మన్నారుదాసవిలాసము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ రాజగోపాలాయ నమః

మన్నారుదాసవిలాసము

(పద్యకావ్యము)

పంచమాశ్వాసము

శ్రీలలనావిహరణహరి!
నీలమణీనర్మహర్మ్యనిజశుభవక్షా!
లాలితవరతనయ! శ్రీ
పాలనవిలసత్కటాక్ష! పద్మదళాక్షా!

1


వ.

అవధరింపుము.

2


రాజచంద్రునితో గలసి శ్రీనివాసతాతయాచార్యులు కాంతిమతీవిజయరాఘవుల వివాహమునకు ముహూర్తమును నిశ్చయించుట

క.

మన్నారుదాసుఁ డప్పుడు
వన్నెగఁ దననగరుఁ జేరి వైభవ మొప్పన్
గన్నెను మనమునఁ దలఁపుచు
నున్నతఱిన్ దాతయార్యుఁ డుత్సాహమునన్.

3


సీ.

విజయరాఘవధీర! విను నేడు నిశ్చయ
        తాంబూల మొనరింపఁ దగు దినంబు
హితుల మంత్రులఁ బురోహితులను గూర్చుక
        విడెము సాగించి యే వేడ్కవత్తు
నని పల్కి నగరముత్తైదువ లప్పుడు
        శోభనద్రవ్యముల్ సొంపుమీరు
కనకాంబరంబులు ఘనమైన కెంపుల
        ముడియుంగరంబులు ముదముతోడ


తే.

వెంటఁ గొనిరాఁగ వాద్యముల్ జంట మొరయ
నెలమి నారాజచంద్రుని యింటి కరిగి

యతఁ డెదుర్కొన బంధుసంతతులతోడ
విడెము సాగించి యెంతయు విభవ మలర.

4


క.

పంచమియు శుక్రవారము
నెంచఁ బునర్వసువు రాత్రి యేనవ ఘడియన్
మంచిముహూర్తము రేపని
పంచాంగముఁ జూచి పలికెఁ బార్థివుతోడన్.

5


పట్టణవివాహమంటపాలంకరణము


వ.

ఇట్లు ముహూర్తంబు నిశ్చయించి యాచార్యవర్యుండును మగుడి విజయ
రాఘవభూపాలుఁ జేరవచ్చి తాము నిర్ణయించిన ముహూర్తంబుఁ దెల్పి,
యధికారపురుషవరులం బిల్చి పురంబు రంగుమీరంగ శృంగారింపం బనిచిన.

6


సీ.

అపరంజిప్రతిమల హరువులు గనుపించు
        మేరువు మించిన మేరువులును
రాజవీథికల నిర్వంకలఁ జాలుగాఁ
        దీరైన దీపంపుఁ దేరుగములు
కనకాంబరపుమేలుకట్లతోఁ గనుపట్టు
        నుప్పరం బంటిన చప్పరములు
ప్రతిగృహద్వారపార్శ్వవినిర్మితంబు లై
        జెన్నుమీరినయట్టి చిత్తరువులు


తే.

తోయదంబులతో రాయు తోరణములు
శీతళామోదమలయజాసేచనములు
ధూపితాగరుసామ్రాణిధూపములును
[1]బరఁగ నొనరించి రప్పు డప్పట్టణమున.

7


వ.

మఱియును.

8

శ్రీనివాసతాతయాచార్యులు మన్నారుదాసునకు వివాహమంగళపూర్వాంగములను జరిపించుట; కంకణధారణము


శా.

బంగారంపుటరంటికంబములచేఁ బట్ట బరశ్రేణిచే
రంగన్మౌక్తికపద్మరాగతతులన్ రమ్యప్రసూనంబులన్
గంగానిర్మలచామరవ్రజములన్ గన్పట్టఁగా నచ్చటన్
శృంగారించిరి వేగఁ బెండ్లిచవికన్ జెల్వంబుమీరన్ గడున్.

9


వ.

అంత నారాజచంద్రమహీకాంతుండును నందం బగు నిజమందిరంబున రంగు
మీరఁ బెండ్లిచవిక శృంగారంబు సేయించె; తదనంతరంబ.

10


సీ.

సూర్యోదయంబున శుభముహూర్తంబున
        నాచార్యులు పురోహితాన్వితు లయి
యచట నాందీదేవతాహ్వాన మొనరించి
        పూజఁ గావింపుచుఁ బొలుపు మీర
మించి వాద్యంబులు మిన్నంది మ్రోయంగ
        సంగీతమేళంబు [2]సరసఁ జెలఁగఁ
బెండ్లిపీటను జాలఁ బ్రేమంబు వెలయంగ
        విజయరాఘవమహీవిభుని నుంచి


తే.

పొసఁగ నొడి నింపుచు ఫలతాంబూలములను
సేస వెట్టంగ శోభనశ్రీలు వెలయఁ
గాళ్ళగోరులు దిద్దించి క్రమముతోడఁ
జెలులు కొట్నంపుసుంకులు చెరిగి రపుడు.

11


వ.

మఱియు నమ్మహామహునకు.

12


సీ.

కరముల రతనాలకడియముల్ మోయంగ
        సంపంగినూ నంటె సకియ యొకతె
గరిమతో నిడిన శ్రీగందంపుటటకలిఁ
        గొనగోళ్ళ గీరెను గొమ్మ యొకతె
చెన్నుగా వాసించు పన్నీటిచేతను
        జలకంబు లార్చెనుఁ జాన యొకతె

చలువను మించిన జిలుగుదుప్పటిచేతఁ
        దడియొత్తె నప్పుడు పడఁతి యొకతె


తే.

వనిత యొక్కతె కురుల జవ్వాది యుంచెఁ
దొయ్యలి యొకర్తు సామ్రాణిధూప మొసఁగెఁ
దరుణి యొక్కర్తు నిలువుటద్దంబు పూనఁ
జెలువ యొక్కతె సొగసుగ సిగ యమర్చె.

13


వ.

ఇవ్విధంబున మంగళస్నానవైభవం బాచరించిన యాచెంగమలాంబికావర
కుమారుండు.

14


సీ.

రతనాలజంటిచే రహిమీరఁ గనుబట్ట
        బురుసారుమాల్ గట్టెఁ బొంక మమర
నొరపైన సిగమీఁద హొయిలుగాఁ గన్పించ
        హెచ్చైన ముత్యాలకుచ్చుఁ దాల్చె
మంజాడులను మించు మగరాలనిగరాల
        రంజిల్లునట్టి తురాయి బూనె
ముద్దునెమ్మోమున మురువుగాఁ గనుపించఁ
        దెలిముత్తియముల ముర్వులు ధరించెఁ


తే.

జెక్కుటద్దంబులందును జిగి చెలంగ
వీనులను గొప్ప చౌకట్లు వెట్టె వెలయఁ
జుఱుకు కెంపుదామకముల సొంపుమీరఁ
గంఠమున నుంచె వజ్రాలకంఠసరులు.

15


వ.

మఱియును.

16


క.

[3]బురుసాయిజారుమీఁదను
హరు వగు ముత్యాలజంటి నరచట్టపయిన్
[4]2మెఱుఁగైన రాజదుప్పటి
నెరయఁగ వజ్రాలవంకి నీటుగఁ దాల్చెన్.

17


సీ.

ఘనమైన నక్షత్రకంఠమాలికయును
        జెలువైన పచ్చలచిలుకతాళి
యింపుగా విలసిల్లు కెంపులపదకంబు

        నొఱపైన వజ్రాల యుత్తరిగెలు
పంచరత్నంబుల మించు బాహుపురులు
        తళుకైన రతనాల [5]తాయెతులును
రంగునీలంబుల రాణించు కడియముల్
        జీవరత్నంబుల చేసరాలు


తే.

తగిన వజ్రాలహంవీర [6]తాయెతులును
నొఱపుమీరిన కెంపుల యుంగరములు
బిరుదుపెండెంబు మొదలుగాఁ బేరుగలుగు
భూషణంబులు ధరియించెఁ బొలుపుమీర.

18


వ.

తదనంతరంబ.

19


క.

మంగళవాద్యంబులతో
బొంగుచు నుల్లభములోన భూసురవర్యుల్
రంగగు వివాహవేదిక
చెంగటికై రాణి దెచ్చి చెలు వమరంగన్.

20


సీ.

ఆవివాహపువేదియందు, నందంబుగ
        రాజితంబగు కల్పభూజ మునిచి
కనకవస్త్రంబుల గంధమాల్యముల నా
        భూసురవర్యులు పూజఁ జేసి,
హరిరాణితోడ బ్రహ్మాణి నింద్రాణినిఁ
        గొమరుమీరిన చిత్రకుంభములను
దగ నావరణదేవతలతోడఁ గూడంగ
        నావాహనముఁ జేసి యందముగను


తే.

బూజ గావించి యెంతయుఁ దేజ మమర
ద్వారమున వన్నెకోకలతోరణంబు
బాగుగ నమర్చి బంగరుపళ్లెరముల
నలు గమర్చిరి మిక్కిలి నవ్యముగను.

21


వ.

అంతట మఱియును.

22

ఉ.

బంగరుపెండ్లిపీఁటపయి బాగుగ మన్నరుదాసు నుంచి తా
రంగు చెలంగఁ దాతగురురాయఁడు కంకణ మొప్పఁ గట్టఁగా
మంగళవాద్యముల్ మొరయ మచ్చిక మీర నలంగు వెట్టి యు
ప్పొంగుచు నాసువాసినులు పొల్పుగ సేసలు పెట్టి రందఱున్.

23


కాంతిమతీవైవాహికాలంకరణము, కంకణధారణము

క.

నగరిపురోహితు లప్పుడు
మగువకుఁ గంకణముఁ గొనుచు మహిమ జెలంగన్
దగ రాజచంద్రునింటికి
మిగులన్ వాద్యములు దిశల మెండుగ మ్రోయన్.

24


వ.

చేరన్ వచ్చు సమయంబున.

25


సీ.

ఆరాజచంద్రుండు గారాపుపట్టిని
        బెండ్లిపీఠమునందుఁ బ్రేమ నునిచి
కోమలికినిఁ గాళ్లగో ళ్లప్డు దిద్దించి
        లత్తుకఁ బెట్టించి లలితముగను
గుసుమగంధులచేతఁ గొట్నంబు వెట్టించి
        సుంకులు చెరిగించి పొంకముగను
దాంబూలఫలములఁ దనయకు నొడి నించి
        సేసలు పెట్టుచు భాసురముగ


తే.

నలుగుఁ బెట్టించి మంగళస్నాన మపుడు
సంతసంబున నొనరించి యింతి రాఁగఁ
బణఁతి గైసేయుఁ డనుచును బల్కుటయును
గాంతిమతిఁ జేరి సకియలు క్రమముతోడ.

26


సీ.

పాపటఁ దీర్పుచు బాగుగా నప్పుడు
        కోమలికినిఁ బెండ్లికొప్పు వెట్టి
బంగారుపువ్వుల పావడమీఁదను
        రమణికిఁ [7]బీతాంబరంబు గట్టి
జాళువాపనిహర్వు చాల రాణించఁగా

        రామకు ముత్యాలరవికఁ దొడిగి
విదియచందురు మీరు నుదిటిపైఁ దీరుగా
        సుదతికి జాతికస్తూరి దిద్ది


తే.

యువిదకన్నులఁ గాటుక నొప్పఁ దీర్చి
పొలఁతిచెక్కిటిపై దృష్టిబొట్టుఁ బెట్టి
వనితవీనుల జవ్వాది నొనర నుంచి
యిందుముఖిమేనఁ గుంకుమగంద మలది.

27


సీ.

పాపటబొట్టు చొప్పడు సూర్యచంద్రులు
        నొప్పుమీరు తురాయి కొప్పుబిల్ల
నవరత్నములకుచ్చు బవిరెలు మురువులు
        [8]ముత్యాలకమ్మలు ముక్కఱయును
గంటగరుల్ ముద్దుకంటెయుఁ దాళియు
        నొఱపైన కుతికంటు నుత్తరిగలు
దండలు మరి పత్తికాయ తాయెతలును
        [9]ముత్యాలగాజులు మొగ్గగాజు


తే.

లలరు కెంపులగాజులు తళుకుగాజు
లల్ల నులిగాజులును దగు హస్తకడియ
ములును జేకట్లు చేసరంబులును మఱియు
లలితముగ మించు హస్తపల్లవము లమరు.

28


సీ.

పంచరత్నంబుల బటు వుంగరంబులు
        నొనరఁ బచ్చలచిల్కయుంగరములు
మురువుమీరినయట్టి ముద్దుటుంగరములు
        రంగైన శింగాణియుంగరములు
రహిమించునట్టి వజ్రాలయొడ్డాణంబు
        యల్లికమొలతాడు నందమయిన
గంటల మొలనూలు కడువిం(త బంగరు)
        (వన్నెల)నూళ్ళును వన్నెగలుగు


తే.

కాళ్లకడియంబు లందియల్ గజ్జియలును
పొడగ(మ్ములు) మెట్టెలు పాదసరులు

గండెమీలును బొబ్బిలికాయ లమరు
వీరముద్రిక లాదిగా వెలసినట్టి.

29


క.

వెలలేని భూషణమ్ములఁ
జెలువము కడు మీరునట్లు శృంగారింపన్
గలకంఠి కాంతిమతి యపు
డలరె న్మకరాంకు మోహనాస్త్రములీలన్.

30


వ.

అంతట నా రాజచంద్రమహీకాంతుండును నాభూసురవర్యులు భాసుర
వైభవంబుల గొనివచ్చిన కంకణంబుఁ బొంకంబుగాఁ దనపుత్రికరంబునఁ
గట్టించి సంభావించిన యనంతరంబ యాపురోహితులు నవ్విజయగాఘవ
మహీకాంతుని చెంతకు వచ్చి వివాహలగ్నంబు చేరన్ వచ్చె నని
విన్నవించిన.

31


మన్నారుదాసుఁడు వైభవము చెలఁగ వివాహమంటపము చేరుట, రాజచంద్రుండు సగౌరవముగా నతని నాహ్వానించి కన్యాదానము చేయుట

క.

చెందిన వేడుకతో నిజ
నందనునకుఁ దాత (గురుఁడు) నైపుణి మీరన్
జందురునిఁ బోలు మోమున
కందంబుగ భాషికంబు నమరం గట్టెన్.

32


వ.

అంత.

33


సీ.

ఐరావతము లీల నందమై కనుపట్టు
        తెల్లయేనుగ నెక్కి తేజ మమర
మేలైన హొంబట్టు మేల్కట్టు పూవుల
        చప్పరం బొప్పుగా సవదరింప
నిరుగడలందును నెడలేక పట్టిన
        ముత్యాలగొడుగుల మురువు దనరఁ
బున్నమనెలరీతి వెన్నెలల్ వెదజల్లు
        పగలువత్తులకాంతి మిగుల నిగుడ


తే.

బాణవిద్యలు దిక్కుల భాసిలంగఁ
దీరుమీరిన దీపంపుఁదేరు లమర

హృద్యవాద్యనినాదంబు లెక్కుడుగను
సర(సచతు)రంగబలములు సందడింప.

34


క.

ముందఱ ముత్తైదువగమి
పొందుగ ఫలమాల్యములను బొసఁగిన వేడ్కన్
సందడిగఁ బూని నడవఁగ
నందంబుగ విజయరాఘవాధిపుఁ డంతన్.

35


క.

పురమునఁ గల జను లెల్లను
దరచుగ నందంద నిండి తనుఁ గనుఁగొనఁగా
వరవైభవముల మీరిన
గురిదొర లిరుగడలఁ జేరి కొలువఁగ వేడ్కన్.

36


వ.

హజారంబు చేరన్ వచ్చు సమయంబున.

37


క.

ఆ రాజచంద్రనృపతియు
నారూఢిగఁ దనదు బాంధవావళితోడన్
గౌరవము దగ నెదుర్కొనె
శ్రీరంజిలఁ జేరి నుతులు సేయఁగ విబుధుల్.

38


క.

వరుఁడైన విజయరాఘవ
ధరణీశ్వరుఁ డపుడు సమ్మదంబు జెలంగన్
గరిరాజు డిగ్గె వేడుక
కరమొప్పఁగ దొరలు చేరి కైలా గొసఁగన్.

39


సీ.

జననుతుఁ డగు రాజచంద్రనృపాలుండు
        ముదముతో నీగతి నెదురుకొనుచు
నెలమి ముత్తైదువ లెదురుసేసలుఁ జల్ల
        విజయరాఘవమహీవిభుని వేడ్కఁ
బెండ్లిచవిక జేరఁ బ్రియముతో దోడ్తెచ్చి
        కనకపీఠంబున గరిమ నునిచి
మన్ననా రితఁడని మదిని భావింపుచుఁ
        బదముల్ గడిగి మధుపర్క మొసఁగి

తే.

తెఱవ లిరువురు బంగరుతెర ధరింప
నపుడు రతనాల [10]బాసికం బమరఁ బూను
తనయఁ డోడ్కొనివచ్చి యాధరణివిభుఁడు
కులసతియుఁ దాను మిక్కిలి కోర్కెతోడ.

40


క.

ఘనవాద్యంబులు మ్రోయఁగఁ
దనరఁగ ముత్తైదువలును ధవళముఁ బాడన్
మొనసి పురోహితు లప్పుడు
ఘన(తరముగ) మంగళాష్టకంబులుఁ జదువన్.

41


క.

ఘనమణిభూషణసహితయుఁ
గనకసమన్వితయు నైన కన్యామణి నే
మనమున మన్నారునుగా
నిను భావన జేసి యిత్తు నెలకొన శుభముల్.

42


వ.

అని పల్కి.

43


క.

సరిలేని దివ్యరత్నము
వరదక్షిణగాఁగ నొసఁగి వరునకు వేడ్కల్
బరఁగఁగ నీతఁడె హరి యని
వరపుత్రిక ధారవోసె వాంఛిత మమరన్.

44


వధూవరపరస్పరావలోకనము

సీ.

అత్తఱి సుముహూర్త మనుచు నయ్యాచార్యు
        లించువేడుక హెచ్చరించి నపుడె
విజయరాఘవమహీవిభుఁడు కాంతిమతియు
        నొండొరుఁ జూచుచు నుండువేళఁ
జూపులన్ కలువల సుదతి యప్పుడు పతి
        పాదముల్ పూజించు పగుది నుండెఁ
బతి జూపు లప్పు డప్పణఁతిలావణ్యాభి
        బెళఁకు బేడిస లనఁ బొలుపుమీరె

తే.

మఱియు సతిజూపు లను తేంట్లు వరునిచరణ
సరసిజంబులపై వ్రాలు చంద మొందె
విభుని నునుచూపు నీలముల్ వెలఁది కపుడు
దనర నుంచిన యల దృష్టిదండ లయ్యె.

45


మాంగల్యధారణము, తలఁబ్రాలు, సప్తపది, బువ్వము

వ.

అంత.

46


తే.

ఎలమిని మదీయజీవనహేతు వైన
యట్టి మాంగల్యతంతువు నమరఁ బూని
కోరికలు (మీర నను) గూడి వారిజాక్షి!
యింపుతోడుత ధాత్రి వెయ్యేండ్లు మనుము.

47


వ.

అని పలికి.

48


క.

పొంగుచు నప్పుడు మిక్కిలి
బంగురు శంఖంబు మించు భామగళమునన్
మంగళసూత్రముఁ గట్టెను
రం గలరెడులీల విజయరాఘవుఁ డెలమిన్.

49


సీ.

విజయరాఘవమహీవిభుఁడు ముందుగ నింతి
        శిరసునఁ దలఁబ్రాలు చెలఁగి నించె
నిందుముఖియు నించె నెలమితోఁ దలఁబ్రాలు
        మన్నారుదాసుని మస్తకమున
మునుకొని తలఁబ్రాలు ముదముతో నిరువురు
        నొండొరుపై నించి రొనర నంత
రఘునాథతనయుండు రాజచంద్రుని పుత్రి
        కెంగేలుఁ దనకేల గీలుకొల్ప


తే.

రంగుమీరఁ బురోహితుల్ కొంగుముళ్లు
సవదరించి రారాజును సంతసమునఁ
బ్రియసతియుఁ దాను నటఁ బెండ్లిపీటమీఁదఁ
జెలఁగి కూర్చుండె శోభనశ్రీలు వెలయ.

50


వ.

తదనంతరంబ.

51

సీ.

వేదమంత్రంబుల విప్రు లావేళను
        దెరఁగొప్ప నగ్నిప్రతిష్ఠ సేయ
సరసంబుగా భావమరదు లప్పుడు జేరి
        లాజ లందియ్యంగఁ దేజ మమర
మన్నారుదాసుఁ డామగువచేతను లాజ
        హోమంబు సేయించె నువిదతోడఁ
దనరంగ నగ్నిప్రదక్షిణ మొనరించి
        యింతిపాదంబుఁ దా నెలమిఁ బట్టి


తే.

సప్తపదములు మెట్టించి సతియుఁ దాను
నయిదువతనంబు(నే యో)డ కలరసేయు
నల యరుంధతిదర్శన మాచరించి
పెండ్లిపీటను గూర్చుండి ప్రేమమీర.

52


క.

అం దపుడు వధూవరులకుఁ
బొందుగ (నట) నించి చాల పొలుచు ఫలములన్
డెందంబులోన నెంతయుఁ
జెందిన వేడుకను గురుఁడు సేసలుఁ బెట్టెన్.

53


వ.

మఱియును.

54


సీ.

జననుతుం డగు రాజచంద్రనృపాలుండు
        మన్నెవారలును సామంతవరులు
మహినిఁ బ్రసిద్ధు లౌ మండలాధిపులును
        రహికెక్కు రాజాధిరాజవరులు
పేరుగల్గినయట్టి పెద్దముత్తైదువ
        ల్పొగడొందు నాచార్యపురుషవరులు
అల్లుండు తనయులు హసముదొరల్ మఱి
        హితులు మంత్రులు పురోహితజనంబు


తే.

నాదిగాఁ గల్గు తనవార లందముగను
జేరి రతిమన్మథుల మించుచెలువు గలుగు
దంపతుల కప్పు డెంతయు సొంపుమీర
సేసవెట్టిరి శోభనశ్రీలు చెలఁగ.

55


వ.

తదనంతరంబ.

56

క.

బంగరుపళ్లెములోపల
రంగుగఁ పరమాన్న మునుప రాజసమున న
య్యంగనయుఁ దాను మది ను
ప్పొంగుచు బువ్వము భుజించె భూవిభుఁ డెలమిన్.

57


భోజనవచనం

అంత నమ్మరునాఁడు రాజచంద్రమహీకాంతుండు విజయరాఘవనృపాలు
చెంతకు వచ్చి బంధుపరిజనంబులతోడం గూడ మీర లిందు విందారగించవలె
నని విన్నవించిన, మన్ననమీర నామన్నారుదాసమహీపాలుండును నట్ల
కానిమ్మని యంగీకరించి, చుట్లనున్న మంత్రిసామంతమహీకాంతప్రము
ఖులు వింతశృంగారంబు మీరఁ దనచెంతఁ జనుదేర, సామాణిధూపధూమ
రమణీయంబును, తమ్మటపటహధవళశంఖాదినానావిధవాద్యసంఘసంకులం
బును, అంగనాజనసంగీతభంగీతరంగితంబును, రంభాస్తంభసంభావితద్వార
దేశంబును, కంజనయనామంజీరశింజితరంజితంబును నగు నొక్కభవన
రాజంబునకు వచ్చి యచ్చట నాణిముత్యంబుల రాణింప రంగుమీరు రంగ
వల్లిక లమర్చిన చొక్కం బగు నొక్కయెడ రంగారు బంగారుటనఁటి
యాకులును, వన్నెగలుగఁ దీరిన పసిఁడిగిన్నియలును, మిన్నగల దొన్నె
లును, తీరుమీరు కోరలునుంచి దొడ్డ యడ్లిగలమీఁద నిద్దంపుటపరంజిపెద్ద
పళ్లెరంబు పెట్టి, ఆ యోర నెంచదగు నంచలరీతిని మెండుగల గండుమీల
లీలను, గండభేరుండంబులకైవడిఁ జేసిన నవరత్నమయంబు లగు గిండుల
నిండ గంధోదకంబులు నించి, యందంద తక్కినదొరల కందఱికి నపరంజి
యనఁటియాకులును, హరివాణంబులు నమర్చియున్నం గని యామన్నారు
దాసమహీపాలుఁడు హెచ్చువెల పచ్చరాపీటపయిం గూర్చుండే. తక్కిన
బంధుపరిజనవర్గంబులు బంతులై యథోచితంబుగాఁ గూర్చున్నయనంతరంబ,
సంతసంబున నింతులు తేటపన్నీటఁ గరాంబుజంబులుఁ గడిగి, పసిండిచట్టులు
చట్టువంబులు మొదలగు విచిత్రంబు లగు పాత్రంబులు పాణిపద్మంబులం
బూని, యల్ల విజయరాఘవనృపాలపళ్లెరంబు మొదలుకొని సకలనృపాల
పాత్రంబుల నొప్పుగల కప్పురపుభోగివంటకంబును, మెప్పుగల పప్పులును,
హృద్యంబు లగు సద్యోఘృతంబులును, గొప్ప లగు నప్పడంబులును,
నూరారువగల నింపుగల తాలింపుఁగూరలును, నుల్లంబు రంజిల్లఁజేయు
బీరంజియును, నెక్కుడు వాసనలు గలుగ వండిన కుక్కుటాండంబులును,
పసిమిపస దియ్యని తియ్యగూరలును, కారమ్ము లగు కమ్మఁగూరలును,
రుచుల మేలిమిగల పాలకోడియును, పొంక మగు కుంకుమకోడియును,

వాసనలన్ గనుపట్టు కట్టుకోడియును; మేలింపుగలిగింపు తాలింపులుగ
వండిన పొడపిట్ట, పొడగువ్వ, తీతువు, బాతువులును, పరిమళంబులం
బూరించు సంబారంపుకోడియును, మృదుగుణంబుగల పొదుగుడు కోడి
యును, నేరుపులు మీర నూరుపులుగ వండిన యుల్లంకి నేలనెమలి (తావి
ఠేవ)వలచు, చాల బాళిం దేలించు జాళెనంజుడును, దండిరుచి నిండియుండు
గండెమీలును, పలువగల రుచులకు నెలవగు నులువకో(డియును), (చా)ల
మేలు గలుగు వాలుగలును, కారంబుమీరు సన్నకారిజంబుల యూరుపు
లును, పొడికారిజంబుల కూరలును, పొట్టికాకరకాయల తలమెట్టు పిట్టల
తలలయూరుపులును, పొడినల్లలును, దిరినల్లలును, చిక్కుడుగాయలుఁ
గూర్చి చొక్కంబుగా వండిన తియ్యదనంబుగల రొయ్యలును, అరఁటి
బొందెయందంబున నూర్పుగా వండ నోరూరించు బలుగుణములుగల
మలుగుమీలును, అరఁటిపూలలీలఁ బొలుచు నులుచలును, కూశ్మాండ
ఖండంబులరీతి మెచ్చుగా నచ్చులుగ గోసి వండిన వరాహమాంసఖండం
బులును, మారువాలపడిదంబును, బిల్లలుగ వండిన జెల్లలును, నొమ్ముగల
బొమ్మడాయల చారులును, నొప్పుగల యుప్పురసంబులును, రుచుల
నివ్వటిల్లు గువ్వలయానంబును, ప్రతిలేని యతిరసంబులును, గుత్తు లగు
సారసత్తులును, చొక్కంబు లగు [11]చక్కెరబుగడలును, నొప్పుమీరు నప్పం
బులును, రాణగల పేణగములును, బ్రణుతింపఁదగు మణుఁగుబూవులును,
నెక్కు డగు చక్కెర [12]మండెగలును, ఆసగొలుపు నూసువులును, రాణించు
పేణీలును, దండిగల మెఱుంగుమండెగలును, పసిమిపసగలుగు గసగసల
మండెగలును మెచ్చువచ్చు నచ్చుకజ్జాయంబులును, (పొగడఁద)గు పొగడ
పూవుల కజ్జాయంబులును [13]లేమిగలు పాలకజ్జాయంబులును, మెరుఁగులు
గల నురుగులును, చిత్రంబు లగు నేత్రంబులును, గరగరికలుగల గరవడలును,
సాంద్రంబు లగు చంద్రకుండంబులును, తెప్ప లగు పప్పురొట్టెలును, బొంగ
రంబులు [14]నంగరొల్లెలును, లడ్డుకంబులు, నిడ్డెనలును, మిన్నగల జున్ను
లును, మిక్కిలి యగు నుక్కెరలును, నెన్నఁదగు పన్నీరుపాయసంబు
మొదలగు పాయసంబులును, రసాయనంబులును, జీనిచక్కెరలును, కండ
చక్కెరలును, వీక్షాప్రియంబు లగు ద్రాక్షాఫలంబులును, నిర్జితసుధారసంబు
లగు ఖర్జూరఫలంబులును, పలువగల కలవంటకంబులును, జంటలుగ
దొడ్డుగా వడ్డింప, నకుంఠరుచులు మెఱయ, నాకంఠంబుగా భుజియించి,
సారంబు లగు క్షీరంబులు గ్రోలి, పొడము బడలికల నొరగి చిఱుచెమట
లడఁగ విసరుకొనుచు, లేచి కరంబులకు [15]వార్చిరి; యవ్వేళ నవ్విజయ

రాఘవవిభుండును, నతిరాజసంబునఁ బ్రతిలేని రతనంపుగద్దియమీఁదఁ గొలు
వుండు నవసరంబున.

58


వ.

రాజచంద్రనృ(పాలకుండు).

59


తే.

కుంకుమంబును గస్తూరి సంకుమదము
కుందనపుగిన్నియల నించికొంచు వచ్చి
నొనరు మన్నరుదాసున కొసఁగి వేడ్క
బంధు(వర్గంబు)లకు నిచ్చెఁ బ్రౌఢి మెఱయ.

60


వ.

మఱియును.

61


క.

తెల్లని యాకుల కవిరెలు
మొల్లపువాసనల పోఁకముళ్ళును జాళ్వా
పళ్లెరములందు నింపుచుఁ
గొల్లలుగా నిచ్చె బంధుకోటుల కెల్లన్.

62


నాగవల్లి

వ.

ఇవ్విధంబున వివాహోత్సవంబు నివ్వటిల నాలవ దినంబున.

63


సీ.

అందంబు మీరంగ నాచార్యవర్యుండు
        నాగవల్లి యొనర్చు నయముతోడఁ
[16]బంచవన్నెల నిగ్గు బాగుగాఁ గనుపట్టఁ
        బ్రోలు వ్రాయింపుచుఁ బ్రోదిగాఁగ
నలుదిక్కులను జిత్రకలశముల్ హవణింప
        [17]జోతుల దీపముల్ సొరిది వెలయఁ
బరఁగ నుప్పేనుఁగఁ బప్పేనుఁగల వ్రాసి
        యిరుగడలందును నింపునింపఁ


తే.

బూని వేమరు నాగపసానిచేత
దేవతల పూజ సేయించి ఠీవి మెఱయ
శేషహోమంబు గావించి చెలువుగాఁగ
దంపతులఁ బెండ్లిపీఁటపైఁ దనర నిల్పె.

64

వ.

అంత.

65


క.

వేమరు మంత్రముఁ జెప్పుచుఁ
గోమలికిని నాగవల్లి కుతికం టమరన్
బ్రేమంబుమీరఁ గట్టెను
శ్రీ మెఱయ విభుండు బుధులు జేరి నుతింపన్.

66


సీ.

ఆచార్యవర్యుండు నప్పుడు ప్రోలున
        కిరుగడ నవ్వధూవరుల నునుప
నుప్పేనుఁ గిచ్చెదఁ బప్పేనుఁ గిమ్మని
        విజయరాఘవమహీవిభుఁడు బల్క
సిగ్గుచే నయ్యెడఁ జెలఁగి నా యేనుఁగ
        పదిలక్ష లని పల్కె భామ నగుచుఁ
బప్పేనుఁ గిచ్చెద నుప్పేనుఁ గిమ్మని
        పెండ్లికూఁతు రడుగఁ బ్రేమమీరఁ


తే.

గొమ్మ! నా యేనుఁ గిది పదికోటు లనుచుఁ
బలుక మన్నారుదాసుఁ డాపడఁతితోడ
నతులితామోదమునను దంపతులఁ జూచి
నవ్వి రందఱు కలకలనాద మెసఁగ.

67


వ.

అంతట.

68


సీ.

రతనాల కడియంబు రహిమించు ముక్కఱ
        హేమకుంభమునందు నెసఁగ నుంచి
దంపతు లయ్యెడ నింపుమీరెడు వేడ్కఁ
        గూరాడునీరాడు కూర్మిఁ దొణఁకఁ
గడియంబు ముంగర కలికిచేఁ దగిలిన
        నింతిచే మీఁదని యింతు లనిరి
మఱియొకసారి యామన్నారుదాసుండు
        పడఁతిచేఁ జిక్కిన కడియ మపుడు


తే.

గోట నొక్కుచుఁ దాను గైకొన్నయపుడె
చాల హాసంబు చేసి యాచార్యవరుఁడు
విజయరాఘవమేదినీవిభుని చెయ్యె
మీఁ దటంచును బల్కెఁ బ్రమోద మమర.

69

పాన్పు

సీ.

విజయరాఘవమహీవిభుఁడు దా నప్పు డ
        య్యింతితోఁ గూడి పాన్పెక్కి వేడ్క
దంపతులకు నెల్లఁ దాంబూలఫలములు
        వరుసగా నొసఁగుచు వైభవమున
భాసురలీల సువాసినీజనులకు
        మూసి వాయనములు ముదిత యొసఁగ
బంగారుతొట్లఁ దా రంగుమీరఁగఁ బట్టి
        లాలి యూఁపుచు శుభలక్షణముగఁ


తే.

బగిదిఁ బెట్టించుకోవలె బాగుమీరఁ
బద్మలోచన! బాలునిఁ బట్టు మనియె
[18]బొక్కసము నించి వచ్చెద భూపవర్య!
బాలు నిటు బట్టు మనియెను భామ వేడ్క.

70


క.

ఆచార్యపురుషు లప్పుడు
నాచార్ తిరుమొళియు జదువ [19]నారికడంబున్
ధీచతురత దొల్లించిరి
ఆచార్యులు హెచ్చరింప నందము గాఁగన్.

71


రాజచంద్రుఁడు వధూవరులకు బహుమతుల నొసంగి, పుత్రికకు బుద్ధులు సెప్పుట

సీ.

రాజచంద్రవిభుఁడు రతనాలకడియముల్
        కడు నించు ముత్తెల కంఠసరులు
ఘన మైన చౌకట్లు కంఠమాలికయును
        వెలహెచ్చు చుఱుకు కెంపులతురాలు
పలకవజ్రంబుల బాగైన పదకంబు
        చెలు వైన పచ్చల చిలుకతాళి
పగడంపుపిడివంకి బలవైరివజ్ర మన్
        పేరు గల్గినయట్టి పెద్దకత్తి

తే.

[20]ప్రబలు నైరావతము మించు భద్రకరులు
నఖిలలక్షణయుతజవనాశ్వములును
హేమగిరి నైనఁ దృణముగా నిచ్చునట్టి
యల్లునకు నిచ్చె నప్పుడు [21]హరుషమునను.

72


వ.

అనంతరంబ.

73


సీ.

వెలలేని తొడవులు వింతలౌ కోకలు
        రవికెలు పాపడల్ రంగుమీరు
రతనాల మంచముల్ రాణించు పఱపులు
        చెలువైన యొరగులు తలగడలును
బాగుమీరినయట్టి బంగారుబొమ్మలు
        పంచవన్నెచిలుకపంజరములు
కస్తూరివీణెలు గందంపుమానులు
        జవ్వాదిపిల్లులు జాలిపీఁట


తే.

చెలుల దాదుల మఱియు దాసీజనంబు
పరఁగఁగా నిచ్చి తనముద్దుపట్టి కపుడు
ఘనతచేఁ బదిలక్షల గ్రామములను
బసుపునకు నిచ్చి యెంతయుఁ బ్రాభవమున.

74


క.

అక్కా! దగ్గఱ రమ్మని
యక్కునఁ జేర్చుకొని చాల హర్షము మదిలో
నెక్కొనఁగ శిరసు మూర్కొని
చక్కని తనపట్టిఁ జూచి జనకుం డనియెన్.

75


సీ.

ప్రేమతో నినుఁ బిల్చి ప్రియుఁ డొసంగక నీవె
        వివరించి మున్పుగా వేఁడకమ్మ!
బహుమానముగఁ బిల్చి పతి నీకొసంగినఁ
        గొంచె మంచును నీవిఁ గొసరకమ్మ!
నెసరుతో రమణుండు నినుఁ బిల్వ నంపిన
        నేయెడలను జాగు సేయకమ్మ!
ప్రాణవల్లభుఁడు నిన్ రావింపకయమున్న
        బలిమి దగ్గఱబోయి నిలువుమమ్మ!

తే.

భర్త లాలించె నని హెచ్చి పలుకకమ్మ!
మగని మాటలకును మారుమలయకమ్మ!
ప్రాణనాయకు మతమె చేపట్టవమ్మ!
విభుఁడె దైవం బటంచు భావింపవమ్మ!

76


అప్పగింత

క.

అని యిటువలె బోధించిన
మనమున హర్షించి మిగుల మమతలు హెచ్చన్
వినయంబుమీర మ్రొక్కెను
తనతండ్రికిఁ గాంతిమతియుఁ దద్దయు భక్తిన్.

77


క.

మ్రొక్కిన పుత్రిక నప్పుడు
గ్రక్కున దీవించి మిగుల గౌరవ మొప్పన్
మక్కువ నాచార్యునకును
మ్రొక్కింపుచు నపుడు బలికె ముచ్చట మీరన్.

78


సీ.

ఆచార్య! నిను నమ్మి యాత్మజ నిచ్చితి
        బాల యేమెఱుఁగని గోల గనుక
[22]వేమారు మీతోడ విన్నవించెదను మీ
        ప్రియపుత్రుతోఁ దెల్పి ప్రేమమీర
సవతు లిందఱిలోనఁ జాల మన్ననమీర
        నాపట్టిఁ జేపట్టి [23]నడపు మనుము
బహుతపంబు లొనర్చి బాలను గన్న యా
        మమతఁ బల్కెదఁ బలుమారు నేను


తే.

మాకుఁ బనియేమి యిక తండ్రిమారు నీవు
మేల్మిమీరఁగ నడపిన మీకె ఘనత
యనుచు వినయోక్తులను బల్కి యానృపాలుఁ
డొప్పుమీరఁగఁ గన్నియ నొప్పగించె.

79

సీ.

అల్లునివద్దికి నంత నెంతయు వేడ్కఁ
        దనయఁ దోడ్కొనివచ్చి వినయ మమర
విజయరాఘవభూప! వినవయ్య నామాట
        బరఁగ మే మొనరించు భాగ్యమహిమ
[24]నల్లుఁడ వైతి వీ వందఱు గొనియాడ
        ధన్యుండ నైతిని ధరణిలోన
మమత నే సాఁకిన మందెమేలంబునఁ
        జెల్లుబడిగ నుండు నుల్లమునను


తే.

నేర్పునేరము లన్నియు నీవె యోర్చి
కరుణమీరఁగ నేలుమీ కన్య ననుచుఁ
దనర నప్పుడు మన్నారుదాసునకును
నొప్పగించెను మదిఁ బ్రేమ యుప్పతిలఁగ.

80


కాంతిమతిని దల్లి యాశీర్వదించుట; వధూవరు లూరేఁగుట

వ.

అయ్యవసరంబున.

81


సీ.

బంగారు తెంకాయ పండ్లును బసుపును
        దాంబూలములు క్షేమతండులములు
నొప్పైన రతనాల యొడిగట్టు గిన్నెయు
        నొడి బాలకృష్ణుని నొనరఁ దెచ్చి
తల్లి దా నొడి నించి తన ముద్దుపట్టినిఁ
        గౌఁగిటఁ జేర్పుచు గారవమున
వెలయంగఁ బతిఁగూడి వెయ్యేండ్లు మనుచును
        దనయులఁ గనవమ్మ తల్లి! నీవు


తే.

చెలఁగి పతిసేవ సేయుచు స్థిరముగాఁగ
వన్నె వాసియుఁ దేవమ్మ! వంశమునకు
సవతు లందఱు గొనియాడ జగతిలోన
సాటిలేకనె వర్ధిల్లు చల్లఁగాను.

82


వ.

అని దీవించిన.

83

క.

అప్పు డల రాజచంద్రుఁడు
ముప్పిరిగొను ప్రేమఁ దనదు ముద్దులపట్టిన్
రప్పించి మిగుల వేడుక
నొప్పగు పల్లకిని నుంచి యూఱడఁ బలికెన్.

84


వ.

తదనంతరంబ.

85


సీ.

విజయరాఘవమహీవిభుఁడు సంతసమున
        దెల్లయేనుఁగ నెక్కి తేజ మమరఁ
గొమరుగా ముత్తెలగొడుగులు బట్టంగ
        నుభయచామరములు నొనరు వీవ
మేళవాద్యంబులు మిన్నంది మ్రోయంగఁ
        బగలువత్తుల కాంతి ప్రబల మిగుల
నెడలేక దివ్వటిల్ హేరాళముగఁ బూన
        బాణవిద్యలు చాల భాసిలంగ


తే.

సరసచతురంగబలములు సందడింపఁ
బ్రజలు చూడంగఁ గన్నులపండువుగను
వనితయును దాను నూరేఁగి వచ్చి యపుడు
మన్ననారుల సేవించుచెన్ను మీర.

86


క.

ఏనుఁగను డిగ్గి యప్పుడు
మానినియునుఁ దాను మిగుల మచ్చికమీరన్
గానుకలు వేడ్క నొసఁగుచు
శ్రీనిధి మన్నారులకును జెలఁగుచు మ్రొక్కెన్.

87


క.

మదమున నంబులు దనకున్
ముదితకుఁ దీర్థప్రసాదములు సాధింపన్
బొదలెడు భక్తిన్ జేకొని
హృదయము వికసింప మగుడ నేనుఁగ నెక్కెన్.

88


వ.

ఇవ్విధంబున నవ్వసుమతీశ్వరుండు జవ్వనియునుం దాను నూరేఁగి వచ్చి
సుముహూర్తంబున.

89

క.

నగరిహజారముచెంగటఁ
బొగడఁగ నేనుగను డిగ్గి భూవిభుఁ డమరన్
దగ నింతి చెట్ట బట్టుక
జిగి మించిన పెండ్లిచవికెఁ జేరఁగ వచ్చెన్.

90


క.

అంగనయుఁ దాను నప్పుడు
బంగరుపీఁట న్వసించి భామలు మది ను
ప్పొంగుచు సేసలువెట్టఁగ
[25]రంగలరుచు నుండె విజయరాఘవుఁ డంతన్.

91


పడతులు శయ్యాగారము నలంకరించుట; సంయోగవియోగశృంగారములు

సీ.

బంగారుపడకింట బాగుగా నొకయింతి
        రతనాలమంచంబు రహి నమర్చె
సొగసుమీరిన యొక్కశుకవాణి కుంకుమ
        పూలపాను పమర్చెఁ బొంకముగను
మిక్కిలివేడ్కచే మెలఁత యొక్కతె పట్టు
        తలగడ లమరించెఁ జెలువుమీరఁ
గోమలి యొక్కతె కూర్చినజూజులుఁ
        జప్పరంబునఁ గట్టె నొప్పుగాను


తే.

మఱియు నొకకొంద ఱతివలు తఱచుగాను
గందమును గుంకుమంబును గస్తురియును
జాతిపన్నీరు నరవికిసరులు సురఁటి
నిలువుటద్దంబు లచ్చట నిలిపి రెలమి.

92


క.

అంగనలు కేళిభవనము
శృంగారించితిమి యనుచుఁ జెలువుగఁ దెలుపన్
బంగరుమంచముమీఁదను
రంగలరుచు నుండె విజయరాఘవుఁ డంతన్.

93

క.

కాంతిమతిఁ దోడితెమ్మని
యింతులతో విజయరాఘవేంద్రుఁడు బలుకన్
గంతునిచెంతకు నల రతి
కాంతను దోడుకొనివచ్చుక్రమ మమరంగన్.

94


క.

ఎంతయు నీభవనము కడు
వింతగు శృంగారములను వెలసెను జాలన్
సంతసమునఁ గనుగొందము
కాంతిమతీ! రమ్మటంచుఁ గాంతలు బలుకన్.

95


సీ.

సిగ్గుచే నప్పుడు చిఱునవ్వు నవ్వుచు
        భామలు తనుఁ బిల్చు భావ మెఱిఁగి
ఘల్లుఘల్లని పాదకటకముల్ మోయఁగా
        రాయంచనడపుల రంగుమీర
రతనాలకమ్మల రహిమించు కొంతులు
        చెక్కుటద్దంబులఁ జికిలిసేయఁ
దీరైన యాణిముత్తియముల హారముల్
        కులుకుగుబ్బలమీద గునిసియాడ


తే.

[26]అసదుఁ గౌ నసియాడఁగా నందముగను
వేడ్కతో వచ్చి యచ్చట విభునిఁ జూచి
సిగ్గు మురిపెంబు ప్రేమయుఁ జెలగ నపుడు
మగువ యపరంజికంబంబు మఱుఁగుఁ జేరె.

96


వ.

ఆసమయంబున.

97


సీ.

[27]ఇంత సిగ్గేటికే? యింతిరో నీకని
        సంతసంబునఁ బల్కె సకియ యొకతె
[28]వనితరో! నేను నీమన సెఱుంగనే యని
        సరసమాడుచు బల్కె తరుణి యొకతె
జాగేల సేసెదు? జాణరో! నీ వని
        ముద్దుగులుచు బల్కె ముదిత యొకతె
కంబము చాటేల? కాంతరో! నీ కని
        మగువ, యొక్కతె బల్కె మచ్చి కలర

తే.

నింత బూటక మేలనే? యిగురుఁబోణి!
నాఁడు మనవీథిలోన మన్నారుసామి
గరుడవాహన మెక్కుక కదలిరాఁగఁ
గంటి నీభావ మని యొక్క కలికి పలికె.

98


వ.

అంత.

99


సీ.

బాగుగాఁ గపురంపు బాగా లొసంగుచు
        మడుపు లందీయవే మంజువాణి!
పంచదారను మించు ప్రాణేశు కెమ్మోవిఁ
        బలుగంటిసేయవే కలువకంటి!
పయ్యదఁ దొలగించి బటువుగుబ్బలచేతఁ
        బతిరొమ్ము గుమ్మవే పద్మగంధి!
చిగురుఁ బానుపునకుఁ జెలువుండు రమ్మన
        జాగేల సేసేదే? చంద్రవదన!


తే.

నెలయు వెన్నెలయునుఁ బలె చెలువుమీరి
నిండువేడుక విభుఁ డీవు నుండుఁడమ్మ!
అనుచుఁ గొందఱు చెలులు నెయ్యంబుమీర
మగనిచెంతకుఁ బిలిచిరి మగువ నపుడు.

100


సీ.

సకులంద ఱిటువలె సరసతఁ బలుకంగ
        సిగ్గుచే నదలించు చెలియఁ జూచి
గోల నందఱు నేల? గేలిసేసెద రని
        చెలులు వారింపుచుఁ జెలువుమీర
నవ్విలాసవతి నెయ్యంబుతో నప్పుడు
        కాంతిమతినిఁ జేరి గారవించి
బుజ్జగింపుచుఁ జాలబుద్ధులుఁ జెప్పుచు
        మేదినీవరుపాన్పుమీఁద నుంచి


తే.

తరుణి కడుముద్దరా లిది తలఁచిచూడ
నీవు నెరజాణ వన్నిట భావ మెఱిఁగి
కొమ్మ నేవేళ దయ నేలుకొ మ్మటంచు
విజయరాఘవుతోఁ బల్కె వేడ్క మెఱయ.

101


వ.

అంత.

102

తే.

కాంతిమతియును విజయరాఘవుఁడు నిట్లు
నిండువేడుక శయ్యపై మండువేళఁ
బనుల నెపములు గైకొని పణఁతు లెల్ల
దవ్వుదవ్వుల నుండిరి నవ్వుకొనుచు.

103


వ.

అప్పుడు.

104


సీ.

మన్నారుదాసుఁడు మగువరో! రమ్మని
        చెంతకుఁ దియ్యంగఁ జే విదల్చు
మోహంబు మీరంగ ముద్దు బెట్టఁగఁ జేర
        మో మటు ద్రిప్పును ముద్దుగులుక
గబ్బిగుబ్బలుఁ గేలఁ గదిసి పట్టగఁజేర
        సరగునఁ బయ్యెదఁ జక్కఁజేర్చుఁ
గాంతులు హెచ్చగాఁ గౌఁగిలింపఁగ రాఁగ
        నొడ్డించుకొని నిల్చు నొఱపు మెఱయఁ


తే.

బొడము వేడుకచేఁ బోఁకముడి వదల్ప
మగుడ సిగ్గున బిగియింప మందగమన
నాతి మౌగ్ధ్యంబుఁ గనుఁగొని నవ్వుకొనుచు
విజయరాఘవుఁ డెంతయు వేడ్క మీర.

105


సీ.

తొయ్యలి నప్పుడు తొడలపై నుంచుక
        కొనగోరఁ దీరుగాఁ గొప్పు దువ్వి
మగువచెక్కిలి నొక్కి మక్కువమీరంగఁ
        బుక్కిటివిడె మిచ్చి బుజ్జగించి
కోమలిగుబ్బలఁ గుంకుమం బలఁదుచుఁ
        గౌఁగిటఁ జేర్పుచు గారవమున
మానిని మాటికి తేనెసోనల నించు
        పలుకుల లాలించి భావ మలర


తే.

నతఁడు మిక్కిలిప్రౌఢనాయకుఁడు గనుక
భామకును దమి బుట్టించి ప్రేమమీర
సంతసము మించఁ జక్కిలిగింత లిడుచు
లజ్జఁ బాయంగఁదోసెను లలన కపుడు.

106


తే.

నీవి వదలించి యెంతయు నేర్పు మెఱయ
గళరవంబులు సేయుచుఁ గాంతిమతిని

బచ్చవిల్తునికేళిని బాగుమీర
విజయరాఘవుఁ డేలెను వింతరతుల.

107


సీ.

ఓరి! బడలితి నంచు నువిద యప్పుడు బల్కఁ
        బను లానతిమ్మని పలికె విభుఁడు
మడుపు లందించిన మగనికి నప్పుడు
        పుక్కిటివిడె మిచ్చె పొలఁతి వేడ్క
నొయ్యారమునఁ జేరి యురమున నొరగినఁ
        బ్రేమను సురఁటిచేఁ బ్రియుఁడు విసరె
రతిచేత బడలిన రమణి పాదంబులు
        ప్రాణేశుఁ డొత్తెను బాగుమీర


తే.

బరఁగ నవ్విలాసవతి మున్ బల్కినట్టి
పలుకు లొకరొకరితోఁ దాము బలుకుకొనుచు
సరససల్లాపములు సేయు సమయమునను
విజయరాఘవుఁ డప్పుడు వెలఁదితోను.

108


ఏకశయ్యావిరహము

సీ.

కొమ్మరో! నీగొప్పకొప్పుపూవులు వాడెఁ
        జంపకసరములు సరవిఁ జుట్టు
మనిన నీసమయంబునందు నౌర! విభుండు
        తనదు మోహపురాణిఁ దలచెఁ ననుచు
నలుక నెమ్మదిఁ బూని యవ్వలిమొగ మయి
        పవళించియున్నట్టి భామఁ జూచి
నేరములే కల్గ కారణం బేమని
        తాను నవ్వలిమోముగా నతండు


తే.

నపుడు పంజరమున నున్నయట్టి చిలుక
చక్కెరల ముద్దుబెట్టరా సామి! యనిన
మతిని శుకవాణిపలుకని పతి మగుడఁగ
వెలఁది యవ్వలి మోమౌచుఁ బతినిఁ గలసె.

109

మేలుకొలుపు

సీ.

విజయరాఘవుఁడును వెలఁదియు నిటువలె
        పొలయల్కులను దీరి పొంకముగను
మరుకేళిఁ దేలుచు మమతలు మీరంగ
        సరసవైఖరి నుండు సమయమందు
నరుణోదయం బైన నారాజు మేల్ కొల్ప
        సంగీతమేళంపు జతనుఁ గూడి
యతివ లప్పుడు జేరి యందంబు మెఱయంగ
        సలలితరాగాతిశయముఁ దనర


తే.

వేడ్కతో (మేలుకొలుపు)లు వినికి సేయ
జాళువాపాలకుండలు పూలసరులు
నిలువుటద్దంబు మొదలుగాగల వమర్చి
యూడిగంపుచెలుల్ గాచియుండి రపుడు.

110


సీ.

నిడువాలుఁగన్నుల నిద్దురనీటును
        మురువుమీరినయట్టి మోవికాటు
చెమటచే జాఱిన చెలువైన తిలకము
        లరజారు విరిసరు లలకములును
జెలువైన నెమ్మని చిటులుగందంబులు
        సందిటి నెలవంక యందములును
బడలికచే మించు నడలయోయ్యారము
        తీరుగాఁ బెడఁగొన్న హార మమరఁ


తే.

గాంతిమతివల్వ విజయరాఘవవిభుండు
విజయరాఘవుదుప్పటి వెలఁ(ది గట్టి)
(రాజసంబు)న రతిరాజు రతి యనంగ
వచ్చి రిరువురు మిక్కిలి వన్నెమీర.

111


కాంతిమతితోఁగూడి విజయరాఘవుఁడు శ్రీరాజగోపాలు ననేకవిధముల నుతించి జనులు బహుభంగులఁ బొగడ నిజనగరంబైన తంజాపురిని బ్రవేశించి సుఖంబున నుండుట

వ.

ఇవ్విధంబున జవ్వనియుం దాను కేళీభవనంబు వెడలివచ్చి విజయరాఘవ
మహీవిభుఁ డహర్ముఖంబున నిత్యకృత్యంబులు నిర్వర్తించి నామతీర్థం బయి

యాకాంతిమతి మున్నుఁగాఁగల యంగనలుం దానును జెంగమలాంబికా
రాజగోపాలకులసన్నిధి నిల్చి పెన్నిధిఁ గన్న చందంబున నానందింపుచు
నామన్ననారులకు నన్నివిధంబులం బూజలు గావించి యిట్లని స్తుతియించె.

111

విన్నపము

శ్రీ రాజగోపాల! త్రిభువనసుజనసంరక్షణలోల! సంక్రందనాదిసురబృంద
వందితచరణారవింద! [29]అడియని విన్నపము వడిగ వినుము; మహానుభావు
లైనయట్టి బ్రహ్మాదులు నీ మహిమఁ దెలియనేర రనిన నే మిమ్ము వినుతింప
నెంతటివాఁడను? మిమ్మే శరణుజొచ్చి నమ్మితి, సతతంబు [30]మీదివ్య
శ్రీకృత్పదంబుజములమీఁది భక్తి గలుగఁజేసి యాచరించి నన్ను రక్షింపవే
కరణారసమహిమ, సహజగుణసంపన్న! సంపంగిమన్న! (ఇదే సీస
పద్యమున్ను.)[31]

112


వ.

అని విన్నవించి మఱియు నిట్లని స్తుతించె.

113


సీ.

రక్షింతు నని ధాత్రి దక్షిణద్వారక
        భాసిల్లు వేల్పు మాపాలివేల్పు
చెంగమలమ్మతో శృంగారమహిమఁ గ
        న్పట్టిన వేల్పు మాపాలివేల్పు
రంగారు బంగారు చెంగోలుఁ గెంగేల
        గీలించు వేల్పు మాపాలివేల్పు
వెలఁదులు పదియాఱు వేలను బ్రేమచేఁ
        బాలించు వేల్పు మాపాలివేల్పు

తే.

పార్థసారథి చక్రి మాపాలివేల్పు
పద్మనేత్రుండు శౌరి మాపాలివేల్పు
భవ్య దాయి మురారి మాపాలివేల్పు
భక్తనిధి మన్ననారు మాపాలి వేల్పు.

114


వ.

అని మన్ననారుల సన్నుతించి యామన్నారుదాసభూపాలుండు సన్నిధివా
రొసంగు తీర్థప్రసాదంబులు స్వీకరింపుచు శ్రీకరం బగు క్షేమకారిదర్శనంబు
గావింపుచు సంతసంబున నంతట.


సీ.

కరితురంగమశతాంగభటబృందంబులు
        తనముందు వెనుక సందడిగ నడవ
బంగారుటనుసుల పట్టుదిం డ్లమరించు
        పల్లకీలను సతుల్ పరఁగ రాఁగ
భేరీమృదంగాదిభీమవాద్యధ్వనుల్
        [32]దిక్కు లెల్లను నిండి పిక్కటిల్ల
నవరత్నమయకేతనప్రభావళి చేత
        నంబరం బతిచిత్ర మై చెలంగఁ


తే.

దరలి యత్తఱి నిజరాజధాని యైన
తంజపురినిఁ బ్రవేశించి తనర నచట
బహువిధాలంకృతులు గల్గి రహి జెలంగు
రాజవీథుల వచ్చుచో రాజముఖులు.

116


సీ.

ఈరాజకులచంద్రుఁడే కదా లోకంబుఁ
        జల్లఁగాఁ బాలించు సరసుఁ డనఁగ
నీమనోజ్ఞాకారుఁడే కదా యెంచఁగ
        మానినీమోహనమదనుఁ డనఁగ
నీకృపాగుణశాలియే కదా వసుమతీ
        పాలన శ్రీరామభద్రుఁ డనఁగ
నీశౌర్యసంపన్నుఁడే కదా కదనోగ్ర
        వీరారిభేదనవిజయుఁ డనఁగ


తే.

ననుచు సేసలు చల్లఁగ ననుచు వేడ్క
రమణులును దాను శుభముహూర్తంబునందు

విభవముల మించు నగరు ప్రవేశమగుచుఁ
జెలువ మన్నారు సేవించి చెలువుమీర.

117


సీ.

భాసిల్లు రాజగోపాలవిలాసంబు
        నందు సువర్ణసింహాసనమున
నాకాంతిమతిమొదలైన ప్రియాంగనల్
        కోరి యిర్వంకలఁ గొలువుసేయఁ
బొలుపొందఁ గొలువుండి పుత్రులు పౌత్రులు
        తామరతంపరై దండఁ దనర
నల శ్రీనివాసతాతాచార్య(వర్యులు)
        సరసప్రసంగముల్ సారె సేయ


తే.

సకలతారావృతుం డైన చంద్రుఁ డనఁగ
(విశదనిర్మల)చంద్రికల్ దిశల వెలయ
విజయరాఘవమేదినీవిభువరుండు
చెలఁగుచున్నాడు శోభనశ్రీలు వెలయ.

118


వ.

మఱియును.

119


సీ.

సమదమాయావాదతిమిరంబు లణఁగింప
        నుదయించు బాలసూర్యుం డనంగ
నతులితశ్రీవైష్ణవాంబోధులకు వృద్ధి
        సవరించు సితపక్షచంద్రుఁ డనఁగ
[33]అఖిలాధ్వగశ్రేణి కనివార్యఫలములు
        ధర నిచ్చు నవకల్పతరు వనంగ
సకలయాచకలోకచాతకసంఘంబు
        (కడుదృష్ణ నణఁచు మేఘం) బనంగ


తే.

బుధజనస్తుతసత్కళాభోజుఁ డనఁగ
మన్ననారు(ల సేవించి మనిన ఘనుఁడు)
వివిధవైభవములఁ జాలవినుతిఁ గాంచి
తనరుచున్నాఁడు మన్నారుదాసవిభుఁడు.

120

సీ.

శ్రీరామభద్రనిర్మిత మైన యా సేతు
        వెన్నివేలేండ్లు దా నెసఁగుచుండు
నల విభీషణుఁడు నత్యకలంకమతి లంక
        నెన్నివేలేండ్లు దా నేలు(చుండు)
(చిలువల)గమికాఁడు నిల నెన్నివేలేండ్లు
        సొంపుమీరఁగ భరియింపుచుండు
..................................
        ...........................
............................
............................
...........................
............................

121


ఫలశ్రుతి

సీ.

నావిభుఁ డైన మన్నారుదాసునిచేత
        ముదమున మంజరీముఖకృతులను
బొగడొంద నంకితంబుగఁ గాంచు శ్రీరాజ
        గోపాలశౌరికిఁ గోర్కెమీర
నేనంకితము సేయు నిటువంటి మన్నారు
        దాసవిలాసంబు ధరణిలోనఁ
బరమభాగవతునిచరితంబు గావున
        వినిన వ్రాసిన చదివిన జనులకు


తే.

నాయురారోగ్యపుత్రపౌత్రాభివృద్ధి
ఘనకనకముఖ్యవస్తువాహనసమృద్ధి
నిరుపమానకవిత్వపాండిత్యమహిమ
కలుగు నాచంద్రరవితారకంబుగాఁగ![34]

122
  1. బరఁగ నొనరించి యప్పుడ
  2. సరస జలగ
  3. బురుసాహిజారుమీఁదను
  4. మెరుఁగగు విరాజిదుప్పటి. క. మెరుఁగను విరాజిదుప్పటి.
  5. తాయతలును, క. తాయతులును
  6. తాయెతలును, క. తాయతులును
  7. క. హేమాంబరంబు
  8. ముత్తెల
  9. ముత్తెల
  10. భాషికం
  11. చక్కెరబురుడలును
  12. మండిగలును
  13. లేమిగల
  14. నంగరవొల్లెలును
  15. వార్చి
  16. బంచె వెన్నెల
  17. బోతుల
  18. బొక్కిసము క. బొక్కసము
  19. నారికెడంబున్ క. నారికెడంబున్
  20. ప్రజలు
  21. క. హర్షమునను
  22. వేమరుమాతోడ క. వేమరుమాతోడ
  23. నడపుమనుచు
  24. అల్లుఁడవైతివి అందరు గొనియాడ
  25. క.రంగలరుచు విజయరాఘవుఁ డంతన్
  26. అసుదు క. అసుధు
  27. ఇంతి
  28. వనితరా
  29. క. అడియేని
  30. మీదివ్యపదాంబుజముల. క. మీదుదివ్యశ్రీపాదాంబుజముల.
  31. సీ. శ్రీ రాజగోపాల! త్రిభువనసుజనసం
                రక్షణలోల! సంక్రందనాది
        సురబృందవందితచరణారవింద! య
                డియని విన్నపము వడిగా వినుము మ
        హానుభావు లైనయట్టి బ్రహ్మాదులు
                నీ మహిమఁ దెలియ నేర రనిన
        నే మిమ్ము వినుతింప నెంతటివాఁడను
                మిమ్మే శరణు జొచ్చి నమ్మితి సత
    తే. తంబు మీదివ్యశ్రీకృత్పదంబుజముల
        మీఁద భక్తి గలుగఁజేసి యాదరించి
        నన్ను రక్షింపవే! కరుణరసమహి
        మసహజగుణసంపన్న! సంపంగిమన్న!
  32. తెలుగులిపిలోని మూలగ్రంథములో నింతకుఁబైన లేదు. (M. 246.)
  33. అఖిలభ్యజశ్రేణి
  34. ఈ సీసపద్యము ప్రథమ ద్వితీయాశ్వాసముల కడపటను M. No. 246 సంఖ్యగల
    గ్రంథమునఁ గానంబడియెడివి. గ్రంథాంతమున నుండుటయే యుచిత మని భావించి యవ్విధంబుగనే చేర్పఁబడినది.