Jump to content

మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/పాంపేయుఁడు

వికీసోర్స్ నుండి

పాంపేయుఁడు

పాంపేయుని తండ్రి 'స్ట్రాబుఁడు'. తండ్రి దురాశాపరుఁ డగుటచేత నతనిని రోమనులు గర్హించిరి. సన్నిపాతమువలన నతఁడు మృతినొందెను. స్మశానమునకు శవమును దీసికొని పోవుచున్న సమయమునఁ గోపముఁ బట్టలేక వారు దానినిఁ బీకి పారవేసిరి. తండ్రి నెంత నిందించిరో కుమారుని వారంత సుతించిరి. పాంపేయునిఁ బ్రేమించుట కనేక కారణములు గలవు. ఆతఁడు సంగర కేళీనిపుణుఁడు; శరశిక్షాశాలి; గురులకు భయస్థుడు; ఉదారుఁడు; దయార్ద్రహృదయుఁడు; శౌర్య ధైర్య గాంభీర్య ధురంధరుఁడు; వినయరతుఁడు; హృదయ విదుఁడు; మానధనుఁడు ప్రజల పొత్తు నభిలషించువాఁడు. అతఁడు మఱియు సముచితసంభాషణంబులచేతఁ బ్రజల నం కించుటచే వా రతని నభినందించిరి. చెలువంపుమేనును జెన్ను మొగంబును గలిగి, వారి నతఁ డాకర్షించెను. నేత్రములలో నతనికి సిరియుండు. అతఁడు మహా అలెగ్జాండరును బోలి యుండెను. మానసికముగ నితని పనుల నతఁడు స్మరించు చుండెను.

అతఁడు తండ్రితోఁగూడఁ బోరాటమునకు వెల్లియుం డెను. శత్రువు లతని స్నేహితుని వశముఁ జేసికొని, స్కంధావారములో నతఁడు నిద్రించునపు డతనినిఁ బొడిచి చంపుమని స్నేహితునిఁ బ్రోత్సాహపఱచిరి. ఈ సంగతి భోజనకాలమం దతనికిఁ దెలిసినను పాంపేయుఁడు యధావిధిగ స్నేహితునితోఁ గలిసి భుజించి యతనినిఁ బంపివేసెను. అతఁ డా రాత్రి, శిబిరములోఁ బండుకొనలేదు. స్నేహితుఁడు నిశాసమయమున శిబిరములోనికిఁ బోయి యతఁడుఁ బండుకొనినాఁడని భావించి, కత్తితో నతని మంచముమీడ నాలు గైదు స్థలములలో గంట్లు పెట్టెను. తదుపరి, సైనికులందఱు కలహించి సేనాధిపతియైన స్ట్రాబుని చంపుటకు యత్నించిరి. ధైర్యముఁ గలిగి పాంపేయుఁడు వారి నివారించెను. కొందఱుమాత్రము శత్రుపక్షములోనికి వెళ్లిరి.

ఇంతలో స్ట్రాబుఁడు గతించెను. ఇతఁడు ప్రజలయొద్ద నపహరించిన సొత్తు పాంపేయుని యధీనములో నున్నదని ప్రజ లొక వదంతి వేసి, యతనిని, న్యాయసభలో విచారణకుఁ దెచ్చిరి. స్వదేశమునకు వచ్చులోపున శత్రువు లతని గృహములోఁ బ్రవేశించి ధనము నపహరించిరి. అప్పు డతఁడు న్యాయసభలో ప్రాడ్వివాకుని (Proctor) యెదుట సపక్షమున న్యాయముగఁ బలికినందున నితఁ డందులకు సంతసించి తన కుమారితె నతని కిచ్చి వివాహముఁ జేయుటకు సమకట్టెను. ఈ సంబంధమునకుఁ బ్రజలు సంతసించిరి. అతఁడు 'అంతస్థి' యను నామెను వివాహమాడెను. ఈమె న్యాయాధికారి కూఁతురు.

తదనంతర మతఁడు శత్రుపక్షమువాఁడైన 'సిన్నుని' యొక్క శిబిరములోనికి వెళ్లెను. కారణములేక యతనిని శత్రువు నిందించినందున నతఁ డక్కడనుండి వెడలెను. సైనికు లందఱు నతనిని 'సిన్నుఁడు' చంపియుండు నని యెంచి వా రతనితోఁ గలహించి వానిని జంపివేసిరి.

ఈలోపున పాంపేయుఁడు స్వగ్రామమునకుఁ బోయి యక్కడ ప్రజల నందఱిని రేపి కొంత సైన్యమును సమకూర్చెను. కొంతకాలమున కతనిసైన్యము బహుళమైనందున రాజ్యాధికారు లందఱు మిగులభయపడిరి. సం|| 23 రముల వయసువాఁడై రాజ్యాధికారుల సెలవులేనిది యతఁ డీ సైన్యమును చేర్చెను. రాష్ట్రము పక్షమునఁ గొందఱు సేనాధిపతులు సైన్యములను దీసికొనివచ్చి యతనితోఁ బోరాడిరి. కాని వారి నందఱి నతఁడు సమరములోఁ బరిభవించెను. ఈ వార్తను విని రోముపట్టణములో నక్షదర్శకుఁడును (Consul) న్యాయాధికారియునైన 'సిపియుఁడు' దండుతో వెడలివచ్చెను. ఇతఁడుగూడ యుద్ధములో నోడి పరారియయ్యెను. ఇటుల మహాదండనాయకు లఖండంబుగ ఖండింపఁబడుటను విని 'సిల్లుఁడు' తన సైన్యమును గొని పోరాటమునకు వచ్చెను. ఇతఁడు పాంపేయుని యొక్క రథగజతురగపదాతులను జూచి వెఱుఁగుపడి అతని తోఁ గలహించుటకు వెనుకకుఁ దీసెను. అపు డుభయసేనాధిపతులు (సిల్లుఁడు, సాంపేయుఁడు) మిత్రభావమున సమావేశమైనపుడు పాంపేయుఁడతనిని సార్వభౌముఁడని (Imperator) గౌరవించి వందనముఁ జేసెను. తనకంటె చిన్నవాఁ డైనను పాంపేయుని సిల్లుఁడుగూడ నటులనే గౌరవించి మన్ననఁ జేసెను. అతఁడు వచ్చినపుడెల్ల సిల్లుఁడు ప్రత్యుత్థానముఁ జేసి యతనిని దీసికొని వచ్చి యాసనముపైనిఁ గూర్చుండ నియమించుచుండెను.

ఇటుల గౌరవములను బొందుచున్నను బాంపేయుఁడు గర్వించలేదు. సిల్లుఁ డతనిని ఫ్రాంసుదేశమునకుఁ బోయి యక్కడ సేనాధిపత్యమును వహించవలసిన దని నియమించెను. “అక్కడి సేనాధిపతినిఁ బనిలోనుండి తొలగించుట న్యాయముకా"దని పాంపేయుఁడు చెప్పెను. అందులకు సిల్లుఁడు సంతసించక పాంపేయుని సేనాధిపత్యము వహించుమని నిరోధించెను. ఆజ్ఞోల్లంఘనముఁ జేయలేక పాంపేయుఁడు సమ్మతించి ఫ్రాంసుదేశమునకుఁ బోయి యక్కడి సేనాధిపత్యమును వహించి సిల్లునియొక్క కార్యముల నతఁడు నిర్వర్తించెను.

కొంతకాలమునకు 'సిల్లుడు' నానా దేశములలోను సర్వాధికారియని ప్రఖ్యాతి వహించెను. అందుల కతఁడు సంతసించి ప్రత్యయిత దండనాయకులను సన్నుతించి, బహూకరించెను. పాంపేయునియొక్క సుగుణములకు ముదమంది సిల్లుఁ డతనితో సంబంధముఁ జేయుటకుఁ దలపెట్టి దంపతు లిరువురు నేకీభవించి తమ కోడలి నతని కిచ్చి వివాహముఁ జేయుటకు సమకట్టిరి. ఇంతకన్న క్రూరమైనకార్యము మఱి యొకటి లేదు. అతని మొదటి భార్య (అంతస్థి) నెలదప్పి యుండెను. అతనిమూలమున నామె తండ్రి మరణము నొందెను. ఈ దుఃఖమును బట్టలేక యామె తల్లి యాత్మహత్య చేసికొనఁబూని యుండెను. దీనికి తోడుగ పాంపేయుఁడు రెండవ వివాహ మాడునను వార్త వినవచ్చెను. అతఁడు వివాహమాడఁ దలఁచిన పడుచు గర్భముధరించి యుండెను. ఇంతలో 'అంతస్థి' ప్రసవమై పురిటిచావుఁ జచ్చెను..

తదనంతరము 'సిసిలీ'ద్వీపములోఁ గొందఱు రాజ్యాధికారులపైని తిరుగఁబడిరి. వారిని దండించుటకు పాంపేయుఁ డా ద్వీపమునకు వెళ్లి వారిని మాపివేసెను. ఇంతకు లోపున నాఫ్రికాఖండములో నుత్తరభాగమునఁ గొన్ని యల్లరులు పుట్టినందున వాని నణఁగఁగొట్టుటకు 'సెనేటు' సభవారు, సిల్లుఁడును, పాంపేయున కుత్తరువుచేసిరి. అతఁ డా ప్రకారము ఆఫ్రికాఖండముసకు దండుతో వెడలి వెళ్లెను. అక్కడ ఘోరాహనములో శత్రువులఁ దునుమాడి యతఁడు జయముఁ బొందెను.

ఇంతలో నతనిని సేనాధిపత్యమును విడిచి, చాజధానికి రావలసిన దని సిల్లుఁ డుత్తరములు వ్రాసిపంపెను. ఇందుకుఁ గారణ మతనికిఁ దెలియలేదు. ఈ సంగతి సైనికులు విని తమ్మును విడిచి పాంపేయుఁడు వెళ్లుటకు వారు సమ్మతించలేదు. సేనాధిపతియందు మిగుల బద్దానురాగులైనందున వా రతనిని నేనాధిపత్యము విడువవల దని నిరోధించిరి. కాని వారి నతఁ డెంత సమాధానముఁ జేయఁ దలఁచినను వా రతని మాటల సరకు సేయక, అతని నధికారుల యాజ్ఞకు వ్యతిరేకముగ నడువవలసిన దని ప్రోత్సాహముఁ జేసిరి. “ నే నధికారుల యాజ్ఞకు వ్యతిరేకముగ నడువలేను. మీరు నన్నిటుల నిర్బంధముఁ జేసిన యెడల నే నాత్మహత్యఁ జేసికొనియెద"నని వారితోఁ జెప్పి దండును వెంటఁబెట్టుకొని రాజధానికిఁ బోవుటకుఁ బ్రయత్నముఁ జేసెను.

సర్వాధికారియగుటకు పాంపేయుఁడు ప్రయత్నించుచుండె నని రోముపట్టణములో వదంతి పుట్టినందున సిల్లుఁ డతనిని సేనాధిపత్యము వదలి పట్టణమునకు రావలసిన దని యుత్తరువు చేసెను. మహా వైభవముతో పాంపేయుఁడు రాజధానికి వచ్చి జయప్రవేశముఁ జేయవలెనని యత్నించెను. అది పూర్వాచారమునకు విరుద్ధ మని సిల్లుఁడు వాదించెను గాని పాంపేయుఁ డందులకొల్లక నాలుగేనుఁగులచే లాగఁబడిన రథమునెక్కి జయద్వారముగుండఁ బట్టణములోఁ బ్రవేశించెను.

'దుందుభి ఖంజరి మర్దళ భేరీరవంబులు' మిన్నుమ్రోయ నీ గండరగండఁడిటుల మహాటోపముతోఁ బరిక్రమించినందుకు సిల్లుఁడు మొగంబు గంటుపెట్టుకొనెను. ఇంతలో నితనికి కాలము సమకూరెను. అవసానకాలమున నితరులను తన కుమారునికి సంరక్షకులుగ నియోగించి పాంపేయునిమాత్ర మితఁడు నిరసనఁజేసెను. సిల్లుఁడు కాలాంతరగతుఁ డయ్యెను. బిరుదు నిశానీలతో నితనిని రుద్రభూమికి దీసికొని వెళ్లునపుడు పాంపేయుఁడు గూడపోయెను.

కొంతకాలమునకు 'లెపిడస్సు' అను నతఁడు రోములో సర్వాధికారమును బొందుటకు సమకట్టి సైన్యములను గూర్చి, వానితోఁగూడ 'ఇటలీ'దేశపు టుత్తరభాగమును జయించి రోముపట్టణసమీపదేశము వచ్చిచేరెను. నాగరికు లందఱు గలతఁ జెందిరి పాంపేయుఁడు పైగానుండి శత్రుసైన్యము నోడించి, వారి భయమును బాపెను. 'లెపిడస్సు'దేశమును విడిచి పారిపోయి దుఃఖము భరింపలేక మృతినొందెను.

స్పానియాదేశము రోముప్రజారాజ్యములోనిది. అక్కడి రాజ్యాధికారి తిరుగుబాటు చేసి స్వాతంత్ర్యముఁ బొందవలె నని సమరసన్నాహముఁ జేసెను. అతనిని దండించుటకు రోమను అధికారు లొక సేనానిని సైన్యముతోఁ బంపిరి. కాని యతఁడు వానిని శిక్షింప లేకపోయెను. అటుపైని వారు పాంపేయుని సైన్యముతోఁ బంపిరి. అతఁడు స్పానియాదేశముఁ బోయి దాడిలో వైరుల దునుమాడి జయమును బొందెను. అతఁ డనంతరము రాజధానికి వచ్చినపైని 'వీరజయోత్సవమును' ప్రజలు చేసిరి. ఇది రెండవ యుత్సవము. తదుపరి పాంపేయుఁడు క్రాసస్సుతోఁగూడ 'అక్షదర్శకుని' యుద్యోగమును నిర్వహించెను. వారిరువురు గొంతకాల మేకీభవించి పని పాటులను జక్క పెట్టిరి గాని తుదకు కలహించి వ్యవహారమును మానిరి.

అటుపైని పాంపేయుఁడు సభలో న్యాయవాదిగ నుండలేదు. కొన్ని సమయములలోమాత్ర మతఁడు బయటికి వచ్చు చుండెను. బయలుదేరినపుడు బంధుమిత్ర పరివారములతోడఁ గూడి యతఁడు వాహ్యాళి సలుపుచుండెను. అనేకులు పనివార జనులకు వేతనము లిచ్చి పోషించుచు మహావైభవముతో నతఁడు జీవించెను. అతి పరిచయము మర్యాదకు లోకువయని యెంచి పరుల కతఁడు చర్శనమిచ్చుటలేదు. మొదటినుండి, ప్రజారాజ్యములో జీవించుచు ప్రజలను బొడగన్న భృత్యుని కైవడి వారియెడల సంచరించి కాలపరిపక్వమున రణశూరుఁడని పేరుఁబొందినందు కతనికి గర్వము బలిసెను.

ఇంతలో మధ్యధరాసముద్రముమీఁద నోడదొంగలు విస్తరించి నావికాయాత్ర జేయువారిని వధించుచుండిరి. నావికాయాత్రఁ జేయుట కష్టమయ్యెను, వర్తకవ్యాపారములు నిలిచిపోయెను. రోమను లందుకు కోపించి వారిని దండించుటకు 500 యుద్ధనావలను సమకూర్చి పాంపేయుని నౌకాసేనానిగ నియమించిరి. వెంటనే అతఁడు నావలతో బయలుదేరి వారిమట్టు మాపెను. ఈ శుభవార్త రోమనులు విని మిగుల సంతసించిరి. రోమురాజ్యమునకు తూర్పుననున్న దేశముల కతనిని సర్వాధికారిగ వారు నియమించిరి. ఆ దేశములలో నతఁడు రోమకాధిపత్యమును స్థాపించుటకు మాతంగతురంగనరనికురంబబలంబులతో గదలివెడలి వాని నతఁడు స్వాధీనముఁ జేసికొని రాజధానిం జేరెను.

అతని ప్రతాప మిటుల లోకవిశ్రుతమైయుండ స్వగృహచరితము లింపుగ లేవు. అన్ని దేశములు తిరిగి వేళకు భోజన భాజనములు లేక, కీర్తిని సంపాదించుటకుఁ గష్టపడి యతఁడు సుఖముగఁ గాలయాపనఁ జేయవలె నని యిల్లు చేరెను. ఆతఁడు పరదేశములో నున్న కాలమున నతని భార్య పరపురుషునితోఁ గూడె నని యతఁడు విని కలఁతఁ జెందెను. ప్రపంచకధర్మ మంతయు ద్వంద్వమె. మనుజుఁడు ద్వంద్వా తీతఁడు కావలెను. అతఁడు దుఃఖపడి భార్యకు విడియాకు లిచ్చెను,

ఆతఁడు దేశములోనికి వచ్చి ప్రజల నెటుల త్రిప్పునో, రాజధానిలోఁ బ్రవేశించి నగరవాసుల నెటుల మన్నించునో, ప్రజారాజ్యముయొక్క నామరూపముల నేకరాజ్యాధిపత్యమునకు ఎటుల మార్చునో యని పలువిధములఁ బ్రజలు చింతంచిరి. క్రాసస్సు తన సర్వస్వము తీసికొని పట్టణము విడిచిపోయెను. పాంపేయుఁడు దేశములోనికి వచ్చి దళములు విడివడుట కుత్తరువు చేసెను. వీరజయోత్సవమునకు రాజధానికి రావలసినదని వారితో నతఁడు చెప్పెను. వారి వారి స్థానములకు వారినిఁ బొండని సెలవిచ్చి పంపివేసెను. ఆనంతర మతఁడు స్నేహితులతోను పరివారజనముతోను గూడి నగరమునకు వచ్చుచుండెను: ఈ వార్తను విని నగరములలోని ప్రజలు సంతసించి గుంపులు గుంపులుగ నతనివెంట నంటి రాజధానికి వచ్చిరి. 'సెనేటు'సభను తిరుగఁద్రోసి మహారాజ్యధిపత్యమును స్థాపించుట కతనికి సమయము దొరికెను. కాని యతఁ డందులకుఁ బూనుకొనలేదు, అతఁడు దిగ్విజయము చేసి వచ్చిన తరువాత చేసిన యుత్సవములలో నిది మూఁడవ వీరజయోత్సవము. అతఁడు దేశములు కొట్టితెచ్చిన ధనము రాసులుపోసిరి. స్వాధీనమైన దేశములనుండి 21,000 టాలంటులు (1 టాలంటు=193 కాసులు: 1 కాసు=15 రూప్యములు) రాఁబడి వచ్చెను. పంచాశ్వములు, భద్రగజములకు పరిమితి లేదు. పరాజిత రాజుల ప్రతినిధులనుగూడ నతఁడు వెంటదెచ్చెను. ఈ యుత్సవము రెండురోజులు రోమునగరములో జరిగెను. -

ఇంతలో బాలసూర్యునివలె సీౙ రుదయించెను. క్రాసస్సు పాంపేయులకుఁ గల మత్సరములఁ బాపి వారిని సఖులుగఁ జేసి వారితో నతఁడు గలిసెను. ఈ మువ్వు రేకీభవించి రాజ్యమేలుటవలన సీౙరు లాభమునుబొంది క్రమముగ నేక రాజ్యాధిపత్యమును స్థాపించుటకు దగిన సన్నాహముల నతఁడు చేసెను. నూతనసీమకుఁ బ్రజలను బంపుటకు సేద్యము లేని భూముల నరికట్టించుటకు సీౙరు యత్నించి పాంపేయుని సలహాతో సెనేటుసభలోఁ బ్రస్తావించెను. ఇందుకుఁ బ్రజలు సంతసించిరి.

సీౙరునం దభిమానము పాంపేయునికి లావయ్యెను. వా రిరువు రది నొకటేమాట. మాటలలోనె గాక క్రియలలోఁ గూడ వా రేకీభవించిరి. సర్వసేనాధిపత్యమును వహించుట చేతఁ బూనిన కార్యములను వారు నిరంకుశముగ నెరవేర్చిరి. సీౙరుయొక్క కుమార్తె 'జూలియా'ను పాంపేయుఁడు వివాహమాడెను.

సీౙరు, పాంపేయుఁడు క్రాసస్సు వీరు మువ్వురు రాజ్యమును మూఁడు భాగములుగఁ బంచుకొనిరి. వారి వారి రాజ్యములకు మిగిలినవారు పోయి వ్యవహారములను జూచుకొను చుcడిరి గాని పాంపేయుఁడు స్వరాజ్యమునకు వెళ్లక రోము నగరములోనుండి నూతనముగఁ గాపురమునకు వచ్చిన భార్యతోఁ గాలముఁ గడుపుచుండెను. ఒక వేళ నతఁడు గజములను బోరాడించును; మల్లులయుద్ధముఁ జూచును; నాటకములఁ జూడఁబోవును. ఈ మొదలగు వినోదములలో నతఁడు భార్యతో గలిసి విహరించెను. దంపతు లిరువురుఁ గలిసి 'ఇటలీ' దేశములోని నగరములను జూచుచు యాత్ర జేసిరి. కొంత కాలమున కామె గర్భిణియై, యకాలములో నొక స్త్రీశిశువును గని పురిటిచావుఁ జచ్చెను. ఆ శిశువుకూడ విశేషకాలము జీవించలేదు. తదనంతరము పార్థులతో యుద్ధముఁ జేయుచు చనిపోయిన కుమార క్రాసస్సుయొక్క భార్యను పాంపేయుఁడు వివాహమాడెను. ఆమె చక్కనిది. చక్కదనమునకుఁ దోడుగ నామె వీణవాయించఁ గలది; బీజగణితములో నామెకు ప్రవేశముండెను; తత్వజ్ఞానమును "లెస్సగగుఱ్తెఱిఁగియుండెను. ఇన్ని విద్య లున్నను నామె భర్తకు శుశ్రూషఁ జేయుచు మెలకువతో సంచరించెను. స్త్రీలు విద్యనేర్చిన, వినయవిధేయతలు లేక యమంగళకార్యములు సేయుదు రను మాట కామె వికృతముగ నడిచెను.

ఇంతలో పాంపేయుఁడు 'నేపిల్సు' పట్టణములో చావు సంకటముపడి దైవకృపవలన స్వాస్థ్యము నొందెను. అతఁడు మృత్యువువాతఁబడి లేచినందుకు పట్టణములలోను పల్లెలలోను దేశమంతటఁ బ్రజలు మహోత్సవముఁ జేసి యతనిని దర్శించుటకు వేనవేలుగ వచ్చిరి. ఈ మర్యాదలను బొందుటచేత నతనికి గర్వ మంకురించెను. ఇంతకుపూర్వము వినయ విధేయతగ నున్న పాంపేయునకు దర్పము బలిసి సీౙరును నిర్లక్ష్యముగఁ జూడనారంభించెను. "అతఁడు పక్షివంటివాఁడు. ఇతనిఁ బడఁద్రోయుట నిముషముపని” యని పాంపేయుఁడు ప్రగల్భములు పలికెను. ఈ మాటలమూలమున నతనికి ముప్పువచ్చెను. కొండెగాం డ్రీ మాటలను సీౙరుతోఁ జెప్పి, వాని మాటలను పాంపేయునితోఁ బలికి వారికి మనస్పర్థలను రగిలించిరి.

సీౙరు, పాంపేయుఁడు, వీరిరువు రతిరథశ్రేష్ఠులు. సేనాధిపతులు. ఒకఁడు భూసైన్యములకు నాయకుఁడు; మఱియొకఁడు భూనావికాసైన్యముల కధికారి. వీరిరువురు రోమునగరము స్వాధీనముఁ జేసికొని మహారాజ్యాధిపత్యమును స్థాపించుటకు సమకట్టియుండినవారు. ప్రళయకాలమున మహాబలప్రేరితంబులై క్షుభితంబు లగు మహాసముద్రంబులు చెలియలిగట్ట నతిక్రమించుట కుప్పొంగు విధమున ప్రత్యానీక సైన్యంబులు రెండును మార్కొని పోరాటము సలిపిరి. సీౙరుఁ జయముఁబొందెను,

పాంపేయుఁ డపజయముఁబొంది దారాపుత్రాదులతోఁ గొందఱు పరివారకులు వెంటరా నొక పడవనెక్కి. పరదేశములకుఁబోయెను. ఏదేశపురాజును జేపట్టి శత్రువును శిక్షించుటకు దగిన సైన్యమును లేవనెత్తుటకు వీలగు నని పాంపేయుఁడు చింతించెను. 'ఈజిప్టు'దేశము నేలుచున్న కుమారరాజు తన కాప్తుఁ డని యెంచి, యక్కడకుఁ బోవుట కతఁడు సమకట్టి కుమారరాజునకు వర్తమానముఁ బంపెను. అప్పు డితని మంత్రులు "ఏలినవారు పాంపేయునిఁ జేరఁదీసిన, సీౙరు మీకు శత్రు, వగును; పాంపేయుఁడు యజమానుఁ డగును. మర్యాదఁ జేయక పాంపేయునిఁ బొమ్మనిన నతఁడు కార్పణ్యము వహించును; దొరికినవానిఁబట్టి యప్పగించ నందుకు 'సీౙరు' కోపగించును. అందుచేత, నిరాయుధుఁడుగ నున్న పాంపేయుని మంచిమాటలతోఁ జేరఁదీసి యతనిని జంపుట మేలు. సీౙరుకు మీయం దనుగ్రహము కలుగును. పాంపేయుఁడు మిమ్ముల నేమియుఁ జేయ లే"డని కుమార రాజునకు బోధ చేసిరి.

నగరములోనికి విజయము చేయవలసిన దని కుమార రాజు వర్తమానముఁ బంపి నందున, పాంపేయుఁ డొక పర్యాయము భార్యను ముద్దులాడి, కుమారునిఁ గౌఁగిలించుకొని, యొక చిన్న పడవనెక్కి యొడ్డునఁ జేరెను. మామగారైన సీౙరును నమ్మి యతని సముఖముననుండిన, దన చేయి క్రిందగు నని యెంచికదా, పాంపేయుఁడు పరదేశరాజును నమ్మి యతని చేతిలోఁబడెను. రెండు కత్తు లొక వరలో నిమిడియుండలేవు. అతఁ డొడ్డునకు వచ్చి చేర, కుమార రాజు వచ్చి వందనము చేసెను. వందన ప్రతి వందనములైనపిదప పాంపేయుఁడు ప్రసంగించుటకు యత్నించుచుండ, హంతకులు వెనుకనుండి వచ్చి యతనిని బాకులతోఁ బొడిచి చంపిరి. మరణమునొందు సరి కతనికి 59 సంవత్సరముల వయస్సు. ఈ యుపద్రవమును జూచి భార్య కుమారుఁడు మొదలగువారు భయపడి నావను గడుపుకొని పోయిరి.

అతని వెంటవచ్చిన పరివారకుఁ డొకఁ డాశవమును దీసి, సమీపముననున్న యొడ్డునఁ బెట్టి దానిని దహనముఁ జేయఁ జూచెనుగాని కట్టెలు లేకపోయెను, శిథిలమైయున్న యొక పడవయొక్క బల్లలను ప్రోగుచేసి వానితో నతఁ డా శరీరమును దహనముఁ జేసెను. పాంపేయుండు క్రీ. పూ. సం|| 48 రములో మృతినొందెను.