భోజరాజీయము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

భోజరాజీయము

పంచమాశ్వాసము

శ్రీదేవీహృత్సరసిరు
హాదిత్య! సమస్తదేవతార్చితవిలస
త్పాదాంబుజ! శ్రీమత్తుల
సీదళదామాభిరామ! శ్రీనరసింహా!

1


వ.

అవధరింపుము దత్తాత్రేయ మునీశ్వరుం డా నరేశ్వరున కి ట్లనియె న ట్లాభోజ
రాజునకు సర్పటి సిద్ధుండు వినిపింప రత్నమండనకథాలతకుం బాయుగొన
యగు గోవ్యాఘ్రసంవాదంబునందు మదనరేఖ చరిత్రం బిప్పుడు చెప్పం
బడియె దదనంతరప్రసంగం బాకర్ణింపు మయ్యితిహాసంబు చెప్పి యప్పశు
రత్నం బా పులివక్త్రంబు చూచి నీవు నన్ను నమ్మకునికింజేసి యిట్లు సత్య
వ్రతోదాహరణంబు చేసితి నింక నేమి సేయుదుఁ జెప్పుమనిన.

2


చ.

అనితరసాధ్యసత్త్వమగు నవ్వనసత్త్వము గోవుఁ జూచి యి
ట్లను 'నిపు డీవు చెప్పిన మహామహిమంగల పుణ్యురాలికిన్
దనరఁగ నగ్రజన్ముఁడగు ధన్యుఁడు పావకలోముఁ డెట్టి వ
ర్తనములవాఁడు? వాని సతి దా నది యెట్టిది? నాకు జెప్పుమా!'

3


చ.

అనవుడుఁ జెప్పెద న్విను మృగాధిప! పావకలోము తండ్రికిం
జనవరియైన మంత్రి జనసన్నుతుఁ డొక్క సువర్ణకారకుం;
డనయము వానికిం దనయుఁడై గుణహీను డొఁకండు కుంభినాఁ
జను, నతఁ డగ్నిలోమునకు జానగు నిష్టసఖుండు మేదినిన్.

4


క.

ఒక నాఁ డయ్యిఱువురు నుది
తకుతూహలవృత్తిఁ జేసి ధనువులా నస్త్ర

ప్రకరములు దాల్చి నగరాం
తిక వనవాటికల గేలిఁ దేలుచు నుండన్.

5


క.

హయములు గరులును రథసం
చయమును వివిధాతసత్రచామరములు నై
పయనపుసిరి యుజ్జ్వలముగ
బయితెరువున నరుగు భూమిపాలశ్రేణిన్.

6


వ.

కని తద్వనప్రాచీనోపాంతంబున నిల్చి సమీపవర్తులగు జనంబులం బిలిచి
'వీర లెవ్వ? రేపని కెటపోయెద? రెఱింగింపుఁ' డనిన వార లి ట్లనిరి.

7


చ.

'వనధిగభీరుఁ డొక్కఁ డజవక్షుఁడు నాగలఁ, డాతఁ డున్కి నా
ట్యనగర, మా నరాధిపు ప్రియాంగన మేఖల, దానికూఁతు పే
రనుమతి, తత్స్వయంవరమహత్త్వనిరీక్షణకౌతుకంబునన్
జనియెద రిమ్మహీపతులు సైన్యసమన్వితులై రయంబునన్.

8


చ.

అరయఁగ నెల్లి సూర్యు నుదయంబుపయిన్ ఘటికాద్వయంబునం
బరిణయలగ్న మే తడవుఁ బట్టదు తద్విభవంబు చూచి వే
మరలఁగవచ్చు మీరును గుమారవయస్కుల రివ్వనంబులోఁ
దిరుగఁగ నేమి సిద్ధి, యరుదెం డిది యుక్తము గాదె' నావుడున్.

9


క.

రాకొమరుఁడు గుంభియు నా
భూకాంతలతోడ నాట్యపురి కేఁగిరి భూ
లోక విహారముఁ గోరి ది
వాకర శశధరులు గూడి వచ్చి రనంగన్.

10


వ.

అప్పు డప్పురంబునందు.

11


సీ.

వజ్రదీధితులు భాస్వద్వారిపూరంబు,
       భూషణోత్థితరజఃపుంజ మిసుక,
ధవళనీలారుణాతపవారణములు సి
       తాబ్జనీలోత్పలహల్లకములు,
నింద్రనీలపుఁదేరు లిందిందిరశ్రేణి,
       శస్త్రాస్త్రరుచులు మత్స్యవ్రజంబు,

జలితచామరములు కలహంసములు, మణి
       ద్యుతులు రక్తాబ్జసంతతులు గాఁగ,


తే.

నెలమిఁ దత్ప్వయంవరమున కేఁగుదెంచి
యున్న రాజన్యసమితిచే నొప్పు మిగిలి
యుండె నా రాజమార్గంబు నిండుఁగొలని
భంగిఁ గలమంజులాలాపబహుల మగుచు.

12


వ.

అయ్యవసరంబున.

13


సీ

అజవక్షుఁ డొక యంత్రహంసంబుఁ దెప్పించి
       యా హంస యఱుత ననర్ఘ్యరత్న
మయమైన పదకంబు నయమునఁ గీలించి
       యొక సౌధవేదిపై నునిచి తనదు
తనయ శృంగారించి కొని వచ్చి యా పక్షి
       మీఁద నెక్కింప నా మృదులహస్త
హస్తాబ్జమునఁ దారహారంబు శోభిల్ల
       నఖిలమర్త్యులకుఁ బ్రత్యక్ష మైన


ఆ.

వాణి వోని కీరవాణిఁ బీనశ్రోణి
నలి వినీలవేణి నలరుఁబోణి
నఱ్ఱు లెత్తి చూచి రందఱుఁ దమ తమ
నయనవిస్తృతు లొగి బయలు పడఁగ.

14


క.

ఆ వేళ నమ్మహీపతు
లీవనజదళాయతాక్షి యిఁక నెవని కగున్
భావింప నతఁడ తగుఁ బో
భావజసామ్రాజ్యపట్టభద్రుఁడు గాఁగన్.

15


క.

అనువారు, నవ్వధూమణి
తనక తనక యబ్బు ననుచుఁ దత్పరులై క
న్గొనువారు, మనుజలోకం
బున కిచ్చెలువంబు క్రొత్తసొ మ్మనువారున్.

16

వ.

ఇత్తెఱంగునం దమ తమ చిత్తంబుల కెట్లు దోఁచె నట్ల పలుకుచున్న యన్నర
నాథలోకంబు నాలోకించి సారాసారవివేకదక్షుం డగు నజవక్షుండు సకల
మహీభారభరణసమర్థంబగు తన హస్తం బెత్తి కలకలంబు పారించి వారి
కి ట్లనియె.

17


ఉ.

అంబరవీథి నీ కృతక హంసిక వాఱఁగ; దీని కంఠభా
గంబునఁ బొల్చు రత్నపదకం బొక దివ్యశరంబునందు లీ
లం [1]బడనేసి యీక్షితితలంబుపయిం బడకుండఁ బాణిప
ద్మంబునఁ దిట్టు నే నృపుఁ డతండు వరుండగు మత్తనూజకున్.

18


క.

 అని పలికినంత విప్రులు
మును పెట్టిన పుణ్యలగ్నమున హంసం బా
వనితావతంసమగు న
య్యనుమతి మోచికొని పాఱె నంబరవీథిన్.

19


చ.

తడఁబడ నప్పు డొండొరులఁ దాఁకుచు దిగ్గన లేచి విండ్ల నె
క్కిడియెడువారు, నెక్కిడక యేయఁ దొడంగెడివారు, నెద్దియుం
దడవక విండు లేతెతి బెడిదంబుగ మీఁదికి వైచువారు, సం
దడిఁ బడలేక పాసి యుచితస్థితిఁ జూచుచు నుండువారలున్.

20


క.

మిడుతల గతి, సురగరువలిఁ
బొడమిన కారాకుగముల పోలికి, ఱెక్కల్
వడసిన భుజగంబుల కై
వడిఁ దఱచుగ నమ్ము లేయువారును దివికిన్.

21


క.

ఈ తఱచు టంపగము లా
నాతిఁ దగులకుండ మున్నొనర్చిన గేహీ
భూతరచన గడు మెఱసెం
బో తిరముగ ననుచు మెచ్చి పొగడెడువారున్.

22


క.

వడి గల్గి హంసగతికిం
గడవఁ బఱచువారు, నదియ గతిగా నాసల్

విడిచి దమ తమ పురంబుల
కెడపక చనువారుఁ, దిరిగి యేసెడువారున్.

23


వ.

ఇవ్విధంబున నవ్వసుధేశు లందఱుం దమ తమ కన్నగతిం బోవ నట పోవు
హంసం జూచి రాచతనంబునకు నీచత రాకుండ నింతట నా పౌరుషంబు
నెఱపవలయు నని సమదసామజగమనంబున సతి గడవం బోయి విక్రమాభి
రాముండగు పావకలోముండు.

24


సీ.

ధనువు క్రిందటికొమ్ము ధరణిపై మోపి, మీఁ
       దటికొమ్ము వామహస్తమునఁ బట్టి,
తత్తఱపడక తదందండమధ్యంబు ద
       క్షిణజానుకరములఁ జేసి యెత్తి,
యససవ్యకరమున నయ్యెక్కుఁ గదియించి,
       ప్రియమున నారి సారించి చూచి,
ధరణియు నభము దిక్తటములు నొక్కటం
       దల్లడపడ గుణధ్వని యొనర్చి,


తే.

శరము సంధించి దృష్టి లక్ష్యమునఁ గూర్చి
సీలఁ బుచ్చినలీల నక్కీలు ప్రిదుల
నేసి, నేలపైఁ బడకుండ నెయిది పట్టి
వక్షమునఁ దాల్చెఁ బదకంబు నాక్షణంబ.

25


క.

ఆ లీలా హంసమునకు
గీ లప్పదకంబ యనఁగ క్షితితలమునకున్
వ్రాలె నది యతని దృగ్రుచి
జాలంబున కింపుఁ బెంపు చాతుర్యగతిన్.

26


ఉ.

అంబరవీథి [2]నాడు ఝషయంత్రము నేసిన క్రీడిఁ దొల్లి మో
దం బలర న్వరించు ద్రుపదక్షితిపాత్మజభంగిఁ బ్రీతిపూ
ర్వంబున నగ్నిలోమజనవల్లభునిం దగఁ జేరి, వాని కం
ఠంబున వైచెఁ గాంతినిబిడం బగు హారము రాజపుత్రియున్.

27

తే.

అంత నక్కుంభి తన యాత్మ వింత లేసి
రోజూ లిట్లైరి తన తరమా జయంబు
గొనఁగ వ్యర్థుఁడై పోయెఁ గా కనుచుఁ గొంత
తడవునకు వచ్చె నా రాజతనయు కడకు.

28


ఉ.

వచ్చి కృతఘ్నుఁ డప్డు విడు వాలికకన్నులు ముద్దుమోము నే
యొచ్చెము లేని దేహలతయుం గల కోమలిఁ జూచి లోలుఁడై
యెచ్చట మోసపుత్తు నొకొ యీ నృపపుత్రుని నెప్పు డొక్కొ యే
నిచ్చపలాక్షి నెత్తుకొని యేఁగుదు నా కిరవైన చోటికిన్.

29


క.

అని యూహించుచు మిథ్యా
వినయంబును. రిత్తనగవు, వెడమ్రొక్కుల పె
ల్లును, డక్కరిమాటల తఱ
చును, నాఱడి సంభ్రమంబుఁ జూపె సఖునకున్.

30


చ.

అతఁ డవి కృత్రిమంబు లని యాత్మ నెఱుంగక , నిత్యసౌహృద
స్థితిఁ జెలికానిఁ జూచి 'యిటు చేకుఱె నాకు ననర్ఘ్యరత్నశో
భిత మగు నవ్విభూషణము, బ్రేమరసోదయహేతువైన యీ
యతివయు' నంచుఁ జెప్పె దరహాస మెలర్పఁగ నెమ్మొగంబునన్.

31


క.

చెప్పిన విని 'దేవా! నీ
కిప్పుడు రాఁ బ్రాప్తమైన యివి యెవ్వనికిం
దప్పింప వశమె! బ్రాతిగఁ
జెప్పుదు నినుఁగూర్చి యేమి చిత్రము చెపుమా!'

32


అని కొనియాడి యప్పు డితఁ దాడట నప్పురి కేగె నేని త
జ్జనపతియుం బ్రధానులును సర్వజనంబులు వీనియూరుఁ బే
రు నెఱఁగిపోదు రప్పు డొకరుండును గైకొనకుండు నన్ను మ
న్మనమున నున్న యిప్పని యొనర్చుటకు న్మఱి సందు లేదగున్.

33


క.

అటు గాన యా కుమారునిఁ
గుటిలాలకఁ జొప్పు దప్పఁ గొనిపోవక యుం
డుట కార్యము గాదనుచుం
జొట జొటఁ గన్నీరు దొరుఁగఁ జుట్టమ పోలెన్.

34

ఉ.

పావకలోముఁ జూచి 'పెనుఁబాబు మొగంబునఁ దోపఁ గుంభి శో
కావిలచిత్తునట్ల మెలపారఁగ నిట్లను 'రాడవారలుం
దేవులు నిందు నీవు చనుదెంచు టెఱుంగరు, చెప్పి రాము, నే
పోవక యున్న నెవ్వగలఁ బొందరె నీ పొడగానకుండుటన్.

35


క.

కొలఁదిపడదు పెండిలి వే
డ్కలతో నిట్లుంటిమేని కడుఁ దడ వౌనున్,
వెలికి వెలియఁ బోద' మనుచుఁ
దొలఁగఁగఁ గొనిపోయె దంపతులఁ బెడత్రోవన్.

36


క.

పులు లెలుఁగు లడవియేనుఁగు
లలరెడు సింహంబు లాది యగు మృగములచేఁ
దలచూపరాని విపినం
బుల ని ట్లడ్డంబు గాఁడి పోవగ నొకచోన్.

37


చ.

అతివకు నీరువట్టయిన నంతరభేదకుఁ డౌటఁ గుంభి ద
త్సతి నొక మ్రానినీడ నిడి, శైత్యజలంబులు దెత్త మంచు భూ
పతిసుతు నొక్క దిక్కునకుఁ బంపుచుఁ దా నొక దిక్కు వోయె, నా
కృతకమతంబు లెల్లఁ బరికింపఁగ నెన్నటి కింకఁ దక్కెఁ బో.

38


ఆ.

రాచకొడుకు తిరిగి రాకుండమున్ను నా
నేర్పు మెఱయ వలయు నీళ్ళపట్టు
దయ్య మెఱుఁగు ననుచుఁ దా నెందుఁ బోవక
మగిడి వచ్చి కుంభి మగువతోడ.

39


ఉ.

అల్లదె కండె యొక్క జలజాకర, మేమియు దవ్వు లేదు, నీ
వల్లభుఁ డెంతప్రొద్దునకు వచ్చునొ, చెట్టులఁ జిక్కుఁగాని నీ
యుల్లము రాఁ జరించుటకు నోపెడు నంతటివాఁడు గాఁడు నీ
వల్లన రమ్ము నా వెనుక నచ్చటఁ జూపెదఁ బెక్కు తోయముల్.

40


మ.

అని గర్భోక్తులు(?) పల్కి యా తరుణి నుగ్రారణ్యమార్గంబునం
గొనిపోనంగ 'నదేమి? కుంభి! యిట నాకుం ద్రావ నీ రెద్ది? యా
యన యే పోకలఁ బోయెనో! తడవ వే లన్నా! కడుం దూర మి
ట్టు ననుం దెచ్చితి కల్లఁ జేసి' తనుచున్ డోలాయమానాకృతిన్.

41

క.

అమ్ముగ్ధ సొలసి పల్కిన
'నమ్మక నీ రేమి బ్రాతి యటు నా ల్గడుగుల్
రమ్మా డస్సితి ననక ధ్రు
వమ్ముగ నీ మనసు పట్టువాఁడ లతాంగీ!'

42


క.

అని కైదువుఁ బరిఁ జించుచు ?
ననువరి గద రన్న కుంభి యని నీతిజ్ఞుల్
విని మెచ్చవలదె పదకముఁ
గొనియె నతఁడు, నాకు దీనిఁ గొను టనుచితమే.

43


తే.

నాకు బాలకి, రెండును నాఁచికొనిన
నేల పోనిత్తు? నెట్లైనఁ బాలు గొందుఁ
గాక, యని మల్ల చఱచుచుఁ గనరు ముట్టఁ
బలుక నక్కుంభిఁ జూచి యా జలజనయన.

44


ఉ.

గమ్మన కన్నునీ రొలుకఁగా నపు డిట్లనుఁ 'బాపకర్ముఁడా!
నమ్మితిఁ గాక నీ విటులు న న్నడకించుట యె ట్లెఱుంగుదుం
బొమ్మని యాతనిం దొలఁగఁ బుచ్చితి నీళులపేరు చెప్పి, నన్
బిమ్మటఁ దెచ్చి కాఱడవిఁ బెట్టితి నీ కిది మిత్రధర్మమే?'

45


మ.

అని శోకాకులచిత్త యై పలుకఁగా నక్కుంభి 'యే లమ్మ! న
వ్విన నీ వీక్రియ నెగ్గు పట్టెదవు? నే విశ్వాసిఁ జుమ్మమ్మ! నీ
వనుమానింపక వేగ ర' మ్మనుచు మిథ్యాలాపము ల్పల్కఁగాఁ
గని యత్యుగ్రపురక్కసుం డొకఁడు వీఁకన్ వచ్చె నచ్చోటికిన్.

46


ఉ.

వచ్చి యనర్గళస్ఫురితవైర మెలర్పఁగఁ 'బోకు పోకు నీ
వెచ్చటి కేఁగె దింక నిను నిప్పుడ యుక్కడఁగింతు' నంచు వా
పుచ్చి యదల్చుచున్ గనపభూజమునం దనుజుండు వేయఁగాఁ
జొచ్చిన గుంభి దా మరలి చూడక పాఱె మహారయంబునన్.

47


వ.

అట్టు పాఱిన దైత్యుం డత్తెఱవ నెత్తికొని నభశ్చరుండై యరిగె.

48


ఉ.

రావణుబారిఁ జిక్కిన ధరాసుతచాడ్పున భీతి నొంది వా
పోవుచుఁ బోవుచు న్నృపతిపుత్రునకుం దన పోక చెప్ప భూ

దేవికి లంచ మిచ్చినగతి న్సురవైరి యెఱుంగకుండ రా
జీవదళాక్షి యప్డు వయిచెం దన మైతొడవుల్ గ్రమంబునన్.

49


సీ.

అంతఁ బావకలోముఁ డట పోయి నిర్మలో
       దకపూర్ణమై యొప్పు నొక మహాత
టాకంబుఁ గని తన డప్పి యంతయుఁ బోవ
       జలపాన మొనరించి సరభసమున
నచ్ఛిద్రసరసీరుహచ్ఛదంబునఁ గొంత
       యుదకంబు నుంచి యయ్యువిద కనుచుఁ
గొనివచ్చి మున్ను డా నునిచి పోయినపోటఁ
       దరళాక్షిఁ గానక తల్లడించి


ఆ.

దెసలు కలయఁ జూచి తిరిగి వచ్చియు లతా
కుజము లరసి యెల్ల గుహలయందు
వెదకి యోలములు వివేకించి చఱులు భా
వించి గొల్లములకుఁ బంచె దృష్టి.

50


క.

ఎందును గానక తద్దయు
వందురి యెలుఁ గెత్తి పిలిచి 'వనజముఖీ! నీ
వెందున్నదానవే? యీ
చందంబునఁ బిల్వఁ బల్కఁ జనదే నీకున్.

51


చ.

ఉదకంబు ల్వెసఁ దేక యేఁ దడవుగా నున్నంతఁ గోపించి యొ
క్కదెసం దాఁగితొ? నాదు చిత్త మరయంగా నీరముల్ దూఱితో?
పొదలం బువ్వులు గోయం బోయితొ? మృగంబుల్ సంచరింపంగఁ జూ
చి దిగు ల్చొచ్చి తొలంగఁబాఱితొ? ననుం జింతింపవేలే మదిన్?'

52


వ.

అని యనేక ప్రకారంబులం బ్రలాపించి, తన యరణ్యరోదనంబునకు నొండు
గతి లేకునికింజేసి తన్నుం దా నుపశమించుకొని నా చెలికాఁడును రాఁడయ్యె
నట పోయి వానిం గూర్చుకొని కార్యాలోచనంబు సేయవలె నని యూహించి
యా రాజనందనుండు.

53


చ.

పడతుకఁ గానలే కునికిఁ బాయని నెవ్వగఁజేసి యెంతయున్
సుడివడి తాఁకుచున్ దగులుచున్ గడుదూరములందుఁ జొచ్చి పో

యెడునెడఁ గుంభి వచ్చె, నొడ తెల్లఁ జెమర్పఁగ ముల్లుకంపలం
బడి తలచీర చీరఁబడి పాఱిన భావము దప్పకుండఁగన్.

54


ఉ.

వచ్చిన 'నెంత ద వ్వరిగి వచ్చెదొ, నీళులు గానవో కదే,
యొచ్చెల! నిన్నుఁ జూచి వగ నొందెడుఁ జిత్తము త్రావు' మంచుఁ దాఁ
దెచ్చిన నీళ్ళు వానికి నతిత్వరితంబునఁ బోసి 'చూచితో
యెచ్చటి కేఁగెనో యబల యేఁ బొడగానను దొంటి చక్కటిన్.'

55


క.

అని గద్గదకంఠంబున
వినిపించిన గుంభి దాను విక విక నగుచుం
'గనుతిరుగలిగా కా సతి
మన పెట్టినచోట లేక మఱి యెం దరిగెన్.

56


ఉ.

కందువ దప్పినాఁడ వతికాముకభావము నీకుఁ గల్మి నే
పొందు నెఱుంగ నైతి వనభూములఁ గామిను లొంటిఁ బోదురే
మందవివేక! నీవు పదమా, వెడమాటలు మాను నీకుఁ ద
త్సుందరిఁ దొంటిచోన తగఁ జూపెదఁ బాపెద నీ మనోవ్యధన్.'

57


క.

అని యతని బ్రమయ నడపుచు
మును దత్సతి నిల్పి చనిన భూజముకడకుం
గొనిపోవ నచట నది లే
కునికిఁ బున శ్శోకవహ్ని నుల్ల మెరియఁగన్.

58


ఉ.

'ఓ చెలికాఁడ! నీవు నను నూరక తెచ్చితి గాక మున్ను నా
చూచిన చోటు గాదె యిది, చూడఁగఁ జాలక యా లతాంగి బోఁ
ద్రోచెఁ జుమీ విధాత' యని తూలెడు పావకలోముఁ జూచి యా
నీచు మనంబులో నగుచు నిక్కమ యాప్తుఁడపోలె ని ట్లనున్.

59


ఆ.

'ఇంక వగవ నేల యిది నానిమిత్తమై
వచ్చినట్టి దుర్వ్యవస్థ గాదె!
నెలఁత వద్ద నిన్ను నిలిపి నీళ్ళకు నేను
బోని తప్పు గలిగె, భూపతనయ!

60


ఆ.

చిత్తగింపు మబల చేతప్పి పోయిన
యపుడె పోయెఁ గాక యడిచి పడిన

నెచటనుండి వచ్చు నీ గతోదకసేతు
వులఁ బ్రయోజనంబు గలదె తండ్రి!'

61


చ.

అనిన నతండు నీకు నిటు లాడుట యుక్తమె కుంభి! నాదు నె
మ్మనమున మర్త్యులందును నమర్త్యులయందును నిట్టి కాంత లే
దని తలపోతు; నట్టి సుభగాకృతి యే మఱవంగ నేర్తునే
చని పరికింపఁగావలయు శైలగుహాగహనాంతరంబులన్.'

62


క.

అని యతఁడు వెదకఁ దొడఁగినఁ
గని కుంభియు నంత నంతఁ గాళ్ళీడ్చుచుఁ బి
ల్చినఁ బది యెలుఁగుల కొకమరి
మునుకుచు వలసియును వల్లములు సనుదెంచున్.

63


క.

తనచేత నృపతిసుతుఁ డెఱిఁ
గినఁ బై వచ్చు నని పుల్లగిలిపోఁ జూచున్,
వనసత్త్వము లత్యుగ్రం
బున మెదలఁగఁ జూచి పాఱిపోవను వెఱచున్.

64


ఆ.

అతనిఁ దిరిగి చూచి యకట నా వెనువెంట
నితఁడు తిరిగి తిరిగి యెంత డస్సె
ననుచు నిల్చి చూచుకొనుచుఁ బావకలోముఁ
డతివ వెదకుచుండె నడవులందు.

65


వ.

ఇ ట్లక్కుమారవరేణ్యుం డరణ్యమధ్యంబునం బరిభ్రమించుచు నొక్కయెడ
నయ్యింతి యంతకుమున్న దిగవైచి పోయిన విమలాభరణంబు లవ్వనలక్ష్మికిం
గనకకుసుమోపహారంబు గావించిన చందంబున నందంబై చాలుపడి యుండ
నొండొండ పుచ్చుకొని తన మనంబున నిట్లని విత్కరించు.

66


క.

శార్దూలాది మృగంబులు
మర్దించిన విచట రక్తమాత్రము వలదే!
దుర్గముఁడగు దనుజుఁ డొకఁడు
నిర్దయుఁడై యెత్తికొని చనియెఁ గావలయున్.

67


క.

అని యాందోళింపుచు న
వ్వినుతాభరణములచొప్పు విడువక చనుచుం

గనియె నెదురుకట్టుల నోక
ఘనగండశిలానిబద్ధగహ్వర మొకచోన్.

68


మ.

కని యా గుండు దొలంగఁద్రోవఁగ నశక్యంబైన నుద్వక్త్రుఁడై
కనుఁగొంచుండఁగ నా నగేంద్రముపయిం గప్పారి ధూమంబు దోఁ
చిన నా చక్కటి కెక్కి చూచుడును దచ్ఛిద్రంబులో దవ్వుల
వినిచెన్ మానవభాషణంబులు గడున్ విస్పష్టమై వీనులన్.

69


క.

వివిచినఁ బావకలోముఁడు
మనమున నాశ్చర్య మంది మనుజులొ పాతా
ళనివాసులొ చూడవలయు
నవి తద్గమనేచ్ఛఁ ద్రోవ నరుగఁగ నొకచోన్.

70


ఉ.

సన్నపుగండి యొక్కటి రసాతలమార్గము పోలె నిమ్నమై
యున్న నతండు కుంచి వెలినుండఁగఁ చా నసహాయశూరుఁడై
మిన్నక యందుఁ జొచ్చి చని మేడలఁ జారు నికేతనంబులం
జెన్నగు నొక్కి ప్రోలు గని చేరఁగఁ దోవఁగ నందులోపలన్.

71


క.

సరిలేని యంజి, సొగటా,
లరుదగు జూదంబు, నెత్త, మచ్చనగండ్లున్
దిన మగు వోమనగుంటలు
సరసత మెయి నాడుచున్న సతులం గనియెన్.

72


మ.

కని యా నిష్పురుషంపుఁజోట నిటు నీ కాంతాజనంబుల్ సుఖం
బున నే చింతయు లేక వేడ్కలు మదిం బొంగార ని ట్లాడుచు
న్ననిమిత్తం బిది యేమి యొక్కొ యనుచున్ భావించుచున్నంత నా
తని యేతెంచుట బిట్టుబిళ్ళు గని కాంత ల్విస్మయాక్రాంతలై.

73


క.

లేచి యెదురేగి లోచన
రోచు లలర నతనితోఁ దరుణు లిట్లని రే
లా చనుదెంచితి వుగ్రని
శాచరుఁ డొకఁ డిచట మనికి చర్చింప నొకో!

74


క.

నిన్న నొక తరుణి నిచటికి
నిన్నీచుఁడు దెచ్చి తొలఁగ విడి నెమ్మదితో

నున్నాఁడు నిదుర వోవుచుఁ
గన్ను దెఱవఁ డాఱునెలలు గడచన కున్నన్.

75


తే.

కలదు వీనికి నొక చమత్కార మనఘ!
యితర పురుషుఁ డిచ్చోటికి నేఁగుదెంచె
నేని యొక జాములోనన మాను నిదుర
వాఁడు వధియించు నెంతటివాని నైన.

76


క.

కావునఁ బదివే లైనను
నీ వీ యెడఁ దడవుగాఁగ నిలువవలదు పొ
మ్మా' వెస ననవుడు ని ట్లనుఁ
బావకలోముండు కార్యబంధురుఁ డగుచున్.

77


ఉ.

'చెచ్చెర నాకు నీ వెఱపు చెప్పకుఁ డేను స్వయంవరంబునం
దెచ్చిన కన్య నీ యసుర దెచ్చె వెస న్ననుఁ గానకుండ! నే
వచ్చితిఁ దన్నిమిత్తమయి, వాని వధింపక రిత్త వోవ; మీ
రిచ్చట నిట్టు లుండఁ గత మెయ్యది చెప్పుఁడ నాకు' నావుడున్.

78


ఉ.

ఖేచరుఁడై నిశాచరుఁడు కేవలసాహసుఁ డొంటి వచ్చి మా
యాచణభావ మేర్పడఁ ద్రియామల నిద్రిత లైన రాజక
న్యాచయముం గ్రమక్రమమునం గొనివచ్చి దురాత్ముఁ డిందులో
వైచిన వాఁడు తా నటె వివాహము గాఁగలఁడట్టె మీఁదటన్.'

79


క.

అని తమ తెఱఁగంతయుఁ జె
ప్పి 'నరోత్తమ! యిందు వచ్చి పెక్కండ్రు నృపుల్
సని రిట మున్న యమాలయ
మున కి ద్దానవునిచేత బుద్ధిరహితులై.

80


వ.

కావున నీ యసురాధముండు లేవకమున్న నీ వెందేని యరిగి ప్రాణంబులు
రక్షించుకొనుట ల గ్గట్లు కొక యోపుదేని వీని వధించి నిన్నును మమ్మును
రక్కసుబారిఁ బడకుండఁ గాపాడునది' యనిన న ప్పావకలోముండు తీవ్ర
ధాముండునుంబోలెఁ బ్రతాపదీప్తుం డగుచు నచ్చోటు వాసి వచ్చి కుంభకర్ణుండు
వోలే నిద్రించియున్న యసురకు దీర్ఘనిద్ర గావింపం బూని కదిసి యి ట్లున్న
యునికిన వధియించుట పౌరుషంబు గాదని యమదండంబువోని యంఘ్రిదం

డంబున వాని యెదురుఱొమ్ము దన్నినఁ దన్ను మైపఱచి మేల్కని పినపాటిగా
నల్ల నీల్గుచు వాఁ డవ్వలిప్రక్కయైనఁ జూచి కోపంబునఁ జాపంబు విసరి
వీఁపు వ్రేసిన నులికిపడి పెడచేతం గన్ను లుసిమికొనుచు లేచి కూర్చుండి
తప్పక చూచి యోరీ! నీ వే యూరివాఁడ? విచటి కెట్లు వచ్చితి? గుహాగేహ
గోళంబున విశ్రమించియున్న సింహంబుతోడఁ జెనకు సారంగంబుభంగి నా
నిదుర చెఱిచితి వింక నెందుఁ జొచ్చెద?' వనుచు దంష్ట్రాధరోష్ఠదష్టుం
డగుచు జంకించిన నతం డేమియు శంకింపక 'నీ వెడబింకంబు లేల? నిశా
వేళయందుఁ గొంద ఱిందుముఖులం దెచ్చి ముచ్చుఁదనంబున నిచ్చో ముచ్చ
మునింగియున్న నిన్ను మెయిమెయి నుండనిత్తునే చెండివైతుంగా' కని
యధికరోషంబున నా దోషకారిం గడకాలు పట్టి ఖేచరప్రీతిగా బడిసె వైచు
చొప్పునం ద్రిప్పి చట్టుమీఁదఁ జొనిపి ముద్దవైచునట్లు చిదురుపలై చెదరునట్లుగా
నేలతో వైచి యఖర్వగర్వంబున నప్పర్వతంబు ప్రతిధ్వానభీకరఘోరం బగు
నట్లుగాఁ బేర్చి యార్చిన.

81


క.

రక్కసుఁ డీ బాలునిచేఁ
జిక్కెర మా కోర్కి నేఁడు సిద్ధించెర మా
మ్రొక్కెడు మ్రొక్కులు వేల్పుల
కెక్కెర యిన్నాళ్ళ కనుచు నింతులు ప్రీతిన్.

82


ఉ.

గ్రక్కున నేఁగుదెంచి తనుఁ గాంచిన నందఱ నాదరించి యా
చక్కటి మున్ను దా నిడిన చాపము నస్త్రసముచ్చయంబు నిం
పెక్కఁగఁ జేరి పుచ్చుకొని యెప్పు డొకో పదిఁ గాంతు నంచు న
ల్దిక్కులు చూచు నయ్యనుమతిం గవి పావకలోముఁ డి ట్లనున్.

83


చ.

'తనులత వాడె, మాసె ముఖదర్పణ, మొప్పగు మీననేత్రముల్
ఘనవిరహాశ్రుపూరములఁ గాంతివిహీనత నొందె, నూర్పు గా
డ్పును వెదచల్లుచున్నది, కఠోరమనస్కుఁడు బ్రహ్మ, వాని నే
మని యిట దూఱుఁవాఁడ వినుమా! యిటు సేయుట మానినీమణీ!

84


క.

అమృతమయుం డగు చంద్రుని
యమలతనువు నాఁడు నాఁటి కఱుగం బెరుగం

గమలఁగఁ జేసిన బ్రహ్మకు
రమణీ! [3]ని న్నిట్లు సేయ రాకుండెడునే!'

85


వ.

అని యుపలాలించి తనతోడనె కూడ మంగళస్నానంబు సేయించి విమలాంబ
రాభరణశోభితం గావించి గాఢాలింగనంబున నయ్యంగన నపగతక్లేశం జేసి.

86


చ.

సరకునిఁ జంపి వానిసదనంబున నున్న నృపాలకన్యలం
దిరముగఁ దెచ్చు కృష్ణునిగతిన్ శిబిలోముడు దక్సతీతతిన్
వరుస [4]వెలర్ప ముంద రజవక్షునికూఁతురు నిర్గమించినం
దరమునఁ గాచియుండిన ప్రధానిసుతుండు మనోగతంబునన్.

87


మ.

ఒకభంగిన్ నృపపుత్రుఁ గన్మొఱఁగి యే నుగ్రాటవుల్ చొచ్చి యీ
సుకుమారిం గొనిపోవఁగా దనుజుఁ డచ్చో నన్నుఁ బోఁదోలి యు
త్సుకరీతిం గొనిపోయె దీనిఁ, దుది మత్పూర్వార్జితోదాత్తస
త్సుకృతం బీక్రియఁ దెచ్చి యిచ్చెఁ దరుణీచూడామణిం గ్రమ్మఱన్.

88


క.

అనుచుఁ దదీయద్వారం
బునఁ బెనుగుండొకటి ద్రోచి పూర్ణేందుముఖిం
గొనిపోయె గుంభి యపు డ
వ్వనితారత్నంబు శోకవహ్ని నెరియుచున్.

89


ఉ.

ఈ మనుజాధముండు నను నెయ్యెడ కీడ్చునొ, వీని గెల్వ నా
కేమి మతంబు గల్గు నని యిచ్చఁ దలంచి యళీకహాసముల్
మోమునఁ దోఁప నిట్లనియె 'ముద్దియ చేకుఱె నీదుకోర్కి ర
మ్మా! మన మెట్టులున్నఁ బెఱమర్త్యు లేఱుంగరు చన్నసన్నయున్.

90


ఉ.

కావున నీవు మజ్జనకుఁ గాంచి స్వయంవర లద్ధి యయ్యె నా
కీవనజాక్షి, యంచు జనులెల్ల నెఱుంగఁగ నన్నుఁ జూపి యా
భూవిభు మన్నన ల్గనుట బుద్ధియు [5]మ్రుచ్చునుబోలె నొక్కెడన్
బోవుట మేలొ, మత్పురికిఁ బోదము రమ్ము వికార మేటికిన్.

91


వ.

అని వెడ్డు పెట్టిన నతండు బేల్పడి యట్లు చేసె, నయ్యజవక్షుండు మహాహర్ష
చక్షుం డగుచు వానికి నున్నతాసనంబు పెట్టించి సభాసదులం గలయ నవలో
కించి యి ట్లనియె.

92

ఉ.

'వాలుమగ ల్మహామకుటవర్ధను లాఢ్యులు శస్త్రహస్తు ల
వ్వేళ నొకండు నాగగనవీథిని బాఱెడు హంసయక్కునన్
వ్రేలెడు రత్నభూషణము వ్రేలను జూపఁగలేక పాసి రీ
లాలితకీర్తి నిత్యశుభలక్షణుఁ డొక్కఁడుదక్క నందఱున్.'

93


వ.

అని.

94


ఉ.

వానికి నవ్వధూమణి వివాహము సేయ నుపక్రమింప, న
మ్మానిని తండ్రిఁ జూచి 'వినుమా! యొక విన్నప మప్పు డెవ్వరుం
బూని యొనర్స లేనిపని బోరనఁ దా నొనరించె మద్వరుం
డైనయతండు వేఱ , యితఁ డాతనిఁ గొల్చినబంటు భూవరా!'

95


క.

అని యప్పావకలోముఁడు
దనుఁ జేపట్టినది మొదలు దా నచటికి వ
చ్చినయది తుదియుంగా దొర
కొని యన్నియుఁ జెప్పెఁ బూస గ్రుచ్చినభంగిన్.

96


ఉ.

చెప్పినఁ గూఁతుమాటలకుఁ జిత్తము ఘూర్ణిలఁ గుంభిదిక్కు దాఁ
దప్పక చూచె భూపతి; యతండు కరంబులు మోడ్చిఁ 'దేవ ! యేఁ
జెప్పెద విన్ము, నీతనయ చెప్పినమాటలజాడ యంతయుం
దప్పదు; నన్నుఁ గాదనుటఁ దా వినఁబోలదుగాని యందులోన్.

97


క.

మొదలం దను నేఁ బడసితిఁ
దుదిఁ దనుఁ గొనిపోయినట్టి దుష్టాసురునిం
గదనమున నేనె గెల్చితి
సుదతి బ్రమసెఁగాని రాక్షసుల మాయలచేన్.

98


చ.

అది మది నమ్మ వే నచటి కల్పులు వోవఁగలేరు, సైన్యసం
పద మెఱయంగ నావెనుకఁ బార్థివశేఖర! నీవ రమ్ము, చూ
పెదఁ గొనిపోయి యానేలవు, భీషణమూర్తులు దైత్యు లాజికిం
గదిసిరయేని నాకుఁ బని గాదు సుమీ! మునుముట్టఁ జెప్పితిన్.


ఆ.

సతులు ముగ్ధ లైన జననాథ! మీరును
ముగ్ధులయ్య! యెట్టి మూఢుఁ డైనఁ

దగిలి యొడ్ల చేఁత తనచేతగాఁ జెప్పు
నయ్య! రిత్త సందియంబు లేల?

100


సీ.

అనిన నయ్యజవక్షుఁ డనుమతిఁ జూచి 'యీ
       యనృతంబు లేమిగా ననియె?' దనియె;
సబల 'యెయ్యది దృష్ట' మనియెఁ దజ్జనకుండు
       'కల్పితహంసికాగళసమర్పి
తాకల్ప మే మయ్యె?' ననియెఁ దత్సుత; రాజు
       [6]దివిరి క్రమ్మఱఁ గుంభిదిక్కు చూచె,
మొగమెత్తి కొండొక నగియె నాతఁడు
       'దీని కేమి మోసముగదా భూమియందు


ఆ.

నిట్టిపనులు పుట్టునే యుండెనేఁ జూపఁ
గాదె!' యనియె నృపతి; కల్లకోపఁ
బదక మాజి నెచటఁ బడియెనో! వెలఁ జెప్పుఁ
డనుచు నిచ్చువాఁడ ననియెఁ గుంభి.

101


వ.

అంత నయ్యనుమతి వీని యసత్యవచనంబులకుం గలుషించి, వీనివృత్తం
బన్యు లెఱుంగరు, సత్యంబు కాలంబ తేటపఱచు, వీని నొల్ల, నాపతి వచ్చు
నంతకు శివారాధనతాత్పర్యంబునం గాలంటు పుచ్చెద నని వ్రతంబు
పూనియుండె.

102


మ.

అజవక్షుం డిది పోలుఁ బోలదని కార్యాకార్యనిష్పత్తికిన్
నిజ మూహింప నశక్తుఁడై యపుడు వానిం జింప నొంపం బరి
త్యజియింప న్మది నోడి తద్దయు నివాతంబైనచో సద్భట
వ్రజముం దోయము చేసి యున్న సుఖియై వర్తింపుచుండెం బురిన్.

103


వ.

అంత నప్పావకలోముండు.

104


క.

తల యెత్తి చూచి తన తొ
య్యలిఁ గానక యెదుర నడ్డమైయున్న మహా

శిలఁ గని మది నద్భుతసం
చలములు దలకొనఁగ బహువిచారవివశుఁడై.

105


చ.

'దనుజునివంకవాఁ డొకఁడు దాఁ బగ వీఁగఁ దలంచి పొంచి యేఁ
జనుపథ మిట్లు చేసెనొకొ, చంపెనొకో గుణశాలిఁ గుంభి, నే
మనఁగల దాసుమిత్రసుతుఁ డన్నపిఱుందఁ జరించునట్లు నా
వెనుకను వచ్చుచుండుఁ దుది వీఁడును నేమయిపోయేనో కదే!'

106


వ.

అని యతని నుద్దేశించి మఱియును.

107


చ.

కవలునుబోలె నొప్పుచును గౌతుకమందఁగ నీస్వయంవరో
త్సవమను పేరు చెప్పి కడు దవ్వుగఁ దెచ్చె కృపావిహీనుఁడై
తివిరి దురంతదుర్దశలఁ దెచ్చె విరించి భవద్వియోగసం
భవపరితాప మేమిగతిఁ బాయునోకో యవి విహ్వలింపఁగన్.

108


ఉ.

ఆతనియార్తిఁ జూచి మనుజాధిపనందన లందఱు న్మనః
ప్రీతిగఁ దద్గుణావళులు పేర్కొని యి ట్లని పల్కి 'రేల యీ
రీతి నధీరున ట్లవధరించెదు, తాల్మి వహించి లెమ్ము నీ
యాతత భాగ్యసంపదకు నడ్డము గల్గునె యెందు నెన్నఁడున్.

109


క.

ఆపదలు గాఁపులుండవు,
చూపులకు [7]గులాద్రులట్లు చుట్టుకొనుఁ, దుదిన్
రూ పేది విరిసిపోవు మ
హాపవనాహతపయోధరావలి భంగిన్.

110


వ.

కావున నిశ్చింతుఁడవై మమ్మింతవట్టువారిని నీవారినకాఁ బరిపాలింపు' మనిన
నీవేళ కిదియ కార్యంబనుచు నతం డంద యుండె, నంత నొక్కనాఁ డొక
కిరాతుండు వేఁటమెయి వచ్చి యచ్చేరువ మెలంగుచుండి మున్ను కుంభి
యనుమతిం బట్టి బలాత్కారంబునఁ దిగిచి తోఁకొనిపోవునప్పు డప్పడంతి
కరంబుననుండి యూడిపడి తత్ప్రాంతం బంతయుం దనమయంబకాఁ బ్రజ్వ
లించు నొక్క యనర్ఘరత్నంబు గని పుచ్చుకొని యాశాలబ్ధుండై మఱియు
నేమేమి విశేషంబులు గందునో యని [8]పరికించువాఁ డెదుర నగ్గుండు గని

యెట్టకేలకు దిరుగంద్రోచి యామార్గంబున బిలంబు సొచ్చి చని ధనుర్ధరుం
డగు పావకలోముం గని వెఱచి పఱవందొడంగిన పావకలోముండు.

111


చ.

కనుఁగొని వానిభీతి యుడుగ న్మృదురీతి నెలుంగు సూపి గ్ర
క్కునఁ గదయంగ వచ్చి 'యటకుం జనుదేరఁగ నేమి కారణం?'
బనవుడు నక్కిరాతుఁడు యథార్థము చెప్పుచుఁ జేరి మ్రొక్కి, త
ద్ఘనమణి వాని కీయఁ దన కామినిరత్నముగా నెఱుంగుచున్.

112


చ.

పొరిఁబొరి నొత్తుఁ గన్నులఁ, గపోలయుగంబున నప్పళించుఁ జె
చ్చెర, నధరప్రయుక్తముగఁ జేయు, గళంబునఁ గూర్చుఁ గోర్కిచే,
నురమున మన్చుఁ, దుడ్చుఁ గడు నొప్ప మనోభవభూతశాంతికై
యరుదుగ రక్షపూస యఖిలాంగములం దిగమోపుచాడ్పునన్.

113


క.

'ఓరత్నమ! నాఁ డాతరు
ణీరత్నము నన్నుఁ బాసి వీ విచటను నే
పారఁగ నుండితివే మన
మారాజీవాక్షి గందుమా? యింక' ననున్.

114


చ.

అని తన నాతిపోకకు నిరంతరచింత మునింగియు న్మనం
బునకును ధైర్యముంచి పువుఁబోఁడుల కందఱకుం దగం బ్రసా
దనము దగంగ నిచ్చి వనితాసహితుండయి తత్పురస్పరం
బునఁ దన పట్టణంబునకుఁ బోయి ప్రణామ మొనర్చెఁ దండ్రికిన్.

115


వ.

ఇట్లు ప్రణామ మొనర్చిన కుమారుం గౌఁగిలించుకొని కరుణారసమిశ్రంబులగు
నశ్రులు కన్నులఁ దొఱుంగ గద్గదకంఠుం డగుచు నతని కి ట్లనియె.

116


క.

'ఇన్నాళ్ళు నిన్నుఁ గానక
కన్నులు గల్గియును లేనిగతి నుండితి నే
నన్నా! [9]నన్నిటు సేయఁగఁ
జన్నే నీ యట్టి సుగుణసంపన్నునకున్?


క.

పోయెడువాఁడవు తదభి
ప్రాయ మెఱుఁగఁ జెప్పి పోవరాదే నీకై

రేయును బగలును జింతా
తోయంబులు వెల్లివిరియఁ దోఁగితి పుత్రా!

118


చ.

అది యటులుండె దైవముదయం జనుదెంచితి చాలు నింక, నా
బ్రదుకు ఫలించెఁ; గుంభి యటరాఁ డెట పోయెఁ దనూజ! యప్సర
సుదతులఁబోలు వీ రెచటి సుందరు? లిచ్చటి కెట్లు వచ్చి రే
మిదయను? జెప్పు' మన్నఁ దమ మిత్రునిపోకకు వెచ్చనూర్చుచున్.

119


క.

అనుమతి ప్రసంగ మెయ్యది
యును దడవక గుహకుఁ జనుటయును నచ్చో వీ
వనితల గనుటయుఁ గుంభిని
ఘనగుహవాకిటను నిలువఁగా నుంచుటయున్.

120


ఉ.

చెప్పి 'నృపాల! యే నటులు చేసి గుహోద్గమనంబు సేయుచో
నప్పుడు మత్పదంబునకు నడ్డముగాఁ బెనుగుండు ద్రోచి యే
చొప్పుననొక్కొ, యెవ్వఁడొకొ చొప్పడ నేమివిధంబొ యయ్యయో
చెప్పఁగఁ జెట్టలే నచటఁ జిక్కితిఁ గుంభియు నెందుఁ బోయెనో!

121


క.

అచ్చోటఁ గొన్ని దివసము
లిచ్చెలువలు నేను నుండ నీయర్జునకుం
డచ్చటికి వచ్చి వెలువడఁ
దెచ్చిన వచ్చితిమి భాగధేయము పేర్మిన్.'

122


క.

అని చెప్పి తదనుమతి న
వ్వనజాక్షుల నందఱను వివాహంబై నూ
తనమన్మథుఁ డనఁగ నతం
డనుదినమును మదనకేలి నలరుచు నుండన్.

123


చ.

దివిజవధూటి భావమునఁ ద్రెక్కొనుదుఃఖము లెల్లఁ బోవఁగా
నితనికి నైనదిక్కును నహీనదయామతిఁ జేసి మేనకా
సుతకును గల్గులాంఛనము చొప్పడఁగా ఘనయోగవైభవో
న్నతి నొక యోగికాంత నృపనందనుపాలికి వచ్చె వేడుకన్.

124

వ.

ఇట్లు తన మ్రోల కేతెంచిన సిద్ధవనితకు గొబ్బున లేచి మ్రొక్కి యక్కాంత
చేతం గృతాశీర్వచనుండై సబహుమానంబుగాఁ దెచ్చి కూర్చుండం బెట్టు
కొనిన.

125


క.

పెదవులు గదలెం గదలవు
రదనంబులు గానవచ్చె రావను పాటిన్
మృదువచన రచన లెసఁగఁగ
ముదిత యతని హృదయకమలముం గరఁగించెన్.

126


వ.

ఇవ్విధంబునఁ బూర్వరంగంబులగు ప్రసంగంబులు చెల్లం దదవసరంబునఁ
బావకలోముండు.

127


తే.

'ఎచటనుండి వచ్చి తిందుల' కనిన న
య్యగ్నిలోమునకును ననియె వనిత
'సకలభూములందుఁ జరియింతు నే, నిక్క
డక్క డనఁగఁ గలదె యొక్కచోటు?'

128


క.

అన విని 'నీవు చరించుచుఁ
గనినట్టివి వింత లేమి గల?' వని యడుగన్
గను మట్టులైనఁ జెప్పెద
నని యి ట్లని చెప్పెఁ దాపసాంగన ప్రీతిన్.

129


చ.

'అనుమతినాఁగ నాట్యనగరాధిపుఁ డయ్యజవక్షు కూఁతు రా
కనకలతాంగిఁ దత్కమలగంధిని మున్ను స్వయంవరోత్సవం
బున వరియించినాతఁ డెట పోయిననో, మఱి యొక్కఁ డేను బొ
మ్మని కొనివచ్చి తత్పితృసమక్షమున న్మదిరాక్షి నుంచినన్.

130


ఆ.

వార లియ్యకొని వివాహంబు సేయ ను
పక్రమింపఁ గొన్ని వక్రభాష
లుచ్చరించి వీని నొల్ల, వీఁ డెక్కడి
భర్త నాకు, వీఁడు పాతకుండు.

131


వ.

వీనిం బరిహరించెద. నా పెనిమిటి వచ్చునంతకు నంబికారాధన తత్పరనై
కాలంబు పుచ్చెద నని పంతగించి యున్నయది.

132

ఆ.

రాతిబొమ్మకైనఁ జైతన్య మొనరించి
కరఁగఁజేయవచ్చుఁ గాని మఱియు
రమణిదైన యంతరంగంబు గరఁగింప
నంగభవునికైన నలవి గాదు.'

133


క.

అని చెప్ప నాతపస్విని;
విని రాజతనూభవుండు వెఱ గందుచు న
య్యనుమతి నెవ్వఁడొకో తో
డ్కొని చని కడు దుఃఖపఱిచెఁ గుత్సితవృత్తిన్.

134


చ.

అని తలపోసి నెమ్మనమునందు జనించు వియోగశోక మ
వ్వనితకుఁ దోఁపనీక మృదువాక్యపురస్సరవస్తుసంపదల్
తనరఁగ నిచ్చి పంపి, త్వరితంబున నయ్యజవక్షుప్రోలికిన్
జని కనియెన్ వ్రతస్థయగు చాన నిజాంగనఁ జారులోచనన్.

135


వ.

అనుమతియుఁ దన శివారాధనంబు ఫలించెఁ గదా యని ప్రమోదంబు నొంది
నాథురాకకు సంతసించి యతని నుద్దేశించి.

136


చ.

'కటకటఁ గుంభి వీకుఁ జెలికాఁడని నీవెనువెంటఁ ద్రిప్పఁగా
నిటువలె నయ్యె నింక నిటు లేటికి మాటలు విన్నుఁ జూడఁగాం
చుటఁ గృతకృత్య నైతి' ననుచుఁ వెస డగ్గఱ నేఁగి వానిఁ గౌఁ
గిటఁ గదియంపఁ దజ్జనని క్లేశము నొందుచుఁ జేరి యిట్లనున్.

137


క.

'అమ్మమ్మ! యేల బ్రమసితి
విమ్మనుజాధిపుఁడు నీకు నెక్కడి మగఁడే!
యుమ్మలిక యుడిగి రమ్మా,
కొమ్మ! వినియెనేనిఁ గుంభి కోపించుఁ జుమీ!'

138


ఆ.

అనినఁ దల్లిఁ జూచి 'యరయిక లేనివా
క్యంబుగాక, పాపకర్ముఁడైన
కుంభిఁ బెద్దఁజేసికొని యుత్తమక్షత్ర
వంశజాతు నితని వదలఁదగునె?

139


క.

నాకింక నితనితోడిది
లోకము, నీ వరుగు' మనిన లోలాక్షి మదిన్

శోకించుచుఁ జని చెప్పి మ
హీకాంతున కంతపట్టు నేకాంతమునన్.

140


క.

ఇప్పని యుక్తము గాదని
యప్పడుచుకు బుద్ధి చెప్పి యదలుపకున్నన్
ముప్పగునని యడిచిపడుచు
నప్పుడ చని కూఁతుతోడ నజవక్షుఁ డనున్.

141


ఉ.

'ఆదిక దెచ్చుకొంటి, తగునమ్మ? తనూభవ! యట్టులైన నీ
తోడికుమారికల్ నగరె, ధూతకళంకునిఁ గుంభి నొల్ల కే
వాఁడొ యెఱుంగ మాతనిని వల్లభుఁ డందువు తప్పు గాదె, నా
తోడు మదీయబుద్ధి విను, దుఃఖముగట్టకు మాకు ముప్పునన్'

142


ఆ.

 అనినఁ దండ్రిఁ జూచి యనుమతి యిట్లను
'నేటిమాట లాడె దెఱుకమాలి
నీకుఁ గుంభిగాని నాకు వాఁడయ్యమే
ధ్యంబులోని క్రిమివిధంబు సుమ్ము.

143


క.

ఈరాజకుమారుఁడు దను
గారవమునఁ బెనుపఁ బెరిగి కడుఁ గ్రొవ్వి కదే
వారక వాఁ డిటు చేసెను
మీ రీమొద లెఱుఁగ రివియె మీదు విమర్శల్.

144


క.

మీతో నాఁడును జెప్పనె,
పాతకుఁడగు కుంభిమాట పాటిగఁ గొని మీ
రాతని నుపేక్ష చేసితి
రాతఁడు కీడ్పఱిచె నితని నన్యాయమునన్.

145


తే.

రాష్ట్రముననైనపాపంబు రాజుఁ బొందు;
క్షితిపుపాపంబు మఱి పురోహితుని బొందు;
మగువచేసినపాపంబు మగనిఁ బొందు;
శిష్యుపాపంబు గురుఁ బొందు సృష్టియందు.'

146


క.

అని తన్నుఁ దూల బల్కిన
యనుమతిమాటలకుఁ గలఁగి యజవక్షుడు ము

న్నును నిది యట్టులు పల్కె నీ
తనివలనం దెలియవలయుఁ దత్కథ యనుచున్.

147


ఉ.

అవ్విభుఁ డగ్నిలోముఁ గదియం జని తేకువ యుల్లసిల్ల 'నీ
వెవ్వఁడ వన్న? నీ జనకుఁ డెవ్వఁడు? మత్పురి నున్న కుంభి దా
నెవ్వఁడు? నీకు నీవనిత యేమగుఁ? జెప్పఁగదన్న! కానలే
కివ్విధిఁ జిక్కు దుల్పెద మనేకదినంబులనుండి' నావుడున్.

148


వ.

తన పేరు తాను జెప్పవలసెనని విషాదంబు నొందియుం గాలస్వభావంబు గదా
యేమి సేయవచ్చు నని తలంచి యి ట్లనియె

149


క.

'పావకలోముఁడు నే, నో
భూవర! యంభీరనృపతి పుత్రుఁడ, నస్మ
త్సేవకుఁడు కుంభి, యనుమతి
నావనిత, స్వయంవరంబునం బడసితి నేన్.'

150


క.

అని తనకు గుంభి యొనరిం
చినద్రోహము లెల్లఁ దెలియఁ జెప్పిన వివి య
జ్జననాయకుఁ డాకష్టుని
కిని దగుదండనము సేయఁ గెరలినయంతన్.

151


వ.

మిత్రద్రోహియగు కుంభి వెఱపు గదుర వడవడ వడంకుచున్నం గాంచి
పావకలోముండు.

152


క.

'తమ్ముఁడ! యేమియు వెఱవకు
నమ్ముము నన్నిట్లు సేయ నాదెస నపరా
ధ మ్మేమి కలిగె బొంకక
యమ్మనుజాధిపునియెదుర నేర్పడఁ జెప్పుమా!'

153


తే.

అనిన 'సర్వాపరాధి నే నధిపతనయ!
నీవు పుణ్యాత్మకుండవు నీకుఁ దప్పు
మోప నే నెంతవాఁడ నా పాపమునకు
గడమ లే'దంచుఁ జాగిలఁబడియెఁ గుంభి.

154


క.

కనుఁగొని యజవక్షునితో
ననుమతి 'యిదె చూడు నీకు నల్లుఁడ నని వ

చ్చిన ద్రోహిమాట నిక్కం
దిని ననుఁ గోపించి తిప్పు డైనఁ దెలిసెనే.'

155


క.

అనవుడు ముడివడు బొమ్మలుఁ,
గనలెడుకన్నులును, నదరుకటములు, నెగఁబా
ఱినమీసలునై యతఁ డి
ట్లను భటులం గుంభిఁ జూపి యౌడు గఱచుచుచున్.

156


సీ.

'ఈ పాపకర్ముని నిప్పుడ కొనిపోయి
       పూరివెంటులు చుట్టి పురముచుట్టు
ద్రిప్పి తోఁకొనివచ్చి తెకతెక నుడి కెడి
       యుక్కుఁగంబముతోడ నొత్తిపట్టుఁ,
డినుపరాగోలల నిఱికించి యంతతో
       నన్యకాంతోపగూహనసుఖంబు
పైఁబడి కోరిన ఫలము చేసేఁతన
       మనసారఁ గన్గొను' ననిన నతని


తే.

తెగువఁ జూచి యనుమతీవల్లభుఁడు 'వీని
నిట్లు సేయకున్న నేమి దప్పె?
ధరణిపతులు చేయు దండనంబునకంటెఁ
దక్కువయ్య! జమునిదండనంబు?

157


వ.

కావున వీనిని మీదేశంబునుండి వెడలఁదోలుటయ చాలు, చంపనీ' ననిన నజ
వక్షుం డల్లునిమాటమెయి నట్ల చేసె.

158


ఉ.

అంతఁ బతివ్రతాగుణమహత్వముఁ జూచి సురల్ ప్రమోదిత
స్వాంతత యొప్పఁ గ్రొవ్విరులవాన గురించిరి భామమీఁద, ది
గ్ధంతిసమానబాహుబలగర్వితుఁ డాశిఖిలోముమీఁద, ని
శ్చింతులునై కనుంగొని రశేషజనంబులు నవ్విశేషమున్.

159


తే.

అప్పు డజవక్షుఁ డిరువుర నందలముల
మీఁద నెక్కించుకొని యప్రమేయవిభవ
మొనరఁ గొనిపోయి యొక పుణ్యదినమునందుఁ
బెండ్లి సేయుడు నిశ్చలప్రేమతోడ.

160

వ.

తత్సతీద్వితీయుండై యతండు రతిసమేతుండగు మీన కేతనుండునుంబోలెఁ
బొలుపొందుచు నాట్యనగరంబునందుఁ గొన్నిదినంబు లుండి యొక్కనాఁడు
తన మామచేత ననుజ్ఞాతుండై భార్యయుం దాను నిజపురంబగు దివిజపురంబు
నకుం జని యంభీరమహారాజునకుం గుంభినీమహాదేవికిం దండప్రణామంబు
చేసి యనుమతిం జూపిన నారాజపుంగవుండు నిజాంతరంగం బాశ్చర్యతరం
గంబుగా నతవి కి ట్లనియె.

161


ఉ.

'ఏలర ముద్దుకూన? నను నెప్పుడుఁ గన్ను మొఱంగి పోయె ద
వ్వేలుపుటింతు లట్టి యరవిందదళాక్షుల మున్నుఁ దెచ్చి తీ
బాలికఁ దెచ్చి తిప్పు డిదె భావజుదేవియుఁ బోనిదాని నీ
లీల దలంప నచ్చెరువు, లేమలఁ గందువఁ బెట్టి తెచ్చెదే.'

162


క.<poemఅనిన నతఁ డింకఁ దాఁపఁగఁ

బని లే దంతయును జెప్పఁబడు నని చెప్పెన్ మును గుంభియుఁ దానును నటు

చనుటాదిగఁ గల్గు తత్ప్రసంగము లెల్లన్.></poem>
163


వ.

అంభీరనృపతియుఁ గొడుకుపలుకు లాలకించి కుంభిసేతలకుఁ జిత్తంబునం
గలుషించి 'వాఁడు నీ కాప్తుఁడై యుండి యింత చేసెనే యక్కటా కృతఘ్నుల
తోడ నేస్తం బిట్టులుండుఁ గాఁబోలు ' నని గుణధాముండగు పావకలోము
భూమిపాలనంబునకు నభిషేకంబు చేసి తాను దపోవనంబునకుం జనిన నతండు
సింహాసనస్థుండై దుష్టజననిగ్రహంబును శిష్టజనానుగ్రహంబును దనకు నిత్య
కృత్యంబులుగా ననేకవర్షంబులు రాజ్యంబు చేసి పూజ్యంబగు శివసాయుజ్యంబు
వడసె నని యప్పశురత్నంబు పుండరీకంబునకుం జెప్పె నని.

164


ఆ.

బ్రహ్మరాక్షసునకు రత్నమండనుఁడు చె
ప్పుట యుపన్యసించె భోజపతికి
సిద్ధుఁ డంచు నిట్లు చెప్పిన విని తద
నంతరప్రసంగ మడుగుటయును.

165


చ.

ప్రణమ దశేషకల్మషపరాగనిరాసపయఃప్రపూర! మా
ర్గణగణనిర్గతానలశిఖాపరిశోషితసింధురాజ! భీ

షణదశవక్త్రవక్త్రజలజవ్రజచంద్ర! సమస్తలోకర
క్షణపటువీక్షణస్ఫురణ! గర్వితదానవమానమర్దనా!

166


క.

దుగ్ధాబ్ధిశయన! యదుకుల
దుగ్ధాంభోరాశిచంద్ర! దుగ్ధమరాళ
స్నిగ్ధయశ! యశోదాస్తన
దుగ్ధప్రియ! గోపసదనదుగ్ధసుచోరా!

167


భుజంగప్రయాతము.

రమాహృత్పయోజాతరాజీవమిత్రా!
తమాలాతసీపుష్పధామాబ్జనాభా!
యుమాసంతతస్తోత్రయోగ్యాభిధానా!
పముద్యత్ఖగాధీశశైలాగ్రధామా!

168

గద్యము
ఇది వాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ
సుకవిజనవిధేయ అనంతయ నామధేయ ప్రణీతంబైన
భోజరాజీయంబను కావ్యంబునందుఁ
బంచమాశ్వాసము

  1. బడినేసి
  2. నాఁడు
  3. ని న్నెట్లు సేయ
  4. వెలర్పె
  5. మ్రుచ్చులువోలె
  6. జరిగి
  7. గులాద్రియట్లు
  8. పరికించుచు
  9. నీకిటు