మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/శిశిరో

వికీసోర్స్ నుండి

శిశిరో

ఇతని తల్లిపేరు ' హెల్వియా'. ఆమె కులీనురాలు; మంచి గుణములు కలది. ఇతని తండ్రికిఁ గల యభివాదము మంచిది కాదు. అతఁడు రజకుఁడని వాడుక కలదు. పనిలోఁ బ్రవేశించినపుడు పేరును మార్చవలసినదని శిశిరోను స్నేహితులు వేఁడిరి.. కాని యతఁ డా పేరును వహించియే కీర్తినొందెద నని బదులు చెప్పెను. ఇతఁడు క్రీ. ప్రూ. 78 సం॥ రమున జనవరి మూఁడవ తేదీని జనన మొందెను. ప్రతి సంవత్సర మారోజున న్యాయకర్త లందఱును చక్రవర్తి క్షేమమునకు హోమముచేసి దైవప్రార్థనఁ జేయు వాడుకకలదు. ఇతని జననకాలమునఁ దల్లి విశేషముగఁ బ్రసవవేదనఁబడలేదు. ఇతని పెంపుడుదాది కొక ఛాయా పురుషుఁ డగుపడి భాగ్యవశమున నామె పెంచుచున్న శిశివు గొప్పవాఁడు కాఁగలఁ డనియు రోముపట్టణములోఁ బురుష సింహ మను పేరొందు ననియుఁ జెప్పెను. ఈ సోదెయొక్క సత్య మతని చేతలవలస తేట తెల్ల మయ్యెను. యుక్తవయస్సున నతఁడు పాఠశాలకుఁ బంపఁబడెను. అప్పు డతఁడు మేధావియని పలువురు తెలిసికొని యతనిని దర్శించుటకు పాఠశాలకుఁ బోవు చుండిరి. బాలురచే సన్మానింపఁబడి వారిలో సగ్రాసన మతఁ డధిష్ఠించెను, ' ప్లేటో' చెప్పినప్రకారము పండితునకును జ్ఞానికిని గావలసిన గుణము లతనికిఁ బట్టెను. అన్ని విద్యలను నేర్చుకొనుటకుఁ దగిన ధారణాశక్తిని గలిగియుండి యేవిద్యను నతఁడు తృణీకరించలేదు. అన్నిటిలోను గావ్యరచనయం దతని కాసక్తి మెండు. కాలాంతరమున పూనికతో నవ్యామోహమును సమజేర్చి గొప్ప కవీశ్వరుఁ డనియె కాక, గొప్ప వక్తయనికూడ నతఁడు ప్రసిద్ధినొందెను. భాషలో నేఁటికి కొన్ని మార్పులు వచ్చినను, నతనిప్రవచనీయము లిప్పటికిని శ్లాఘింపఁబడుచున్నవి. ఆతని యనంతరమున గొందఱు కావ్య నిపుణులు బయలుదేరినందున నతని కావ్యములు నీరసించి నేఁ డుపేక్షఁ జేయఁబడినవి.

సాధారణముగ బాలురకుఁ బఠనయోగ్యములైన చదువుల నతఁడు సాంతముగ నభ్యసించినపైని విద్వాంసుఁడగు 'పైలో' యొక్క ప్రసంగములను వినెను. 'సెనేటు' సభాధ్యక్షుఁడును న్యాయవాదియునైన 'మూసియసు-స్కివోలా' యను వానివద్ద న్యాయశాస్త్రము నతఁడు నేర్చెను. 'సిల్లా' యను వానియొద్ద శిక్షను బొంది శస్త్రవిద్యయం దభిలాష గలవాఁ డయ్యెను. జనప్రకోపమువలన ప్రజారాజ్యతంత్ర మల్లకల్లోలముగా నుండుటచేత దేశము తుదకు నిరంకుశ రాజాధిపత్యమగు నని యెంచి, శాస్త్రపరిశోధనఁ జేయుచు, విద్వాంసులతో ముచ్చటించుచుఁ, గావ్యాలాపవినోదములఁ దేలి శ్రవణ మననములలో, సతఁడు కాలమును గడిపెను. 'సిల్లా' యను నతఁడు ప్రభువై స్థిరముగఁ గొంత రాజ్యతంత్రము నిర్మాణించువఱకు నతఁడీప్రకారమున దివసములను జరిపెను.

'సిల్లా' రాజ్యాంగములను నడుపు కాలమున నతఁడు వక్తృత్వాభ్యాసమును జేయు చుండెను. కొన్నిదినములు దేశసంచారములో నతఁడు గడిపెను. ఈ దినములలో సుఖదుఃఖములను సమముగఁ జూచుటకు కొందఱు వైరంగికులు (Stoics) బయలు వెడలి యొక పాఠశాలను స్థాపించి దానిలో వారు సిద్ధాంతీకరించు చుండిరి. ఈ పాఠశాలలో 'శిశిరో' ప్రవేశించి వారి నియమములఁ గొన్నిటిని పరిగ్రహించెను. రాజకార్యములలో ప్రవేశించుట కతనికి సమయములు దొరకనప్పుడు 'ఆథెన్సు' పట్టణమునకుఁ బోయి యక్కడ శాస్త్ర శోధన జేయుచు దినములను గడపఁగోరెను..

ఇంతలో 'సిల్లా' మరణమునొందె నని వార్త శిశిరోకు వచ్చెను. ఇంతకుఁ బూర్వము దేహపరిశ్రమను జేసి దాని సతఁడు దృఢపఱచుకొనెను. అతని కంఠస్వరము తీరుగఁ గుదురుపడి కుహరాంతరాళముల నిండునటుల పూరించి మృదు మధురయుక్తముగఁ బ్రస్తావించుట కతనికి శక్తికలిగెను. రోము పట్టణములో స్నేహితు లతని నక్కడకు విజయముచేయ వలసినదని వేఁడుచు నుత్తరములు వ్రాయుట చేత సతఁ డక్క.డకుఁ బోయి రాజకార్యములలోఁ బ్రవేశించుటకు సమకట్టెను. దాని కనుగుణ్యముగఁ బ్రవచనము నభ్యసించుచుఁ బ్రవచనీయుల ప్రసంగములను వినుచు నతఁ డొకదినమైనను వ్యర్థము చేయలేదు. వ్యవహారశక్తుల నుపయోగించుటకుఁ దగిన సామర్థ్యముఁ బొందవలయుననిన, వ్యావహారికునకు వాచాలత్వము తోడుగా నుండవలెనని స్మరించి తద్రూపమగు పద్ధతుల నతఁ డవలంబించెను. -

అతఁడు వెంటనే మహోల్లాసముతో రాజకార్యములలోఁ బ్రవేశించెను. మొదట వ్యనహారములను నిర్వర్తించుటలో కొంచె మతఁడు తొట్రుపాటుపడినను జాగరూకతతో పనులను జేయుచుండెను. ప్రజ లతనిని దయాళువు, పిఱికిపందయని నిరసించిరి. పుస్తకజ్ఞానము తప్ప లోకజ్ఞానము లేని వాఁడని ప్రవాదముకూడఁ గలదు. గౌరవమును బొందవలె నను వాంఛ కలవాఁడగుట చేత నతనిని తండ్రి, స్నేహితులు ప్రోత్సాహపఱచినందున నతఁడు న్యాయవాదిగ సభలోనికి వెళ్లెను. క్రమముగ నతఁడు వాచాలకుఁడని దేశమందంతట వెల్లడియై సమకాలీనులలో గొప్ప వక్తయని ప్రసిద్ది నొందెను.

ఒక కాలమున క్షామము కలిగినందున నతనిని వికర్నికునిగ (Queestor) 'సెనేటు' సభవారు నియోగించి సిసిలీ ద్వీపమునకుఁ బొమ్మని యుత్తరవుచేసిరి. అక్కడి ప్రజలను మొదట నట్టహాసముతో ధాన్యమును రోముపట్టణమునకు బంపవలసిన దని నిరోధించినను నతఁడు వారిని నెమ్మదిగను న్యాయముగను పరిపాలించెను. రోముపట్టణములోని కులీనులైన కొందఱు పురుషులు మితిమీఱి ప్రవర్తించుటచేత వారిని సిసిలీద్వీపమునకు సభవారు వెడలఁగొట్టిరి. అక్కడ ప్రజాప్రతినిధియెదుట వారిపక్షము నవలంబించి శిశిరో ముచ్చటించెను. ఈ మహత్కార్యములను జేసినందు కతఁ డుబ్బినవాఁడై రోములో నందఱుఁ దనను విశేషముగఁ జెప్పుకొనుచుందురని తలంచి మార్గమున వచ్చుచు నతఁడొక స్నేహితునితో నీ విషయమును గుఱించి తర్కించెను. "ఇన్ని రోజులనుండి తమ రెక్కడనుంటి” రని వాఁడు ప్రతివచనమిచ్చెను.

మహా సముద్రములోఁ జిరుచేపవలె నతని కార్యములు రోములో మునిఁగిపోయినందుకు విచారించి వాంఛలను, తగ్గించుట కతఁడు సమకట్టెను. కీర్తిసముద్ర మపార మని యతఁడు గ్రహించెను. అయినను ముఖస్తుతియం దాసక్తియుఁ, గీర్తియం దపరిమితమగు కోరికయు గనుక నతని యధ్యవసాయములు కొన్ని సాగలేదు. శిల్పకారులు తమ పనిముట్లను వేర్వేరుగ గుఱ్తెఱిఁగినవిధమున రాజకార్యధురంధరుఁడు ప్రజలను వారివారి నామములతోఁ దెలిసికొన వలయును. అందుచేత నతఁడుగూడ నాగరికుల నందఱను వారి వారి పుట్టుపూర్వోత్తరములతోఁగూడ విచారించి వారిని జ్ఞప్తిలో నుంచెను. అతఁడు దేశ సంచారమునకు గమనించినపుడు తన స్నేహితులకుఁ జెందిన గృహక్షేత్రములను నిరూపించుచుండెను.

దినచర్య గడుచుటకు తగినంత స్థితి యున్నను నది విశేషముగ లేనందున న్యాయవాదములలో నతఁడు పణమును స్వీకరించకపోవుట చిత్రముగనున్నది. కొంత స్వామ్యము గలవాఁడై దాని మూలమున దేహయాత్రను సంతుష్టిగ నతఁడు జరిపెను. యుక్తాహారవిహారములు యుక్తమగు చేష్టలతోఁగూడి రోములు, గ్రీకులులోని విద్వాంసుల గోష్ఠినిఁ బొంది కాలము నతఁడు గమనించెను. అతని దర్శనముఁ జేయుటకు ప్రతిరోజును గొంద ఱతని గృహమునకుఁ బోవుట కలదు. రాజకీయ వ్యవహారములలో 'పాంపేయి' యనువాని కతఁడు తగినట్లు యోచనలను చెప్పుచుండెను.

అతనిని 'ప్రేటరు' అను నొక న్యాయాధికారిగ నియమించిరి. అతఁడు వ్యవహారములను నిష్కళంకముగ నిర్వర్తించెను. లంచములు పుచ్చుకొని న్యాయము నీతిపంథనుండి తప్పించి యపంథలోని కతఁడు త్రిప్పుట లేదు. మఱి కొంతకాలమున కతఁడు 'కాన్సలు' అను పెద్ద న్యాయాధికారిగా నియో గింపఁబడెను. ఎక్కడనున్నను న్యాయముఁ దప్పక తన వాచాలత్వము చేత సత్యమునకు వన్నెతెచ్చి ప్రజలచేత నతఁడు మన్నింపఁబడెను. నీతి పథమును దప్పక సత్యసంకల్పముతోఁ ఈపేజి వ్రాయబడి యున్నది. ఈ పేజివ్రాయబడి యున్నది. ప్రజల కప్రియమైనను దానినే విస్తరింపఁజేసి వారికి హితవుగ న్యాయాన్యాయములను విచారించుచుండెను.

అతని భార్యపేరు 'టెరన్షియా'. వీరి దాంపత్య మనుకూలముగనుండెను. భర్తయొక్క వ్యసహారములలో నామె సహకారినుండెను. భర్త త్రిశక్తియుతుఁడైనను నతని కామె మంత్రోత్సాహశక్తుల నాపాదించుచుండెను. దంపతు లిరువురుఁ బట్టణములో సన్మానమును విశేషముగఁ బొందుచుండిరి. పరులను మన్నించి వారిచేత మన్ననలను వీరు పొందుచుండిరి. ఆహితలక్షణుండును, రోషామర్షాహిషనిషేధుండును గుణాఢ్యుండును, నావేగాగమ వర్జితుండును నై యతఁ డొప్పుచుండెను.

ఎంత గొప్పవారికైన కాల మొకరీతిగ గడువఁబోదు. కాలాంతరమున నతఁ డజాతశత్రు నైనను వ్యవహారరీతిని గొందఱతనిపై శత్రుత్వమును బాటించి మంచి చెడ్డలను విచారించక దేశోచ్చాటనము జేసిరి. అతని గృహములను వారు తగుల పెట్టిరి. అతని స్వామ్యములను రాష్ట్రమునకుఁ గలిపిరి. అతఁడు చేశాంతంగతుఁడై పరదేశములలో ప్రజలచేత సత్కరింపఁబడెను. ఈలోపున నతని శత్రువులు పదభ్రష్ఠులైరి. అతని కర్మ పరిపక్వమయ్యెను. పదియారు మాసములకు స్వదేశమున కతఁడు వచ్చెను. అతని రాకకు ప్రజలు రాకకువలె నెదురు చూచిరి. తలవంపులైన శత్రువులకుఁగూడ నతని రాక మేలు రాక యయ్యెను. ఇంతలోనే రాజ్యాంగములు మాఱి ప్రజాప్రభుత్వమునకు బదులుగ నేకరాజాధిపత్యమును స్థాపించిరి. స్వదేశ చరిత్రను వ్రాయుట కతఁ డుద్యుక్తుఁ డయ్యెను. కాని కొన్ని కారణములచేత దానిని నెరవేర్ప లేకపోయెను. భార్యాభర్తల కింతలో మనస్పర్ధలు రగిలెను. ఆమె విశేషముగ ఋణములను జేసినదని, యుద్ధమునకుఁ బోవునపు డతనికిఁ దగిన యేర్పాటు లామె చేయలేదని, తగిన సన్నాహములను జేసి కూఁతురి నామె తనయొద్దకు పంపలేదనియు, నిందారోపణఁ జేసి భార్య కతఁడు విడియాకు లిచ్చెను. తదనంతుమున మఱియొక కన్య నతఁడు వివాహమాడెను. ఇతని స్వగృహచరితము లిట్లుండెను.

సంసారసాగరము నీదుచు నతఁడు వార్ధక్యము నొందెను. మహాబలాహక ప్రేరితంబులై సముద్రంబులుప్పొంగి. సంగమించుకరణి రాజ్యాంగ తంత్రోత్పాటన సమయంబున దేశ మరాజకమై ప్రజలు యుక్తాయుక్తవిచక్షణదూరులై , విదళిత మనోధైర్యములు కలవా రగుదురు. ఈ సమయములో స్వపక్ష పరపక్ష, వివేచన లేక తృటి కాలములో పక్షములను క్రమాను రూపముగ విడుచుటయుఁ బొందుటయుఁగూడఁ గలదు. అట్టి కాలములో సపక్షమువా రతనికి శత్రువులై గృహకవాటములను భేదించి భృత్యులను విదశించి లోపలఁజొచ్చి శిశిరోను వారు చిత్రవధఁ జేసిరి.