మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/లైకర్గసు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

లైకర్గసు

ధర్మశాస్త్రజ్ఞుఁడైన 'లైకర్గసు'ను గురించి తెలిసిన సంగతులన్నియు వివాదాస్పదము లయినవి. అతఁ డెప్పుడు పుట్టెనో, యెన్నడు గిట్టెనో; యే యే దేశములలోఁ దిరిగెనో; ధర్మశాస్త్రము నెటుల సమకూర్చి, రాజ్యతంత్రము లెటుల నిర్మించెనో ఈ యంశములు పలువురు పలువిధముల వ్రాసిరి. ఇతఁడు గ్రీసు ద్వీపకల్పమునకు దక్షిణముననున్న 'స్పార్టా' యను మండలములోనివాఁడు. కులీనుఁడు; క్షత్రియుఁడు;. భేతాళుని (Hercules) వంశములోనివాఁడు.

తండ్రి సంతానములో నతఁడు రెండవవాఁడు. అతని జ్యేష్టభ్రాత కొంతకాలము రాజ్యముచేసి స్వర్గస్థుఁడయ్యెను. ఇతని భార్య నెలదప్పియుండెను. లైకర్గసు తక్తు నెక్కెను. వదినెగా రతనియందలి మక్కువచేత గర్భస్రావము చేసికొనియెదనని చెప్ప, నతఁ డందుల కియ్యకొనక, పుట్టినశిశువును చంపివేయవచ్చునని యామెకు సమాధానము పంపెనఁట. అతని మాట లామె నమ్ముకొనెను. ఆమె గర్భము దినదిన ప్రవర్థమానమై, నానాఁటికిఁ బ్రసవదినము లామెకు సంప్రాప్తమయ్యెను. ఆమె ప్రసవ వేదన పడుచున్నదని భృత్యులు వచ్చి రాజుతోఁ జెప్పిరి. సుపుత్రిక జననమందిన, దానిని దాసీల కప్పగించవలసినదనియు, సుపుత్రుఁడు కలిగిన దానిని తనయొద్దకుఁ దీసికొని రావలసిన దనియు వారి కతఁ డాజ్ఞ చేసెను. ఆమెకు పుత్రుఁడు కలిగెను. భృత్యు లా శిశువును రాజువద్దకుఁ దెచ్చిరి. ఆ శిశువే దేశమునకు రాజని ప్రకటన చేయింపించి, సంరక్షకుఁడను బిరుదుతో నతఁడు రాజ్యముఁ జేయుచుండెను, ఆ శిశువునకు 'చారులాసుఁ' డని నామకరణముఁ జేసిరి.

ఈ బాలుని జంపి, రాజ్యము సపహరించవలెనని యతఁడు కోరలేదు; అట్టికోరిక స్వప్నములోనైనను కలుగ లేదు. బాలుని మేనమామ 'లియానిదాసుఁడు', యతని న్యాయపరిపాలనమున కోర్వలేక, యతఁడు బాలుని జంప సమకట్టు చుండెనని, నిందారోపణఁజేసెను. అందు కతఁడు రోసి, బాలునికి వయస్సు వచ్చువఱకు దేశాటసఁ జేయుటకు నిశ్చయించి, రాజ్యసూత్రములను విడిచి, బయలు దేరిపోయెను.

అతఁడు మొదట 'క్రీటు' దీవికిఁ బోయెను. అక్కడి రాజ్యతంత్రముల నిర్మాణమును గనిపెట్టి, 'థాలీసు^' అను వైణికునితో స్నేహముఁజేసి, వానిని తనదేశమునకుఁ గాపురముబోయి యుండు మని చెప్పెను. థాలీసు వీణమీటించి కంఠమెత్తుసరికి, సభికులు పరవశు లగుచుండిరి. ఇతని కంఠస్వరము, వీణస్వరములు రెండును సమ్మిళితములగుట చేత, నేదియేదో సభికులు గుర్తెఱుగలేకయుండిరి. అవి షడ్రసములు జిలుకుచుండెను. అట్టివాఁడు తనదేశములో నుండిన, ప్రజలకు మేలుకలుగు నని యెంచి, లైకర్గసు నతనిని స్వదేశమునకుఁ బంపెను. థాలీసు స్పార్టనులను గొంత మార్గములోనికిఁ దెచ్చినపైని, లైకర్గసు వారిని ససరించుటకు వీలుపడెను.

ఆ ద్వీపమునుండి బయలుదేరి, 'ఆసియామైనరు'. 'ఈజిప్టు' మొదలగు దేశములకుఁ బోయి, యా యా దేశీయుల వేషభాషలను గుఱ్తెఱిఁగి, వారివారి రాజ్యతంత్రములలోని లోగుట్టులను గ్రహించుటలో నతఁడు గాలము గడుపుచుండెను.

ఇఁక స్వదేశముసంగతి యేమియు బాగు లేదు. రాజు బాలుఁడు; రాజ్యతంత్రములను నేర్చుకొనుచుండెను; రాజ్య సూత్రములను బరులు వహించిరి. రాజుండినను, దేశ మరాజకముగ నుండెను. ప్రజలు ఘోష పెట్టుచుండిరి; రాజును, వాని సంరక్షుకులను నిష్ఠురమాడుచుండిరి. అప్పుడు వారంద ఱేకీభవించి, 'లైకర్గసు'కు వర్తమానముఁ బంపి, యతనినిఁ దెప్పించిరి. అతఁడు వచ్చి, ప్రజలసమ్మతి పైని, రాజ్యతంత్రములను వారి కనుకూలముగ మార్చెను. అవతరించిన మార్పులలో 'సెనేటు,యను సామంతుల సభయొకటి. రాజు, ప్రజలు - ఒకరి నొకరు స్వబలముచేత మట్టి వేయకుండునటుల వారిని సమశాంతముఁ జేయుటయే, యీ సభవారిపని; ఉభ యుల మర్యాదలను హక్కులను యథావిధిగ నిలబెట్టుచుండెను. ప్రజలు హర్షించి, యతనిని బొగడిరి.

ఆకాలమునాఁటికిఁ బ్రజలు భూములను సరిగా ననుభవించుట లేదు. కొంతభూమి సాగులేక పడియుండెను. సాగుబడి యగుచున్నదానిలోనైన ప్రజలకు హక్కు లేదు. కొందఱికి భూములు గలవు, కొందరికి లేవు. లైకర్గసు ప్రజలసమ్మతిపైని, ముందుజనాభా యెత్తించి, భూమిని కొలిపించెను. అప్పుడు దా మాషాయిని భూమిని వారి కతఁడు పంచెను. సాగులేని భూములను వరకట్టుట కతఁ డాప్రకారమె వారికిచ్చెను. వారిలో భాగ్యవంతుఁ డని బీదవాఁడని తారతమ్యము లేదు. సుగుణ దుర్గుణములచేత నెవఁడైన బేరుపొందవలెను గాని, ధనముచేతఁగాదు. చరాస్తులనుగూడ సమానముగ పంచవలె నని యతఁడు గోరెనుగాని, ప్రజలందు కంగీకరించలేదు. అందు కతఁడు వారికి బుద్ధివచ్చునటుల నొకమార్పు చేసెను. టంక శాలలలో బంగారు వెండి నాణెములను ముద్ర వేయింపించక, యినుప- నాణెములను ముద్ర వేయింపించి, వీనిని చలామణిలోనికిఁ దెచ్చెను. ఈ నాణెము లెన్ని పోగుచేసిన, నొక బ గారు, వెండి నాణెముతో సమానమగును? అవి పెద్దవియగుటచేత, - వానినైన సునాయాసముగఁ దీసికొని వెళ్లుటకుఁ బ్రజలకు కష్టముగనుండెను. అందుచేత వారికి తృష్ణపోయెను; వెండి బంగారములకు వారు దూరస్థులయిరి. సర్కా . రుద్యోగ స్థు లేమి లంచము పుచ్చుకొనియెదరు? వారెటుల పెద్దవేషములు వేయఁగలరు? వ్యవహారములలో వా రమాయకులు. అందుచేతనే "స్పార్టను అమాయకత్వ”మని లోకప్రసిద్ధి యయ్యెను.

ఈ మూలముననేగాక, మరియొక విధమునగూడ వారికి విషయభోగములయం దతఁడు వారికి విముఖత గలుగఁజేసెను. ఆ బాలవృద్దులందఱు కలిసి పంక్తిభోజనముఁ జేయవలసిన దని యతఁడు నియమించి, భోజనములోఁగూడ నిర్ణయించఁబడిన పదార్థములనె యుక్తముగ వారు భుజించవలయునుగాని, నిషేధింపఁబడినవానిని పుచ్చుకొనఁగూడదు. గృహములో భోజనముఁ జేసినవాఁడు గర్హ్యుఁడు. ఇటుల సహపంక్తిని వారు భుజించుటవలనఁ బొందిన లాభములను జెప్పనేల? యుక్తాహారమును మితముగ గ్రహించినందున నిరోగులై శరీరసాటవము గలవారైరని వచింపవలెనా? 'దేహబలమే' మనోబలము కదా!

స్పార్టాలో మగశిశువు కలుగఁగానే, దానినందఱుఁజూచి, మంచి యేపరి, దృఢశరీరము కలవాఁడగునని తోఁచిన, దానిని గృహములోఁ దల్లివద్దనుంచుదురు. ఆ శిశువే ముందుకు బలహీనుఁడు, కునిష్ఠియగునని వారికిఁదోఁచిన, దానిని, దీసికొని పోయి వారు, సమీపముననున్న కొండమీఁద పారవేయు చుండిరి. గృహములో పెరిగిన శిశువు, తల్లివద్ద నేడుసంవత్స రములవఱకుండి, తదనంతరము రాష్ట్రమువారు స్థాపించిన గరిడీశాలలోఁ బ్రవేశించును. అందులో వాఁడు తన యీడు బాలురతోఁ గలిసి సామువిద్యలను నేర్చుకొనును; ఎండ నీఁడ యనక, ఆఁకలి దాహమనక, అన్ని కాలములలో నేకవస్త్రధారి యై, గష్టపడును; ప్రాణములు నిఁలబడుటకుఁదగిన యాహారము మాత్రమే వాఁడు పుచ్చుకొనును. వాఁడెంత కష్టము భరించగలఁడో నిదర్శనముగఁ జూచుట కుపాధ్యాయులు వానిని బెత్తముతోరక్తమువచ్చువఱకు గొట్టుటకలదు. వ్రాయను, చదువనుమాత్రము వాఁడు నేర్చుకొనును. పెద్దచదువులు వారిలో లేవు. మాటలలో వారు మితభాషులు, ముప్పదిసంవత్సరములు వచ్చువఱకు వారిలో నెవఁడు పెద్దవాఁడు కాఁడు. అప్పుడు వాఁడు వివాహముఁ జేసికొనుట కాజ్ఞఁబొంది వివాహమాడినను, భార్యతోఁ గాపురము జేయుటకు వాని కాజ్ఞ లేదు; వాఁడు గరిడీశాలలోనే యుండవలెను; సామువిద్యలను జేయు చుండును; సహపంక్తిని భుజించవలెను. ఇటు లఱువదిసంవత్సరములు వచ్చువఱకు వాఁడు రాష్ట్రమునకై రక్తమును ధారవోసి, తదనంతరము గృహస్థాశ్రమధర్మములను జరుపుచుండును. దీనినే 'స్పార్టనుశిక్ష' యని లోకులు వాడుదురు,

ఇఁకను స్త్రీలవిషయమై చెప్పవలెను. వారుకూడ రాష్ట్రములోనివారుగనుక, గృహకృత్యములను జేయుటయేగాక, రాష్ట్రమును నిలఁబెట్టుటకుఁ దగిన బలముగల సంతానము నిచ్చువారు కావలెను. అందుచేత, వారుకూడ సామువిద్యలను నేర్చుకొని, మల్లయుద్ధము మొదలగువానిలోఁ దేరి పారిరి. పురుషులయెదుట వా రీవిద్యలను గనఁబఱుచుచుండిరి. వారికి స్వాతంత్ర్యముగలదు. ఇరువది సంవత్సరము లపుడు స్త్రీ వివాహమాడినను, భర్తతోఁ గలిసియుండుట లేదుగాని, రాకపోకలుమాత్రము గలవు. అన్యదేశపుకాంత యొకనాఁడు “మీలో స్త్రీలు పురుషుల నేలుదు”రని 'లియానుదాసు'ని భార్యను వ్యధికరణముఁ జేయ "మాస్పార్టను స్త్రీలే పురుషులను కనియెద”రని యీమె ఖండించెను. భర్తలను, కుమారులను శౌర్యము గనఁబఱుచునటుల వీరు ప్రోత్సాహపఱుచు చుండిరి. యుద్ధమునకు కుమారుఁడు వెళ్లునపుడు, "నాయనా, డాలుపట్టుకొని రమ్ము, లేదా దానిని పట్టుకొని పడిపొమ్ము” అని తల్లి వాని కుపదేశించును. స్త్రీ పురుషు లాటపాటలలో గలిసిమెలసి తిరుగుచుండిరి. బాగుగ నాట్యముఁ జేసినవారికి బహుమాన మిచ్చుట కలదు. ఈ మార్పులన్నియు 'లైకర్గసు' చేసెను.

ఇఁకను, స్పార్టనులు పైదేశములకుఁ బోవుట కాజ్ఞలేదు; విదేశీయులు వచ్చి వారి దేశములో నుండకూడదు. స్వదేశీయులు చెడిపోవుదు రను భయముతో నతఁ డీ నిబంధనఁ జేసెను. సమాధిస్థల మొకటి యేర్పఱచి, శవముల నక్కడనే సమాధి జేయునటుల యతఁ డుత్తరువు చేసెను. ఇటు లన్నివిధముల రాష్ట్రము నుద్ధరించి, యతఁడు సంతసించెను. రాజ్యాంగము లన్నియు సరిగా నడచుచుండెను. రాజును, సామంతులను సంసారులను పిలిపించి సభఁ జేసి “ నేను వీనికన్న విశేషమైనది మరియొకటి చేయఁదలఁచితిని. మీరు దాని ప్రకారము నడుచు కొనియెద మని ప్రమాణముఁ జేసిన, నేను దానిని నెరవేర్చుదును. మీ యభిప్రాయమేమి?” యని యతఁడు వారి నడిగెను. అతఁడు చేసిన నిబంధనల ననుసరించి నడచుటకు వారు ప్రమాణముఁ జేసిరి. తాను చేయఁబూనిన కార్యమునకు ముందు సోదె యడిగి మంచి చెడ్డలను కనుగొనుట కతఁడు 'డెల్ఫి' యను పట్టణమునకుఁ బోయెను.

గ్రీసు దేశములోఁ బ్రసిద్ధికెక్కిన 'అపాలో' యను సూర్యదేవాలయము 'డెల్పి' యను పట్టణములోనుండెను. పూనిన కార్యములయొక్క జయాపజయములు కనుగొనుటకు దేశదేశములనుండి ప్రజ లిక్కడకు వచ్చి సోదె యడిగి తెలిసికొనుచుండిరి. 'డెల్ఫిసోదె' యని లోకవిఖ్యాత మయ్యెను. ఈ దేవాలయములో మధ్య నొక బిలముగలదు. దీనిలోనుండి యొకవిధమైన వాయువు పైకి వచ్చుచుండును. సోదె చెప్పుటకుముందు, బిలముపై నొక ముక్కాలుపీట వేసికొని, దానిమీఁద సోదెకత్తె కూర్చుండును. ఆమె తల కా వాయువు యెక్కఁగానె, యామె స్మారకము తప్పి, సోదె చెప్పును. ఆమె పలికిన పలుకులను దగ్గిఱనున్న యర్చకులు వ్రాయుచుండిరి. ఈ మాటలనే, 'అపాలో' దేవుఁడు భక్తు లకు ప్రసన్నుఁడై, యామె ముఖత పలికె సని ప్రజలు విశ్వసించుచుండిరి.

ఇక్కడకు 'లైకర్గసు' వచ్చి, బలు లిచ్చి, సోదె యడిగెను. అతఁడు చేసిన పను లన్నియు శాశ్వతముగ నుండి, ప్రజలకు రాష్ట్రమునకు. గీర్తివచ్చు నని సోదె చెప్పిరి. ఆ మాటను వ్రాసి, యతఁడు స్వదేశమునకుఁ బం పెను. అతఁడు కష్టములు పడ లేదు; అన్న దూరుఁడు కా లేదు; మంచి కాలములో నుండెను; రోగము లేదు; విచారము లేదు; అన్ని విధముల సుఖముగ నుండెను. అయిన, నతఁడు జీవించుట కిచ్చ లేక, యుపవాసములు చేసి శరీరమును గృశింపఁ జేసి, కాలమునకు వశుఁ డయ్యెను. అతఁడు నియమించిన నియామకముల ననుసరించి నందున, నతఁ డేర్పాటు చేసిన రాజ్యాంగముల నయిదువందల సంవత్సరముల వఱుకు స్పార్టనులు నిలఁ బెట్టిరి.


Maha-Purushula-Jeevitacaritramulu.pdf