మన్నారుదాసవిలాసము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరాజగోపాలాయ నమః

మన్నారుదాసవిలాసము

(పద్యకావ్యము)

తృతీయాశ్వాసము

శ్రీవిజయరాఘవాధిప
భావితనిజదివ్యలీల! భాసురశీలా!
పావనశుభ గుణహారీ!
గోవర్ధనధారి! రాజగోపాలహరీ!

1


వ.

అవధరింపుము.

2


సీ.

చంద్రకాంతములందు సరసత నెరయించి
        మొనయించి తొగల కామోదగరిమ
వేడ్కఁ జకోరాళి విందులఁ దగఁ బూన్చి
        జలధుల కభివృద్ధి జాలఁ గూర్చి
కందర్పునకు బాహుగర్వ మెక్కు డొనర్చి
        బొండుమల్లియలతోఁ బొందుఁ గాంచి
కామినీకాముకస్తోమంబుఁ గదియించి
        యిలకుఁ జల్వ నొసఁగి యింపు మీరఁ


తే.

దారహీరపటీరకర్పూరరుచుల
మిగుల నీహారధారలు నిగుడఁ జేసి
పుండరీకరుచిస్ఫూర్తి మెండుకొనుచుఁ
బండువెన్నెల జగముల నిండియుండె.

3


వ.

అట్టి సమయంబున.

4


చెలులు కాంతిమతికి శైత్యోపచారములఁ జేయుట

క.

వెన్నెల యిడు నలజడికిన్
దిన్నఁగ నెదురించు చలువతెమ్మెరవడికిన్
గ్రొన్ననతేనెల జడికిన్
గన్నియ మదిఁ గాఁక హెచ్చఁ గలఁగె న్మిగులన్.

5

మ.

జవరా లున్న తెఱంగుఁ గాంచి సకియల్ శైత్యోపచారంబులన్
సవరింపన్ వలె నంచు నెంచి యచట నవ్యేందుకాంతస్థలిక్
జివురుంబా న్పమరించి పూలబటువుల్ చెన్నొందఁ గీలించి యా
నవలామిన్నను నిల్పి తాప ముపశాంతం బౌ తెఱం గేర్పడన్.

6


సీ.

పడఁతి యొక్కతె మేనఁ బన్నీరుఁ జిలికించె
        సుదతి యొక్కతె పూలసురఁటి విసరె
జలజాక్షి యొక్కతె చలువగంద మలందె
        సకియ యొక్కతె కల్వసరులు జుట్టెఁ
జెలువ యొక్కతె నించెఁ జెందమ్మిపుప్పొడిఁ
        గలికి యొక్కతె గుప్పెఁ గప్పురంబుఁ
బొలఁతి యొక్కతె గప్పె నలరుల దుప్పటి
        వెలఁది యొక్కతె యిచ్చె విరులబంతి


తే.

బాలికామణి యొకతె మృణాళలతలు
సారెసారెకు నెమ్మేనఁ దీరుపఱచె
మఱియు నింతులు గొంద ఱమ్మగువ కపుడు
సకలశైత్యోపచారముల్ సలిపి రెలమి.

7


శైత్యోపచారము నిష్ఫల మగుట - మన్మథబాణవిద్ధ యగు కాంతిమతియొక్క మాన్మథప్రలాపము

సీ.

పదముల హత్తించు పల్లవప్రకరంబు
        కుచయుగార్పితసుమగుచ్ఛములును
బాహుయుగంబునం బరపు మృణాళముల్
        నెమ్మోముపై నుంచు నీరజంబు
కొప్పున సవరించు కురువేరుగుంపులు
        కనుదోయి హవణించు కలువసరులు
సరవిమై నించిన సంపెంగరేకులు
        పుక్కిట నెలకొల్పు పొన్నవిరులు


తే.

ఉవిదయంగంబులకు నోడియున్న వగుట
నధికతాపభరంబున నపుడు మిగుల
వాఁడి యెంతయు మలినభావము వహించి
సేవ సేయుచు నున్నట్టి చెలువుఁ గాంచె.

8

వ.

తదనంతరంబ.

9


క.

ఎలమావితోఁట లాయము
గల తేజీరౌతు వలుపుగల వింటను దే
నెల మత్తా గొను నారిని
నలరింపుచు నేసె వాఁడి యల రంపగముల్.

10


ఉ.

వెన్నెలరాయఁడు న్మరుఁడు వేమరు నీగతిఁ గాఁక నించఁ దా
నెన్నఁగరాని మోహమున నెంతయుఁ గాంచుచుఁ బారవశ్యమున్
గన్నులముందఱ న్విభుఁడు గ్రక్కున నిల్చినయట్లుఁ దోఁచఁగాఁ
గన్నె బహుప్రియోక్తులను గాంతలచెంతను బల్కె నీ క్రియన్.

11


సీ.

విజయరాఘవ! నిన్ను వేడ్కతో విని విని
        మనసు నీపైఁ జిక్క మరులుకొంటిఁ
జంద్రబింబము బోలు చక్కని నీమోముఁ
        గనుఁగొన్నయప్పుడే కాఁక హెచ్చెఁ
బంచదారను మించు బల్కులు బల్కరా
        వీనులవిందుగా వెలయ నిపుడు
చక్కెరకెమ్మోవిఁ జవి చూడనియ్యరా
        మొక్కెద నీకు నే మోహనాంగ!


తే.

మరుఁడు నాపయి దండెత్తి మచ్చరించి
విరహ మగ్గల మాయెరా వేగ రార
కౌఁగిటను జేర్పరా చాల గారవించి
నన్ను రతి నేలుకోర మన్నారుదాస!

12


సీ.

కులుకుగుబ్బలమీదఁ గుంకుమం బలఁదరా
        వలచితి నే నీకు వన్నెకాఁడ!
చక్కెరమో వాని చనవుఁ బాలింపగా
        దక్కితిరా యోరి! నిక్కముగను
జెక్కిలి గొనగోర జీరి నన్నేలరా
        పక్కకు వచ్చెదఁ బ్రాణనాథ!
పుక్కిటివిడె మిచ్చి బుజ్జగింపుచు నన్ను
        దయఁ జూడవేమిరా? దానశూర!

తే.

నిన్ను నమ్మినదానరా మన్నెరాయ!
మేరమీరిన చలువతెమ్మెరల జడిసి
పండువెన్నెలకాఁకచే బడలినాను
విజయరాఘవ! నన్నేలు వేడ్కమీర.

13


సీ.

పలుమారు నేఁ బిల్వఁ బల్కవ దేమిరా!
        పంతంబు లేలరా? రంతుకాఁడ!
ముద్దు బెట్టఁగ రాఁగ మో మటు ద్రిప్పెడు
        నేర మేమిర? యోరి! నీటుకాఁడ!
కౌఁగిలించెద నని కదియ నేఁ జేరినఁ
        [1]జేయ మర్చెద వేమి చేలువరాయ!
కామునికేళినిఁ గలయ నే వచ్చిన
        రారావు సేతురా రాజవర్య!


తే.

ఇటుల నన్నేల? యేఁచెద వెమ్మెకాఁడ!
[2]చిలుక లివె చేరి కడు నల్క చిల్కఁ బల్కె
గండుఁగోయిలబారులు గదియ వచ్చె
విజయరాఘవ! నన్నేలు వింతరతుల.

14


సీ.

చక్కఁదనము సూచి సొక్కితి నాసామి!
        బటువుగుబ్బలుఁ గేలఁ బట్టవేల?
మక్కువ నీతేటమాటకే [3]వలచితి
        ముద్దువెట్ట వదేర? ముచ్చ టలర
నీరాజసముఁ జూచి నీకు నే దక్కితిఁ
        జెక్కు నొక్క వదేమి? చెలువుమీర
సొగసైన నీహొయిల్ సూచి నేఁ గోరితిఁ
        గౌఁగిలింప వదేమి? కాఁకదీర


తే.

నింత నన్నేఁతురా! పంత మేల? నిన్ను
జాల [4]2నమ్మినదానరా జాణరాయ!
పచ్చవిల్తునికేళిని బాగుమీర
విజయరాఘవ! న న్నేలు వేడ్కమీర.

15

ముక్తపదగ్రస్త సింహావలోకన కందపద్యము

క.

ధీ రాజిలఁ జనవీరా
వీరాయితకేళి నిన్ను వెలకు గొనేరా
నేరాల కేమి రారా
రారాపులు మాని విజయరాఘవధీరా!

16


క.

అని పలికి తెలిసి మఱియును
ఘనముగ నెమ్మనమునందుఁ గాఁకలు [5]హెచ్చన్
వనజేక్షణ భ్రమ నొందుచు
నెనయఁగ నిట్లనియె మగుడ నింతులు వినఁగన్.

17


సీ.

శృంగారముల మించు చెలువైన కాంతు నే
        నెన్నఁడు జూతునే! యింతులార!
తేనెలు [6]గ్రమ్మెడు తేఁటైన కెమ్మోవి
        యాన నెప్పుడు గల్గు? నతివలార!
మెఱుఁగుటద్దమ్ముల మీరు చెక్కుల గోర
        జీరుట యెన్నఁడో? చెలువలార!
సొగసైన తొడలపై సొంపుగాఁ గూర్చుండి
        మాటాడు టెన్నఁడో? మగువలార!


తే.

విరహ మగ్గల మాయెను వెలఁదులార!
తాళలే నింక మరుకాఁకఁ దరుణులార!
విజయరాఘవవిభుఁ దెచ్చి వేడ్కమీరఁ
బొందుగా నన్నుఁ గూర్పరే పొలఁతులార!

18


వ.

అని బహువిధంబుల.

19


కాంతిమతిస్థితి నెఱింగిన సఖులలో నొకతె యగు విలాసవతి యను చెలి కారణం బడుగుట

క.

కాంతిమతి యిట్లు కంతుని
సంతాపముచేతఁ బలుకు సమయమునఁ గడున్

వింతాయెను వింటిరె యని
చింతింపుచు నందు నొక్కచెలి నెన రమరన్.

20


సీ.

ఇంతిరో! చూచితే యీకల్కి చూపులు
        మగువ! వింటివె చెలిమనసుతగులు
యెలనాగ! వింటివే యీకన్నెకోరిక
        నెలఁతరో! సుదతికి నిద్ర లేదు
మెలఁతరో! సకియకు మేను చిక్కెను జాల
        వనిత! లేమకు నెందు వాంఛ సడలె
నలివేణిరో! యతివఁ బాయఁగఁద్రోచె
        మదవతి! తగుణి మైమఱచి పలికెఁ


తే.

[7]గొదవ లింకను రాకుండఁ గొమ్మలార!
కాంతిమతికి సంతసమును గలుఁగజేయు
పడఁతు లెవ్వరొ యిం దని పలుకువేళఁ
బలికెను విలాసవతి తోడిభామలకును.

21


క.

చెలులార! యింతసేపును
దెలియఁగరాదయ్యె నింతితెఱఁ గిప్పుడు దాఁ
బలికిన పలుకుల హృదయము
తెలిసెగదా! మనకుఁ దేటతెల్లమిఁ గాఁగన్.

22


వ.

అని మఱియును.

23


సీ.

తనకు నేవస్తువుల్ తలిదండ్రు లంపిన
        మనకు దాఁచఁగ నిచ్చు మగువలార!
మనము బంతికి రాక మఱి యెంతప్రొద్దైన
        నారగించఁగ నొల్ల దతివలార!
అలరఁ గుంకుమగంద మలఁదెడు వేళల
        ముందుగా మన కిచ్చు ముదితలార!
ముడిఁబూలు కొప్పున ముడుచుచు మనకును
        సగముఁ బంచి యొసంగు సకియలార!


తే.

వింతవగలైన సొమ్ములు వెలల హెచ్చు
చీరలును నిండ్ల కంపించుఁ జెలియలార!

మనకు నిటుల సేసిన మేలు మఱువ వశమె!
కొమ్మకోర్కెలు మనము చేకూర్పవలయు.

24


క.

కన్నియ నిందఱ మడిగినఁ
దిన్నఁగ దన మనసుకోర్కెఁ దెలుపదు మనకున్
మున్నుగ నే నొక్కతెనే
యెన్నఁగ నీతలఁపుఁ దెలిసి యిదె వివరింతున్.

25


వ.

మెఱుంగుబోణులార! మీర లందఱు మఱుఁగున నుండుం డని విలాసవతి
కాంతిమతిం జేరి సంతసంబున.

26


సీ.

చెదరిన ముంగురుల్ చెలువంబు మీరఁగాఁ
        గొనగోళ్ళ దువ్వుచుఁ గొ ప్పమర్చి
[8]చిటుల గందఁపుఁబూఁత బటువుగుబ్బల నర
        జారు పయ్యదకొంగుఁ జక్కఁ జేర్చి
డెప్పరంబుగ నంటు పుప్పొడుల్ రాలంగ
        మెఱసిన చెల్మి నెమ్మేను నిమిరి
చెక్కుటద్దంబులఁ జెమటఁ బయ్యద నొత్తి
        యక్కునఁ జేర్చి నెయ్యంబుతోడ


ఆ.

సకులలోన నన్ను జాల [9]లాలింపుదు
ప్రాణపదము గాఁగ పద్మనయన!
చిన్ననాటనుండి చేసిన చెలిమిచే
మగువ! దాఁచ వెపుడు మనసుఁ దనకు.

27


క.

ఎంతటి కార్యం బైనను
కాంతిమతీ! సంఘటింపఁగలదాన నిఁకన్
బంతముఁ బలికెద నీతో
జింతింపక దెల్పు మిపుడు సిగ్గేమిటికే.

28


చ.

అని చెలి బల్కఁ గాంతిమతి యందగరాని తలంపు దీని నే
మని వినిపింతు నీ చెలికి నక్కట! తెల్పక యున్న నన్నిఁకన్
మనసిజుఁ డెట్లు సేయునొకొ! నమ్మిన నెచ్చెలి లేదు దీనిక
న్న ననుచు నెంచి నెమ్మనమునఁ నలుదిక్కులు చూచి [10]యెంతయున్.

29

కాంతిమతి సకలవృత్తాంతంబులను విలాసవతికిఁ దెలియఁజేసి విజయరాఘవుఁ గూర్పఁగోరుట; విలాసవతి సమ్మతించుట, సూర్యోదయవర్ణన

క.

అప్పుడు ఘన మగు సిగ్గున
ముప్పిరిగొను మోహభరము మురిపెముఁ జెలఁగన్
రెప్ప యిడక చెలిమోమును
దప్పక కనుఁగొనుచు సరగఁ దా నిట్లనియెన్.30
సీ. మనవీథిలో నిన్న మన్నారుదేవుఁడు
        గరుడవాహన మెక్కి కదలి రాఁగ
మన మందఱము గూడి మణిసౌధమున నుండి
        సేవించితిమి గదా! చెలువ మలర
నతఁడె యీతఁడొ యన నందంబు గలవాఁడు
        విజయరాఘవమహీవిభువరుండు
కులసతులును దాను గోపాలుఁ గొల్చుచు
        రాఁ జూచితిమిగదా! రమణ నప్పు


తే.

డెలమి నారేయి నిద్రింప నింపుమీర
సరసిజానన! వేకువజామువేళ
ఘనుఁడు మన్నారుదాసుఁడు కలను వచ్చె
నతఁడు లాలించువిధము లేమందు నమ్మ!

31


సీ.

తిలకంబుఁ దీరుగా దిద్దెద నని వచ్చి
        చెక్కిలిఁ గొనగోర జీరె నమ్మ!
మోము మోమునఁ జేర్చి ముద్దువెట్టెద నని
        చక్కెరకెమ్మోవి నొక్కె నమ్మ!
మేనఁ గుంకుమగంద మే నలందెద నని
        బటువుగుబ్బలుఁ గేలఁ బట్టె నమ్మ!
కౌఁగిట నను జేర్చి గారవించెద నని
        యొనర నీవీబంధ మూడ్చె నమ్మ!


తే.

విజయరాఘవుఁ డే నని వెలయఁ బలికి
విరులశయ్యనుఁ జేర్పుచు వేడ్కమీరఁ

గంతుకేళిని నను నేలునంతలోనె
మేను గరుపాఱ వేగమె మేలుకొంటి.

32


క.

మేలుకొని మేను మిక్కిలి
బాళి న్నాతలఁపు వానిపై నెలకొల్పన్
జాలా హెచ్చెను మోహము
వాలాయం బతనిఁ గూర్పు వన్నెగ నింకన్.

33


సీ.

హెచ్చుగ నామీఁద మచ్చికగల చెలుల్
        నీకన్న నెవ్వరే నీరజాక్షి!
పరుల చిత్తంబులు బాగుగాఁ దెలియుచు
        మాటాడ నేర్తువే మందగమన!
యెంత కార్యంబైనఁ జింత సేయక నీవె
        సంఘటింతువు గదా! చంద్రవదన!
నెనరుతో నెప్పుడు నిను నమ్మువారల
        పంత మీడేర్తువే పద్మగంధి!


తే.

ఇట్టి చాతుర్యము నుతింప నెట్లు నేర్తు
నెమ్మి నీవంటి సఖి గల్గ నెలఁత! యిపుడె
యన్నికోర్కెలు చేకూఁడె నని తలంతు
విజయరాఘవు నను గూర్పు వేడ్కమీర.

34


వ.

అని మంతనంబునం దెలిపిన సంతసించి కాంతిమతికి విలాసవతి యిట్లనియె.

35


సీ.

నలవసంతజయంతనలకూబరశ్రీలఁ
        జెలువంబుచే గెల్చి చెలఁగినాఁడు
రాధేయశిబిసింధు రాజకల్పకముల
        దానవిద్యను మించి తనరినాఁడు
రామభార్గవసురరాజపార్థులలీల
        విక్రమంబున హెచ్చి వెలసినాఁడు
భారతీపద్మసంభవశేషగురులను
        బాండిత్యమున మీరి ప్రబలినాఁడు


తే.

[11]దానము సతులచేతను ధరణి మఱియు
ఖ్యాతి కెక్కగ సేయించు ఘనుఁ డతండు

రాజగోపాలుచందాన రాజముఖుల
నయమునను నేలు దక్షిణనాయకుండు.

36


క.

ఏమి తపం బొనరించితొ!
వామాక్షీ! విజయరాఘవవిభుఁడె కలలోఁ
ప్రేమను నిను లాలించె నిఁ
కేమందును నీదు భాగ్య మేరికిఁ గలదే!

37


క.

చింతిలకుము కాంతిమతీ!
మంతనమున నేనుఁ దెల్పి మచ్చిక వనితా
కంతుని మన్నరుదాసునిఁ
గాంతా! నినుఁ గూర్చి చాల ఘనత వహింతున్.

38


వ.

అని పలుకు సమయంబున.

39


క.

ఆరమణి మది విచారము
జాఱెడుగతిఁ దమము లంత జాఱెన్ మఱి య
న్నారిముఖాబ్దమునం బలె
తూరుపుదిక్కునను దెలివి దోఁచె న్మిగులన్.

40


తే.

అంబుజేక్షణ [12]సకుల ముఖాంబుజములు
చెలువ మలరఁగఁ గడు వికసించినట్లు
సరవిఁ గనుపట్టు నామోదగరిముతోడ
నపుడు వికసించె సరసుల నంబుజములు.

41


క.[13]

జనలోచనోత్సవంబును
వనజకులోత్సవము నొక్కవరుసగఁ గలుగన్
దనకరములు నెరయింపుచు
దినకరుఁ డుదయించెఁ దూర్పుదిక్కున నంతన్.

42


కాంతిమతి యనుమతిఁ గైకొని విలాసవతి విజయరాఘవునొద్దకు బయలుదేరుట

వ.

ఇవ్విధంబున సూర్యోదయంబైన నవ్విలాసవతి కాంతిమతిం జూచి సంత
సంబున నిట్లనియె.

43

క.

మనమున నించుక యేనియు
ననుమానము వలదు దీని కంబుజనేత్రా!
వనజాతుని కృపచేతనె
యొనగూడు న్నీదుకోర్కి యూఱడు మింకన్.

44


క.

మన్నరుదాసునిఁ బొడగని
విన్నప మొనరించి తలఁపు వేడుకమీరన్
గన్నెరొ! వేగమె వచ్చెదఁ
జెన్నొందఁగ నుండు మిచటఁ జెలులు న్నీవున్.

45


సీ.

అని యింతితోఁ బల్కి యనుమతిఁ గైకొని
        యుచితశృంగారంబు నొనరఁ బూని
బంగారుచాయల రంగుమీగుచునుండు
        గజనిమ్మపండ్లుఁ గైకాన్కఁ గొనుచుఁ
జెంగమ్మ! నాకోర్కిఁ జేకూర్చి రక్షింపఁ
        గులదైవముగ నిన్నె కొలుతు నెపుడు
నని తలంపుచు రాఁగ నవ్వేళఁ గనుపట్టె
        శుభశకునంబులు జోక మఱియు


తే.

వామభాగానఁ గనుపట్టె క్షేమకారి
క్షీరకుంభద్వయం బటు చేరు వయ్యెఁ
బెండ్లిపాటలు పాడుచుఁ బేరటాండ్రు
వచ్చి రెదురుగ ఫలములు వరుసఁ గొనుచు.

46


వ.

తదనంతరంబున.

47


సీ.

విజయరాఘవుఁ గూర్తు వేడ్కతో నే నని
        పంతగించితిఁగదా! పడఁతితోడ
నెవ్వరితోఁ దెల్పు దిప్పు డీ కార్యంబు?
        నెవ్వార లాప్తులో? యెరుకసేయ
రాజదేవేంద్రుఁ డౌ రఘునాథతనయుని
        సముఖంబు [14]దొరకించు సకియ గలదె!
పూనిన కార్యంబుఁ బొంకాన జతగూర్చి
        తనకు సహాయమౌ తరుణు లెవ్వ

తే.

రెవ్వరో? యాప్తబంధువు లెలమిఁ దనకు
నెమ్మి నాతోడు నిజము చెంగమ్మె యనుచు
మఱియు యోజన సేయుచు మనసులోన
నవ్విలాసిని యట వచ్చునవసరమున.

43


విలాసవతి విజయరాఘవుఁ జేరి కాంతిమతీసౌందర్యాతిశయమును, చాతుర్యమును వర్ణించి యామెను బెండ్లియాడ వేడుట; మన్నారుదాసుఁడు (విజయరాఘవుఁడు) సమ్మతించుట

వ.

అవ్విజయరాఘవనృపతిలకుండును జలకంబులాడి చలువలు ధరియించి,
బంగారుపనుల రంగారు పరంగిపీఁటపైఁ బ్రాఙ్ముఖుఁడై కూర్చుండి, యప్పు
డప్పురోహితు లందిచ్చు శుద్ధోదకంబుల శుద్ధాచమనంబుఁ గావించి, సంత
సంబునఁ గాంతలుం దాను నంతఃపురంబు వెడలి, కుందనంపుసవరణల
నందం బగు నందలం బెక్కి యిరుగడల దొరలును, సామంతమహీకాంతు
లును బలసి కొలువ, వామభాగంబునం గనుపించు క్షేమకారిదర్శనంబు
గావించి మౌనముద్రఁ బూని హృదయారవిందంబునం బొందుగా నరుణార
విందేందిరారాజగోపాలకుల పదాంభోజంబులుఁ దలంపుచు, ఠీవి మెఱయఁ
గోవిలఁ జేరవచ్చి వేత్రహస్తు లందంద సందడిఁ దొలఁగింప నందలంబు
నందంబుగా డిగి, యొక బోఁటి తేటపన్నీటఁ బదారవిందంబులుఁ గడుగ
మఱియు నొకపడఁతి గడితంపుఁబావడం దడి యొత్త, జెలువుమీర
నిలిచి కపిలధేనువులకు గ్రాసంబు సమర్పించి, [15]భృంగారసలిలక్షాళితంబు లగు
తధేనుశృంగతీర్థంబుఁ గరంబునను పవిత్రం బగు తదంగసలిలంబుఁ దద్వా
లాగ్రంబునను, శిరంబునఁ బ్రోక్షించుకొని, యాయయ్యసన్నిధి నున్న
శ్రీవైష్ణవశ్రేణులకు భక్తిమీర మ్రొక్కి, యచ్చట న్మెచ్చువచ్చు నవరత్న
సింహాసనంబునఁ జెంగమలాంబిక చెగటఁ జెలంగ నిరువంకలఁ బొంకంబుగా
రుక్మిణీసత్యభామలు కొలువుసేయఁ గన్నులపండు వగుచుఁ దనసన్నిధి
సేసి పెన్నిధివలె కొలువున్న మన్ననారుల సేవించి, సాష్టాంగదండప్రణా
మంబులుఁ గావించి, యాచెంగట రంగుమీర నొద్దిక గావించిన బంగారు
గద్దియమీఁద శతక్రతు శ్రీనివాసతాతయాచార్యశేఖరు లగ్రభాగంబునఁ
గూర్చుండ బద్మాసనాసీనుండై యమ్మహామహు నుపదేశక్రమంబున
శుద్ధాచమనం బొనర్చి, యందుఁ గొంద ఱాచార్యశిఖామణులు దివ్య
ప్రబంధంబులును, గొందఱు భాగవతాదిబహుపురాణంబులు వినికిసేయుచు

నుండ నాకర్ణింపుచు, ద్వాదశోర్ధ్వపుండ్రంబులు ధరియించి యయ్యాచార్య
వర్యుండు ప్రశస్తం బగు తమ శ్రీహస్తంబునఁ బ్రసాదించు మన్నారుదాస
నామముద్ర భద్రంబుగా వక్షస్థలంబున ధరియింపుచు, యత్నంబుమీరఁ
గాలించిన రత్నమయం బగు జపసరంబుఁ జేఁ బూని, యష్టాక్షరీమంత్ర
జపంబు నల రాజగోపాలమంత్రజపంబు గావించి, నిత్యదానంబు లొనర్చి
తిరుశఠగోపంబులకుఁ దిరువారాధనంబు సేసి, తదనంతరంబున ముదంబున
మన్ననారుసన్నిధి నిలిచి సంతసంబున నింతు లొసంగు చెంగల్వసరంబులను
[16]సేమంతియలను, నింపులు నింపు చంపకకుసుమంబులను జాజుల, గేదంగులఁ
[17]గెందమ్ములను, జెలువుమీరు శ్రీతులసీదళంబులను, సహస్రనామంబుల
నర్చనంబు గావించి, ధూపదీపనైవేద్యతాంబూలసమర్పణంబు సేయించి,
యారాజవదనలుం దానును నీరాజనంబు లొసంగి, ధ్వజవ్యజనాతపత్ర
చామరదర్పణధారణప్రముఖంబు లగు సకలోపచారంబులు గావించి, వచన
కుసుమార్చనలుగాఁ దాము విన్నవించిన విన్నపంబులు వినిపింపుచు సన్ను
తించి, సన్నిధివా రొసంగు తీర్థప్రసాదంబులఁ గైకొని, యయ్యింతులుం
దాను [18]నారాజగోపాలున కభిముఖుండై వచ్చి, యచ్చట మెచ్చుగా
యత్నంబునం బఱచిన రత్నకంబళంబులయందు నొద్దిక యగు రతనంపు
గద్దియమీఁద నిండువేడుకతోడం గూర్చండి, చెలువుమీరఁ గొలువు [19]సింగా
రంబై, యయ్యాచార్యవర్యు లగ్రభాగంబున కలంకారంబుగా వేంచేసి
యుండ, శ్రీవైష్ణవశ్రేణులు నలువంకలన్ బలసి కూర్చుండి యాశీర్వా
దంబులు సేయుచు నుండ, శ్రీమద్రామాయణశ్రవణంబు గావించి,
విద్వత్కవిబృందంబు లందంద నింపొందఁ బ్రసంగంబులు సేయ వినుచు,
శ్రీరాజగోపాలశౌరి కారగింపుఁ గావించి తెచ్చియిచ్చు తాంబూలంబుఁ
గావింపుచు, నిండువేడుకతోడఁ బేరోలగంబుండి, యంతట సమ్మదంబున
నమ్మగువలుం దానును మన్ననారుల మగుడ సేవించి ముదంబునం
గదలివచ్చె; నాసమయంబున నవ్విలాసవతియును నతిమోదంబున.

49


క.

సంగీతము వినిపించఁగ
నంగన లిరుగడల నిల్చి హరు వలరంగా
బంగరుపల్లకియందును
రంగలరుచు వచ్చు విజయరాఘవుఁ జూచెన్.

50


వ.

చూచి యయ్యవసరంబున.

సీ.

ఇది వేళ తన కని యిచ్చ నుప్పొంగుచుఁ
        జేరంగఁ జనుఁదెంచి చెన్నుమీర
నంజలి సేయుచు నల కాంతిమతిగుబ్బ
        పాలిండ్లకును నిది ప్రతి యటన్న
కైవడిఁ జేనున్న గజనిమ్మపండ్లను
        గాన్కగా నొసఁగు నాకలికిఁ జూచి
యంగనామణి వచ్చు నింగితం బెఱుఁగుచుఁ
        బిలుపింతు నిదె యని ప్రేమఁ బల్కి


తే.

యపుడు నగరు బ్రవేశించి యతిశయించు
రాజసంబున నంతఃపురంబుఁ జేరి
యారగించినపిదప నయ్యతివఁ దలచి
సంతసంబున నుండి సమ్మదము మెఱయ.

52


క.

సరసకు నెగ్గడికత్తెను
మెఱవడితోఁ బిల్చి యపుడు మిక్కిలి తమి నా
తరుణిం దోడుక రమ్మన
సరగున నది తోఁడితెచ్చె సముఖంబునకున్.

53


వ.

అంత.

54


క.

రంజిల్లి మ్రొక్కి నిల్చిన
కంజానన! వచ్చినట్టికార్యం బేమీ?
మంజులవాణీ! యన నా
[20]తంజపురాధిపున కింతి తా నిట్లనియెన్.

55


సీ.

శ్రీరాజగోపాలశౌరి చెంగమ్మయు
        గరుడవాహన మెక్కి కదలిరాఁగ
రాజచంద్రునిపుత్రి రాజబింబానన
        యల కాంతిమతి జూచి యపుడు మిమ్ము
నారాత్రిఁ గలలోన నక్కఱ మీరంగఁ
        గలసినయట్లుండఁ గలఁగి మిగుల
విరహంబుచే సొక్కి మరునికాఁకకు స్రుక్కి
        మనసు నీపై నుంచి మమత హెచ్చఁ

తే.

బ్రాణపద మైన ననుఁ బిల్చి పద్మగంధి
స్వామికినిఁ దెల్పు మనుచును బ్రేమఁ బనిచె
గాంతిమతి చెలువంబు నే ఘనతమీర
విజయరాఘవ! తెల్పెద వేడ్క వినుము.

56


సీ.

అతివపాదంబుల యందంబునకు నోడి
        నీళ్ళలోపల డాఁగె నీరజములు
వనితయూరువులకు నెనగామి ననఁటులు
        పలుమారు సిగ్గుచేఁ దలలు వంచెఁ
జానజంఘలతోడ సరిబోరఁగాలేమి
        దొన లెల్ల సాదులవెనుక నొదిగె
భామపిఱుందులఁ బ్రతిరాక చక్రముల్
        దేశంబులం దెల్లఁ దిరుగసాగె


తే.

జలజలోచననాభికి నళికి మిగులఁ
దెలియ నదులందు నావర్తములు గరంగె
సుదతిమధ్యంబునకు మొనచూప వెఱచి
కోరి సింహంబు పర్వతగుహలుఁ జేరె.

57


సీ.

గజయానపాలిండ్లు గజనిమ్మపండ్లగు
        విమలాంగికరములు విరిసరములు
కలకంఠిగళము చొక్కపుశంఖకుల మగు
        వనితకర్ణములు శ్రీవర్ణము లగు
నంగనకెమ్మోవి యమృతంబులకు దీవి
        తరుణిపల్కుదురు కుందముల నెదురు
మదిరాక్షిముక్కు సంపంగిమొగ్గకు నిక్కు
        భామనేత్రము లబ్జపత్రము లగు


తే.

వెలఁదికనుబొమ లంగజు విండ్లకొమలు
కామినీమణివదనంబు కాంతిసదన
మించుఁబోణికి ముంగురుల్ మించుటిరులు
మగువచెలువంబు నంతయు బొగడఁ దరమె!

58

సీ.

అనుపమగతి మించు తనుకాంతిచే నల
        హేమసౌందర్యంబు నెసఁగ మించు
జోకైన తొడల మేల్ చాకచక్యంబుచే
        రంభావికాసంబు రహి జయించు
నిడువాలు కనుఁగవఁ బొడమెడు [21]సిగ్గుచే
        హరిణివిలాసంబు నతిశయించు
నుతియింపఁ దగిన నెన్నుదుటి యొప్పిదమున
        శశిరేఖలీలల సరవి మీరు


తే.

[22]నెనరు నాస దిలోత్తమవినుతి నలరుఁ
గైశికమున సుకేశివిఖ్యాతిఁ దనరు
నరయ నచ్చెరపూఁబోణులందు నైనఁ
గాంతిమతిసాటి బోల్ప నేయింతి గలదు?

59


సీ.

అలరఁ బ్రత్యక్షపాంచాలాదిశయ్యల
        సకలప్రబంధముల్ చదువ నేర్చు
జంత్రగాత్రంబులు జతగూడ శ్రుతులకు
        నింపుగా వీణె వాయింప నేర్చుఁ
బదపద్యగద్యముల్ బహువిధోల్లేఖల
        హరువుగా రచన సేయంగ నేర్చుఁ
గడు వింతలుగ నాటకంబులు హవణించి
        మించి కేళిక వినుపించ నేర్చు


తే.

వ్రాలు ముక్తాఫలము లన వ్రాయనేర్చుఁ
దనరఁ జిత్తరువులు వ్రాయఁ దానె నేర్చు
విజయరాఘవ! మాటలు వేయు నేల?
చెలఁగి నిన్ను మెప్పించ మా చెలియ నేర్చు.

60


సీ.

పదములు సరిలేని పద్మరేఖలఁ బొల్చు
        హంససంగతు లందె యలరియుండు
నందంబుఁ బెందొడ లనఁటులై యుండును
        గరికరశ్రీ లందె కలిగియుండు

నూఁగారు ధూమలతాగౌరవముఁ దాల్చు
        నసివిలాసం బందె యమరియుండు
నెమ్మోము హరిణాంకనిభమై చెలంగును
        నీరజద్యుతి యందె నిండియుండు


తే.

లలన మదనుని యింద్రజాలంపువిద్య
కాకయుండిన నిటువలె లోకమునకు
నచ్చెరువుఁ బూన్పఁజాలునే మెచ్చు లొదవ
లెవ్వరు సాటి మాకాంతిమతికి?

61


క.

కులమున గుణమున రూపున
నిల నలకాంతిమతివంటి యింతులు గలరే!
చెలువకు నీవే తగుదువు
తలఁపఁగ నాయింతి నీకె తగును నరేంద్రా!

62


చ.

ఎలమిని నీవు కాంతిమతి నిప్పుడు మెచ్చుగఁ బెండ్లియాడినన్
నెలయును రోహిణీసతియు నీరజనాభుఁడు సింధుకన్యయున్
వలపులవింటిజోదు రతి వన్నెగఁ గూడినలీల నుందు రౌ
వల నగునట్టి కుందనము వాసనఁ జెందినరీతి నెంచఁగన్.

63


క.

అని యవ్విలాసవతి బ
ల్కిన వీనుల విందుగా సఖీమణిగుణముల్
విని మనమున నుప్పొంగుచు
నెనయఁగ మన్నారుదాసుఁ డిట్లని పలికెన్.

64


సీ.

రాజీవలోచన! రాజగోపాలు నే
        సేవింపుచును వచ్చి చెలువుమీర
మేలైన బంగారుమేడపైఁ దొలుకరి
        మెఱుఁగుకైవడి నుండు మెలఁత నపుడు
కన్నులపండువుగా విలోకింపుచు
        నీకాంతి గలదె! యేయింతికైన
నేరాజకన్యయో! యీరాజముఖి యంచుఁ
        [23]జోద్య మందితి మది సొక్కి మిగుల

తే.

[24]నవుర యాచంద మాయంద మాయొయార
మట్టి యాకుల్కు లాబెళ్కు లట్టి తళ్కు
లహహ! యానీటు లాతేట లట్టి నడలు
గలదె! భూలోకమందు నేకాంతలకును.

65


చ.

చెలువుగ ఫాల్గుణోత్సవము శ్రీకరలీలల శేఖరింపుచున్
వలనుగఁ బిన్నపెద్దలను వాకిట నుండెడియట్టి మంత్రులన్
నెలకొను వేడ్కతోఁ బనిచి నీరజలోచనఁ బెండ్లియాడఁగాఁ
దలఁచితి నంతలోపలనె తామరసాక్షిరొ! వచ్చితేకదా!

66


క.

మనమునఁ దలచిన కోరిక
వనితా! నెఱవేఱె నీవు వచ్చినకతనన్
విను రేపె పెండ్లి యనుచును
వినుపింపుము కాంతిమతికి వేడుక మీరన్.

67


విలాసవతి కాంతిమతివద్ధికి మరలి సకలవృత్తాంతంబుల నెరుకపరచుట

మ.

అని లాలింపుచు నవ్విలాసవతి నత్యానంద మొందింపుచున్
ఘనమౌ సొమ్ములు కాంచనాంబరములు గర్పూరతాంబూలమున్
వినుతుల్ సేయుచు నియ్యఁగా మనమునన్ వేమారు నుప్పొంగి తా
ననియె న్మన్నరుదాసుఁ జూచి నగుచున్ హర్షంబు రెట్టింపఁగాన్.

68


క.

స్వామీ! నీతోఁ దెల్పిన
యీమాటలు రాజచంద్రుఁ డెఱుఁగకయుండన్
నీమంత్రుల నటఁ బంపుము
తామసమున కింక చెలియ తాళదుసుమ్మీ!

69


వ.

అని పలికిన యనంతరంబ.

70


సీ.

విజయరాఘవిమహీవిభునితో మాటాడి
        మగుడివచ్చుచు నల మందయాన
తలఁపు ఫలించెగా తనకు నేఁ డని యెంచి
        యెంతయు మదిలోన సంతసించి

రఘునాథతనయుఁడు రమ్మని తనుఁ బిల్చి
        చాల లాలించెగా చల్లఁగాను
మండలాధిపులతో మాటలాడని మేటి
        ననుఁ బిల్చి మాటాడె నమ్ము మనుచు


తే.

సొంతభాగ్యంబు సేసితి నెలమి నేను
కలిగె నింతటిదొరసముఖంబు తనకుఁ
బంత మీ డేర్పఁ గంటిని పణఁతి కిపుడె
యనుచుఁ బల్కుచు నట వచ్చు నవసరమున.

71


క.

కాంతిమతియు నవ్వనమున
మంతనమున నుండి చాల మరుకాఁకలచే
నింతింతనరాని తమిన్
జింతింపఁగఁ దొణఁగె దనదు చిత్తములోనన్.

72


సీ.

పంతముల్ వల్కి నాపతినిఁ గూర్చెద నని
        జలజాక్షి చనియెగా సముఖమునకు
[25]మన్నారుదాసుతో మాటలాడఁగ వేళ
        కలుగునో కలుగదో! కమలముఖికి
రాజసంబున నల రాజాధిరాజు దాఁ
        బలుకునో బలుకఁడో! భావ మలర
మచ్చరంబున పద్దిమగువ లీ కార్యంబుఁ
        జెలువుండు వినకుండ సేతు రొక్కొ!


తే.

ఏల చెలి తామసించెనో? యింతసేపు
మించుఁబోణి తడవు [26]తామసించె నపుడె
పూనినటువంటి కార్యంబుఁ బొంకముగను
నిర్వహించుట తోఁచెను నెమ్మనమున.

73


తే.

అనుచు నాలోచనలు సేయునట్టి వేళ
వామనేత్రాంసకుచములు వరుస నదరెఁ
గలకలంబుగ దక్షిణగౌళి వలికె
వేగఁ బెండ్లి కుపశ్రుతి వినఁగ నయ్యె.

74

క.

అంతట విలాసవతియును
సంతసమునఁ జేరరాఁగ సఖముఖకాంతిన్
వింతగు వేడుకఁ గనుఁగొని
కాంతిమతియు నెదురుకొనుచుఁ గౌఁగిటఁ జేర్చెన్.

75


వ.

ఇవ్విధమున నెదురుకొని కాంతిమతి యింతిని తోడి తెచ్చి నెయ్యంబునఁ
గూర్చుండ నియమించి, యాయిందువదనం జూచి యిట్లనియె.

76


క.

మన్నరుదాసుని సముఖముఁ
గన్నియరో! చేరినట్టి కార్యం బేమీ?
యెన్నఁగ పండో కాయో!
మన్ననతోఁ దెల్పవమ్మ! మరి కింపలరన్.

77


వ.

అనినఁ గాంతిమతికి విలాసవతి యిట్లనియె.

78


సీ.

పండెను నీకోర్కె ఫలియించె నీనోము
        కంజాక్షి! వినవమ్మ కార్య మిప్పు
డతివ! కళావతీసుతుని చెంగటి కేఁగి
        వెలయంగ నీకోర్కె విన్నవింప
సంతసంబున విని చాల నన్ లాలించి
        సుదతిచెల్వం బేముఁ జూచియుందు
మీ ఫాల్గుణోత్సవం బిది శేఖరింపుచు
        నాతిఁ బెండ్లాడెద నమ్ము మనుచు


తే.

నభయహస్తం బొసంగె నీ కబ్జనయన!
వెలల హెచ్చగు సొమ్ములు వేడ్క నొసఁగె
రేపె పెండ్లియు నని పల్కె నేపుమీర
సమ్మదంబున నుండుము సకియ! నీవు.

79


విలాసవతి చేసిన యుపకారమునకుఁ గాంతిమతి యామెను మెచ్చుకొనుట

వ.

అని పలికిన విలాసవతిం జూచి కాంతిమతి యిట్లనియె.

80

సీ.

చెలియ! [27]నీవను తేప గలిగియుండంగ నే
        నీవిరహాంబుధిఁ నీఁదగంటి
వనిత! నీవనెడు నంజనము గల్గఁగఁ బ్రియుం
        డనెడు నిక్షేపంబు నందగంటి
నతివ! నీవను కల్పలత గల్గ నామనో
        రథపలం బబ్బెను రమణమీర
కలికి! నీవను కామగవి గల్గియుండ నా
        [28]పాలయ్యె నానందలీల లెల్లఁ


తే.

గాంత! నీవు సేసిన యుపకారమునకు
నేనుఁ బ్రత్యుపకారంబు నెట్లొనర్తుఁ?
జెలఁగి నావద్ద నుండెడు చెలులలోన
నువిద! నీవంటి ప్రాణబంధువులు గలరె!

81


వ.

అని మఱియును.

82


క.

వేమారును బ్రియుమాటలె
భామామణి! మగుడ మగుడఁ బలుకు మటంచున్
దామరసేక్షణ నడుగుచు
సామజవరయాన యుండె సంతస మమరన్.

83


క.

శ్రీచెంగమలావల్లభ!
వాచంయమశినుతనామ! వరగుణధామా!
ఆచక్రవాళశైలధ
రాచక్రావనద! విజయరాఘవవరదా!

84


క.

సురసన్నుతనిజచరణాం
బురుహస్మరణప్రవీణభూరిగుణసుధీ
నిరవధికసుఖవిధాయక
గురుకరుణాలహరి! రాజగోపాలహరీ!

85


పృధ్వీ.

చతుర్ముఖసమర్చితా! సకలసంయమీంద్రస్తుతా!
నితాంతకరుణోన్నతీ! మఘవనీలనీలద్యుతీ!

రతిప్రియశతాకృతీ! విజయరాఘవక్ష్మాపతీ!
ప్రతీపనృపశిక్షకా! సుజనభాగ్యసంరక్షకా!

86


గద్య.

ఇది శ్రీమద్రాజగోపాలకరుణాకటాక్షవీక్షణానుక్షణప్రవర్ధమానసార
సారస్వతధురీణయు, విచిత్రతరపత్రికాశతలిఖితవాచికార్థావగాహనప్రవీ
ణయు, తత్ప్రతిపత్రికాశతస్వహస్తలేఖనప్రశస్తకీర్తియు, శృంగారరసత
రంగితపదకవిత్వమహనీయమతిస్ఫూర్తియు, అతులితాష్టభాషాకవితా
సర్వంకషమనీషావిశేషశారదయు, రాజనీతివిద్యావిశారదయు, విజయ
రాఘవమహీపాలనిత్యసంభావితయు, విద్వత్కవిస్తుతగుణసేవితయు,
పసపులేటివెంకటాద్రిబహుజన్మతపఃఫలంబును, మంగమాంబాగర్భశుక్తి
ముక్తాఫలంబును, రంగద్గుణకదంబయు, నగు రంగాజమ్మవచనరచనా
చమత్కృతిం జెన్నుమీరు మన్నారుదాసవిలాసం బను మహాప్రబంధంబు
నందుఁ దృతీయాశ్వాసము.


శుభమస్తు.

శ్రీరాజగోపాలాయ నమః.


  1. చెయ్యమర్చెద వేమి క. చెయ్యెమర్చెదవేమి
  2. చిలుక లివి
  3. వెరచితి క. వఱచితి
  4. నమ్మినదాన క. నమ్మినదానరా
  5. హెచ్చెన్
  6. క. గమ్మెడు
  7. కొదవ లింకును రాకుండ
  8. చిటుల గందపుపూఁత. క. చిటుల గందపుబూఁత
  9. లాలింపుచు
  10. యంతయున్ క. యంతయున్
  11. దానముల్ క. దానముల్
  12. సకుల, క. సఖుల
  13. ఈ కందపద్యమునకుఁ బూర్వము క. గ్రంథమున "అంతా" అను వచనము గలదు.
  14. దొరగించు
  15. భృంగారు. క. భృంగారు
  16. శామంతెలను. క. శామంతెలను
  17. కెదమ్ములను
  18. నాగోపాలున. క. నారాజగోపాలున
  19. శింగారంబై క. శింగారంబై
  20. తంజాపురా, క. తంజపురా
  21. క. నిగ్గుచే
  22. నొనరు. క. నెనరు
  23. సొద్య మందితి, క. సోద్య మందితి.
  24. క. నౌర
  25. మన్నరు. క. మన్నారు.
  26. తామసించినపుడె?
  27. నీపను తేప.
  28. *****