భోజరాజీయము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

భోజరాజీయము

షష్ఠాశ్వాసము

శ్రీయువతీ మృదువచనర
సాయన పరిపూర్ణకర్ణ! శశింభవర్ణా!
మాయాతీత! సువర్ణ
స్తేయాద్యంహోవిఘాత! శ్రీనరసింహా!

1


వ.

అవధరింపు మమ్మహాపతి కి ట్లనియె నట్లు రత్నమండనుండు చెప్పు గోవ్యాఘ్ర
సంవాదకథావిశేషంబునఁ బావకలోముచరిత్రంబు విని 'చిత్రకాయం బెటు
వోయె నక్కథ విని బ్రహ్మరాక్షసుం డేమి చేసె నెఱింగింపు' మని భోజుం
డడిగిన సర్పటి యి ట్లని చెప్పె నాప్రసంగంబు విని.

2


క.

తా నెఱిఁగినకథ చెప్పితిఁ
బో నీ కుండెడునె యింకఁ బులి యని మదిలో
నూనిన సంతసమున నా
ధేనువుఁ దాఁ జనవు మెఱపి ధృతి ని ట్లనియెన్.

3


క.

'పావకలోముని చరితము
భావ మలర వింటి వింకఁ బంపుము నన్నున్
రావలయుఁ దిరిగి వేగమ'
నావుడుఁ బులి గోవుఁ జూచి నగి యి ట్లనియెన్.

4


క.

ఏమిటికి నెట్టుకొనియెదు
వీమాటల నాకుఁ గడుపు నిండునె పుత్ర
వ్యామోహ మేల విడువవు
నాముందటఁ బ్రిదుల వచ్చునా నీ కింకన్.

5

ఆ.

అకట నీవు నన్ను నడకించి పోఁ జూచె
దేను మోసపోను గాని గోవ!
యడవిలోన నున్నయంతనె పులి యింత
యెఱుక లేని దయ్యెనే తలంప.

6


ఉ.

నావుడు నిట్లనుం గపిల 'నావచనంబు లనర్థకంబులే?
నీవు వివేకశీలుఁడవు నీ కిటు లాడుట యుక్తమే? ననుం
బోనిడు మంట ని న్మొఱఁగి పోవుటకే? పదివేలు చెప్పినన్
భూవలయంబులోఁ బలికి బొంకుటయుం బ్రతుకే తలంపఁగన్.

7


తే.

ఆడి తిరిగినఁ చండాలుఁ డండ్రు గాని
కులము చండాలుఁ డైనను గొఱఁత లేదు
బొంకకున్నఁ జండాలుఁడె పో ధరిత్రిఁ
బూజ్యుఁ డనుమాట వినవయ్య! పులులరాజ!

8


తే.

అతిథిసత్కారమునకంటె నధిక మైన
ఫలము లే దండ్రు పెద్ద లీ పట్టునందు
నీవ యతిథివి నాకు ని న్నిచట డించి
పోయి రాకున్నఁ బాపంబు పొరయ కున్నె?

9


ఆ.

కన్నకడుపుగానఁ గడుఁ బిన్న గాన నే
నతనిఁ బాసి దూర మరుగునట్టి
వేళ గాన వాని వీక్షించి రాకున్న
వగపు మాన దనిన వదల వైతి.

10


క.

నీ కిష్ట మైనఁ జాలుం
గా కట్టులు సేయు' మనినఁ గారుణ్యరసో
త్సేకంబై తన చిత్తము
వే కరఁగుడుఁ బుండరీకవిభుఁ డి ట్లనియెన్.

11


చ.

'కొడుకుఁ దలంచి నీవు గడుఁ గొందల మందఁగఁ జూచి గోవ! న
న్విడిచిన నాఁకటం దనువు నిల్వదు నాకు గృహంబు కేఁగి యే
తడవుకుఁ గాని రావొ శపథంబులు పల్కక నమ్మఁ జాల' నా
వుడుఁ బులిఁ జూచి గోవు 'వినవో మదిలో ననుమాన మేటికిన్.

12

సీ.

ఇంటికి నేఁగి నే నిచటికి రాకున్న
       వెలఁదులసంసర్గ విడువలేని
యతి వోవుగతికి, మధ్యస్థుల మని కూడి
       పాడి చెప్పేడిచోటఁ బక్షపాత
మతిఁ బల్కునాతని గతికి, నిల్లడసొమ్ము
       నడగోలు గొని త్రోచు నతనిగతికి,
జట్టియుఁ బెండ్లియు సంఘటించినచోట
       విరియఁ దన్నినదుష్టనరునిగతికి


తే.

మిత్రుఁడై పొత్తు గుడిచి యమిత్రభావ
మాచరించి లో నిచ్చినయతనిగతికి
గోవు లుపవాస ముండంగం గుడిచినతని
గతికిఁ జనుదాన శార్దూలగణవరేణ్య!

13


ఉ.

గోవులఁ దప్పు లేకయును గొట్టినతిట్టినయాతఁ డేగతిం
బోవు పరాంగనారతికఁ బొందినపాతకుఁ డెందుఁ జొచ్చు మున్
జీవిత మంది రాచపని చేయక పాఱినపంద యేఁగు నే
రావున కిన్ని చోట్లను బడం గలదాన నసత్య మాడినన్.

14


ఉ.

ప్రల్లద మాడి పెద్దలకు బాధ యొనర్చునతండు, తండ్రికిం
దల్లికి మాఱుపల్కెడు నతండును, నాఁకొని వచ్చి యొడ్లచే
నుల్ల మెలర్ప మెయఁ జనుచున్నవృషంబు నదల్చునాతఁడుం
ద్రెళ్ళెడు నట్టిదుర్గతులఁ ద్రెళ్ళుదు నేనును రాక తక్కినన్.

15


సీ.

అపరాహ్ణవేళయం దతిథి యాఁకొని వచ్చి
       యడిగినఁ బెట్టక కడపువాని
గతికి, నర్ధాపేక్షఁ గన్నియఁ గొనిపోయి
       ముసలికి నిచ్చుతామసునిగతికిఁ
బాపంబు లేకయె పత్నిఁ బరిత్యజిం
       చినవానిగతికి, నాశ్రితచయంబు
గ్రాసంబు లేక దుఃఖముల నొందఁగ నప
       ద్వ్యయ మాచరించినవానిగతికి

తే.

ధారవోసినధన మీక తత్ప్రతిగ్ర
హీతఁ బలుమాఱు నడిగించుదాతగతికిఁ
బోవుదాన నింటికిని నేఁ బోయి మరలి
రాక తక్కతినేఁ బుండరీకవర్య! '

16


క.

అని శపథంబులు పలికిన
విని వ్యాఘ్రము 'నీవు ధర్మవిదురాలవు నీ
కెన యెవ్వరు ధేనువ! యే
నిను నమ్మితిఁ బోయి రమ్మ' నినఁ బటుబుద్ధిన్.

17


చ.

పులికిఁ బ్రదక్షిణించి తలఁపుం బలుకున్ సదృశంబు గాఁగ న
స్ఖలితవిలాసయాన మెసఁగం బురి కేఁగెఁ జతుస్తనంబులుం
బలసి పొదుంగు వ్రేఁగుపఱుపంగ గభీరరవంబుతోడ వీ
థుల నడయాడుబాలకులు దోరపుభీతిఁ దొలంగి పాఱఁగన్.

18


ఉ.

ఆయతరీతిఁ దద్ధ్వని రసాయనమై చెవి సోఁక నప్పు డం
బే యనుచుం బ్రతిస్వనము పెల్లుగఁ జూపుచుఁ బాఱి ధేనువున్
డాయఁగఁ బోయి వేడుక నొడ ల్గదలింపుచు వాల మార్చుచుం
బాయక గుప్పుచుం గుడిచె బాలవృషంబు నిజాంశదుగ్ధముల్.

19


తే.

కొడుకు చనుగ్రోలుచున్నంతదడవుఁ దల్లి
యడుగు దిరుగక కదలక యన్యచిత్త
గాక పై నీఁగ పోఁకినఁ గదలకుండె
నెమ్మిఁ బాషాణధేనువు నిలిపినట్లు.

20


చ.

కనుఁగొని యప్పు డాగృహిణి కౌతుక మందుచు వచ్చి దద్ఘన
స్తనములచాయఁ జేతికలశం బటు సాఁచిన దాని నిండెఁ బొ
మ్మని కొనియాడ నర్హ మగునట్లుగ నుఱును దాయి లేక చ
య్యనఁ బిదికెన్ సుధాసమసమంచితసారవయఃప్రపూరముల్.

21


వ.

అయ్యవసరంబున.

22


సీ.

పొట్టపొంగునఁ దల్లి పొది వాసి వీథికిఁ
బాఱి క్రమ్మఱుఁ బెద్ద పరువుతోడఁ

దల యెత్తి చూచుచుఁ బలుమాఱుఁ దను దల్లి
       పిలువంగ నిట నటఁ బొలసి యాడు
నిలమీఁద మో మిడి యే మేని మూర్కొనుఁ
       బసి వెట్టికొనుచుఁ దత్ప్రాంతమందు
నంతంతఁ బసిబిడ్డ లడ్డంబు సుడిసిన
       జంకించి మిన్నంటఁ జౌకళించు


తే.

నిట్లు శైశవక్రీడల నెసంగుచున్న
కొడుకుదెసఁ జూచి కన్నీరు గ్రుక్కుకొనుచుఁ
'గటకటా యిట్టి నెత్తురుగందు నిచట
వైచి పోవంగ వలసేనే నీచగతికి.

23


ఆ.

తల్లు లరుగుదేరఁ దనయీడుకోడెలు
సదమలానురక్తి నెదురువాఱఁ
దాను గూడపాఱి తన మాతృహీనతఁ
దెలిసి బిడ్డఁ డంత దలఁగ గున్నె?'

24


వ.

అని శోకించుచు మఱియును.

25


ఉ.

'ఏఁ దనుఁ బాసి పోవుతెఱఁ గెద్దియుఁ గానఁడు వీఁడు నెమ్మదిం
దాఁ దిరుగం దొడంగెఁ బులి తద్దయు నాఁకొని యోర్వలేక
మీఁద నసత్యదోష మిడి మిన్నక పోవునొ యింక నాకు ని
చ్చోఁ దడయంగ రా' దనుచు సూనుని డగ్గఱి ధేను వి ట్లనున్.

26


క.

'నిన్నుఁ గని యెన్ని దినములు
చన్నిచ్చితి నేను ఋణవశంబున నిక నీ
వెన్నఁడు నన్నుఁ దలంపకు
మన్న! మమత్వంబు విడువు మన్న మనమునన్.

27


క.

మమకారంబు నహంకా
రము సంసారానుబంధరజ్జువు లని చి
త్తముల వివర్జింతురు సం
యము లీవును నడుపుమా తదాచారంబు.

28

క.

ఆడకు మసత్యభాషలు
కూడకు గొఱగానివాని గొంకక యొరు లె
గ్గాడిన నెదు రుత్తరమీఁ
జూడకు విని విననివాని చొప్పునఁ జనుమీ.

29


క.

ఒంటి చరింపకు పొలమున,
నింటికిఁ గడుప్రొద్దు గలుగ నేతెంచుచురా,
వెంటఁ బడి పొడుచుగోవుల
జంటఁ జనకు, క్రయ్యఁబడక సందడి యగుచోన్.

30


క.

అంగజకేళికి దివిరెడు
పుంగవులను మసరు కలిసి పోరాడకు, వీఁ
కం గొలు ద్రవ్వు వృషభము
లం గదియకు తెవులుగొంటులం గూడకుమీ.

31


క.

తొడుకు దినఁబోవు పసరము
బడిఁ బోకుము, తురగగార్దభద్విరదాదుల్
నడచుపథంబున కడ్డము
సుడియకు, దుర్జనులు మెలఁగుచో నిలువకుమీ.

32


క.

నూతుల దరులను లోఁతగు
పాతటికసవులను నెట్టిపచ్చిక యున్నన్
బ్రాతిపడి మేయఁ బోకుము
మూతి నిడకు ముగ్రసత్వములు గలనీటన్.

33


క.

ఏనుఁ గలిగియుండఁగ నె
వ్వానికి నిను ముద్దు సేయ వాలాయ మగున్
గాని, యిటమీఁద నెవ్వఁడు
గానికిఁ గైకొనక చుల్కగాఁ జూచుఁ జుమీ.

34


క.

చులకన జలరుహతంతువు,
చులుకన తృణకణము, దూది చుల్కనసుమ్మీ,
యిల నెగయుధూళి చుల్కన,
చులుకన మఱి తల్లి లేని సుతుఁడు కుమారా!

35

ఉ.

కావున నిట్టిలాఘవము గానుపకుండఁ బ్రభుత్వమున్ గుణ
శ్రీ వెలయంగ సజ్జనులఁ జెంది తదీయహితోపదేశముల్
నీ విమలాంతరంగమున నిల్పుము, కాని నిరర్ధగోష్ఠికిం
బోవకు మయ్య! [1]దుఃఖములఁ బొందకు మయ్య! వివేకహీనతన్.'

36


చ.

అని తగ బుద్ధిఁ జెప్పెడునిజాంబఁ గనుంగొని తత్తనూజుఁ డి
ట్లను 'నిది యేమి తల్లి! యిటు లాడెదు? విప్రుఁడు నిన్ను నర్థకాం
క్ష నొకని కమ్మెనో, తనదు గాదిలిపుత్రికి నీ దలంచెనో,
యెనయఁగఁ బుణ్యకాలమున నెవ్వరికేనియు ధార వోసెనో.

37


ఉ.

నీ వెట పోయె దేను నట నీవెనుకం జనుదేరఁజాలనే
గోవును గ్రేపుఁ దల్లి మఱుఁగుల్గ నొనర్చువివేకహీనుఁ డే
ఠావునఁ గల్గునే! కటకటా నను డించి యథేష్టబుద్ధిమైఁ
బోవుతలంపు నీ కెటులు పుట్టె విచారము చాలదో కదే.'

38


వ.

అనినఁ గ్రేపుమాటలకు మిక్కుటం బగునక్కటికంబు మనంబునం బొడమ
నగ్గో వి ట్లనియె.

39


క.

'ఇవ్విప్రవరేణ్యుఁడు నను
నెవ్వరికిని నొసఁగఁ డేన యేఁగెద విను మం'
చవ్వివరము సర్వంబును
నవ్వత్సముతోడఁ జెప్ప నది కడు భీతిన్.

40


క.

పిడు గడిచినక్రియ, నీటెం
బొడిచినగతి, గుండె పగిలి భూస్థలిమీఁదన్
బడి పొరలు , దన్నుకొను; ను
గ్గడువుగఁ గన్నీరు నించు, గడగడ వడఁకున్.

41


క.

'బే' యనుఁ, దల్లీ! నీ వెట
పోయెద?' వను, 'నన్ను డించి పులివాతఁ బడన్
బోయెదవే?' యను, 'జెల్లం
బో' యను, 'నిం కేటి బ్రతుకు పో నాకు' ననున్.

42

క.

ఇవ్విధమున శోకింపఁగ
నవ్వత్సశిరంబుమీఁద నానన మిడి 'నీ
వెవ్వరికిఁ గాఁగ వగచెద
వివ్వలవనిజాలి పడఁగ నేటికిఁ బుత్రా!

43


చ.

అరుదుగ సత్యవాక్యము సహాయముగాఁ బులిఱేని వక్త్రగ
హ్వర మను పెద్దత్రోవను రయంబున స్వర్గసుఖంబుఁ జూఱకో
నరుగుచునున్నదాన; నిది హర్షము నొందెడు వేళ గాక దు
స్తర మగుశోకముం బొరయుదానికిఁ గారణ మేమి చెప్పుమా.

44


క.

పుట్టినపిమ్మటఁ జావును
గట్టి; వృథామరణ మొందుకంటె బుధులకున్
దట్టమగు కీర్తిసుకృతము
లిట్టలముగఁ గల్గుచావు లింపులు గావే!

45


ఉ.

శోకము దక్క లెమ్ము గుణశోభిత! నీ' వనఁ దల్లివాక్యముల్
గైకొని తత్తనూభవుఁడు కంపము నొందుచు లేచి 'యక్కటా
గోకులభూష, నీకు సమకూరెడు శాశ్వతపుణ్యలోకముల్
నాకు నగమ్యదేశములె? నన్నును దోఁకొని పొమ్ము' నావుడున్.

46


క.

సంతతి యెడ తెగి నంతన
నెంతటి పుణ్యగతు లైన నెడ తెగు నని సి
ద్ధాంతము విను నాతమ్ముఁడ!
చింతింపకు మొక్కతెలివి చెప్పెద నీకున్.

47


క.

సుతుఁడు మహిఁ దల్లిదండ్రులు
బ్రతిదినమును బ్రోచు నన్నపానాదులచే ;
మృతు లైనపిదపఁ బితృదే
వతపూజలఁ జేసి వారి వదలక ప్రోచున్.

48


ఉ.

కావునఁ బుత్రజన్మము జగంబున భుక్తికి నిత్యముక్తికిన్
దావల మండ్రు, నిన్నుఁ గని ధన్యత నొందితి; మత్సవిత్రవం
శావళి నీకతంబున నిరంతరమై కొనసాఁగె నేని నా
దేవనివాస మాదియగు దివ్యపదంబులు నాకుఁ జేకుఱున్.

49

ఆ.

ఇంకఁ బెనగ వలవ దిచట నేఁ దడపిన
నచట ననృతదోష మావహిల్లు
దానఁ జేసి యగు నధమలోక మంత సే
యంగ నేల పనుప వయ్య నన్ను.'

50


చ.

అని యిటు లెట్టకేలకు నిజాత్మజు శోకదవాగ్నికీల లొ
య్యన వచనాంబువర్షమున నాఱఁగఁ జేయుచు దాని నచ్చటం
గొనకొని యుండఁగా నిలిపి కూరిమితోఁ బులి యున్నయట్టి య
వ్వనమునకున్ రయం బెసఁగ వచ్చుచునుండఁగ నంత నక్కడన్.

51


వ.

అప్పులి యి ట్లని వితర్కించు.

52


క.

'పాటి గలదె పసరమునకు
వ్రేటలనిం గదిసినపుడె విఱువక నే న
మ్మాటల బేలుపడితి మొగ
మోట దరిద్రత్వమునకు నొగిఁ బొత్తయ్యెన్.

53


క.

తానొక నిజమరి పోలెం
బూని పలికెఁ బెక్కు శపథములు కడపటఁ దాఁ
గానియదివోలె నాఁకొని
యే నిచ్చట నున్కి దలఁప దెటు వోయె నొకో.

54


క.

పులిచేతఁ జిక్కి యొక యి
మ్ముల విడివడి పోయి దానిముందఱి కేగో
వులు మరలి వచ్చు నేలా
తలపోఁతలు నోరికండ తప్పెం దప్పెన్.

55


క.

ఏ దానితోడి చలమున
నేదినమున నైన నొక్కయెడ నడరి గత
చ్ఛేదము సేయక యూరక
పోదునె యిటు గాక యున్నఁ బులినే నేనున్.'

56


చ.

అని యుదరాగ్నిచేఁ బరవశాత్మకయై ధృతి మాలి నెమ్మనం
బునఁ దలపోయుచున్నపులి ముందటి కప్పుడు వచ్చి నిల్చెనో

యనఁగ మహాద్భుతం బగురయంబునఁ దాఁ బఱతెంచి ధేను వి
ట్లను 'నిది ప్రొద్దుదాఁకఁ గడు నాఁకొని యేక్రియ నుండితో కదే.

57


ఆ.

ఇంత తాల్మి లేక యిల నిట్టిసుకృతంబు
లెట్లు సంభవించు నేరి కైన
నీనిమిత్తమై కదా నాతనూజుని
బుజ్జగింపఁ గంటిఁ బురికి నేఁగి.

58


క.

నామన సొక్కటి యయ్యెను
నీ మనసారఁగ భుజింపు నీ కే నధిక
ప్రేమమున సమర్పించితి
నా మే నిదె పుణ్యగతికి ననుఁ బుచ్చవనా.'

59


ఆ.

అనిన దాని తెగువ కద్భుతస్వాంతుఁడై
పుండరీక 'మేను బుట్టి పెరిగి
యింతవాఁడ నైతి నింత నిష్కపటుల
నిట్టి ధీరమతుల నెఱుఁగ [2]నెందు.

60


ఉ.

ఇట్టి మహానుభావులకు హింస యొనర్చి దురంతదోషముల్
గట్టికొనంగఁ జాల, మఱి కల్గవె మాంసము లొండుచోట? నీ
పుట్టువునందు నన్ను మును పుట్టఁగఁ జేసినయట్టిదైవ మీ
పట్టునఁ బూరి మేపెడినె? ప్రాణము లింతనె పోవుచున్నవే?'

61


మ.

అని యాధేనువుఁ జూచి 'నీ విమలసత్యప్రౌఢికిన్ మెచ్చు వ
చ్చె, నినుం జంపఁగఁ జాల, నీదుతల గాచెన్ ధర్మ మీ ప్రొద్దు, పొ
మ్ము నిజావాసము చేర నీసఖులు సమ్మోదంబునుం బొంద నీ
తనయుం డత్యనురాగముం బొరయఁ జిత్తప్రీతి [3]మై నుండఁగన్.'

62


వ.

అనిన నప్పులికి నమ్మొద వి ట్లనియె.

63


క.

మెత్తని మనసే నాయది
యొత్తి యిటులు చూడ నేల యోపుణ్యుఁడ! నే

నిత్తనువు నీకు మును వా
గ్దత్తము చేసినది కాదె కథ లేమిటికిన్.

64


ఆ.

చనువు చెఱుప వైతి, ననుఁ బోయి రానిచ్చి,
తదియ చాలుఁ గాక యుదరవహ్ని
వేఁగుచున్న నిన్ను విడిచి యేమని పోదు
గెలుచునంతదాఁక గలదె పాడి.

65


వ.

కావున పగలింటి యుపవాసభారం బంతయుఁ బోవునట్లు మద్రక్తమాంసము
లతో నక్తమ్ము సేసి నాకుఁ బుణ్యమ్ము ప్రసాదింపుము.'

66


క.

అని గంగడోలు బిగియఁగఁ
దన మెడ యెత్తుకొని కపిల దగ్గఱఁ జనుదెం
చినఁ జూచి పుండరీకము
వెనువెనుకకె పోవుఁ గాని విఱువదు దానిన్.

67


సీ.

'కుడువంగ ర'మ్మని తొడరి చుట్టముఁ బిల్వ
       'నాఁకలి గా దొల్ల ' ననుచుఁ బెనఁగు
నతఁడునుబోలె నాతతశోభనాంగియై
       తనరున ధేనురత్నంబు దన్ను
భక్షింపు మని పట్టుపఱప సద్యోజ్ఞాన
       శాలియై పరగు శార్దూలవిభుఁడు
దా నొల్ల నని పల్కఁ దమలోన నొకకొంత
       దడవు ముహుర్భాషితంబు లిట్లు


ఆ.

జరుగుచుండ గోవుసత్యవాక్శుద్ధికిఁ
బులికృపాసమగ్రబుద్ధికిని బ్ర
సన్ను లైరి సురలు; సాధువాదము లుల్ల
సిల్లె గగనవీథి నెల్లయెడల.

68


వ.

అయ్యవసరంబున గరుడారూఢుండై మురవైరి ప్రత్యక్షమగుడు నాదివ్య
రూపంబుఁ గన్గొని యమ్మొదవును నప్పులియును నప్పురుషోత్తము చరణ
సరసిజంబుల కెరగిన నవ్విశేషంబు చూచి యనిమిషు లి ట్లని స్తుతించిరి.

69

చ.

'కలువలఁ దమ్ములన్ సమవికాసము నొందఁగఁ జేయుక్రాలుగ
న్నులు గలనీకుఁ బాన్పును మనోజ్ఞరథంబును [4]నాగ తద్విరో
ధులయిననీకు నారయఁ జతుర్భుజ! చేయఁగరాదె గోవునుం
బులియును శత్రుభావములఁ బోనిడి మైత్రి యొనర్చునట్లుగన్.

70


క.

దైవం బాదిగఁ దిర్య
గ్జీవులు తుదిగాఁగఁ గలయశేషము నీ యా
జ్ఞావిలసితవర్తనములు
గావే నీమహిమఁ దెలియఁ గలరే యితరుల్.'

71


వ.

అని కొనియాడుచుండి రంత నయ్యనంతుండుఁ దద్గోవ్యాఘ్రంబులఁ గారుణ్య
దృష్టి వీక్షించి 'మీ సచ్చరిత్రంబులకు మెచ్చితిం జెఱొక్క వరం బిచ్చెద
వేఁడుం ' డనిన నవి 'దేవా! భవద్దివ్యలోకంబు మాకుం బ్రసాదింప వలె'
నని ప్రార్ధించిన.

72


క.

ఇచ్చితి ననుచుం జనియె వి
యచ్చరతతి పొగడ విష్ణుఁ, డవియును జనియెన్
జెచ్చెరఁ దమ తమ నెలవుల
కచ్చుగఁ దుది నొదవెఁ గోర్కు లయ్యిరువురకున్.

73


వ.

ఈ గోవ్యాఘ్రసంవాదంబు విన్న నరులు మృగపన్నగాది బాధలం బొరయరు,
వెన్నుండు వారికిఁ బ్రసన్నుం డగు' నని చెప్పి మఱియును.

74


క.

పసరం బండ్రు, వివేకము
పస చాలనినీచు నట్టిపసరమ కాదే!
వసుధపయి సత్యవాక్యం
బసదృశముగ నిర్వహించె' నని కడుఁ బ్రీతిన్.

75


ఉ.

మానుగ రత్నమండనకుమారుఁడు పల్కుడు బ్రహ్మరాక్షసుం
డానరనాథపుత్రు వదనాబ్జము చూచి 'య దేనిఁ బొమ్ము, ము
న్నీనిజ మే నెఱుంగ, నిట నిక్కము రా నొకమాట పల్కు, మి
చ్చో నుదరాగ్ని నేను గడు శోషిలకుండఁగ రమ్ము క్రమ్మఱన్.'

76

వ.

అనిన విని యతం డేమి పల్కుదు?' ననిన వాఁ డి ట్లనియె.

77


క.

కుడువఁ దొడఁగునెడ నాఁకటఁ
గడుఁ దూలుచు నతిథి వచ్చి గ్రాస మడిగినం
గడపునతఁడు పడుపాటులఁ
బడుదు ననుము పోయి మరలఁ బడి రాకున్నన్.

78


ఉ.

నావుడు నట్ల పల్కుచుఁ బ్రణామ మొనర్చి పురంబు కేఁగి నం
దావనినాథుతోడ నతఁ డంతయుఁ జెప్పినఁ దల్లడిల్లుచుం
'దైవమ! యెంత చేసి తిది తప్పఁగఁ ద్రోయ నుపాయ మెద్ది
ప్రావళిమాటలుం జెనఁటి యయ్యెనె కార్యము తప్పెనో కదే.'

79


చ.

అని తనుఁ దాన దూఱుకొను, నాత్మజుఁ గౌఁగిటఁ జేర్చు, బాష్పముల్
నినుచుఁ 'దనూజ! నీ దయిన నిద్దపుమేనికి నెట్టి పాట్లొకో'
యనుఁ దల యూచు 'బాపు విధియా ' యను 'నింతకుఁ దెచ్చితే' యనున్
'వనరుహసంభవుండు మును వ్రాసినవాఁతలు దప్పునే' యనున్.

80


క.

ఇవ్విధమునఁ బలవింపఁగ
నవ్వక నవ్వినటు లాననద్యుతులు గడున్
నివ్వటిల రత్నమండనుఁ
డవ్వసుధాధిపునితోడ నలరుచుఁ బల్కున్.

81


ఉ.

ధీరత లేనివానిక్రియఁ దేజము పెంపఱ ని ట్ల లందురం
గారణ మేమి? యస్థిరము గాదె తలంప శరీర మిట్టిచో
మారక పోవుకంటె నొకయోగ్యుఁడు కోరి భుజించు టొప్పదే
బోరనఁ బంపు నేఁ బలికి బొంకఁగఁ జాల నృపాలశేఖరా!

82


తే.

కులము వెలయింపఁ బుట్టిన కొడుకు కొడుకు
గాక, కులనాశనుఁడు కొడుకా తలంప
వసుధ నేకల్మషము లేనివంశమునకుఁ
గల్మషముఁ బొందఁ జేయ యుక్తంబె నాకు.

83


క.

శతరూపాధిక దీర్ఘిక,
శతవా ప్యధికంబు గ్రతువు, శతయజ్ఞసము

న్నతుఁ డొక్క సుతుఁడు, దత్సుత
శతకంబున కెక్కు డొక్క సత్యోక్తి నృపా!

84


చ.

కావున నీకు నస్మాదృశు లైన కొడుకుల నెందఱ నైనం బడయవచ్చుఁగాని,
సకలజగదుద్ధారకం బగు సత్యవ్రతంబు ఘటియింప వచ్చునే, నన్నింక సంకిలి
సేయక నిష్కల్మషచిత్తుండవై యుండు మేఁ బనివినియెద నని యచ్చోటు
వాసి యటుపోయి.

85


ఉ.

నవ్వుచుఁ బుష్పగంధివదనంబు గనుంగొని 'యోలతాంగి! ము
న్నెవ్వఁడు చెప్పె నీవు జనియించిననాఁటిఫలంబు, నేఁడు నా
కవ్విధ మంతపట్టు నిజ మయ్యె, మహాపురుషుండు వానికై
యవ్వనభూమి కేఁగెద రయంబునఁ బొమ్మను చెప్ప వచ్చితిన్.'

86


చ.

అనిన 'ననిష్టము ల్గని యుపాయబలంబునఁ ద్రోచుఁ గాక స
జ్జనుఁ డధముండువోలెఁ గనుసన్నను జావ సుపక్రమించునే?
విను నృపనందనుండవు వివేకివి చక్కనివాఁడ వాత్తయౌ
వనుఁడవు నేఁడు నీకుఁ దగవా యిటు పల్కఁగ నాదు సన్నిధిన్.'

87


వ.

అని పుష్పగంధి పనికిన నారాజనందనుం డి ట్లనియె.

88


క.

'ఇదె వచ్చెదఁ జనని మ్మనీ
సదమలమతిఁ బలికినాఁడ శపథ మతని కే
మొదలనె; బోంకెడుబ్రతుకును
బ్రదుకే పూఁబోఁడి వక్రభాష లుడుగుమా!'

89


క.

అనవుడు 'నేమని పల్కితి
వినవలయం జెప్పు' మనియె వెలఁది; యతం డా
తనతోడఁ దాను మును ప
ల్కినశపథక్రమము దానికిన్ వినిపించెన్.

90


క.

విని నృపకన్యారత్నము
తనమదిఁ దలపోసి చూచి దానికి నొక కీ
ల్గనియెను, బుద్ధి చతుర్గుణ
మనుట సతులయందు నిశ్చితార్థ మనంగన్.

91

వ.

ఇట్లు గని యయ్యుపాయంబువలన తనమగని యపాయంబు పాయు నని
నిశ్చయించి.

92


ఉ.

'పొమ్ము నృపాలపుత్ర! తలపువ్వులు వాడకయుండ నెమ్మదిన్
ర' మ్మనుపుష్పగంధివచనంబులకుం దరహాసభాసురా
స్య మ్మలరంగ నాతఁడు వెసం జనుచుండగఁ బౌరకాంత 'లో
యమ్మరొ! చూచితే యత నియాలికి నారయ నెట్టి గుండెయో

93


ఆ.

రోగయుతుఁడు గాఁడు, రూపహీనుఁడు గాఁడు,
వృద్ధు గాఁడు, దుర్వివేకి గాఁడు,
పడయ రాని రాచపట్టి నేమని పుచ్చె
బ్రహ్మరాక్షసునకు భక్షణముగ.'

94


క.

అనువారు తల్లిదండ్రులు
మునుకొని చెప్పంగ వినియు మొఱకుందై వ
చ్చినపిదప నిల్పఁగను నం
గనవశమా? చనినఁ జనియెఁ గా కనువారున్.

95


క.

నాఁ డెల్ల వారు నీ పూఁ
బోఁడి వలదు మాను మనఁగఁ బుయిలోడక తాఁ
దూఁడరియై తఱియఁబడిన
వాఁ డితనికి నేఁడు వగవ వలద'నువారున్.

96


వ.

ఇత్తెఱంగునం బెక్కండ్రు పెక్కువిధంబులం బలుకుచుండ నారత్నమండ
నుండు వివాహగమనోన్ముఖుండునుం బోలె సుముఖుండయ్యును నింద్రదత్త
ప్రముఖులగు సఖుల వీడుకొలిపి చంద్రశర్మాదులగు మేదినీసురులకు నమస్క
రించి నిలిపి తదాశీర్వాదంబులు తోడుగా నొక్కరుండును వెడలి యరుగునప్పు
డా పుష్పగంధియుఁ దనయుపాయంబు నెరపం బూని వానివెనుకనె యొక్క
తెయు నింతనంత నరుగుచుండె నంత నిక్కడ నమ్మహాపురుషుండు.

97


చ.

'అదె యపరాబ్ధిఁ గ్రుంకె నినుఁ డాఁకలి మిక్కుటమయ్యె నాకు, వాఁ
డిదె యరుదెంతు నంచుఁ జని యిప్పుడుఁ జేరఁడు రాక తక్కినన్
బ్రిదులఁగనీక రాజును పురిం గలమర్త్యుల నెల్లఁ బట్టి మ్రిం
గుదు' ననుచుండ నయ్యెడకు గొబ్బున వచ్చె నృపాలపుత్రుఁడున్.

98

ఉ.

వచ్చిన నమ్మహాత్ముఁదును వావిరిఁ దత్తరుశాఖ డిగ్గి వే
వచ్చి నృపాత్మజుం గదిసి వానిశిరోరుహరాశి యొక్కచేఁ
జెచ్చెరఁ జుట్టి పట్టి యొకచే మొగ మెత్తి గళంబుబాయకుం
దెచ్చె మొగంబు దంష్ట్రికలు దీటుచు నుత్కటసంభ్రమంబునన్.

99


వ.

అంత నయ్యతివ తనపతిప్రాణభయంబు తప్పింప నిదియ
యవసరం బని
యూహించి.

100


క.

'భిక్షాం దేహి ' యనుచుఁ గమ
లాక్షి యతనియెదుర నిల్చి హస్తము నెత్తన్
వీక్షించి యతఁడు 'నీ కే
భిక్ష' మనినఁ 'బెట్టు పురుషభిక్షం' బనియెన్.

101


చ.

విని యతఁ డాత్మఁ జోద్యపడి వీఁ డిటఁ గ్రమ్మఱ వచ్చునట్లుగాఁ
బనిపడి యేను గొన్నపరిభాషయె నాకు మరల్చి యివ్విధం
బున నను గెల్చె నీసతి, ప్రబుద్ధులు లేరనవచ్చు నయ్య భూ
మి ననుచు నాతని న్విడిచె మెచ్చి నుతించిరి మువ్వురిన్ సురల్

102


వ.

అయ్యవసరంబున మహనీయవైభవస్థానం బైనవిమానం బొక్కటి మహికి
నేఁగుదేర బ్రహ్మరాక్షసుండు తన వికృతరూపంబు విడిచి దేవరూపంబు
గైకొని 'మీనిమిత్తం బై కదా నాకుఁ బుణ్యలోకంబులు సిద్ధించె' నని యా
రత్నమండన పుష్పగంధుల దీవించుచు నద్దివ్యవిమానం బెక్కి, యప్సరో
గణంబులు గొలువ నింద్రసభకుం జనియె, నవ్వధూవరు లిరువురు నిజపురం
బునకుం జని నందమహీనాథునకు బంధుయూధంబునకుఁ దమ గమనాగమనం
బులక్రమంబు చెప్పిన విస్మితులై వీని కిది పునర్జన్మంబు పొమ్మని వీఁ డెవ్వరి
చేతను దిట్టు పడనికాలంబునకు నిట్టి యాపద తరియించె సని పరమానందం
బునుం బొంది విప్రవాక్యంబు నిక్కంబు గదే యని కొనియాడుచుండి రటు
గావున.

103


క.

కుడుపుతఱి నతిథి గ్రాసం
బడిగినఁ దన కుడువఁ దొడఁగునశనం బైనన్
వడి నొసగంగా వలయుట
యడర మహాపురుషుచేత నభినుత మయ్యెన్.

104

చ.

అనవుడు భోజుఁ 'డిట్టి యితిహాసము నే నెఱుఁగంగ నేర నిం
క నొకటి నాకు ని న్నడుగఁగా వలయున్ గృహమేధి కర్హపుం
బని సదనాగతాతిథిసపర్యయకా తెలివొందెఁ జిత్త మో
మునివర! యందుఁ గల్గు ఫలము న్వివరింపఁ గదయ్య' నావుడున్.

105

అన్నదానపరుఁడగు విప్రుని కథ

క.

భోజనృపా! విను మతిథికి
భోజన మిడునతని కొదవు పుణ్యమహిమ యం
భోజభవుఁ డైన నెఱుఁగఁడు
నా జగమున వింత నంత నా నెచ్చోటన్.

106


సీ.

ఈ యర్ధమున కొక్క యితిహాస మేను జె
       ప్పెద నొక్కవిప్రుఁడు సదమలాత్ముఁ
డతనికి మువ్వురు సుతు లుత్తములు వారు
       పితృమాతృభక్తులై పేర్చి యుందు
రగ్రజన్ములఁ గొల్తు రనుజు లగ్రజులును
       ననుజులఁ బాటింతు రనుదినంబు
నందులోఁ జిన్నవాఁ డతిధర్మశీలుఁడై
       విప్రుల కశనంబు వెలయఁ బెట్టు


ఆ.

నట్లు జరుగుచుండ నమ్మేలు చూడఁ జా
లక విధాత దుదిఁ గలంచె ననఁగఁ
గతిపయాబ్దములకు మృతుఁ డయ్యె నవ్విప్రుఁ
డతనియతివ తోన యనుగమించె.

107


క.

తల్లియుఁ దండ్రియు నీక్రియఁ
జెల్లినఁ బరలోకవిధులు చేసినతుది న
య్యిల్లు చెడకుండఁ దమలో
నుల్ల మలరఁ గలసి మెలసి యుండిరి కొడుకుల్.

108


క.

అప్పుడు నయ్యనుజన్ముఁడు
తప్పక యతిథులకు నన్నదానము వినయం

బొప్పఁగ నిడునదిగారణ
మెప్పుడు సిరి గదల దతనియింట నృపాలా!

109


వ.

ఇట్లు జరుగుచుండ నొక్కనాఁ డాతనివదినెలుఁ దమ మఱఁది ప్రియవాదితనంబు
చూచి కనుకుట్టుఁదనంబున నతనిధర్మంబునకు విఘ్నంబు గావింపఁ దలంచి
తమ పురుషులం జేరి సఖేదంబుగా ని ట్లనిరి.

110


ఉ,

'అత్తకు నేము మార్పలుక మాయమచిత్తములోనివారమై
వత్తుము, పెద్దవారు గలవారికి నన్నియుఁ జెల్లుఁగాక, నేఁ
డిత్తఱి మమ్ముఁ బుచ్చి పని యెవ్వరు గొందురు? మిమ్ముఁ జూచి నో
రెత్తగ నోడి యేపలుకు లెన్నఁడుఁ జెప్ప మెఱింగి యుండియున్.

111


క.

ఇంతట నెఱిఁగెద రొండే
నంతట నెఱిఁగెదరు గాక యని యుండక మీ
రెంతట నెఱుఁగరు బ్రతికెడు
పంతమె యిది మీకు నేము పగవారలమే.

112


క.

ఒకనాఁ డైనను మాతో
నొక యాలోచనముఁ జేయ కూరక మోమె
త్తికొనుచుఁ బోదురు మీ రాం
డ్రకు మగలకు నిట్టి వేఱడంబులు గలవే.

113


క.

మగఁ డెఱుఁగ వలయుఁ గాదేన్
మగువ యెఱుఁగ వలయుఁ గాక మనుగడతెఱఁ గ
మ్మగువయు మగఁడును వెలిగా
జగమున సంసార మెట్లు జరగును జెపుఁడీ.'

114


వ.

అని పలికి తమ తోడికోడలిం బ్రసంగించి.

115


క.

పని పంప వెఱతు మాబిడ
పని యెప్పుడు చేసి చేపి పాయవడితి మె
వ్వనిరాజ్యమని యెఱుంగదు
తనచేఁతకుఁ దోడు మమ్ము తప్పులు పట్టున్.

116


క.

తా మాకు నత్త యైనది,
యామఱఁదియు మాకు మామయై వర్తించున్,

మే మయ్యిరువురచేతను
బాములఁ బడలేము నాతిపాపులభంగిన్. (?)

117


ఉ.

పాఱుల పేరు చెప్పుకొని బానెడుపప్పునుఁ బాయసంబు నై
దాఱు పసంట్లవంటకము నాజ్యముఁ గమ్మనికూరగాయలున్
జూఱలు దించు వారసతిచొప్పున గోళ్ళను మీటుకొంచు దా
దూఱులు పల్కు నీదగరతోఁ బడఁజాలము వేయి చెప్పినన్.

118


ఉ.

ఏతరిలాగు మానఁ డతఁ, డెవ్వరి నైనను బిల్చి పెట్టు; మీ
రాతని కొక్కమాటయును నడ్డము చెప్పఁగ లేరు; జీవనం
బీతెఱఁ గైన నేమి గల దింతయు నిప్పుడు గాసి కాదె మీ
రాతనితోడి యంశమున కర్హులు గారె విదార మేటికిన్.

119


క.

తన గడన లేదు మీ తె
చ్చినయవి తోడ్తోన వ్యయము చేసెడి నింకీ
తనితోడి పొత్తు పదివే
లును వచ్చె మనకు విభక్తులును గావలయున్.

120


క.

కాకున్నను జీవనరుచి
మీకుఁ గలుగునంతదాఁక మీ పెట్టినచో
నేకరణి నైన నుండెద
మీకస్తులఁ బడఁగఁ జాల మెన్నాళ్ళైనన్.

121


ఉ.

ఉమ్మడి సొమ్ము గానఁ దన యోపినయంతయు నన్నివంకల
న్నెమ్మదిఁ బాఱఁ జల్లుచును నీల్లెడు దానప్రదాత నంచు ని
క్కమ్ముగ వేఱు పడ్డ తుది గానఁగ రాదె యతండు పొందులా
భమ్ముల కెల్ల మూల మనుపాటిగ నాలును దాను నుండఁగన్.

122


క.

తన యాలును దానును గుడు
వను గట్టను, నిట్టి యీయవస్థలఁ బడ నే
మును మీరును నటె; చాలుం
దనిపితి మీ బ్రతుకుపట్టు దయ్య మెఱుంగున్.'

123


క.

అనవుడు 'నది యట్టిద' యగు
నని యొండొరుమోము చూచి యన్నయుఁ దమ్ముం

డును నైకమత్య మై తమ
యనుజన్ముని వేఱు పెట్టి రట్టిదకాదే.

124


తే.

అన్నదమ్ములు దమలోనఁ బిన్న పెద్ద
వరుస లెఱిఁగి యథోచితవర్తనముల
మెలఁగుచుండుట తమయాండ్ర సొలపుమాట
లోలిఁ జెవిఁ బడ్డపెమ్మట నేల జరుగు?

125


వ.

ఇ ట్లయ్యన్నదమ్ములు మువ్వురు విభక్తులై పిన్నాతని నొంటి చేసి పెద్దవా
రిద్దఱు నొద్దికమై కలసి యుండి రట్లుండియుఁ గుటుంబభారంబునందు
బ్రుంగుడుపడి దానమానంబుకందువ లరసికొని తిరుగనె పోయెం గాని
పరోపకారంబునకు నవకాశంబు లే దయ్యె, నతం డొంటి యయ్యును దొంటి
యట్ల తన పట్టినవ్రతంబు వదలక యన్నదానంబు సేయుచుండె నంత నా
పెద్దవారియందు.

126


చ.

శిశువులు కూడు కూ డనుచుఁ జిందఱ వందఱ సేయ నాఁడు వా
రశనము లేక క్రొవ్వు చెడి యంటలు గట్టి చరించుచుండ దు
ర్దశలకు నెల్ల మూల మయి తా రొకయప్పుడు నీరెలుంగుతో
మశకము లట్లు తూలుచు సమరులమోముల వ్రేలుచుండఁగన్.

127


తే.

పిన్న యయ్యును గుణములఁ బెద్ద గాన
వానిజీవన మేమియు హీనపడక
యుండె నయ్యున్కి గన్గొని గుండె లెల్లఁ
గుళ్ళుచుండంగ వదినెలు కుంది కుంది.

128


చ.

మగలమొగంబు చూచి 'యణుమాత్రయుఁ బేదఱికంబు లేక ఖ్యా
తిగ మనుచున్నవాఁడు భవదీయకనిష్ఠుఁడు వానిఁ బట్టి పా
లు గొనఁగ రాదె ము న్నతఁడు లోన నడంపఁగఁ బోలు సొమ్ము మీ
కగపడకున్న రాజునకు నైన మొఱో యని చెప్పఁ జాలరే?'

129


వ.

అని పల్కుచు నతనియతివ నుద్దేశించి యాకన్నులకల్కికి ధన మెట్టు గూడెనే
యని గుసగుస వోవుచుండుదు రీ కుటిలప్రసంగంబు లెఱుంగ కతండు
సౌజన్యధనుండు గావున విశేషతిథులయందు సపుకళత్రంబుగాఁ దన యగ్రజద్విత
యంబు రావించి తన పంక్తి నశనంబు వెట్టుచుండు నమ్మగువయు మగని

మనసులోనిద యై మెలంగుచుండు; బ్రాహ్మణోత్తములు ప్రతిదినంబును
నతనిగృహంబున నాహారంబు గొని దీవించుచుం బోదు రిట్లు చెల్లుచుండ
నొక్కనాఁ డాగృహస్థునితో గృహిణి యి ట్లనియె.

130


క.

'మీ రెల్లప్పుడు విప్రస
మారాధన తత్పరాత్ములయి వారల కా
హారములు పెట్టుచుండుదు
రారయ నందు నగుసిద్ధి యది యెద్ది యొకో.'

131


క.

అనవుడుఁ 'దత్ఫల మింతిం
తని యేనును మున్ను విన్నయది లే దబలా!
నను నీ విపు డడిగితి గా
వునఁ జెప్పెద విప్రపుంగవులు రా నిమ్మా.'

132


చ.

అని తన యింటి కద్దివసమం దరుదెంచిన విప్రజాతి క
య్యనఘుఁడు షడ్రసాన్వితము లైన పదార్థచయంబుతోడ భో
జన మిడి వారు తృప్తు లయి చల్లనినీడ వసించి యుండ న
వ్వనితయుఁ దాను వారలకు వందన మొప్పఁగఁ జేసి యి ట్లనున్.

133


క.

'ఊహించి మాకు నొక సం
దేహము వాపుటకు నరుగుదెంచితిమి మహో
త్సాహమున విప్రవర్యుల
కాహారము పెట్టుసుకృత మది యెట్టిదియో?

134


క.

మా కేర్పడ నానతి యీ
రే కృపతో' ననుడు వార లిందఱు మది నా
లోకించి కొలఁది గానక
మూకత్వము దాల్చి రపుడు మూఢుల భంగిన్.

135


ఉ.

వారలఁ జూచి విప్రు 'లిటువంటి మహాత్ములు మీ రెఱుంగరే
యూరక యుండు టేతెలివి యుక్తివిహీనుల భంగి' నావుడున్
వారలలోన మేటి యగువాఁ డొకవిప్రుఁడు 'విప్రజాతి కా
హారము పెట్టునట్టి ఫల మన్యు లెఱుంగరు భూసురోత్తమా!

136

చ.

వరదుఁడు కాశికాపుర నివాసుఁడు నాఁదగు విశ్వనాథుఁ డే
తరుణి వరించు నట్టిహిమధామనిభానన శీతసానుమ
ద్వరజ యెఱంగుఁ బొ' మ్మనిన వాఁ డది తీర్థముస్వార్థముం గదా
యరిగెద సంచు గ్రక్కునఁ బ్రియాణము గైకొని భార్య కిట్లను- •

137


క.

'కాశికి నేఁగెద నని పర
దేశం బనుతలఁపు నీమదిం జొనుపకు మ
కేశగతిఁ దిరిగి వచ్చె
నోశశధరవదన! యోడకుండుమి నెమ్మిన్.

138


క.

ఆఁకొని వచ్చిన విప్రులఁ
దాఁకింపక యశన మిడుము తత్పరమతి న
ఱ్ఱాఁకలి సేయకు కుడువం
దోఁకొని రా పర్వమగు తిథుల మనవారిన్.'

139


వ.

అని చెప్పి యాతం డరిగిన నయ్యెలనాగయుం బ్రతిదినంబు నతిథిపూజ
గావించుచు భర్తృభాషితంబు చొప్పునఁ దప్పక విశేషతిథులం దన బావలను
దోడికోడండ్రను వారిబిడ్డలను రావించి యశనంబు పెట్టుచు వసుమతియ పోలెం
దాల్మి గలిగి మెలంగుచుండే నంత నక్కాంతమగఁ డత్యంతదూరం జరిగి
యొక్కనాఁడు పదత్రాణార్థం బొక్క చర్మకారసదనంబుచక్కటికిం జనిన
నతం డి ట్లనియె.

140


క.

'ఎందుండి రాక మీ రిట
కెందుల కేకార్యమునకు నేఁగెద రది నా
కుం దెలియఁ జెప్పుఁ డ' నవుడు
మందస్మితలలితవదనమండలు డగుచున్.

141


చ.

'తిరముగ దక్షిణాంబునిధి తీరమునం దొక యూర నుండి యేఁ
బరగఁగ నొక్కసంశయము పాపుకొనం జనుచున్నవాఁడ శం
కరగిరిజానివాస మగుకాశికి' నావుడు 'నట్ల యేని నో
పురుషవరేణ్య! నేఁడుఁ గడుఁ బుణ్యుఁడ నైతిఁ ద్వదీయసేవనన్.

142


క.

అడరఁగ నే నాజాహ్నవి
నడిగితి నని చెప్పి నాకు నయ్యుత్తర మే

ర్పడఁ జెప్పు మయ్య! యే నీ
యడుగుల కెరఁగెద మహీసురాన్వయతిలకా!'

143


చ.

అనవుడు విప్రుఁ డియ్యకొని యచ్చటు వాసి క్రమప్రయాణఖే
లన మమరంగ సోమశకలద్యుతిశోభిజటాకలాపరం
జనుఁ డగుపార్వతీశు ప్రియసద్మమునాఁ దగు కాశికిన్ ముదం
బునఁ జని జాహ్నవీసలిలపూరము చొచ్చి పవిత్రగాత్రుఁడై.

144


శా.

ఈశానుం బరమేశు పాలనయనున్ హేలాజితానంగు గౌ
రీశుం గేశవతల్పభూషణుఁ ద్రిలోకేశు న్వియత్కేశు న
క్షేశోదంచితు భుక్తిముక్తిపలదున్ గీర్వాణనిర్వాహకుం
గాశీనాయకు విశ్వనాథుఁ గొలిచెం గారుణ్యపూర్ణాకృతిన్.

145


ఉ.

బొందులు వేఱు గాని తలపోయఁగఁ బ్రాణము లేకమం డ్రిలం
గొందఱు, లేతమాట లవి కూరిమిపట్టున నందుఁ, బ్రాణముల్
బొందులు నేకమై రనఁగఁ బొల్పగు శంకరుని న్భవాని న
స్పందితభక్తిమైఁ గదిసి బ్రాహ్మణపుంగవుఁ డానతాంగుఁడై.

146


ఆ.

అచటఁ గొన్నిదినము లతఁ డా భవానిఁ బ్రా
ర్ధించుచుండఁ దద్గరిష్టనిష్ఠ
జూచి మెచ్చి తనదు శోభనాకృతిఁ జూపి
గౌరి యొక్కనాఁడు కరుణతోడ.

147


క.

'ఓవిప్రుఁడ! నీ వేపని
కై వచ్చితి చెప్పు' మనిన నతఁ డి ట్లనుఁ 'ద
ల్లీ! విను మే నొకధర్మము
నీవలనం దెలియ వచ్చి నీకృపఁ గంటిన్.

148


ఉ.

ఈ పురి నేఁడు నాఁ డనక యెప్పుడుఁ దప్పక యన్నదాన మే
రూపమునందు నైన నొకరుండును నాఁకొనకుండునట్లుగాఁ
దీ వెసలారఁ బెట్టు దఁట దేవి! తదీయఫలంబు చెప్పుమా
యీపరమార్థనిర్ణయము నెవ్వరుఁ గానరు నీవు దక్కఁగన్.'

149


వ.

అనిన నప్పరమేశ్వరి యతని కి ట్లనియె.

150

ఉ.

'వారణగంగ నాఁగ హిమవద్గిరిచేరువఁ జూడ నొప్పుఁ దెం
పారఁగ నొక్క పుణ్యనది, యానదిపొంత ననంతవైభవ
స్ఫారత నొక్కప్రో లమరుఁ, బన్నుగ హేమవతంబు నాఁగ; నం
గీరుఁడు నాఁగ నొక్క నృపకేసరి యప్పుర మేలు మేలుగన్.

151


క.

ఆవసుధావల్లభునకు
దేవి యొకతె సుమతి నాఁగ ధృతిమతి కాంతి
శ్రీవిలసద్గౌరవముల
రావై పతిభక్తిచే దృఢంబై మెఱయున్.

152


క.

ఆదేవికి సంతతి మున్
లేదు పతియు నేకభామినీవ్రతుఁడై సం
పాదింపఁడు మఱి భార్యల
నాదంపతు లున్నయెడకు నరుగుము విప్రా!

153


క.

అరిగి యథోచితవేళం
గర మనురాగమున వారిఁ గదిసి ధరిత్రీ
భరణక్షముఁ డొక తనయుఁడు
హరిసత్వుఁడు మీకుఁ బుట్టు నని చెప్పుతగన్.

154


ఆ.

పుట్టినపుడ సజ్జచుట్టును బెఱవారు
జనని యాదిగాఁగ సకలజనులు
తొలఁగి యుండి సన్నుఁ దొలుతఁ జూడఁగ నిచ్చి
సుతునిఁ పిదప మీరు చూడుఁ డనుము.

155


చ.

అని యొడఁబాటు చేసికొని యాశిశురత్నముఁ జేరి యేకతం
బున నడుగంగ వాఁడు దెలుపుఁ విశదంబుగ నన్నదానశో
ధనసుకృతంబుచొ ప్ప' నుచుఁ బార్వతి చెప్పిన నద్భుతాత్ముఁడై
'పనుపుము పోయి వచ్చెదఁ గృపారసమానస!' యంచుఁ జయ్యనన్.

156


చ.

వలగొని మ్రొక్కి నేత్రకరవారిజసంజ్ఞల నాభవాని వీ
డ్కొలుపఁ బునఃప్రణామములు గోరి యొనర్చి 'భవత్కటాక్ష మె
వ్వలనను నాకు రక్ష' యనువాక్యముతోడఁ దదీయసద్మమున్
వెలువడి యొక్కరుండు కడు వేడుక నుత్తరభూమి కేఁగుడున్.

157

వ్యాధుని కథ

శా.

ఆవిప్రుం డొకచోటఁ జొచ్చి వని ఘోరారణ్యమార్గంబునన్
దీవ ల్గాళ్ళను జుట్టఁ దొట్రుపడుచుం ది క్కేది విభ్రాంతుఁడై
పోవం బోవగ నొక్కబోయ గని యీపుణ్యాత్ముఁ డేయూరికిన్
బోవం బోయియొ త్రోవఁ దప్పె ననుచుం బూర్ణానుకంపామతిన్.

158


ఉ.

ఆతనిఁ జేరఁ బోయి 'వసుధామర! యేపురి కేఁగె దీవు? ఖ
ద్యోతనుఁ డస్తపర్వతగతుం డగుదెంచెఁ బథంబు దూర మీ
రీతి నరణ్యమధ్యమున రేయి చరింప వశంబె యెట్టిని
ర్భీతుల కైన? వన్యమృగబృందము మైమయిఁ బోవ నిచ్చునే!

159


క.

అనవుడు నా బ్రాహ్మణుఁ డా
వనచరుతో 'నేను హేమవతపురమునకున్
జనుచుండి త్రోవ దప్పితి
నెనయఁగ నా త్రోవ చూపు మేఁగెద' ననినన్.

160


క.

'ఏటికి వేగిరపడ నీ
పూట నిచట నిలిచి రేపు పోవఁగరాదే
మాటలఁ దప్పితి తెరు వి
చ్చోటికి నమడకుఁ బడియెఁ జు మ్మది' [5]యనియెన్.

161


చ.

అని తన పోడుచేనికడ కాతనిఁ దోఁకొని పోయి బోయ యి
ట్లను 'నివె పొట్టికందులును నన్ములు నున్నవి క్రొత్తకుండ లే
దనఘ! యుపాయ మెద్ది? కడు నాఁకొని వచ్చినవాఁడ వీవు నీ
పనిచినయట్ల చేసెదఁ గృపామతి నానతి యిమ్ము' నావుడున్.

162


క.

'నీసౌజన్యమున మదా
యాసము సర్వమును బాసె నంతియ చాలున్.
గ్రాసేచ్ఛ లేదు; నీవు వృ
థా సంకటపడకు సౌఖ్యతర మిది నాకున్.'

163

వ.

అని యతవి నూఱడించి యవ్విప్రుండు తన కలశోదకంబున సాయంకరణీ
యంబులు దీర్చి కూర్చుండునెడ నక్కిరాతుండు రెండుదొప్పల చారబియ్యం
బును దేనెయుం దెచ్చి యిచ్చిన నవి భగదర్పితంబు చేసి యుపయోగించి
యాప్యాయనంబుగా నుదకంబు గొని కృతాచమనుండై పర్ణతల్పంబున నుప
క్రమించిన.

164


క.

'క్రూరమృగంబులు గల వీ
ఘోరాటవి, నిచట నిద్ర గూరుట గొఱ గా;
దీరును మత్సతియును బొడ
వారిన మంచెపయి నుండుఁ ' డని యెక్కించెన్.

165


వ.

ఇ ట్లెక్కించి యక్కిరాతుండు.

166


ఉ.

తా నొక విల్లు నమ్ములును దాల్చి ముదంబున నిద్ర గాచి యా
చేనికి దుష్టసత్వములు చేరక యుండ నదల్చుచుండ న
చ్చో నరుణోదయం బిగుట చూచి యొకించుక కన్ను మోడ్చె నా
లోనన యొక్క బెబ్బులి విలోలత వచ్చి వధించె నాతనిన్.

167


క.

అప్పులి గవిసిన యప్పటి
చప్పుడు విని యక్కిరాతసతి మేల్కని వా
తప్పక యొక్కశరంబునఁ
జెప్ప నరిది గాఁగ దాని జీవము గొనియెన్.

168


శా.

ఆవిప్రుండును నప్డు బిట్టులికి యత్యాకంపముం బొంది వా
పోవం జొచ్చె; లతాంగి వె న్పఱచి విప్రుం దేర్చెఁ; బద్మప్రియుం
డావార్త ల్విని వచ్చినట్లు కరసంఘాగ్రంబునం జీఁకటుల్
పోవం ద్రోచుచుఁ దోఁచె నాదిమదిశాభూమీధ్రశృంగంబునన్.

169


ఉ.

అంతఁ గిరాతకాంత వగ నందెడువిప్రునిఁ జూచి 'తండ్రి! యే
నింతకు నోచి యుండ నిది యేరికి వశ్యమె తప్పఁ ద్రోవ ని
శ్చింతత నేఁగుఁ డాతవముచేఁ గడుఁ జికెకేద రింక నైన; న
ల్లంతనె పోవుత్రోవలె యుదగ్రమహోగ్రమృగప్రకీర్ణముల్.'

170


చ.

అనిన నతండు 'నాకుఁ దగవా? యిటువంటి పరోపకారి నెం
దునుఁ బొడగాన నీతఁడు మృతుం డగు టేఁ గనుఁగొంటిఁ, జూచి యే

మని చనువాఁడ మిన్నక యథాపరతంత్రము సేయ' కంచుఁ బే
ర్చినకృపతోడఁ జేయఁ బనిచెన్ దహసక్రియ వాని మేనికిన్.

171


క.

వనితయు నప్పుడు పతితో
ననుగమనము చేయఁ బూని యావిప్రుని న
వ్వనభూమి వెడలునంతకు
ననిపి మరలి వచ్చి చేయునదియై నిల్చెన్.

172


వ.

అతండును దాని నూరార్చి 'నీ నేర్చువిధంబున నితనికిఁ బరలోకక్రియలు
నిర్వర్తింపుము నాకుం బోవలయు ' ననిన నవ్విప్రుమాటకు నబ్బోటి యిట్లనుఁ
'దండ్రీ! నీ నీయరణ్యమార్గంబులు మున్నెఱుంగవు ని న్ననిపి వచ్చెదం
బద ' మని ధనురస్త్రపాణి యగుచు నా సుశ్రోణి యతనిం దోడ్కొనిపోయి
గతాగతజనంబులవలన నిరంతరసంకులం బగు హేమవతపురంబు తెరువు
చూపి యతని వీడ్కొని వచ్చి పచ్యమానుండగుచున్న తనభర్తం జూచి యే
నిట వచ్చెద నిలువు మని సస్మితంబుగాఁ బల్కుచు నయ్యగ్నియందుఁ
బ్రవేశించె నంత నక్కడ

173


ఉ.

హేమవతాభిధానపురి కేఁగి మహీసురుఁ డానృపాలచూ
డామణితో రహస్యపుటెడ న్మును పార్వతి చెప్పినట్లు చే
తోముద మొప్పఁగాఁ బలికి ధూతకళంకతఁ గొన్ని మాసముల్
సోమకళాధరాలయము సొచ్చి జపం బొనరించుచుండఁగన్.

174


ఉ.

పుట్టెఁ దనూజుఁ దానృపతిపుంగవుదేవికిఁ బుణ్యవేళ న
ప్పట్టునఁ దత్తఱించుచును బాఱి యథోచితభంగి నేఁగి 'మా
చుట్టమ! కన్ను విచ్చి ననుఁ జూడుము చెప్పుము విప్రజాతికిం
బెట్టినయన్నదానమునఁ బేర్చుఫలం ' బని వేఁడె విప్రుఁడున్.

175


చ.

కల కల నవ్వుచున్ శిశుశిఖామణి యిట్లని చెప్పె నప్డు 'వి
ప్రులకుఁ బ్రయత్నపూర్వముగ భోజన మిడ్డఫలంబు చెప్ప నా
యలవియె మీ రెఱుంగరె యనంతఫలప్రద మన్నదాన మేఁ
దెలుపఁగ నేల వేఱె యొకదృష్టము చెప్పెదఁ జిత్తగింపుఁడా!

176


ఉ.

మీ రలనాఁడు పంకరుహమిత్రుఁడు పశ్చిమవార్ధిలోనికిం
జేరెడువేళ మద్గృహము చేరినఁ బెట్టితి నింత దేనియం

జేరెఁడు చాఱబియ్యమును జిత్త మెలర్పఁగఁ దానఁ జేసి బృం
దారకరాజ్యతుల్య మగుధారుణి యేలుట కిట్లు పుట్టితిన్.

177


వ.

అని పలికి యర్భకుండు పూర్వజన్మంబునం దాను గిరాతుండై యుండిననాఁ
డతనికిఁ జేసినసత్కారంబుకొలంది దెలిపె మఱియు ని ట్లనియె; 'అయ్యా !
యయ్యల్పదానంబువలన నా కిట్టి యనల్పఫలంబు సిద్ధించె నీవు నిరంతరాన్న
దానశీలుండవు నీ కెంతటి ఫలంబు గల్గునో యది యాపరమేశ్వరుండే
యెఱంగుం గాని యన్యు లెఱుంగ లేరు, నీవు విచ్చేయు' మనిన నాద్విజా
తుండు ప్రీతుండై.

178


క.

అంగిరునిం దగ వీడ్కొని
యంగీకృతసుప్రయాణుఁడై ముక్తిపుర
ప్రాంగణ మగుకాశీపురి
కిం గర మనురాగమున మగిడి చనుదెంచెన్.

179


ఉ.

క్రమ్మఱ నాభవానిపదకంజయుగంబు శిరంబు సోఁక మో
దమ్మున్న జాఁగి మ్రొక్కి, 'వనితాతిలకంబ! భవన్మతంబునం
గ్రమ్మఱ నేఁగి యాశిశుముఖంబున నే వినఁగంటి నన్నదా
నమ్ముఫలం బగణ్య మని' నావుడుఁ బార్వతి ప్రీతి ని ట్లనున్.

180


క.

'విను విప్రోత్తమ! నీ వ
చ్చినపని సిద్ధించె నింకఁ జేరుము భవదీ
యనివాసమ్మునకు గృహ
స్థునకుఁ బ్రవాసైకవృత్తి దోషము సుమ్మీ!

181


క.

మఱి యాశ్రమస్థు లెల్లను
వఱలు గృహస్థాశ్రమంబువారిన కానం
బఱతెంతురు తమ దగు న
క్కఱ దీర్చుకొనంగ నొందుగతి లే కునికిన్.

182


చ.

వ్రతులు గృహస్థువాకిటికి వచ్చి యథోచితపూజఁ గానరే
నతనిగృహస్థధర్మ మది యంతయు నిష్ఫల మండ్రు; వెండి య
య్యతిథికృతాఘసంచయము లన్నియు నాతనిఁ బొందుఁ, దత్సమం
చితసుకృతంబు లయ్యతిథి జెందుఁ జుమీ పరమార్థ మారయన్.

183

క.

గృహపతి లేనిగృహం బది
గ్రహపతిరహిత మగుదినముగతి మధ్యంబై
మహిమ చెడి యుండుఁ గావున
బహుచింతాలతలఁ జిక్కు వడక యరుగుమా!'

184


చ.

అనవుడు నట్ల కాక యని యంబిక వీడ్కొని యాత్మభూమికిం
జనియెడువేడ్క నివ్వటిల జాహ్నవి దాఁటి మహీసురుండు నె
మ్మనమున నల్ల యంత్యజునిమాట దలంచి య దేమిచందమో
కనుగొని పోదు నంచు నెసకంబుగఁ [6]గ్రమ్మఱి నిల్చి యి ట్లనున్.

185


క.

'ఓ దేవి! వినుము ని న్నొక
మాదిగవాఁ డడిగె వానిమాటకుఁ గలదే
యే దైన నొక్కయుత్తర
మాదట నెఱిఁగింపు నాకు నరుగఁగ వలయున్.'

186

మాదిగవాని కథ

మ.

అనినం గంగ నిజాంగదీప్తినిచయం బవ్వాహినీమధ్య మె
ల్ల నతిస్నిగ్ధముగా నొనర్ప నయనోల్లాసంబు మందస్మితా
ననకాంతిం బొదలింపఁ గంకణ[7]రవోన్నాదంబుతో హస్త మె
త్తి నయం బారఁగఁ బల్కు నోద్విజుఁడ! యర్థిన్ వింటి నీవాక్యముల్.

187


ఉ.

శీలగుణోన్నతుం డమలచిత్తుఁడు మత్ప్రియసేవకుండు చం
డాలుఁ డనంగ రా దతిదృఢవ్రతుఁ డాతనికిన్ శుభంబె; నా
మేలును జెప్పు మాతనికి; మిత్రజ లోనగు పుణ్యవాహినీ
జాలముతోడ విశ్వపతిసన్నిధి నెమ్మదిఁ బాయ కుండుదున్.

188


మ.

అని గంభీరరవంబునం బలుకుపుణ్యాకారిణిం బ్రీతిఁ గ
ల్గొని విప్రుండు కరాబ్జము ల్మొగిచి 'నీకున్ మ్రొక్కెదన్ దేవి! యే
జనులుం గానరు నీదుదివ్యతను వస్మద్భాగధేయంబుపెం
పున నేఁ గంటి భవత్కటాక్ష మెలమిం బొందించె నాడెందమున్.

189

క.

వాఁడును గేవలపురుషుఁడు
గాఁ డెవ్వఁడొ, యంత్యజుండు గాఁ గత మేమో,
పోడిగ వినవలయు నినున్
వేఁడెదఁ జెప్పు మని జాహ్నవినిఁ బ్రార్థించెన్.

190


వ.

అట్లు ప్రార్థించి యడిగిన నమ్మహానది యతని కి ట్లనియెఁ 'దొల్లి గౌతమీ
సింధుపమీపంబున నొక్కపసులమంద యుండ నొక్కనాఁ డయ్యేటివెంట
నీటివడిం బడి యొక్కగర్భిణికర్కటి వచ్చి యచ్చో నొక్కబొక్క గావించు
కొని యుండుడు దానిమీఁద నచటి గోపాలుఁ డొక్క పాలకడవ యిడిన నది
ప్రమాదంబునం దిగిలి తత్ప్రదేశంబు జొబ్బిలం దడిసె నంత.

191


క.

ఆకర్కటిగర్భమున న
నేకంబులు పుట్టెఁ బిల్ల, లీనుచు మృతయై
పోక యది యేమికతమున
నో క్రమ్మఱ బ్రతికి యుండె నొగిఁ గర్కటియున్.

192


అ.

అట్లు పుట్టి పిల్ల లాదుగ్ధపూరంబు
వలనఁ దోఁగి కమ్మ వలచుచున్న
మంచిమృత్తిక దిన మఱికొన్నిదినముల
నంతవట్టు దెగిన నరుచి పుట్టె.

193


ఉ.

అం దొకయర్భకంబు దమ యమ్మకు నిట్లను 'నాదుజిహ్వ కే
చందమొ మున్ను వోలెఁ జవి చాలదు మృత్తిక రోగ మెద్దియుం
బొందదు దీపనాగ్నియును బుటక మానుట లేదు నా కయో
యిందఱి కి ట్లనో తలఁప నేమి యుపద్రవమో తలంపఁగన్.'

194


చ.

అనవుడుఁ బుత్రుతోడ దరహాస మెలర్పఁగ నెండ్రిలేమ యి
ట్లను 'విన వన్న! పట్టి! యిది యచ్చపుమంటిగుణంబు [8]గాదు ; తోఁ
చిన దొక దోష మేమియును జెప్పఁగఁ జొప్పడ, దొక్కకారణం
బున రుచి వుట్టె, యామిసిమి పోయినఁ గ్రొత్త యొనర్చె జిహ్వకున్.'

195


వ.

అని యమ్మన్ను మున్ను పయఃపూరంబువలన రుచిసారం బగుటఁ దెలిపి
'నీవు పుట్టినకోలె నదియ సేవించి పెరిగితి గానఁగేవల మృద్భక్షణం బెఱుంగ

వట్లు గావున నీ కిప్పు డిది యరుచి పుట్టె ' ననిన విని వెఱఁగు పడి యప్పిల్ల
తల్లి కి ట్లనియె.

196


క.

'పా లని చెప్పెద వది దా
నేలాగున నుండ ? దాన నెనసిన యీజం
బాలం బింత మధుర మది
గ్రోలెడువారికిని జవులు గొఱఁతయె చెపుమా!

197


ఆ.

పాలు లేనివాని బ్రతుకు నిరర్ధంబు
పాలు గల్గువాఁడు చాల భోగి
పాలు మనకు నేయుపాయంబునందు సి
ద్ధించుఁ దల్లి! నాకుఁ దెలుపు' మనిన.

198


క.

సురలోకమునకు నమృతము
నరలోకంబునకుఁ బా లనఁగ నీ రెండున్
సరి చేసెఁ బ్రహ్మ, యల్పుల
కరయంగాఁ దత్సుఖంబు లబ్బునె కొడుకా!

199


వ.

అనిన నది మఱియు ని ట్లనియె.

200


క.

'నరలోకం బెటువంటిది?
సురలోకం బెట్టి? దీవు చూచితె మన మం
దిరముల సాటివి యౌనో
విరచితగతి నింతకంటె విస్తీర్ణములో?

201


క.

అం దుండెడువారికి మన
చందమె రూపములు వేఱె చందమొ నాకా
చందము వివరింపు' మనిన
నందనుమాటలకుఁ దల్లి నవ్వుచుఁ బల్కెన్.

202


క.

'మన ముండెడు బొక్కలకును
మనకును నుపమేయమాత్రమా వారల భ
వ్యనివాసస్థలములుఁ ద
ద్వినుతాకారములుఁ దెలియ విను మట్లయినన్

203

క.

నాక మనఁ బరగు దివిజుల
లోకము [9]దా నరయ నూర్ధ్వలోకము, మఱి భూ
లోక మనఁ బరగు మనుజుల
లోకము మన మిప్పు డున్నలోకము పుత్రా!

204


చ.

చరణము లూరువు ల్జఘనచక్రము లానతనాభు లంచితో
దరములు పీనవక్షము లుదారభుజంబులు కంబుకంఠముల్
సురుచిరవక్త్రపద్మములు శోభితచక్షులు ఘ్రాణకర్ణముల్
శిరములుఁ గేశపాశములుఁ జెన్నగుమేనులవారు దేవతల్.

205


క.

దేవతలకు విను ముదిమియుఁ
జావును లే డెన్నఁడును బ్రశస్తగుణాఢ్యుల్
కావున విమానయానులు
నై విహరింపుదురు వా రుదాత్తప్రీతిన్.

206


క.

జరయును రుజయును నరులకు
903
దొరకొనె నని కాని యాకృతులు దలఁపగ ని
ర్జరులట్ల నరులు, వారికి
గరితురగాందోళికలును ఘనవాహనముల్.

207


వ.

కావున నట్టిప్రభావంబు లొక్కొక సుకృతవిశేషంబునం గాక యూర కెట్లు
సిద్ధించు? మనము పూర్వజన్మంబున దూరీకృతసుకృతుల మగుట నిట్టి దుష్ట
జన్మంబు వాటిల్లె' ననిన విని 'జననీ! నీ కిట్టి పరమజ్ఞానం బేమివిధంబునం
గలిగె? నెఱిఁగింపు మనిన వాని కి ట్లనియె.

208


శా.

ఏ నాగౌతమిలోన నుండునెడ నయ్యేటం గృతస్నానులై
నానాదేశసమాగతద్విజులు నానాధర్మము ల్చెప్పుచో
నానారీతులమాట లేను వినుట న్నాకిట్టి యత్యుత్తమ
జ్ఞానం బబ్బెఁ బురాణగోష్ఠి కెనయే సౌఖ్యంబు లొం డెవ్వియున్.

209


మ.

విను మయ్యుత్తమగోష్ఠి యందుఁ గొడుకా! విశ్వంభరం గల్గుపు
ణ్యనదీతీర్థవిశేషముల్ తెలిసె నెన్నం బెద్ద యాగంగ, త

ద్వినుతస్నానఫలంబునం గలుగుఁ జువ్వే పుణ్యలోకంబు లె
వ్వనికిం బొంద నశక్యమైనయవి దుర్వారప్రచారంబుగన్.'

210


క.

అనవుడు 'భవదుపదేశం
బునఁ దల్లీ! నాకు వేడ్క పుట్టెడు నన్నుం
బనుపుము గంగాస్నానం
బున కీదివసములు రిత్త వోవక యుండన్.

211


ఉ.

నీ కిదె చాఁగి మ్రొక్కెద ననింద్యగుణాస్పదమూర్తి! నేను గం
గాకమనీయతోయములఁ గాయము దొప్పఁగఁ దోఁచి యే తీయ
స్తోకపురాకృతాఘముల దొంతులు సర్వము దూలఁ దన్నుదుం
గాక భవత్తనూభవతఁ గాంచియు నిర్వ్యవసాయి నౌదునే!

212


క.

నాతెగువకుఁ దగ నీవును
నోతల్లి! యనుజ్ఞ యొసగు మొయ్యనఁ జని సు
స్నాతుఁడనై మన యన్వయ
జాతులకును బుణ్యలోకసౌఖ్య మొనర్తున్.'

213


ఆ.

అనినఁ గొడుకు మాట కడ్డంబు చెప్పంగ
నలవి గాక యుండి వెలఁది పలికెఁ
'దీర్ధయాత్ర సేయఁ దివురువారల నడ్డ
పెట్టి పాప మేల కట్టుకొందు.

214


ఆ.

పొమ్మనంగఁ జాలఁ బో కని మాన్పంగఁ
జాల నీకు నెట్లుపోలు నట్లు
చేయు' మనిన నతఁడు చిఱునవ్వు నవ్వుచు
మాత యడుగులకు నమస్కరించి.

215


క.

మానుగ వెడలి సమంచిత
యానంబునఁ గొంతనేల యరుగఁగ నొకచో
మ్రానిపయి నుండి చూచె మ
హానిష్ఠురమూర్తి యొక విహంగము దానిన్.

216


క.

చూచి పఱతెంచి యొడిసి య
గోచరవేగమున నెత్తుకొని పోయి సమీ

పాచలశిలపయిఁ దినియెన్
వాచవి కలరుచును వాని నంజుడు పెలుచన్.

217


వ.

ఇట్లు తిని యాఖగం బెగసి పోయె; నాకర్కటికుమారుండును నట్లు మర
ణంబు నొంది గంగాయాత్రలు సేయువారలు విధివశంబున నడుమనె మృతిం
బొంది రేని జన్మత్రయంబునఁ దద్దర్శనంబు సిద్ధించు ననుట సిద్ధంబు గావునఁ
దదనుకూలంబుగా నొక్కమహీపాలు కీలారంబుగోవులలో నొక్క గోవు
కదుపున జన్మించి.

218


ఆ.

తనకు నెదురు లేని ఘనసత్వసంపద
నలరి గోపికాచయంబులోన
గోపకృష్ణు నట్లు గోరత్నములలోన
వృషభ మధికసౌఖ్యవృత్తిఁ బెరిగె.

219


క.

కరువునఁ బోసినవిధమున
నరుదుగఁ దనరూప మెట్టి దట్టిదకాఁ ద
త్సురభులు గ్రేపుల నీనఁగఁ
బొరిఁ బొరి నేటేటఁ గదుపు పొదు పగుదెంచెన్.

220


క.

ఈ తెఱఁగునఁ బెక్కేడులు
జాతిగ భోగించి తనిసి పదపడి వృషభం
బాతను వొక మృగపతికి న
నాతంకప్రీతి నొసఁగె నాహారముగన్.

221

వంజరుని కధ

క.

మఱి కొంకణదేశంబున
నెఱసిన సితదత్తనామనృపతికి సుతుఁడై,
గుఱి లేని పరమగుణముల
వఱలెఁ దృతీయభవమందు వంజరుఁ డనఁగన్.

222


క.

వంజరుఁ డఖిలాశ్రితశుక
పంజరుఁడు విరోధిభయదబాహాబలది
క్కుంజరుఁ డభిరామయశో
మంజరుఁ డన నొప్పె నతినమంజసవృత్తిన్.

223

ఉ.

ఆతని పెండ్లి సేయుటకునై సితదత్తవిభుండు రాజక
న్యాతిలకంబులం దడవునప్పు డతండును దండ్రితోడ 'న
య్యా! తనుదోషము ల్పొలియునట్లుగ జాహ్నవి కేఁగి యందు సు
స్నాతుఁడనై నినుం గొలువఁ జయ్యన వత్తునె వేడ్క పుట్టెడున్.'

224


క.

అనవుడు 'నే నెటు దలఁపఁగఁ
దనయుం డెటు దలఁచె బాపు దైవమ! యింకే
మని పల్కుదు నీతఁడు పొసఁ
గనికోరికఁ గోరె నెట్లు గా నున్నదియో.'

225


వ.

అని యించుకసేపు విచారించి యానృపసత్తముండు దన కుమారోత్తముదెసఁ
గ్రమ్మఱ నవలోకించి.

226


క.

అక్కటిక మెసఁగ ని ట్లనుఁ
'జెక్కడిచినఁ బాలు వడుచు చిన్నవడుగ! నీ
వెక్కడ గంగాస్నానం
బెక్కడ పసిబిడ్డ వేమి యెఱుఁగుదు చెపుమా!'

227


క.

అని పుత్రస్నేహంబునఁ
దనుఁ బల్కినతండ్రితో నతం డిట్లనుఁ 'బ్రా
గ్జననోదాత్తసుకృతవా
సన నూనినమానసాంబుజము వికసింపన్.

228


సీ.

ధర్మకర్మము సేయుదానికి నిది ప్రాయ
       మిది కాల మని వాలయింపఁ గలదె?
తన యోపినంతయుఁ దవిలి యొనర్పంగ
       నట యబ్బినంతయు నబ్బెఁ గాక,
చేయార ధర్మంబు చేయఁ గాలము లేదె
       యనుచు నేమఱి యున్న నజునితలఁపు
తనచేతిలోనిదే? ధర్మేచ్చ గలుగుట
       యల్పమే? కలిగినయది నిరర్థ


ఆ.

కంబు చేసికొనుట కర్తవ్యమే? నేత్ర
హీనుఁ డైనయాతఁ డెట్టు లున్న

నుండెఁ గాక తనకు రెండుకన్నులు గల్గి
యుండి యందునట్ల యుండఁ దగునె?

229


క.

నీ వెఱుఁగని ధర్మస్థితి
భూవర! మఱి కలదె, నన్నుఁ బుచ్చుము, త్రిజగ
త్పావని యగుగంగానది
కేవిఘ్నముఁ జేయవలవ దిచ్చో' ననినన్.

230


క.

'అన్నన్న యేల నీ కీ
పిన్నొడలికి నలవిగాని పెనుఁబోకలు? నే
నున్నంతకాలమును నా
కన్ను లెదుర నుండవన్న కథ లేమిటికిన్?'

231


క.

అని తన్ను నివారించిన
జనకునితో నతఁడు 'నన్నుఁ జననీ కున్నం
జనవర! నీమీఁద నభో
జన ముండుదు' ననుచు గెంటసము లాడుటయున్.

232


సీ.

ఏఁ దన్ను వల దని యెన్ని చెప్పిన మానఁ
       డని పంప నేఁడాది కాఱునెలల
కైనను గ్రమ్మఱ నరుదెంచు బలిమి నేఁ
       డడ్డ పెట్టితి నేని నశన ముడిగి
వేగంబె ప్రాణము ల్విడుచు నీరెంటియం
       దును వీనిఁ గాశికిఁ బనుచుపనియె
పొసఁగి యున్నది యని వసువస్త్రధాన్యాది
       కముగఁ బాధేయంబు గలుగ నొసఁగి


ఆ.

పరిజనముల నుచితభంగిఁ దో డిడి కొంద
ఱవనిసురులఁ గూర్చి యవ్విభుండు
తనకుఁ బ్రణతుఁ డైన తనయుని నాశీర్వ
దించి వీడుకొలిపెఁ దెగువతోడ.

233


క.

ఈ విధమునఁ దనుఁ బాసియు
భావంబునఁ బాయకున్న బాలునిరూప

శ్రీ విభవము పలుమఱు శో
కావేశమతిం దలంచు నశ్రులు నించున్.

234


క.

నాయనుఁగుఁదనయుఁ డింతకు
నేయెడ కరుగు ననుఁ, దొల్లి యెఱుఁగండు ప్రవా
సాయాసం బను, నేనునుఁ
బోయెదఁ గా కనును, గడచి పోకున్నె యనున్.

235


క.

ఇవ్విధమునఁ దలపోయుచు
నివ్వటిలెడు పుత్రశోక నిష్ఠురవహ్నిన్
గ్రొవ్వు చెడ నెరసి జీవం
బవ్విభుఁడు దొఱంగె స్వజను లాక్రందింపన్.

236


క.

సితదత్తుఁ డవ్విధంబున
మృతుఁ డగుటయు మంత్రివరులు భృత్యులును బురో
హితసామంతాదులు స
మ్మతి నాలోచించి యైకమత్యం బెసఁగన్.

237


ఉ.

ఆతనిపాలి కేఁగి 'సుగుణాకర! నీజనకుండు నిర్జర
వ్రాతములోని కేఁగె మనరాజ్యము కెవ్వరు దిక్కు లేరు నీ
వీతఱిఁ దీర్థసేవ కిటు లేఁగుట నీతిపథంబె వైరిధా
త్రీ లనాథు లిం కిట మదింపరె శిక్ష యొనర్పకుండినన్.'

238


క.

అనిన విని 'యకట నాకై
తన ప్రాణము విడిచెఁ దండ్రి, తత్పురి కే నే
మని వత్తు గంగ కరిగెద
నని వెల్వడి వచ్చి మగుడ నర్హంబగునే!

239


క.

ఎక్కడి పితృమరణము మఱి
యెక్కడి రాజ్యంబు గంగ కేఁగెడుచో మీ
రిక్కడి విఘ్నము చేసెద
రెక్కడి బ్రాహ్మణులు మరలుఁ డే రా నొల్లన్.'

240


వ.

అని విడియ నాడిన నతని యాగ్రహంబునకు నిగ్రహపడక సామోపాయంబునఁ
గార్యంబు గొనవలయు నని వార లి ట్లనిరి.

241

సీ.

'ఏము ధర్మస్థితి యెఱుఁగనివారమే
       మామాట నీకు నమ్మంగఁ దగదే
మీతండ్రి మమ్ము నేరీతి మన్నించు నీ
       వును నట్ల కాఁ గనుఁగొనఁగఁ దగదె
ప్రార్థితంబుగఁ జేయుపని దోష మనిపింప
       నేల యీవలవనిజోలి నీకు
నంతియ వలసిన సంతతి వడసి రా
       ష్ట్రమునకుఁ బుత్రుఁ బట్టంబు గట్టి


తే.

పిదపఁ బోయిన నడ్డపెట్టెదమె రాజ
పుత్ర!' నావుడు వీరు చెప్పుట హితంబు
గానఁ బోవుట గాదని కడఁకతోడఁ
గాశి కెదు రుండి కృతనమస్కారుఁ డగుచు.

242


క.

'క్రమ్మఱఁ బనివినియెదఁ జు
మ్మమ్మ! భవత్సేవ' కనుచు నచ్చపుభక్తిన్
మమ్ముఁ దలంచుచు నాత్మపు
రమ్మునకుం జనియె వంజరప్రభుఁ డెలమిన్.

243


వ.

ఇట్లు చని సితదత్తమహీభర్తకుఁ బితృకృత్యంబులు యథోచితంబుగా నొనర్చి
యొక్కపుణ్యదినంబునఁ బుణ్యనదీజలాభిషేదనపురస్సరంబుగాఁ బట్టంబు గట్టు
కొని యప్రతిహతప్రతాపంబు దీపింప ననేకవర్షంబులు భూమి యేలుచు భామిని
యను కామినియందు నుగ్రలోచనుం డను నుదగ్రపరాక్రముం డగు కొడుకుం
గని వానిమీఁద సకలసామ్రాజ్యభారంబును బెట్టి నన్ను దర్శించి తపోవనంబు
నకుం జనియె.

244


మ.

అని సిద్ధుం డల భోజరాజునకు ని ట్లైతిహ్యముం జెప్పె నం
చనసూయాతనయుండు చెప్పిన మహుం డానందము బొంది మో
డ్చినకే లౌఁదలఁ జేర్చి నమ్రుఁ డయి 'తండ్రీ! యేఁ గృతార్థుండ నై
తి నెఱింగింపఁ గదే తదుత్తరకథల్ తెల్లంబుగా' నావుడున్.

245


చ.

త్రిభువనవంద్య! దానవసతీగళమంగళసూత్రభంగ! ది
గ్విధుసముదాయసేవిత! రవిద్విజరాజసునేత్ర! సర్వలో

కభరిత! యోగిహృద్విమలకంజమధువ్రత! సూర్యకోటీస
న్నిభ! యిభరాజరక్షణ! ఫణిద్విషదద్రినివాసభాసురా!

246


క.

కరుణారసభరితాంతః
కరణా! సుకవీంద్రరచితకవితాచరణా!
శరణాగత జనభయపరి
హరణా! దివిజగణసంతతార్చితచరణా!

247


ఇంద్రవజ్రము.

శ్రీరాజతల్పీకృతసింధురాజా!
స్వారాజనీలామలచారుదేహా!
గోరాజరాజానలగోవిలాసా!
క్షీరాజపత్నీహిమసింహకీర్తీ!

248

గద్యము
ఇది వాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ
సుకవిజనవిధేయ అనంతయ నామధేయ ప్రణీతంబైన
భోజరాజీయంబను కావ్యంబునందుఁ
షష్ఠాశ్వాసము

  1. దుర్గముల
  2. నేను
  3. మైనొందఁగన్
  4. నాగ= శేషసర్పము. తద్విరోధి= దానికి విరోధియగు గరుడుఁడు.
  5. యనినన్
  6. గ్రమ్మఱనిచ్చి
  7. రవోన్మాదంబుతో
  8. గాని
  9. లో మఱియు