Jump to content

మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/మార్కసు-బ్రూటసు

వికీసోర్స్ నుండి

మార్కసు-బ్రూటసు

మార్కసు-బ్రూటసుయొక్క పూర్వికుఁడు 'రోము' నగరములోఁ బెద్ద యుద్యోగముఁ జేసెను. ఇతఁడే, నగరములోని ప్రజాపీడకుల సంహరించి, రాజ్యమునకు స్వాస్థ్యమును దెచ్చెను. ఇతని రూపమున, రోమకు లోక యిత్తడి ప్రతిమను నిరూపించి, నగరములో స్థాపించిరి. ఇతఁడు చదువుకొనిన వాఁడైనను, మహా కఠినుఁడు. ఆ వంశములోనివాఁడైన మార్కసు-బ్రూటసు చదువుకొని నెమ్మదియైనవాఁడు; మెత్తని చిత్తముగలవాడు. జూలియసుసీౙరును చంపుటకు గూడిన కుట్రదారులలో నొకఁ డైనను, దౌర్జన్యమును జేసినవాఁడు 'కాసియసు' యనువాఁడు గాని, యతఁడు కాఁడు. అతఁ డుదారపురుషుఁ డని వాడుక. అతఁడు కులీనుఁ డని కొందఱు, కాఁడని కొందఱు చెప్పుదురు. ఏది ఎట్లున్నను, ఇతని పూర్వికులలో మూఁడు, నాలుగు తరములలోనివారు సర్కారుద్యోగము చేసినటుల కానవచ్చుచున్నది.

గ్రీకు వేదాంతియైన 'ప్లేటో' మత మతఁ డవలంబించెను. లాటినుభాషలోఁ జదువ, వ్రాయ, నుపన్యసించుటకుఁ దగినంత పాండిత్య మతఁడు సంపాదించెను. ముక్తసరిగ వ్రాయుటయు, ప్రసంగించుటయు నతని వాడుక.

ఈ కాలములోనే, రోమునగరమును, రాజ్యమును స్వాధీనపఱుచుకొనుటకు, సీౙరు, పాంపేయుఁడు ప్రతికక్ష వహించి పోరాడుచుండిరి. తన తండ్రిని జంపినవాఁడని కార్పణ్యము వహించక, పాంపేయునిపక్షమును బ్రూట నవలంబించెను. శతృకక్షలోనివాఁడైనను, సీౙ రతనిని ప్రేమించెను. అనంతరము, సీౙరు, పాంపేయుఁడు పోరాడిరి. పోరాటములోఁ బాంపేయుఁ డోడిపోయెను. బ్రూటసు వచ్చి సీౙరుపక్షములోఁ జేరెను.

అతఁడు న్యాయమైన పనులకే సమకట్టును; సమకట్టిన వానిని తుదముట్టించును; తుదముట్టినవానిలో జయమే గాని యపజయము లేదు. ఒక పని, న్యాయము గాని యన్యాయము గాని, చేయుమని పలుమా రొకరు చెప్పుటచేత, అతని మనస్సొక్కొకవేళ తిరుగును గాని, యతఁ డటుల సాధారణముగ మనస్సును తిరుగనియ్య లేదు. అతఁడు నిష్కర్షగ వ్యవహారములను జరిపెను. కొన్ని పరగణాలలో సర్కారుద్యోగస్థులు ప్రజలను బీడించి సొమ్ము నపహరించుట గలదు. అతఁ డేపరగణాలలో సర్కారుపనిఁ జేసెనో, యక్కడివారందఱు సుఖముగ జీవించి, యతనిని బొగడిరి. అతనికి ధనదాహము లేదు.

'ప్రేటరు'ద్యోగము లనేకములు గలవు. అందులో రోమునగరములోని యుద్యోగము శ్రేష్ఠము. అందుచేత నా పనికి, బ్రూటసు, ఇతని బావమరిది 'కాసియసు' వీ రిరువురు దరఖాస్తుఁ జేసిరి. వారిరువురిలో బ్రూటసు నా పనిలో సీౙరు నియోగించెను. వీ రిరుగురితో సఖ్యతగ నుండవలెనని సీౙరుయొక్క యభిప్రాయము. ఇతఁడు సమకూర్చుచున్న యేకచ్ఛత్రాధిపత్యమునకు వీరుమాత్ర మిష్టపడలేదు. మరియొక యుద్యోగమిచ్చినను, 'కాసియసు' లోలోన ఘూర్ణిల్లుచుండెను. బావమరదుల కెప్పుడును వైరమె. బావమరిది చొరవరి, తొందరపాటుగలవాఁ డని యతనికి కోపము.

బ్రూటసు 'ప్రేటరు'గ నుండుకాలములో, "ప్రజాపీడకుల నెఱుంగుము. ఎఱుంగకపోయిన, నీవు బ్రూటసువు కావు” అని వ్రాయఁబడిన కాగితములచేత నతని న్యాయపీఠ మలంకరించఁబడియుండెను. అంతలో సీౙరును జంపుటకు, కాసియసు మొదలగునారు సమకట్టి, కొంచెము పేరుగలవాఁడు కుట్రకులకు నాయకుఁడగ నుండిన సలక్షణముగ నుండు నని యెంచి, బ్రూటసును దమలోఁ జేర్చుకొనుట కాలోచించిరి. ముందుగ నతని భావము గనుగొని, వా రతనిని గలుపుకొనిరి. నాఁడుమొద లతఁడు స్వాస్థ్యము గోలుపోయి హాయిగ నిద్రించుటలేదు; అతని గుండెలు బరువెక్కెను; నిదురలోఁ ద్రుళ్లిపడి లేచుట సహజమాయెను; కళంక రహితునకు కళంకము తగిలె. ముఖముఁజూచిన మీగాళ్లవాపు బయల్పడు నను లోకోక్తి నిజమయ్యె; కచ్చేరిలో నతఁడు తన ముఖమును వికాసముగ నుంచ జూచెనుగాని అట్టిపని వీలుగాదయ్యెను. పనిపాటులు లేనిసమయములో నతఁడు మౌనముగ నుండును. అతని మనోవ్యధనుభార్య కనిపెట్టి, యతని నడుగుట యుచితముకా దని తలంచి, యొక పన్నాగము పన్నెను. పరివారకు లందఱను బొమ్మని, కత్తితో నామె తన చేతిమీఁద నొక గంటు వెట్టుకొనెను; రక్తము కారుచుండెను. అప్పుడు భర్తవచ్చి కారణమేమని యామె నడిగెను. ఆమె కారణముఁ జెప్పక "ఏమైన మీకేమి? నేను మీకు సహధర్మచారిణియని తోఁచిన, మీ మనోవ్యథను నాతొఁ జెప్పియుందురు. అటుల చేయలేదు గనుక, ....” అని యేడ్వసాగెను. ఆమె చదువుకొనినది; బుద్ధిమంతురాలు; ఆలోచన పరురాలు; 'స్త్రీలనోటిలో నూఁగింజ నాన'దను మాట తెలిసినను, నామెతో నతఁడు కుట్రసంగతిఁ జెప్పెను. ఆమె గాయముఁ జూపించెను.

అనంతరము సీౙరు సభలోనికి వెళ్లుటయు, కుట్రదారు లంద ఱతని నక్కడ బొడిచి చంపుటయు జరిగెను. కొంతవఱకు సీౙరు వారి నెదిరించెనుగాని, బ్రూటసు తనను బొడుచుట చూచి, 'అరే, బ్రూటసు, నీవుకూడానా' యని యతఁడు కండ్లు మూసికొని నేలఁగూలెను. శత్రువును సంహరించి, ప్రజారాజ్యమును నిలఁబెట్టినందుకు, సెనేటుసభవారు బ్రూటసు నభినందించిరి; ప్రజలుగూడ సీౙరు మరణమునకు విచారించ లేదు. తదుపరి సీౙరుయొక్క దినవారములు వచ్చెను. అతనికి నపరకార్యములఁ జేయుట కతని స్నేహితుఁడు 'ఆంతోని' యారంభించెను. శవమును రుద్రభూమికిఁ దీసికొని పోవుటకు ముందు, మరణము నొందినవాని బంధువుఁ డొకఁడు ప్రేతోపన్యా స మొకటిసేయుట, రోమకులలో వాడుక కలదు. మరుచటిదినము 'ఆంతోని' ప్రజలయెదుట ప్రేతోపన్యాసము నిచ్చెను. చనిపోవుటకు ముందు, సీౙరు మరణశాసన (విల్లు) మొకటి వ్రాసి, దానిలోఁ బ్రతి రోమకునకు సుమారు రు 50 లిచ్చి, నగరమునకుఁ బైనున్న యుద్యానవనములు తోఁటలు మొదలగువానిని ప్రజలు వాడుకొనవలసినదని, శాసించెను. ఈ శాసనమును 'ఆంతోని' చదివి వారికి వినిపించెను. అదివఱకు సీౙరు మరణమునకు విచారించని వారంద ఱుద్రేకించి, కుట్రదారులను సంహరించుటకు సిద్ధపడిరి. సీౙరుకు తగిలిన గాయముల నతఁడు వారికిఁ జూపించెను. వారు వానిని జూచి విశేషముగ కోపించి, బల్లలు కుర్చీలు మొదలగువానిని తగులబెట్టి, యా కొరకంచులతోఁ గుట్రదారుల గృహములను దగులబెట్టుటకుఁ బోయిరి. ఈ సంగతి వారు విని గృహములు విడిచిపోయిరి. బ్రూటసు లేచి పారి పోయెను.

అనంతరము సీజేరుయొక్క మేనల్లుఁడు 'అగస్టసు-సీౙరు' నగరమునకు వచ్చెను. ఇతఁడు 'ఆంతోని'తోఁగూడి, 'లెపిడసు' యనువానితో సహా దేశమును బంచుకొనెను. బ్రూటసు 'ఆథెన్సు' నగరములో నివసించుచుండెను. లోలోపున నతఁడు 'కాసియసు' మొదలగు స్నేహితులద్వారా పనిచేయించి, సైన్యమును జేర్చెను. రోముకు దూర్పుననున్న దేశము లతనికి స్వాధీనమయ్యెను. అతఁడు సైన్యములను దీసికొని 'అగస్టసు' పైకి వెడలెను. ఒకనాఁడు వీరు విడిదిచేసిరి. అతఁడు విశేషముగ నిద్రపోవువాఁడుగాఁడు. రాత్రి భోజనముఁ జేసి, 2 3 గంటల కాలము శయనించి, శేషించినకాలములోఁ జదువును; కొంతవర కుత్తరువులను వ్రాయును. స్కంధావార మా రాత్రి, నిశ్శబ్దముగ నుండెను. శిబిరములో నతఁ డొంటరిగ గూర్చుని వ్రాసికొనుచుండెను. అప్పుడు నిశిరాత్రి; ఒక చాయాగ్రహ మతనియెదుట నిలిచెను. “నీ వెవ్వఁడవు? నాతో నీకేమిపని?" యని యతఁడడిగెను. "నేను నీ దురదృష్ట దేవతను. యుద్ధములో నన్ను చూడగల"వని చెప్పి యా గ్రహము జారిపోయెను. అనంతరము పోరయ్యె, ఉభయసైన్యములు దార్కొని మిన్నుముట్టనార్చుచు, బొడుచుచు, దిక్కులు తెలియక, వెనుదియ్యక, పోరాడిరి. అగస్టసు జయముఁ బొందెను. కాసియసు మొదలగువారు మడిసిరి. బ్రూటసు మువ్వురు పరిచారకులతోఁ గూడి పరారియయ్యెను. వీరొక కొండ గుహనుజేరిరి. స్నేహితులకు గలిగిన విపత్తునకు విచారించి, తనను జంపి వేయవలసిన దని యతఁడు సేవకులకు వేఁడెను. వారిలో నొకఁడు కత్తియెత్త, దానిమీఁదఁబడి యతఁడు ప్రాణములు విడిచెను. సేవకు లాత్మహత్యఁ జేసికొనిరి. ఈ యుద్ధము క్రీ. పూ. సం|| 42 రములో జరిగెను. భర్త మరణము విని, యతని భార్య దుర్మరణము దెచ్చుకొనెను.

అతఁడు గ్రంథపఠనకుఁ దగినవాఁడుగాని, సర్కారు పనికిఁ దగినవాఁడుకాఁడు; ప్రజారాజ్యమును నిలబెట్టుటకు పాటుపడెను; స్వదేశాభిమాని యని పేరొందెను. ఆ కాలములో నతఁడు మంచినడవడికలవాఁడు; చదివిన చదువుల నతఁ డభ్యాసములోనికి దీసికొని రానందున, నవి నిష్ప్రయోజనములయ్యెను. మంచి జ్ఞాపకశక్తి గలవాఁడు. ప్రజానాయకుఁ డగుటకుఁ దగిన త్రిశక్తు లతనికి లేవు. అందుచేత, నతఁడు మాటుపడెను.