిరి. అందు మొదటివాఁడు ముత్తుస్వామి అయ్యరు. అతని యుపదేశము సర్వవిధముల శ్లాఘనీయముగ నుండెనని యది విన్నవారంద రభిప్రాయపడిరి. తనకు విద్యాగురువగు పవెలుగారియెడల నతఁడెంతో కృతజ్ఞుఁడై యుండెను. పవెలుగారివంటి మిత్రుఁడు హిందువులకు మఱియొకఁడు లేఁడని యతఁడు పలుమారు చెప్పుచువచ్చెను. కుంభకోణము కాలేజీ ప్రధానోపాధ్యాయుఁడగు తండాళం గోపాలరావుగారి విషయమున నతఁడిట్లు చెప్పుచువచ్చెను. "నాజీవితకాలములో నేను


సంపూర్ణముగా మెచ్చుకొన్న మనుష్యుఁ డితఁ డొక్కఁడే" గోపాలరావుగారిమీఁద నున్న గౌరవముతో సమానముగ రంగనాధం మొదలియారుగారిమీద నతనికి గౌరవముండెను.

ముత్తుస్వామి అయ్యరు సంఘస్కారమున కేవిధమయిన నుపకారముఁ జేయలేదని పలుమారాతని నెన్నుచుందురు. సంఘసంస్కరణము గావలయునని యతఁ డభిప్రాయపడెనఁటగాని మెల్లగను జాగరూకతతోను జేయవలెనని యాయనమతము. మనవిద్యాధికుల నేకులు వీరివిధముననే సంస్కరణము కావలెనని మాటలఁ జెప్పుచు నాచరణమున వెనుక దీయుచుందురు. మనదేశ స్త్రీల స్థితి యుండవలసిన విధముగా లేదనియు నెంతో మార్పు జెందవలయుననియు నాతఁడభిప్రాయపడి పురుషులు తమతమ సంరక్షణమందున్న స్త్రీలకు విద్య నేర్పుచుండవలసినదని యుపదేశము చేసెను. ఆయన విదేశ ప్రయాణమునకు విరోధికాఁడు ఆవిషయమున నతఁడొకసారి "మీలో యూరపుఖండమునకు వెళ్ళగలసామర్థ్యము గలవారు తప్పక యక్కడకుఁ బోయి యచటి సంఘస్థితులు నాగరికతలుఁ దెలిసికొని జ్ఞానాభివృద్ధి జేసుకొనుఁడు".

బాల్యవివాహము కూడదని యతఁ డీక్రిందివిధమున జెప్పెను. "రజస్వలానంతర వివాహము కన్య కశాస్త్రీయముకాదు. అయినను సంఘమట్టిపని మహాపాతకమని ఊహించి తండ్రి యొక వేళ అట్టివివాహము చేసినయెడల కూఁతును బాధించును" స్త్రీపునర్వివాహ విషయమున నాయన యభిప్రాయమిది. 'స్త్రీ' యొక్క వివాహమునకే యర్హు రాలయ్యున్నను పురుషుఁడు బహుభార్యలు జీవించియున్నప్పుడు సయితము తనయిచ్చవచ్చినట్లు వివాహమాడవచ్చునట. స్త్రీ పురుషుల స్వాతంత్ర్యములలోఁ గనఁబడుచున్న యీయన సమత్వము మన కుటుంబబద్ధతులవల్ల మఱింత బాధకరముగా నున్నది. స్థితిగతు


లిట్లుండుటచేత నభివృద్ధి పక్షమువారు మన సంఘపద్ధతి వానికాధారమయిన ధర్మశాస్త్రము క్రూరములుగ నున్నవనుట యొకయాశ్చర్యముగాదు. నీతి సంబంధము నాలోచించితిమా బాల వితంతు వివాహములు మన దేశమందెంత యవసరములో కొలఁదికాలము కాపురము చేసిన వింతతువులకు నంతియ యవసరమని నాయభిప్రాయము.

అట్లభిప్రాయపడియు ముత్తుస్వామియయ్యరు హైకోర్టుజడ్జిగా నుండి సంఘసంస్కరణమును ముఖ్యముగా వితంతువివాహమును వృద్ధిజేయుటకు మారు దానికి వ్యతిరేకముగ దీర్పులు చెప్పెను. అట్లు చెప్పుట తగదని కొందఱు తన్ను నిందింప నతఁడీ క్రిందివిధముగా వారికుత్తరము జెప్పెను.

కోర్టులు నడపవలసివచ్చిన హిందూధర్మశాస్త్రము జనుల యంగీకారమును బట్టికాని వేదకాలములోను స్మృతులకాలములోను నుండిన యాచారములనుబట్టి కాదు. అట్లు చేసితిమా తీర్పులు ధర్మ సమేతములుగావు. యుక్తియుక్తములుగావు. ఇట్టిమతము గల్గిన వాఁడయ్యు నతఁడు సంఘపురోభివృద్ధికి విఘ్న కారిగాడని కొందఱభిప్రాయ పడుచున్నారు. ముత్తుస్వామియయ్యరుగారి యభిప్రాయం ప్రకారము ప్రతిమనుష్యునకు మత ముండవలయును. ఆయన పూర్వాచారపరాయణుఁడు. బ్రాహ్మణుఁడు చేయవలసిన నిత్యానుష్ఠానములను తప్పక నెరవేర్చువాఁడు. వేదాధ్యయనము జేసిన వారియెడ నాయనకు మిక్కిలి గౌరవ ముండెను. వేదశాస్త్రముల యభివృద్ధికై యతఁడొక పాఠాశాలగూడ బెట్టించెను. ఆతని జ్ఞాపకశక్తి యద్భుతమైనది. అతఁడు దేనినైన ముమ్మారుచదివిన యావజ్జీవము జ్ఞాపక ముండునట. ఒక వ్యాజ్యము విని తరువాత నాఱుమాసములకైన జ్ఞాపకముంచుకొని తీర్పు వ్రాయఁగలడట. ఆకాలమందలి విద్యార్థులు కొన్ని పుస్తకములను కంఠపాఠముగ జదివి దానిని మరల చూడకుండ


వ్రాయగల సామర్థ్యముగలవారు. ముత్తుస్వామియయ్యరు నట్టివాడె. చిన్ననాటనుండియు నితడు చాలకష్టములకోర్చి విద్య నేర్చినవాడు. శాంతసముద్రుడు, నీతిమంతుఁడు ఉపాధ్యాయులందరు వానినెక్కుడు గారము చేయుటంబట్టి విద్యార్థియైన నాతడు కొంచెము గర్వియై యుండెను. గాని యుద్యోగమునందు జేరినపిదప కార్యభారము పై బడినకొలది లోకానుభవము కలిగినకొలది "విద్యయొసగును వినయ" మన్నమాట కుదాహరణమై యుండెను. ఈయనకు సంగీత విద్యయం దత్యంతమైన యభిమానము. ఈనాటి గొప్పయుద్యోగస్థులలో ముఖ్యముగ మన యాంధ్రులలో నిది యరుదుగదా ! ఈయన మహా ధన సంపన్ను డయ్యు దానధర్మములు విస్తారము చేసినట్టు కనబడదు. స్త్రీపునర్వివాహాది సంఘసంస్కారములు తనకిష్టమని పలుమారు వచించియు నాంధ్రదేశ శంకరాచార్యస్వామికిని శ్రీయాత్మూరి లక్ష్మీనరసింహముగారికిని జరిగిన వివాదములో నితఁడు స్వాములవారికి రెండువందల రూపాయలు ధన దండన విధించి యాయన యధికారమును మాత్రము బలపరచెను. ఇందుచేతనే యతడు సంఘసంస్కారమునకు మంచి ప్రాపుకాడని తలంచిరి. సంస్కారాభిలాష యెట్లున్నను దక్షిణ హిందూస్థానములో బుట్టిన గొప్పహిందువులలో నిత డొకడు. ఈయన తన పరిశ్రమవలననే నెలకొక రూపాయిజీతగాడయి యెట్టకేలకు నెలకైదువేల రూపాయల జీతము పుచ్చుకొనువాడయ్యెను. ఈయన సత్ప్రవర్తనము నిష్పక్షపాతబుద్ధి పరిశ్రమాసక్తి శ్లాఘనీయములు.