మత్స్యపురాణము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

మత్స్యపురాణము

తృతీయాశ్వాసము

క.

శ్రీవల్లభ జగదీశ్వర
కావేరీమధ్యనిలయ కరుణారససం
భావిత బుధజనసేవిత
భావభవాకార రంగభవననివాసా.

1


వ.

అవధరింపు మిట్లు కమలసంభవుండు నారదునకు సాధారణధర్మంబులును
జాతిధర్మంబులును జెప్పి మఱియు నిట్లనియె.

2


ఉ.

విప్పగు నిట్టి కర్మపదవిం జనువారికి మంత్రతంత్రముల్
దప్పినఁ బత్యవాయములు దార్కొనివచ్చును గాని దాన లే
దప్పరమేశుఁ బొందెడు ప్రయత్నము నే నిట నీకు వేడుకం
జెప్పెద గుప్తమార్గమునఁ జేయుము దత్క్రియ భూసురోత్తమా.

3


గీ.

మహిమ నీవారశూకాగ్రమాత్రమైన
మోప నెడలేక శ్రీవిష్ణుమూర్తితేజ
మలచరాచరవిశ్వంబు నెలవుకొనియు
నిలుచు నొరులకుఁ దెలియంగ నలవిగాదు.

4


వ.

అట్టి యెడ సంస్కారవిశేషంబున సమ్యజ్ఞానంబు నొంది దేహి సంసార
సాగరంబునఁ బరిభ్రమించుచు నైనను దద్గుణంబులం జెందక గురుముఖం
బునఁ దత్పదంబు దెలిసి త్వగ్రక్తమాంసమేదోమజ్జాసహితం బై యతి
హేయశుక్లశోణితసంయోగంబున సముత్పన్నంబగు పాంచభౌతికదేహం
బు నిత్యంబు గాదనియు శరీరమాత్రబాంధవులగు సుతదారాదులు దుఃఖ
ప్రదులనియుఁ బయాససంపాదితంబులగు పశువిత్తాదులు క్లేశసహితంబు
లనియు సుఖంబులు స్వప్నప్రాయంబులనియు వ్యాపారంబులు విద్యుత్స
మానంబు లనియు మనంబున వితర్కించి ప్రసన్నుండై యభ్యాసయోగం

బునఁ జిత్తం బేకాయత్తంబు సేసి బాహ్యభ్రమంబు విసర్జించి కామమదా
దులఁ గుదియందిగిచి చక్షురాదీంద్రియంబుల ప్రచారంబు లంతరాత్మ
యందు నియమించి సంశయంబు నొందక దృఢనిశ్చయంబు గలిగి యఖం
డజ్ఞానపిహితచేతస్కుఁడై శిలామయ దారుమయ లోహమయ మృణ్మయం
బు లయిన ప్రతిమావిశేషంబుల నెద్దియైనఁ పీఠంబునం బాదుకొలిపి యందుఁ
బుండరీకాక్షు నావహించి యమ్మహాత్మునకు భక్తిపూర్వకంబుగ నుపచార
విధినగు పూజ సమర్పించి ప్రదక్షిణనమస్కారంబు లాచరింపఁగవలయు
నందు సాలగ్రామశిలామధ్యంబున లక్ష్మీకాంతుండు నిత్యనివాసుం డగుఁ
గావున దత్పూజానమస్మృతులు పాపక్షయకరంబులు ముఖ్యమార్గసాధనం
బులు నగు నట్టి సాలగ్రామమూర్తి విశేషంబుఁ జెప్పెద నాకర్ణింపుము.

5


మ.

హరి పూర్వంబున జీవకోట్లు నిజకర్మాయత్తులై సంతతా
చరితానేకమహాఘసంఘములచే సంప్రాప్తమైనట్టి దు
ర్భరదుఃఖప్రదరౌరవంబులను సంభ్రాంతాత్ములై వేఁగఁ చ
త్పరితాపంబులు చూచి హృద్గతదయాదాక్షిణ్యసంపన్నుడై.

6


సీ.

స్నానమూలంబున సకలపాపక్షయం
        బునకునై ప్రవహించుపుణ్యనదులు
దానంబులను దుష్కృతము లణంగుటకు నై
        వేదవిద్యాయుక్తవిప్రవరులు
యజ్ఞతంత్రముల నత్యంతాఘశోషణం
        బునకు నగ్నిత్రయంబును విచిత్ర
పూజావిధానసంపూర్తి సంహెూనాశ
        మునకు సాలగ్రామములు ననంగ
వీని సృజియింప దేహప్రవిష్టులైన
యట్టి జీవులు స్నానదానాగ్నిహోత్ర
నిత్యపూజదివిధులు వర్ణింపనడపి
చనుదు రవ్యయమగు మోక్షసదనమునకు.

7


వ.

అట్లు గావునఁ బుణ్యాదికృత్యంబులకు సాలగ్రామవిశేషంబులే లక్ష్మీనా
రాయణస్వరూపంబు లని తలంచి దేహి తన్మూర్తులయందుఁ బ్రణవపూర్వ

కంబులును నమోంతంబు లైన విష్ణునామంబులతోడఁ దులసిదళంబులఁ
బూజించి వైకుంఠనగరనివాసుం డగునని మఱియు ని ట్లనియె.

8


శా.

సాలగ్రామశిలాభిషేకజలముల్ సంప్రీతితో మౌళిపై
లీలం దాల్చు నరుండు పాతకమహాళిం బాసి విఖ్యాతది
వ్యాలంకారసమేతుఁడై చను నమర్త్యశ్రేణి హర్షంబునన్
జాలం బువ్వులవర్షముల్ గురియ సన్నాహంబునన్ ముక్తికిన్.

9


క.

ప్రేమను బుధులకు సౌల
గ్రామశిలాదాన మిచ్చి కలుషవిహీనుం
డై మాధవపురిఁ బొందును
సామాన్యుండైన లోకసన్నుతచరితా.

10


క.

చాతురి సాలగ్రామశి
లాతోయముఁ గ్రోలి నరుఁడు లక్ష్మీపతి లో
కాతిశయసౌఖ్య మొందును
జాతివిహీనాత్ముఁ డైన సత్యప్రభనా.

11


శా.

శ్రీదేవీపతిరూపమై తనరు నాశ్రీమూర్తిఁ బూజించి స
ద్వేదోచ్చారితమంత్రపూర్వముగ నైవేద్యంబు లర్పించి స
మ్మోదంబందుచుఁ దత్ప్రసాదములు తామున్ బుత్త్రమిత్రాంగనా
సోదర్యావృతులై భుజించు నరు లస్తోకవ్యధాముక్తులై.

12


వ.

హరిపురంబుఁ జేరుదురు. మఱియు భక్తియోగంబు కర్మనిష్ఠంబు జ్ఞాననిష్ఠంబు
నన ద్వివిధంబై ప్రవర్తించు నందు స్నానదానయజ్ఞస్థండిలపూజాదిబాహ్యోప
చారంబులయందు నిశ్చలంబగు భక్తికర్మనిష్ఠంబును ధ్యానయోగంబున
హృత్పద్మకర్ణికామధ్యంబునఁ బరమాత్మం గనుంగొను భక్తిజ్ఞాననిష్టంబు నగు.
నిట్లు బాహ్యాభ్యంతరసక్తంబగుభ క్తిగలిగిన దేహికి వితర్కింప స్వల్పంబగు.
ననలంబు తృణాదులచేతఁ బ్రవృద్ధంబై యరణ్యదహనసామర్థ్యంబునందు
చందంబున జ్ఞానానలంబు కర్మయోగప్రవృద్ధంబై సంచితప్రారబ్ధకర్మ
నిర్మూలనంబు సేయు బలిమి గలిగి స్వయంవ్యక్తంబై ప్రకాశించు. నప్పుడు
సద్యఃప్రసూతుండగు బాలునకు స్తన్యపానంబున దుగ్ధంబు గ్రోలెడి వెరవు
తనయంతనె సంభవించురీతి నతనికి స్వానుభవైకవేద్యంబై యవిచ్ఛిన్నంబై

యపరిమితం బైన బ్రహ్మానందసుఖం బుదయించిన దేహంబునం దాదరం
బు విడుచు దేహసమాగతసౌఖ్యంబులయందు విరక్తుం డైనట్టి మహాత్ముం
డు సాయుజ్యంబు నొందునని చెప్పిన విని నారదుం డిట్లనియె.

13


చ.

సరసిజనాభువక్షమునఁ జయ్యన నుండుటకాని లక్ష్మి త
చ్ఛిరమునఁ బాదుగా నిలిచి సేవ యొనర్పఁగఁ జాలదట్టిచో
హరికిని గంఠభూషణము లై మణికీలితకుండలంబు లై
సిరసున ధార్యమైన తులసీమహిమాతిశయంబుఁ జెప్పవే.

14


వ.

అనినఁ బద్మసంభవుండు మునివరున కిట్లనియె.

15


క.

సురలును నసురులు వారిధిఁ
దరువ సురాసింధురాశ్వతరుణీమణులున్
దరు లుదయించిన ధన్వం
తరి యంతట నమృతకలశధరుఁడై యొదవెన్.

16


క.

అయ్యవసరమున హరి యది
చయ్యన నీక్షించునంత సత్కుచములపైఁ
బయ్యెదఁ గీలించుచు నం
దొయ్యన నొకతరుణి వేడ్క నుద్భవ మందెన్.

17


క.

ఈనియతి నమృతకలశము
లోనం జనియించి రమణి లోకోత్తరు ల
క్ష్మీనాధుఁ గాంచి ఘనల
జ్జానతవదనాబ్జ యగుచు నభినుతి కెక్కెన్.

18


మ.

జలజాక్షుండును వేడ్కఁ జూచెను సుధాసంజాతనంభోజినీ
దళవిస్తారితలోచనన్ విమలహస్తం బక్వబింబాధరన్
బలభిన్మత్తకరీంద్రకుంభయుగళీప్రత్యాఖ్యవక్షోరుహన్
లలితాస్యన్ సుకుమారమూర్తిసహితన్ గాంతామణిన్ భ్రాంతిమై.

19


వ.

అంత నప్పరమపురుషుండగు లక్ష్మీవల్లభుండు తత్కాంతాదర్శనసంజాత
హర్షంబున నుప్పొంగి మనంబు సింజాసమంజీరకీలితనీలరత్నప్రభాపటల
శ్యామలితతత్పాదసరోరుహంబులయందును, బద్మరాగమణిమయం బగు
రశనాకలాపంబువలన సముద్ధితంబగు తేజఃపుంజంబుచేత రంజితం బై

విచిత్రంబగు దుకూలంబునకు నాలంబనంబగు తదీయజఘనప్రదేశంబు
నందును యౌవనతోరణంబునకునై మదనభూపాలుఁ డొనర్చు హేమసోపా
నపరంపరలో యన విలసిల్లు వళిత్రయంబుచేత నభినుతంబగు తన్మధ్య
భాగంబునందును జంభవైరికుంభకుంభస్థలంబులచక్కదనంబు నధఃక
రించు తత్కుచకుంభంబులయందును, గంకణకేయూరరత్నముద్రికాము
ద్రితంబులై భిన్నంబులను మిసమిస మెఱుంగుల తెరంగునకు నెఱతనంబులు
గఱపుచు సువర్ణలతికలచందంబున విలసిల్లు తద్బాహుదండంబులయందును,
దరహసితవికసితంబై పూర్ణిమానిశాకరశోభాతిరస్కరణచాతురీధురీణం
బగు తన్ముఖారవిందంబునందును, బంచశరునకు సంచితంబులగు నిశితశ
రంబులో యనఁ బ్రసరించిన కటాక్షవీక్షణంబులకు నాలయంబులగు నయ
నసరోరుహంబులయందును, ననల్పకల్పమహీరుహప్రసవకల్పితంబులగు
మాల్యంబులసమ్మేళనంబున వినిర్గతంబగు సుమనోరజంబున శోణవర్ణం
బగు తదీయసీమంతంబునందును, సీమంతప్రసూనగుచ్ఛంబులను నిచ్ఛావి
హారప్రదేశంబులకు భ్రమరప్రవేశ మనందగు తత్కబరికాభారంబునందు
ను విచిత్రంబులగు మకరీపత్రంబులకు బాత్రంబులై సిద్ధంబులగు చెక్కు
టద్దంబులయందును నిమేషరహితంబగు దృష్టి పాదుకొల్పి యచ్చెరువందు
చు నిట్లనియె.

20


మ.

పరిపూర్ణాకృతియందు సద్గుణములన్ భాగ్యంబునం గోకిల
స్వరధిక్కారసమర్థభాషణవయఃసంపద్విలాసంబులన్
సిరితోడం దులఁదూఁచ నెక్కు వగుచున్ జెన్నొందుచున్నట్టి యీ
తరుణీరత్నము పేరింకన్ దులసియై తర్కింప వర్థిల్లెడున్.

21


వ.

అని పలికి మరియు నిట్లనియె.

22


క.

సిరికన్న నెక్కువగు నీ
తరుణి తులసియనుచు విబుధతతి వొగడఁగ మ
చ్చిరమునఁ దాత్పర్యము సు
స్థిరముగ విహరించుఁగాత సిరులు దలిర్పన్.

23


సీ.

అని పల్కునంతన యబ్జలోచన యప్పు
       డఖిలదేవాసురు లభినుతింపఁ

బొలుపొంద నమృతసంపూర్ణకలశిడిగ్గి
       హర్ష మందఁగ మందయాన యగుచుఁ
బార్శ్వంబులను దేవభామలు కర్పూర
       నీరాజనంబులు నెమ్మి నొసఁగఁ
గమ్మపూఁదేనియల్ గ్రమ్మంగ నవపారి
       జాతపుష్పప్రవర్షములు గురియ
దరవిహసితంబు మోవిపైఁ దళుకులొత్తఁ
దెలిగటాక్షాంచలోద్భూతదృష్టి నిగుడ
హరిసమీపంబున కరుగ నమ్మహాత్ముఁ
డాతలోదరి కరపద్మ మంది యచట.

24


క.

ఆలింగనమున నయ్యమృ
తాలయ నాత్మీయహృదయమం దిడుకొనినన్
శ్రీలలన చూచి రోష
ప్రాలంబితవదన యగుచుఁ బతి కి ట్లనియెన్.

25


చ.

సరసిజనేత్ర నీకుఁ బ్రియసఖ్య మొనర్చెనె యీవధూటి య
న్యరమణి కాక్రమింపఁ గడిదై మదనాప్తగృహం బనంగ సు
స్థిరమగుయుష్మదుజ్జ్వలవిశేషభుజాంతరమందు నిల్చె నే
తరుణికినైన నాత్మవిభు దాసిన భామిని సైఁపవచ్చునే.

26


గీ.

అట్లు గావున భువనవిఖ్యాత యగుచుఁ
జెలఁగుచుండెడు నట్టియీతులసిభామ
భవదుదారాంఘ్రిభక్తి చేపడినదైన
భూరుహాకారసహితయై పొలుచుఁగాక.

27


వ.

అని హరిప్రియ నుడివినవచనంబులకుఁ జిన్నఁబోయి కన్నీరు ఱెప్పలనిం
చుచు సంతసం బుడిగి వేదనాయత్తచిత్తయై నిల్చియున్న యాతులసిలలనం
గనుంగొని పరమదయాపరిపూర్ణుండై చక్రధరుండు సాంత్వనపూర్వకం
బుగా నిట్లనియె.

28

ఉ.

కన్నుల నీరు నించుచునుఁ గందఁగనేల లతాంగి యోశుభా
భ్యున్నతమూర్తి నీ వమృతపూర్ణమహాకలశంబునందు సం
పన్ననయౌవనంబులకుఁ బాత్రమవై జనియించి తట్టి నిన్
సన్నుతి సేయఁగాఁ గలరె సర్వజగంబుల దేవమానవుల్.

29


చ.

సురలు నుతింప భూసురులు సొంపుగ వందన మాచరింప దు
ష్కరకలుషౌఘసంహరణకారణరూపమవై జగంబులో
నొరులకుఁ జూడ శాఖిక్రియ నుండినఁ బుష్పదళచ్ఛలంబునం
దిరముగ మూర్థభాగమున నేను ధరించెద నిన్ను మానినీ.

30


క.

ఎచ్చట నీవు జనింతువు
చెచ్చెరఁ దరురూప మంది సిరులు దలిర్పన్
మచ్చిక మదిఁ దలఁకొన నే
నచ్చట విహరించువాఁడ నంభోజాక్షీ!

31


సీ.

నవకిరీటమున కన్నను వాసిగా మౌళిఁ
       బాదుగా ధరియింతు నీదళంబుఁ
దెలివితో గుండలంబులభాతి శ్రుతులందు
       నేర్పుతో ధరియింతు నీదళంబు
దామంబులందు నుద్దామంబుగా గ్రీవ
       నియతిమై ధరియింతు నీదళంబు
నురమున సవతైన సిరితోడ సరివొంద
       నిగుడించి ధరియింతు నీదళంబు
నదియునుంగాక భువనత్రయంబునందుఁ
బాదపాకృతిఁ దొల్చు నీపాదమూల
మున రమాకాంతతోఁగూడ మోద మలరఁ
గ్రీడ సేసెదఁ బూబోఁడి ప్రేమ మలర.

32


క.

నినుఁ బూజించిన జనులకు
ననుమానము లేక కలుగు నస్మత్పురసా
ధునివాసజనితసౌఖ్యము
వనజాయతలోలనయన వర్ణింపంగన్.

33

మ.

ధరణిన్ సర్వసుధాశనాహితచమూదర్పంబు వారింప సు
స్థిరలీల యదువంశసంభవుఁడనై చిత్రంబుగా గోపికా
తరుణుల్ గొల్వ భవద్వనాంతరములన్ దార్కొన్నహర్షంబుతో
నెరవై క్రీడ యొనర్చువాఁడ రమణీ నిత్యప్రభాతంబులన్.

34


క.

సిరి యలిగిన వచనములకుఁ
బరితాపము నొందవలదు పద్మానన యేఁ
దిరముగ నిల్చెద నీయం
దరయఁగఁ దత్పంకజాలయాసహితుడనై.

35


వ.

మఱియు నిన్ను జనులు తులసి యనియు, విష్ణుప్రియ యనియు, నమృతో
ద్భవ యనియు, ననురూపయనియు, మాధవి యనియు, వైష్ణవి యనియు,
కుండలి యనియు, మోహిని యనియు,శంఖిని యనియుఁ, బదప్రభ
యనియు, నారాయణి యనియుఁ, జక్రిణి యనియు నిట్లు ద్వాదశనామంబులం
కొనియాడి కలుషరహితులును వైకుంఠనివాసులు నగుదురని యాలక్ష్మీవల్ల
భుం డానతిచ్చినయంత వసుధాంశంబున నమృతకలశసంభవ యగు నా
తులసీలలామ జగంబులు పవిత్రంబులు సేయుకొఱకు నై తరురూపంబు దా
ల్చి నిజపుష్పదళంబుల విష్ణుకైంకర్యంబు సలుపుచుండెనని చెప్పి చతురాస
నుండు మఱియు నిట్లనియె.

36


క.

తులసీతరుసన్నిధి వి
ప్రులకును మృష్టాన్న మొసఁగు పుణ్యుఁడు సిరులన్
వెలయుచు మని తుద లక్ష్మీ,
లలనాధిపలోకసుఖములను గను ననఘా!

37


క.

తులసీతరుమూలంబున
జలములు పరిపూర్తినిడిన సజ్జనులు మహా
కలుషములఁ బాసి విభవం
బులఁ బొందుదు రాత్మబంధుపుత్త్రులతోడన్.

38


క.

తులసీమూలంబున ని
శ్చలభక్తిని విష్ణుపూజ సలుపు మహాత్ముల్

బలువైన రోగజాలము
గెలుతురు పరిపూర్ణవిభవకీర్తులు వెలయన్.

39


క.

కన్నులఁ జూచిననైనను
జెన్నుగ మదిలోనఁ దలఁపు చేసిననైనన్
మన్ననఁ బొగడిననైనను
నెన్నంగాఁ దులసి నరుల కిష్టము లొసఁగున్.

40


క.

తులసీనలినాక్షంబులు
గళముల ధరియించుచక్రకరభక్తులు ని
శ్చలసుజ్ఞానము లొదవఁగఁ
దలఁకరు యమహస్తకాలదండంబునకున్.

41


క.

అనయము తులసీదళముల
వనజాక్షుని బూజసేయువారలు భవసం
జననము నొందక విభవం
బునఁ జనుదురు పుణ్యలోకమునకు మునీంద్రా.

42


గీ.

తులసీమూలంబు మృత్తిక తిలకముగను
ఫాలభాగంబులను దాల్చు భవ్యమతులఁ
జూచినప్పుడె భయమంది చోద్యముగను
దొలఁగిచనుదురు యమదూత లలఘుచరిత!

43


క.

శ్రీవిష్ణుప్రీతిగఁ దుల
సీవననికటమున భక్తిఁ జేసినదానం
బావనజోదరపురిసౌ
ధావాసంబునకు హేతువై విలసిల్లున్.

44


వ.

మఱియు నొక్కపురాతనోపాఖ్యానంబుఁ జెప్పెద నాకర్ణింపుము.

45


సీ.

నిరుపమప్రాకారపరిఖగోపురసౌధ
       వరతోరణద్వారవర్ణితంబు
మత్తేభతురగహేమస్యందనానేక
       వీరనాయకచమూవిశ్రుతంబు
పణ్యపూర్ణాపణాగణ్యపణ్యాంగనా
       పాదలాక్షారసభ్రాజితంబు

వివిధోపవనకల్పవృక్షపుష్పాంతర
       వ్యాకీర్ణపరిమళవాసితంబు
దమ్మటానేకభేరీమృదంగపటహ
పణవగోముఖవాద్యసంభవ నినాద
బధిరితాశావకాశంబు భాసురంబు
నగుచు విలసిల్లుఁ బుష్పకన్యాపురంబు.

46


సీ.

ఆపురంబున సంతతాచారసహితుండు
       వేదవిద్యాశాస్త్రవిశ్రుతుండు
నిత్యకర్మక్రియానియతుండు హరిపాద
       భక్తుఁ డార్యుఁడు లోకపావనుండు
సత్యంబు నిరతంబు జరుపుచుండెడివాఁడు
       సద్గుణప్రఖ్యుండు సర్వసముఁడు
పరకాంతఁ దల్లిఁగా భావించు పుణ్యుండు
       పరమతపోధ్యానపారగుండు
దేవలుండను నొక్కభూదేవసుతుఁడు
తల్లిదండ్రులు మృతిఁబొందఁ దన్నుఁ బ్రోఁచు
బాంధవు డొక్కఁడైనను బ్రాపులేక
బ్రహ్మచర్యము తీర్థయాత్ర విడకుండు.

47


వ.

మఱియు నప్పరమభాగవతోత్తముండు వయఃపరిపూర్ణుండయ్యును గామ
క్రోధమదాదులం దగులువడక ఖడ్గధారాగమనంబు చేయుచందంబున న
ప్రమత్తుండై బ్రహ్మచర్యంబు నడపుచుఁ బుణ్యనదీవిశేషంబులయందుఁ
దీర్థంబులాడుచు భిక్షాశియై హరినామమంత్రంబు జపించు టేమఱక సంచరిం
చుచు నొక్కనాఁడు భాగీరథీతీరంబున కరిగి తత్పుణ్యజలంబుల స్నానాది
కృత్యంబులు దీర్చి భిక్షాశియై హరినామమంత్రజపంబు మఱవక జపించుచు
న్నసమయంబున నొకసాలవృక్షంబు శాఖాగ్రంబుల వ్రేలుచు శవాకా
రంబులు దాల్చి మొఱలిడుచున్న నరనారీజనంబులం గనుంగొని దయాపరి
పూర్ణుండై వారలమనోరథంబుఁ దెలియంబూని యచ్చటి కరిగి యందుఁ దల్లి
దండ్రులరూపులు దోఁచిన వారలం జూచి యిట్లనియె.

48

చ.

సరసిజమిత్రతేజమున సంతతతప్తశరీరులై నిరం
తరమును దీవ్రదుఃఖమున ధైర్యము జాఱఁగ క్షుత్తృషార్తులై
మొఱలిడుచున్ మహోష్ణమున మోములు వాడఁగఁ బుణ్యులార! యీ
తరువున మీరు వ్రేలెడువిధంబది దెల్పుఁడు నిశ్చయంబుగన్.

49


క.

చలనమునొందని నామది
చలియింపఁదొడంగె నేఁడు చర్చింప మహా
త్ములు మీరలు మిముఁ జూచిన
నలరదె దయ యెట్టివారికైనను దిరమై.

50


క.

ఏపని సెప్పిననైనను
నోపికఁ దత్కార్యభార మొనరించెద నీ
రూపమున మీరు దుఃఖితు
లై పరఁగఁగ నేల భూరుహస్థితు లగుచున్.

51


వ.

దేవలుం డట్లు దయాపూర్వకంబుగాఁ బలికినవచనంబులకు సంతసించి త
ద్వృక్షనివాసు లిట్లనిరి.

52


క.

పనివడి దయ నీ విచ్చటి
కిని వచ్చితి వమరపూజ్యకీర్తులు వెలుగన్
మునివర మద్వృత్తాంతము
వినుపించెద మవధరింపు వీనులు దనియన్.

53


వ.

అనిన నట్ల కాక యనుఁడు.

54


సీ.

మత్స్యదేశంబున మానితంబై యొప్పు
       పుష్పకన్యానామపురవరంబు
దేవలుండన మహీదివిజుండు గలఁడు త
       త్పురమున నాచారపూర్ణుఁ డనఘుఁ
డతఁడు బ్రహ్మజ్ఞానియై యనవరతంబు
       బ్రహ్మచర్యంబునఁ బరఁగుచుండుఁ
బుణ్యతీర్థస్నానపూతాత్ముఁడై తపో
       ధ్యానసంయుక్తుఁడై తనరువాఁడు

నతని వంశాబ్ధిభవుల మే మనఘచరిత
యామహాత్ముఁడు సద్గృహస్థాశ్రమమున
నిలిచి సంతానహేతువై వెలసెనేని
కలుగు మాకును నూర్ధ్వలోకములసుఖము.

55


గీ.

అతఁడు వైవాహికక్రియ నలరఁడేని
త్రిదివమునఁ దర్పణాంజలి తృప్తి లేక
నడవవలయును బాతాళనరకమునకు
వితతదుఃఖార్తు లైనట్టి పితరులకును.

56


క.

ఇదికర్మమయమహీజము
తుద మొద లెఱుంగగరాదు తోయజభవునిన్
గుదియఁగఁ దివియక పోదిది
యదవద స్రుక్కించుఁగాని యణఁగదు విప్రా!

57


వ.

మఱియు నరుండు మునిఋణంబు దేవఋణంబుఁ బితౄణంబు నను ఋణత్ర
యంబున సంభవించు. నం దస్ఖలితబ్రహ్మచర్యంబున మునిఋణంబువలనను ,
నగ్నిహోత్రక్రియాకలాపంబున దేవఋణంబువలనను, బరమసాధ్వియగు
కులసతియందు సముత్పాదితంబగు సంతానంబునఁ బితౄణంబువలనను
ముక్తుండై యనంతరంబు సంసారంబు పరిత్యజించి చతుర్థాశ్రమస్వీకారం
బునఁ బరమలోనివాసుం డగు. న ట్లగుటం జేసి ఋణంబులు దీర్ప సమర్థుండు
గాని జ్ఞాననిష్ఠునకునైనను సంభవించు యథార్థజ్ఞానంబు ఋణవిమోచన
పర్యంతంబు పునర్జననంబునకుఁ గారణంబగుఁ గాని పునరావృత్తిరహితలోక
నివాససౌఖ్యకరంబుగాదు. మహీరుహంబు గ్రమక్రమంబునఁ బల్లవితంబును
గోరకితంబును బుష్పితంబును నై తుదఫలంబుఁ జూపునది దోహదసంస్కార
సమయంబున ఫలంబుఁ జూప శక్తంబగున ట్లాశ్రమత్రయంబున ఋణవిముక్తి
నొంది దేహి యంత వైకుంఠంబను ఫలంబు నొందు. వర్ణాశ్రమసమేతు
లగువారలకు గర్మకాండప్రతిపాదితంబులగు చత్వారింశత్సంస్కారంబు
లను సాధనంబే ప్రధానంబు. అది శరీరంబునకు జననకారణం బగునట్లు
సంభవించి శరీరకర్మమూలంబున సంస్కృతుండై విప్రుం డనంబఱగు. నవ్వి
ప్రుండు ఋణత్రయవిముక్తుండై పరమపదంబునకుం జను నని యామహీరుహ

నివాసులు పలికినవచనంబు లాకర్ణించి దేవలుండు పరితాపంబు నొంది యందు
శుష్కీభూతులగు జననీజనకులం గనుగొని గోత్రనామపూర్వకంబుగా నమ
స్కరించి యిట్లనియె.

58


క.

పరికింపఁ బుష్పకన్యా
పురనిలయుఁడ దేవలాఖ్యభూసురుఁడ భవ
ద్వరవంశసంభవుండను
గరుణింపఁగవలయు నన్ను గౌరవ మొదవన్.

59


శా.

ఆకర్ణింపుఁడు పుణ్యులార! కలుషాయత్తంబు సంసార మా
లోకింపంగ ననేకరూపములఁ ద్రైలోక్యప్రకాశార్థమై
యాకంజాసనుఁ డాత్మలోఁ దలఁచి భవ్యాకారశోభావయో
వ్యాకీర్ణాంగనలన్ సృజించెను దపోవైఫల్యబీజంబులన్.

60


క.

మాయామృగరూపంబులు
కాయనిబీరెండ లాత్మఘాతుకలు మరుం
డేయని నిశితశరంబులు
పాయనికర్మములు సతులు పరికింపంగన్.

61


తే.

అట్లు గావునఁ దద్గృహస్థాశ్రమమున
సతులయందును బుత్త్రసంతతులు వడసి
కర్మయోగమునఁ జరించు ధర్మరతులు
కణఁక సంసారజలరాశిఁ గడువఁగలరె?

62


ఉ.

మీనము మాంసలోభమున మించురయంబున నామిషంబునన్
గానఁగరాక తీష్ణమగు గాలము మ్రింగి నశించుతీరునన్
మానవుఁ డాత్మవిత్తనుతమానినులందలి మోహసక్తుఁడై
కానగలేక పొందు ఘనకర్మవశంబున రౌరవంబులన్.

63


సీ.

సతులయంగంబున నతిఘనం బగుఁ గామ
       మందుమూలంబున నగును దోష
మందున బుద్ధి పర్యాప్తమై నిలువదు
       బుద్ధినిలువమిచెఁ బోవు తెలివి

తెలి వణంగినచోట ధృతిఁ జాఱు నొయ్యన
       చెదరిన ధైర్యంబు పదిల ముడుగు
బదిలంబు నుడిగినఁ బండితులకయినఁ
       గలుగదు జ్ఞానంబు గల్గెనేని
నిలువగానేర దయ్యది బలిమి గలిగి
యట్టిసుజ్ఞానవిరహితుండైన నరుఁడు
విపులసంసారకూపంబు వెడలలేక
భ్రాంతుఁ డగుఁ గర్మపాశాభిబద్ధుఁ డగుచు.

64


గీ.

అట్లు కావున సంసారమందు సుఖముఁ
బొందుమానవులకునెల్ల పువ్వుబోండ్లు
కారణంబులు దుష్కృతాగమనములకుఁ
బ్రత్యయంబులు మోక్షవైఫల్యములకు.

65


క.

తనయునిమూలంబుననై
నను మోక్షము గలుగుననిన నానాఁటికి ద
త్తనయుఁడు దుష్పథమునఁ దిరి
గినఁ గలుగునె భుక్తి ముక్తి కీర్తులు జగతిన్.

66


వ.

అ ట్లగుటంజేసి సమ్యగ్జ్ఞానసమేతుండగు మానవోత్తమునకు బ్రహ్మచర్యా
శ్రమంబె కైవల్యప్రాప్తికిఁ గారణంబును, పితృదేవతాతృప్తికిఁ బ్రథాన
కారణంబును నగుఁగాని యితరోపాయంబులు గైవల్యప్రాప్తికేని పితృ
తృప్తికేని కారణంబులు గావని పలికినఁ బితృదేవతలయందు దేవలుని
జనకుండు హర్షితుండై తనయుని నవలోకించి యిట్లనియె.

67


ఉ.

భూవలయంబులోనఁ బరిపూతచరిత్రుఁడవై శమంబునన్
గోవిదులెల్ల మే లనఁగఁ గోర్కెఁ జలింపక నిశ్చలుండవై
నీ విటు బ్రహ్మచర్య మతినిర్మలవృత్తిఁ జపించుచుండఁగాఁ
బావన మయ్యె మాకులము భాసురపుణ్యసమేత! పుత్త్రకా!

68


క.

ఇలఁ బుణ్యకీర్తనుండన
వెలయంగ గృహస్థధర్మవిఖ్యాతుఁడవై

కుల ముద్ధరించి మము ని
శ్చలపదమున నిలుపవలయు సత్వచరిత్రా!

69


క.

సతిఁ బెండ్లియాడి యజ్ఞ
వ్రతదానము లాచరించి వసుమతిలోనన్
బితృదేవతల ఋణంబులు
చతురతఁ దీర్పంగవలయు సన్నుతసేయన్.

70


సీ.

పుణ్యతీర్థస్నానపూతాత్ముఁడైనను
       లలితసద్గుణసంఘనిలయుఁడైన
బాత్రదానక్రియాప్రఖ్యాతుఁడైనను
       బరిపూర్ణశాంతిసంభరితుఁడైన
నాగతాతిథిపూజ నలరెడువాఁడైన
       నతిశయంబుగ నీతిచతురుఁడైనఁ
గామలోభమదాదిగర్వహీనుండైనఁ
       గమనీయహరిభక్తికలితుఁడైన
సంతతంబును సత్యవిశ్రాంతుఁడైన
నధికసుజ్ఞానసంయుతుండైన నరుఁడు
ఋషిసురేశ్వరపితృదేవఋణము లెల్ల
దీర్చకుండినఁ బోవఁడు త్రిదివమునకు.

71


గీ.

ఇది యెఱింగి మాకు హిత మాచరింపఁగ
మదిని నీకు బుద్ధి యొదవెనేని
తనరఁ బెండ్లియాడి ధర్మంబుఁ గైకొని
సప్తతంతుసరణి సలుపవలయు.

72


వ.

అని పలికిన జనకునకు దేవలుం డిట్లనియె.

73


సీ.

పాదు లూడెను దంతపఙ్తులు కేశముల్
       పలితంబు లయ్యెఁ బదిలము దప్పి
వళులచే స్రుక్కెను వదనంబు వెలుకనై
       యతికుంచితము లయ్యె నవయవములు
కన్నులఁ దిమిరంబు పన్నియుండఁగఁ బూనెఁ
       జాలెను భోగవాంఛాప్రశంస

బలురోగచయము సంభ్రమమున నెదిరించె
       గఫము కంఠంబునఁ గలుగఁజొచ్చె
నధికశుష్కతయును మదీయాంగములకు
సూటిఁ బఱతెంచె నింక నేవీటికైనఁ
బెండ్లియాడెదననిపోవఁ బ్రియముఁ దప్పి
బాలు రెల్లను నవ్వరే భ్రాంతుఁ డనుచు.

74


గీ.

తండ్రిమాట వినక తలఁగిపోవఁగరాదు;
ఋణముఁ దీర్పకున్న నణఁగ దఘము;
వార్ధకంబు వచ్చె వైవుగా; దిఁక గృహ
స్థాశ్రమంబునకును యత్న మెట్లు?

75


వ.

అని పలికిన దేవలునకు జనకుం డిట్లనియె.

76


సీ.

చేదిదేశంబున నాదిమం బగునట్టి
       పురము గోమతియనఁ బొలుపు మిగిలి
కలదు దత్పురమునఁ గౌండిన్యుఁడనుపేర
       విలసిల్లు నొక్కభూవిబుధవరుఁడు
అతనికూఁతురు సత్యవతియు నాఁ దెలివొందు
       కన్యకారత్నంబు ధన్యచరిత
యాపుణ్యవతి నీకు నలరెడు భార్యయై
       తద్గర్భమందు సంతతి జనించు
నట్టి సంతానమునను మా కభిమతార్థ
సిద్ధి యగుఁగాన మదిలోనఁ జింత వదలి
సంశయింపక వేడ్కతోఁ జనఁగవలయుఁ
బూజితంబగు తత్పురంబునకుఁ దనయ!

77


వ.

అనిన దేవలుం డట్ల కాక యని తద్వచనంబుల కొడంబడి పితృదేవతలకు
నమస్కృతు లొనర్చి గోమతీనగరంబునకుం జని కౌండిన్యుని సదనంబున
వేదోక్తమార్గంబునఁ దత్ప్రియతనయయగు సత్యవతి కన్యకం బెండ్లియాడి
గృహస్థాశ్రమసమేతుండై యజ్ఞాదికృత్యంబు లాచరించుచు నిత్యనైమిత్తిక

కామ్యకారుణ్యపైతృకాచరణంబులఁ బితృదేవతాతృప్తిఁ గావించుచు నతిథి
పూజాసమేతుండై పశుధనధాన్యాదిసంపత్పరివృతుండయ్యును దత్సుఖా
సక్తుండై మోహంబు నొందక విష్ణుభక్తిసహితహృదయుండై సంసారసంగ
తుండయ్యును దద్గుణలిప్తుండుగాక ధర్మమార్గంబునఁ బ్రవర్తించుచున్న
యెడ నొక్కనాఁడు.

78


సీ.

నిరుపమపతిభక్తినిర్మలహృదయయై
       తెలివొందునయ్యువతీలలామ
ఋతుమతియై దినత్రితయంబు మౌనపూ
       ర్వంబుగ నిశ్చలవ్రతము నడపి
యంత నాలవదినం బరుదెంచుచో ఋతు
       స్నానార్థమై జలాశయము జేఁరి
తత్తీరమందు నంత్యజుఁడొక్కఁ డతిదీర్ఘ
       విపులాత్మకేశముల్ విప్పుకొనఁగఁ
జూచి యచ్చెరువంది యాసుందరాంగి
పరుని వర్ణించి పలికిన బాప మనుచుఁ
దద్గతంబగుదృష్టిసంధాన ముడిగి
తీర్థతోయాంతరంబునఁ దీర్థ మాడి.

79


సీ.

గృహమున కేతెంచి గృహకృత్యములఁ దీర్చి
       యాసత్యవతి మహాహర్ష మొదవ
భూసురగోదేవపూజలు గావించి
       పతిభుక్తశేషంబు భక్తితోడ
భుజియించి యారాత్రి నిజనాయకునిగూడి
       సంభోగములు వేడ్కఁ జలు పునపుడు
విభునికేశంబులు వీడియంసంబునఁ
       దూలికాకృతులతోఁ దూలియాడ
నవి నిరీక్షించి పూర్వదృష్టాంత్యజాత
కేశపాశంబు తలఁపులోఁ గీలుకొలుపు

నాక్షణంబునఁ దద్గర్భమందు నిలిచె
దేవలునివీర్య మధికప్రదీప్త మగుచు.

80


వ.

ఇట్లు సత్యవతి స్మృతిపూర్వకంబుగాఁ బ్రారబ్ధంబగు గర్భంబు ధరియించి
దశమమాసంబున శుభలగ్నంబునఁ గుమారునిం గాంచిన దేవలుడు తత్కు
మారునిం గనుంగొని పితౄణమోచనం బయ్యెనని హర్షంబున నుప్పొంగి
యబ్బాలకునకు జాతకర్మాదికృత్యంబులు దీర్చి సుభద్రుండను నామంబిడిన
నాతండు శైశవంబు విడిచి యుపనయనాదిసంస్కారంబుల సంస్రృ
తుండై వేదశాస్త్రంబు లభ్యసించియుఁ బితృమాతృవేదదేవతానిందకుండై
కౌమారంబు నతిక్రమించి యౌవనవయఃపరిపూర్ణుండై కామక్రోధాదివశంబు
నొంది సంచరించుచు నొక్కనాఁడు తత్పురాంగణంబునం గలుగు నారామం
బునకుం జని యందు సంచరించుసమయంబున.

81


సీ.

మరుశరంబులరీతి మెఱుఁగులై వెడలెడు
       కలికిచూపులమోము తొలకరింప
నునుపులై బిగువులై ఘనములై తెలివొందు
       కుచము లంచితలీల గునిసియాడ
నతులలాక్షారసాంచితపాదయుగళంబు
       జఘనభాగంబును సందడిలఁగ
గమనవేగోద్భూతగంధవాహముచేత
       దుసిగి పయ్యెదకొంగు దూలియాడఁ
బట్టు బిగిదప్పి తనచేతిపారువంబు
తద్వనాంతరసహకారతరువుకడను
వ్రాల నీక్షించి పరువుతో వచ్చె నటకుఁ
దలపుకదలిక నొక్కమాతంగయువతి.

82


వ.

ఇట్లు తదారామమధ్యంబున కతిత్వరితగమనంబునఁ జని యాచండాల
భామిని వయోరూపలీలాపరిపూర్ణుఁడగు విప్రకుమారునిం గనుంగొని.

83


సీ.

కొనగోళ్ళఁ బుష్పముల్ గోయునెపంబునఁ
       గర మెత్తి కక్షభాగంబుఁ జూపు
వదలిన వలిపపయ్యెద కేలఁ దొలఁగించి
       పాలిండ్లనునుజాయ బయలుపఱుచు

హర్షలజ్జాసాధ్వసాతిచంచలములై
       విలసిల్లుతళుకుఁజూపుల నటించుఁ
బారువంబు తనచే పడిననైనను బోక
       సన్నల నెలయింత సందుకొలుపు
నిట్లు తత్కాంత మదనప్రహితములైన
భావములఁ దన్మహీసురభావనిబిడ
ధైర్యమంతయు వదలించి దర్పకునకు
వశము నొందింష నతఁడుఁ దద్వనిత గదిసి.

84


మ.

స్మరుబాణంబుల కోర్వఁజాలక మహాసంతాపచేతస్కుఁడై
ధరణీదేవకుమారుఁ డప్పు డచటన్ దత్కాంతభావంబు శాం
తరసోద్రిక్తమృదూక్తిచే నొడఁబడన్ దార్కొల్పి యాభామతో
వరసంభోగసుఖంబు నొందెఁ బ్రసవవ్యాకీర్ణతల్పంబునన్.

85


వ.

ఇట్లు సుభద్రుం డాచండాలకాంతాగమనజనితపాతకసమాక్రాంతుఁ డ
య్యును దద్గతమోహంబు విసర్జింప శక్తుండుగాక పతితత్వంబు నొంది కుల
దూషితుండై యంత్యజగృహప్రాంగణంబున నొక్కకుటీరంబుఁ గావించి
చౌర్యద్యూతపానాదివ్యసనంబులం దవిలి నిజాచారంబు విడిచి యాభామి
నింగూడి సంసారసుఖం బనుభవించుచు.

86


క.

ఆపతితుఁడైన విప్రుఁడు
పాపములకుఁ దల్లడిలక పామరుఁడై యు
ద్దీపితమదనాతురుఁడై
యాపడఁతికి లోలుఁ డయ్యె ననవరతంబున్.

87


గీ.

అట్లు చండాలభామతో ననఁగి పెనఁగి
హర్ష మొనఁగంగ ధేనుమాంపాశి యగుచు
నాసుభద్రుండు మది నింతయైనఁ దాప
మంది కుందక దిరుగాడు మందగతిని.

88


వ.

ఇట్లు లజ్జాసాధ్వసవిహీనుండై వర్తించు నతనిగృహప్రాంగణంబున నొక్క
తులసీమహీరుహమూలంబున నతనికి గాలం బరుగుదెంచిన.

89

సీ.

పాశగదాకుంతపాణులై సమవర్తి
       కింకరుల్ చెలరేఁగి పొంక మలరఁ
జండాలకామినీసంగతుం డగుసుభ
       ద్రునిఁ గొనిపోవ నుద్యుక్తు లగుచుఁ
దద్గృహప్రాంగణస్థలమున కరుదెంచి
       తులసీతరుచ్ఛాయ మెలఁగుచున్న
పాపాత్ముఁ డగునట్టిపతితుని వీక్షించి
       యాతనిఁ జేరంగ నలవిగాక
వరుసఁ దప్పక పదుమూఁడువాసరములు
నిలిచి యచ్చోట దోషసంచలితహృదయు
లగుచు నొండొరు లాత్మ నాయమునియాజ్ఞ
కును వణంకుచుఁ దమలోన ననిరి యిట్లు.

90


గీ.

జలజనాభుండు భూరమాసహితుఁ డగుచు
సంతతంబును బృందావనాంతరమునఁ
క్రీడఁ జేయుచునున్నచోఁ గినిసి మనకు
నీతరుచ్ఛాయఁ జేరంగ నీతి యగునె?

91


క.

పాపాభసంయుతుం డగు
నాపతితుని గొనుచుఁ జననియప్పుడె మిగులం
గోపించు నంతకుం డన
నీ పని సమకొల్ప నలవి యెట్లగుఁ దలఁపన్.

92


మ.

అని యీరీతిఁ గృతాంతదూతలు భయాయత్తాత్ములై యాసుభ
దుని జేరంగ నశక్తులైనయెడ నుత్తుంగాకృతుల్ శంఖచ
క్రనవాంభోజగదాసమన్వితకరుల్ రాజద్విభూషాకరుల్
వనజాతాక్షుని కింకరుల్ చనిరి భవ్యంబైన యచ్చోటికిన్.

93


సీ.

ఈచందమున రమాధీశుని కింకరుల్
       బలిమితో నచ్చోట నిలిచినంతఁ
దులసీదళామోదలులితానిలంబుల
       నతిఘనమరణదాహం బణంగఁ

దత్పుష్పధూళులధారాపరంపరల్
       తనువును నతిశీతలంబుఁ జేయఁ
దన్మూలదీపికాస్థలవైభవంబున
       సంచితకలుషముల్ సమసి తొలఁగ
నాసుభద్రుండు పార్థివం బైన యట్టి
యాత్మదేహంబు విడువ నయ్యవసరమున
నతని నవపుష్పకాంతరగతునిఁ జేసి
యారమాధీశుపార్షదు లరుగునపుడు.

94


వ.

సమవర్తికింకరులు రోషావేశంబున నుప్పొంగుచుఁ బాపసమేతుం డగు
సుభద్రుని విడిపింపబూని సహస్రసంఖ్యల వర్తిల్లుచు గదాతోమరపరశు
పట్టిసభిండివాలముసలప్రాసఖడ్గధనుఃకుంతాది వివిధాయుధంబులు
ధరియించి తద్విష్ణుకింకరుల నెదిర్చి కదనంబు సలుపుచున్నయెడఁ దద్రమా
విభుని పరిచారకులు శంకారహితులై కేశాకేశియుద్ధంబు సేయునప్పుడు
సమవర్తికింకరులు విచ్ఛిన్నసాహససంయుక్తులును నికృత్తశిరస్కులును
విదారితహృదయులును ఖండితోరుపదబాహుసమేతులును క్షతలోచనులు
ను జూర్ణికృతాంత్రమాలికాసంభరితులును విశీర్ణాంగుళులు నై జముసము
ఖంబునకుం జని యేతద్వృత్తాంతం బెఱింగించిన.

95


మ.

శమనుం డంత సుభద్రువృత్తమున కాశ్చర్యంబును బొంది రో
షమదోద్రేకసమావృతుం డగుచు నశ్వస్యందనానేకప
ప్రముఖప్రస్ఫుటసైన్యముల్ గొలువ నభ్రాధ్వంబునం బోవుచు
న్నమహీకాంతుని భక్తులం గదిసి సన్నా హంబుతో నిట్లనున్!

96


చ.

పరువున నేల యేగెదరు పంతముగా దట నిల్చి సంతతా
పరిమితపాపయుక్తుని సుభద్రుని మాకు నొసంగుఁ డిందిరా
వరపదభక్తులార! తగవా యిది మీకు జగంబులోన దు
ష్కరతరపాపజీవులకుఁ గర్తను నేను దదీయశిక్షకున్.

97


ఉ.

కాక మదీయవాక్యములు గైకొననొల్లక మోరత్రోపునన్
గేకసలాడుచుం జనినఁ గింకరసైన్యముతోడఁ గూడి యేఁ

జేకొని మిమ్ముఁ గెల్చి యతిచిత్రమహాఘసమేతుఁ డైన యా
లోకవినిందితున్ నరకలోకముఁ జేర్చెదఁ బంత మొప్పఁగన్.

98


వ.

అని యిట్లహంకారపూర్వకంబుగఁ బితృపతి పలికిన వచనంబులకు రోషిం
చి విష్ణుకింకరు లిట్లనిరి.

99


క.

దురమున మము గెలిచెద నని
హరిహయుఁడుం బలుకనోపఁ డంతక! నేఁ డీ
హరిభక్తులసామర్థ్యం
బెఱిఁగెద విఁకఁ బ్రల్లదంబు లేలా పలుకన్.

100


మ.

మురువొప్పం గమలోదరుండు తులసీమూలంబునన్ లచ్చితో
నిరవైయుండెడిచో సుభద్రుఁ డచటన్ హీనాత్ముఁడై పాపదు
ర్ధరుఁడయ్యున్ మృతిఁబొందెఁ గావున జగత్ప్రఖ్యాతి నింద్రాదు ల
చ్చెరువొందం జనువాఁడు మోక్షపదవీశృంగారదివ్యాంగుడై.

101


వ.

అని మఱియు నొక్కపూర్వవృత్తాంతంబు చెప్పెద మాకర్ణింపుము.

102


గీ.

శేషశాయియైన శ్రీమానినీశుండు
సంతసంబు నిగుడ జలజభవుఁడు
వినఁగ నొక్కమాట విస్మయంబుగఁ బల్కె
మమ్ము నీక్షఁ జేసి మహిమ మెఱయ.

103


సీ.

కలరు జగంబులో ఘనపాపయుక్తులు
       పుణ్యాత్ములగు మర్త్యపుంగవులును
నేపాతకంబున కేది కృత్యం బగు
       నాపాతకంబున కది యెఱింగి
యం దఘసంయుక్తు లగువారి నీక్షింప
       దండహస్తుఁడు గర్త మండలమున
మత్పాదభక్తిసామర్థ్యసంయుతు లెల్ల
       ధరణి సజ్జనులని యెఱుఁగవలయు
జాతిహీనులైన సత్కులోద్భవులైన
వేదవేదులైన వేరు లేని

నన్నుఁ దలంచినట్టి నరవరోత్తము లెల్ల
మత్పురంబులోన మలయువారు.

104


వ.

మఱియును.

105


సీ.

తులసికానలినాక్షములు కంఠముల వేడ్క
       ధరియింపనేర్చిన ధన్యమతులు
బృందావనం బింటఁ బెంచి తద్దళముల
       ముముఁ బూజసేయు సన్మర్త్యవరులు
భూసురోత్తమకరంబులయందు మత్ప్రీతి
       దానమొసఁగు సత్కర్మరతులు
పొలుపుగా మన్నామముల సంతతంబును
       దలఁపంగ నోపిన తత్వవిదులు
వదల కెప్పుడు సత్యంబు పలుకునట్టి
నిర్మలాఖిలజనవర్ణనీయనియతు
లగు మహాత్ముల శోధించి యత్న మొదవ
వారిఁ గొని తెండు మత్పురావాసమునకు.

106


శా.

యక్షాధీశ్వరుఁ డైన తద్విభుఁడు మర్యాదార్థమై మమ్ము ని
ట్లాజ్ఞాపించిన నట్లకాక యని మే మత్యంత మిద్ధాత్రిలో
సుజ్ఞానోన్నతు లైన వైష్ణవుల సంశోధించి వారిం జడ
ప్రజ్ఞల్ గల్గిన నైనఁ జేర్తుము జగత్ప్రఖ్యాతిగా ముక్తికిన్.

107


క.

శ్రీవల్లభునామంబులు
తావలముగ నుడువనేర్చు తత్వజ్ఞులు త
త్కైవల్యంబున కర్హులు
భావింపగ నధికపాపపరిచితులైనన్.

108


క.

ఈపతితుండగు విప్రుఁడు
పాపాత్ముం డైన తులసిపాదపమూలా
రోపితుఁ డై మృతిఁ బొందుటఁ
జేపట్టఁగవలసె మాకు శ్రీవిభు నాజ్ఞన్.

109

గీ.

ఇతని విడిపించుకొనిపోవ నింద్రుఁడైనఁ
జంద్రఖండార్ధధరుఁడైన సకలలోక
నాయకుండు బ్రహ్మయైనను నశక్తు
లట్టియెడ నీకు మగతనం బలరెనేని.

110


క.

బెదరక హృదయములోపలఁ
బదిలుఁడ వై దండహస్తభయరహితుఁడ వై
యెదిరించి యిచట మాతో
గదనం బొనరింపవలయుఁ గ్రమ మొప్పంగన్.

111


వ.

అని యిట్లు విష్ణుకింకరులు శంకారహితులై పలికిన వచనంబులకుఁ దలం
గుచు సమవర్తి సమరంబు విసర్జించి లజ్ఞానమితకంధరుం డై సైన్యంబు
తోడం గూడి నిజసదనంబునకుం జనిన యనంతరంబున హరిదూతలు సుభ
ద్రునిం గొని వైకుంఠనగరంబున కరిగి రని చెప్పి మఱియు నిట్లనియె.

112


చ.

వినుము మునీంద్ర శ్రీతులసివృక్షముఁ బ్రోచిన మానవోత్తముల్
తనయవధూజనాప్తధనధాన్యసమున్నతులై జగత్త్రయం
బున నతిపూజ్యులై విబుధపూజితు లై తుది విష్ణుమందిరం
బున విహరించుచుందురు విభూషణభూషితదివ్యదేహులై.

113


క.

ధరణీసురు హస్తంబున
హరిం దులసిం బూజసేసి యంత్యజుఁ డైనన్
దురితములఁ బాసి చనుఁ ద
త్పురమునకును సకలలోకపూజితుఁ డగుచున్.

114


క.

శ్రీతులసీమాహాత్మ్యము
చాతురితో వినిననైనఁ జదివిననైనన్
ఖ్యాతుండై మనుజుఁడు చను
నాతతహరిమందిరమున కతిముద మలరన్.

115


వ.

అని యిట్లు తులసీమహాత్మ్యంబు చెప్పిన విని జనకునకు నారదుం డిట్లనియె.

116


చ.

అనయము కామినీసుతధనాప్తసముద్గతమోహయుక్తమై
పనుపడి పిప్పలచ్ఛదముభాతిఁ జలించుచునున్నచిత్త మె

ట్టనువునఁ బాదుగా నిలిచి యత్నముతోడ రమాధినాథుపా
దనవసరోజమధ్యమున దార్కొనియుండును లోకనాయకా!

117


గీ.

వర్తమానసుఖము వాంఛించుచిత్తంబు
దృష్ణభోగరతిఁ బరిత్యజించి
తెలియఁజూచికాక దేహీలోకాంతర
ప్రాప్తసౌఖ్యములకుఁ బరపు టెట్లు.

118


శా.

అస్తీతిప్రతిపద్యమానవచనవ్యాపారముల్ సూచిత
న్నాస్తీత్యర్ధసమేతయుక్తిసహితానల్పాపసిద్ధాంతవా
క్ప్రస్తావోన్నతులైన దుర్జనులవాక్యప్రౌఢిమం గుంది వి
స్రస్తంబైన మనంబు నిల్చువిధ మేచందంబు పద్మోద్భవా!

119


వ.

అని విన్నవించిన మునీంద్రునకు సురజ్యేష్ఠుం డిట్లనియె.

120


సీ.

ఇంద్రియంబులలోన నెక్కువ నయనముల్
       తన్మూలమునఁ బాపతతులు పుణ్య
చయమును నొదవును సహకారి యందుకు
       హృదయంబు నదియును బదిలపడక
మోహాంధకారముల్ ముసరుకోవర్తించుఁ
       గణఁక నందున దేహి గానలేక
పార్థివదేహసంప్రాప్తబాహ్యసుఖాను
       భవమె సత్యం బని భ్రాంతిఁ బొంది
యించుకైనను గ్రిందుమీఁ దెఱుఁగలేక
విదితవేదాంతవాక్యముల్ వీక్ష చేసి
సందియంబులఁ దెలియంగ శక్తి సమసి
నిహతుఁడగు నంత విధిచేత నేర్పు చెడిన.

121


వ.

అట్లగుటం జేసి దేహినిజాయుష్యంబు కొంచంబనియుఁ బుత్త్రదారాదులు
శరీరమాత్రబాంధవులనియు జన్మజరానురణంబు లనిత్యంబులనియు విత
ర్కించి హలికుండు రజ్జుముఖంబున గోష్ఠంబువలన బలాత్కారంబుగ నొ
క్కకోడియం దిగిచితెచ్చి యభ్యాసవశంబున లాంగలవహనసమర్థంబు

గాఁ జేయు చందంబున మనోవృషభంబుఁ గుదియందిగిచి స్వవశంబు నొం
దింపంగవలయు. నది జ్ఞానంబు. నట్టి జ్ఞానంబు సంశయంబును, విపరీతంబును,
ఖండంబును, నాగంతుకంబును, క్షీణకంబును, యాకస్మికంబును, వ్యక్తం
బు నన సప్తప్రకారంబులఁ బవర్తించు. నందు వివిధమతసిద్ధాంతస్రవణం
బు నన నిర్ణీతంబగునది సంశయజ్ఞానంబు, నపసిద్ధాంతంబుగా నెఱుంగునది
విపరీతజ్ఞానంబును, ఖండఖండంబులై స్రవించునది ఖండజ్ఞానంబును, వే
దాంతాదిశ్రవణంబున సమాగతంబగునది యాగంతుకంబును, బాంధవ
వినాశకాలంబున సముద్భవంబగునది క్షీణకంబును, జన్మాంతరపుణ్యవి
శేషమున శ్వేచ్ఛాసమయంబున నరుదెంచునది యాకస్మికంబును, సంప్ర
త్యయంబున నిశ్చలంబై పరమాత్మనిరీక్షణపర్యంతంబున భేదంబునం బ్ర
వర్తించునది వ్యక్తంబును నగునట్లు సప్తవిధంబులఁ బ్రవర్తించుజ్ఞానంబును
వ్యక్తంబగునట్లు పాదుకొలిపి హృదయంబు పదిలంబుగా నిలుపవలయు.

122


క.

హరిరూపంబులు వేదము
లరయగ వేదాంతదర్శితార్థంబులచేఁ
బరలోకము గలుగుట సు
స్థిరముగ నెఱుఁగంగవలయుఁ జిత్తములోనన్.

124


గీ.

సజ్జనులతోడి సంసర్గసాధువృత్తి
జలజనాభాంకసత్కధాశ్రవణరతియు
నాత్మరిపునిగ్రహంబును ననఁగ నివియుఁ
గ్రమముతో హృదయస్థైర్యకారణములు.

125


సీ.

దైవికభౌతికాత్మవికారభావముల్
       సంభవించిననైన జడుపువడక
యనుజతనూభవాప్తాంగనాదివియోగ
       మాసన్నమైనచో నడలువడక
పశుధనధాన్యసంపదల నొక్కుమ్మడి
       దఱిఁగినవైనను దత్తరిలక
వదలక మృత్యుదేవత డగ్గఱిననైనఁ
       బరితాపమందుచు బలిమి చెడక

నరుఁడు సర్వంబు మిథ్యగా నెఱిఁగికొనుచు
శ్రీవిభుం డైన విష్ణుఁడే దైవ మనుచు
వేదవేదాంతవాక్యవివేకసరణి
తెలిసి హృదయంబు పాదుగా నిలుపవలయు.

125


వ.

మఱియుఁ గర్మమూలంబునఁ బ్రవర్తించు కర్యనిస్ఠులకు నాధారం బగుటం
జేసి పుత్త్రమూలంబుగఁ బుణ్యలోకనివాసంబును సమ్యగ్జ్ఞాననిష్ఠులకు జ్ఞానం
బనియెడి సుపుత్త్రునిమూలంబునఁ బునరావృత్తరహితశాశ్వతపదంబును గలు
గు. నిట్లు కర్మజ్ఞానంబులు వేదంబులయందుఁ బ్రతిపాదితంబులై తత్తదధి
కారమూలంబునఁ బ్రవర్తించు. నందు.

126


ఉ.

జ్ఞానముచేతఁ గర్మములు సంక్షయమందెడుచోట నట్టి సు
జ్ఞానమె ముక్తిమార్గగతిసాధకసత్త్వవిశుద్ధి కంచు దు
ర్మానవకోట్లకుం దెలియఁ బ్రస్తుతి సేయును వేదజాలముల్
పూనికఁ దత్సమాచరితపుణ్యమఖాధికకర్మసంతతిన్.

127


క.

క్రతువులు దలఁపఁగ లక్ష్మీ
పతిరూపము లగుటఁ జేసి ప్రఖ్యాతిగఁ ద
త్క్రతుపశుహింసలు ధర్మ
చ్యుతికిని బాత్రములు గావు, చూడఁగ ననఘా!

128


మ.

స్థిరచిత్తుండగు మానవోత్తముఁడు సుస్నిగ్ధాత్ముఁడై యిందిరా
వరునామంబుఁ దలంచెనేని యతఁ డత్యంతంబు సంసారసా
గరతీర్ణుం డగుచున్ మహామహిమతోఁ గర్మంబులం ద్రుంచి మో
క్షరమాధీశ్వరుఁడై వెలుంగును వివస్వత్కాంతిసంపన్నుఁడై.

129


క.

గురుదోషఘ్నము లాయు
ష్కరములు సంపత్ప్రదములు కలుషమహాసా
గరబాడబములు లక్ష్మీ
వరుసద్గుణకీర్తనములు వర్ణింపంగన్.

130


సీ.

కావించు పుండరీకాక్షప్రతిష్ఠలు
       జలజనాభాలయస్థాపనములు
భక్తితో విష్ణువైభవవర్ధనంబులు
       మహిమఁదన్నందిర మార్జనములు

తద్వాసుదేవార్పితప్రణామంబులు
       ప్రార్థితహరిపాదతీర్థసేవ
పరమవైష్ణవదీప్రపాదాంబురుహపూజ
       దానంబు సత్యంబు దమము శమము
సంతతాచారవిధియును సాత్వికంబు
ధ్యానమార్జవమ క్రోధ మతిముదంబు
ననఁగ నివి భాగవతమానవావళికిని
మోక్షసంప్రాప్తికరధర్మములు తనూజ!

131


క.

ఏకర్మంబున నరులకు
నాకస్మిక మాగతంబు లగు రోగంబుల్
చేకొని తద్వృత్తాంతము
లోకాధిప తెలుపవలయు లోకశరణ్యా!

132


క.

అని మునివర్యుఁడు పలికిన
విని పద్మభవుండు హసితవిమలాననుఁడై
తనయున కిట్లనియెను నె
మ్మనమున సంతోష మొదవ మాన్యచరిత్రా.

133


వ.

అదియెట్లనిన.

134


సీ.

మహిఁ బుండరీకాక్షమందిరంబులయందు
       వీఁక శిరోజముల్ విప్పుకొనిన
గురుమాతృపితృదేవధరణిసురోత్తమ
       ప్రతతికిఁ జేయమి వందనములు
ప్రేమతో హరికి నర్పింపని పుష్పముల్
       తడయక శిరముపై ముడుచుకొనినఁ
దత్పాదతీర్థముల్ ధరియింపనొల్లక
       దూరమార్గంబునఁ దొలఁగి చనినఁ
బాపసంయుక్తివలనను బ్రాప్తమగును
బార్శ్వికంబును నాస్ఫోటబాధ మఱియు

సేపనంబును వదనదుర్భావితంబు
ననుమహాదుఃఖకరశిరోవ్యాధు లనఘ.

135


వ.

మఱియును.

136


సీ.

పరకామినీకక్షభాగస్థలంబులు
       రతివాంఛ నీక్షించుప్రాణితతులు
అడిగిన నిడఁజాలకైనఁబదార్థముల్
       చూచి యుపేక్షించునీచతరులు
గోభూసురులు రుజల్ గొని చావఁదలఁపక
       ప్రవిలోకనము సేయుపాపవరులు
వేదబాహ్యమతప్రవీణపాషండాది
       సందర్శనోద్భవానందయుతులు
విప్రదేవాంగనాత్మీయవిక్రయులును
గ్రామపశుపక్షిధేనుపుష్కరచరాది
హింసకులు దుర్మదాంధులు హీనమతులు
నేత్రరోగబాధితులుగా నెఱుఁగవలయు.

137


మ.

ధరణీదేవనిలింపనిందకులకున్ ధర్మంబు వర్ణించి దు
ష్కరపారుష్యముతోడి దుర్మతులకున్ సత్యోక్తిసంశూన్యులై
పరమర్మంబులు పల్కుచున్ బృధివిలోఁ బాపాత్ములై నిత్యమున్
బరదుఃఖప్రదులైన కీటకులకున్ బ్రాపించు వాగ్రోగముల్.

138


క.

పరనిందాకరవాక్యము
లిరవుగ నాలించునట్టి హీనులకును సు
స్థిరబధిరాదిశు9తిగో
చరరోగము లుద్భవించు సంయమివర్యా.

139


సీ.

ధరణీసురేంద్రసద్గురుజనోత్తములకుఁ
       బరితాప మొందించుపాపరతులు
అనయంబుఁ బరకాంత నాలింగనము సేసి
       క్రీడలు సలుపుదుష్కీర్తిరతులు

గోతరుణీబాలకులఁ బట్టి వధియించు
       సంచితపాపప్రచారమతులు
అన్నార్థ మేయింటి కరుదెంచునతిథులఁ
       బూజింపనొల్లనిపుణ్యరహితు
లాత్మకౌటిల్యసంగతులైనవారు
శల్యభేదనదద్రుకశ్వాసకాస
తాపహిక్కాగ్నిశూలచిత్త భ్రమాది
బహువిధానేకహృద్రోగసహితు లనఘ!

140


ఉ.

చేరి యభక్ష్యభక్షణము చేసినవారలు భక్తచోరకుల్
మీఱి యసత్పరిగ్రహసమేతులు దుష్టపరాన్నవాంఛితుల్
కూరిమి నన్యకాంతలను గోరెడుసంతతపాపయుక్తులున్
ధారుణిఁ గుక్షిరోగపరితప్తులు చూడఁగ నెల్లకాలమున్.

141


క.

నారదవినుమతి గోప్యము
నేరుపు దలకొనఁగ నీకు నేమించెద ని
ట్లారోగములకు నౌషధ
మారయఁ దులసీసమేతహరిపదజలముల్.

142


క.

కలిదోషంబులఁ జెఱచును
బలురోగచయంబు నణఁచుఁ బాపఘ్నము ని
శ్చలపుణ్యంబుల నొసఁగును
దెలియఁగ శ్రీవిష్ణుపాదతీర్థము తనయా!

143


మ.

నరు లజ్ఞాననిమోహితాత్ము లగుచున్ నారాయణాంఘ్రిద్వయ
స్థిరసద్భక్తిఁ బత్యజించి తనయశ్రీకామినీమత్తులై
పరదైవంబుల వేడ్కతోఁ గొలిచి తత్ప్రాంతంబునం గాలకిం
కరదండాహుతులై మునుంగుదురు సంఘాతంబునన్ భూసురా!

144


క.

పదిలంబుగ లక్ష్మీపతి
పదములు దలపంగ నేర్చు భాగ్యోన్నతు లా
పదలం బొందక చనుదురు
ముదమున వైకుంఠనగరమునకును దనయా!

145

వ.

అని చెప్పిన.

146


క.

మంజీరనిహితమణిగణ
పుంజీకృతగళితకాంతిపూరవిలాసా
భ్యంజితపదయుగసరసిజ
రంజితభువనైకవీరరంగవిహారా!

147


పృథ్వీవృత్తము.

సురాసురనమస్కృతా శుభవిభూషణాలంకృతా
కరీంద్రరిపుభంజనా కమలవాసినీరంజనా
నిరంకుశపరాక్రమా నిఖిలపూర్ణపాదక్రమా
గిరీశతరుణీనుతా గిరిచరౌఘసంసేవితా.

148

గద్య.
ఇది శ్రీహనుమత్కటాక్షలబ్ధవరప్రసాదసహజసారస్వతచంద్ర
నామాంక రామవిద్వన్మణికుమా రాష్టఘంటావధానపరమే
శ్వర హరిభట్టారకవిరచితంబైన మత్స్యపురాణ
ఖండం బగు విష్ణుధర్మోత్తరంబునందుఁ
దృతీయాశ్వాసము.
శ్రీ