మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/ప్లూటార్కు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్లూటార్కు వర్ణితచరిత్రలు

ప్లూటార్కు

అన్నినాఁడులలోఁ జిన్ననాఁడు మంచి దని యొక మహాపురుషుఁడు చెప్పెను. మాయమర్మములు తెలియక నిర్గుణుల మై యెల్లప్పుడు నానందించుచు మనము చిన్నతనమును గడుపుదుము. వయస్సు ముదిరినకొలఁది లోకవ్యాపారములలోఁ దిగి విషయాసక్తులమై మనమ తరంగములలోఁ గొట్టుకొను చుందుము. అటుల ఏకాంతస్థలమున చిదానందమును బొందుచుఁ గాలము గడపిన తత్వజ్ఞానియైన 'ప్లూటార్కు'యొక్క జీవిత చరిత్రమును ముందుగఁ జదివి హర్షించి, తదనంతర మతనిచే వ్రాయఁబడిన లౌకికతరంగములలోఁ గొట్టుకొనుచున్న మహాపురుషుల జీవిత చరితములఁ బఠింపవచ్చును..

ప్రాజ్ఞుని యనుభవములను మనమెట్లు స్వీకరించునట్లే లోకమునుగూర్చిన యతని యాలోచనలను సహితము మనము తెలిసికొనవలెను. ప్రపంచ ధర్మములు ద్వంద్వములు. ఇవి యుద్రేకించి రాష్ట్రవినాశమును దెచ్చును. దేశకాల గృహ సాంప్రదాయముల నివి మరగుపఱచును. ఇది యొకటి. రెండవది యే దన, మన స్వాతంత్ర్యమువలనఁ గలుగు మహోత్కృష్ట పదవికంటె హెచ్చైన సమభావముఁ గలిగియుండుట మేలు; ఉచ్చ పదవిని బొంది, సమభావమును బోఁగొట్టుకొనుటకంటె శాస్త్ర జ్ఞానముచేత ధర్మమును నిలఁబెట్టి నిశ్చలతతోఁ గాలమును గడుపుట మనుజున కుచితమైన పని. ఈ విషయముల నతని జీవితచారిత్రమును జదివినచో మనము తెలిసికొనఁగలము.

గ్రీసుదేశములోఁ 'బియోషియా' యను పేరుగల యొక మండల ముండెను. అక్కడి ప్రజలు పశుప్రాయులుగ నుండుట చేతఁ 'బియోషియా మూర్ఖు'లని వారికిఁ బేరువచ్చెను. మనము 'గొల్లల మూర్ఖత్వ' మనునట్లు 'బియోషియా మూర్ఖత్వ'మని వాడుకకలదు. ఈ యపవాదమును బోఁగొట్టుటకు నా 'పిండారు' అను కవియు, 'అపామినందాసుఁ'డను వీరుఁడును నాదేశములోఁ బుట్టిరి. వారి తరువాత ప్రాజ్ఞుఁడైన 'ఫ్లూటార్కు' ఆ దేశములోఁ బుట్టి దానికిఁ గీర్తిఁ దెచ్చెను. అతఁడు క్రీ. శ. 66. సం|| రములో జననమొందినటులు తెలియుచున్నది.

'అమోనియస్సు' అను నొజ్జయొద్ద నతఁడు చదివెను. శిష్యుఁడు వ్రాసిన సంగతితప్ప మఱియొకటి గురువునుగుఱించి మనకుఁ దెలియదు. శిష్యుల నితఁ డెట్లు శిక్షించెనో దానిని 'ప్లూటార్కు' వ్రాసెను. “ఒకనాఁడు మధ్యాహ్నమున అతఁడు పాఠములను జెప్పుటకుఁ బూర్వము మేము భోజనము చేయు చుఁ గొంతకాలము గడిపితిమి. ఇందు కతఁడు కోపగించి, కుమారుఁడేమో భోజనముఁ జేయుచు లేచిపోయె నని మిషఁబెట్టి, వానిని మా సమక్షమున కొట్టించెను. ఈ సమయములో నతఁడు మా వైపు దృష్టి నిగిడించి చూచుచున్నందున, మా నిమిత్త మతఁడు వానిని దండించె నని మేము గ్రహించితిమి.” ఈ సంగతిని 'ఫ్లూటార్కు' వ్రాసినందువలన గురువు విషయాసక్తుల (Epicureans) లోనివాఁడు కాఁడని తెలియుచున్నది. అతఁడు చేసిన శిక్షనుబట్టి యతఁడు వైరంగికుల (Stoics)లోనివాఁడని తోఁచునుకాని నిజముగ నతఁడు శాస్త్రజిజ్ఞాసకుల (Academicians) లోనివాఁడు. వీరి పాఠశాల లాకాలములో గ్రీసుదేశమునందు విశేషముగఁ గీర్తిఁబొందెను.

బెత్తమును వాడుకఁ జేయుటకు తండ్రికిమాత్ర మధికారము కలదు. ఈ పాఠశాలలలో గురువులు దాని నుపయోగించుట లేదు. బుద్ధిని వికసింపఁ జేయుటయే గురువులపనిగాని హేయమై, నికృష్టమై, నీచమైన బెత్తమును బట్టుకొని బాలురను దండించి వారి మనోవ్యాపారములను దగని విధమున నిరోధించి, వారి మర్యాదకుఁ దగిన స్వాతంత్ర్యబుద్ధినిఁ బోఁగొట్టుట, యుపాధ్యాయులకు ధర్మముకాదు. బెత్తమును బట్టుకొని బాలురను గురువులు శిక్షించుట, నేఁడుగూడఁ గలదు. బెత్తము చేత దేహశుద్ధినిఁ బొందుట కాదుకాని, సిగ్గులజ్ఞలవలన, బుద్దివంతులు, మొదట విచ్చలవిడిగ సంచరించినను, మార్గములో నికి రాఁగలరు. ఏపాటిబుద్ది లేకపోయిన దేహశుద్ధివలన వాఁడు మొండిదేరునుగాని సన్మార్గములోనికి రాలేఁడు. ఉన్నటువంటి తగుపాటి బుద్దినైనను నిర్మలము చేయవలెనుగాని దెబ్బలుకొట్టి దానిని మలినము చేయరాదు. దేహపీడయైనకొలఁది మనస్సు శుద్దిని బొందుచుండును; సిగ్గులజ్జలను బోఁగొట్టునది దానికంటె మఱియొకటిలేదు. ఆ రెండును గలిగియుండిన, ధర్మము. నిలఁబడును; కీర్తి ప్రతిష్ఠలు వచ్చును.

ఇప్పటి మనవలెఁగాక గ్రీకులు మఱియొక విధమున విద్యాభ్యాసము జేయుచుండిరి. ప్రారంభములోనే నా రన్ని శాస్త్రములలోను బ్రవేశ పెట్టఁబడుచుండిరి. రామచిలుకలవలె మనము మాటలనుమాత్రము గ్రహింతుము; వారు మాటలచేత నిరూపింపఁబడిన వస్తుజ్ఞానమును గలిగియుండిరి. మనవలె రెండప్రచలిత భాషలను జదువుటలోఁ బదిసంవత్సరముల కాలమును వారు వ్యర్ధపుచ్చుట లేదు. ఆ కాలమున వారు ప్రకృతిని పరిశోధించుటలో గడిపి, దానిలోని చిత్రముల యథార్థ్యమును వాని నియమములను గ్రహించుచుండిరి. తత్వ, గణిత శాస్త్రములనేగాక శబ్దోత్పత్తి శాస్త్రము (Philology) ను వా రభ్యసించిరి. మహాకవుల గ్రంథములలోని ప్రస్తావికవచనములను వారు జిహ్వాగ్రమున సుంచుకొనిరి.

ఈ విద్యలలో 'ఫ్లూటార్కు' పూర్ణుఁడై మహాపురుషుల జీవితచరిత్రలను వ్రాసెను. ధారణాశక్తి విశేషముగఁ గలదు. కనుకనే, చెప్పిన యంశములను జెప్పక చరిత్ర నతఁడు వ్రాసెను. నూటికొకచోట పునరుక్తి కలదుకాని సాధారణముగఁ గనఁబడదు.

వేషభాషలవలన నతఁడు శాస్త్రజిజ్ఞాసకులలోనివాఁడని తెలియుచున్నది. క్రియలు, మాటలు, ఉపదేశములు, ఆచరణలలో నతఁడు దాని కనుగుణ్యముగ నడిచెను. క్రమముగ నతఁడు తత్వజ్ఞానమును బొందె నని యతని గ్రంథముల మూలమున దెలియుచున్నది. అందఱి మతములను బరిశీలించి శాస్త్రజిజ్ఞాసకులను, విషయాసక్తులను జెందక, బ్రహ్మజిజ్ఞాసకులపక్ష మతఁ డవలంబించెను. నైరంగికుల నతఁడు ముట్టలేదు. అందఱి బోధలలోను శ్రేష్ఠ మగునానిని గ్రహించి నాని నతఁ డనుష్ఠించెను.

ప్రకృతి నారాధించు 'పైథాగొరాసు' క్షుద్రజంతువులను మనుజులు హింసించుటఁ జూచి, విచారించి, యొక్కమతమును గనిపెట్టెను. దానినే పునర్జన్మమత' (Metempsychosis) మందురు. జీవుఁడొక శరీరములోనుండి మఱియొక శరీరములోఁ బ్రవేశించునని, దీని సిద్ధాంతము. ఈమూలమున జంతువులకు హింసలేకుండఁజేయుట యతని యభిప్రాయము. మొదటినుండి సృష్టిలోని పిపీలికాది జీవకోటులనుజూచి సంతసించుచున్న 'ప్లూటార్కు' ఈమతసిద్దాంతముల నెటుల నవలంబించకుండును? మతబోధకునివలె నతఁడుగూడ నుపన్యసించి, జంతువులను హింసించిన, వాని రూపమును బొందవలసివచ్చు నని ప్రజలకు బోధించెను.

'కేటో'యొక్క జీవితమును వ్రాయుచు, “అతఁడు (Cato) పరిచారకులను పశువులవలెఁ జూచుచుండెను; వారిని తోఁచినపుడెల్ల బానిసలుగఁ జూచుచుండెను; కొన్ని వేళల వారిచేత బరువులను మోయింపించెను; కొన్ని సమయములలో వారిని బయటకు వెళ్లఁగొట్టి వారి కాహారమిడుట లేదు. సృష్టిలో మనుజుఁడు రాజు గనుక, మనుజులను సోదరభావముతోఁ జూచుటయేగాక, యితర జంతువులసహిత మతఁడు ప్రేమించవలెను. అన్ని జంతువులను సమభావముతోఁ జూచుటయే పరమమతము” అని ప్లూటార్కు తన మనోభిప్రాయమును విశదపఱచెను. గురూపదేశమున కనుగుణ్యముగ నతఁడు నడిచెను.

పాఠశాలలలో గురువు లుపన్యసించు అస్పష్ట పరిభాషణములను, వీరమతస్థుల పిచ్చికూతల నతఁడు తిరస్కరించి, పైథాగొరాసు శాస్త్రమును ప్రకృతితో సమ్మేళనఁజేసి, జ్ఞానోదయమగునట్లు చేసెను. పారసీకము, ఈజిప్టు దేశములలోని శాస్త్ర,ములను శోధించినందున, నతనిని జ్ఞానియని స్వదేశీయులు బిలువఁ దలఁచినపుడు, దాని కంగీకరించక 'శాస్త్రజిజ్ఞాసకుఁ'డని పిలువఁబడుట కతఁడు సమ్మతించెను.

గురువులయొక్క సదభిప్రాయములనెగాక, వారి దురభిప్రాయములనుగూడ ఫ్లూటా ర్కవలంబించినందుకు మన మత నిని మన్నింపవలెను. గురువువలెనె నతనికి స్వప్నములయందు నమ్మకము కలదు; వాని యాధార్థ్యమును జెప్పలేము. రెండుపక్షములలోఁ దగు కారణము లగుపడుచున్నవి.

ఆ కాలములో ముద్రాక్షరశాలలు లేవు; ముద్రింపఁబడిన పుస్తకములు లేవు. అన్నియు లిఖితరూపముగనున్న గ్రంథములు. "వానిని వ్రాయుట కష్టము. వ్రాయఁబడినవానిని కొనుట కష్టతరము. సంపాదించిన వానిని జదువుట కష్టతమము. అట్టి స్థితిలో, ఫ్లూటార్కు చదివిన గ్రంథములకు లెక్క లేదు. 'కావ్యాలాపవినోదేన కాలో గచ్ఛతి ధీమతాం.”

అతని కుటుంబమువారు ధనము లేనివారుకారు. ఆతని పూర్వులు పెద్ద యుద్యోగములఁ జేసినవారు. ప్రపితామహుని బాగుగ నతఁడెఱుఁగును. ఇతని కాలములో స్వదేశీయులు 'రోమనుల' దాడి భరింపలేక శ్రమపడి రని ఫ్లూటార్కు వ్రాసి యున్నాఁడు. అతని పితామహుఁడు సంతోషపురుషుఁడు; మంచి వక్త: మద్యపానాపేక్షుఁడు; రసములోనికి వెళ్ల, సరసము బయటకు వచ్చుచుండెను. అతని తండ్రికూడ ధర్మాత్నుఁడు, సుగుణ వంటఁడు. ఆ కాలపు చదువుల నతఁడు బాగుగఁ జదివెను. తండ్రినిగుఱించి చెప్పుచు, “ నేను మఱియొకనితోఁ గలిసి సందేశముమీఁద నొక గ్రామమునకుఁ బంపఁబడితిని. నాతోడవచ్చిన వాఁడు మార్గములోనుండి పోయినందున, నొంటరిగ నేనాగ్రామమునకుఁబోయి, యా సందేశమును నెరవేర్చి, స్వగ్రామ మునకు వచ్చితిని. మఱునాఁడు నిర్వహించుకొని వచ్చిన యంశమును సభలో ముచ్చటింపవలసి యున్నందున, నా తండ్రి “నేను, నేనని వాడుకచేయక, మేము కార్యము నెరవేర్చితిమని చెప్పిన, ప్రజలు నిన్నీర్ష్యతోఁ జూడ'రని నాతోఁ జెప్పె”నని ఫ్లూటార్కు వ్రాసెను.

'టైమను,' 'లెంప్రియను’ వీరిరువు రతని యన్నదములు. వీరు మువ్వు రత్యంత మైత్రిగ నుండిరి. అందులో 'డైమను'ను ప్లూటార్కు విశేషముగఁ బ్రేమించెను. “నే నదృష్టము గలిగి యున్నను, నాయన్న 'టైమను'యొక్క స్నేహము, దయకును బాత్రుఁడనైతినని ఫ్లూటార్కు వ్రాసెను. 'అంప్రియసు'కు తాతపేరు పెట్టినందున, నతనివలె నితఁడు సంతోష, ఫురుషుఁడు.

కొంతకాల మతఁడు దేశయాత్రలలో గడిపెను. ఈజిప్టు, ఇటాలియా దేశములలో నతఁడు తిరిగెను. ఇటాలియా దేశములోనుండిన దినములలో నతఁడు 'లాటిను' భాషను నేర్చుకొనుటకు సమయము దొరకలేదు గాని, రోమనులలో మహాపురుషుల జీవితచరిత్రలను వినుచుండెను. మొదట వస్తుజ్ఞానమఁ గలిగియున్నందున, వానిని నిరూపించు శబ్దముల నతడు 'లాటిను' భాషలో నేర్చుకొనెను.

ప్రకృతిలోని ప్రతివిషయము బుద్ధిని వికసింపఁ జేయనని యెంచి, వానినే ప్రసంగములలో 'రోమనులు' ముచ్చరించు చుండిరిగాని, 'కుక్కకూత' నక్కకూత'లలో 'వారు కామును వ్యర్థపుచ్చ లేదు. అందుచేతనే, భాషాపరిజ్ఞానము లేకపోయినను, సంభాషణలవలన ప్లూటార్కు మహనీయుల చారిత్రములను గ్రహించెను. కొంచెము వయస్సు ముదిరినపైని, లాటిను భాషను నేర్చుకొని, అందు వ్రాయఁబడిన రోమనుల చరిత్రము నతఁడు చదివెనుగాని చరిత్రములకుఁ గావలసిన ముఖ్యాంశములను సంభాషణలలోనె నతఁడు ప్రోగుచేసెను.

ఆకాలములో రోమునగరములోని మహనీయుల చేతను, ప్రాజ్ఞులచేతను మన్ననలను బొందుటయెకాక, రోము చక్రవర్తి 'ట్రాజను' చేతకూడ నతఁడు గౌరవ మందెను. అతఁడు చక్రవర్తికి గురువని కొందఱు, కాఁడని కొందఱు జెప్పుదురు. గొప్ప పండితుఁ డను పేరతనికి వచ్చెను. "బోద్ధారో మత్సర గ్రస్తా: ” అనునట్లు అతనిని జూచిన కొందఱికి శిరోభారముగ నుండెను. జ్ఞానులకు వచ్చు దురవస్థ యిదియె. జ్ఞానులను మనము తేరి చూడలేము (మేఘముచేత గప్పబడినప్పుడు తప్ప గ్రహరాజును చూడలేని విధమున).

జ్ఞానులకుఁ దగిన మర్యాదలను బొంది రోమునగరములో ధర్మము స్థాపించి, ప్రజలకు జ్ఞానోపదేశముజేసి, ట్రాజను చక్రవర్తిని సుగుణవంతునిగ నొనర్చి ప్లూటార్కు స్వదేశమునకు వచ్చి చేరెను. శిష్యుఁడైన చక్రవర్తి మరణము నొందినందున, నతఁడు దుఃఖంచి 'కైరోనియా' పట్టణమునకుఁ బోయెను. అక్కడ నివసించి, లౌకిక వ్యాపారములలో దిగక, ఏకాంత ముగఁ గాలముఁ గడుపుచు, మహనీయుల జీవితచరిత్రములను వ్రాయ నారంభించెను.

ఈ చరితములను చరిత్రములు వ్రాయువిధమున వ్రాయకపోయినను, నతఁడు వానిని రసవంతములుగ జేసెను. దేశకాల సంబంధముల నతిక్రమించి చరిత్రాంశములను వ్రాసినను, జ్ఞానోపదేశములచేత వాని నతఁడు నింపినందున, పండిత పామరులు వానిని శ్లాఘించుచున్నారు. కంటకములతోఁగూడిన గులాబీ పుష్ప మెంత మనోహరముగ నుండునో, యటుల సంకటములతోఁ గూడియున్న యతనిగ్రంథ మంత యాహ్లాదకరముగ నున్నది.

సృష్టిస్థితిలయకర్తయైన పరమేశ్వరుఁ డొక్కఁడైనను, మీఁది మెట్టుననున్న దేవతలకు క్రింది మెట్టుననున్న మనుజులకు, యెవరికి సమీపముననున్న వారి గుణరూపములను బొందుచున్న ప్రాణులు కలవని యతని నమ్మకము. శూన్యస్థల ముండుట ప్రకృతికి విరుద్ధము గనుక, దేవతలకు మనుజులకుఁ గల యంతర మీ జీవులచేత నిండియుండక తప్పదని యతఁడూహించెను. పుణ్య పాప కర్మములకుఁ దగినటుల నీ ప్రాణులను లోమ విలోమముగ దేవ మనుజ రూపములను బొందుచుందురని యతని యభిప్రాయము.

స్వగ్రామమున గ్రంథావలోకనలోనేగాక, వైదికవ్యాపారములను లౌకిక చర్యలతో గలిపి కాలమతఁడు గడిపెను. సంఘములో నున్నపుడు, గృహస్థు ధర్మము నవలంబించి సాంఘికదేవ పితృఋణముల నతఁడు తీర్చెను. అతఁడు న్యాయాధికారిగఁ గొంతకాల ముండెను. “న్యాయాధికారి యెపుడును ప్రజల కష్టసుఖములను వినవలెను. అతఁ డార్తశరణ్యుఁడు గావలెను. అతని గృహము శరణాలయము” అని యతఁడు చెప్పెను. ప్రజారాజ్యము నతఁడు మన్నించెను. ప్రజలు స్వాతంత్ర్యముగ నుండవలె నని యతని యభిప్రాయము.

తత్వజ్ఞాని, చరిత్రకారుఁడు, న్యాయాధికారి - ఈ బిరుదులు యోగ్యముగ నతఁడు వహించెను, ఇఁక నతఁడు సంసారము నెట్లు గడిపెనో మనము చూడవలెను. నిస్సారమైన సంసారములో మనుజునియొక్క సారము తెలియును. అన్ని చదువుల సారము కూడినందున నతఁడు సంసారి..

సత్కులమందుఁ బుట్టుట దుర్లభము. పుట్టినతరువాత ననుకూలవతియైన గృహిణినిఁ బొందుట కష్టము. వీనిలో నేది లేకపోయినను, మనుజునికి సంకటమే; రెండును గలిగియున్న దానికంటె భాగ్యములేదు. అతఁడు సత్కులమునందుఁ బుట్టెను. అతని భార్య యోగ్యురాలు; భర్త కనుకూలముగ నడిచెను; పురుషార్థములను గుఱ్తెఱిఁగి దంపతులు గృహస్థు ధర్మమును నడిపిరి. ఆమె పేరు 'టైమాక్షి'. వారికి నలుగురు కుమారులు, నొక కొమరితయుఁ గలిగిరి. "నా కూఁతురు దాదియొద్ద పాలుత్రాగి కడమ పిల్లలకు పాలిమ్మని దాని నడుగు”నని ఫ్లూటార్కు వ్రాసెను. ఈ కూఁతురు బాల్యములోనె మరణము నొందెను. కొంతకాలమునకు కుమారు లిరువురు చనిపోయిరి. ఎన్ని కష్టములు వచ్చినను వానిని భరించి మనోచాంచల్యమును ఆ దంపతులు పొందలేదు.

ప్లూటార్కు చిరకాలము జీవించెను. అతఁడెటుల మరణము నొందెనో, దాని వినరణ లేదు.