మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/డెమాస్తనీసు
డెమాస్తనీసు
డెమాస్తనీసు తండ్రి, డెమాస్తనీసు, 'ఆథెన్సు' పట్టణములో నివసించుచుండెను. అతఁడు ఖడ్గకారకుఁడు. అనేకమంది సేవకుల చే నతఁ డాపనిని చేయించుచుండెను. రాజద్రోహముచేసి దేశమునుండి పరారియైన 'గైలాను'నకును, నతని భార్యయైన యొక కిరాతక స్త్రీకినిఁ బుట్టిన చిన్నది డెమాస్తనీసు యొక్క తల్లియని కొందఱు చెప్పుదురు. కాని దాని యధార్థ్యమును నిర్ణయించుటకు వీలులేదు. ఇతఁడు మాణవకుఁడుగ నుండినప్పుడు తండ్రి డెమాస్తనీసు కాలము జేసెను. పిత్రార్జితము దరిదాపుగ, నరువదివేల రూష్యము లితనికిఁ జెందెను. ఇతని సంరక్షుకులు తమ స్వంతమునకు దీనిలోనుండి కొంతసొమ్ము నుపయోగించుట చేతను, శేషించినదానిని సద్వినియోగముఁ జేయక పోవుటచేతను, ఇతనికిఁ జేయవలసిన సంస్కారములు వారు జేయక యుపేక్షించిరి. ఇతఁడీయవలసిన గురు కట్నములఁగూడ వారు తమ స్వంతమునకు వాడుకొనిరి. ఇట్లీతని బుద్ధికుశలతకుఁదగిన జ్ఞానసంస్కారము లేనందున నితఁడు దాని ఫలితమును బొందుట కనకాశము లేకపోయెను. ఇతని శరీరము సున్నితమైనందున నితనిని మొండిపనులఁ జేయుటలో నియమించుట కితని తల్లి కిష్టము లేక యుండెను. వారి వేతనములు వారికి తిన్నఁగ నందక పోవుటచేత గురువు లితనిని దేహపరిశ్రమఁ జేయవలసినదని నిరోధించ లేదు. మొదటినుండియు నితఁ డర్భకుఁడు. అందు చేత బాలురంద ఱితని నపహసించుచుండిరి.
సర్వజనసమక్షమునఁ బ్రసంగించుట కీకాలములో నితని కాకాంక్ష కలిగెను. ఒక సమయమున 'లౌలీస్ట్రేటసు' అను నొక వాక్చతురుఁడు విచారణసమయమునఁ దన వక్తృత్వమును సర్వ జనసమక్షమున విశదపఱచునని విని, డెమాస్తనీసు తన యుపాధ్యాయులను వేఁడుకొని వారితోఁగూడ సభకుఁబోయెను. నాఁడు వాక్చతురిని వాగ్ధోరణిచేత పగవశులయి యందఱును వానిని స్తోత్రముజేసిరి. అందుచేతఁ దాను సహితము వానిం బోలు వాక్చతురుఁడని పేరుఁ బొందుటకు నిశ్చయించి, బాల క్రీడలయం దాసక్తి వదలి, డెమాస్తనీసు ,వాక్పాటవాయత్త చిత్తుం డయ్యెను. సువక్తృత్వమునందు సంస్కారమును బొందుటకు 'ఐసోక్రేటీసు' అను పేరుగల గురువు నాశ్రయించెను. తన బాల్యావస్థ గడచినపిదప తన సంరక్షకులను వారు చేసిన పనులకుఁ గారణములను జూపుఁడని న్యాయసభలో ఖచితముగ నడిగెను. వారు కపటముగ సంచరించి కాలయాపనఁ జేయుటచేత, వారిని నిరాకరించుచుఁ దన వాగ్వైభవమును న్యాయసభలోఁ గనుపఱచుట కతని కవకాశ మయ్యెను. ఎంత పోరాడినను బితృధనములో నతనికిఁ గొంచెము సొమ్ము మాత్రమే చిక్కెను. ఈ మూలమునఁ గొంత స్వానుభవముఁ బరిపాటినిఁ బొంది, రాజకీయ వ్యవహారములలోఁ దన వాగ్వై భవమును సభలోఁ బ్రకటనఁ జేయుటకు యత్నించి క్రమముగ నతఁడు పేరుపొందెను.
మొదట నతఁడు సభలోఁ బ్రసంగించుట కుపక్రమింపఁ దొందరపాటులో వాక్యవిరామముల నతిక్రమించి పూర్వపక్ష సిద్ధాంతముల నసందర్భముఁ జేసెను. మాటలలో స్ఖలితస్వరుఁడై యేక రీతిగ ధోరణిని నడిపించుటకు వాయువు చాలనందున నతని ప్రస్తావమును సొంతముగ వినుటకు సభ్యులు రోసి యతని నధిక్షేపించిరి. సాలంకారనిష్యందమునకు లావణ్యోత్కర్షలను సమకూర్చునది ప్రవృత్తియె యని తెలిసికొని, సోచ్చారణాంగ విక్షేపవిముక్త ప్రవచనము లప్రశంసనీయము లని యతఁడు గ్రహించెను, నాఁటినుండియు భూగర్భమున నొక బిలమును నిత్యానుష్ఠానమున కేర్పఱచుకొని, రెండుమూఁడు నెలలపర్యంత మక్కడ నతఁడుండి పోవుచుండెను. అక్కడనుండి బయటకు రావలె నని తనకోర్కె పొడమిన నటుల వచ్చుటకు విఘ్నము కలుగునట్లతఁడు తన శిరస్సును సగము ముండనము చేసికొనెను.
అతఁడొకరి దర్శనమునకు వెళ్లినపుడుకాని, యతని దర్శ నమున కితరులు వచ్చినపుడుకాని జరిగిన ప్రస్తావనాంశములు అనఁగా విశ్రుతమైన వ్యవహారము లతని కభ్యాసముఁ గలుగఁ జేయుచుండెను. స్నేహితులు వెళ్లినపైని నతఁ డధ్యయనాగార ముఁజొచ్చి, విధి నిషేధపక్షములఁ జర్చించి విషయాంశమును వితర్కించుచుండెను. కొన్ని ప్రవచనీయములను మనన చేసి వానిని యుక్తముగ సంస్కరించి, యతఁడు జిహ్వాగ్రమున నుంచు కొనెను. సభలో నతనిని పేరు పెట్టి పిలిచి సాంప్రతవిషయము గుఱించి ముచ్చటించనలసిన దని సభ్యలు కోరిన దాని నతఁ డసంభావపూర్వకముగఁ బ్రసంగించుట లేదు, అందు చేత నతఁడు ధారణాశక్తిలేనివాఁడనియు, నతని వాక్చాతుర్యము వ్యవసాయ ఫల మనియు, పకు లెంచిరి.
'పెరికిలీసు' నతఁ డా దర్శముగ దీసికొన లేదు. అస్ఖలిత భాషణమును, హస్తాద్యభినయములను నాతనినుండి యితఁడు నేర్చుకొనుటయేగాక అతనివలె నాకస్మిక ప్రవృత్యానుసారోదిత వాదములయందుఁ బ్రతికూల మనస్కుఁడయ్యెను. వాని యౌన్నత్యమున కిదియే కారణ మని యితని యభిస్రాయము. అన్ని సమయములలోఁ దన వాక్శక్తులను దైవాధీనము లని యెంచకపోయినను ప్రాప్తకాలములయందు తన సభాపాండిత్య.మును బ్రకటనఁ జేయుట కతఁడు విముఖుఁడు కాలేదు. ప్రస్తావించినపుడెల్ల దైవబలము కలదో యనునటుల సతఁడు భాషించుచుండెను.
స్వదోషములను బోగొట్టుకొనుట కతఁడు కొన్ని ప్రతి విధానములను సమకూర్చెను. అస్పష్టభాషణమును బోగొట్టు కొనుటకు నోటిలో గులకరాళ్లను బెట్టుకొని కంఠస్థముగనున్న కావ్యమునో ప్రవచనమునో సమ స్థలములను ఉచ్చభూములను బరుగెత్తుచు నతఁ డుపన్యసించుచుండెను. స్వగృహమున నొక దర్పణము నిడుకొని దానిముందట మాటలాడుచు హస్తవిన్యాసముల నతఁ డభ్యసించెను. ఒక సమయమున నొకఁడు పరిభవమును బొంది తన పక్షమున సభలో వాదించుట కితనిని రావలసినదని వేఁడుకొనెను. 'నీవు పరిభవముఁ బొందిన వానివలె గనఁబడవే?' యని డెమాస్తనీసు తర్జింప, 'సరి, సరి, నేను దెబ్బలు తినలేదనియా మీ యభిప్రాయ'మని వాఁడు గర్జించెను. “నీవిప్పుడు దెబ్బలు తిన్నవానివలెఁ గనఁబడుచున్నావని డెమాస్తనీసు మాటను కలి పెను.
"ఆకారైరింగితైర్గత్యా చేష్టయా భాషణేవచ |
నేత్రవక్త్రవికారేణ లక్ష్యతేంతర్గతంమఃనః||"
అని డెమాస్తనీ సభిప్రాయపడెను.
అతని వక్తృత్వములు సర్వజనశ్లాఘనీయము లయినను, రసికులు కొందఱు వానిని నీరసించిరి. వీని రచనశైలి చాతుర్య సంశోభితంబై మనోభేదవపాటవ ప్రశస్తంబుగ నుండెను. లిఖత రూపముగనున్న ప్రవచనములు మనోశకలమును గలిగించు చున్నను నతని సరసోక్తులు , శ్రవణానందముగ నున్నవి.
'ఫోకియను'ల యుద్ధ ప్రారంభసమయమున నతఁడు వ్యవహారములలో దిగినటులఁ గనఁబడుచున్నది. అతఁడు వ్రాసిన భర్త్సనవాక్యములలోకూడ నటులనె యున్నది. 'మిడియా'సను వానికి ప్రతికూలముగ నితఁ డిరువదిమూఁడు సంవత్సరముల ప్రాయమున ప్రవచనములను వ్రాసెను. అప్పటికింకను కీర్తి ప్రతిష్ఠల నతఁడు పొందలేదు.
పరిగృహ్యమానవైరుండును, వైరానుబంధజాజ్వల్య మానరోషానలుండునునై యతఁ డొప్పుచుండెను.. ధనము కలిగి స్నేహితుల ప్రాపకముమీఁద నిలువఁబడియున్న ‘మిడియాసు'ను పనిలోనుండి తొలఁగించుట కతనికి సమర్థత లేకపో యెను. అందునలన నతనికిఁ బ్రయోజనముఁగూడ లేదు. కాఁబట్టి వానిపక్షము నవలంబించుట కతఁ డద్యుక్తుఁ డయ్యెను. గ్రీసు దేశమును 'ఫిలిప్పు' అనువాని దాడినుండి రక్షించనలసి వచ్చినప్పుడు రాజకార్యములయం దతనికిఁ గల యాకాంక్ష సిద్దించుట కవకాశము కలిగెను. పూనినకార్యమును మహాయోధునివలె నిర్వహించుటకు, వక్తృత్వమునకె కాక పలికిన సత్యవాక్యముల కాతఁడు ప్రఖ్యాతినొందెను. గ్రీసు దేశపు ప్రజ లతని నభినుతించుటయే కాక, పారసీకదేశపు రాజాను గ్రహమున కతఁడు పాత్రుఁడయ్యెను. మండలాధీశ్వరుఁడైన ‘ఫిలిప్పు' సహిత మందఱి వక్తలకంటె నితని నెక్కుడుగ నభినందించెను. శత్రువులుకూడ వాగ్వాదములలో నతనిని శ్రేష్ఠునిగ బహూకరించిరి.
మనుజులతోఁగాని వస్తువులతోఁగాని తుడముట్ట పొత్తు నిలఁబెట్టుకొను స్థిరబుద్ధి యతనికి లేదని కొంద ఱనియెదరు. అయినను మొదట నవలంబించినపక్షములను సిద్ధాంతములను సాంతముగ నతఁడు పరిగ్రహించినటులఁ గనఁబడుచున్నది, ప్రాణములను విడుచుట కతఁ డొప్పుకొనెనుగాని వాని నతిక్రమించుట కియ్యకొన లేదు. మాటలలోను క్రియలలో నతఁడెప్పటి కామాటలాడువాఁడుకాఁడు. రాజ్యతంత్రములోని రహస్యమును గుర్తెఱెఁగి దాని ననుసరించి యతఁడు నడిచెను, ధర్మము ధర్మముకొఱకె యనుష్ఠించవలసిన దను నియామకమున కనుగుణ్యముగ నతని ప్రవచనములు వ్రాయఁబడెను. ప్రియమైనవి, సుళువైనవి, లేక లాభకరమైన పనులను జేయవలసిన దని ప్రజల నితఁడు వీని మూలమున హెచ్చరించలేదు. కీర్తి ప్రతిష్ఠలను నిలుపుకొనుటయే ముఖ్య మనియు, రాజ్యము యొక్క క్షేమమంతగ యెన్నిక చేయవలసిన యంశము కాదనియు, వారి కతఁడు బోధించెను. మాటల కనుగుణ్యమైన క్రియలు, క్రియల కుపయుక్తమైన మాటలు కలిగినవాఁడైనను, యుద్ధముఁ జేయుటకుఁ దగిన ధైర్య స్తైర్యములు లేక లంచములు పుచ్చుకొననివాఁడైన పక్షమున నతఁ డధికముగ మన్ననలను బడసియుండును. రణరంగమున విచ్చలవిడిగ సంచరించుటకుఁ దగినంత ధైర్య మతనికిలేదు; వాడియైన సిరిచూపు లతని మనస్సును నొప్పించక యుండలేదు.
సమయము దొరికినపుడెల్ల 'మాసిడను' మండలాధీశ్వరుఁ డగు 'ఫిలిప్ప'నునాని కార్యముల నితఁడు తృణీకరించుటకలదు. అందుచేత నతఁ డితని నందఱికంటె విశేషముగ సన్మానించి, యితని ప్రశంసలను ముఖ్యాలోచనలోనికిఁ దెచ్చి వానికి యుక్తముగఁ బ్రతివచనముల నిచ్చుచుండెను. 'ఫిలిప్పు' యొక్క సభకు రాయబారిగ నలుగురితో నితఁడు గలిసి వెళ్లినపుడు వారిలో నితఁడు విశేషముగ గౌరవమునొందెను. డెమాస్తనీసు తన వాక్చాతుర్యము చేత స్వదేశీయులను ఫిలిప్పుతో పోరాడు నటులఁ జేసెను. ఈ జగడము కొంతకాల మతిక్రమించెనుగాని తుదకు ఫిలిప్పునకు జయముకలిగెను. ఈ పరాభవము కలిగినందులకుఁ గొంద ఱితనిని దూషించిరిగాని తుద కతఁడు నిర్దోషి, యని జనులు ప్రకటనఁ జేసిరి. వీరస్వర్గము నొందినవారివిషయమై చేయవలసిన ప్రసంగముల నితనిని జేయుమని ప్రజలు వేఁడుకొనిరి.
ఫిలిప్పు కాలములోనే కాక వాని కుమారుఁడైన మహా అలగ్జాండరు కాలములోఁగూడ నితఁడు స్వదేశమువిషయమై పాటుపడెను. కాని నీచదశసంప్రాప్త మైనందున నతని శత్రువుల విజృంభణ సహింపలేక, వారికి లోఁబడవలసివచ్చునని యెంచి, విషముఁ ద్రావి డెమాస్తనీసు దేహత్యాగముఁ జేసికొనెను.
ప్రపంచములోఁ బుట్టిన మహావక్తలలో శ్రేష్ఠుఁడనఁదగు డెమాస్తనీసుయొక్క వాక్చాతుర్యము మిగుల సంస్తవనీయము. ఆతఁ డుపన్యసించుచుండ 'అధీనియను' లొకవేళ నతని వాగ్దారాసంపాతమునకు సంతసించుచు, నొకవేళ పరవశత్వము నొందుచు, కొన్ని సమయముల హృదయచాంచల్యమునకు లోనగుచు, మఱికొన్ని సమయముల దుఃఖపూరితమనస్కు లగుచుందురు. ఒకప్పు డతఁడు తన వాచాలతచేత తన దేశస్థులను శౌర్య స్థైర్యాదిగుణంబు లంకురింపఁజేసి పుత్రధనయోషా మిత్రసంపత్కళాప్రస్థానంబులను వీడఁజేసి తత్తరంబున రణంబునకు దుముకఁ జేయును. ఇటుల దన వాచాలత్వమున, సూర్యమండలము ననుసరించి తిరుగు గ్రహములవలెఁ బ్రజ లతనిని బరి వేష్ఠించి సంచరించు చుండిరి.