మత్స్యపురాణము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

మత్స్యపురాణము

ప్రథమాశ్వాసము

క.

హరికి సమర్పిత మగు కృతి,
సరళం బగు శుక్తిమధ్య జలబిందుక్రియన్
హరి కసమర్పిత మగు కృతి,
విరసం బగుఁ దప్తలోహవృతజలముగతిన్.

1


వ.

అని మనంబున వితర్కించి.

2


సీ.

జలజసంభవునకు నిలువేలు పై మించెఁ
        జర్చింప నే వేల్పు జగములోన,
తారకబ్రహ్మ మై తనరురామునిచేతఁ
        బూజితుం డయ్యె నే పుణ్యమూర్తి,
వీక్షింప నుభయకావేరీజలాంతరం
        బున నిల్చె నే దేవుఁ డునికిఁ గోరి,
విభవంబుతోడ నే విభుఁ డొసంగును భక్త
        జనులకు వైకుంఠసదనముఖము,

నట్టి నిర్మల నిరవద్య యజ్ఞతత్వ
సచ్చిదానందరూపప్రశస్తుఁ డైన
రంగపతిమీఁద బుద్ధి జేరంగఁ బూన్చి
యమ్మహాత్ముని బాదుగా నాత్మ నిల్పి.

3


చ.

లలితమనోజ్ఞవర్ణసదలంకృత మై సరసాంతహృద్య మై
దళగణతుల్య మై శ్రవణధారణవాంఛిత మై నవీన మై
నలఁకువ నొంద కచ్యుతగుణప్రకరంబులతోడ యుక్త మై
పొలు పగు కావ్యపుష్పతతిఁ బూజ యొనర్చెద రంగభర్తకున్.

4


శా.

భారద్వాజసగోత్రసంభవుఁడ నాపస్తంబుఁడ దిమ్మమాం
బారాజద్వరగర్భసంభవుఁడ రామక్ష్మాసురానేకజ
న్మారూఢాధికపుణ్యలబ్ధహరినామాంకాప్తసత్పుత్త్రుడన్
శ్రీరామానుజపాదపద్మయుగళీచింతాసమాయుక్తుఁడన్.

5


క.

ఈరీతి గోత్రనామాం
కారూఢుఁడ నైన యేను యత్నముతోడన్
శ్రీరంగపతిఁ గృతీశ్వరుఁ
గా రయమునఁ బాదుకొలిపి కౌతుక మొదవన్.

6


సీ.

ఆయురారోగ్యనిత్యైశ్వర్యములు గల్గి
        విభవంబుతో ధాత్రి వెలయుకొఱకు
ధనమునకై నరాధముల సన్నుతి సేయఁ
        బొడమినపాపముల్ చెడుటకొఱకు
హృదయంబు లక్ష్మీశపదపంకజములందు
        నిశ్చలవృత్తితో నిలుచుకొఱకు
రౌరవంబులఁ బాసి రయమున వైకుంఠ
        సదనంబునకు వేడ్కఁ జనెడుకొఱకుఁ
బరమవైష్ణవజను లెల్లఁ బ్రస్తుతింప
మత్కృతం బయి హరికథామాన్య మగుచు
నుత్తమం బగు విష్ణుధర్మోత్తరంబు
రంగనాథున కర్పింతు రాణ మెఱసి.

7

గీ.

తలఁచి చూడ విష్ణుధర్మోత్తరమునకు
నాయకుండు రంగనాథుఁడైన
సన్నుతింప హేమసౌధంబునకు రత్న
కలశ మెత్తినట్టి క్రమము గాదె?

8


వ.

ఇట్లు నిర్మితం బగు మదీయకావ్యంబునకు రంగభర్తను నాయకునిఁగా
నొనరించి.

9


క.

సురతాత్ముఁ డౌ విభీషణ
వరదునకును సకలదివిజవర్ణితసుగుణా
కరునకుఁ బరమదయారస
పరిపూరితహృదయునకును భావజ్ఞునకున్.

10


క.

పంచశరాహితసఖుసకు
సంచితకలుషౌఘతిమిరజలజాప్తునకున్
జంచత్త్రిభువనభవనున
కంచితశ్రీరంగమందిరావాసునకున్.

11


క.

వరశంఖచక్రకీలిత
కరునకు మునియోగిహృదయకంజాంతరసు
స్థిరునకు శతకోటిదివా
కరతేజున కంబురాశి గంభీరునకున్.

12


క.

ధారాధరసమవిశదా
కారసమేతునకు సకలకర్మఠమతికిన్
శ్రీరంగవిభునకును సర
సీరుహదళనయనునకును శ్రీనాథునకున్.

13


వ.

అర్పితంబు గా నా రచియింపఁ బూనిన పురాణంబునకుఁ బ్రారంభం బెట్టి
దనిన.

14


ఉ.

కారణకార్యరూప! గుణకర్మసమూహవిహీన! సచ్చిదా
కార! పరాపరా! ప్రకృతికల్పితదోషలతాలవిత్ర! దు
ర్వారసురారిఖండన! భవత్రిదశాధిపముఖ్యదేవతా
ధార! జగన్నివాస! రిపుదర్పవినాశక! రంగనాయకా!

15

వ.

అవధరింపు మంత శౌనకుండు విష్ణురాతునివలన షడంగయుక్తంబు లై
విధ్యర్థవాదమంత్రాత్మకంబు లైన ఋగ్యజుస్సామాధర్వణంబు లనంబరఁగు
నాల్గువేదంబు లభ్యసించి తద్గీతార్థంబు లెఱింగి తదనుష్ఠానప్రకారంబులు
వివిధంబు లైనం జూచి మనంబున సంశయించి సద్గురుముఖంబున ముక్తి
ప్రాప్తికరం బగు గర్మానుష్ఠానంబు తెలియంబూని.

16


శా.

వేదంబుల్ వివిధార్థజాలరచనావిర్భూతముల్ గానఁ ద
ద్వేదంబుల్ వివరింప నెయ్య దదియే దీపించుఁ గైవల్యమం
గా దివ్యాకృతిఁ గానుపింప దది నా కజ్ఞానశైధిల్యముం
గాదిం కెవ్వఁడు దీనిఁ దెల్ప గలఁ డేకం బైన మార్గంబునన్.

17


క.

ఆ వేదార్థము లొక్కొక
టే వివరింపంగ నొక్కటికి నొక్కటి వై
రావాస మగుచుఁ బరఁగఁగఁ
దావళ మెట్లొదవునందుఁ దలపోయంగన్.

18


తరళ.

అని మునీశ్వరుఁ డివ్విధంబున నాత్మలోపల వేదసం
జనితవాక్యగతార్థసారవిచారరూఢమనస్కుఁ డై
వనధితీరసువేలశైలనివాసవర్జితుఁ డయ్యుఁ దాఁ
జనియె శిష్యసమేతుఁ డై మణిసానుమద్వనవీథికిన్.

19


వ.

ఇ ట్లమ్మునివరుండు శిష్యసమన్వితుం డై దేశంబులు గడఁచి పుణ్యవనులు
దాఁటి శైలంబు లతిక్రమించి మేరుమహీధరప్రాంతంబున కరిగి యచట
భోగవతీనదీతీరంబునఁ బల్లవితంబులు, కోరకితంబులు, పుష్పితంబులు
నైన నగంబులనడుమ విలసిల్లు సహకారపనసకదళీఖర్జూరనారికేళబిల్వ
కపిత్థజంబీరమాతులుంగపున్నాగకురువిందలవంగశతపత్రమధూకమల్లికా
జాతికరవీరచంపకవకుళప్రియంగుకురువకపిచుమందమందారాదితరులతా
సంజాతప్రసవగుచ్ఛగళితమకరందధారాసంపాతపంకిల తన్మహీరుహముల
శీతలచ్ఛాయాసమాళితకస్తూరిమృగనాభివాసనాసంసక్తహోమధూమామో
దమోదితంబును హంసకారండవాదిజలపక్షులకు నాందోళికలచందంబున
డోలాయమానంబు లైన కనకమయకమలషండంబులవలన నిష్యదంబు

లగు సుమనోరసంబులపరిమళంబులకు నిలయంబు లై శీతలపానీయపూరి
తంబు లైన సరోవరంబులచేత నలంకృతంబును మునికుమారులకు సహశ్రోత
లనం బరఁగు శుకశారికలచేతఁ బఠితంబు లైన వేదాంతవాక్యంబుల రచ
నావిశేషంబుల శ్రవణమనోహరంబును నిర్వైరంబునఁ బర్ణశాలాంగణంబున
సంచరించు మృగస్తోమంబులచేత దర్శనీయంబును బాలతరుమూలకల్పి
తంబు లగు నాలవాలంబులసేచనంబునకు నై జలపూరితంబు లగు కల
శంబులు కరంబులం గీలించి వనమధ్యంబునఁ దద్వనదేవతలో యనఁ బరి
భ్రమించుచు నిండుజవ్వనంబున విఱ్ఱవీఁగు మునికన్యకలచేత నభినుతంబును
వివిధయోగిజనసమాజసంకులంబును హరిభక్తసమేతంబును సకలమంగళా
శ్రయంబును సర్వపుణ్యనిలయంబు నగు నారాయణాశ్రమంబు చేరంజని.

20


సీ.

వ్యాఖ్యానముఖరవేదాంతవాక్యంబుల
        శ్రవణయుగ్మమున కుత్సాహ మొదవ
ఫలితపుష్పితనూత్నపాదపప్రకరంబు
        లెడపక కన్నుల కింపుఁ జూపఁ
దుదిముట్టఁ జనుహోమధూమగంధంబులఁ
        దనువునకును శుచిత్వంబు నిగుడఁ
దత్పుష్పపరిమళోద్యతమారుతంబున
        మార్గసంజాతశ్రమంబుఁ దొలఁగ
శౌనకుం డంత సంతోషసహితుఁ డగుచు
నట్టి సన్నుతనారాయణాశ్రమప్ర
వేశ మొనరించి యందు సంవిష్టుఁ డైన
మునివరేణ్యుని దర్శించి ముదితుఁ డగుచు.

21


గీ.

అంతఁ దత్కృతంబులకు నాతిథేయంబు
లంది యంచితాసనాంతరమున
నతిముదంబుతోడ నాసీనుఁ డై యుండి
పలికె శానకుండు భక్తి మెఱసి.

22

క.

నారాయణరూపంబున
నీరీతిని సకలలోకహితమునకై ల
క్ష్మీరమణ! సంభవించితి
వారూఢచరిత్ర! దేవతాధిపవంద్యా.

23


క.

వేదంబులు భవదభినవ
పాదములకు భూషణములు భావింపఁగ బ్ర
హ్మాదుల కైన నశక్యము
మీదివ్యవిభూతిఁ దెలియ మిత్రశతాభా!

24


మ.

సనకాదుల్ భవదంఘ్రీభక్తియుతు లై సంసారదావానలం
బున సంతప్తులు గాక విత్తగృహసత్పుత్రాదిదుర్మోహసం
జనితాత్మీయవికారముల్ గెలిచి మోక్షశ్రీసమాయుక్తు లై
వనజాతాక్ష! భవత్స్వరూపధను లై వర్ధిల్లి రెల్లప్పుడున్.

25


వ.

అదియునుం గాక భవన్మంగళగుణంబులు నిర్ణయించి వర్ణింపఁ బద్మసంభ
వాదు లైనను శక్తులు గారు. అట్టియెడ జగద్రక్షణంబుకొఱకును వేద
మార్గాచారంబుకొఱకును బృథివ్యాదిభూతంబులసంతుష్టికొఱకును నారాయ
ణరూపంబు గైకొనిన మిమ్ము సాధారణజనంబులు తెలియం గలరే? యని
పలికి శౌనకుండు మఱియు నిట్లనియె.

26


క.

మనమునఁ బెక్కువిధంబుల
ననుమానము లుద్భవింప నవి యణఁగుటకై
పనివింటిని మిము దర్శిం
పను లోకశరణ్యనిత్య పావనచరితా!

27


చ.

చదివితి వేదశాస్త్రములు సాంగపదస్వరవర్ణరూఢి నం
దొదవినమార్గముల్ వివిధయోజ్యము లై విలసిల్లు వానిలో
నెదిరినకర్మకాండము నహింసయు జ్ఞానమునం దకర్మమున్
వదలక పల్కుచుండును బ్రవాదములన్ విపరీతవృత్తు లై.

28


గీ.

పాపరూప మగుచు బలసి యుండెడు హింస
పాపరహిత మగుచుఁ బరఁగు టెట్లు
కర్మసరణిఁ గాని కలుగదు బ్రాహ్మణ్య
మట్టి కర్మసరణి యణఁపఁ దగునె.

29

సీ.

వరుస మంత్రంబె దేవతయని వర్ణించు
        నుచితార్థ మీక్షించి యొక్కచోట
యొత్తఁ గా నిత్యనైమిత్తికకామ్యక
        ర్మముల నొక్కొకచోటఁ బ్రస్తుతించు
దురితనాశం బని దూఁకొని యొకచోట
        విధినిషేధంబులు విస్తరించుఁ
బలుకు నొక్కొకచోటఁ బర మార్దరూఢిగా
        సరవిఁ దత్కర్మవిసర్జనంబు
నట్టి విధ్యర్థవాదమంత్రాదికస్వ
రూపవేదంబు శ్రీవిష్ణురూప మనుట
జేసి సన్మార్గములలోన సిద్ధ మైన
యర్థ మెఱుఁగరు సుజ్ఞాను లైన ననఘ!

30


క.

ఈ వేదంబులలోపల
భావింపఁగ సకలధర్మపావన మై మో
క్షావాసహేతు వగు నది
ధీవర! వినిపింపవలయుఁ ద్రిదశేంద్రనుతా!

31


ఉ.

ఎవ్వనిచేత నీ జగము లెల్లను సృష్టము లయ్యె రక్షకుం
డెవ్వఁడు వీని కబ్జజమహేంద్రదిశాధిపు లాత్మభీతితో
నెవ్వని యాజ్ఞసేయుదు రధీశ్వరులయ్యును ముక్తిదాయకుం
డెవ్వఁడు తన్మహాత్ముని మునీశ్వర! తెల్పుము మాకు వేడుకన్.

32


చ.

అరయ మదీయ మైన హృదయంబున మోహమదాంధకారముల్
గురువుగ నిల్చి యున్నయవి ఘోరతదీయవికార మంతయున్
సరసభవద్వచోవిమలచంద్రికచే విదళించి సంతత
స్థిరకరుణార్ద్రదృష్టి నభిషిక్తునిఁ జేయుము నన్ను ధీవరా!

33


వ.

అని యిట్లు శౌనకుం డంతఃప్రపత్తిపూర్వకంబుగాఁ బలికినవచనంబులకు
సంతసించి నారాయణముని యిట్లనియె.

34

క.

పలికితివి మంచిమాటలు
వలనుగ ని ట్లడుగనొరుల వశ మగునె తుదం
దెలియఁగ వలసినవన్నియుఁ
దెలిపెద నే విస్తరించి తేటపడంగన్.

35


చ.

జగదుదయావ్యయంబులును సంసృతిలక్షణ మాత్మయోగముల్
భగవదుపాసనావిధియు భక్తివినోదము గర్మమార్గమున్
సగుణవిశేషముం దెలిపె నారదమౌనికి బద్మజాతుఁ డ
ప్పగిదిని నీకుఁ దత్కథలు భాతిగ నే వినుపింతు వేడుకన్.

36


సీ.

ఒకనాఁడు పర్వతయుక్తుఁ డై నారదుఁ
        డమరలోకంబున కరిగి యచట
నమరేంద్రపూజితుం డగుచు వారుణలోక
        మున కేగి కైలాసమునకు నడచి
తద్గిరీంద్రంబుపై ధరణీధరాత్మజా
        సహితంబు నాగభూషణునిఁ గొలిచి
యంతఁ బంకజసంభవాగణ్యలోకసం
        ప్రాప్తుఁ డై యాశారదాధిపునకు
నభినుతంబుగ వందనం బాచరించి
మహతి యను వీణె సారించి మంద్రమధ్య
మాదిభేదకరాగముల్ పాదు కొలిపి
చతురగానమ్ములను దృఢస్తుతు లొనర్చి.

37


మ.

ధీసంపన్నుఁడు తన్మునీంద్రుఁ డట సుస్నిగ్ధస్వరావృత్తితో
నాసంగీతవినోదవాద్యముల బ్రహ్మానందసంపన్నయో
గాసక్తుండుగఁ దత్పయోజభవు నత్యంతంబు హర్షాధిక
శ్రీసంయుక్తునిఁ జేసి తత్కరపరిస్సృష్టాంగుఁ డై యిట్లనున్.

38


సీ.

ఏ రీతి నుదయించె నీచరాచరరూప
        మై ప్రవర్తించు బ్రహ్మాండకుహర
మిందున కాధార మెయ్యది కర్తృత్వ
        శక్తి యెవ్వనియందు సంక్రమించుఁ

గైవల్య మన నెద్ది కాలంబు క్రియ లెవ్వి
        తత్వరూపం బైన ధర్మ మెట్లు
పశ్యాదివిశసనప్రారంభసంయుతా
        ధ్వరము లే క్రియ దేవతలకుఁ దృప్తి
జ్ఞానమును జ్ఞేయమును నన జగతి నెవ్వి
సాక్షియై నిల్చు నెవ్వాఁడు సకలదిశల
బహువిధంబుల శాస్త్రముల్ ప్రబలు టెట్లు
తేటపడ నిట్టి సూక్ష్మముల్ దెలుపవలయు.

39


వ.

అనిన నారదునకుఁ బద్మసంభవుండు వికసితస్వాంతుండై యిట్లనియె.

40


చ.

వినుము మునీంద్ర పూర్వమున వేడుకతో సనకాదు లెల్ల ని
ర్జన మగు కాననంబునఁ బ్రశస్తతపంబులు సల్ప మెచ్చి యే
ననయము హంసరూపమున నచ్చటి కేగిన వార లందఱున్
నను హృదయంబునం దెలిసి నమ్రత నొందిన వారి కయ్యెడన్.

41


క.

నీ వడిగిన ప్రశ్నలు సం
భావితవాక్ప్రౌఢితోడఁ బలికితి నవి నీ
కావిర్భనించు నట్లు గ
ధీవర వినిపింతు నాత్మ తేటపడంగన్.

42


చ.

కలఁ డొకఁ డాదివేలుపు జగన్నుతుఁడై శతకోటిభాస్కరో
జ్జ్వలఘునమూర్తిచేఁ దనరి వర్ణితుఁ డయ్యును రూపహీనుఁడై
తలకొని విశ్వసంజనసతత్పరిపాలనశాసహేతు వై
కొలఁది యెఱుంగ రాక జనగోచరనిశ్చితవర్ణశూన్యుఁడై.

43


వ.

అట్టి నిర్మలనిరవద్యనిరతిశయసచ్చిదానందస్వరూపసమేతుం డగు తత్తే
జోమయమూర్తి స్వేచ్ఛావిహారసమన్వితుం డగుటం జేసి యపరప్రేష్యబుద్ధి
సంయుక్తుండై యాదిని జలతత్వంబు సృజియించి యంత బాహ్యావరణ
సమేతంబుగా నొక్క సువర్ణమయం బగు బహ్మాండంబు నిర్మించి తత్ప
యోరాశిమధ్యంబునఁ గీలుకొలిపిన నది పాదుకొన నాధారంబు లేక ము
నింగెడు సమయంబున.

44

క.

నేరుపు దలకొనఁగఁ దదా
భారం బై యట్టి తోయతత్వములోనన్
దారుకొని నిలువ నతనికి
నారాయణ నామ మపుడు నాణెంబయ్యెన్.

45


వ.

తత్ప్రకారంబున జలమధ్యసంస్థాపితం బగు నట్టి బ్రహ్మాండకరండం బపా
యంబునం బడకుండుట తదాధారరూపంబు గైకొనిన యట్టి నారాయణ
మూర్తి నిజతేజంబున బాహ్యాంతరంబు లాక్రమించి యంత విరాడ్రూపం
బు గైకొని పుండరీకవిశాలనయనుండును, గంబుకంధరుండును, విశాలవ
క్షస్సముజ్జ్వలుండును, గరచతుష్కోపశోభితుండును, సర్వలక్షణసమేతావ
యవపరిపూర్ణుండును, రత్నకిరీటాంగదహారకుండలగ్రైవేయకకౌస్తుభాభర
ణుండును శ్రీవత్సవనమాలాంగుళీయకపీతాంబరహేమరశనావిభూషితుం
డును నై జలతత్వం బగు శంఖంబును, తేజస్తత్వం బగు సుదర్శనంబును,
నభస్తత్వం బగు నందకంబును , వాయుతత్వం బగు శార్ఙ్గంబును, గర్మమ
యంబు లగు బాణంబులును ధరియించి కాలపురుషరూపం బగు గదఁ గేలం
బూని నిత్యానపాయిని యైన లక్ష్మీరూపం బగు యోగమాయకు నాశ్రయం
బై సర్వవ్యాపకుం డగుటం జేసి విష్ణు నామంబుఁ గైకొని ఛత్రంబును జామ
రంబును శయనంబును నాసనంబును నుపధానంబును నుత్తరీయంబును బా
దుకంబులును నై నిజశరీరభేదంబున శేషనామంబు గల పన్నగేంద్రభో
గం బను దివ్యమంగళతత్వంబున శయానుండై పరబ్రహ్మనామంబున నట్టి
హిరణ్మయాండాభ్యంతరంబుననుండి తత్పయోరాశిమధ్యంబున యోగని
ద్రావశుం డై యుండె నా సమయంబున.

46


క.

ఆవిష్ణుని నిర్మలనా
భీవనరుహమందు భువనబీజాంకుర జ
న్మావాసహేతు వన నే
నావిర్భూతుండ నైతి నాత్మభవుఁడ నై.

47


వ.

అయ్యవసరంబున.

48


క.

ఆపరమమూర్తి నిజమా
యాపరిషిక్తాత్ముఁ డగుచు నతిముదమున ని
ద్రాపరవశుఁ డై యుండ స
మావృతతత్కర్ణయుగళ మలసంభవు లై.

49

క.

మధుకైటభు లను రాక్షసు
లధికబలోద్దాము లగుచు నంతట నస్మ
ద్వధసేయఁ బూని నప్పుడు
విధివశమున నిద్రఁ దెలిసి విష్ణుం డచటన్.

50


గీ.

పవ్వళించియుండి బాహుద్వయంబున
వారితోడ యుద్ధవైభవంబు
సలుపు నంత దివ్యసంవత్సరంబులు
నూఱుపదులు చనియె నూత్నచరిత!

51


శా.

ఆరాత్రించరవీరఘోరకదనవ్యాపారసత్వోద్ధత
శ్రీరాజత్కరపంకజోజ్జ్వలుఁడు లక్ష్మీనాథుఁ డాదైత్యులన్
వారింపంగ నుపాయముం దలంచుచో వా రాత్మలన్ మెచ్చి కో
పారంభంబులు మాని సత్యవచనవ్యాహర్త లై రిట్టుగన్.

52


క.

వెయ్యేఁడులు బహుబలమునఁ
గయ్యంబొనరించు నీదు ఘనవిభవముతో
నెయ్యముగ వరము నొసఁగెద
మెయ్యది ప్రార్థింపవలయు నిచ్చదలిర్పన్.

53


మ.

అనినన్ వారలలోడ నిట్లనియె నత్యంతంబు తత్పుండరీ
కనవాక్షుం డసురేంద్రులార మహితఖ్యాతిన్ మదీయాయుధం
బున మీరల్ మృతినొందఁగావలయు సన్మోదంబుతో వాంఛితం
బన నీ యొక్కటి యే వరం బడిగెదన్ వ్యక్తంబు గా నియ్యెడన్.

54


క.

ఈరీతిని వరమడిగిన
నారాయణమూర్తితోడ నయమొప్పఁగ నా
ఘోరాసురవరు లిట్లని
రారూఢిని మాట దిరుగనాడక దృఢులై.

55


క.

వరమిచ్చెద మని పలికిన
వర మడిదితి వనఘ నీకు వలసిన యట్లా
వర మొసఁగితి మిఁక నీ వొక
వర మియ్యగవలయు మాకు వనజదళాక్షా!

56

మ.

మెఱుఁగుల్ గ్రాలెడి వేఁడిశస్త్రములచే మిన్నందుచున్ జ్వాలలన్
దఱచై మండెడు వహ్నిచే నొరులచేతంగాక సంప్రీతితో
నెఱి నస్మద్వధ సేయఁగా వలయు నిర్నీరప్రదేశంబునన్
వర మిట్లియ్యఁగఁజాలితేని యశముల్ వర్ధిల్లు నీకియ్యడన్.

57


వ.

ఇట్లు మధుకైటభులు ప్రార్ధించిన నంత నారాయణుం డట్ల చేసెద నని తదీ
యశిరంబులు కరంబులం బట్టికొని యంతరిక్షంబున నొండొంటితో బిట్టు
వగులం దాఁకించిన నాక్షణంబ తద్దనుజవీరులు మృతిఁ బొంది సందియంబు
లేక విష్ణుసాయుజ్యంబు నొందిరి, అంతఁ దచ్ఛిరంబులవలన నుడుగక
వెడలు మేదోరక్తంబు జలమధ్యంబునం బడి తెట్టువ గట్టిన నది మేదిని
యనం బరఁగె నయ్యెడ నప్పరమపురుషుండు కూర్మాకారంబు ధరియించి
తదాధారంబై నిలిచి యండమధ్యభారభరణంబునకు నిజాంశం బైన
శేషాకారంబును తద్కోణభారభరణంబునకు నణిమాదిగుణాంశనిర్మితంబు
లను నెనిమిది దిగ్గజంబులను నియమించి యమ్మేదినీమండలంబు చలనంబు
నందకుండెడు నట్లుగా హృదయాంశంబు లగు మేరుమందరహిమాచలమా
ల్యవత్పారియాత్రగంధమాదనవింధ్యాదిపర్వతంబులు కీలాభావంబునం గీలు
కొలిపిన నంత నమ్మేదినికి నచల యను నామంబు గలిగె మఱియును.

58


గీ.

అట్టి మధుకైటభాసురహననసమయ
విపులతామససంజాతవిష్ణురోష
మణఁగ నేరక తద్దేహమందు వెడలి
రుద్రుఁ డనఁ బరఁగెను ఘోరరూప మంది.

59


క.

ఆరుద్రుఁడు నిజరౌద్రా
కారంబు ధరించి వివిధగర్జనముల ది
గ్ధారుణి వణఁకఁగ నప్పుడు
నారాయణమూర్తిఁ గాంచె నతకంధరుఁడై.

60


క.

హృదయంబున సుజ్ఞానం
బొదవఁగ నారుద్రుఁ డంత యుక్తవయస్సం
పదఁ బొదలుచుఁ దన్మూర్తిని
గదిసినుతింపం దొడంగె ఘనవాక్ప్రౌఢిన్.

61

చ.

పరమపరాపరార్థపర పారగ సర్వనివాస సంతతా
పరిమితసద్గుణాకర కృపారసపూరితనేత్ర పద్మభూ
వర బహురూపభక్తజనవత్సల నిత్యవిహారవైభనా
కర దురితౌఘనాశక వికారవిహీన జయాతినిర్మలా!

62


సీ.

అలఘుపాపౌఘతూలాచలంబులకును
        ననలంబు మీనామ మఖిలజనక
గతజన్మసంచితాద్భుతకర్మలతలకు
        నవలవిత్రంబు మీనామ మనఘ
చిరకాలజనితదుష్కృతతమిస్రములకు
        నర్కుండు మీనామ మబ్ధిశయన
దారుణసంసారనీరదంబులకును
        ననిలంబు మీనామ మంబుజాక్ష
యనయమును యుష్మదీయనామామృతంబుఁ
గ్రోలియును దృప్తి నొంది నిరూఢమతులు
సంతతాపాయరహితులై సత్యమైన
పదము నొందుదు రధికప్రపత్తిఁ బొదలి.

63


క.

పరతత్వ మనిన నీవే
పరమేశుఁడ వనిన నీవె బ్రహ్మాండములన్
బరిపూర్ణుఁ డనిన నీవే
పరమజ్ఞానస్వరూప భాసురచరితా!

64


క.

ఏఁ జేయవలయు కార్యం
బీజగమున నెద్ది యాన తీయఁగవలయున్
దేజోమయ సర్వాత్మక
రాజితపద్మదళనేత్ర రమ్యచరిత్రా!

65

వ.

అని యిట్లు రుద్రుండు విన్నవించు సమయంబున నప్పరమపురుషుం డగు
నారాయణుని దివ్యమంగళదేహంబువలన నొక్కతేజంబు వెడలి తమో
వికారం బగు నది కాంతావికారంబుఁ గైకొని భృకుటిదంష్ట్రాకరాళవద
నయు దివ్యాయుధసమేతయు రక్తచందనమాల్యాంబరభూషణధారిణియు
శంఖచక్రశూలడమరుపాశాంకుశశరచాపసముజ్జ్వలకరాంబుజయు నై
ఘోరాకారంబున నిలిచె నిలిచిన నట్టి మహాశక్తి నవలోకించి యప్పుండరీ
కాక్షుండు రుద్రున కిట్లనియె.

66


సీ.

అతిరౌద్రరూపనిర్గతుఁడ వైతివి గాన
        రుద్రనామము నీకు రూఢమయ్యెఁ
బరఁగ మన్నామజాపకుఁడవై వర్తింప
        నలరెడు మృత్యుంజయత్వ మనఘ!
సంభవించిన చరాచరరూపవిశ్వంబు
        నియత మై నీచేత లయము నొందు
నీతమోమయదేహ యేకాంతయై భవ
        ద్దేహార్ధమున నిల్చుఁ దెల్వి మెఱయఁ
ద్రిజగదుదయావనవ్యయ త్రితయరూఢ
గతిరజస్సత్వతమములం దతిశయిల్లు
నట్లు గావున సర్వలయంబులకును
గర్తవై మెలఁగవలయు గరిమ రుద్ర!

67


క.

అనయంబును దామసగుణ
మునఁ బొదలక సాత్వికప్రముదితాత్ముఁడ వై
యనిమిషులు గొల్వఁగాఁ ద్రిభు
వననాథుఁడ వగుచుఁ దిరుగవలయు మహేశా!

68


గీ.

ఏను నీవు ననఁగ నీభేద మాత్మయం
దనువుపడదు గుణములందుఁ గాని
బాహ్యభేద మేమి భావింప హృద్భేద
మెడలకుండు మైక్య మీక్ష సేయ.

69

వ.

అది గావున నీవు మేరుశైలంబునకు రజతశృంగం బై విలసిల్లు కైలాసనగం
బున నివాసంబు సేయవలయు నని విష్ణుం డాన తెచ్చి యారుద్రునకుఁ దేజ
స్తత్వం బగు మహాశూలంబును , ఆకాశతత్వం బగు డమరుకంబును,
వాయుతత్వం బగు వృషభవాహనంబును నొసంగె నంత దత్తమోమా
యారూపం బై రుద్రాణి యనం బరఁగిన సంహారశక్తి యోగవశంబున
సహస్రరూపంబులం బొంది తద్రుద్రశరీరభవంబు లగు రోమకూపంబులం
దావిర్భవించిన యంతన మృత్యుంజయుండు శక్తిసమేతుండగుటం జేసి జగ
త్సంహారకారణబలపరాక్రమసమేతుం డై తదాజ్ఞ నంగీకరించి నారాయణ
నామస్మరణంబు సేయుచుఁ గైలాసపర్వతంబునకుం జనియె నయ్యవసరం
బున నేనును దన్నాభసరోరుహకర్ణికామధ్యంబున నాసీనుండ నై తేజోమ
యం బగు తద్విష్ణుదేహంబు నిరీక్షింప నశక్తుండ నై పరితాపంబు నొం
దుచు భారంబునం దదీయనామస్మరణంబు సేసి.

70


క.

జయ జయ కైటభమర్దన
జయ లోకశరణ్య సర్వజగదవనపరా
జయ సతతపరమపావన
జయ భాస్కరకోటితేజ జయ సర్వేశా.

71


గీ.

సూక్ష్మమునకు మిగుల సూక్ష్మంబ వగుచును
ఘనతరంబునకును ఘనమ వగుచుఁ
గట్టు వడని నిన్నుఁ గణఁకతోమాయాభి
బద్ధుఁ డందు రెట్లు పరమపురుష!

72


క.

కారణకార్యసమేతుఁడ
వై రూఢిగఁ ద్రిభువనముల నతివేగమునన్
నీరధినడుమను నిలిపిన
నేరుపు లొరులకును గలవె నీకుందక్కన్.

73


క.

మృగనాభిగంధసహితం
బగు వస్తుచయంబు లెల్ల నతిశయనిజగం
ధగరిమఁ బొదివిన క్రియ నీ
జగములు నీవలన వికృతిఁ జనుఁ బరమేశా!

74

మ.

జలతత్వంబు సృజించి యందును నిజేచ్ఛావేశసంసృష్టిని
ర్మలహేమాండము నప్రయాసమున సామర్థ్యంబుతో నిల్పి యు
జ్జ్వలరూపాకృతిఁ బొంది శేషశయనావాసుండ వై యుంటి వీ
జల మెవ్వానికి నైనఁ గల్గునే దయాపారీణ లక్ష్మీశ్వరా!

75


సీ.

సిరికి నాథుండవై చెలఁగి యుండెడు చోట
        నైశ్వర్య మేమని యభినుతింప
నఖిలలోకములు నీయాత్మలోపల నుండ
        బౌరుషం బేమని ప్రస్తుతింప
శతకోటిభానుతేజస్సమేతుఁడ వైన
        నీ తేజ మేమని నిర్ణయింప
నమిత భూతాధార మై ప్రవర్తించు మీ
        ప్రాభవం బేమని పలుకరింప
మృద్వికారంబు లెల్లను మృద్భవంబు
లయ్యు నంతర్గతంబు లై యణఁగు మాడ్కి
నిట్టి యావిర్భవాపాయహేతురూప
మైన నిను సన్నుతించెద నంబుజాక్ష!

76


శా.

జాతివ్యక్తుల మాడ్కి ద్యవ్యగుణముల్ సంధిల్లు చందంబునన్
సాతత్యంబుగ నీవు విశ్వ మన నాశబ్దప్రభేదంబుతో
జేతోవృత్తులఁ గానుపింతువు తుదిన్ జిహ్నంబు గావింతు వి
మ్మై తత్వస్థితి నొంది యుండుదువు నీ వన్యక్రియాశూన్యతన్.

77


ఆ.

ఈ జగంబులోన నింతైనఁ బరికింప
సూదిమొనకు మోపఁ జోటు లేక
నిలిచి వివిధమైన నీమహాతేజంబు
నొరుల కెఱుఁగ వశమె దురితహరణ!

78


చ.

కఱకున ఘోరదానవులు గ్రక్కున నార్ధి జనించి వచ్చినన్
హరివరరమ్యభోగశయనాంతరమందునె పవ్వళించి యో
గరసనిషేకసంభవసుఖశ్రితమానససంయుతుండ వై
కరముల నప్రయాసమునఁ గయ్యము సేయుచు నంతలోపలన్.

79

క.

అధికు లగునట్టి దనుజుల
వధియించితి వీశ యింక వసుధను జనులున్
మధుకైటభారియని మి
మ్మధికృతులు తలంచి చనుదు రర్హస్థితికిన్.

80


వ.

దేవా! భవదీయగుణంబు లనంతంబగుటం జేసి యస్మదాదులకు వర్ణింప
మనోవాగ్గోచరంబులు గావు. ఇట్టి యెడం బాషాణంబులు తేజోవిశేషంబు
లం బొదుగుడువడి మణులనం బరఁగి మహారాజమాన్యంబు లగు చందం
బున జీవులు హేయంబు లైన పార్థివశరీరంబులు ధరియించి భవత్పాదాం
బుజాద్వితీయనిశ్చలభక్తిచే వన్నియ కెక్కి భాగవతు లనం బరఁగి భవ
న్మాన్యు లై వర్తింతు రఖిలభూతనివాసా శతకోటిభాస్కరప్రభాసమేతుం
డ వయ్యును ద్రిభువనోత్పాదనార్థంబు సారాకారం బగు లీలామానుషవిగ్ర
హంబు ధరియించిన యుష్మదీయాకారంబు దర్శింప సమర్థం బగు దివ్యద
ర్శనంబు దయసేయు మని ప్రార్థింప నిజరూపదర్శనప్రభావసమేతం
బగు దివ్యదృష్టి కృప సేసిన నే నప్పుడు మదనశతకోటిరూపలావణ్యవిలాస
విభ్రమసముద్భాసితంబును గటకకేయూరకంకణాంగుళీయకహారకౌస్తుభ
శ్రీవత్సమకరకుండలరత్నకిరీటదివ్యభూషణభూషితంబును, బీతాంబరరశ
నావిరాజితంబును దివ్యచందనచర్చాసమన్వితంబును, శంఖగదాపద్మ
శార్ఙ్గాదిదివ్యాయుధసమేతకరచతుష్కోపశోభితంబును నగు తద్రమాకాంతు
దివ్యమంగళాకారంబు విలోకించి తదీక్షణసంజనితసుఖపారవశ్యంబున
దేహంబు మఱచి తదాయత్తమానసుండనై యున్న యెడ నప్పరమమూర్తి
పుత్త్రభావంబుగ నన్ను బరమదయావాత్సల్యంబున నీక్షించి యిట్లనియె.

81


క.

పంకజసంభవ నీ విఁక
శంకారహితుండ వగుచు సకలజగంబుల్
సంకోచింపక నిలుపుము
పొంకంబునఁ దత్ప్రబుద్ధబుద్ధినుతుఁడ వై.

82

క.

తారుకొని యేనె జగములు
నారూఢి సృజించువాఁడ నందు సహాయ
ప్రారంభములకుఁ దలపఁగఁ
గారణమాత్రంబు నీవు కమలజజన్మా.

83


క.

పరముఁడ నే బూర్వుఁడ నై
పరఁగఁగఁ దచ్ఛబ్దపూర్వపరరహితుడనై
పరిపూర్తిఁ బొంది త్రిజగ
త్పరితృప్తిగ నిల్వవలయుఁ ప్రాభవ మొప్పన్.

84


గీ.

బ్రాహ్మమానమునను బరిపూర్తి నూఱేండ్లు
వృద్ధిఁ బొంది యంత సృష్టినాశ
సమయ మందు భూతసంఘంబు గెడగూడి
క్రమ్మఱంగ మమ్ముఁ గలయవలయు.

85


క.

పొడవుల కెయ్యది మిక్కిలి
పొడ తగు బ్రహ్మాండమందుఁ బొలుపుగ నచటన్
గడువేడ్క నిల్వవలయును
నెడపక సదసద్వివేకహితవాగ్విభవా!

86


క.

సర్వజ్ఞుఁడ వై త్రిజగ
న్నిర్వహణసమర్థశక్తినియతుఁడ వగుచున్
సర్వాంతరస్థితుండును
సర్వాతీతుం డనంగఁ జనియెదు పుత్త్రా.

87


క.

ఏకార్యం బెచ్చోటను
నీకును శక్యంబు గాక నిలుచును జగమం
దాకార్యం బబ్చోటను
జేకొని యేఁ దీర్చువాఁడ సిద్ధము తనయా!

88


క.

ఆయతగతితో నొదవెడి
మాయలకును లోనుగాక మహనీయములై
నీ యందు మద్విభూతులు
పాయక వర్తించుఁ గాక పరమార్థము లై.

89

క.

ఏ వంక నైన జగముల
భావింప నశక్య కార్యభారము లొదవన్
రావలసిన పని గలిగిన
రా వలయును బుధులఁ గూడి ప్రాముఖ్యమునన్.

90


వ.

అని పుండరీకాక్షుం డాన తిచ్చి యంతర్ధానంబు నొందిన నంత మహాంధ
కారంబు దోఁచె నప్పుడు జ్ఞానవిహీనుండ నై యా వృత్తాంతంబు స్వప్న
ప్రాయంబుగాఁ దలంచుచు నజ్ఞునిమాడ్కిఁ బట్ట నూఁకువ యెఱుంగక త
న్నామస్మరణంబునందుఁ దలఁపు వెట్టి తత్తిమిరకబళితం బగు పయోరాశి
మధ్యంబునఁ బరిభ్రమించుచు నతిశ్రాంతుండనై కొంతకాలంబునకు.

91


సీ.

కనుఁగొంటి నొకచోటఁ గాంతిచే విలసిల్లు
        మణిమయప్రాకారమండలంబు
నట విలోకించితి నభ్రంలిహంబు లై
        దీపించు నవరత్నగోపురములు
చూచితి నంతను జొక్కంబు లై మించు
        తోరణోపరిగృహద్వారతతులు
నీక్షించితిని బుణ్యదీక్షావశాక్షీణ
        మానమౌక్తికకేకుమాలికలును
వీక్ష చేసితి నవపుష్పవివిధగంధ
సన్నుతానేకకల్పభూజాతసహిత
విమలవనవాటికాసమన్వీత మగుచు
నుదధినడుమను జెలు వొందు నొక్కపురము.

92


వ.

అయ్యెడం బ్రాకారసౌధతోరణధ్వజకేళీవనవిరాజితం బై యానందకందం
బై సొంపులగు సంపదలకుఁ దానకం బై విభవంబుల కాలయం బై మంగ
ళంబులకు నివాసం బై సౌభాగ్యంబులకు మనికిపట్టై పుణ్యంబులకు నికేత
నం బై తెలివొందు నట్టి పట్టణంబుఁ జేరం జను నంత సహస్రవర్షపర్యం
తంబుగఁ గాలంబు దోఁచె నంతఁ దత్పురప్రవేశంబు చేసితిఁ దత్సౌభా
గ్యం బెట్టి దనిన.

93

సీ.

సౌధకీలితరత్నశకల మొక్కటి చాలు
        భాస్కరతేజంబు పరిహసింపఁ
బొలుపొందు నవజాతభూజ మొక్కటి చాలు
        నఖిలలోకముల కిష్టార్థ మొసఁగ
నభినుతింపఁ గను వామాక్షి యొక్కతె చాలుఁ
        గ్రతుభోజనాంగనాగర్వ మడఁపఁ
బరికింప నచ్చోటి పురుషుఁ డొక్కడు చాలు
        నస్మదాదుల కనిత్యతను దెలుప
మహిమతో ని ట్లలోకసామాన్యధర్మ
ములకుఁ దానక మయ్యుఁ బ్రమోద మొదవ
వివిధపరిపూర్ణమై నిత్యవిభవములకుఁ
దానకం బన విలసిల్లుఁ దత్పురంబు.

94


క.

అతులితముగ నిజమణిబిం
బితజగములచేత నందుఁ బృథుతరపురముల్
వితతరమాధిపసారూ
పతతు లొలయ వెలయు సర్వపరిపూర్ణములై.

95


వ.

మఱియును.

96


సీ.

ఎచ్చోటఁ జూచిన నచ్చోట వేదాంత
        పరమరహస్యముల్ వలుకువారు
నే వంకఁ బరికింప నా వంక లక్ష్మీశు
        సద్గుణంబులగోష్ఠి సలుపువారు
నే వీథి వీక్షింప నా వీథి సంగీత
        ములఁ బుండరీకాక్షుఁ గొలుచువారు
నే వేదిఁ బరికింప నా వేదికలయందు
        శ్రీరమావిభునిఁ బూజించువారు
నగుచుఁ దత్పురనిలయు లై నట్టి జనులు
శంఖచక్రాబ్జశార్ఙ్గహస్తములతోడ
సర్వకాలము సంతోషసహితు లగుచుఁ
జెలఁగుచుందురు విభవప్రసిద్ధితోడ.

97

క.

నిరుపమవైభవశోభా
కర మై సన్మంగళ ప్రకరరాజిత మై
హరిభక్తపూజితం బై
తిర మగు తత్పట్టణంబు దివ్యమునీంద్రా!

98


మ.

తరుణుల్ తత్పురపుష్పవాటికలలోఁ దారస్వరం బొప్ప సు
స్థిరలీలన్ హరిఁ బుండరీకనయనున్ శ్రీమానినీనాయకున్
బరమప్రీతినిఁ బాడుచున్నయెడఁ దత్పార్శ్వస్థితానోకహాం
తరభృంగావళి సేయు గానములు తత్తద్వాక్యసంపన్న మై.

99


క.

కదియవు తత్పురవాసుల
మదమును లోభంబు క్షుధయు మాత్సర్యంబున్
మదనవికారముఁ గ్రోధము
నదలును నను పకృతిజంబు లగు దుర్గుణముల్.

100


వ.

మఱియును.

101


సీ.

ప్రాకారగోపురప్రాసాదనవరత్న
        దీప్తు లంబరముపైఁ దేజరిల్ల
వర్ణితమందారవనపుష్పవాసనల్
        ఘుమఘుమాయితము లై గుబులుకొనఁగ
నాట్యక్రియాసమున్నతమృదంగధ్వనుల్
        సౌధాగ్రగృహముల సందడిలఁగ
సాధిష్టశీతలచ్ఛాయాకరంబు లై
        గరుడకేతనములు గ్రందుకొనఁగ
మాసపక్షర్తుదివసప్రమాణసహిత
మగుచుఁ బరిపూర్ణవిభవాశ్రయంబు శోభ
నాలయంబును నిత్యంబు ననఁగ జగతి
నిరుపమం బయి వెలయుఁ దత్పురవరంబు.

102

క.

కనుగొంటి నట్టి పట్టణ
మున వివిధమణిప్రభాసమూహంబులచే
తను మిన్నుముట్టి తనరెడు
ఘనశైలము లొక్కనాల్గు కమనీయము లై.

103


వ.

ఇ ట్లఖిలమంగళాశ్రయం బై యతివిస్తృతం బగు తత్పురంబునం గలుగు
విశేషంబులం గలయ నవలోకించి తత్పురవాసులచేత జాతివిహీనునిచం
దంబున నసంభాషితుఁడ నై హృదయజనితసంతాపంబునం గుందుచు
నంత నొక్క విజనప్రదేశంబున సమాసీనుండ నై క్రమ్మఱఁ దత్పుండరీ
కాక్షప్రసాదంబున సుజ్ఞానంబు నొంది నయనంబులు ముకుళితంబు సేసి
బాహ్యంబు మఱచి హృదయపద్మంబునఁ బూర్వదృష్టం బగు నప్పరమపు
రుషుని దివ్యమంగళవిగ్రహంబు ధ్యానంబు సేయుచుఁ దదాయత్తచిత్తుండనై.

104


సీ.

ఓ పుండరీకాక్ష! యో జగన్నాయక!
        యో సుదర్శనహస్త! యో ముకుంద!
యో రమాధీశ్వర! యో భక్తమందార!
        యో నిత్యకల్యాణ! యో కృపాత్మ!
యో సత్యసంకల్ప! యో సర్వలోకేశ!
        యో కౌస్తుభాంకిత! యో పరేశ!
యో కైటభాంతక! యో మంగళాకార!
        యో వైభవాశ్రయ! యో పవిత్ర!
యో సదానందమయరూప! యో గుణాఢ్య!
యో సహస్రార్కసమతేజ! యో నిధీశ!
యో ధరాధరధారణా! యో విశాల!
భక్తుఁ డగు నన్ను దిగనాడఁ బాడి యగునె?

105


చ.

తిరమున మీగుణంబులు నుతింపక మోహవిమోహితుండ నై
తిరిగితి బెక్కువర్షములు దీనుఁడ నై విపులాంధకారసా
గరమున ఘోరసాధ్వసవికారసమన్వితమానసుండ నై
సిరులు దలిర్ప నింక దయసేయుము నన్ను రమామనోహరా!

106

క.

శరణాగతరక్షకుఁ డను
బిరుదుం గలవాఁడ వండ్రు పృథులచరిత్రా
శరణాగతుండ నగు నను
స్థిరముగఁ గరుణింపవలయు శేషశయానా!

107


వ.

అని యి ట్లార్తుండ నై తద్గుణంబులు గొనియాడి నయనయుగంబులు తెఱ
చి నప్పుడు తొల్లింటియట్ల యేనుఁ దన్నాభీసరోజంబునఁ బద్మాసనాసీనుం
డ నై పాదుకొని క్రమ్మఱ నప్పరమపురుషు నవలోకించి తద్దర్శనామృత
ధారాసిక్తశరీరుండనై గతశ్రమంబున కచ్చెరు వంది.

108


చ.

పరమపరార్థరూప! గుణభాసుర! నిత్యనివాసవైభవా
కర! కరకాంతచక్రరవిఖండితశత్రుసమూహ! వార్ధిజా
వర! వరమంగళాశ్రయభవష్రియకౌస్తుభభూషణావళీ
ధర! ధరణీశ! నీ విపులతత్వము నన్యు లెఱుంగ నేర్తురే.

109


క.

నిరుపమవైభవకరుణా
పరిపూరితనయన లోకపాలక లక్ష్మీ
వర భక్తవరద యెయ్యెడ
నురవడి మీ మాయఁ దెలియ నొరులకు వశమే.

110


సీ.

గాఢాంధకారసాగరమునఁ బెక్కేండ్లు
        దృఢసాధ్యసంబునఁ దిరిగి తిరిగి
శోకమోహంబుల సుడిఁగొని చిత్తంబు
        కలఁగి పాదుకురాగఁ గళవళింప
శాంతుఁడ నై యుండి సౌధగోపురమణి
        ప్రాకారతోరణప్రాజ్య మైన
పురరాజ మొక్కటి పొలుపుతో నీక్షించి
        తన్మధ్యమంబునఁ దరణికోటి
కాంతిసందీప్తమణిగణోత్కరము లైన
శైలములు నాల్గు గనుఁగొంటి సత్యచరిత
వీని వృత్తాంత మంతయు వివరపుట్టఁ
దెలుపవలయును లోకేశ జలధిశయన.

111

వ.

ఇవ్విధంబున స్తుతిపూర్వకంబుగా నే నిన్నవించిన వచనంబు లాకర్ణించి
మందస్మితవదనుం డై దశనద్వుతు లధరంబుపై దళుకొత్తఁ గూర్మిసలు
పుచు నట్టి పరమతేజోమయమూర్తి న న్నవలోకించి యిట్లనియె.

112


సీ.

కమలజ విలసిల్లు గాఢాంధకారసా
        గరమునఁ దిరుగ నొక్కటి క్షణంబు
కాలంబు చనియెఁ దత్కాలంబు నీకును
        వేయేండ్లు నై తోఁచె విస్మయముగ
నాతమోరూపమై నదియె మన్మాయాప్ర
        భావంబు దాసనే ప్రబలె జగము
మోహాంధ మై నాశమును నుద్భవంబును
        నొందు నకుంఠితోద్యోగసరణి


గీ.

నచట నీ చేత దృష్ట మై నట్టి పురము
మన్నివాసంబు వైకుంఠమందిరంబు
చతురతత్పురమధ్యమాంచితము లైన
ధరణిధరములు నాల్గు వేదంబు లనఘ!

113


శా.

నీ వీ తత్వ మెఱుంగు మబ్జభవ యే నీకుం బ్రవచించెదన్
భావంబందు మదీయపాదయుగళీభక్తిప్రసన్నాత్ములై
ధీవర్యుల్ గతపాపు లై యమరు లై దివ్యాకృతిప్రఖ్యులై
యా వైకుంఠపురంబు నొందుదురు నిత్యానందసంపన్నులై.

114


క.

ఆ దివ్యనగరినడుమను
బాదుగ విలసిల్లు రత్నపర్వతములు
వేదంబులు నీ విఁక విను
ప్రాదుర్భూతంబు లందుఁ బద్మజ జగముల్.

115


గీ.

అట్టి వేదరాసు లగు సత్స్వరూపంబు
లందు నిశ్చితార్థ మాచరించి
చనఁగ నేర్చు మనుజు లనిమిషాధిపవంద్యు
లగుచు ముక్తిఁ బొంద నరుగువారు.

116

వ.

అని యానతిచ్చి పుండరీకాక్షుండు మఱియు నిట్లనియె.

117


మ.

అదె దర్శింపుము సర్వలోకముల కగ్ర్యం బై మహావైభవా
స్పద మై యొప్పెడు బ్రహ్మలోక మచటన్ బ్రఖ్యాతితో నిత్యసం
పదలం బొందుచు సృష్టికర్త వగుచున్ మద్భక్తియుక్తుండ వై
విదితప్రజ్ఞను నిల్వఁగావలయు భావింపంగ నీ వాత్మజా!

118


క.

నారాయణనామము నీ
వారూఢిగఁ దలపవలయు నది మద్రూపం
బై రచితములకు నెప్పుడుఁ
గారణ మై వెలయుచుండుఁ గమలజనిలయా!

119


క.

ప్రణవాది చేసి నారా
యణనామచతుర్థి తుదిగ నట మధ్యమునన్
బ్రణతి ప్రకాశకం బగు
మణిమయశబ్దంబు చొనుప మంత్రము పుత్త్రా!

120


క.

ఈ యష్టాక్షరిమంత్రము
ధీయుతు లై పఠనసేయు ధృతిమంతులు మ
త్సాయుజ్యముక్తిఁ బొందుదు
రాయాసవిహీను లగుచు నతిమోదమునన్.

121


గీ.

మత్సహాయ మైన మహనీయశక్తియు
సర్వవేదవిదితసారమతియు
విభవపూర్ణమైన విశ్రుతాయుష్యంబు
గలుగవలయు నీకుఁ గమలజన్మ.

122


వ.

అని యానతిచ్చి యప్పుండరీకాక్షుండు నిజమహత్వంబు నాకు దృష్టంబు
సేయుటకై విశ్వపూర్ణరూపంబుఁ గైకొని సహస్రవదనుండును, సహస్రన
యనుండును, సహస్రపాదుండును సహస్రశిరస్సమేతుండు నై పదతలంబు
వలన శేషఖండ, సౌఖండ, కూర్మఖండ, శ్వేతఖండ, బిలఖండంబులను
పంచఖండసమేతం బగు పాతాళలోకంబును, నంఘ్రులవలన మార్దవంబు
గల యెనిమిదవమండలంబునకు గంధకాఠిన్యగుణంబులును, లవణేక్షు
మధుక్షీరదధ్యాజ్యపానీయాదిసప్తసాగరంబులును, జంబూద్వీపకుశద్వీపశా

ల్మవిద్వీపప్లక్షద్వీపక్రౌంచద్వీపశాకద్వీపపుష్కరద్వీపంబు లను సప్తద్వీపం
బులును శైలకాననవిశేషంబులును, నాభివలన దారకాగ్రహనక్షత్రసము
న్నతం బగు నంతరిక్షంబును శిరంబువలన గోలోకపితృలోకతపోలోకజ
లలోకతేజోలోకనరకలోకవాయులోకసాధ్యలోకంబులను నుపరిలోకం
బులతోడ సముజ్జ్వలం బగు స్వర్గలోకంబును, మఱియఁ బ్రాణంబులవలన
సప్తమారుతంబులును ముఖంబులవలన ననలంబులును సృజియించి యం
తఁ బాతాళలోకంబునకుఁ దామ్రకంకటవిశ్వకేతుదందశూకకరాళకేతు
ధూళికాపన్నగేంద్రులను భూలోకంబునకు ముఖంబువలన నరుల నలనఖం
బులవలనను బిపీలికామశకాదులను హాసంబువలన గిరిభూరుహాదిస్థావరం
బులను సృజియించి యంత స్వర్లోకంబునకు మునితేజంబువలనఁ జత్వా
రింశత్ప్రభేదదేవతాగణసహాయు లగు పురందరాది దిక్పాలకులను, మనం
బువలన నిశాకరమండలంబును హర్షంబువలన మీనకేతనగంధర్వకిన్నర
కింపురుషాప్సరోగణంబులను నిర్మించి యిట్లు పరిపూర్ణంబుగా స్థావరజంగ
మాత్మకం బగు మనస్సృష్టిఁ గావించిన నందు జంగమరూపంబు లగు
జీవంబులు క్రమ్మఱయును మనోమయం బగు సృష్టి నిర్మింప నుపాయం
బెఱుంగక.

123


క.

గగనమహీతలపాతా
ళగిరిజలాంతరములందులం దిరిగెడి త
త్ఖగమృగకీటకపశుప
న్నగములు వైరంబుతోఁచె నంగుచు సమసెన్.

124


వ.

అంత.

125


సీ.

వరుసతో విప్రాదివర్ణసంభవు లైన
        మానవోత్తములును మాన్యులైన
సురలు దిగ్వరులు కింపురుషులు సాధ్యులు
        నప్సరోగణములు యక్షతతులు
తల్లిదండ్రులమీఁదఁ దనయులు మోహంబు
        విడనాడలేని య ట్లెడప కెపుడుఁ

దము సృజించిన రమాధవునిపైఁ జిత్తంబు
        ననుకొల్పి సుజ్ఞానసహితు లగుచు
బాహ్యవస్తుమోహభావంబు విడనాడి
కామమదము లందుఁ గట్టువడక
ముదముతోడ నెనసి ముక్తు లై తద్విష్ణు
దీప్తిఁ గలసి చనిరి ధీవరేణ్య!

126


వ.

ఇట్లు పుండరీకాక్షు మనస్సృష్టినిర్మితు లై లోకత్రయంబునం గలుగు నాగ
మనుష్యసురేంద్రాదులు భక్తియోగంబున ముక్తు లై తన్నుం గలిసిన.

127


గీ.

మఱలఁ బురికొనంగ మజ్జనకుం డగు
భగవదాఖ్యుఁ డైన పరముఁ డాది
విష్ణుమూర్తి నన్ను వీక్షించి ముదమునఁ
బలికెఁ గూర్మి మెఱయ భవ్యచరిత!

128


సీ.

ఇలలోన ఖగమృగాదులు నిజాంశమ్ముల
        మించ సర్గంబు నిర్మించలేక
వైరామబంధప్రవర్తనంబుల నవి
        సమసెఁ గాలంబున సత్వ ముడిగి
నరదేవనాగకిన్నరముఖ్యు లెల్లను
        హృదయముల్ మిక్కిలి పదిలపఱచి
మత్పాదభక్తి మై మఱగంగ నడుకొల్పి
        మఱి యన్య మెఱుఁగక మాన్యు లగుచు
జలము లెల్లను జలరాశిఁ గలయునట్లు
యత్నమున మత్సముద్భవు లగుటఁ జేసి
వారు బాహ్యప్రపంచసంచార ముడిగి
క్రమ్మఱను మమ్ముఁ గలసిరి కంజనిలయ.

129


క.
పాయక యి ట్లఖిలము మ

త్సాయుజ్యము నొందు నంత సకలజగంబుల్ శ్రీయుతము లగుచు శూన్యము

లై యున్నని తమముచేత నాశాంతములై.
130

క.

తొల్లింటయట్ల లోకము
లెల్లను బరిపూర్ణముగను నింకను నీ వు
ద్యల్లలితమతివిశేషతఁ
దెల్లమి సృజియింపవలయుఁ దిరుగం బ్రజలన్.

131


క.

నేరుపున సకలకార్యము
లారసికొని యేను దత్ప్రయత్నము లెల్లన్
సారసమచేసి నిలిపెదఁ
గారణమాత్రంబు నీవు కాంచనగర్భా.

132


క.

అని యివ్విధమున లక్ష్మీ
వనితావరుఁ డానతిచ్చు వాక్యము లెల్లన్
విని యా జగములు సృజియిం
పను వెఱ వెఱుగంగ లేక భయసహితుఁడ నై.

133


శా.

ఈరీతి న్వచియించు నవ్విభునితో నిట్లంటి నే నప్పు డ
త్యారూఢప్రతిభావిశేషమున హస్తద్వంద్వముల్ మోడ్చి యో
కారుణ్యాకర యేను బాలుఁడను సర్గప్రోద్భవాధార మై
సారస్యం బగు బుద్ధి యె ట్లొదవుఁ దత్సామర్థ్యసంపన్న మై.

134


వ.

అని పలుకు నెడ నప్పు డప్పరమనివాసుని దివ్యమంగళశరీరంబువలన
నొక్క మహాతేజంబు వెడలి మదీయవదనద్వారంబులు ప్రవేశించి
యిట్లనియె.

135


శా.

ఏ నెట్లట్టుల నీవు సర్వభువనాధీశుండ వై సర్వవి
ద్యానంతప్రతిభాసమన్వితుఁడ వై యక్షీణమత్ప్రాప్తసు
జ్ఞానాపూరితమానసుండ వగుచున్ సర్వజ్ఞతం బొందు ని
త్యానందప్రకృతిన్ సృజింపు మిఁక రేతస్సృష్టి సర్వాత్మకా.

136


క.

ఆ రేతోమయసృష్టికి
గారణ మగుఁ గర్మసమితి కర్మములందుం
దారుకొని దేవమానవు
లారూఢిగఁ గట్టువడుదు రంభోజభవా!

137

క.

జననంబునకును మరణం
బునకును తత్కర్మసరణి మునుకొని రాఁగా
రణమున సుఖదుఃఖప్రద
మన వేలయును జీవకోట్ల కది రభసముగన్.

138


క.

ఆకర్మంబులఁ జెందక
లోకంబుల మత్పదాబ్జలోలుపు లయ్యున్
నీకును దలఁకక సంతో
షాకారులు చనుదు రవ్యయస్థలమునకున్.

139


క.

జననముఁ బొందినఁ ద్రిజగ
జ్జన మెల్ల మదీయనామసంకీర్తన చే
సినమాత్రన వసుధాతల
మునఁ దిరుగ జనింప రఖిలమునిజనవినుతా!

140


గీ.

అట్టి జను లెల్ల వసుధాతలాంతరమున
మించి యెప్పుడుఁ దిరుగ జన్మించకుండి
రపుడె సృష్టికి విమ్నంబు లరుగుదెంచు
నట్లు గావున నిట్టివృత్తాంత మెఱిఁగి.

141


సీ.

దేవతాంతరమార్గదీప్తంబు లగు నట్ల
        పెక్కుశాస్త్రముల గల్పించి యందు
జతురతతోడ నస్మద్విరోధకరంబు
        లగు యుక్తు లెల్లను దగ నొనర్పు
మవి చూచి ఘనసంశయాత్ములై జను లెల్ల
        మోహంబు నొందియు ముక్తిమార్గ
కారణం బగు మమ్ముఁ గననెఱుంగక దుఃఖ
        వశమున దుర్గమవసతులందుఁ
జేరి కర్మానుభవములు చేసి పిదపఁ
బుత్త్రదారాదిమాయాభిపూర్ణు లగుచు
సారవిరహితసంసారసాగరమును
దిరుగుచును జన్మలయములఁ దెమలువారు.

142

క.

ఈరీతి వివిధమతములు
చేరికగాఁ జేసి జనుల చిత్తము లెల్లన్
మీఱి కలగంగఁ జేయుము
వారికి జననవ్యయము లవశ్యము గలుగున్.

143


చ.

అనవరతంబు మద్గుణము లాత్మ దలంచుచు జిహ్వలందు మ
ద్వినుకుము లైన నామములు వేడుకతోఁ బఠియించునట్టిస
జనులు గతాఘు లయ్యు సురసన్నుతు లయ్యు జగంబులో బున
ర్జననము లేక నిల్తు రిట సంతతనిత్యవిహారసక్తు లై.

144


సీ.

బాహ్యసంభవము నాభ్యంతరసంభవం
        బన రెండు విధములఁ దనరు దుఃఖ
మందును రోగశస్త్రాదిసంజాతంబు
        బాహ్యదుఃఖం బది భౌతికంబు;
ఆభ్యంతరంబు పుత్త్రాదివియోగజం
        బదియ భౌతికదుఃఖ మనఁగఁ బరఁగు
నేకద్ద్వయీభావ మీక్షింప వారక
        సుఖము సర్వేంద్రియశుభకరంబు
వరుసతో నిట్లు దట్ట మై వచ్చునట్టి
వివిధసుఖదుఃఖంబులు వీక్ష చేసి
వట్టిమోహంబు నొందక వలసి మమ్ము
దలఁచువారలు మన్మూర్తిఁ గలయువారు.

145


గీ.

సుఖము వచ్చిన మతిల్లి చొక్కుపడక
దుఃఖ మొందిన దురపిల్లి తొట్రువడక
నిర్మలం బగు బుద్ధిచే నిలిచి మమ్ము
దలఁచు పుణ్యుండు నిలుచు మద్వసతియందు.

146


వ.

మఱియు సాలోక్యసాకారసామీప్యసాయుజ్యంబు లన ముక్తి నాల్గువి
ధము లై పర్యవసించు నందు సమానలోకనివాసంబు సాక్యంబును, సుద
ర్శనపాంచజన్యాదిచిహ్నంబులు గలిగి మత్సమానరూపంబు గైకొనుట సా
కారంబును మత్సన్నిధానంబునఁ గైంకర్యపరుండై వెలుంగుట సామీప్యం
బును మదీయతేజంబునం గలిసికొనుట సాయుజ్యంబు నగు న ట్లధికారవిశే
షంబున మద్భక్తుండు తత్తత్పదంబులఁ బొందు నందు.

147

క.

వాలాయం బగు భక్తిని
నాలుకతుద మమ్ముఁ బొగడు నామాంకధరుల్
సాలోక్యముక్తిఁ బొందుదు
రాలస్యవిహీను లగుచు నతిరభసమునన్.

148


శా.

ఏ కాలంబును మమ్ముఁ గూర్చి ఫలమం దెందున్ విరక్తాత్ము లై
లోకాచారము లైన కర్మముల నాలోకించి తత్కర్మముల్
సేకూరన్ వెస నాచరించు సుజనుల్ శృంగారపుణ్యాత్ము లై
సాకారం బను ముక్తిఁ బొందుదురు రాజత్పంకజాంతర్భవా!

149


శా.

కామక్రోధమదాదులం గెలిచి దుష్కర్మక్రియాశూన్యు లై
ప్రేమన్ వహ్నిజలాదులం దొనర మత్ప్రీత్యర్థమై వేడ్కతో
ధీమంతుల్ మముఁ బూజసేసి గతసందీప్తాంగు లై మాన్యు లై
సామీప్యం బను ముక్తిఁ జెందుదురు భాస్వన్మూర్తిసంపన్ను లై.

150


సీ.

అనయంబు మన్నామ మాత్మలో దలఁచుచు
        సత్యంబు వదలక సాధువృత్తిఁ
దిరుగుచు దానంబు దీనార్థితతులకు
        నొసఁగుచు నత్యాశ నొదుగువడక
సంతుష్టి నొందుచు శాంతు లై సర్వంబు
        మునుకొని మద్రూప మని యెఱింగి
పలుద్రోవ వీక్షించి భావంబులోపల
        సందియంబుల నొంది చౌకపడక
గురుముఖంబున సద్భక్తిఁ గుదురుపఱిచి
ధ్యానయోగప్రబలు లైన యట్టిజనులు
జలము జలరాశిలోపలఁ గలయునట్లు
తెలివి సాయుజ్యముక్తి నన్ గలయువారు.

151


సీ.

యజ్ఞాదినిత్యకర్మాచారవిధియును
        దానంబు సత్యంబు దమము శమము
దేవతాభజనంబు తీర్థజలస్నాన
        మాత్మశుద్ధియు నింద్రియముల గెలుచు

టనృతంబు విడుచుట హర్షంబు నొందుట
        చేరి సజ్జననిందఁ జేయకుంట
గోవిప్రభక్తిసంభావితుం డగుచుంట
        సర్వసమత్వంబు జరుపుచుంట
తఱచుగను వేడ్క లొదప మత్కథలు వినుట
క్రోధభయము లణంగంగఁ గుదియఁ దిగుచు
టప్రయాససంప్రాప్తవ్య మందుకొనుట
కణఁకతో విను సుజ్ఞానకారణములు.

152


గీ.

ఈ జగం బెల్ల మిథ్యగా నెఱిఁగికొనుట
జ్ఞాన మన నొప్పు నట్టి సుజ్ఞానగమ్య
మైనవస్తువ యని నన్ను నాత్మఁ దెలియుఁ
బుణ్యమతు లెల్ల మత్పురిం బొందువారు.

153


క.

నీ వఖిలభువనములకును
బావనుఁడవు మత్కృపావిభాసితుఁడవు నే
నీవని బెరయం దొణఁగితి
నీవాక్యములన్ బరిగ్రహింపుము తనయా!

154


క.

రంగేశ! రంగసంగత
రంగప్రియ! రంగరాజ! రంగవిహారా!
రంగాధినాయక! శ్రీ
రంగాధిప! రంగనిలయ! రంగావాసా!

155


మాలినీవృత్తము.

కరధృతదరచక్రా! ఖండితారాతిచక్రా!
సురవినుతచరిత్రా! శోభితశ్రీకళత్రా!
దురితతిమిరమిత్రా!ధూసితారాతిగాత్రా!
పరిహృతఖలజాతా! భాగ్యవత్పారిజాతా!

156

గద్య
ఇది శ్రీహనుమత్కటాక్షలబ్దవరప్రసాద సహజసారస్వతచంద్ర
నామాంక రామవిద్వన్మణికుమా రాష్టఘంటావధానపరమే
శ్వర హరిభట్టారకవిరచితం బైన మత్స్యపురాణ
ఖండం బగు విష్ణుధర్మోత్తరంబునందుఁ
బ్రథమాశ్వాసము