మత్స్యపురాణము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

మత్స్యపురాణము

చతుర్థాశ్వాసము

శ్రీనారీకుచయుగనిహి
తానేకమణీవిభూషణాలోకనహ
ర్షానీతహృదయబుధస
న్మానితఘనవిభవరంగమందిరనిలయా.

1


వ.

అవధరింపు మిట్లు చతురాననుండు నారదునకుం జెప్పి మఱియు నిట్లనియె.

2


చ.

మదనగురుండు యోగిజనమానసపంకజషట్పదంబు దు
ర్మదసురవైరిభంజనుఁడు మానితుఁ డాద్యుఁడు శ్రీధరుండు భ
క్తదురితనాశకుం డగుచుఁ గంజభవాండములోనఁ బూర్ణుఁడై
కదలక నిల్చియుండుటయుఁ గానరు జీవులు ప్రాప్తదేహులై.

3


వ.

మఱియు దేహి దేహగతుఁడై తమస్సత్వరజోమార్గంబులగు మనోవ్యాపారం
బులందుఁ బ్రవర్తించు. నందు రోషంబు ననృతంబు మొదలైనవి తమస్సంభ
వంబులు, సత్యంబు దానం బస్తేయ మహింసయు దయయు మేధయు వైరా
గ్యంబునుఁ దుష్టయుఁ బుష్టియు క్షమయు మతియు మొదలైనవి సత్వగుణో
ద్భనంబులు, హర్షంబును వేగంబును నహంకారంబును మొదలైనవి రజ
స్సంజాతంబులు నగు. నంత నేతద్గుణంబులు మనోవికారమిళితంబులైన గ్లాని
యు భయంబును శమంబున ధృతియుఁ జింతయు వ్రీడయు మోహంబు హృ
దయసముత్పన్నంబులగు నాభావంబులచేత నుద్వేజితంబులై యవిజ్ఞానదీ
పంబునకు నాచ్ఛాదకంబులు నజ్ఞానంబునకు నుద్భోదకంబులునై యింద్రి
యవ్యాపారంబులం గలసి పరిభ్రమించునట్లగుటం జేసి మనం బజ్ఞానమాత్రం
బున నశిక్షితంబై స్వేచ్ఛావిహారంబున సంచరించు. నంత.

4

శా.

పాదాపీడితపుచ్ఛశీర్ష మగు సర్పంబుక్కు పోఁజిక్కి యే
భేదం బందక లీనమైనక్రియ రూపింపంగఁ జిత్తంబు నే
త్రాదిప్రస్ఫుటవక్రమార్గ మగునావ్యాపారము ల్మానఁ దాఁ
బాదై నిల్చును ద్వాదశాక్షరజపాప్తజ్ఞానసంబద్ధమై.

5


క.

జ్ఞానానలంబునం ద
జ్ఞానజభావంబు లనెడి సమిధలు భస్మా
ధీనములు చేయ వ్రేల్చిన
మానవుఁడు సుఖించు విష్ణుమందిరగతుఁడై.

6


వ.

మఱియుఁ గులాలకకు విందులు నిత్యాబ్యాసకృతంబు లగుఘటపటాదివ్యా
పారంబులయందు సంతతావిచ్ఛిన్నమనస్కులై సాన్నిపాతికవికారసమ
యంబునను నవి యస్మరియించునట్లు భక్తుండు సంతతంబు మనంబు భగ
వంతునంద నిల్పి యభ్యాసవశంబున నంత కాలంబునఁ దన్నామంబు స్మరిం
చిన వైకుంఠంబునకుఁ జనునని పరమేష్ఠి మఱియు నిట్లనియె.

7


సీ.

ఉద్బోధితంబును నుద్బోధనంబును
        నన రెండువిధములై యలరుజ్ఞాన
మందు సద్గురుని వాక్యవిశేషసరణిచే
        బోధితప్రాప్త ముద్బోధితంబు
శాస్త్రార్థదర్శనోచ్ఛ్రయవివేకజము ను
        ద్బోధనజ్ఞానంబు భూసురేంద్ర
వనజకుట్మలము శైవాలలతాపూర్ణ
        జలభేదకంబగు శక్తితోడ
వెడలి వికసించుకైవడిఁ బదటవడక
శాస్త్రదర్శనగురువాక్యజనితమైన
విమలసుజ్ఞాన మజ్ఞానవితతి నణఁచి
తానె వికసిల్లుఁ బరమాత్మదర్శనమున.

8


వ.

తొల్లి పుండరీకుండన వెలయు మహీవల్లభుండు కపిలునివలన నిశ్చలజ్ఞానం
బు నొంది భగవద్భక్తిపరాయణుండై ముహూర్తమాత్రంబునఁ బరమపదం
బు నొందెఁ. దద్వృత్తాంతం బెఱింగించెద.

9

సీ.

అభ్రంలిహాదభ్రశుభ్రమణిద్యుతి
        విభ్రమత్ప్రాకారవిశ్రుతంబు
చండమార్తాండసన్మండలమార్గని
        రోధకగోపురోద్బోధితంబు
అంగనాసంగీతసంగతమర్దల
        ధ్వనిపూర్ణనాదాభివర్ణితంబు
మణిమయనూత్నతోరణనిత్యసంకులా
        పణపూర్ణపణ్యవిభ్రాజితంబు
మత్తతరయూధపతురంగమరథవీర
వరమహీసురరాజన్యవైశ్యశూద్ర
సంయుతంబయి విలసిల్లు చంద్రభాగ
తటమునందున నిత్యప్రతాపపురము.

10


సీ.

చండకాండాసనచలితబాణాసార
        ఖండితాఖిలరాజమండలుండు
అఖిలదిఙ్మండలాభ్యంతరపరిపూర్ణ
        వివిధకీర్తిప్రభావిశ్రతుండు
చతురాననాదేశజనపాలవర్ణిత
        ప్రఖ్యాతనిజగుణోద్భాసితుండు
శారదాజయరమాసదనాయమానవ
        క్త్రాంబుజబాహుయుగ్మాంతరుండు
కంతునలకూబరాదికాకారసుతుడు
ప్రేమఁ బొగడంగఁదగుఁ బుండరీకుఁ డనఁగఁ
బుణ్యవృత్తుండు నరపాలపుంగవుండు
తత్పురాధీశ్వరుం డయ్యెఁ దత్వనిలయ.

11


వ.

ఇట్లు సకలగుణసంపన్నుండగు పుండరీకనరపాలకుండు నిత్యప్రతాపనగ
రంబున కధీశ్వరుండై గజతురంగమరథపదాతిప్రముఖబహువిధసేనాస
మన్వితుండై హితపురోహితామాత్యకవిగాయకనటవిదూషకాదిపరిజనం

బులు పరివేష్టింప సింహాసనాసీనుండై కాంతాసహస్రంబునకు వరుండై ని
ష్కంటకంబుగ రాజ్యంబు సేయుచుండె. నయ్యవసరంబున.

12


సీ.

విరహిణీజనమనోవీథుల మత్యధ్వ
        జాంబకానలకీల లంకురింపఁ
బ్రణయరోషంబులఁ బాటిల్లుతరుణుల
        హృదయముల్ కలయంగ నెదురుకొనఁగ
నభిసారికాగణయత్నముల్ సాహస
        స్ఫూర్తితోఁ బెనఁగొన సొంపుమిగుల
నవవయఃపరిపూర్ణనారీజనంబుల
        కోర్కు లంతంతకుఁ గొనలుసాగ
వినుతకలకంఠకంఠనిస్వనము లెదుగ
సతతమధుకరమధురఝంకృతులు చెలఁగ
నంగజాధీశదర్పాలయం బనంగ
నభినుతం బయ్యె నవవసంతాగమంబు.

13


సీ.

సన్నుతకామినీసత్కుచకుంభద్వ
        యాలింగనంబుల కాసపడక
ముఖరితనూపురముఖకోమలాంగనా
        పాదఘాతంబులఁ బరిహరించి
యతులితగంధసంయుతవామలోచనా
        గండూషమధ్యసేకముల మాని
వర్ణితరూపలావణ్యయోషాకృత
        క్రమశుద్ధరాగసంగతిఁ దొలంగి
తరుణమకరందపానమత్తద్విరేఫ
ఝీంకృతాటోపములతోడఁ జెలువ మగుచు
ననచి మొగి విచ్చి చిగుఱాకునయముఁ జూపి
పూచె వనముల విలసిల్లుభూరుహములు.

14


వ.

ఆ సమయంబున.

15

గీ.

పుష్పరథ మెక్కి, సూనాస్త్రములు ధరించి
భ్రమరశుకశారికాదిసైన్యములు గొలువ
నవవసంతునితోడ సన్నాహ మొదవ
దండయాత్రాభిముఖుఁ డయ్యె దర్పకుండు.

16


వ.

ఇ ట్లఖిలలోకమనోహరం బగువసంతసమయసౌభాగ్యంబు నిరీక్షించి పుం
డరీకమహీకాంతుండు సంతోషాయత్తచిత్తుం డై మృగయావినోదంబు సలు
పంగోరి చతురంగబలసమన్వితుం డై చండప్రతాపదోర్దండమండనాయ
మానం బగుమండలాగ్రంబు ధరియించి వాగురాసమేతు లగుకిరాతులు
మున్నాడి చనుచుండ నవప్రసవమకరందపరిమళాక్రాంతం బగువనాం
తంబుఁ బ్రవేశించి యందు.

17


మ.

తెరలంజిక్కిన సింహఖడ్గగవయాదిప్రోచ్చలోద్యన్మృగా
పరిమేయాంఘ్రిగళాక్షిపుచ్ఛముల భూపాలుండు బాణాళిచే
నెరయం ద్రుంచి పిపాసతప్తుఁ డగుచున్ నీ రారయంగా బయిం
బరఁగెన్ వాయువు లంబుశీకరపరివ్యాప్తంబులై యొక్కెడన్.

18


క.

అవనీనాథుఁడు ధృతి న
య్యవసరమున రథముతోడ నరిగెను వెసఁ ద
త్పవనంబున కభిముఖుఁ డై
జవమున నుదకంబుఁ గ్రోల శతయోజనముల్.

19


వ.

ఇట్లు పుండరీకమహీకాంతుండు తృష్ణాపీడితుం డై రథవేగంబున సముద్ర
తీరంబుఁ జేరి యచ్చట పల్లవపుష్పఫలభారసమిద్ధశాఖిశాఖాంతర
గళితసుమనోరసవాసితశీతలపయఃపూరితసరోవరాభిమతంబును దధ్యా
జ్యసమిత్పురోడాశహోమసముద్ధితధూమవాసనావాసితంబును, శుక
శారికాపోతముఖవినిర్గతవేదాంతవాక్యరచనాముఖరితంబును, సింహ
శరభకరిగవయచమరీమృగాదిపరిజనస్తోమసేవితంబును, సకలదేవతా
సన్నుతంబును నగుకపిలాశ్రమంబు ప్రవేశించి రథంబు డిగ్గి యచ్చట
నొక్కసరోవరంబున నతిశీతలంబులును, గమలవిమలకేసరఖండవాసితం
బును, రసయుక్తంబులు నగుపానీయంబులం గ్రోలి తత్తీరశీతలతరుచ్ఛాయా
సమాసీనుం డై యచ్చట నొక్కహరిణంబుఁ గనుంగొని వివేకహీనుం డై.

20

గీ.

శరము వింటఁ దొడిగి జననాథుఁ డచ్చోటఁ
దన్మృగంబుగళముఁ దగులనేయ
నది మునీంద్రుకడకు నరిగిన యతఁ డంత
దానిఁ జూచి రోషతప్తుఁ డగుచు.

21


చ.

సరసిజసంభనాదిసురసంఘము లైన మదాశ్రమంబునన్
దిరిగెడి కీటిపోతమును దేఁకువతో వధియింపలేనిచో
సరగున నీమృగంబు నతిసాహసవృత్తి వధించె నెవ్వఁ డా
పురుషుని నిట్ల సేతునని భూసురవర్యుఁడు కోపదీప్తుఁ డై.

22


గీ.

హరిణ మేగుదెంచు నా జాడఁ దప్పక
పుండరీకుఁ డున్నభూరుహంబు
కడకుఁ జన నతండు గని నమస్కారాది
కృత్యముల్ ఘటించి కేలు మొగిచి.

23


వ.

సాంత్వనవాక్యసమేతంబుగా నిట్లనియె.

24


గీ.

పుండరీకుఁ డనెడు భూపాలకుండ ని
త్యప్రతాపనగర మాశ్రయంబు
వేఁట వచ్చి యెండ వెట్టది ఘనమైన
దాహ మొదవునంతఁ దత్తఱమున.

25


మ.

అరదం బెక్కి జలంబు గ్రోలుటకు నే యత్యంతవేగంబునన్
మురువై యిచ్చటి కేగుదెంచి కమలామోదాశ్రమస్థాంబువుల్
పరిపూర్ణంబుగఁ ద్రావి యంతట భవత్పాదాంబుజద్వంద్వసే
వరతిం గోరఁగ నయ్యభీష్ట మెదురై వచ్చె న్మునీంద్రోత్తమా!

26


మ.

ఘనపాపోన్నతుఁడన్ దయారహితుఁడన్ గాలక్రియాశూన్యుఁడన్
ధనపుత్త్రాప్తగృహాదిమోహరతుఁడన్ దర్పాంధుఁడన్ సత్యవా
క్యనయజ్ఞానవిహీనుఁడన్ జపలుఁడన్ గాఠిన్యపాపాత్ముఁడన్
నను మన్నింపఁగ నీకుఁ బంతము మునీంద్రా! లోకరక్షామణీ!

27


వ.

అని నమస్కారపూర్వకంబుగాఁ బలికిన వచనంబు లాకర్ణించి యామహీ
వల్లభునకు మునివర్యుం డిట్లనియె.

28

చ.

జనపతి వంచు ని న్ననఁగఁజాలము ధాత్రి విరోధిసైన్యముల్
పనుపడి కార్ముకోచ్చలితబాణపరంపరఁ ద్రుంచివైచి సం
జనితయశంబు నొందుటయె శాస్త్రముగాక మదాశ్రమస్థలం
బున వసియించునట్టి మృగమున్ వధియింపఁగ నీకుఁ బంతమే.

29


గీ.

వనములోనఁ బూరి వలసినట్టుగఁ గొని
నీడ లైనచోట నిలిచియున్న
మృగముఁ బోవనీక తెగి నొంపఁ గారణం
బేమి గల్గె నీకు భూమిపాల?

30


క.

అపమతి యై క్రోధంబున
నపరాధముఁ జేసినట్టి హరి సుతు నైనన్
శపియింపనోపఁగల నన్
గపిలుండని యెఱుఁగవలదె క్రమ మొప్పంగన్.

31


సీ.

నిద్రయు నాహారనియతియు భయమును
        నిధువనంబునునాఁగ నివ్వి సర్వ
జంతువులకుఁగూడ సంతతధర్మంబు
        లై ప్రవర్తించుచో నందు నరుఁడు
బుద్ధి నత్యధికుఁ డై భువనంబులోపల
        సత్వాదిగుణసమాజంబుతోడ
నుద్బోధితంబు లై యొదవెడు కామరో
        షాదులఁ గుదియంగ నాఁపలేక
చిత్త మెట్లైనఁ బరపుచుఁ జెంగలించి
కాల మాసన్నమని సూటి గానలేక
చింత సేయక పరుల హింసించి యందు
కతన సంతుష్టిఁ బొందు సంతతముఁ దలఁప.

32


ఉ.

ఎందఱు రాజు లేని చని రీవసుధాతల మెల్ల జీవుఁ డిం
దెందఱ కాత్మజుం డగుచు హీనకుయోనుల సంభవింపఁ డీ
పొందిక గానలేక మదపూరితనేత్రుఁడ వై మదాశ్రమం

బందు సుఖంబునం దిరుగునట్టి మృగంబును హింససేయ నీ
కిందున నేమి గల్గె మనుజేశ్వరడింభక! పాపభూషణా!

33


గీ.

మేటిరణమునందు మృగయావినోదంబు
సలుపునపుడు యాగసనుయమందు
హింస సేయఁ బంత, మితరకాలంబున
నదియె పాపనిలయ మధిపులకును.

34


సీ.

దుర్గంధితామేయదుష్టమూత్రక్రిమి
        వ్యాప్తాంతమాలికావర్తమందు
మాంసాస్థిశకలచర్మసమన్వితంబుగ
        రక్తశుక్లములచే వ్యక్తమగుచు
ఘనదుఃఖకరమైన గర్భకోటరమున
        నొదవి నిత్యాపాయయుక్తమైన
తనువు శాశ్వతమని తలఁపులోఁ దలపోసి
        భూవరాహంకారమునఁ జెలంగి
భూతదయలేక పుణ్యంబు పొలుపుఁ జెఱిచి
చేరి యిచ్చట హింససేసితివిగాక
తత్వ మెఱిఁగిన నరపాలతనయు లిట్లు
పాపములు సేయునేర్తురే పార్థివేంద్ర.

35


ఉ.

తప్పులు గల్గియుండినను దండ్యులు గారు మహీసురేంద్రు లే
తప్పును లేక మాయెడకుఁ దప్పిన నీఘనరాజ్యవైభవం
బిప్పుడె నాశమొందునని యే శపియించిన నడ్డగింపలేఁ
డప్పరమేశుఁడైనను రమాధిపుఁడైన నృపాలకీటమా.

36


సీ.

పాడిఁ దప్పక ప్రజాపాలనం బొనరించి
        సత్యంబు వదలక సాధువర్గ
గమనంబు విడువక గాంభీర్య ముడుగక
        నీతిమార్గవివేకనిరతుఁ డగుచుఁ
బరకామినీవిత్తభావంబుఁ గుదియించి
        సంతతదానప్రశస్తుఁ డగుచుఁ

జిత్తంబు విష్ణుని శ్రీపాదములఁ జేర్చి
        యైహికభోగంబు లమర విడిచి
కీర్తిధర్మంబు లార్జించి కినుక వడక
పుణ్యుఁ డైనట్టి నరపాలపుంగవునకు
ధాత్రి రాజ్యంబు సేయఁ బంతంబు గాక
మనుట కెడ రిట్లు సేయంగ ననువుపడునె?

37


క.

తెలియవు గాక మదంబునఁ
గులసంభవు లైన రాజకోట్లకు నీచొ
ప్పలవడునె యెన్ని చూచిన
కలుషాలయహృదయ సర్వకార్యవిహీనా.

38


తరళము.

అని మునీంద్రుఁడు పల్కువాక్యము లాదరించి నపాలనం
దనుఁడు రాజ్యధనాదిమోహము తత్క్షణంబ త్యజించి సం
జనితహర్షసమేతుఁ డై యట సంపుటీకృతహస్తుఁ డై
వినయ మొప్పఁగఁ బల్కె నప్పుడు విశ్రుతంబుగఁ బుత్త్రకా!

39


క.

గురువులకుఁ దప్పి నడచిన
గురుపాతకు లైన మనుజకోట్లకు నెల్లం
బరికింప శిక్ష యెయ్యది
తిరముగ నావాక్య మాన తిమ్ము మునీంద్రా.

40


వ.

అని పల్కి తీక్ష్ణధారలుగల్లు నిశితఖడ్గంబునఁ బుండరీకుండు తనశిరంబు
ద్రుంచికొన నుద్యోగించె నప్పు డక్కపిలుండు తన్మహీకాంతుని పశ్చాత్తా

పంబునకు సాహసంబునకు సంతసించి యతనికరంబు పట్టుకొని తత్కృ
త్యంబు నివారించి యిట్లనియె.

41


క.

అనవలసిన మాటలు ని
న్నని చూచుటగాక మృత్యు వరుదెంచియు మ
ద్వనకీటము నైనను మును
కొని చంపంగలఁదె సర్వగుణగణనిలయా!

42


క.

వెఱవకుము రాజనందన
వరకీర్తిసమేత నీకు వాంఛిత మగు నే
వర మొకటి వేడ్క నొసఁగెదఁ
బరిపూర్తిగ నడుగవలయుఁ బ్రాభవ మొప్పన్.

43


వ.

అని పలికిన మునీంద్రునకు రాజేంద్రుం డిట్లనియె.

44


ఉ.

నీదయ నివ్వనానఁ బరినిష్ఠితుఁ డై విలసిల్లు నాతఁ డిం
ద్రాదులు సన్నుతింప వసుధాధిపుఁ డై విహరించు వేడుకన్
నీదయలేక భూవరుఁడు నీతిసమన్వితుఁ డైన హీనుఁ డై
ఖేదము నొందుచుం దిరుగుఁ గీర్తులు మాయఁగ భూసురోత్తమా!

45


క.

నిరుపమభవదంఘ్రిద్వయ
సరసిజములు చూడఁగంటి చర్చింపఁగ సు
స్థిరహృదయ నిత్యకరుణా
పరభాషణ యింతకన్న వరముం గలదే.

46


క.

ఆపద్ధ్వాంతముఁ జెఱుచును
బాపౌఘనివారకంబు ప్రస్తుతి సేయన్
తాపతయనిర్హరణము
మీపదసందర్శనంబు మిత్రశతాభా!

47


క.

మోహంబు నొంది తనుభో
గేహాపరవశుడ నగుచు నింద్రియములచే
దేహంబు మఱచి తిరిగితి
నాహారస్వాపమైథునాదుల పొందై.

48


క.

మానవుఁ డధ్యాసాదివి
హీనుండై ముక్తినొందు నేధర్మములన్

బూనిక నాధర్మంబులు
వీనుల కుత్సాహ మొదవ వినుపింఫు తగన్.

49


వ.

అని పుండరీకుండు పలికిన వాక్యంబులకు సంతసించి కపిలుం డిట్లనియె.

50


క.

ధనమును రూపంబును నన
మనుజుల కివి మదకరములు మనుజేశ్వర యి
ట్లొనరెడుచో నజ్ఞానం
బునఁ బొదలక మేలుఁ దలఁపఁబూనితి వనఘా!

51


క.

గతజన్మసహస్రసమా
ర్జితపుణ్యముచేత నరుఁడు శ్రీపతిపాద
ద్వితయాబ్జభక్తిరశనా
వృతుఁ డై మోక్షంబు నొందు విభవముతోడన్.

52


క.

జ్ఞానంబు లేక యశమున
కై నడపిన కర్మమార్గ మతిముదమున మ
ర్త్యానీకమునకు ముక్తిని
దానము గానేర దాత్మఁ దలపోయంగన్.

53


వ.

మరియు మోక్షం బపేక్షించు మానవుండు పూర్వదానఫలసమాగతంబు
లైన సంపదలు విద్యుత్సమానంబు లనియుఁ బరహింసాకరంబు లగు వ్యా
పారంబులు దురితకరంబు లనియు వితర్కించి భయాకులితమానసుం డై
గురువాక్యమూలంబునం దత్త్వం బెఱింగి దృఢనిశ్చయుం డై ప్రవర్తించవల
యు. నందు.

54


క.

కృతపడిన రాజులు న్మద
మతిసంయుతు లయ్యు మోహమహనీయతమో
వృతులై కదనస్థలముల
హతులైరి వసుంధరాజయార్థము జగతిన్.

55


చ.

ధనకులరూపశౌర్యగుణదానవయోబలరాజ్యభోగసం
జనితమదాంధులై నృపతిసంఘము లెల్ల నిజాత్మశత్రులన్
మునుకొని గెల్వనోపక సమున్నతసైన్యసమేతులై రయం
బునఁ దనువుల్ త్యజింత్రు ధనపూర్ణధరాతలలాభకాంక్షులై.

56

క.

ఆజిని రిపుల జయించుట
భూజనవిభుఁ డార్తతతులఁ బోషించుటయున్
రాజులకు నివియె ధర్మము
లీజగము పరిగ్రహింప హితజనవినుతా.

57


వ.

మఱియును.

58


సీ.

సత్యంబు విడువక సామర్థ్య ముడుగక
        సంతతాచారనిస్తంద్రుఁ డగుచు
భావంబులోపల బదిలుఁడై ధనధాన్య
        కులరూపపదములు గుట్టుపఱిచి
పరమదయారసప్రఖ్యాతుఁడై నిత్య
        నియమముల్ జరుపుచు నిర్వికార
మునఁ బ్రవర్తించుచుఁ దనయకళత్రాది
        మోహజాలంబున ముణుఁగువడక
మోక్షగమనసరణి వీక్షింపఁగోరుచు
స్వప్నరూపమైన సంసృతిగతి
చనఁగ నేర్చునతఁడు చర్చింప సద్గురు
బోధ్యుఁ డనఁగఁబఱఁగు భూమిలోన.

59


వ.

మఱియు నేతద్గుణసమేతులైనవారు జ్ఞానాధికారులై యంకురితలును, బుష్పితు
లును, ఫలితులు ననఁ బ్రవర్తింతురు; అందు మోక్షధర్మాపేక్షు లంకురితులును
దదాచారనిరతులు పుష్పితులును జీవన్ముక్తులు ఫలితులు నగుదు; రిట్లు త్రివి
ధప్రవర్తునులకు గురుముఖసంబోధితంబగు జ్ఞానంబున మోక్షంబు గలుగున
ని చెప్పి కపిలుండు మఱియు నిట్లనియె.

60


సీ.

దయయు సత్యంబును దాక్షిణ్యమును లేక
        రాజ్యగర్వంబున రాణ మెఱసి
పరసతిపశుధనభ్రాంతచేతస్కులై
        పుత్త్రదారేషణస్ఫూర్తిఁ బొదలి
ప్రజలఁ బీడించుచుఁ బాపసంయుక్తులై
        బ్రాహ్మణగురుదేవభక్తి విడిచి

భూప్రాప్తికై శత్రుభూపాలకులతోడఁ
        గదనరంగములకుఁ గాలు సాచి
రోషకామాదిసక్తులై రూఢి మెఱసి
గతనిజాయుష్యకాలంబుఁ గానలేని
రాజవరు లేడ మోక్షధర్మంబు లేడ
నూహ సేయంగ మదిలోన యుక్త మగునె.

61


చ.

వనమృగ మేగుదేర నొకవాఁడిశరంబున దానికంఠ మే
సిన యపరాధ మెల్లను నశించుటకై యిట మమ్ముఁ జూచి సం
జనితభయంబుతోడ నతిశాంతునిరీతిని మాన్యవాక్యముల్
మునుకొని నీవు పల్కినఁ బ్రమోదముతోడుత నమ్మవచ్చునే.

62


సీ.

ప్రత్యక్షదేహానుభావ్యమహారాజ్య
        వర్ణితఘనభోగవాంఛ మాని
సంపూర్ణయౌవనస్తబకితమానినీ
        లలితకుచాశ్లేషములు త్యజించి
కర్చూరచూర్ణసంకలితనూతనపుష్ప
        చతురశయ్యానివాసంబు విడిచి
బహుళసింధురరథభటతురగాదిక
        చతురంగబలనిరీక్షణముఁ బాసి
తల్లిదండ్రుల వర్జించి తపము సేఁత
యధికులైనట్టి విప్రులకైనఁ దెలియ
నలవిగానట్టి ధర్మంబు లడుగ నీకు
నింతకపటంబు నడఁపంగఁ బంతమగునె.

63


ఉ.

త ప్పిటులేమి యెన్న వసుధావర నీయెడఁ గల్గినట్టి యా
తప్పులు నొప్పు లయ్యె నిఁక తాపవివర్ణితమానసుండవై
చొప్పుగ వచ్చుమార్గమున సూటి యెఱింగి రథంబుతోడ నీ
విప్పుడె పట్టణంబునకు నేగుము రాజకులైకభూషణా.

64


చ.

నరపతి నిట్లు వీడ్కొలిపి నారద తత్కపిలుండు పద్మినీ
వరుఁ డపరాద్రిశృంగమున వన్నియకెక్కినఁ జూచి యంత సాం

ధ్యరుచిరకర్మముల్ సలుపఁ దత్క్షణ మేగె నిజాశ్రమాంతర
స్ఫురదతిశీతలాచ్ఛజలపూర్ణసరోవరతీరభూమికిన్.

65


వ.

ఆ సమయంబున.

66


గీ.

చరమసంధ్యాంగనాముఖాబ్జంబునందుఁ
దీర్చినిలిపిన సిందూరతిలక మనఁగఁ
జెలువు మైమించె నస్తాద్రిశిఖరభాగ
మున విభాకరుఁ డరయఁ బ్రమోద మొదవ.

67


వ.

అంత.

68


క.

దోషాకరముఖదర్శన
దోషమునకు భీతినొంది దొలఁగినమాడ్కిన్
బ్రోషితుఁడై యఖిలజగ
ద్భూషణుఁ డర్కుండు గ్రుంకెఁ దోయధిలోనన్.

69


ఉ.

చేరె నికేతనంబులకు సేమమునన్ మృగపక్షియూధముల్
జాఱెను చక్రవాకయుగసాంద్రమనోజరసాతిరేకముల్
మీఱె నజాండభాండమున మించి రయంబున నంధకారముల్
పేరెను దారకాభినవబృందఘనద్యుతు లంబరంబునన్.

70


వ.

ఇ ట్లంధకారంబు సర్వదిక్పరిపూర్ణంబై దృష్టిగోచరపదార్థంబుల దృష్టరూ
పంబు లగునట్లు నిబిడంబై ప్రవర్తించునెడ.

71


క.

మదననృపాలుని గొల్లెన
తుదనెత్తిన హేమమయచతురకలశమునా
నుదయాచలశిఖరంబున
నుదయించెను విధుఁడు కాంతియుక్తుం డగుచున్.

72


వ.

అంత నమ్మునివరుండు చరమసంధ్యాసమయసముచితానుస్థానంబు దీర్చి శి
ష్యసమన్వితుండై నిజనిలయంబున కరిగి యగ్నిహోత్రాదికృత్యంబులు స
మాప్తించి విష్ణుధ్యానపరాయణుండై యుండె. నంత నప్పుండరీకమహీకాం
తుండు పయఃపానంబు సేసి తత్తరుమూలంబున సమాసీనుండై మనంబున ని
ట్లనియె.

73

చ.

నిరుపమయోగసంపదల నిశ్చలులై గతభావికాలజా
పరిమితకార్యభావములు ప్రస్తుతి సేయఁగఁజాలి తత్పురం
దరవిభవం బణంపను బ్రతాపముగల్గిన సన్మును ల్కరం
బెఱుఁగఁగ లేరొకో మదిమహీవలయంబున నన్యచిత్తముల్.

74


చ.

కపిలమునీంద్రువాక్యములు గైకొని యే వినినంత నాత్మలో
నపరిమితంబులై యొదవె హర్షసమేతములైన భావముల్
విఫులవధూజనాత్మభవవిత్తజసన్నుతరాజ్యభోగవాం
ఛ పనికిరాక జాఱె నది సౌమ్యతదీయదయాసమున్నతిన్.

75


క.

దృష్టిగ్రాహ్యం బగునది
నష్టంబై చనెడుచోట నానాఁటికి వి
స్పష్టముగఁ దెలియవలయును
సృష్టికిఁ గర్త యగువిభుని జిత్తములోనన్.

76


గీ.

గురుముఖంబువలనఁ గుదురుగా దనమూర్తి
నెఱిఁగికొనినయట్టినరవరుండు
సురలు వినుతి సేయ శుభరూపసహితుఁడై
చెడనిపదమునకును జేరుకొనును.

77


చ.

కపిలమునీంద్రచంద్రుదయ గల్గినదాఁక జలాశినై మనో
విపులవికారయుక్తపదవిం జననొల్లక నిశ్చలుండనై
యపరిమితఫ్రసూనముల కాశ్రయమై చెలువొందు నిట్టివా
దపమె నివాసగేహముగఁ దప్పక నిల్చెద సుస్థిరంబుగన్.

78


వ.

అని యిట్లు పుండరీకుడు వితర్కించుచుఁ దన్మహీరుహమూలంబున నిద్రా
విరహితుండై యుండె. నంత.

79


క.

ఘనతిమిరోరగకబళిత
వనజాసననిర్మితాండవర్ణితసంజీ
వన మిది యన నుదయించెను
దినకరుఁడు సురాధినాథదిగ్భాగమునన్.

80


వ.

ఇవ్విధంబున సూర్యోదయాస్తమయపరిమితంబులగు పదుమూఁడుదివసం
బులు జలాంజలిత్రయపానంబున దేహధారణంబు సేయుచుఁ దన్మహీరు

హమూలంబునఁ బుండరీకుండు మోక్షధర్మాపేక్షుండై యుండె నంతఁ బదునా
ల్గవదినంబునఁ దత్కపిలుండు శిష్యసమన్వితుండై సంధ్యాదికృత్యంబులు
దీర్చి యమ్మహీవల్లభునిఁ గనుంగొని మనంబున నచ్చెరువంది యతనిఁ జేరం
జని యిట్లనియె.

81


గీ.

రాజ్యసుఖము మాని రమణుల విడనాడి
భోగసరణి మీఱి బుద్ధి దప్పి
యడవిలోన నుదక మాహారముగ నిట్లు
బడలఁదగునె నీకుఁ బార్థివేంద్ర.

82


క.

జననాంతరసుకృతంబుల
జననాథుండగు నరుండు జనపతి యయ్యున్
మునివేషముఁ గోరినఁ బశు
వనరే తద్భూమియందు నఖిలజనంబుల్.

83


వ.

అని పలికిన మునీంద్రునకు రాజచంద్రుండు ముకుళితకరుండై నమస్కృతి
పూర్వకంబుగా నిట్లనియె.

84


చ.

గురువులు గాన మీ కెదిరి కొంచెపువాక్యము లైనఁ బల్కరా
దరయఁగ రాజ్యవైభవము లస్థిరముల్ జననవ్యయంబు లె
వ్వరికిని నైన నిత్యములు వర్ణన చేయఁగ వీనిచేత ని
ద్ధరణిని సాధ్య మేయది నతప్రియ మీదయ చాలకుండినన్.

85


క.

క్లేశంబు జాఱె నాశా
పాశంబులు వీడె నణఁగె భవరోగంబుల్
గాసిల్లె మత్కలుషములు
వాసెను మీదర్శనమున వరమునివంద్యా.

86


చ.

సురపతివంద్యపాదయుగశోభితుఁడై యఖిలాండనాథుఁడై
పరఁగుచు దేవదేవుఁడగు పద్మదళాక్షుఁడె దైవ మంచుఁ ద
త్పరమమతంబె ముక్తికి నిదానమునా విలసిల్లునంచు నే
నెఱిఁగితి కొంతకొంత భవదీయముఖాంబుజవాక్యవైఖరిన్.

87


క.

నలినాక్షభక్తియోగము
తెలిపితి తదుపాసనావిధిప్రయతనముల్

దెలియంగ నానతీయఁగ
వలయును మునినాథ భువనవర్ణితచరితా.

88


క.

అని యీరీతిం బలికిన
జనపతి నీక్షించి మిగులసంతత మొదవన్
మునినాథుఁ డతనితో ని
ట్లనియెను గ్రమ్మఱ నుదరవిహసితాననుఁడై.

89


సీ.

జననాథ వినుము నిస్సంశయంబుగ నీకుఁ
        దెలిపెద సర్వంబుఁ దెలిసికొనుము
జగమున సంతతాచారపూతాత్ములై
        కర్మయోగంబున ఘనులు ద్విజులు
చర్చింపఁ దద్విప్రసంస్కృతులై తద
        ర్థాచారసహితులు రాజవరులు
తన్మహీపాలకర్తవ్యార్థకర్మ
        ప్రవర్తులు తదనుజ్ఞవైశ్యజనులు
బాహ్మణోత్తమసేవనాభక్తిదక్క
నతులకును శూద్రజనులకుఁ జలుపవలయు
నట్టికర్మంబు లెచ్చోటనైనఁ గలుగ
వట్లుగావున వారు పుణ్యాత్ము లనఘ.

90


క.

ఉర్వీతలమున మనుజుల
దుర్వహకలుషాగ్నులకును దోయద మగుచున్
సర్వాధికార మనం జను
సర్వేశ్వరపాదభక్తి చర్చింపంగన్.

91


క.

తఱచుగా విఘ్నము లెదిరినఁ
బరితప్తుఁడుగాక విష్ణుపదపంకజసు
స్థిరభక్తితోడ మనుజుఁడు
చరియింపగవలయు సుగుణచరితుం డగుచున్.

92


క.

యోగంబున విఘ్నితుఁ డగు
భాగవతోత్తముఁడు సిరులఁ బరగుచు విపులన్

భోగార్థ ముద్భవించియు
యోగోన్నతుఁ డగును బూర్వయోగబలమునన్.

93


క.

మారుతమున ముడిచెదిరిన
బూరుగుతూలంబు మాడ్కిఁ బోవును వృధయై
నారాయణుఁ దలఁపని పా
పారూఢులవంశ మాయురైశ్వర్యంబుల్.

94


గీ.

అస్థిరంబు దేహ మనుచో ననాగత
క్షణమునందు బ్రదుకు సంశయంబు'
ఇది దలంచి నీవు పదిలమై హరిభక్తిఁ
జనగవలయు విష్ణుసదనమునకు.

95


వ.

మఱియు దేహి దేహలయంబు మనోలయంబు నను ద్వివిధంబులగు లయంబు
లం బొందు. నందు దేహలయంబు నైమిత్తికాత్యంతికభేదంబులం బ్రవర్తి
చుఁ. దద్భేదంబులయందు సుషుప్త్యవస్థాసమయంబున జీవుండు మనోల
యంబు నొందుటనైనది నైమిత్తికంబును, దజ్జీవుండు దేహంబు పరిత్యజిం
చి దేహాంతరప్రాప్తుం డగుట యాత్యంతికంబును నగు. నిట్టిభేదంబులం బ్రవ
రిల్లు నవి దేహలయం బనంబరగు. నింక మనోలయంబు ధ్యానయోగనిష్ఠంబై
ద్వేధావిభక్తం బగు. నందు బాహ్యంబు మఱిచి లక్ష్మీవల్లభు నుల్లంబున ను
త్ప్రేక్షించుట ధ్యానసిద్ధంబు; హృత్కమలనివాసుండగు లక్ష్మీకాంతునిదివ్య
మంగళవిగ్రహంబునందుఁ దన్మానసంబు లయంబు నొందుట యోగనిష్ఠం
బును నగు. నిట్లు నిత్యప్రవృత్తంబులైన దేహమనోలయంబుల స్వరూపంబులె
ఱింగ జ్ఞానాజ్ఞానాత్మకంబైనఁ బ్రపంచంబునఁ దిరంబగు దేహంబున నధి
ష్ఠితంబైన జ్ఞానంబూని తన్నిజాంశంబుస మనంబును సృజియింప నది లో
చనరూపంబై తాదృగ్విధదృష్టప్రపంచంబునందు ఘటపటాదులు గ్రహి
యించుఁ దత్ప్రథమావస్థాసంభవంబును, దదంతరావస్థాస్థితియును, దద
విలోకనంబుసు విశ్వంబునకు లయంబు లనఁబరఁగు. నిట్లు వస్తువులయందు
క్షణమాత్రోదితంబులైన జననస్థితిలయంబులు ద్రవ్యరూపంబులై నిజశరీరం
బున నధిష్టితంబులుగా వివరించెద. రంతఃకరణవ్యాపారసమేతంబగు తద
జ్ఞానంబు నణంచి సర్వేంద్రియరూపంబగు చిత్తంబును బాహ్యవస్తువులవల
నం గుదియించి లక్ష్మీవల్లభు ననవరతంబునుం దలంపఁగవలయు.

96

ఉ.

కాలముచేత వంచితుఁడు గాక దయాపరిపూరితాక్షుఁడై
నాలుకఁ బుండరీకనయనప్రియనామము లెల్లకాలమున్
లీల నుతించు మర్త్యుఁడు నిలింపులు గొల్వఁగ ముక్తినొందుఁ ద
త్కాలుని కాలదండహతిఁ గందక వేడ్క దలిర్ప భూవరా!

97


సీ.

వేదంబులెల్ల శ్రీవిభునిరూపంబులై
        వివిధధర్మాచారవిధులనెల్ల
విస్తరింపఁగనైన వీక్షించి తద్గ్రథి
        తార్థముల్ కుమతు లన్యముగఁ జేసి
విధినిషేధంబులు వివరింపనొల్లక
        కర్మవైగుణ్యముల్ గనఁగలేక
మహిని సర్వజ్ఞాభిమానసంయుక్తులై
        ఖ్యాతి తత్ఫలముగ నాదరించి
విష్ణువిరహితముగ దుష్టవృత్తి దనరి
భూతతృప్తిగ యాగముల్ పూని చలిపి
పెంపు దలకొన ముక్తి సాధింపలేక
తిరుగ జన్మవ్యయంబులం దెమలువారు.

98


సీ.

ఫలసమేతంబైన పాదపం బీక్షించి
        సత్వహీనుండైన సత్వరముగ
నాయాససంయుక్తుఁ డయ్యుఁ దద్వృక్షాగ్ర
        మారోహణము సేయునట్టినరుఁడు
వట్టిమ్రాఁ కెక్కఁగ వాంఛిపఁ డట్లుగ
        బుధులు భోగప్రాప్తిఁ బొదలుకొఱకు
ననయంబుఁ గామ్యకర్మాగారనిరతులై
        శాశ్వతనిలయంబు జాడ విడిచి
తత్ప్రయుక్తంబులుగ వాంఛితములఁ బొదవి
దేవభూముల వసియించి తిరుగ వసుధ
పై మహాహీనమాతృగర్బములఁ జెంది
యుద్భవంబును నాశంబు నొందువారు.

99

క.

ఆకామ్యములైనను ల
క్ష్మీకాంతున కర్పితముగఁ జేసినమనుజుం
డాకైటభరిపునిశ్చల
లోకంబున సుఖమునొందు లోకోత్తరుఁడై.

100


వ.

మఱియు బాలకుండు గుడవాంఛాసమేతుండై తిక్తంబుఁ గొను చందంబునఁ
గర్మఫలవాంఛ నొదవి తద్దర్శకంబులగు జ్యోతిష్టామాదికర్మంబు లాచరింపం
దత్సామర్థ్యంబున జ్ఞానంబునకు నాచ్ఛాదకంబులైన కలుషంబు లపహృతం
బులగు. న ట్లయినచో మలినంబగు దర్పణంబు పత్రచూర్ణలేపనప్రభావంబు
న నిర్మలంబగునట్ల తత్కర్మాచరణంబునం బాతకాపేతంబై జ్ఞానంబు ప్ర
వృద్ధంబై నిష్కళంకంబైన కైవల్యంబునకుఁ గారణరూపంబగునట్లు గావున
నిత్యనైమిత్తికాదికర్మంబులును జ్ఞానంబునకు సాధనంబులగునని చెప్పి మ
ఱియు నిట్లనియె.

101


సీ.

స్థావరజంగమాత్మకమైన విశ్వంబు
        విష్ణురూపంబుగా వీక్ష చేసి
మానితదేహాభిమానంబు వర్జించి
        గురుకృపాకలితుఁడై వెరవు గలిగి
తద్విష్ణుభృత్యభృత్యసమానుఁడై శాంత
        చిత్తుఁడై నిత్యశుచిత్వ మలరఁ
గామరోషాదిదుష్కరదేహజాహిత
        సంఘంబు లెల్లను సడల మోఁది
సంతతాచారసహితుఁడై సత్యవాక్య
సంయుతుండగు చనయంబు సఖ్యవృత్తి
దిరుగనేర్చిన పుణ్యుండు త్రిదశవినుతుఁ
డగుచు విలసిల్లు హరిమందిరాంతరమున.

102


క.

ఆహవభయవర్జితు లగు
బాహుజులకు వైశ్యులకును బణఁతుల కైనన్
దేహాయాసము నొందక
శ్రీహరిఁ దలఁపంగవలయుఁ జిత్తాబ్జమునన్.

102

గీ.

సిరుల నీయఁజాలి చిరకాలసంప్రాప్త
కలుషచయము నణఁపఁగలిగినట్టి
పుండరీకనయనుఁ డుండఁగఁ గుమతులు
పతితు లగుదు రన్యమతముఁ దగిలి.

104


సీ.

చింతనీయములందుఁ జింతింపఁదగు విష్ణు
        మంగళనామంబు మానవేంద్ర
దర్శనీయములందు దర్శింపఁదగు పంక
        జాక్షుని చరరూప మవనినాథ
శ్రవ్యంబులం దతిశ్రవ్యంబు లక్ష్మీశు
        సద్గుణజాలంబు జనవరేణ్య
వర్ణనీయములందు వర్ణ్యముల్ చక్రాంక
        పౌరుషంబులు రాజపద్మమిత్ర
యట్లు గావున వేదవేదాంతనిలయుఁ
డగు తదంభోజనాభుని ననుదినంబు
సర్వగతుఁడుగఁ దలఁచి నిస్సంశయమున
వినుతి సేయంగవలయు నుర్వీతలేశ.

105


సీ.

రక్తమాంసాస్థిచర్మావృతం బైనట్టి
        తను వనిత్యం బని తలఁపవలయు
స్వప్నరూపం బైన సంసౌరసౌఖ్యంబు
        మెఱపుచందం బని మెలగవలయు
బహుళపుత్త్రాదిసంపదలెల్ల ఘనదుఃఖ
        హేతువులని యాత్మ నెఱుఁగవలయు
సంభవస్థితివినాశములు దేహమునకు
        నిత్యంబు లని బుద్ధి నిలుపవలయు
జంగమస్థావరాదిప్రశస్తవిశ్వ
విభుఁడె దేవత యనుచు సేవింపవలయు
నంబుజాక్షుండె ముక్తిదాయకుఁ డఁటంచుఁ
దేఱుకొన నిట్టివివరముల్ దెలియవలయు.

105

గీ.

భోగసరణిమీఁద బుద్ధి రోసినఁ గాని
పాదుకొనదు హృదయపంకజంబు
స్వాంతవనరుహంబు చాంచల్య ముడిగిన
యపుడె యోగసిద్ధి యగు నృపాల.

107


క.

తలఁపుము హరినామంబులు
నిలుపుము హృదయంబులోన నీరజనాభున్
జలుపుము వైష్ణవకృత్యము
లలఘుయశోధామ కువలయాధిపవినుతా.

108


క.

శరణాగతు లగు దాసులు
దురితౌఘసమేతు లైనఁ దోయజనాభుం
డరసికొని వారి కొసఁగును
బరిపూర్తిగ నాత్మలోకభవసౌఖ్యంబుల్.

109


వ.

మఱియుఁ గర్మయోగంబును భక్తియోగంబును జ్ఞానయోగంబును ధ్యాన
యోగంబు నను యోగవిశేషంబులు ముక్తిప్రాప్తికరంబులై నాల్గువిధంబు
లఁ బ్రవర్తించు. నందు, నాధానపుంసవనసీమంతజాతకర్మనామకర
ణాన్నప్రాశనచౌలోపనయనవేదవ్రతస్నాతకవివాహపంచమహాయజ్ఞ
హోమవైశ్వదేవమాసపైతృకనైమిత్తికపైతృకాగ్నిహోత్రదర్శపూర్ణ
మాసాగ్రయణాగ్నిష్టోమాదికర్మాచరణంబు కర్మయోగంబు, శిలాదారు
లోహమృడాదికల్పితంబులైన ప్రతిమాభేదంబులయందుఁ బుండరీకాక్షు
నావహించి యప్పరమపురుషునకు విధ్యుక్తప్రకారంబున నాసనార్ఘ్యపాద్యా
చమనీయమధుపర్కస్నానవస్త్రయజ్ఞోపవీతదివ్యాభరణగంధపుష్ప
ధూపదీపనైవేద్యతాంబూలాద్యుపచారంబులు యధాసంభవంబుగ సమ
ర్పించి స్తుతిపూర్వకంబుగఁ బదక్షిణనమస్కారంబు లాచరింపవలయు.
నిట్లు ప్రత్యహంబును నాచార్యపుండరీకాక్షతద్భక్తకైంకర్యసమేతం బగు
శ్రద్ధ భక్తియోగంబును నిస్సారం బగు సంసారంబున శరీరమాత్రబాంధవు
లైన సుతదారాదులయందుఁ బాదుకొనిన దుర్మోహంబుఁ బరిత్యజించి
వైరాగ్యంబు నొంద నది జ్ఞానయోగంబ నగు. నింక ధ్యానయోగలక్షణంబుఁ
జెప్పెద నాకర్ణింపుము.

110

సీ.

తానంబు దీర్చి ధౌతములైన వస్త్రముల్
        ధరియించి సాంధ్యకృత్యములు నడపి
విజనస్థలంబున విమలపద్మాసనా
        సీనుఁడై యంత నిశ్చింతుఁ డగుచు
నయనవాగాదికేంద్రియనిరంకుశబాహ్య
        గతి నంతరాత్మసంగతము చేసి
కామరోషాదులఁ గట్టి మూలకుఁ ద్రొబ్బి
        శీతోష్ణములచేతఁ జిక్కువడక
యోగిపురుషుండు హర్షసంయుక్తుఁ డగుచు
ద్వాదశారసమేతహృద్వనజమందుఁ
బ్రణవ మంత్రాక్షరంబులఁ బాదుకొల్పి
తత్పయోరుహకర్ణిక తలము సేసి.

111


సీ.

శ్రీవత్సకౌస్తుభశ్రీయుక్తవక్షుని
        లలితపీతాంబరాలంకరిష్ణు
నతులకుండలరుచివ్యాప్తగండద్వయు
        నంచితవక్త్రపద్మాభిరాముఁ
బుండరీకాక్షు నంబోధరశ్యామల
        దేహుఁ గిరీటదేదీప్యమాను
శార్ఙ్గనందకసుదర్శనశంఖరంజిత
        శ్రీహస్తవర్ణితు శేషశయను
వాసవప్రముఖామరవంద్యచరణుఁ
దులసికాదామసంలగ్నలలితకంఠుఁ
దన్మనఃపద్మకర్ణికాంతర నివిష్ణుఁ
దలఁచునది ధ్యానయోగంబు ధరణినాథ.

112


క.

ఏవంవిధలక్షణముల
భావితుఁడై మదనకోటిభాసురుఁడగు నా
శ్రీవల్లభునిఁ దలంపుము
భావసరోజంబునందుఁ బార్థివముఖ్యా.

113

క.

వినుము నృపాలక చెప్పెద
మనమున ననుమానమెల్ల మాని రమానా
థునిఁ దలఁపుము హృదయంబున
ననిమిషులు నుతింప ముక్తి కరిగెద వీవున్.

114


వ.

అని యిట్లు కపిలమునీంద్రుండు వైరాగ్యలక్షణంబును విష్ణుభక్తిప్రకారంబు
ను జెప్పిన విని పుండరీకుం డిట్లనియె.

115


మ.

ఘనులై పాపవిముక్తులై నిగమయోగజ్ఞానసంపన్నులై
వనజాతాక్షవిశిష్టభక్తిరతి విశ్వస్తాత్ములైయున్నయీ
మునివర్యుల్ తపమాచరించుచును దన్మోక్షంబు నొందంగలే
రనఘా యీక్రియఁ దెల్పఁగావలయు సత్యజ్ఞానసంభావితా.

116


క.

అనిన మహీవల్లభునకు
మునివల్లభుఁ డిట్టు లనియె మోదముతోడన్
వనరుహవిమతాకృతిద
ర్శనసంక్షుభితాబ్దిఘోషచారుమృదూక్తిన్.

117


సీ.

తపముచే విశ్రుతుల్ తర్కింప మును లెల్ల
        దాన నాయుష్యంబు తఱిఁగిపోక
దినవృద్ధి నొందంగఁ ద్రిదశనాయకుఁడైన
        దన్మునీంద్రులఁ జూచి తలఁకుచుండు
నమ్మహాత్ములు పంకజాసనుతోఁ గూడి
        చనువారు శ్రీవిష్ణుసదనమునకు
నంతపర్యంత మబ్జాక్షున కర్పితం
        బులుగాక సత్కర్మములఁ జరింతు
రట్లుగాన దేహాంతరప్రాప్తి లేక
నిత్యముక్తులు తత్పుణ్యనిరతమతులు
యుష్మదాదుల కెల్ల నాయువులు గొంచె
మైనయెడ ముక్తిమార్గంబు లరయవలయు.

118

సీ.

హరియె దైవంబని యాత్మలో మును లెల్ల
        నెఱిఁగియుండియు వారు వెఱపు గలిగి
తొల్లి ప్రత్యక్షమై తోయజాక్షుం డాన
        తిచ్చినక్రమమెల్ల వీక్ష చేసి
ప్రబలు వైష్ణవనిరూపణమున నీసృష్టి
        విఘ్నసంయుక్తమై విరియుననుచు
మతివిశేషమున దుర్మతయుక్తి సంయుక్త
        బాహ్యవాదంబులఁ బ్రబలికొనుచు
వడిఁ జరాచరరూపవిశ్వంబు నెల్ల
మోహపఱుచుచు నిజమైన ముక్తిసరణి
సత్యపరులకు నైన సజ్జనులకైనఁ
దెలుప రొరులకు సుజ్ఞానలలితహృదయ.

119


వ.

అట్లు గావునఁ గర్మాచారసమేతులును వైరాగ్యసంయుక్తులును సుజ్ఞానసమే
తులును నగ్రగణ్యులును నైన మునీంద్రులు శాపానుగ్రహసమర్థులై
మోక్షంబునందుఁ గృతనిశ్చయులై ముక్తు లనంబరఁగి భోగవాంఛారహితు
లై తత్తద్ధామంబులయందు శాంతులును దాంతులును వైరాగ్యసంయుక్తులు
ను నైన పరమపుణ్యులకు వైష్ణవం బగు మార్గం బుపదేశించుచుఁ బ్రవర్తిం
తు రని చెప్పినఁ గపిలునకుఁ బుండరీకుం డిట్లనియె.

120


క.

వనజాక్షుఁడు తత్పూర్వం
బున నేమని యానతిచ్చె ముద మలరఁగఁ ద
న్మునివరులకు నీభువనం
బనుమతిఁ జెడుటెట్లు వైష్ణవాగ్రమతమునన్.

121


క.

వనరుహనాభుని యానతి
యన నెయ్యది తెలివి మెఱయ నతిరభసమునన్
మునినాథ యీవిచిత్రము
వినుపింపుము హృదయమందు వేడ్క దలిర్పన్.

122


వ.

అనిన రాజునకు మునివర్యుం డిట్లనియె.

123


సీ.

వినుము భూవర పూర్వమున రమాకాంతుండు
        వేడ్క మనస్సృష్టివిదితముగను

నిర్మింపఁ దద్విశ్వనిలయమానవనాగ
        యక్షాదు లానంద మతిశయిల్లఁ
దత్పుండరీకాక్షుఁ దలఁచి కైవల్యంబుఁ
        బొందినయంతఁ దత్పుణ్యమూర్తి
రేతోమయంబుగాఁ జాతుర్యమున సృష్టిఁ
        గ్రమ్మఱియును నిల్పి కౌతుకమున
నందు మఱియును నరదేవయక్షపక్షి
పశుమృగాదులు గావించి ప్రాభవమున
నవియుఁ జెడకుండ నొండుపాయంబుఁ దలఁచి
మునుల నీక్షించి వారితో ననియె నిట్లు.

124


గీ.

ఏకతంబు సేసి యేను మీతోడుత
మాట యనెద నొకటి మంతనంబు
తెలిపి చెప్పవలదు త్రిభువనంబుల నది
చెప్పినపుడు మీకుఁ దప్పిదంబు.

125


వ.

అది యెట్టి దనిన.

126


సీ.

అనుమాన ముడిగి శ్రీవనితాధిపుఁడు లోక
        నాయకుండని మనోనలినమందు
మము వేడ్కఁ దలఁపోసి మన్నామజపములు
        సేయుచు మద్భక్తిఁ జెలగువారు
అరుగుదు రస్మదీయాలయంబునకును
        బ్రబలపునర్జన్మరహితు లగుచు
నిది యథార్థంబుగా నెఱిఁగి మానవకోట్లు
        మన్ముఖ్యదివ్యనామములు దలఁచి
నంత సాయుజ్యముక్తికి నరుగునపుడె
ప్రాణివిరహిత మగుచుఁ బ్రపంచ మెల్ల
వృద్ధిబొందక విపరీతవృత్తిఁ జెదరి
సకలదిశలందు శూన్యమై సమయు నంత.

127


గీ.

అట్లు గాన నస్మన్మతం బణఁచి మీరు
బాహ్యమున నన్యమతములు పాదుకొల్పి

ప్రకటములు సేయనందునఁ బ్రజల కెల్ల
సంశయంబొదవు హృదయాబ్జంబులందు.

128


క.

ఈరీతి సంశయంబుల
మీరి జనుల్ బెగడుపడినమృగములకరణిన్
నేరుపుసెడి పలుతెఱఁగుల
జాఱుదు రెఱుంగంగలేరు సన్మార్గంబుల్.

129


గీ.

జాడఁ దప్పినట్టి జను లెల్ల భ్రాంతులై
తిరుగుచున్నయట్లు దివిజులైన
మముఁ దలంపరేని మహిమీఁద వారలు
మేటిసంసృతులను మెలఁగువారు.

130


క.

నలినోదరుఁ డగు నను మదిఁ
దెలియక యీజీవకోట్లు తిరుగన్ జననం
బులఁ బొందఁగఁ జనునప్పుడు
నిలుచును నెడతెగక సృష్టి నిర్విఘ్నముగన్.

131


క.

అది యెఱిఁగి మీరు ముక్తి
ప్రదమగు మన్మతము దాఁచి మనుజుల కెల్లన్
విదితము సేయక మదిలో
ముదమునఁ దెలియంగవలయు మునివరులారా.

132


గీ.

కర్మమార్గమందు ఘనులైనవారికి
ముక్తి గోరునట్టి భక్తులకును
నిలిచి తొలఁగ నట్టి నిశ్చలజ్ఞానంబు
గురుఁడ నగుచు నేనె కుదురుపఱుతు.

133


వ.

అని పుండరీకాక్షుం డానతిచ్చినక్రమంబు నీ కెఱింగించితి; నట్టి భాగవత
ధర్మంబులు దెలియఁ బద్మభవాదుల కైనను శక్యంబులు గావు; ఈ జగంబు
తద్విష్ణుమాయామోహితంబై ప్రవర్తించు; నతని గుణవ్యాపారపౌరుషం
బులు వినుతించువారు సాయుజ్యంబు నొందుదురని పలికి మునీంద్రుం డి
ట్లనియె.

134


గీ.

ఒక్కమంత్రరాజ ముపదేశ మిచ్చెద
నది జపంబు సేయు మంబుజాక్షుఁ

డాఱుదివసములకు నభివాంఛితం బిచ్చు
నీకు మనుజచంద్ర నెమ్మితోడ.

135


వ.

అట్టి మంత్రం బెట్టి దనిన.

136


మంత్రము.

పరాయ పరరూపాయ పరమాత్మన్ పరాత్మనే
నమః పరమతత్త్వాయ పరానందాయ ధీమహి.

137


క.

ఈమంత్రము జపియించిన
భూమీశ్వర నీకుఁ గల్గు భువనములోనన్
గామితమగు వైకుంఠము
శ్రీమత్పదపద్మయుగ్మసేవారతియున్.

138


వ.

ఇవ్విధంబునఁ గపిలుండు మోక్షధర్మంబులు సెప్పిన విని పుండరీకుండు
మనంబునం గలుగు సంశయంబు మాని సమచిత్తుండై యామునీంద్రునకు
దండప్రణామం బాచరించి స్నానపూర్వకంబుగఁ దన్మంత్రంబు పరిగ్ర
హించి యమ్మహాత్ముని యనుగ్రహంబునఁ దదాశ్రమోపాంతంబునం గలుగు
పద్మపుష్కరిణీతీరంబు జేరి తత్పుణ్యజలంబుల స్నానాదికృత్యంబులఁ
దీర్చి ధౌతవస్త్రంబులు ధరియించి పద్మాసనాసీనుఁడై బాహ్యగతజ్ఞానంబు
విసర్జించి హృదయపద్మంబునందు సర్వభూషణభూషితుండును, సుదర్శన
పాంచజన్యాదిసర్వాయుధోపేతుండును, సర్వలక్షణసమేతుండు నైన లక్ష్మీ
వల్లభుని బాదుకొల్పి తదుపదిష్టం బగు మంత్రంబు జపియించుచున్నయెడ.

139


సీ.

గ్రైవేయకంకణాంగదహారకుండల
        ప్రభ లలితస్ఫూర్తి బరిఢవిల్ల
నవరత్నకీలితోన్నతకిరీటద్యుతు
        లాశావకాశంబు నలమికొనఁగఁ
గటివిలంబితహేమకాంచీవిలగ్నమై
        రాజితపీతాంబరంబు మెఱయ
శ్రీవత్సకౌస్తుభశ్రీసమాయుక్తమై
        తులసికాదామంబు తొంగలింప

నతిరయంబున గరుడవాహనసమేతుఁ
డగుచు విష్ణుండు శంఖచక్రాదివిశ్రు
తాయుధంబుల ధరియించి యవనిపతికిఁ
దక్షణంబున నచటఁ బ్రత్యక్ష మయ్యె.

140


వ.

ఇట్లు పుండరీకలోచనుండు నిజభక్తసమేతుండై యచ్చటికి నరుగుదెంచి
తన్మహీకాంతునకు దివ్యజ్ఞానంబు గృపసేసిన నతండును రోమాంచకంచుకి
తుండు హర్షాయత్తచిత్తుండు నై వివిధభూషణాలంకృతుండును సర్వాయు
ధోపేతుండును సర్వలక్షణపరిపూర్ణుండును బతగేంద్రవాహనుండును భక్త
జనసమేతుండును నైన యప్పరమమూర్తిం గనుగొని బ్రణామపూర్వకంబు
గా నిట్లనియె.

141


చ.

అనవరతంబు మీగుణము లాత్మఁ దలంచుచు నిత్యముక్తు లై
మునులు భవత్స్వరూపము సమున్నతి నీక్షణ సేయలేనిచో
వనజదళాక్ష భక్తజనవత్సల యేఁ గనుఁగొంటిఁ బుణ్యలో
చనముల యుష్మదీయమగు సన్నుతదివ్యశరీర మిచ్చటన్.

142


చ.

ఫలితము లయ్యె మత్కృతతపంబులు జన్మసహస్రసంచితా
ఖిలకలుషౌఘసంపదలు గీటడఁగెన్ భవసాగరంబు ని
శ్చలభవదంఘ్రిభ క్తి యను సాధనసంగతి వెళ్ళ నీఁదితిన్
నలినవిలోలనేత్ర యిఁక న న్గరుణింపుము భక్తవత్సలా.

143


సీ.

పరిమళద్రవ్యంబు బహుళమై వర్తింపఁ
        జని కర్దమముఁ బూసికొనినయట్లు
సరిలేని రత్నభూషణములు వర్ణించి
        గురువెందసరములు గోరినట్లు
సరసాన్నభక్ష్యభోజ్యములు విసర్జించి
        మించి శాకమున కాసించినట్లు
వన్నె మీఱిన పట్టువస్త్రముల్ విడనాడి
        కంబళచేలముల్ గట్టినట్లు
అఖిలజగదేకనాథుఁడ వైన నిన్నుఁ
దలఁపనొల్లక దేవతాంతరములందు

భక్తిసంపన్ను లగునట్టి పాపరతులు
పొందుదురు రౌరవంబుల భువనవంద్య.

144


క.

కీటం బైనను మీదయ,
పాటిల్లిన నింద్రుఁ డగును బాకాహితుఁడున్
గీటం బగు మీదయకును
సూటిగ వర్తింపఁడేని శుభగుణనిలయా.

145


క.

ఏవివరంబును నెఱుఁగను
గావింపఁగలేను నిత్యకర్మాద విధుల్
శ్రీవల్లభ దయచేయుము
కైవల్యము నస్మదీయకాయముతోడన్.

146


వ.

అని పుండరీకుండు విన్నవించిన సంతసించి యప్పరమపురుషుండు నిజకర
కమలంబునఁ దదీయశరీరస్పర్శనంబు సేయుచు నిట్లనియె.

147


మ.

రమణీబంధుజనాప్తులన్ విడిచి తద్రాజ్యంబు వర్జించి దు
ర్దమకామాదులఁ జెందనీక హృదయస్థైర్యంబునన్ మించి తీ
వమితాస్మద్గుణకీర్తనావ్రతముచే నాహ్లాదయుక్తుండ నై
విమలంబైన గుణంబు గల్గ నిను నే వీక్షించితిం బుత్త్రకా.

148


క.

చలితులు గాక దృఢంబుగఁ
దలఁపున మముఁ దలఁచునట్టి తత్త్వజ్ఞుల మ
న్నిలయమునఁ బాదుకొల్పుదుఁ
జలమునఁ దద్విహితహర్షసంయుక్తుఁడ నై.

149


క.

భూరమణ నీవు జగముల
మీఱి మముం దలఁచుటకును మెచ్చితి మదిలో
నేరీతి నీవు గోరితి
వారీతిన చనఁగవలయు నస్మత్పురికిన్.

150


వ.

అని యిట్లు పుండరీకాక్షుం డానతిచ్చిన యనంతరంబ యప్పుండరీకుండు దధి
వేశసంగంబున దుగ్ధంబులు దధిరూపంబులు దాల్చుచందంబునఁ దత్కరస్ప
ర్శనంబున దివ్యశరీరసమేతుండై పరమభాగవతాగ్రణ్యుండై దివిజులు స
న్నుతింపఁ దద్రమావిభుం గొలిచి పరమపదంబునకుం జనియె. నట్లు గావున లక్ష్మీ

వల్లభుండు భక్తియోగమార్గంబుననె ప్రసన్నుండై భక్తులకుఁ బరమపదం
బుఁ గృపసేయు. నీయుపాఖ్యానంబు వినినం బఠించిన లక్ష్మీకాంతునిలోకంబు
న నిలయంబు కలుగునని చతుర్ముఖుండు సెప్పి నారదునకు మఱియు నిట్లనియె.

151


సీ.

తెలియుము మదిలోనఁ దిరముగా విష్ణుండు
        పరతత్వ మనుచును భక్తిఁ బొదలి
నుడుగుము భక్తితో నెడపక తద్రమా
        కాంతుసద్గుణములు కౌతుకమునఁ
దలఁపుము హృదయపద్మంబునఁ గమలేశు
        నామపంజరము సన్నాహ మొదవ
వినుము వీనులయందు మునుకొని కౌస్తుభా
        భరణుని కథలు సంభ్రమము నిగుడ
వందనము సేయు మాచార్యవర్యవిప్ర
పరమవైష్ణవమార్గప్రపన్నులకును
జేరఁబోవకు నచ్చోట వారిజాక్ష
మతవిరోధకులైన దుర్మతుల ననఘ.

152


క.

ఈవైష్ణవధర్మంబులు
భావంబునఁ దెలిసి విష్ణుభక్తినుతుఁడ వై
కావింపుము సత్కృత్యము
లావనజాక్షుం డొసంగు నఖిలార్థంబుల్.

153


సీ.

ఆచార్యవైముఖ్య మాత్మప్రశంసయు
        విష్ణుభక్తులఁ జూచి విరసపడుట
తత్ప్రయోజనములు తప్పించి నడచుట
        పరులలాభంబులు చెఱుపఁజనుట
గర్వంబు నొందుట కపటంబు సలుపుట
        మాయయు మోహంబు మత్సరంబు
పాదతీర్థము నేలఁ బడఁగ నంకించుట
        హరిమందిరము చేర నరుగకుంట

సువ్రతంబగు నేకాదశీవ్రతంబు
వీడనాడుట దుష్టప్రవృత్తితోడఁ
గామినులనింద సేయుట క్రమము సెడుట
విష్ణుధర్మమున కీవె పో విఘ్నతతులు.

154


చ.

సరసిజజాతుఁ డి ట్లఖిలశాస్త్రమతంబులలోన నేర్చి పా
పరతులకైన ముక్తి సులభం బని వైష్ణవమార్గ మంతయున్
సురముని కీక్రియం దెలుపఁ జోద్యము నంది యతండు హర్షసం
భరితమనస్కుఁడై మఱియుఁ బద్మజు జూచి ప్రియోక్తి నిట్లనున్.

155


క.

శ్రీకాంతునకు బ్రియంబై
యేకాలము నరుల కెల్ల నిష్టార్థంబుల్
చేకొని యొసఁగుచు ఘనమగు
నేకాదశిమహిమ మాకు నెఱుఁగఁగవలయున్.

156


వ.

అని పలికిన నారదునకు సురజ్యేష్ఠుండు సంతోషంబునఁ బులకితాంగుండై
యిట్లనియె.

157


సీ.

వినుము మునీంద్ర యే వివరించి జెప్పెద
        వరుస నేకాదశీవ్రతమహత్త్వ
మాదినంబునఁ బంకజాక్షునిఁ బూజించు
        వారికి సిద్ధించు వాంఛితములు
ఉపవాసనిరతులై యుండెడిసజ్జనుల్
        హరిమందిరమ్మున కరుగువారు
ద్వాదశీవ్రతమహూత్సాహసంపన్నులు
        నిష్పాపులై కీర్తి నెగడువారు
విప్రభూమీశదేవతావిత్తహరులు
భ్రూణహంతలు సంతతక్రూరమతులు
నార్యనింద్యులు మద్యపానాభిరతులు
దద్వ్రతంబున ముక్తులై తనరువారు.

158


వ.

మఱియును.

159


సీ.

దశమినాఁ డేకభుక్తము సేసి దేవగృ
        హమున నధశ్శాయి యగుచు వేడ్క

నిద్రించి మఱునాఁడు నియతుఁడై యేకాద
        శీదినంబునను రాజీవనేత్రుం
దలఁచుచు నిమ్ముగా జలకృతస్నానుఁడై
        విమలుఁడై సంధ్యాదివిధులఁ దీర్చి
లీలతో గోమయలిప్తస్థలంబునఁ
        బద్మనాభాకృతి ప్రతిమ నిలిపి
యందు భావించి లక్ష్మీశు నావహించి
పుష్సచందనములచేత బూజ సేసి
భక్తి నైవేద్య మర్పించి ప్రస్తుతించి
యతిముదంబునం దా నమస్కృతు లొనర్చి.

160


గీ.

విష్ణుకథలచేత వితతనర్తనవాద్య
గీతనుతులు సెలఁగఁ బ్రీతితోడ
జాగరంబు సేసి చతురత నారాత్రి
గడపవలయు నిట్లు గరిమ మెఱయ.

161


వ.

అంత.

162


క.

బారసిదినమున నుచితా
చారమ్ములు దీర్చి నరుఁడు సంతసమున ల
క్ష్మీరమణార్పితముగఁ దాఁ
బారణ సేయంగవలయు భాసురచరితా.

162


గీ.

ఇది వ్రతంబు గాఁగఁ బదిలుఁడై కడఁకను
నడపనేర్చినట్టి నరవరుండు
సురలు వినుతి సేయ శోభితాకారుఁడై
చనుచునుండు విష్ణుసదనమునకు.

164


క.

తలకొని నఖముల జిదిమిన
తులసీదళములను విష్ణుదోయజనాభున్
ఫలవాంఛఁ బూజ సేయ వి
ఫలుఁడగు నానరుఁడు పాపభావుం డగుచున్.

165

సీ.

మునుకొని ప్రణవాదులును నమోంతములునై
        తెలివొందు లక్ష్మీశుదివ్యనామ
ములు వేడ్క నొడువుచుఁ దులసీదళంబులు
        పదియేను బూజింపఁ బద్మనాభుఁ.
డఖిలపాపంబుల నడఁచు నేకాదశీ
        వాసరంబున రమావాసుఁ డపుడ
చెఱుచును గాంచనప్తేయాదిదోషముల్
        దళముల నూటఁ దత్కమలనాభుఁ
డంతమీఁదట ఫల మెల్ల నంబుజాక్షు
పురములోపల మణిగణస్ఫురితకల్ప
భూజసుమవాసనాపరిపూర్ణనిత్య
నిరుపమానైకసౌభాగ్యనిలయ మనఘ.

166


క.

హరివాసరమున నన్నము
పరితృప్తి భుజించు టెల్లఁ బానగృహమునన్
సురతోడుత గోమాంసము
వెఱవక భుజియించునట్ల వీక్షింపంగన్.

167


గీ.

అనుపనీతు లగుచు నజ్ఞులై తిరిగెడు
పంచవత్సరముల బాలకులకు
వృద్ధరోగులకును వీక్షింపఁజెందదు
విష్ణువాసరాన్నవృజిన మరయ.

168


సీ.

భూదేవగురువిత్తములు హరించిన నైన
        సంతతానాచారసహితుఁ డైన
బ్రహ్మహత్యాదిపాపములఁ జెందిన నైన
        గురుభామినీబాలగోఘ్నుఁ డైనఁ
జండాలకామినీసంగతుం డైనను
        దఱచుగ మధుపాననిరతుఁ డైనఁ

దల్లిని దండ్రిని ద్యజియించువాఁడైనఁ
        బాషండవర్గసంభరితుఁడైన
నఖిలదోషాశ్రయుండైన యట్టినరుఁడు
సుస్థిరంబగు బుద్ధిచే సొంపుమిగిలి
యొక్కహరివాసరంబున నుపవసింపఁ
గలుగు నతనికి లక్ష్మీశనిలయ మనఘ.

169


గీ.

భక్తిసాధ్యుఁడైన పక్షీంద్రగమనుండు
హృదయపద్మమందుఁ బదిలముగను
నిలిచియున్నచోట గలుషితులై మర్త్యు
లెఱుఁగ రిట్టిసూక్ష్మ మింద్రియముల.

170


వ.

ఇంక నొక్కపురాతనంబగు నుపాఖ్యానంబు వినిపించెద నాకర్ణింపుము.

171


సీ.

మగధకోసలకురుమద్రాధినాథుఁడై -
        రంతిదేవుండను రాజవరుఁడు
ధర్మంబు విడిచినఁ దద్దేశములయందుఁ
        గోర్కెమై వర్షము ల్గురియవయ్యె
నదియె కారణముగ నఖిలసస్యంబులు
        ఫలవిహీనంబులై నిలువు చెడిన
నంత దుర్భిక్ష మత్యంతభీకరముగ
        నరుదేర నాప్రజ లధికమైన
దప్పి నాఁకట నత్యంతతాప మంది
సమయునప్పుడు మద్రదేశంబునందు
దానవిఖ్యాతుఁడగు విష్ణుదత్తుఁ డనఁగ
భూసురుం డుండు విత్తసంపూరితుండు.

172


గీ.

అన్నమునకు విత్తమంతయు వెచ్చించి
చిన్నమైనముడుపు చేత లేక
రూపురేఖలందుఁ జూపట్టునిజభార్య
యగుసుగంధితోడ ననియె నిట్లు.

173

సీ.

వర్షంబులేమిని వసుధాతలంబున
        సస్యముల్ పండక సమసిపోవ
దుర్భిక్ష మేతెంచి తొలఁగ దేమిటనైన
        వెళ్ళెను మనచేతివిత్త మెల్ల
సమయుచునున్నారు సకలదేశంబుల
        ప్రజ లన్నములు లేక భ్రాంతు లగుచు
సత్యదానక్రియాచారవిహీనుఁడై
        ధర్మంబు వర్జించె ధరణివిభుఁడు
తలఁప నిచ్చోట మనకుండఁ దగవు కాదు
తొలఁగి యొకచోటఁ బ్రాణముల్ నిలుపవలయుఁ
బ్రాణమూలము పుణ్యంబు ప్రబలుటకును
బుణ్యమునఁ గల్గుఁ బరలోకపూర్ణసుఖము.

174


క.

ఇప్పటికి వింధ్యదేశము
చొప్పుగ ఫలకందమూలశోభిత మగుచున్
జెప్పన గోచరమగునది
తప్పక చనవలయు నటకుఁ దాత్పర్యమునన్.

175


వ.

అంత.

176


క.

శ్రీవత్సకౌస్తుభాంకిత
భావజశతకోటితులితభాసురదేహా
కావేరీపులినాంతర
పావనసురవినుతరంగపట్టణశయనా.

177


మత్తకోకిల.

మండలాగ్రవిఖండితాఖిలమత్తశాత్రవమండలా
పుండరీకవిశాలలోచన పూర్ణచంద్రవికాసకా
కుండలీశవిపక్షవాహన ఘోరపాపవినాశయా
ఖండలాదిసురేంద్రశేఖర కాంతిమత్పదపంకజా.

178

గద్య
ఇది శ్రీహనుమత్కటాక్షలబ్ధవరప్రసాద సహజసారస్వతచంద్ర
నామాంక రామవిద్వన్మణీకుమా రాష్టఘంటావధానపర
మేశ్వర హరిభట్టారకవిరచితంబైన మత్స్యపురాణ
ఖండంబగు విష్ణుధర్మోత్తరంబునందుఁ
జతుర్థాశ్వాసము.
శ్రీ