మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/టైబీరియసు-గ్రాకసు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

“టైబీరియసు-గ్రాకసు'

‘గేయసు-గ్రాకసు'

వీరిరువురు 'టైబీరియసు-గ్రాకసు'యొక్క కుమారులు, ఇతఁడు రోమునగరములోఁ బెద్ద యుద్యోగములు చేసి, ధర్మాత్ముఁడని పేరుఁబొందెను. ఇతని భార్య 'కార్నీలియ'. ఒకనాఁ డతఁడు పండుకొనియుండ, రెండు సర్పములు వచ్చి యతని ప్రక్కనఁ బడుకొనెను. వాని నతఁడు పట్టుకొని చంపఁ బోయెను గాని, సోదెకాండ్రు గూడదని వారించిరి. పురుష సర్పమును జంపిన, యతఁడు చచ్చునని; స్త్రీసర్పమును జంపిన, యతనిభార్య మరణము నొందు నని వారు చెప్పిరి. అతఁడు పురుషసర్పమును జంపించి, రెండవదానిని విడిచిపెట్టించెను. మరి కొద్దికాలమున కతఁడు స్వర్గస్థుఁ డయ్యెను. సంసారమును భార్య నిర్వహింపవలసివచ్చెను. ఆమెకుఁ బండ్రెండుగురు సంతానము.

భర్త మరణానంతరమున నామె సంసారమును జూగరూకతతో నిర్వహించుచుండెను. ఆమెనువివాహముఁ జేసికొనుటకు 'ఈజిప్టు'దేశపురాజు కోర్కిడి, వర్తమాన మామెకుఁ బంపెను. కాని, యామె యందుల కియ్యకొనలేదు. ఆమె సంతాన మంతయు నశించి, యిరువురు కుమారులు, నొక కూఁతురును మాత్రమే యామెకు దక్కిరి. ఈ కుమారులే వీరిరువురు. వీరి జీవితచరిత్రములనే మనము వినఁబోవుచున్నాము.

అన్నదమ్ము లిరువురు మంచి గరిడీలు; రెండవవాఁడు . స్వారిచేయుటలో ఘనుఁడు. దాతృత్వము, వక్తృత్వము, ఔదార్యము, మితభోజనము, ధైర్య స్థైర్యములలో వారు సమానులే. రాజకీయ వ్యవహారములలో మాత్రము వారు భిన్నాభిప్రాయులు. పెద్దవాఁడు శాంతుఁడు; రెండవవాఁడు దుడుకు. స్థానము వదలక పెద్దవాఁ డుపన్యసించును; తమ్ముఁడు నాట్యముఁ జేయుచు ప్రసంగించును. జ్యేష్ఠుని ప్రసంగములు నిర్మలమై, విరివిగనుండును; కనిష్ఠునివి గంభీరమై మనస్సును గరగించును. అటులనే, వారికి భోజనములోఁగూడ ద్వైతమె, ఒక్కఁడు మితభుక్కు; ఇతర రోమకులతోఁ బోల్చిన రెండవవాఁడు యుక్తాహారమును బుచ్చుకొనువాఁడైనను, పెద్దవానికంటె భోగియని చెప్పవచ్చును. ఒకఁడు ముందు వెనుక లాలోచించి కార్యములను నెమ్మదిగఁ జేయును; రెండవవాఁడు తొందరపాటున మనస్సు కట్టలేక, దాని వ్యాపారములకు లోఁబడి, వ్యవహారములలో షడ్రసములను జూపుచుండెను. ఏకోదరు లిట్టి భిన్నవ్యాపారములు గలవారు.

మొదటివాఁడు చిన్నవానికంటెఁ దొమ్మిది సంవత్సర ములు పెద్ద. ఇట్టి తారతమ్యము లున్నను, న్యాయవిచారణలోను, నియామకముల ననుసరించుటలోను, శత్రువులను శిక్షించుటలోను, తదితర రాజకీయవ్యవహారములలో వారు సమానముగనుండిరి. ఈడులో నింత వ్యత్యాసము లేకపోయిన, వారు చేసిన కార్యములు విశేషముగ రాణించియుండును. ముందు పెద్దవాని చరితమును వ్రాయుచున్నాము.

పెద్దవాఁడు ధర్మాత్ముఁడు, శాంతస్వభావుఁడును గనుక, శకునజ్ఞుల (Augurs) కళాశాలలోఁ బ్రవేశించెను. వాని యోగ్యతనుజూచి, యా కాలములో రోమునగరములోఁ బెద్ద యుద్యోగముఁ జేయుచు పేరుఁబొందిన 'ఆపియసు- క్లాడియసు' తన కుమార్తె నతని కిచ్చి వివాహముచేసెను. అతని చెల్లెలిని 'చిన్న సిపియు'న కిచ్చి వివాహము జేసిరి. ఇతఁడు తేజోవంతుఁడు, పరాక్రమశాలి, రణవీరుఁడు. ఇతఁ డాఫ్రికాదేశములోఁ బోరాడుచున్నపుడు గ్రాకసు బావమఱఁదితోఁ గలసిపోయి, యుద్ధములోఁ దన బలపరాక్రమములను వెల్లడిచేసెను.

యుద్ధములో గెలిచి స్వాధీనముఁ జేసికొనిన భూములలోఁ గొన్ని రాష్ట్రమున కని, కొన్ని ప్రజల కని, యుంచి, మిగిలినవానిని రోమకు లమ్మివేయుచుండిరి. కొంతకాలమునకు సామంతుల ప్రభ ప్రబలమై, భూములన్నియు వారె యాక్రమించుకొనిరి. అందుచేత, నైదువందల యెకరములకంటె హెచ్చుభూమి కెవఁడును ఖామందుగ నుండకూడ దని యొక చట్ట మేర్పడెను. ఇందుమూలమున సామంతులు కొంతవఱకు లొంగి తిరుగుటకు వీలుపడెను.

చాలకాలము రోమకులు యుధ్ధములలోఁ దిరుగుట వలన, పరదేశీయులు గాపురమువచ్చి వారి భూములను దున్నుచు భాగ్యవంతులయిరి. భాగ్యవంతు లయిన రోమకులు తమ భూములను హెచ్చు మొత్తమునకు కవులు వ్రాసినవారి కిచ్చుచున్నందున, నాదారుపడిన రోమకు లా మొత్తము లియ్య లేకపోయినందున, వీరు భూమినుండి తొలఁగించఁబడి, మోతుబరులైన పరదేశీయులు భూములను సాగుజేయుటకు నియమింపఁబడుచుండిరి. ఇటుల కొంతకాలము జరిగినపైని, రోమకులు డీలాపడి, నిలుచుటకు నీడ, తినుటకు తిండి, కట్టుటకు బట్ట లేక యుండిరి.

ఇంతలో 'టైబీరియసు' ప్రజానాయకుండుగ (Tribune) నియమించఁబడెను. అతఁడు వారి దురవస్థను జూచి, దానిని సవరణఁ జేయుటకు సమకట్టెను. సామంతుల కది కష్టమయ్యెను; వారి లాభములు రాఁబడులు తగ్గును. వా రందఱొక్కుమ్మడి నతని నెదిరించిరిగాని, యతఁడు ప్రజల ప్రాపకము కలిగి యున్నందునఁ బూనిన కార్యమును నెరవేర్చెను, భూములు కొలిపించి, వానిని రోమకుల కప్పగించెను. పరదేశీయులు భూములనుండి తొలఁగించఁబడిరి. ప్రజలందఱు సంతసించి, యతనిని వేనోళ్ల బొగడిరి. అనంతర మతఁడు 'అక్షదర్శకు'ని (Consul) యుద్యోగములోఁ బ్రవేశించెను. భూమి తగాయిదాలు తుద ముట్టలేదు. సామంతులను సంసారులను బొత్తుపఱుచవలె నని యతఁడుద్దేశించెను గాని, సామంతులు మొఱకుతనముచేసి, యతనిని జంపుటకు గుట్రపన్నిరి. ఒకరోజున నతఁడు 'సెనేటు'సభలో ముచ్చటించుచుండెను. అప్పుడు సామంతు లంద ఱేకీభవించి, యతనిపై తిరుగఁబడిరి. అతఁడు లేచి పారిపోయెను; అల్లరి బల మయ్యెను. సామంతులు ప్రజలు రాళ్లురప్పలతోఁ గొట్టుకొనిరి. అనేకులు చచ్చిరి. 'టైబీరియను’ దుర్మరణము నొందెను. ఆ శరీరమును దహనముఁ జేయుటకు తమ్ముఁడు తీసికొని పోవుచున్నను, దానిని వారు బలవంతముగ లాగుకొని, 'టైబరు' నదిలోఁ బారవేసిరి. చనిపోవుసరికి, యతనికి 30 సం॥ రము.లు లేవు.


Maha-Purushula-Jeevitacaritramulu.pdf