మన్నారుదాసవిలాసము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరాజగోపాలాయ నమః

మన్నారుదాసవిలాసము

(పద్యకావ్యము)

చతుర్థాశ్వాసము


శ్రీమత్కళావతీసుత
కామితఫలదానదక్ష! కౌస్తుభవక్షా!
హేమాబ్జనాయికాకుచ
సీమాకృతనఖవిలాస! చిత్రన్యాసా!

1


వ.

అవధరింపుము, తదనంతరంబ.

2


మన్నారుదాసుఁడు మాన్మథశరాహతుఁడై ప్రలాపించుట

చ.

ఎసయఁగ నవ్విలాసవతి యింపుగఁ బల్కినయట్టి పల్కులన్
మనసున మాటిమాటికిని మానిని చెల్వమె ప్రేమ నెన్నుచున్
గనకనిభాంగి కాంతిమతి కన్నులఁగట్టినయట్టు లుండఁగా
మనసిజబాణవర్షముల మన్నరుదాసుఁ డధీరచిత్తుఁడై.

3


సీ.

మగువపైఁ గలిగిన మక్కువ నొకయింత
        సేపు నివ్వెఱఁగును జెందుచుండుఁ
దరుణి బల్కినయట్టి తద్విలాసము లెల్ల
        నెంతయు మదిలోన నెన్నుచుండు
యువతియందమునకు నుప్పొంగు వేడుక
        నొకయింతవడిఁ దల యూఁపుచుండు
నీరజేక్షణమీఁది కోరిక హెచ్చఁగా
        నొరగుపై నొరగి నిట్టూర్పుపుచ్చు


తే.

వెలఁదిపల్కులు పలుమారు వినక యహహ
కాంత నంచితి నే లంచుఁ గలఁకఁ గాంచు

నెవ్వరికి దెల్పి యీ కార్య మిప్పు డేను
సంఘటింపఁగఁ జేయుదు సరవి ననును.

4


వ.

మఱియును.

5


సీ.

మొనబంట మడుపులు మోహంబుతో నొక్కి
        సగముఁ బ్రేమ నొసంగుఁ జాన యెపుడొ!
మోము మోమునఁ జేర్చి ముద్దుబెట్టుచుఁ దేట
        మోవితేనె నొసంగు ముదత యెపుడొ!
ఓరి! రారా యని యొయ్యారి నుదుటను
        దిలకంబుఁ దీరుగా దిద్దు నెపుడొ!
అరజాఱు పయ్యదయందంబుతోఁ గొమ్మ
        కులుకుగుబ్బల ఱొమ్ము గుమ్ము నెపుడొ!


తే.

వింతవింతగు రతులను వేడ్కఁ గూడి
గళరవంబుల సొక్కించి కళల నంటి
భళిర! నాసామి! యనుచును బలుకరించి
ముచ్చ టెన్నఁడు దీర్చునో మోహనాంగి!

6


సీ.

బంగారుకుండల బాగు మీరినయట్టి
        పడఁతిగుబ్బలుఁ గేలఁ బట్టవలదె
పగడంపుతేటల సొగసు మీరిన యితి
        చక్కెరకెమ్మోవి నొక్కవలదె
పువ్వుదీఁగెను బోలు పొలఁతుకనెమ్మేను
        జెలువుగాఁ గౌఁగిటఁ జేర్పవలదె
[1]అద్దంబులను మించు నలివేణినిద్దంపు
        చెక్కిళ్ళుఁ గొనగోర జీరవలదె


తే.

చేరఁదీయుచు లాలించి సారెసారె
చిగురుఁ బానుపుమీఁదఁ జౌసీతిగతుల
నలరువిలుకానికేళినిఁ జెలఁగి కూడి
మెలఁతతోఁ బ్రేమ నేవేళ మెలఁగవలదె!

7


వ.

అని యిట్లు మనంబున ఘనంబగు విరహభారంబున మీరియున్న
సమయంబున.

8

సీ.

మన్ననారులకు నాత్మజుల మిర్వుర మని
        చెలువంబుచేతను గెలిచె ననియు
జ్ఞాతిత్వవైరముల్ ఖ్యాతిచే మదిఁ బూని
        విజయరాఘవమహీవిభుని గెల్వ
నిది వేళ తన కని యిచ్చ నుప్పొంగుచు
        [2]రసదాడి సింగాణిరౌతు వేగ
చిలుకతేజీ నెక్కి చికిలిచేసినయట్టి
        కలువసేజాఁ బూని ఘనతమీర


తే.

నంచబలగము వెనువెంట నంటిరాఁగ
గండుగోయిల లిరువంకఁ గదిసి కొలువ
నళులబారులు ముందఱ నమరి నడువ
మలయపవనుండు దళకర్తమాడ్కిఁ జెలఁగ.

9


క.

దుముకింపుచుఁ దనతేజీ
దుముదారుగ వచ్చి మిగుల దురుసగు వింటన్
భ్రమరముల నారిఁ గూర్పుచుఁ
గొమరుగ విరిగోల లేసి కోయని యార్చెన్.

10


క.

ఈవిధమున మరుఁడు ధనుః
ప్రావీణ్యముఁ జూప విజయరాఘవవిభుఁడున్
ఠీవినిఁ దనముందఱఁ జెలి
భావము గనుపట్టినట్లుఁ బఱఁగన్ గలఁకన్.

11


సీ.

తరుణిరో! నీవు నాదగ్గఱ రమ్మని
        కౌఁగిలింపఁగఁ జేరుఁ గాక హెచ్చ
జక్కెరబొమ్మరో! మొక్కేను నీకని
        ముద్దుబెట్టఁగ నెంచు ముచ్చ టలరఁ
జానరో! పయ్యదఁ జక్కఁ జేర్చెద నని
        బటువుగుబ్బలఁ గేలఁ బట్టఁ దివురు
వెలఁదిరో! పుక్కిటివిడె మిమ్ము తనకని
        వేగఁ జెక్కిలి నొక్క వేడ్కఁ దలఁచుఁ

తే.

గొమ్మ! నామీఁద నీ కింత కోప మేలె?
నిన్ను నమ్మినవాఁడనే నీరజాక్షి!
అనుచుఁ బ్రియములు బలుకుచు నాదరమున
నువిదపదములు గన్నుల నొత్తఁజూచు.

12


సీ.

దొండపండును జూచి తొయ్యలిమో వంచు
        నీటుగా మొనబంట నాఁటఁ దలఁచుఁ
బూలబంతులఁ జూచి పొలఁతిపాలిం డ్లని
        యుక్కుగోరను సారె నొక్క నెంచుఁ
జిగురాకుఁ గనుఁగొని చెలియకెంగే లని
        యొఱపుగాఁ గన్నుల నొత్తఁ జూచు
నెలమావితీవియ నింపుతోఁ గనుఁగొని
        లేమమే నని కౌఁగిలించఁ గాంచుఁ


తే.

గులుకు మీరిన రాచిల్కపలుకు వినుచు
నింతి పల్కె నటంచు దా నెలమి వినును
గలికిపైఁ జాల మోహ మగ్గలము గాఁగ
మరునిమాయలఁ దగిలి యమ్మనుజవిభుఁడు.

13


వ.

ఇవ్విధంబున నివ్వటిల్లు ప్రేమాతిశయంబున వర్తింపుచు మఱియు
నిట్లనియె.

14


సీ.

వెలహెచ్చు హారముల్ వెలఁది! నీ కిచ్చెదఁ
        గౌఁగిలింపవె మదిఁ గాకదీరఁ
గపురంపు వీడెంబుఁ గల్కి నే నొసఁగెదఁ
        జక్కెరకెమ్మోవి నొక్కనీవె
యెలనాగ! కస్తూరితిలకంబు దిద్దెద
        జెక్కిలిఁ గొనగోర జీరనీవె
రతుల హెచ్చిన పచ్చరాలతురా లిత్తు
        రతులఁ దేలించవే రాజవదన!


తే.

యెంత దయలేనిదానవే [3]యించుఁబోణి!
పలుక వేఁటికి నాతోను పద్మగంధి!
చలము సేసెద వేఁటికే జలదవేణి!
మనవిఁ జేకొని లాలించు మంజువాణి!

15

సీ.

ముదితరో! నీముద్దుమోముఁ జూచినను మ
        హాపద్మనిధిఁ జూచినట్లు తనకుఁ
గలకంఠకంఠి! నీకంఠంబుఁ జేనంట
        నల శంఖనిధి తన కంటినట్లు
శీతాంశుముఖి! నీదు చెట్టబట్టిన తన
        కల పద్మనిధి చేతి కబ్బినట్లు
మగువ! నీచనుఁదోయి మకరముల్ చిత్రింప
        నదె మాకు మకరని ధైనయట్లు


తే.

కలికి! నీయుపరిపదముల్ కచ్ఛపనిధి
నెలఁత! నీ నెఱిగురు లెంచ నీలనిధియుఁ
గొమ్మ! నిను గూడుటే యాముకుందదయను
గుందని వరంబు లెల్లఁ జేకూడినట్లు.

18


సీ.

పలుమారు బిలిచినఁ బలుకకయున్నావు
        పంత మీవేళనా? పద్మగంధి!
యెంత నే వేఁడిన నెలమితోఁ జూడవు
        సరస మీవేళనా? సన్నుతాంగి!
చేరి నే మ్రొక్కినఁ జేరఁదీయ వదేమి?
        నవ్వు లీవేళనా? పువ్వుఁబోణి!
కదియ నే వచ్చినఁ గౌఁగిలింప వదేమి?
        అలుక లీవేళ నా? జలదవేణి!


తే.

తరుణి! నీ దాసుఁ డనుచును దయను నన్ను
సేవ సేయించుకోరాద చెలియ! నీవు
మరుఁడు దండెత్తె నామీఁద మగువ! నీదు
చరణపద్మంబులకు నిదె శరణు శరణు.

17

నాగబంధము


చ.

జలజముఖీ! వయోలలితశాతనఖస్తనభారభాసురా!
యలరులబంతి! బాల! ఘనయానజయస్తవ! యిందురేఖని
ర్మలతరకాంతిశీల! విను మాను మసన్మతిఁ గాముఁ డేయఁగా
వలవదు మాన మేల? దయ బాయక సుస్థితి నేలవే సఖీ!

18


వ.

అని విజయరాఘవమహీకాంతుండు కాంతిమతిమీఁది మోహపారవశ్యం
బునఁ బలుకు సమయంబున.

19

మన్నారుదాసునికాంత లతనివైఖరి నెఱంగి కలవరపడుట

క.

మన్నరుదాసుని పలుకులుఁ
గన్నియ లందఱును వినుచుఁ గలకల నగుచున్
సన్నల సైగల నప్పుడు
[4]వన్నెగ నిట్లనిరి చతురవైఖరి మీరన్.

20


సీ.

ఎలనాగ! చూచితే యీవిభు మోహంబు
        వెలఁది! చూచితినమ్మ వింతగాను
నళినాక్షి! వింటివా నాథుని పలుకులు
        నతివ! వింటిఁగదమ్మ యందముగనె
ఆటపాటలచేత నందచందంబుల
        మనకన్న నెక్కుడా మగువ! వినవె
యింతులపొందు దా నెరుఁగని యందానఁ
        జిత్త మాయింతిపైఁ జేర్చె నమ్మ!


తే.

వలచువారలు లేరొ యీవసుధలోన
యింత తమి గల్గ వింటి మే యిందువదన!
యనుచుఁ దమలోన గుసగుసలాడుకొనుచు
విజయరాఘవుఁ గనుఁగొని వేడ్క ననిరి.

21


సీ.

ముదమున నే వచ్చి ముద్దుబెట్టు మనంగ
        ముద్దువెట్ట వదేర మోహనాంగ!
సంతసంబున వచ్చి సరసంబు లాడిన
        సరస మేలాడవు జాణరాయ!
మచ్చికతో వచ్చి మడుపు కొర్కిచ్చిన
        మడు పందుకోవేమి మన్నెరాయ!
నెనరుతో నే వచ్చి నిను గౌఁగిలించిన
        గౌఁగిలింప వదేమి కంతురూప!


తే.

యెవ్వతె దలంచినా విప్పు డెమ్మెకాఁడ!
యానతియ్యర నాసామి! యందముగనె
యనుచుఁ దను జేరి పలుకంగ నబ్జముఖులు
కాంతిమతిమీఁద నెలకొన్న కాంక్ష నుండె.

22

వ.

ఆసమయంబున.

23


మన్నారుదాసునికాంతలమూలముగ విషయము నెఱింగిన శ్రీనివాస తాతయాచార్యులు పూర్వజన్మవృత్తాంతంబుల జెప్పి విజయరాఘవుని సమాశ్వాసపరచుట

ఉత్సాహ.

పూని మన్ననారుదాసుఁ బ్రోవ వీట నున్నయా
శ్రీనివాసుఁ డితఁ డంచుఁ జెల్వుగా నుతింపఁగా
శ్రీనివాసతాతయార్యశేఖరుండు వేడుకన్
భానుతేజ మొప్ప వచ్చె భాగ్యరాసి కైవడిన్.

24


క.

వచ్చిన యాచార్యులకు
నెచ్చెలు లందఱును మ్రొక్క నిశ్చలభక్తిన్
హెచ్చిన కృప దీవింపుచు
నచ్చెరువునఁ దనయుఁ జూచి యతివల కనియెన్.

25


సీ.

ఎపుడు నే వచ్చిన నెదురుగాగనె వచ్చి
        పాదముల్ సేవించి భక్తిమీరఁ
గైదండ యొసఁగుచు గద్దియపై నుంచి
        మమ్ముఁ బూజించును నెమ్మిమీర
నేను దగ్గరరాఁగ నెంతయుఁ బ్రేమచే
        నెదురుగా రానట్టి హృదయ మేమి?
చెంతఁ గూర్చుండిన సంతోష మమరంగఁ
        బలుకకయున్నట్టి భావ మేమి?


తే.

మన్ననారుకటాక్షంపుమహిమవలన
మన కసాధ్యంబు లెవ్వియు మహినిఁ గలవె!
మనసులోపల నున్నటి మత మదేమి?
తెలియఁగా బల్కరమ్మ! యోచెలువలార!

26


వ.

అని పలికిన యాచార్యవర్యునకు సంతసంబున నింతు లిట్లనిరి.

27


సీ.

వినవయ్య యాచార్య! విన్నవించెద మేము
        విన్న కార్యం బెల్ల విశదముగను
రాజచంద్రుం డను రాజవర్యునిపుత్రి
        ధరఁ గాంతిమతి యనఁ దనరు దాని

ప్రాణపదం బైన భామ యొక్కతె వచ్చి
        గజనిమ్మపండ్లుఁ జే కాన్క యొసఁగి
యేకాంతమునఁ బల్క నితనితో నొకమాటఁ
        జాల సంతస మంది సకియ కపుడు


తే.

నమ్మిక లొసంగినాఁడట నెమ్మిమీర
నేమి కార్యంబొ! తెలియము స్వామి యిప్పు
డిట్టి దొడ్డ రహస్యంబు నేమి? యనుచుఁ
దెలియ నడుగుఁడు మీ రింకఁ దేటగాను.

28


క.

అని పలుకు చెలులమాటలు
విని నవ్వుచు మనసులోన వేడుక మీరన్
దన శ్రీహస్తముచేతను
దనయుని నెమ్మేను నిమిరి తగ నిట్లనియెన్.

29


సీ.

ధర నుతింపఁగఁ దగు ధైర్యగుణంబున
        మేరువు గెల్చిన మేటి వీవు
ఘనులు మెచ్చఁగ నగు గాంభీర్యమహిమను
        రత్నాకరుని గెల్చు రాజ వీవు
బుధులు రాఘవుఁ డన భుజపరాక్రమమున
        జామదగ్న్యుని గెల్చు జాణ వీవు
పొగడంగఁ దర మైన బుద్ధిచాతురిచేత
        ఫణిపతి గెల్చిన ప్రౌఢ వీవె


తే.

ఇట్టి గుణములచే మది నెంచిచూడ
నీకు నెన యైన వార లీలోకమునను
నృపతు లెవ్వరు? [5]రఘునాథనృపకుమార!
యువతిమకరాంక విజయరాఘవశశాంక!

30


క.

తెలిసితిమి నీదు కోరికఁ
గలఁకలు వల దింక మేలు గలుగు న్నీకున్
[6]గలికిని వలచిన హేతువుఁ
దెలిపెద వినవయ్య! తేటతెల్లమి గాఁగన్.

31

క.

ద్వాపరయుగమునఁ జంద్రుఁడు
గోపాలుని చెంతఁ జేరి కోర్కులు మీరన్
శ్రీపతి! రవిశశిలోచన!
తాపసహృదయాబ్జమిత్ర! దానవజైత్రా!

32


ఉ.

తామరసాప్తపుత్రి యయి ధారుణి మీరు కళిందకన్యకన్
స్వామి వివాహ మౌట విని చాల ముదం బొనఁగూడె నెమ్మదిన్
బ్రేమ మదీయపుత్రికను బెండ్లయి యిప్పుడు వేడ్క మీరఁగా
మామన వాలకింపుచు సమంబుగఁ జూడుము రెండు కన్నులున్.

33


సీ.

అన విని గోపాలుఁ డాచంద్రుఁ గనుఁగొని
        పలికె నిట్లనుచును భావ మలర
నీముద్దుచెల్లెలి నేము పెండ్లాడఁగాఁ
        గోడ లయ్యెను నీదు కూఁతు రిపుడు
[7]కలియుగంబునఁ జాల ఘనుఁ డైన రఘునాథ
        భూపాలవరునకుఁ పొడమి యేను
విజయరాఘవుఁడ నై విఖ్యాతి మీరెద
        దక్షిణద్వారకాస్థలిని నీవు


తే.

రాజచంద్రుఁ డనందగు రాజ వయిన
నపుడు నీకన్యఁ బెండ్లాడి యందముగను
సంతసం బొనరించెద సరగ ననియెఁ
గాన విను మింక విజయరాఘవనృపాల!

34


తే.

నీవె శ్రీరాజగోపాలదేవుఁడ విలఁ
జంద్రుఁడే యెంచ నారాజచంద్రనృపతి
ఘనత నారాజసుత యైన కాంతిమతిని
బెండ్లిసేసెద నే నీకుఁ బ్రేమమీర.

35


క.

తులలేని నీగుణంబులు
సలలితముగ నేను రాజచంద్రునితోడన్
దెలిపి వివాహముహూర్తము
విలసిల్లఁగ నిశ్చయించి వేగమె వత్తున్.

36

శ్రీనివాసతాతయాచార్యులు వివాహనిశ్చయార్థమై రాజచంద్రునివద్ది కేతెంచుట; వివాహనిశ్చయము

వ.

అని యయ్యచార్యవర్యుండు విజయరాఘవమహీకాంతుని యంతరంగంబు
నకు సంతసం బొనరించి బంగారుటనుసుల రంగారు వింతవగపనుల దంతపు
పల్లకి నెక్కి, చెంతలను శ్రీవైష్ణవశ్రేణులు గొలువ, నగ్గలం బగు హెగ్గా
ళెలు దిగ్గగనంబులు నిండి మెండుగా మ్రోయ, సువర్ణదండరంజితంబు
లగు వింజామరంబులు వీవ, నిస్తంద్రచంద్రమండలరాజమానంబు లగు
వాజపేయఛత్రశతంబులు వరుసగా నిరుగడల ధరింప, సురభిఘృతధారా
పూరితంబు లైన దివాదీపికానికరంబులుఁ బరిచారకప్రకరంబులు బూని
క్రందుకొని సందడిగ నడువ, మాపాల వెలయు గోపాలుఁ డీమహామహుఁడే
యని యాబాలగోపాలంబును నందంద వందనంబులు సేయ నానందింపుచు,
సకలవైభవసాంద్రుఁ డగు రాజచంద్రునిహజారంబునకు వచ్చునవసరమున.

37


క.

అవసరమువారు దెలుపఁగ
జవమున నెదురుకొని రాజచంద్రనృపతియున్
సవరణలు మెఱయ నప్పుడు
సవరింపుచు బహువిధోపచారము లెల్లన్.

38


క.

యాదవతిలకుఁడె యితఁ డని
వే దండము లిడుచు మిగుల వేడుకమీరన్
గైదండ యొసఁగి తోడ్కొని
యాదరమున నరిగి వినయ మమరఁగ నంతన్.

39


సీ.

అంతఃపురంబున ననుపమనవరత్న
        సింహాసనమున నాసీనుఁ జేసి
భక్తిమీరఁగ నిజభామలుఁ దానును
        నర్ఘ్యపాద్యాదుల నాచరించి
దాహంబుచేతను దాపంబుఁ జెందెడు
        నరునకు నమృతంబు దొరికినట్లు
లేమిచే మిగులఁ దూలినయట్టి పేదకు
        నధికమౌ నిక్షేప మబ్బినట్లు


తే.

స్వామి వచ్చుట జన్మంబు సఫల మయ్యె
ధన్యుఁడను నైతి నే నిటు ధరణిలోన

వెలయ నస్మత్కులంబు పవిత్ర మయ్యె
గోరిన శుభంబు లెల్లఁ జేకూడె నేడు.

40


క.

అని యిట్లు వినుతి సేయుచుఁ
దనసుత యౌ కాంతిమతినిఁ దద్దయు వేడ్కన్
వినయంబున మొక్కించిన
మనమున హర్షించి పలికె మందస్మితుఁ డై.

41


క.

విజయమునఁ గరుణచేతను
విజయుని రాఘవునిఁ బోలు వీరవరు న్నీ
రజముఖి బెండ్లాడెద వని
త్రిజగంబులు మెచ్చ నపుడు దీవెన లిచ్చెన్.

42


వ.

అని దీవించి యయ్యాచార్యవర్యుండు రాజచంద్రున కిట్లనియె.

43


ఉ.

తామరసాప్తతేజమున ధాత్రిని మించిన మేటి వౌదు వౌ
కాముని మేనమామగతి కన్నులు చల్లఁగఁ జేతు వెంతయున్
దామసవైరిబృందముల దండన సేయుదు నిండు వేడుకన్
భూమిని రాజచంద్ర! నినుఁ బోలఁగ నేర్తురె రాజు లెవ్వరున్!

44


వ.

అని పలుకు నాచార్యవర్యునిం జూచి రాజచంద్రుఁ డిట్లనియె.

45


క.

దేవర యిటకున్ వచ్చిన
భావం బదియేమి? తెలియఁ బలుకఁగవలయున్
సేవకుఁడ గాన నిప్పుడె
గావించెదఁ గోరినట్టి కార్యము లెల్లన్.

46


వ.

అనిన రాజచంద్రునకు నాచార్యవర్యుం డిట్లనియె.

47


సీ.

రాజచంద్ర! వినుము రాజగోపాలుని
        సేవించువేళను జెలువుమీరు
మేడపై నీపుత్రి మెఱుఁగుకైవడి నుండె
        మన్నారుదాసుఁ డామగువఁ జూచి
తమితోడఁ బెండ్లాడఁ దలఁచి మ మ్మిప్పుడు
        నీవద్దికిని బంపె నెనరుమీరఁ
గావున నీపుత్రిఁ గమనీయశుభగాత్రి
        నీకాంతిమతి నిమ్ము శ్రీకరముగఁ

తే.

బరఁగఁ గులగుణరూపసంపదలు బొగడ
నౌర! రఘునాథసుతుఁడు నీయల్లుఁ డగుట
కలర మాతోడ నీకు వియ్యంబు నంద
నెంత భాగ్యంబు సేసితి! విలను నీవు.

48


క.

అనిన విని రాజచంద్రుఁడు
మనసున యోజించి మిగుల మమతలు [8]హెచ్చన్
ఘను లగు తాతాచార్యులు
గనుఁగొని యిట్లనుచుఁ బలికె గౌరవ మొప్పన్.

49


సీ.

బహువర్షములు బూని బాగుగాఁ దపముల
        నొనరించ నీకూతు రుదయ మయ్యె
విజయరాఘవునకు [9]వెయ్యారు లింతులు
        కలిగియుండఁగ నెట్లు కన్య నిత్తు
సవతులలోన నీ చను దాగు పసిబిడ్డ
        యేగతి మెలఁగుఁ దా నింపుమీర?
మన్నెరాయఁ డైన మన్నారుదాసుని
        చిత్త మెఱఁగి యెట్లు సేవ సేయుఁ?


తే.

బృథివి దొర లెల్ల నూతనప్రియులు గారె?
ప్రేమ దనరంగ నాపుత్రిఁ బెండ్లిసేసి
యల్లు నిల్లట ముంచంగ నాత్మలోనఁ
దలఁచియుండుదు నేను శ్రీతాతయార్య!

50


సీ.

అన విని యాచార్యుఁ డారాజుఁ గనుఁగొని
        పలికె నిట్లనుచును భావ మలగఁ
గామిను లెందఱు కలిగిన నందఱి
        సమముగా నేలెడు స్వామి యతఁడు
పసిబిడ్డ యైనను భావంబు రంజిల్ల
        దిద్దుకోనేర్చిన ధీరుఁ డతఁడు
చన విచ్చి నడపెనా శాశ్వతంబుగ నిల్పు
        నితరరాజులసాటి యెంచ నేల?

తే.

ప్రియముతోడుత నేఁ బూని పెండ్లి సేయ
సవతులందును నీ పుత్రి సాటి యెవ్వ
రింక నాలోచనలు మాని యిపుడు సుతను
విజయరాఘవునకు నిమ్ము వేడ్క మీర.

51


వ.

అని పల్కిన.

52


సీ.

ఆమాట లాలించి యారాజు ముదముతో
        నాచార్యవర్యున కనియె మగుడ
ననఘాత్మ! యిట్లు మీ రానతి యిచ్చిన
        నే నుత్తరంబియ్య నెంతవాఁడ?
స్వామివారు తనకు సకలసౌభాగ్యంబు
        లేవేళ సమకూర్చ హితుల రగుట
నాముద్దుపట్టిని నరనాయకులు మెచ్చ
        విజయరాఘవునకు వేడ్క నిత్తుఁ


తే.

బొంతనంబులుఁ దెలిసి మా కాంతిమతికి
మంచిలగ్నంబుఁ దగ నిశ్చయించి యిపుడు
పెండ్లి పెద్దలు మీర యై ప్రేమఁ బూని
పెండ్లి సేయుఁడు వేగమే పృథివి వెలయ.

53


వ.

అనిన నా రాజచంద్రునకు నాయాచార్యశిఖామణి యిట్లనియె.

54


తే.

మన్ననారురథోత్సవమహిమ రేపు
వేడ్కఁ గావించి యెంతయు విభవ మలర
వినుము నిశ్చయతాంబూల మొనర సేయ
నీదునగరికి వత్తుము నిక్కముగను.

55


శ్రీనివాసతాతయాచార్యులు వివాహమంగళవార్తను మన్నారుదాసున కెఱింగించుట; మన్నారుదాసుఁడును మన్ననారు సేవించి యానందించుట

వ.

అని యాసలిచ్చిన యాచార్యచంద్రునకు రాజచంద్రుండు నమూల్యంబు
లగు కనకాంబరంబులు ననర్ఘంబు లగు మణిభూషణంబులు సారఘనసార
తాంబూలంబు లర్పించినఁ గైకొని [10]యమ్మహామహుండు నిండువేడుక
తోడ మరలివచ్చి చెన్నుమీరు మన్నారుదాసునినగరు బ్రవేశించి యంతః
పురంబుఁ జేరవచ్చె నాసమయంబున.

56

క.

మన్నారుదాసనృపతికి
వన్నెగ కుడికన్ను భుజము వరుసగ నదరెన్
దిన్నఁగఁ జుంచును బలికెన్
గన్నులపండువుగ వామగరుడుం డయ్యెన్.

57


వ.

తదనంతరంబ.

58


క.

మచ్చికతో నాచార్యులు
వచ్చుటకై యెదురుచూచు వసుధాధిపుతో
వచ్చిరి యదె యాచార్యులె
యిచ్చటి కని విన్నవించి రెగ్గడికత్తెల్.

59


క.

ఆమాట చెవుల నమృతము
వేమరుఁ జిలికించినట్లు విం దొనరింపన్
శ్రీ మెఱయఁ దాతయార్యుల
భూమీశ్వరుఁ డెదురుకొనియెఁ బొలుపగు భక్తిన్.

60


చ.

ఎదురుక తోడితెచ్చి తనయిష్టసతీనివహంబు తానుఁ ద
త్పదముల నంటి వదనముఁ బల్మరు సేయుచు హేమపీఠమం
దొదవెడు వేడ్క నిల్పుచుఁ బియోక్తులచే వివిధోపచారముల్
మదిఁ దనరంగ సేయు నల మన్నరుదాసునిఁ జూచి యిట్లనున్.

61


క.

ఫలియించె నీదుకోరిక
చెలు వలరఁగ రేపె పెండ్లి చేకురు నీకున్
[11]బళి వీట పూఁటకాఁపై
జలజాక్షుఁడు గలుగఁగా నసాధ్యము గలదే!

62


వ.

అని మఱియును.

63


సీ.

వినవయ్య వేడ్కతో విజయరాఘవభూప!
        యే రాజచంద్రుని యింటి కేఁగి
యారాజు నెమ్మది హర్షించు నట్లుగా
        దేవరగుణములుఁ దెలిపి మిగుల
నతఁడు పుత్రినిఁ గాంతిమతిని నీ కొసఁగఁగఁ
        జెలువుగా సంఘటించితిని శౌరి
తిరుతేరుతిరునాళ్ళు నెరవేరు వెంబడి
        నే వివాహము నిర్ణయించినాము

తే.

కాంతిమతిని మ్రొక్కించెను గనుక తనకు
భామఁ జూచితిఁ గన్నులపండువుగను
సకలశుభలక్షణంబు లాచానయందె
కలవు నీ భాగ్యవశమునఁ గలిగెఁ దరుణి.

64


సీ.

చందమామను మించుఁ జక్కని నెమ్మోము
        కలువరేకులఁ గేరు కన్నుదోయి
సంపంగిమొగ్గతో సరివచ్చు నాసిక
        యధరంబు పగడంబు నంద మొందుఁ
జంద్రఖండములతో సాటి యౌ చెక్కిళ్ళు
        వెన్నెలల్ వెదచల్లు వెలఁదినవ్వు
చిందంబుచందంబుఁ జెనకును గంఠంబు
        కోకయుగ్మము గెల్చుఁ గుచయుగంబు


తే.

పల్లవంబుల నిరసించుఁ బాణితలము
పద్మరేఖల మీరును బదము లౌర!
మురువుగల్గిన సకలసాముద్రికోక్త
లక్షణము లన్నియును నెంచ లలన కలరు.

65


క.

కాంతిమతినిఁ బెండ్లాడిన
సంతసమున నీకుఁ గల్గు సకలశుభము లే
నెంతనుచున్ వినుతింతును
[12]మంతుకు నెక్కుదువు మిగుల మన్నరుదాసా!

66


వ.

అని యానతిచ్చి యయ్యాచార్యవర్యుండు సుఖంబున నుండుమని
యుల్లంబు రంజిల్లం బలికి, తిరుమాళిగఁ బ్రవేసించి పరమానందంబున
నుండె. నంత విజయరాఘవమహికాంతుఁడును సంతసంబున యింతులుం
దానును సుఖంబున నుండె. మరునా డరుణోదయసమయంబున శ్రీరాజ
గోపాలశౌరి తిరుమంజనంబుఁ గొన నవధరించి చెలు వలరు జిలుగువలువలఁ
దడియొత్తి విజయరాఘవసమర్పిత మైన వజ్రాంగియు, హెచ్చైన పచ్చల
కిరీటంబును, గొప్పలగు సుప్పాణిముత్యాలచౌకట్లును చాల హెచ్చిన
మురువుముత్యంబులు, తళుకువజ్రములదామకంబు లమర్చిన ముత్తెల కంఠ
సరంబులును, రతుల హెచ్చిన పచ్చపదకంబును, నక్షత్రకంఠమాలయును,
చురుకుకెంపుల మీసరంబు లగు చేసరంబులును, డంబుగల వైడూర్యంబుల

యొడ్డాణంబును, జంట లగు గంటలమొలనూలును, చరణారవిందంబులకు
నందబు లైన యందియలును, మొదలుగాఁగల యాభరణంబులు ధరించి
సకలజనస్తోత్రపాత్రం బైన వేత్రంబుఁ గెంగేలఁ గీలించి, హేమారవిందేం
దిరారుక్మిణీసత్యభామలతోడఁ గూడఁ జిరత్నరత్నప్రభాకలితహేమసింహా
సనమధ్యంబున నధ్యాసీనుండై, యవక్రగతిక్రమబులు గల చక్రంబులను,
కుందనపుందీఁగెపనివ్రాఁతలఁ జొక్కంబు లగు చందురగావిటెక్కెంబులను,
దట్టంబు లగు కాంచనపట్టంబులను, ఫలభారసంభృతంబు లగు శాతకుంభరం
భాస్తంభంబులను, చతుర్ద్వారసందానితనారంగజంబీరనాళికేరాదిఫలవితానం
బులను, హేమమయంబు లైన నానావిధకుసుమధామంబులను, పురోభాగ
కల్పితానల్పప్రమాణరంగత్తురంగంబులను, దారుకారచితసారథ్యంబునను,
ప్రాంచితం బైన కాంచనకలశంబునను తదగ్రంబున నవరత్నమాలికావి
చిత్రం బగు కాంచనఛత్రంబునను తీరుమీరిన విజయచక్రంబను తిరుతేరున
వేంచేసి తరలివచ్చు సమయంబున, నవ్విజయరాఘవమహీవిభుండును జల
కంబులాడి చలువదుప్పటులఁ దడియొత్తి, క్షౌమాంబరంబులు ధరించి,
సర్వాభరణభూషితుండై నేమంబుమీర నామతీర్థంబై, గొప్ప సుప్పాణి
[13]ముత్తె(ము)లజపసరంబుఁ గెంగేలం బూని మౌనవ్రతంబున [14]మన్ననారు(ల)
పదధ్యానంబు సేయుచుఁ జెలువుమీరఁ జెంతలఁ గులకాంతలు గొలువఁ
దనమనోరథంబు నెఱ వేర్చు [15]విజయచక్రంబను రథంబుపైఁ జెంగమలాంబా
సమేతుండై యున్న మన్ననారును గన్నులపండువుగా గాంచి దండప్రణా
మంబు లాచరించి, ప్రాంజలియై, కటాక్షవీక్షణంబుల నిజరక్షణోన్ముఖుం
డైన యాచండలంకారునకు నభిముఖుండై నడచుచు, సకలాభీష్టసాధ
కంబైన యష్టాక్షరీమంత్రజపంబు గావింపుచు, మందమందయానంబున
నందంబుగా వచ్చు నవసరంబున, నాగోపాలదేవుండును ధేనువత్సన్యాయం
బున నిజదాసుండైన విజయరాఘవుమీది వాత్సల్యంబున శీఘ్రగమనంబున
రథముఁ దరలింపుచుఁ దిరువీథుల వేంచేయునప్పుడు, నానాదేశంబులనుండి
తండోపతండంబులుగా వచ్చిన ప్రజలు దండప్రణామంబు లాచరింపుచు
లోచనోత్సవంబుగా సేవింపుచు నుండువేళ, నందు గొంద ఱాజనులకుఁ
బొడమిన బడలికలు దీర వ్యజనంబుల విసరువారును, చందనకుసుమాదులు,
చలువతీర్థంబులు, జంబీరరసవాసితంబు లగు నీరుమజ్జిగలును, చొక్కం బగు
చక్కెరపానకంబును, మిక్కిలి యలర సొంటిచక్కెరలును, అక్కడక్కడ
నెక్కుడుగ సమర్పించువారును, మఱియును గొందఱు భద్రప్రదం బగు

భాగవతముద్ర వహించి చిటితాళంబు లెగరవైచి నటియించువారును,
ఉల్లంబునఁ దలంచిన కోరిక లీడేరిన రథంబువెంబడిన్ పొర్లుదండంబు
లిడువారును నై సేవించ, వారి యభీష్టంబులు నెఱవేర్పుచు వచ్చి చెలువు
మీరఁ దిరుతేరు నెలవున నెలవుకొనఁజేసె. నప్పుడు ప్రజ లందఱు నొప్పు
మీరఁ జప్పటులు చరచుచు నాబాలగోపాలంబును నాగోపాలు సేవించు
నవసరంబున.

67


క.

మన్నారుదాసనృపతియు
మన్నారు నుతించి మ్రొక్కి మచ్చికమీరన్
జెన్నారఁ బూజసేయుచు
వన్నెగఁ దనవెంటవచ్చు వనితలు దానున్.

68


సీ.

కాన్కగా నప్పుడు కావళ్ళతోఁ దెచ్చు
        వింతైన బంగారువెండిముడులు
కనకమయంబు లౌ కదళీఫలంబులు
        నారికేళంబులు నవ్య మైన
వస్త్రభూషణములు వరగంధమాల్యముల్
        క్రమముతో నర్పించి ఘనత మీర
దివ్యంబు లైనట్టి తీర్థప్రసాదముల్
        స్వీకరింపుచు భక్తి చెన్నుమించఁ


తే.

దేరు డిగ్గి యామన్నారుతీర్థ మొసఁగ
వీడె మంగీకరింపుచు వేడ్కతోడ
మగుడ సేతికి వేంచేయు మన్ననారు
లను భజింపుచు నానందలక్ష్మి గాంచె.

69


క.

భాసురకీర్తివిశాలా!
వాసవముఖవినుతశీల! వారణపాలా!
భూసురహితగుణజాలా!
శ్రీసత్యాకేళిలోల! జితశిశుపాలా!

70


పంచచామరం.

సురేంద్రమౌళిరత్నకాంతిశోభితాంఘ్రిపంకజా!
సరోజమిత్రశర్వరీశచారులోచనద్వయా!

పరిస్ఫురన్మహానుభావభవ్యనవ్యవైభవా!
చిరంతనప్రభావ! మౌనిసేవ్యదివ్యవిగ్రహా!

71


మాలినీ.

కరపరిచితవేత్రా! కంసదోర్గర్వజైత్రా!
నిరుపమఘనతేజా! నిర్జితాదిత్యరాజా!
వరమణిశుభవక్షా! వారిజాతాయతాక్షా!
గిరివహనధురీణా! గీతవిద్యాప్రవీణా!

72


గద్య.

ఇది శ్రీమద్రాజగోపాలకరుణాకటాక్షవీక్షణానుక్షణప్రవర్ధమానసారసార
స్వతధురీణయు, విచిత్రతరపత్రికాశతలిఖితవాచికార్థావగాహనప్రవీణయు,
తత్ప్రతిపత్రికాశతస్వహస్తలేఖనప్రశస్తకీర్తియు, శృంగారరసతరంగితపద
కవిత్వమహనీయమతిస్ఫూర్తియు, అతులితాష్టభాషాకవితాసర్వంకష
మనీషావిశేషశారదయు, రాజనీతివిద్యావిశారదయు, విజయరాఘవ
మహీపాలనిత్యసంభావితయు, విద్వత్కవిస్తుతగుణసేవితయు, పసపులేటి
వెంకటాద్రిబహుజన్మతపఃఫలంబును, మంగమాంబాగర్భశుక్తిముక్తాఫలం
బును, రంగద్గుణకదంబయు నగు రంగాజమ్మవచనరచనాచమత్కృతిం
జెన్నుమీరు మన్నారుదాసవిలాసం బను మహాప్రబంధంబునందుఁ జతుర్థా
శ్వాసము.


శ్రీరాజగోపాలాయ నమః


  1. అందంబులను. క. అందంబులను
  2. పరదాడి, క. రసదాడి
  3. క. యిగురుఁబోణి!
  4. వెన్నగ. క. వన్నెగ
  5. రఘునాథనృపకొమార. క. రఘునాథనృపకుమార
  6. కలికికి. క. కలికికి.
  7. కలికియుగంబున
  8. హెచ్చెన్
  9. వెయ్యారు యింతులు
  10. యిమ్మహామహుండు
  11. ఫళి. క. ఫళి
  12. క. మంతున కెక్కుదువు మిగుల మన్నరుదాసా!
  13. ముత్తెలజపసరంబుఁ గెంగేల. క. ముత్తెలజపసరంబుఁ గేల.
  14. మన్ననారు. క. మన్ననారుల.
  15. విజయచక్రంబును. క. విజయచక్రంబను.