Jump to content

భోజరాజీయము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

భోజరాజీయము

ద్వితీయాశ్వాసము

శ్రీనారీనయనచకో
రానందసుధాంశుబింబ! హరిదశ్వసహ
స్రానూనతేజ! నిర్జర
సేనాసంసేవ్యమాన! శ్రీనరసింహా!

1


ఆ.

అవధరింపు దేవ! భవదీయదివ్యాంశ
జనితుఁ డైన యత్రిసంభవుండు
నిజపదాబ్జరేణునిర్మలదేహుఁడై
తనరు మహుని కిట్టు లనియెఁ బ్రీతి.

2

భోజచరిత్ర

తే. అధిప! చెప్పెద వినుము ప్రయాగమరణ
మిష్టకామ్యసిద్ధిద మగు టెల్లఁ దొల్లి
వేదవేదాంగతత్త్వసంవేది యొక్క
విప్రవర్యుఁడు గలఁడు పవిత్రయుతుఁడు.

3


చ.

ధనరహితుండు, పుత్రసముదాయసమేతుఁ, డుపాయశూన్యవ
ర్తనుఁ డరయంగ నా ద్విజుఁడు, తత్రియభామయు బుద్ధిహీన, జీ
వన మొనరింప నేర , దిలువాడ నెఱుంగదు, భాండశుద్ధి లే
దనిశముఁ బోరుచుండుఁ దదుపాత్తపురాకృతకర్మమో యనన్.

4


తే.

అతఁడు దిరుగనియూరును, నతనిచేత
నడుగఁబడనిమానవుఁడును, నతని చొరని

5

తోఁటయును జూడలేదు మందునకు నైన
నగవు గా దిది నిక్క మా నట్టునందు.

5


క.

ఆలిని బిడ్డలఁ బ్రోచుట
కై లాఘవవృత్తి కగ్గ మై నిర్ధనతా
బీలపయోధి మునుంగుచుఁ
దేలుచు దరి దాపు లేక తిరుగుచునుండెన్.

6


వ.

ఇట్లు సర్వశూన్యం బగు దారిద్ర్యదైన్యంబు సైరింపం జాలక సంసారంబు
వలన విసివి, పంకనిర్మగ్నం బగు గోవునుంబోలె నమ్మహీదేవుండు తన్ను
సముద్ధరింప దిక్కెవ్వరు లేక దుఃఖంబునఁ గృశశరీరుండై యుండఁ గొండొక
కొలంబు సనుటయు నొక్కనాఁడు తన మనంబున నిట్లని చింతించె.

7


ఉ.

ఓలి గృహస్థధర్మముల నుండెడువానికి గ్రాసవాసమున్
చాలఁగఁ గల్లి పుత్రులుఁ గళత్రము సౌఖ్యము నొంద, బంధువుల్
మే లన నార్యకోటి మది మెచ్చఁగ నుండుట యున్కి, గాక యే
చాలును లేక యీ చెనఁటిజాలిఁ బడం దిని యేమి చెప్పుమా.

8


తే.

కుడిచి కట్టినయునికి గా కిడుమఁ బడుచు
నింట నిట్లున్నఁ బురుషార్ధ మేమి కలదు?
కడఁగి యిహ మైనఁ బర మైనఁ గాక తాన
యూరకుండుట నరునకుఁ బౌరుషంబె?

9


ఉ.

లావు గలంతకాలముఁ దొలంగక తాల్చితిఁ బెక్కుభంగులన్
జీవనభార, మిప్డు ముదిసెం దల యంచుఁ బరోక్షసాధనా
భావము నెమ్మదిం దలఁచి భవ్యపథంబున నిశ్చితాత్ముఁడై
యా వసుధామరుం డరిగె నయ్యఘనాశిని యైన కాశికిన్

10


వ.

ఇట్లేఁగి.

11


ఉ.

నిచ్చలు గంగకుం జని వినిర్మలవారిఁ బవిత్రగాత్రుఁడై
వచ్చి శివాలయంబులును వైష్ణవధామములుం గ్రమంబునన్
జొచ్చి నమస్కరించుచును సువ్రతశీలుఁ డనంగఁ గాశిలో
మచ్చిక యుల్లసిల్లఁ బలుమాఱును బెద్దలయిండ్ల కేఁగుచున్.

12

వ.

[1]ఇ ట్లాపుణ్యతీర్థంబునఁ గొన్నిదినంబు లుండి యొక్కనాఁడు.

13


సీ.

ప్రాణాంతికావస్థఁ బడినయప్పుడు గాని
       కలుగదు సిద్ధి యీ కాశియందు
నంత చేయఁగఁ గల్గునవి తోలు వీరలుఁ
       బునుకపేరును, జిటాభూతిధార
ణంబులు, భిక్షాటనముఁ, గపాలపుఁగోర,
       భూతసంగతి, ప్రేతభూమియునికి
యివి యేల నాకు, దుక్కెద్దు దేశాంతర
       మరిగినట్లగును నిట్లైతి నేని,


ఆ.

హీనదశకు నోడి యిలు డించి పరదేశ
మునకు నిట్లు వచ్చియును నపార
విభవ మొందకున్న వృధగాదె యనుబుద్ధి
నాతఁ డచటు వాసి యరిగె ననఘ!

14


ఉ.

వేగమ యేఁగి కాంచెఁ బృథివీసురముఖ్యుఁ డశేషయోగిసం
యోగము, లోకకల్మషవియోగముఁ జారుతరంగమాలికా
భోగసముత్థితాంబుకణపూర్ణసమీరణపాలితాష్టది
గ్భావము, సమ్మునీంద్రపరికల్పితయాగము నాప్రయాగమున్.

15


వ.

కని కరంబులు మొగిచి యిట్లని స్తుతించె.

16


తే.

ఉర్విపై నశ్వమేధి యన్ గర్వ ముడిపి,
బ్రహ్మహత్యాపరుం డను భయము వాపి,
యొసఁగు సుకృతికిఁ బాపికి నొక్కగతియ
యన్యతీర్థము లెనయె ప్రయాగమునకు.

17


చ.

అవె దివిజాపగాజలము, ల ల్లవె యా యమునాజలంబు లా
ధవళతయున్ వినీలతయుఁ దార్కొని చూడ్కికి వేడ్క చేసె మా
ధవసదనాంగణం బగుటఁ దత్పరిచారకు లర్థిఁ జందన
ద్రవమునఁ గ్రొత్తకస్తురిని దక్కక రేకలు పెట్టిరో యనఁన్.

18

క.

గంగాయమునల విమల త
రంగంబులు ధవళచామరంబులు నసితో
త్తుంగబహుబర్హనివహము
నంగజజనకునకు వైచు నట్లొప్పెఁ గడున్.

19


వ.

అని గంగాయమునల సాంగత్యవిశేషంబులు గొనియాడుచు నందుఁ గృత
స్నానుండై యా ద్విజుండు.

20


చ.

అలికులవర్ణు, నున్నతరథాకృతిచారుసుపర్ణు, నిందిరా
లలితకుచోపగూహనసులక్షితవక్షుఁ, బయోరుహాక్షు, నా
కలితఘనప్రతాపుఁ, ద్రిజగన్నుతరూపు, నిజాంఘ్రిజాపగా
మలసలిలోద్వహస్ఫురదుమాధవుఁ గొల్చెఁ బ్రయాగమాధవున్.

21


ఉ.

చూపులు విష్ణుమూర్తులకు సొమ్ముగ, జిహ్వలు విష్ణుమూర్తియా
లాపసుఖంబుఁ జెందఁగఁ, దలంపులు విష్ణుమహత్త్వచింతకుం
బై పడుచుండ, నిట్టు లగు భాగవతోత్తమకోటిచే జగ
ద్దీపిత మైన యవ్విమలతీర్ధమునం దతఁ డుండె వేడుకన్.

22


వ.

ఇ ట్లుండి యవ్విప్రుం డొక్కనాఁ డెప్పటియట్ల గంగాస్నానంబు సేయు
నప్పు డొక్క వనితాచతుష్టయం బచ్చటికి వచ్చి మరణోద్యోగంబున సంక
ల్పంబు చెప్పుకొనుచుండిన నతం డద్భుతాయత్తచిత్తుండై కనుంగొనుచుండె
నంత.

23


చ.

కనకపుఁగుప్పలు, న్మణినికాయములు, ధనధాన్యరాసులున్,
వినుతగజాశ్వసంఘములు, విశ్రుతగోమహిషాదికంబులున్
దన కధికంబుగాఁ గలిగి దాతయు భోక్తయు నైనవాఁడు నా
కనయము భర్త గావలయు నం చొకభామిని కోరె వేడుకన్.

24


చ.

తనవదనంబు వాక్సతికిఁ దానకమై చెలువొందఁ, దన్నుఁ జూ
చినజను లందఱుం గవిత చెప్ప, సమస్తకళాకలాపముల్
దనవశమై తలిర్ప, నుచితజ్ఞుఁ డనంగఁ బొగడ్త కెక్కువాఁ
డనయము భర్త రావలయు నం చొకభామిని కోరే వేడుకన్.

25


చ.

అనుపమసంపదాఢ్యుఁడును, నంచితనిర్మలకోమలాంగుడున్
ఘనకవితారసోదయవికాసితచిత్తుఁడునై సమస్తభూ

జనపరిరక్షణక్షమతఁ జాలఁగ నొప్పి ధరిత్రి నేలువాఁ
డనయము భర్త గావలయు నం చొకభామిని కోరె వేడుకన్.

26


చ.

కనకశలాకవోని తనుకాంతియుఁ బున్నమచంద్రుఁ బోలు నా
ననవిభవంబుఁ, బద్మముల నవ్వు పరిస్ఫుటనేత్రరోచులున్
దన కమరంగ భావభవతంత్రములందుఁ బ్రవీణుఁ డైనవాఁ
డనయము భర్త గావలయు నం చొకభామిని కోరె వేడుకన్.

27


వ.

ఇవ్విధంబునఁ బునర్భవానుభవంబు గోరి.

28


చ.

తలకొని నాగకన్యకలు తత్తటివీతటి కేఁగుదెంచి వి
చ్చలవిడిఁ గేలి సల్పి నిజసద్మముఁ గ్రమ్మఱఁ జొచ్చుభంగిఁ బే
రెరిమి దలిర్ప నా నలువు రిందువిభాస్యలు నాస్యమండలం
బులు వికపింప నయ్యుదధిపూరమునందు మునింగి రిమ్ములన్.

29


ఉ.

అంతయుఁ జూచి విప్రుఁడు ప్రియంబున నేనును నిట్లు చేసి యీ
కాంతలు నాకళత్రములుగాఁగ నభీష్టసుఖోపభోగమున్
గాంతు ధరిత్రిలో నని యకంపితచిత్తసరోజుఁడై యనా
ద్యంతుఁ బ్రయాగమాధవుఁ గృపాబ్ధిఁ దలంచి నమస్కరించుచున్.

30


సీ.

దారిద్ర్యభూతంబు తనుఁ బాసి పోవు నీ
       యుదకపూరము చొచ్చి యున్న ననియుఁ
బెద్దకాలము మేనఁ బెరిగిన పాపపం
       కము లిందు మునుఁగక కరఁగ వనియు
నిది శుద్ధజలరాశి యిందులో వెదకినఁ
       గోర్కిముత్యములు చేకూరు ననియు
నిందు డిందిన నల్వు రింతుల వెడలించి
       గుఱిలేనికోర్కిఁ గైకొందు ననియు


ఆ.

నిట్లు తెగువ చేసె నీవిప్రుఁ డని కొని
యాడునట్లు గాఁగ నతఁడు మునిఁగెఁ
జటులదురితతిమిరపటలప్రచండమా
ర్తాండ మగుప్రయాగ[2]కుండమందు.

31

ఉ.

అంతఁ బ్రయాగమాధవుఁ డనంతదయానిధి పద్మవాసినీ
కాంతుఁడు వారికోర్కి యొసఁగంగఁ దదీయవరోపలబ్ధి య
త్యంతనిరూఢమై నెగడునట్లుగ విప్రుఁడు సూర్యకాంతభూ
కాంతునియందుఁ బద్మవతి గాదిలితల్లిగఁ బుట్టె మేదినిన్.

32


క.

ఆవనితలు నొక్కొక వసు
ధావల్లభునందు సముచితంబగు ప్రాదు
ర్భావము నొందిరి భాగ్య
శ్రీవిలసితరూపములు ప్రసిద్ధికి నెక్కన్.

33


వ.

ఇట్లు పుట్టి యాద్విజుండు భోజుం డనుపేరఁ బ్రసిద్ధుం డయ్యే, [3]నయ్యంగనా
రత్నంబులు నలువురును సుగంధి పద్మగంధి కనకవతి చంద్రప్రభ లను
నన్వర్ధనామంబులతో నతనికి భార్య లైరి; యివ్విధంబున నతండు వివిధవిభవ
విలసితుండును, నత్యంతరూపసంపన్నుండును. సకలకళాప్రవీణుండును,
లాటదేశంబునందు ధారానగరంబున కధీశ్వరుండై యనేకవర్షంబులు రాజ్యంబు
చేసె నట్లు గావునఁ బ్రయాగతీర్థం బిష్టకామ్యసిద్ధి ప్రదం బని పలికితి' నని
చెప్పిన.

34


చ.

'విమలవిచార! నీవలన వింటిఁ బ్రయాగమహత్త్వమెల్లఁ ద
త్సముదిత[4]పూర్వపుణ్యఫలజన్ముఁడు భోజవిభుండు భూమి యే
క్రమమున నేలె? వాఁ డటులు రాజ్యము సేయుదినంబులన్ విశే
ష మొకటి యెద్ది యేనియును సన్మునినాయక రూఢి కెక్కెనే?'

35


చ.

అనవుడు నానృపాలునకు నామహనీయవివేకశీలుఁ డి
ట్లను; 'మును భోజుఁ డాదిసృపులట్టుల రాజ్యము చేసె, వావి వ
ర్తనము నుతింప నల్పుల తరంబె? మహిం జతురుత్తరంబుగాఁ
దనరిన షష్టివిద్యలు నతం డెఱిఁగింపక కల్గ వేరికిన్.

36


చ.

తనుఁ గనుఁగొన్నవారు కవితాఘను లౌదురు; తద్విశేష మెం
తని గుఱి పెట్టవచ్చు మనుజాధిప! యిన్నిటికంటె నెక్కు డిం
క నొకటి చెప్పెద న్విను మఖండితయై యొకవిద్య చేరె నా
తనికి సమస్తభూజనకదంబము ప్రస్తుతి చేయునట్లుగన్.

37

వ.

అది యెయ్యది యంటేని.

38


ఆ.

మనుజు లెల్లవిద్యలను జొచ్చి సాధింపఁ
గలరు గాని లోహకులము నెల్లఁ
బసిడిఁ జేయువిద్య పడయ లే రెవ్వరు;
నట్టివిద్య భోజుఁ డభ్యసించె.

39


వ.

కావున నశేషవిశేషంబులకు నతం డాశ్రయం బగుట వేఱ చెప్ప నేల!
యతనిచరిత్రంబు రామచరిత్రంబునుం బోలెఁ బరమపవిత్రంబై యొప్పు,
నతని కీర్తిలతాజాలంబునకు నాలవాలం బగు ధారానగరంబు మహిమ.

40


ఉ.

సారకవీంద్రచాతకవిశాలహిరణ్మయవృష్టిధార, ని
స్సానదరిద్రభారతరుషండవిలాసకిరారధార, సం
సారకృశానుతప్తజనశైత్యకరామృతధార గాక యా
ధార తలంప నస్యవసుధారమణిక పురోపమానమే.

41


సీ.

ఆచారమున బ్రహ్మ నైనను నోడించి
       పఱపంగఁ జాలు సద్బ్రాహ్మణులును
బరశురాముని నైనఁ బ్రధనవైముఖ్యంబు
       నొందింపఁ జాలు రాజోత్తములును
నలకాధిపతితోడ నైన మచ్చరికించి
       కొన నమ్మఁగల మేటికోమటులును
జట్టుపై నైన రాజనమును జెఱకును
       గావింపఁ గలమహాకర్షకులును


తే.

మదపుటేనుంగుతో నైన మాఱుపెనఁగి
విఱుఁగఁ దోలంగ నోపెడు వీరవరులుఁ
గడఁగి విజితేంద్రియుల నైనఁ గరఁగఁ జేయు
జారసతులును నప్పురిఁ జాలఁ గలరు.

42


చ.

సురపతిదంతిసంతతియొ, సూర్యునివాజుల[5]పాఁగెమో, పొరిం
బొరి నల కామధేనువునఁ బుట్టిన క్రేపుల తోయమో యనం

బరువడి నొప్పు నప్పురము భద్రగజంబులపెల్లు, నుల్లస
తురగచయంబుపెంపు, నవిదూషితగోనికరంబు పేర్మియున్.

43


క.

మొగి నాఱును దొమ్మిదియును
నగురసములఁ గలుగుబహుపదార్థంబుల బ్రా
తిగఁ జవి గొననినరుం డా
నగరంబున మందు కడిగినం జొప్పడునే.

44


ఉ.

కైపద మిచ్చువారలును, గ్రక్కునఁ బద్యము చెప్పువారలున్
రూపితసంస్కృతాదిపదరూఢి యెలర్ప మహాప్రబంధముల్
వే పొసఁగంగఁ బల్కి పృథివిం బ్రథితంబుగఁ జేయువారు ధా
రాపురమందె కాక కలరా మఱి తక్కినపట్టణంబులన్!

45


వ.

ఇ ట్లొప్పు నప్పురంబున కధీశ్వరుండు.

46


క.

భోజుఁడు ప్రసన్నవదనాం
భోజుఁడు నిఖిలార్థికల్పభూజుఁడు విలస
త్తేజుఁడు సంభృతసుకవిస
మాజుఁడు రూపాదిజితరమాజుఁడు జగతిన్.

47


సీ.

అమరమహీజంబు లైదును నైదుభూ
       తములుగాఁ గూర్చి దేహము సృజించి
యతనుఁడై చరియించు నంగజుప్రాణంబు
       నెమ్మిఁ బ్రాణంబుగా నిర్వహించి
యదితికి దేవేంద్రుఁ డావిర్భవించిన
       పుణ్యంపుఁబ్రొద్దునఁ బుట్టు వొసఁగి
భారతి దాదియై గారవం బారఁ టో
       షించునట్లుగ నియమించెఁ గాక


ఆ.

నలినభవుఁడు కానినాఁ డిట్టివితరణం,
బిట్టిరూపమహిమ, మిట్టివిభవ,
మిట్టివిద్య యితని కెట్లు గల్గె ననంగ
భూమిఁ బ్రణుతి కెక్కె భోజరాజు.

48

క.

బలిరాజ్యము, రామమహీ
తలపతిరాజ్యంబు, ధర్మతనయునిరాజ్యం
బిల నెట్టి దట్ల భోజువి
సలలితరాజ్యంబు సర్వసౌఖ్యములందున్.

49


క.

భ్రాజితమణిభూషాంబర
రాజివలన సమవిభావిరాజితు లగుటన్
భోజునియోలగమునఁ గవి
రాజుల రాజులను దెలియరా దెవ్వరికిన్.

50


క.

ఆపృథివీపతిధర్మం
బేపాటియొ కాని యాతఁ డేలెడుధరలో
నేపట్టునఁ బొడగానము
యూపస్తంభములు లేని యూ రొకచోటన్.

51


చ.

చతురత, నీతిపెంపునఁ, బ్రసన్నత, నున్నతవిద్యలందు, ధీ
రత, సుకుమారతన్, సుకవిరాజసమాజసమాశ్రయక్రమా
ద్భుతరతిఁ, గాంతిఁ, దేజమున, ధూతకళంకత, నెన్ని చూడఁగన్
నితఁ డొకరుండ పో నృపుల కెక్కుడు నాఁ దగుభోజుఁ డెప్పుడున్.

52


చ.

జనవర[6] భోజుఁ డట్లఖిలసమ్మతుఁడై ధర యెల్ల నేలుచున్
విను మొకనాఁడు జ్ఞానగుణవిశ్రుతుఁ డాధరణీతలేశ్వరుం
డనుపమసత్త్వశాలి మృగయారతిఁ గాననభూమి కేఁగి కాం
చనరసలిప్తపుంఖశరసంహతిఁ గ్రూరమృగాళిఁ గూల్చుచున్.

53


క.

తురగజవంబున మృగములఁ
బొరగొని తమకమున నలపు పుట్టినయంతన్
కరణముతో నతిదూరము
నరుగ నరుగ నెదుర నొక మహాటవిలోనన్.

54


తే.

అఖిలవిపినంబులకుఁ దన్న యాధిపత్య
మునకుఁ బట్టంబుగట్టినయనువు దోపఁ

దరువితానంబులో
నెల్లఁ దాన యతిని
గూఢమై యొప్పు నొక్క వ్యగ్రోధతరువు.

55


క.

ఆయుర్వీరుహశిఖర
చ్ఛాయ పథశ్రాంతి దీర్ప, సరభసమున భూ
నాయకుఁడు సుఖాసీనుం
డై యుండి తదీయవిభవ మిటు గనుఁగొనుచున్.

56


చ.

బలితపుశాఖయందుఁ బదపద్మయుగంబుఁ బెనంచి పార్శ్వశా
ఖలఁ గరకాండముల్ చొనిపి కన్నులు మోడ్చి యధోముఖాబ్జుఁడై
తలకొని వ్రేలుచున్న యొక తాపపిఁ గాంచె విభూతిభూషణో
జ్జ్వలుఁ డగువాని భోజనృపసత్తముఁ డావటభూరుహంబుపైన్.

57


చ.

కని యితఁ డెవ్వఁ డొక్కొ యిటుగాఁ గత మెయ్యది యొక్కొ పిల్చినం
గినియక పల్కు నొక్కొ పరికించెదఁ గా కనుమాన మేల యి
మ్మునివరు నంచు హస్తములు మోడ్చి శిరంబునఁ జేర్చి భోజుఁ డా
నన మొకయింత యెత్తి నయనద్యుతిసంపద యొప్ప నిట్లనున్.

58


క.

వటతరుశాఖాలంబిత
పటుతరచరణ మగు మీ తపశ్చరణము దు
ర్ఘటనము మీ రెవ్వరు మీ
కటాక్షలాభంబు నాకుఁ గానఁగ వలయున్.

59


వ.

అనిన నతండు వినియు విననియ ట్లుండిన.

60


ఉ.

భోజుఁ డదేమి యొక్క మునిపుంగవుఁ డేఁ బిలువంగఁ బల్కఁ డీ
భూజమహోన్నతిం బలుకు పొందదొ వీనుల నిట్లు గాక తా
నేజగడంబు నొల్లక తదేకమతిం దప మాచరించువాఁ
డై జనభాష లేమి విన నంచు గణింపఁడొ యంచు నిట్లనున్.

61


క.

అన్యుఁడ గాను భవాదృశ
మాన్యుఁడ భోజుఁ డను పేర మహిఁ బరగినరా
జన్యుఁడ ననుఁ జూడగదే
ధన్యుఁడ నయ్యెద ననిన నతఁడు ప్రీతుండై.

62


వ.

కను విచ్చి చూచి యి ట్లనియె.

63

తే.

అధిప పెఱయాశ్రమస్థుల కందఱకును
విను గృహస్థాశ్రమమువాఁడె వెలయ నూఁత
యట్టి గృహమేధులకుఁ గీడు పుట్టకుండఁ
గాచుకర్తలు రాజులు గారె యరయ.

64


క.

ఏతన్మాత్రమహీపతి
వే తగవును ధర్మమును నహింసారతియున్
నీతియు ననఁగల యీగుణ
జాతము నీయంద కాదె శాశ్వత మయ్యెన్.

65


క.

ఏకచ్ఛత్రముగా భూ
లోకము పాలింపు బంధులోకముఁ గరుణం
జేకొని ప్రోవుము సజ్జన
లోకము మన్నింపు శత్రులోకవిదారీ.

66


శా.

నీ బాహాపరిరక్షణంబున గదా నిర్విఘ్నమై మా తపం
బేబాధం దిడ కిట్లు చెల్లుట ధరాధీశా! గిరీశుం ద్రిలో
కీబంధుం గరుణారసార్ద్రహృదయుం గీర్వాణవంద్యున్ దృఢ
ప్రాబల్యంబునఁ బట్టి యేఁ దప మొనర్పం గంటి నిశ్శంకతన్.

67


క.

నీవును నీ మంత్రులు నా
నావిధసుభటులును నేఁడు నా యింటికి ని
ట్లీవేళ నతిథు లయితిరి
గావున నాతిథ్య మిచటఁ గయికొన వలయున్.

68


చ.

అని తరుశాఖ డిగ్గి యతఁ డాతని నల్లనఁ జేరవచ్చినం
గనుఁగొని భక్తిపూర్వకము గాగఁ బ్రణామ మొనర్చి మోడ్పుఁగే
లొనరఁగ నో మునీంద్ర! భవదుజ్జ్వలనామ మెఱుంగఁ జెప్పవే
యనవుడుఁ బిన్ననవ్వు వదనాబ్జమునం బొడమంగ నిట్లనున్.

69


క.

ఒక పేరును నొక యూరును
నొక కులమును ననఁగఁ గలదె యోగీశ్వరజా
తికి? నయినను దాఁపగ నే
టికి సర్పటి యండ్రు నన్నొడికముగఁ బెద్దల్.

70

చ.

అని యుచితప్రసంగముల నానరనాథునిఁ బ్రీతుఁజేసి యా
తనిమది కద్భుతం బొదవ దాఁచినచోటి పదార్థసంఘముల్
గొని చనుదెంచునట్లు మునికుంజరుఁ డాక్షణమందె తెచ్చె న
య్యనిమిషధేనుసంస్మరణమం దొడఁగూడిన యట్టిభోజ్యముల్.

71


క.

అట్టిది కాదె తపస్వుల
కెట్టి పదార్థములు బ్రాతియే నిస్పృహులై
యిట్టుండుదు రట్టుండదు
రెట్టుండిన వారి నొరుల కేమన వచ్చున్.

72


వ.

ఇట్లు సద్యస్సంకల్పితంబు లగు నభిమతాహారంబులు దెచ్చి యారాజునకు
నమాత్యభృత్యసమస్తసైన్యంబునకుఁ దృప్తి గావించిన నారాత్రి యంద
యుండి మఱునాఁడు.

73


క.

తెలతెలవాఱఁగ భూపతి
వల నొప్పఁగఁ బ్రాతరుచితవర్తనములు వే
సలుపుచు సర్పటి కిట్లను
వలయును మత్సురికి రా నవశ్యము మీరల్.

74


వ.

అని ప్రార్థించి పలికిన నానరేంద్రునకు నమ్మునీంద్రుం డి ట్లనియె.

75


తే.

అధిప! మాబోటితపసుల కడవి నుండి
కూరగాయలు నమలుచు వీరఘోర
తపము సేయుచు నునికి యుక్తంబు గాక
చెలగి నగరప్రవేశంబు సేయ నగునె?

76


క.

నావుడు సర్పటితో నతఁ
డీవిధమున నాన తిత్తురే మీరు మదీ
యావాసం బిది వే ఱొక
రావే యి ట్లవధరింపుఁడా తెలియంగన్.

77


క.

ఏ మీ శిష్యుఁడఁ గానే
నామీఁది కృపాతిశయమునం జనుదేరం
గా మీకుఁ జనదె సందియ
మేమిటి కని పలుక నాతఁ డెంతయుఁ బ్రీతిన్.

78

ఆ.

మేలు గాక పొదఁడు మీమాట లేనిటం
ద్రోపు చేయఁ జాల మీపురమున
కరుగుదెంతు ననిన నౌఁ గాక యని గంధ
సింధురాధిరూఢుఁ జేసె నతని.

79


క.

దివిజగణంబులు గొలువఁగ
ధవళాశ్వము నెక్కి చనుశతక్రతుగతి న
య్యవనీశ్వరుండు వివిధా
హవవీరులు గొలువ నుత్తమాశ్వము నెక్కెన్.

80


వ.

ఇట్లు సర్పటిం దోడ్కొని చని త్ర్యంబకసఖుండగు కుబేరుండునుం బోలె
నాధీరుండు వివిధవిభవోదారుం డగుచు నిరంతరాలంకారసారం బగు ధారా
నగరంబు ప్రవేశించునప్పుడు.

81


సీ.

భూచక్రమునఁ గల రాచబిడ్డల కెల్లఁ
       దిలక మై పుట్టినచెలువుఁ డితఁడె
కర్ణాదిదాతల కర లెల్ల మఱపించి
       పేరు గాంచిన దానశూరుఁ డితఁడె
సారంబులగు చతుష్షష్టివిద్యలకును
       దాన తావక మగు ధన్యుఁ డితఁడె
దనమోముఁ జూచిన జనుల కెల్లఁ గవిత్వ
       సరణిఁ జేకుఱఁ జేయు చతురుఁ డితఁడె


తే.

నిఖిలరాజన్యమకుటమణిప్రభావి
భూషితాంఘ్రిపద్ముం డగుభోజుఁ డితఁడె
యనుచుఁ గొనియారు పౌరుల హర్షభాష
లంబునిధిఘోషమునకంటె నతిశయిల్లె.

82


వ.

ఇటు సమస్తజనంబులకు నయనపర్వంబు నిర్వహించుచుండం జని యేనుంగు
మొగసాల చొచ్చి యాన రేంద్రుం డఖిలపరివారంబు నుచితప్రకారంబున వీడు
కొల్పి సర్పటి నొక్క వీడుపట్టున విడియింపను, నతనికి నర్ఘసత్కారంబు
లాచరింపను నాప్తజనంబుల నియమించి యశ్వావతరణంబు చేసి యంతః
పురంబున కరిగి మజ్జనభోజనాదులు సల్పి యథార్హవిహారంబుల దినశేషంబు
గడపి రాత్రి యగుడు.

83

శా.

ఆవేళన్ వివిధాశ్రితవ్రజచకోరానందుఁడై విస్ఫుర
ద్భావుండై విలసత్కలాకలితుఁడై భగ్నీకృతారాతిభూ
పావష్టంభతమస్కుఁడై కువలయాహ్లాదప్రదుండై యశ
శ్రీవిభ్రాజితచంద్రికుం డయి తనర్చెకా భోజరా జున్నతిన్.

84


సీ.

సంగీతవిద్యాప్రశస్తమానసులతోఁ
       గూడి వినోదించుఁ గొంతదడవు
సాహిత్యవిద్యావిశారదాత్మకులతోఁ
       గూడి వినోదించుఁ గొంతదడవు
నృత్తవిద్యాకళాయత్తచిత్తులతోడఁ
       గూడి వినోదించుఁ గొంతతడవు
వాద్యవిద్యానిరవద్యభావకులతోఁ
       గూడి వినోదించుఁ గొంతతడవు


ఆ.

శబ్దశాస్త్ర మంత్రశాస్త్ర ధనుశ్శాస్త్ర
తురగశాస్త్రవిదులతోడిగోష్ఠి
నడుపుఁ గొంతతడవు నయశాస్త్రవేదులఁ
గూడి మాటలాడుఁ గొంతతడవు.

85


చ.

దళ మగు హంసతూలనిజతల్పమునందు నిజప్రియాంగనా
లలితకుచోపగూహనములన్ మధురాధరపానలీలలం
దలకొని యంగముల్ పులకితంబులుగా సుఖియించు నవ్విభుం
డెలమి దలిర్పఁ గొంతతడ విక్షుశరాసనుఁ గ్రేణి సేయుచున్.

86


వ.

మఱియు నెవ్వేళ నెయ్యది కర్తవ్యం బట్టి కృత్యం బప్రమత్తుం డై యొనర్చు
నప్పుడమిఱేనికి నిమిషార్థంబును నిరర్థకం బయి పోవ దిట్లు నిశాసమయ
ధర్మంబులు చెల్లుచుండ నక్కడ సర్పటి సిద్ధుండు.

87


క.

నను నీతఁడు వేడుకపడి
కొనివచ్చెను, వీనితోడి గోష్ఠికిఁ దగులై
యునికి తగ; దితని కొక మే
లొనరించి యథేచ్చఁ జనుట యుక్తము నాకున్.

88

వ.

అని తలంచి పంచలోహకల్పితంబగు నతని కొలువు చవికె సువర్ణంబు
గావించుటకు నం దున్న దీపశిఖపయి నొక్క యౌషధం బెవ్వరు నెఱుంగ
కుండునట్లుగా వైచి యథేచ్ఛం జనియె నంత సూర్యోదయంబగుడు.

89


ఉ.

మంగళపారకధ్వనులు మాగధగీతులు వందిబృంద ము
ప్పొంగి యొనర్చుసంస్తుతులుఁ బూర్ణపయోధిరవంబుచాడ్పునన్
సంగత మై శ్రుతిద్వితయసౌఖ్య మొనర్పఁగఁ జేర్చి భూమిభృ
త్పుంగవుఁ డార్యసమ్మతుఁడు భోజుఁడు మేల్కనియెం బ్రియంబునన్.

90


క.

అతఁ డట్లు మేలుకని య
చ్యుతుసంస్మృతియందుఁ దగిలి శుభలక్షణల
క్షితము లగు నిజకరాంధో
జతలంబులు చూచుచుండు సమయమునందున్.

91


చ.

వనధిన్ బుట్టె నొండె హిమవగ్గిరికిం బ్రభవించెఁ గాని యీ
ఘనకుచ యన్యసంజవిత కా దనఁగాఁ దగుకాంత యోర్తుకాం
చనమయపాత్రికన్ సురభిచందనపుష్పఫలాదివస్తువుల్
గొని చనుదెంచి చూపుమెఱుఁగుల్ వెదచల్లుచు మ్రోలనిల్చినన్.

92


వ.

భాగ్యదేవతాయత్తంబు లగునర్ధంబు లాత్మాయత్తంబులు గావించునట్లు
భక్ష్యంబు లగు తదీయద్రవ్యంబు లంగీకరించి యారాజశేఖరుండు.

93


సీ.

పాదపద్మంబులఁ బసిఁడిపావలు మెట్టి
       సముచితమందయానమున వెడలి
శౌచి యై వార్చి సుస్థలమునఁ బ్రాఙ్ముఖం
       బుగ సుఖాసీనుఁడై పుణ్యకాష్ఠ
మున దంతధావనం బొనర మౌనస్థుఁడై
       చేసి సుస్నాతుఁడై శిఖయు ధౌత
వస్త్రంబు మత్తరావాసంబు గోపికా
       చందనంబును దన కంద మొంద


ఆ.

నాచరించె వైదికాచారవిధు లెల్ల
దాన మొసఁగె విప్రతతులఁ బిలిచి

భూమిధాన్యరత్న హేమగోమహిషాశ్వ
వస్త్రభూషణాది వస్తుచయము.

94


ఉ.

అంతఁ బ్రసూనగంధవివిధాభరణాదులు దాల్చి యమ్మహీ
కాంతుఁడు రాజచిహ్నలఁ బొగడ్త వహించి సమస్తమంత్రిసా
మంతపురోహితాప్తభటమండలి గొల్వఁగ వేత్రహస్తు లం
తంతన చూచి పాయుఁ డనునట్టి యెలుంగులు నింగి ముట్టఁగన్.

95


వ.

భూలోకపాలనలాలసుం డగు త్రిదశపాలుండునుం బోలె నమ్మహీపాలుండు
వివిధవిభవశీలుం డగుచుఁ గక్ష్యంతరంబులు గడచి కొలువుకూటంబునకు
నరుగునవసరంబున నిద్దఱు భృత్యు లెదుర వచ్చి భయభ క్తియుక్తంబు లగు
చిత్తంబులు తలపడుచుండఁ బ్రణామంబు లాచరించి యిట్లని విన్నవించిరి.

96


క.

దేవర పెట్టిన చోటం
గావలి యుండుదు మొకించుకయు నాలస్యం
బేవంకను లేదు ధరి
త్రీవర! కడు మోసపోయితిమి విను నిన్నన్.

97


ఆ.

“ఏమి దైవికంబో యెఱుఁగ, మెవ్వారును
జోచ్చి వెళ్ళినట్టిచొప్పు లేదు;
పంచలోహమయవిభాసితం బగు మన
యనుఁగుమేడ పసిఁడి యయ్యె" ననిన.

98


క.

“వింటిమి మీచేఁ గ్రొత్తలు,
కంటిమె లోహంబు లెందుఁ గనక మగుట య
య్యింటికి నిట్టిమహిమ యెటు
వంటి మహాత్మకునిచేత వర్తిల్లె నొకో!"

99


వ.

అని పలుకుచుం దన మేనును బరిజనంబుల మేనులును గలయ నవలోకించి.

100


క.

పసుపున నానినవీరలు
ముసుఁగు పడినయట్లు దేహమునఁ బీతరుచుల్
పొసఁగినయవి కనకగృహము
పసిమియె కాకున్నె యని నృపతి వెఱఁ గందెన్.

101


వ.

ఇట్లు వెఱఁ గందుచుఁ బోయి సౌవర్ణగేహంబుఁ జూచి చోద్య మంది.

102

చ.

ఇది కడు నద్భుతం బిచట నెవ్వఁ డొకో యిటు చేసి పోయె, స
మ్మదమున నొక్కదివ్యుఁడు విమానగతుం డయి వచ్చి యిచ్చమై
నది యిట దించి, [7]యీచవికె యాదటఁ దా గొనిపోయె నొక్కొ యె
య్యది కత మొక్కొ హేమమయమై యిటు లుండుట యొక్క రాత్రిలోన్.

103


చ.

అని తలపోసి యాచవికెయందు వెలుంగు ప్రదీపవహ్నియుం
గనుఁగొని సర్పటిం దలఁచి కంటి నతం డిటు ధూమవేధిచే
ననువుగఁ జేసిన పరమాద్భుతకృత్యముగాఁగ నోపు, నా
యన యెటు పోయేనో వెదకుఁడా యని భోజుఁడు సంభ్రమంబుతోన్.

104


క.

తన పరమాప్తులఁ బంచిన
జని పుర మంతయును వెదకి సర్పటి నెచ్చో
టను గానక క్రమ్మఱి వ
చ్చినఁ బశ్చాత్తాపతప్తచిత్తుం డగుచున్.

105


వ.

సర్పటి యున్న వటశాఖియొద్దకు భటులం బంచిన వారును నట కేఁగి నెమకి
వచ్చి యాతనిం గాన మని విన్నవించి యరిగిన.

106


ఉ.

ఆతఁడు జను నిచ్చటికి నాదటతోఁ జనుదెంచునట్టి ప్ర
ఖ్యాతపుమార్గ మేమిగతి నొకో యని చింత చేసి యా
భూతలనాయకుండు తన బుద్ధి నుపాయ మొకండు గాంచి య
జ్ఞాతవిధంబునందు నది సాధ్యము చేయఁ దలంచి నేర్పునన్.

107


ఆ.

'శబ్దభేది గలదు చర్చింప భోజభూ
పాలునగర' ననుచుఁ బట్టణమునఁ
జాటఁ బంచె నంత సకలదేశముల న
వ్వార్త మించె నెల్లవారలకును.

108


సీ.

అట్లు కర్ణాకర్ణి నవ్వార్త విని భూమి
       గలసిద్ధు లెల్ల నయ్యలఘువిద్యం
బరికించు వేడుక నరుదెంచుచుండంగ
       నవనీశ్వరుండు రహస్యవృత్తి

నప్పైఁడిమేడ దా విప్పించి యొక్కోక
       ప్రతికి నూఱును వేయి ప్రతులు గాఁగఁ
గప్పెర లాతంబు ఘనకమండలువులు
       మొదలుగా నన్నియు మున్న చేసి


ఆ.

యితరు లెఱుఁగకుండ నిది యెవ్వ రేమి దె
చ్చినను వానిఁ బుచ్చుకొని తొలంగ
వైచి యిచ్చుఁ దన సువర్ణకల్పితములు
బొంకు నిక్క మయ్యె భోజు మతము.

109


క.

వారును దమ తెచ్చినయవి
బోరనఁ దనవిద్యవలన భోజుం డిచ్చో
గారవముఁ జేసి మా కిం
పారఁగ నిచ్చె నని సుముఖులై చనుచుండన్.

110


తే.

తీర్ధముల కేఁగున ట్లెల్లదేశముల జ
నంబులును భోజవిభునిఁ బ్రియంబుతోడఁ
జూడ నరుగంగ సర్పటి చోద్య మంది
నెమ్మి నిట్లని తలఁచుఁ జిత్తమ్మునందు.

111


చ.

వెలయఁగ శబ్దభేది యనువిద్య జగంబున భోజరాజుచే
గల దఁట, వాఁడెపో నృపనికాయముకెల్ల ను మేటి, వానిచేఁ
గలుగుట యేను మున్నెఱుఁగఁ గాని, యెఱింగినఁ బుచ్చుకొందు నాఁ
డెలమి దలిర్ప నప్పురికి నేఁగినయప్పుడ మిత్రభావనన్.

112


ఆ.

ఇంక నైన నచటి కేఁగి యానరనాథ
చంద్రుచేత నున్న శబ్దభేదిఁ
బుచ్చుకొనఁగవలయుఁ బొలుపార నాచేత
నున్నధూమవేధి యొసఁగి యైన.

113


ఉ.

తక్కువజాతియందు వనితామణియున్నను, నీచమర్త్యునం
దెక్కువవిద్య బొప్పడిన, నెంగిలిచోట సువర్ణ మబ్బినన్
దక్కక పెన్ విషంబున సుధారస ముండిన గ్రాహ్య మండ్రు; వాఁ
డొక్కమనుష్యమాత్రుఁడె మహోన్నతుఁ డున్నతరాజపూజ్యుఁడున్.

114

వ.

అదియునుం గాక.

115


చ.

గురునకు సేవ చేయుట దగుం దగువిద్యఁ బరిగ్రహింపఁగా;
నరుదుగ నర్థ మిచ్చి పడయందగు నొందె, సువిద్య యిచ్చి వి
స్తరముగ విద్య గైకొనుట దా నొక పక్షము, మూఁడురీతులం
బరగుట దక్క నాలవయుపాయము లేదని చెప్పు శాస్త్రముల్.

116


క.

కావున నాతనిచేఁ గొన
గా వచ్చును నిట్లు నాదు ఘనవిద్యయు నా
భూవరున కొసఁగ వచ్చును
టో వలయును భోజరాజపురమున కనుచున్.

117


వ.

ధారానగరంబున కేతెంచి భోజరాజుచే సత్కృతుండై యి ట్లనియె.

118


తే.

'ఆది వేఁటమై వచ్చి మీ రల్లనాఁడు
మఱ్ఱికడ నన్నుఁ బొడగని మాటలాడి
పరఁగఁ దోఁకొని రారె మీపట్టణమున
కేను సర్పటి యనువాఁడ నెఱుఁగవయ్య!

119


వ.

మీకుఁ జెప్పకపోవుటంజేపి నాఁటికొఱంత వాపికొన వచ్చితి.'
న్నరేంద్రుండు పెన్నిధిఁ గన్న పేదయుం బోలె నత్యంతసంతుష్టాంతరంగుండై
పునఃపునః [8]ప్రణామంబులు చేసి యి ట్లను, 'నీశ్వరేచ్చ గదా! దీని కేది
కొఱంత? నామీఁది కారుణ్యంబునఁ గ్రమ్మఱ నిట్లు వచ్చుటంచేసి నామనో
రథంబు సఫలం బయ్యె' నని యనే విధంబుల నూఱడించిన నాసర్పటియు
నతనిగుణవిశేషంబులు గొనియాడి యి ట్లనియె.

120


చ.

తిరిగితిఁ బెక్కుదేశములు దేవ! భవత్సము టైన మేదినీ
శ్వరుఁ బొడఁగాన, నీకు వశవర్తిని యై విలసిల్లు నట్టిభా
సుర మగు శబ్దభేది యను చోద్యపువిద్య తదీయలక్షణం
బరయఁగ వేఁడి యేను బ్రియ మారఁగ వచ్చితి నిందు భూవరా!

121


క.

అల నాఁడును నీవిద్యా
జలనిధి లోఁ తెఱుఁగలేక చపలాత్ముఁడనై

తొలఁగితి నే; నటు లుండఁగ
వలదే రాజ ననువాఁడు వసుమతిలోనన్.

122


క.

సిద్ధులలోపల నెల్లఁ బ్ర
సిద్ధుఁడు సర్పటి యనంగఁ జేయుదు నను స
ద్బుద్ధి గల దేని, నాకుఁ బ్ర
వృద్ధం బగు శబ్దభేది విద్య యొసఁగుమా!

123


క.

ఏనును నిచ్చెద నీకు న
నూనం బగు ధూమవేధి యొప్పుగ' ననినన్
‘గానిండు మీరు పెద్దలు
గానఁ దొలుత నాకు నొసఁగఁ గావలయుఁ జుడీ!

124


క.

మఱి నా కన్నతెఱంగున
నెఱిఁగించెద నాదువిద్య యేర్పడ' ననినన్
దెఱఁ గేది భోజభూపతి
కఱిముఱిఁ దనవిద్య చెప్పి యతఁ డి ట్లతియెన్.

125


ఉ.

'చెప్పెతి నాదువిద్య [9]యఱ చేయక నీదగువిద్య యేర్పడం
జెప్పుము నాకు' నావుడును జెన్నగుమోమునఁ గొంత వింత న
వ్వొప్పఁగ భోజుఁ డిట్టు లను 'నొచ్చెల నే నొక విద్యవాఁడనే
[10]తప్పుఁగఁ జిత్తగింపకుఁడు, తద్విధ మే నెఱుఁగ న్మునీశ్వరా!"

126


క.

అనిన విని 'యేటిమాటలు
ఘనతర మగు శబ్దభేది గలుగుట లేదే
జననాథ! మున్ను నీచే'
ననవుడు విని భోజుఁ డిట్టు లను నాతనితోన్.

127


ఉ.

మించగువిద్య భోజునకు మేదినిపైఁ గల దన్నశబ్ద మొ
క్కించుక నీదు వీనుల వహించినమాత్రన [11]నీ మనంబు వే
ధించుటఁ జేసి యిందుఁ జన దెంచితి గావున శబ్దభేదినా
నంచిత మైనవార్త గల దంతియ కాని యెఱుంగ నెద్దియున్.

128

ఉ.

నావుడు నిట్లు పల్కఁ దగునా? ధరణీశులు మీరు, సిద్ధవం
శావళివార మేము, నిజ మాడుము చాలును, విద్య లేనివా
రీవిధి నెల్లవారలకు నిత్తురె కాంచనకల్పితంబు లే
లా వెడమాట లీ చెనఁటిలాగున మాకును గోప మయ్యెడిన్.'

129


వ.

అని ధట్టించి పలుకునప్పు డక్కఱకుందపసి కడకన్నులం బొడముకెంపు గని
కంపించుచు నమ్మహీనాథుండు చేతులు మొగిచి 'నాకు మీచేతి ధూమవేధి
సిద్ధించుటకు నిట్టి కపటోపాయంబు చేసితి, నాతప్పు మన్నింపవలయు' ననుచు
మదకుంభి కుంభస్థలస్పర్శన కర్కశంబు లగు తనహస్తంబుల నతనిపాదం
బులు పట్టుకొనఁ బోవుటయు నతందు కోపంబు డింప నోపక యడిచిపడుచుఁ
దొలంగి యంతంత నిలిచి యి ట్లనియె.

130


క.

'రాజ వని నిన్ను నమ్మితి
భోజుఁడు ధర్మాత్ముఁ డనుట బొం కయ్యెఁ గదే
యోజ చెడ నిట్లుచేఁత ప్ర
యోజనమే వలయు ననిన నొసఁగనె నీకున్.

131


ఉ.

న న్నడకించి యొడ్డరితనంబున నాదగువిద్య నీవు గై
కొన్న సహింప నేర్తునె, తగుం దగు లెస్స విచార మయ్యెఁ బో
ము న్నటు మేలు మే లనఁగ మూర్ఖుఁడవై ధనకాంక్షఁ గాదె యీ
పిన్నతనంబు చేసి తిది పెద్దలు మెత్తురె రాజధర్మమే?

132


వ.

కావున నీవు చేసిన యపరాధంబునంజేసి నీ వనపత్యుండవు గమ్మ' ని
శపియించె.

133


చ.

అనవుడు నమ్మహుండు వినయానతుఁడై మునినాథుతోడ ని
ట్లను 'మును సిద్ధు లెవ్వరును నారయ సర్పటిభంగి మోసపో
యినవిధ మెన్నడున్ విన మరేమి నిమిత్తమొకో యతండు చే
సిన కపటప్రసంగమునఁ జిక్కుట' నావుడు నాతఁ డిట్లనున్.

134


వ.

'దీని కొక్క కారణంబు గల దాకర్ణింపుము' 'దొల్లి రంభవోలె మిక్కిలి
చక్కనిదగు నొక్క వారవనిత గలదు.

135


క.

ఆవనిత యొక్కనాఁ డొక
దేవాలయమునకు నరిగి దేవుఁడు తనకా

భావంబునఁ బొడచూపిన
కైవడి నొకసిద్ధుఁ డుండఁగాఁ బొడగనియెన్.

136


క.

కని ప్రణమిల్లిన నాతఁడు
తనతో భాషింపకున్నఁ దాఁ దొలఁగక శం
భునిఁ బురుషభిక్ష మడుగం
జనుదెంచిన రతియపోలె సన్నిధి నుండెన్.

137


క.

ధ్యానానంతరమునఁ బర
మానందవిజృంభితాక్షుఁ డై సిద్ధుఁడు 'బా
లా! నీ వెవ్వరి దానవు?
నీ నాథుం డెన్వఁ డేల నిలిచితి విచటన్?'

138


వ.

నావుడు నాసిద్ధునకు నమ్మగువ యిట్లను 'నేను వేశ్యాధర్మంబున జరించుదాన,
నిమ్మహాదేవునకు నమస్కరింప వచ్చి యిచ్చట మిమ్ముఁ గని దండప్రణా
మంబు చేసి మీకటాక్షం బపేక్షించి యున్నదాన' ననవుడు నతండు ప్రీతుండై
చేరం బిలిచి నొసలు నిండ విభూతి పెట్టి దీవించిన 'నయ్యా! మదీయావాసంబు
నకు విచ్చేయ వలయు' నని యచ్చెలువ ప్రార్థించిన.

139


క.

'ఊరు చొర నొల్ల నేను, శి
వారాధనతత్పరుండనై నెలఁ బదినా
ళ్ళీరమ్యం బగు దేవా
గారంబున నుండువేడ్క గదిరెడు నాకున్.

140


ఉ.

బాలకి పొమ్ము' నావుడుఁ దపప్విపదాబ్జయుగంబుమీఁద నీ
లాలకజాలము ల్నెరయ నాయలికుంతల సాఁగి మ్రొక్కి క్రొ
వ్వాలినకన్మెఱుంగుల నివాళి యొనర్చి రతీశమత్తశుం
డాలము నోజ బింకపునడల్ బెడఁగొందఁగ నేఁగి భక్తితోన్.

141


క.

నాడు మొదలుకొని యాపూఁ
బోఁడి యనారతముఁ దెచ్చి భోజన మిడఁగా
నేఁడొక్కటి చనునంతకు
వాఁ డక్కడ నుండు నుచితవర్తనలమెయిన్.

142

వ.

అంత నతం డక్కాంతతో నొక్కనాఁ డేకాంతంబున నిట్లను 'నేను నీతాత్ప
ర్యంబునకు మెచ్చితి, నీ కొక్క చోద్యంబగు విద్య యిచ్చెదం గొను' మని
యనుగ్రహించి.

143


ఆ.

ఔషధములు చెప్పి, యవి గూర్చువిధమును
జెప్పి దీపవహ్ని శిఖలమీఁద
వైవ ధూమవేధ వలన లోహంబులు
హేమ మగుతెఱంగు లెఱుఁగఁ జెప్పి.

144


క.

సిద్ధుఁడు చనుటయు వింత ప్ర
బుద్ధచరిత్ర యగు తోడఁబుట్టినసతి కా
శుద్ధి యెఱిఁగించి యౌషధ
సిద్ధి పడయుపనికిఁ జింత చేయుచు మదిలోన్.

145


ఉ.

కన్నులు లేనివాఁ డొకఁడు గల్గినఁ జాలు, నతండు సూరఁగా
వన్నియు మార్చవచ్చు నొరు లెవ్వరు దీని నెఱుంగకుండఁ బ్ర
చ్ఛన్నపుఁజేఁతభంగి సువిచారము సు మ్మని యొక్కరాత్రి యా
సన్నముఖాబ్జ లై మిగులఁ జప్పుడుగాని రహస్యభాషలన్.

146


క.

ఆలోచింపఁగ సర్పటి
యాలో భిక్షమున కరిగి యాపలుకులు దా
నాలించి దానికిం దగు
కీలు విచారించి మగిడెఁ గృత్రిమభంగిన్.

147


క.

మఱునాఁడు విగతచక్షుని
తెఱఁగున నొక పంచఁ జేరి దీనత దోఁపం
గొఱ మాలిన యొకపెంచిక
యఱచేతం బట్టికొని నతాననుఁ డగుచున్.

148


తే.

'కపటిఁ (?) జుం డన్న యిటు నటుఁ గదలలేవి
వాఁడఁ జుం డన్న యో భాగ్యవంతులార!
పుణ్యసతులార! నన్నుఁ గారుణ్యబుద్ధి
నరసి యుదరాగ్ని యార్పుఁడీ" యనుచు నుండ.

149

క.

అప్పొలఁతి చూచి నయనము
[12]లొప్పెడుకమలములు వోలె నున్నవి, యిది యే
చొప్పో కానం డట యితఁ
డప్పా! యిట వచ్చి చూడు మని చూపుటయున్.

150


క.

చూచి యితం డగుఁ బో మన
చూచినపని కనుచు వానిచూపుల సత్వం
బేచందమొ యని తెలియం
జూచుటకయి పెంచిలో నశుద్ధము కలియన్.

151


ఉ.

వైచినఁ బ్రత్యయార్థముగ [13]వాఁ డది ప్రీతి భుజింపఁ బోయినం
జూచి కరంబు పట్టుకొని శుద్ధము కన్నులు చెడ్డవాఁడకాఁ
జూచుచుఁ జెట్ట పట్టుకొని స్రుక్కక యింటికిఁ దెచ్చి నవ్వుచున్
వాచవు లైన భోజ్యములు వానికిఁ బెట్టుచు నే ర్పెలర్పఁగన్.

152


ఆ.

వలయుమందు లెల్ల వానిచే నూరింప
నతఁడు తోడుతోన యన్నిక్రియలు
నెఱిఁగి యొక్కనాఁడు తెఱవసమ్ముఖమున
నిలిచి నేత్రరుచులు నివ్వటిలఁగ.

153


ఉ.

'సింధురయాన! యేను నినుఁ జెంది కృతార్ధుఁడ నైతి. నన్ను నీ
వంధునిఁగాఁ దలంచి యిటు లన్నియుఁ జూపఁగ, నీప్రసాదసం
బంధము పేర్మిఁ జేసి పరిపాటి నెఱింగితి ధూమవేధి యే
నంధుఁడఁ గాను సిద్ధుఁడఁ జు మమ్మ! వధూమణి! పోయి వచ్చెదన్.'

154


క.

అనవుడు సిగ్గును గోపం
బును మదిఁ బెనఁగొనఁగ మోసపోయితిన కదా!
నను నితఁ డిట్లు ప్రమోషిం
చినదానికి మాఱు చేయఁ జెల్లదె' యనుచున్.

155


ఉ.

చేతులు మోడ్చి నిల్చి తనచిత్తము నైక్యము చేసి 'మద్గురుం
డాతతసత్యశాలి యగు టారయ నిక్కమ యయ్యె నేని నే

రీతి నితండు న న్మొఱఁగి రిత్తకు రిత్త గ్రహించె విద్య, యీ
రీతినె మోసపోయేడు ధరిత్రి నితం' డని పల్కె నల్కతో.

156


క.

అది కారణముగ సర్పటి
విదితంబుగ మోసపోయె విను, మని సతతో
భ్యుదయుఁడు దత్తాత్రేయుఁడు
మొదలిటికారణము తెల్లముగఁ జెప్పుటయున్.

157


చ.

విని మహుఁ డమ్మునీంద్రునకు వేడుక నంజలి చేసి 'యో కృపా
వననిధి! నీ ముఖంబున నవారణమై వినఁ గంటి శ్రోత్రరం
జన మొనరింపఁజాలెడు ప్రసంగము; లప్పుడు సిద్ధుఁ డల్గి భో
జనృపతిఁ దా శపించి మఱి శాపవిముక్తి యొనర్చెనే తుదిన్?'

158


చ.

అనవుడు శాంతి నొందుటకు నారయ నెట్టి ఫలంబు మీరు స
జ్జనులు గదయ్య! కోపము ప్రసాదము గల్గుట యొప్పుఁ గాక కా
దన నితరుండు చాలఁడె మహాపురుషా! యనపత్యుఁ డైనవాఁ
డొనరఁగ నూర్ధ్వలోకముల యుక్తుఁడు గాఁ డని చెప్పు శాస్త్రముల్.

159


ఉ.

పాండువిభుండు సన్మునులపజ్జఁ జనం జన నమ్మునీంద్రు లిం
దుండి యపుత్రవంతులకు నొందఁగ రా, దివి దివ్యభూము, లీ
వుండుము, నావుదున్ మగిడి యుల్లము డిల్లము చెంద నవ్విభుం
డొండొక ధర్మమార్గమున నొప్పుగ సంతతి నిర్వహింపఁడే?

160


ఉ.

కాన మనుష్యు లూర్ధ్వగతి గొంచుటకుం దగుసాధనంబు సం
తానమ, యట్టి సంతతి య తప్పునయేని ధనంబు లేల? నా
కీనిఖిలావనీభరము నేల? శరీరసుఖంబు లేల? నీ
తోన చరింప వత్తు ననుఁ దోఁకొని పొ మ్మని వెచ్చ నూర్చుచున్.

161


వ.

ఉండె నప్పుడు సర్పటి.

162


చ.

'వలవనిదుఃఖ మేల? జనవల్లభ! మర్త్యుఁడు దానధర్మముల్
సలుపఁగ నూర్ధ్వలోకములు సాధ్యము గా వెటు? కన్నబిడ్డలే
పొలుపుగఁ దన్ను సద్గతికిఁ బుత్తురె? యీ పెడబుద్ధు లేల? నా
పలుకు దృఢంబుగా వినుము పార్థివశేఖర! లెమ్ము నెమ్మితోన్.

163

క.

అనవుడు 'మీయట్టి మహా
త్మున కెవ్వరు వలదు గాక, మునుకొని గృహధ
ర్మనిరూఢుఁడ నగు నాకుం
దనయులు వల దయ్య? రిత్త తర్కము లేలా?

164


క.

ఆరయ సంసారమునకు
దారాపత్యములు గావె తగునంగము లిం
పార నవి లేనిపురుషుని
పే రెవ్వఁ డెఱుంగు వాని పెం పేమిటికిన్?

165


ఆ.

దివియ లేనిగృహము తెఱఁగున సంతాన
రహితుఁ డైనవాని బ్రతుకు చూడఁ
గడు నిరర్ధకంబు గాదె? నావుడు నతఁ
డతనితోడ నిట్టు లనియె నధిప!

166


ఆ.

'సుతుఁడు, నిధియు, వనముఁ, గృతియు, నల్లిల్లును,
గుడియుఁ, జెఱువు ననఁగఁ బుడమియందు
సంస్తుతింపఁ బరగు సప్తసంతానముల్
గలవు కీర్తిసుకృతకారణములు.

167


తే.

తొలుత నిందులోఁ బుత్రుండు తొలఁగె నేని
నున్నయాఱును నేలోక మొసఁగఁ జాల
వధిప! యిన్నింటిలోపల నధిక మరయఁ
గృతియ చూ నిత్యకీర్తికి గతియుఁ గాన.

168


క.

తొల్లిటిపెద్దల చరితలు
తెల్లంబుగ నేఁడు మనకుఁ దెలియుట ధరణీ
వల్లభ! యిటు వినుమా! విల
సిల్లుకృతులవలన నగుట సిద్ధము గాదే

169


ఉ.

ఆర్వురు చక్రవర్తులుఁ బదార్వురు రాజులు నేఁటివారలే?
యుర్వి బహుప్రకారముల నొప్పుగఁ బోలన చేయరే? గుణా
ఖర్వులు వారలుం జనిరి కాదె? తదీయయశంబు లెల్లెడం
బర్వుట సత్కవీంద్రఘనభాషితసత్కృతిమూలమే కదా.

170

క.

కావునఁ గృతు లొనరింపం
గా విద్వజ్జనులఁ బంపు గారవ మెసఁగన్;
దేవాలయములుఁ జెఱువులుఁ
గావింపుము, ధనము లిమ్ము! కడు పేదలకున్.'

171


చ.

అనవుడు భోజుఁ డిట్టు లను నక్కట భూజను లెల్లవారలున్
దనయులముద్దుఁజేఁతల సుధారసపానము చేసినట్లు నె
మ్మన మలరంగ సౌఖ్యరసమగ్నులుగాఁ గనుఁగొంచు ముచ్చటల్
దనుకగ నెవ్విధంబున నలందురుచుండెడువాఁడఁ? జెప్పుమా!'

172


ఉ.

నావుడుఁ 'బుత్రమోహము ఘనంబుగ నున్నది రాజుడెందమం
దేవిధిఁ దేర్చువాఁడ? నతఁ దేమని తేర్చినఁ దేరఁ డక్కటా
నావచనం బమోఘమయినం దగ నొక్కతెఱంగు చేసి యీ
భూవిభుకాంక్షఁ దీర్తు నని బుద్ధిఁ దలంచుచు సిద్ధుఁ డిట్లనున్.

173


క.

'ఓ రాజ! నాదువాక్యం
బేరూపున బొంకుఁ బొరయ దీవును సంతా
నారూఢి బుద్ధి వదలఁగ
నేరవు విను మొకవిధంబు నీ కొనరింతున్.

174


క.

నీవు గదా యిప్పుడు నా
చే విద్యాసంగ్రహంబు చేసితి కపట
ప్రావీణ్యంబున; నిది నీ
చే వినువారలకుఁ బంపు చేయక యుండున్.

175


సీ.

ఉర్వీశ! వినుము విద్యోపదేశము చేయు
       వాఁడు తండ్రియుఁ గొనువాఁడు సుతుఁడు
నని చెప్పుదురు పెద్ద లటు గాన నీకు నే
       తన్మూలమైనసంతానకరణి
లేకుండు, నది నెపంబై కొని శాపంబు
       తుది డిందుపడఁగ నేరదు, తదీయ
దోషంబువలన ముక్తుఁడవుగా నొండుపా
       యము లేదు గాన, నీయనువు నెనయఁ

తే.

దగ విచారించి చేసితి, దానఁజేసి
పుత్రవంతుఁడ వగుము పవిత్రచరిత!
యోడకుండుము నీ' వని యూఱడించి
మనుజవిభుతోడ సర్పటి యనియె మఱియు.

176


సీ.

బొంకెడుపురుషునిఁ బొంద నొల్లదు లక్ష్మి
       తొల్లింటి సిరియును దొలఁగి పోవు;
బ్రహ్మహత్యాదిపాపము లెన్ని యైనను
       నిల నసత్యంబుతో నెత్తు రావు,
మద్యపానము చేయ మరగినాతనికంటెఁ
       గీడు సు మ్మనృతంబు లాడువాఁడె;
యూర్ధ్వలోకముత్రోవ యుడిగించి యధమలో
       కప్రాప్తి గావించుఁ గల్లతనము,


ఆ.

కాన నింతనుండి మానవేశ్వర! నీవు
నిత్యసత్యనిష్ఠ నెఱపు మయ్య
సత్యమందె నిలుచు సర్వలోకములు, స
త్యవ్రతంబుకంటెఁ దపము లేదు.

177


క.

ఇప్పుడు నీకును నాకును
జొప్పడిన వివాదమునకు శోకింపకు, నీ
తప్పున నై నది గా దిది
యప్పరమేశ్వరుఁడు మూల ముఖిలంబునకున్.

178


క.

అని బోధింప నతఁడు దన
మనము శరత్కాలసరసిమాడ్కిఁ బ్రసన్న
త్వనిరూఢంబుగ నాతనిఁ
గనుఁగొని యి ట్లనియె వినయ గౌరవ మెసఁగన్.

179


క.

'మీకరుణఁజేసి వంధ్యత
లేక మదీయోదరము ఫలించినఁ జాలున్
నా కంతియ పదివేలు, ని
రాకులమతి నైతి' ననియె నని చెప్పుటయున్.

180

క.

ఆకర్ణించి మహుండు 'ప్ర
భాకరసమతేజ! నీకృపం బుణ్యకథల్
నాకు విన నయ్యె భోజుం
డేకరణిఁ జరించె సిద్ధుఁ డే మైఁ జనియెన్.'

181


వ.

అని తదనంతరకథాకర్ణనోత్సుకుం డయి యడిగిన.

182


చ.

సరసిజనాభ! భక్తజనసంచితపుణ్యఫలప్రదాన! వా
గ్వరనుతపాదపంకజ! జగన్నివహాభయదానభూమ! మం
దరగిరిమూలమండిత! రథాయితచారుఖగాన్వయేశ! శం
కరరమణీసదాస్మరణకారణనిర్మలనామశోభితా!

183


క.

గర్వితహిరణ్యకశిపు వ
పుర్విదళనకరణఘననిపుణనఖనికరా
పూర్వాయుధ! కరసంభృత
సర్వాయుధ! దురితతిమిరచండమయూఖా!

184


మత్తకోకిల.

నీలనీరదచారుకోమలనిర్మలాంగ! విజృంభితా
భీలదానవమానమర్దన! భీమనక్రగృహీతశుం
డాలభీతినిరాస! ఘోరకురారలూనసమస్తభూ
పాలకానన! సన్మునీశ్వరపాలనా! నరకేసరీ!

185

గద్యము
ఇది వాణీవరప్రసాదలబ్దవాగ్విభవ తిక్కనామాత్యసంభవ
సుకవిజనవిధేయ అనంతయ నామధేయ ప్రణితంబైన
భోజరాజీయంబను కావ్యంబునందు
ద్వితీయాశ్వాసము

  1. ఇట్లు పుణ్య
  2. గుండమందు
  3. నంగనారత్నంబులు
  4. పూర్ణ
  5. పాగయో
  6. గానగుణ
  7. యాచవికె
  8. ప్రణమంబు
  9. యర
  10. తప్పఁగ
  11. నా
  12. లొప్పెడు చెలువంబు వలెను నున్నవి
  13. వా డతి ప్రీతి