మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/మార్కు-ఆంతోని

వికీసోర్స్ నుండి

మార్కు-ఆంతోని

ఇతని తాతపేరు మార్కు-ఆంతోని'. ఇతఁడు 'సిల్లు' ని పక్షములోనివాఁ డగుటచేత దుర్మరణమునొందెను. ఇతని తండ్రిపేరు 'ఆంతొని'. ఇతఁడు పెద్ద యుదోగ్యములు చేసినట్టు కనఁబడదు. అయిన నితఁడు ధార్మికుఁడు; శాంతుఁడు; నెమ్మదిగఁ గాలముఁ గడిపెను. ఇతనియొద్ద కొక స్నేహితుఁడు డబ్బు లేనందున, సహాయముచేయుమని కోరవచ్చెను. ఇతని వద్ద సొమ్ములేదు; లేదని చెప్ప లేఁడు; అందులో, భార్యవద్ద భయము. కుమారునిఁ బిలిచి, వెండిగిన్నెలో నీరుపోసి తెమ్మని చెప్పి, వాఁడు దానిని తెచ్చినతరువాత, వానిని లోనికిఁ బంపివేసి, యాగిన్నెను స్నేహితునికిచ్చి వీనిని సంతోష పెట్టెను. తరువా తా గిన్నె కనఁబడనందున, భార్య పరిచారకులను దండించుటకు సిద్ధ మయ్యెను. అప్పు డితఁ డామెతో దాఁ జేసిన సంగతిఁ జెప్పి, యామెను శాంతిపఱచెను.

తండ్రి మరణమునొందెను; తల్లి మరియొకనిని వివాహ మాడెను. పిదపఁగూడ నతఁడు తల్లి సంరక్షణలో నుండెను. సవతితండ్రి 'కాటిలీని' కుట్రలోఁ గలిసియున్నందున, శిశిరో యతనినిఁ జంపించి వేసెను. అందుచేత, శిశిరోకు, ఆంతోనికి వైరముపుట్టెను. ఆంతొని మంచి చక్కనివాఁడు; శృంగార పురుషుఁడు. స్నేహితులతోఁ గలిసి మద్యపానముఁ జేయుచు, వారాంగనల పొత్తును బొంది కాలముగడిపి, 250 టాలంటులు ఋణముచేసెను. ఈ సంగతి తండ్రి, తెలిసికొని, 'కుమా రాంతొని'ని గృహము వెడలఁగొట్టెను. అతఁడు వెంటనె గ్రీసుదేశమునకుఁ బోయి, యక్కడ రణశిక్షను బొంది, వక్తృత్వము నభ్యసించెను.

గ్రీసుదేశములో 'గబీనియసు' అనువాఁడు పాక్షదర్శకుఁడు (Proconsul) గ నుండెను. ఇతఁడు సిరియాదేశమునకు యుద్ధమునకు వెళ్లినపు డాంతొనిని గూడ రమ్మమనెను గాని, యతఁ డనామికుఁడుగ వెళ్లుట కిష్టపడనందున, నతనిని రాహుత్తుల సేనానిగ నియోగించి వెంటఁదీసికొని వెళ్లెను. ఆంతోని మహాశూరుఁడు. సిరియాలోని పట్టణమును ముట్టడించినపుడు, ప్రహరీగోడల నతఁడు ముందుగ నెక్కెను. శత్రువుల దునుమాడి, రోమకుల కతఁడు జయముఁ గలుగఁ జేసెను.

తరువాత మరికొన్ని దినములకు 'ఈజిప్టు' దేశపురాజు తనకు సహాయముఁ జేయుటకుఁ గొంత సైన్యమును బంపవల సినదని కోరినందున, 'గబీనియసు' 'ఆంతొని'ని సైన్యముతో వెడలవలసిన దని యుత్తరువు చేసెను. అతఁ డచటకుఁబోయి, రాజు యొక్క శత్రువులను దునుమాడెను. అతని స్నేహితుఁ డొకఁడు శత్రుపక్షమున పోరాడి, పోరాటములోఁబడినందున, వాని శరీరమును దెప్పించి, దాని నతఁడు దగిన మర్యాదలతో బాతిపెట్టించెను.

అతఁడు మహోన్నతపురుషుఁడు; విశాలఫాలముగలవాఁడు; వెడదయురమువాఁడు. భేతాళుని (Hercules) వంశమువాఁడని వాడుకగలదు. అతఁడు పెద్ద గడ్డము పెంచెను; పెద్దకత్తి పట్టుకొని తిరుగువాఁడు; సైనికులచేతఁ బ్రేమించఁబడెను. వారివలె నతఁడు భాషను వెఱ్ఱిమొఱ్ఱిగ మాటలాడుచుండెను; వారితోఁ గలిసి భోజనము జేయుట. గలదు. అతఁడు శృంగారచేష్టలలోఁ దిరుగుటయేగాక, పరులను వానిలో దింపుచుండెను. అతఁడు మహాదాత; అడిగిన వానికి లేదని చెప్పుట లేదు. ఈ సుగుణ మతని దుర్గుణములను గప్పివేసెను.

ఈ కాలములోఁ బాంపేయునకు, సీౙరుకు వైరము మెండయ్యెను. ఆంతొని, సీజేరుపక్షము నవలంబించెను. పాంపేయుఁడు యుద్ధములో నోడి, యీజిప్టు దేశమునకుఁ బోయెను; సీౙరు సర్వాధికారి (Dictator) యయ్యెను. ఇతఁడు, ఫ్రాన్సు, స్పానియా దేశములకుఁ బోవునపుడు, రోమునగరములో నాంతోనిని సర్వాధికారిగ నియమించి, తాను వెడలెను.

ఆంతొని 'ఫుల్వియా' యను నామెను వివాహమాడాను. ఆమె స్త్రీయైనను, పురుషలక్షణములు గలది. సేనాధిపతులను, ప్రజాధిపతుల నామె లొంగదీసెను. ఆమె చేతిలో నాంతొని యేపాటివాఁడు? ఆమె మాట కతఁ డెదురునడుచుటకు వీలులేదు. ఆమెను లాలనఁ జేయదలఁచి, యామేచేత నతఁడు లాలనఁ జేయఁబడెను.

ఈలోపున సీజరు స్పానియాదేశమునుండి జయము బొంది వచ్చుచుండెను. ఇతని నెదురుకొనుటకై ఆంతొని వెళ్లెను. ఉభయులొక రథముమీఁదఁ గూర్చొనివచ్చిరి. వీరజయోత్సవములు చేయఁబడెను. రాజమర్యాదలు సీౙరు బొందెను; కాని అతఁడు రాజచిహ్నములను ధరించుటకు ప్రజ లియ్యకొనలేదు. మరి కొంతకాలము గడచినపైని, సీౙరు దుర్మరణము నొందెను.

ఈ సంగతివిని ఆంతొని చాల దుఃఖించెను; తన వాచాలత్వముఁ జూపి ప్రజల రేపెట్టెను. వారు కుట్రదారుల గృహములను దగుల బెట్టిరి; పట్టణము విడిచిపోఁజేసిరి, తరువాత సీౙరుయొక్క మేనగోడలికొడుకు 'అగస్టసు - సీౙరు', ఆంతొనియొద్దకు వచ్చెను. ఇతఁడు చిన్నవాఁడని యుపేక్షించి, వచ్చినవాని ఆంతొని విశేషముగ మన్నించలేదు. అగస్టసు కోపగించి, దేశములోనికిఁ బోయి, సైన్యములను గూర్చ నారంభించెను. ఆ సంగతి 'ఆంతొని' విని బలములను బోగుచేయ సమకట్టెను. ఉభయసైన్యములు దారుకొని పోరాడెను. ఆంతొని పరాజయముఁ బొందెను.

అతఁడు మార్గములో నానాశ్రమలుపడి, 'ఆల్ప్సు' పర్వత ప్రాంతములకు వచ్చెను. సేనాధిపతి 'లెపిడస్సు' సైన్యముతో నక్కడ విడిదిచేసియుండెను. అతనిని తనపక్ష మవలంబించ మని ఆంతొని వర్తమానముఁ బంపెను. అతఁ డందులకు సమ్మతించలేదు; సైనికు లా మాటవిని, వెంటనె తిరుగుబాటుచేసి, వారంద ఱొక్కుమ్మడి 'ఆంతొని'ని సేనానిగఁ బ్రకటనఁ జేసిరి. అతఁడు 'లెపిడస్సు'ను మర్యాదగఁ జూచి 'ఉపసేనాని'గ నియోగించెను. పదివేల రౌతులకును పదునేడు దళములకును నతఁడు సేనాధిపతియయ్యెను. 'ఫ్రెంచి'దేశమును గాపాడుట కతఁ డాఱు దళముల నక్కడ నుంచి వేసెను.

'శిశిరో' ప్రజారాజ్యమును నిలబెట్టవలెనని కోరుచుండెను; 'అగస్టసు' అందుకు సమ్మతించలేదు. అందుచేత, నితఁడు 'ఆంతొని'పక్షము వచ్చిచేరెను. 'అగస్టసు', ఆంతొని', 'లెపిడస్సు' - వీరు మువ్వురు 'రోము' రాజ్యమును మూఁడు సమభాగములుగఁ బంచుకొనుటకు సమకట్టి, యొడంబడికఁ జేసికొనిరి. మూఁడువందలమంది శత్రువులను వారు పరలోకమునకుఁ బంపిరి. 'శిశిరో'కూడ దుర్మరణము నొందవలసి వచ్చెను.

ఉచ్చపదవి వచ్చినతోడనె, 'ఆంతొని' యధాప్రకారము విషయాసక్తుఁడై తిరుగుచుండెను. 'ఘనుఁడు పొంపేయు'ని గృహములో నతఁ డుండెను; ప్రజల కష్ట సుఖములు వినుట లేదు; అహోరాత్రములు వారాంగనలతోను, తుచ్ఛులతోఁ గాలము గడుపుచుండెను. అతఁడు తన కూఁతురును 'అగస్టసు' కిచ్చి వివాహముఁ జేసెను. ఈ సంగతులు చూచి ప్రజలు రోసిరి. వారు సైన్యములతో వీరుమువ్విరిమీఁదఁ దిరుగఁబడిరి. ప్రజల సేనాధిపతులు 'బ్రూటసు', 'కాసియసు' మొదలగు వారు రణములో హతులైరి.

'అగస్టసు'ను రోమునగరములో నుంచివేసి, 'ఆంతొని' కప్పములను బుచ్చుకొనుటకు గ్రీసు మొదలగు దేశములకుఁ బోయెను. ఇక్కడ రోములో 'అగస్టసు' పడుచున్న బాధలను గనిపెట్టక, విశేషముగ ధనమును బుచ్చుకొని, దాని నతఁడు దుర్వినియోగముఁ జేయుచుండెను. 'కాకులను గొట్టి, గద్దలకు వేయుట' యనునటుల, ప్రజలను బీడించి రాఁబట్టిన ధనము నతఁడు వేశ్యలకు, భట్రాజులకు నిచ్చుచుండెను. అతఁడు చక్కనివాఁడని తెలిసి, రాజపత్నులు, సుందరాంగులు మహా విభవముతో నతనిని జూడవచ్చిరి. ఆ వచ్చినవారిలో 'ఈజిప్టు' రాణి 'క్లియోపాత్రా'కూడ నుండెను. ఈమె లంపట మతనికి తగులుకొనెను. ఆమె వలలోఁబడి, దివారాత్రము లతఁడు గానరాకుండెను.

'జూలియసుసీౙరు', 'పాంపేయుఁడు'...... వీరి కాలములో నామె చిన్నది. ఇప్పటికామెకు యుక్తవయస్సువచ్చెను. ఆమె రెండవ రతీ దేవివలె నుండెను. ఆమెకు నాలుగైదు భాషలలోఁ బ్రవేశము గలదు; సరసముగ మాటలాడునది. మహావైభవ ముతో నామె 'ఆంతొని'ని జూడవచ్చెను. ఆమెకు జిక్కి, యతఁడు వ్యవహారములను విడిచిపెట్టెను. "అహో మోహస్య దుశ్చేష్టితం”. విందులు, నాట్యములు, నాటకములు--వీనిలో వారు మునిఁగి తేలుచుండిరి.

అతని భార్య 'ఫుల్వియా' రోమునగరములో నుండెను. దుర్వ్యాపారములు గలవాఁడని, అతనిపక్షము వా రతనిని నిరసించి విడిచిపెట్టెద రను భయముకలిగి, యామె కొన్ని కుట్రలు పన్నెను. వీనివలన స్వపక్షము దృఢమగు నని యామె యెంచెనుగాని కలహములు లావై, 'అగస్టసు', 'ఆంతొనీ' లకు వైరముపుట్టెను. ఈ సంగతులు విని, 'ఆంతొని' రోము నగరమునకు వచ్చెను. ఇంతలో నతని భార్య మృతి నొందెను. అతఁడు 'అగస్టసు'తో సఖ్యముఁ జేసికొనెను. తూర్పుదేశములకు 'ఆంతొని', పశ్చిమదేశములకు 'అగస్టసు' - ప్రభువులైరి. 'ఆఫ్రికా'దేశమును 'లెపిడసు'నకు వారిచ్చిరి. భార్య చనిపోయినందున, 'అగస్టసు' యొక్క సవతియక్క, 'ఆక్టేవియా'ను 'ఆంతొని' వివాహమాడెను. ఈ సంబంధము వారి మైత్రిని బలపరచెను.

'ఘనుఁడు పాంపేయు'ని కుమారుఁడు 'సిసిలీ' ద్వీపములోఁ బ్రభువుగ నుండెను. ఇతనితో మైత్రిజేసి, 'ఆంతొని' 'గ్రీసు'దేశమునకుఁ బోయెను. అక్కడ గరిడీయుత్సవములు చేయించుటలో నతఁడు కొంతకాలము గడిపెను. 'పార్థివు'లు తిరుగుబాటు చేసినందున, వారిని దండించుట కతఁడు తన 'ఉపసేనాని'ని సైన్యముతోఁ బంపెను. ఇతఁడు పోయి శత్రువుల నోడించెను.

ఇంతలో 'అగస్టసు' కొన్ని వ్యాపారములను వ్యతిరేకముగఁ జేయఁ దలపెట్టెనని విని, 300 నావలను దీసికొని 'ఆంతొని' స్వదేశమునకు వచ్చెనుగాని, యే రేవు పట్టణములో నిలఁబడుట కతనికి వీలులేకపోయెను. అప్పు డతని భార్య నిజమైన సంగతిని గనుగొనుటకు తన యన్నయొద్దకు వెళ్లెను. బావ మఱదుల కామె సంధిచేసెను. భూ సైన్యములో రెండు దళములు 'ఆంతొని' కిచ్చుటకు 'అగస్టసు' ఒప్పుకొనెను; ఇతనికి నూరు నావల నిచ్చుట కతఁ డొప్పుకొనెను. పిల్లలను, గర్భిణితోనున్న భార్యను 'అగస్టసు' కప్పగించి, యతఁడు తూర్పుదేశములకుఁ బోయెను. 'కుమారపాంపేయుఁడు' తిరుగుబాటు చేసినందున, వానిని దండించుటకు 'అగస్టసు' 'సిసిలీ' ద్వీపము వెళ్లెను.

'ఆంతొని కొంతకాలము గ్రీసులోను, కొంతకాలము 'క్లియోపాత్రా' సన్నిధిని గడిపెను. ఎక్కడనున్నను, నతఁ డామెను స్మరించని దినములేదు. ఇంతలో 'పార్థివుల'తో యుద్ధము తటస్థమయ్యెను. రోమకులు వారితోఁ బోరాడిరి; జయాపజయములు తెలియవు; నిలుచుటకు నీడ, తినుటకు తిండి, రోమకులకు లేకపోయెను. శత్రువులు దొంగయుద్ధము జేయ నారంభించిరి. ముందు, వెనుక , ప్రక్కను ఎక్కడను శత్రువులే; దూరమునను, సమీపమున వారలే; నిలిచి యుద్ధము సేయరు. ప్రాణములు దక్కించుకొని, రోమకులు 'ఆంతొని'తో బయటవచ్చి పడిరి. ఎందఱు రోమకులు శత్రు దేశములోఁ జనిపోయిరో చెప్పలేము.

“భ్రష్టస్య కావా గతిః.” దుర్వ్యసనములలోఁబడిన మనుజునకు బుద్ధిమాంద్యము గలుగును. ఇటు లపజయము బొంది, బాధపడుచున్న, నతని మనస్సు 'క్లియోపాత్రా' యందు ప్రసరించెను. ఆమెను జూచి యతఁ డమందానంద మొందెను. ఇంతలో నతని భార్య పిల్లలతో వచ్చెదనని వర్తమానముఁ బంపెను. కొంతసైన్యముతో నామె ధనమును, తినుబడి వస్తువులను, సైనికులకు దుస్తులను బట్టుకొని, బయలుదేరెను. ఈ సంగతి వినినతోడనె, 'క్లియోపాత్రా' మనస్సున సవతివైర మంకురించెను. ఒకప్పుడు సొక్కుచు, సోలుచు, భోజనము మాని కృశించి, భర్తృవియోగమును భరించ లేనిదానివలె నతని యెదుట నటించెను. అతని కామెయం దిరువురు పిల్లలు గిలిగిరి. ఈమె వలపులకుఁ జిక్కి, 'ఆథెన్సు' పట్టణములో నుండ వలసినదని భార్య కతఁడు జూబు వ్రాసిపం'పెను. దేశములు దోచితెచ్చిన ధనమునెకాదు, దేశములనె నతఁడు క్లియోపాత్రా కిచ్చివేసెను. ఆమె 'ఈజిప్టు'దేశపు రాణి; ఇప్పుడు మరి నాలుగు దేశములకుకూడ రాణియని ప్రకటింపఁబడెను. ఇంతియకాదు - ఆంతొనికి మొదటిభార్య 'పుల్వియాకు' కలిగిన బిడ్డలు, రెండవభార్య 'ఆక్టేవియా'కు జనించిన వారు, 'క్లియోపాత్రా'కు బుట్టినవారు కలరు. వీరిలో నాఖరువారి నతఁడు దేశములకు రాజులుగఁ జేసెను. అతని భార్య రోము నగరమునకుఁ బోయి, యక్కడ భర్తృగృహములోనుండి, తన పిల్లలను సవతిపిల్లలను బెంచుచు, భర్తయొక్క గౌరవమును జెడగొట్టక, తమ్ముఁడైన 'అగస్టసు'కు భర్తపైని కోపముబుట్ట కుండునటుల ప్రవర్తించుచుండెను. ఆమె యవస్థఁ జూచి, యందఱు దుఃఖాక్రాంతులై, రగులుచుండిరి. రోమునగరమునకు వచ్చినపు డతఁడు రాణిననుసరించి తిరిగెనుగాని, భార్య నక్కఱ చేయలేదు,

అనంతర మతఁ డామెతో 'ఈజిప్టు' దేశమునకుఁ బోయెను. అతనికి, 'అగస్టసు'కు వైరముపుట్టెను. ఇరువురు సైన్యములను బోగుచేసిరి. ఆంతోనికి దైవబలము లేదు. 'దైవీ బలే దుర్బలే'. అతని భూ నావికాసైన్యములు గొన్ని యోడి పోయెను. మిగిలినవి 'అగస్టసు'పక్షమునకు వెళ్లెను. ఇటుల పరాభవము బొంది, 'ఆంతొని, క్లియోపాత్రా'లు 'ఈజిప్టు' వచ్చిచేరి, సంధిమాటలలోకి దిగిరి.

ఈ మాటలు విని, 'అగస్టసు' ఆమె కభయమిచ్చుటకు నిశ్చయించెనుగాని, అతనిని దండించెద నని వర్తమాన మును బంపెను. సైన్యమును దీసికొని 'అగస్టసు' వారి పట్టణము మీఁదికి వచ్చెను. కొంతవఱ కాంతొని శేషించిన సైన్యము సాయమున వారితోఁ బోరాడెను గాని కార్యము లేకపోయెను. ఇంతలో రాణిచెప్పినప్రకార మామె చనిపోయిన దని భృత్యు లతనితోఁ జెప్పిరి. అదివిని, యతఁడు కలఁతఁజెంది, తనను కత్తితోఁ బొడిచి చంపవలసినదని దగ్గఱనున్న పరిచారకుని వేఁడెను గాని, వాఁ డటులచేయలేక, కత్తితోఁ బొడుచుకొని చచ్చెను. వాని ధైర్యమునకు మెచ్చి, యతఁడు తల్వారు తీసికొని దానిని తన కడుపులో గ్రుచ్చుకొనెను గాని, యతఁడు చావలేదు. శ్రమనివారణఁ జేయవలసినదని పరిచారకుల నతఁడు వేఁడెనుగాని, వా రతనిని జంపలేకపోయిరి. రాణి బ్రతికియున్నదని చెప్పి, వా రతని నామెయొద్దకు మోసికొని పోయిరి.

ఇంతకు పూర్వ మామె సునాయాసముగ మరణము నొందుట కుపాయములను బరికించి, వానిలో 'ఆస్టు' యను పురుగుకాటు మంచిదని యెంచి, వానిని తెప్పించియుంచెను. అతని మరణావస్థనుజూచి, యామె యా పురుగులచేతఁ గరిపించుకొనెను. కొంతవఱకు వారుభయులు మాటలాడుచు, నొకరిచేతులలో నొకరు ప్రాణములను విడిచిరి. వీరు క్రీ. పూ, సం!! 30 రములో స్వర్గస్థులయిరి.