Jump to content

భోజరాజీయము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

భోజరాజీయము

తృతీయాశ్వాసము

శ్రీరమణీకుచకుంకుమ
సారారుణవిపులవక్ష జలజదళాక్షా!
మారశతకోటిసుభగశ
రీర! నిగమగిరివిహార! శ్రీనరసింహా!

1


వ.

అవధరింపుము దత్తాత్రేయ మునీంద్రుం డన్నరేంద్రున కి ట్లనియె.

2


ఆ.

అట్లు నిష్కళంకుఁ డై భోజుఁ డనఘ! యా
కొంటి నీ నిరర్థగోష్ఠిఁ దగిలి
యారగింపకుండ లే రింత తడవు బా
లురును యోగివరులు సరియ కాన.

3


క.

'ఇంతకు మీ కోడం డ్రొన
రింతురు భోజనము నాకుఁ బ్రియ మయ్యెడు మీ
బంతిఁ బ్రసాదము గొనఁగా
నంతఃపురమునకుఁ బోద మరుదెం డనియెన్.'

4


క.

అతఁ డట్లు తన్నుఁ బిల్చుడు
నతఁ డిట్లను నతనితోడ 'నయ్యా! నీయా
నతి యిది యిట్టిద యగు; మ
ద్వ్రతపద్ధతి వినుము చెప్పెదం దెలియంగన్.

5


ఉ.

చేయుదుఁ బంచభిక్ష, యిటు చేయుట నానియమంబు, మీరు వి
చ్చేయుఁడు వేళ యయ్యెను భుజింపఁగ' నావుడు భోజుఁ డి ట్లనున్

'బాయక దీన మీకు వ్రతభంగము గా దిది యేకభిక్షగాఁ
జేయుఁడు వేఁడు మాచనవుఁ జేకొని మద్గృహమందు' నావుడు.

6


తే.

'పంచభిక్షయు నాహారపరత లేక
యునికి యును నొక్కరూప కావున నరేంద్ర!
వ్రతము పూనితి గురునాజ్ఞ వదల రాదు
వలదు పొం' డని సిద్ధుండు పలుకుటయును.

7


తే.

'ఎచట మీరేఱుఁగనిధర్మ మేమి గలదు
వినుఁడు మీతోడు మాటాడ వెఱతుఁ గాని
పూనియొండులప్రార్ధన భోజనంబు
సదుపవాసంబుగాఁ జెప్పు శాస్త్రచయము.'

8


వ.

అనిన సర్పటి యి ట్లనియె.

9


క.

'అది యట్టిద యగు నైనను
విదితంబుగఁ బంచభిక్ష విడువక కొనువా
రది యుడిగి యొక్కభిక్షకు
మది చొనుపుదు రయ్య! యెంత మచ్చిక యైనన్.

10


క.

అనవుడు నవ్విభుఁ డి ట్లను
'ననఘా! భిక్షాశనంబ యత్యంతముగాఁ
గొనియాడెద రం దయ్యెడు
విమతవిశేషంబు నాకు వినిపింపుఁ డొగిన్.'

11


సీ.

అనిన నిట్లను సిద్ధుఁ 'డధిప! భిక్షాశి ని
       రాహారుఁ డని చెప్పు నాగమంబు
అది యప్రతిగ్రహం బై చెల్లు నె ట్లన్న
       దృష్టంబు జెప్పెదఁ దెలియ వినుము
నయమునఁ బుష్ప మేమియుఁ గందకుండంగ
       మధుసంగ్రహము చేయుమధుకరంబు
కరణి గృహస్థు లెవ్వరును వేసరకుండ
       నపరాహ్ణసమయంబునందుఁ జేయు

తే.

భిక్ష మాధుకరం బనుపేరఁ బరగుఁ
గాన నది భూమి నప్రతిగ్రహము నయ్యె
నది నిరాహారసంకోశ మదియుఁ గాక
యొకవిశేషంబు చెప్పెద నొసర వినుము.

12


క.

ఈ నియమంబున భిక్షయ
మానుగఁ గొను పరమయోగిమహిమలు చెప్పం
గా నేల యతని కిడునది
దా నొక్కటి కోటిఫలము తప్పదు గృహికిన్.

13


వ.

అని సర్పటి సిద్ధుండు చెప్పిన విని భోజనరేంద్రుండు ముకుళీకృతకరారవిందుం
డగుచు నిట్లనియె, 'గృహపతికి నతిథిం గడపుట యతినింద్యంబుగా విందు,
నిది యేమి చందం బానతి' మ్మనిన నతం డతని కిట్లనియె 'మనుష్యుండు
పుట్టినగోలిం నీడుమలం బడి గడియంచిన యెడమి పుడమిఱేఁ డలిగి గడియ
దడవులోన నొడగోలు గొన శక్తుం డగునట్లు గృహాగతుం డగు నతిథి
తిరస్కృతుండై యతని పూర్వార్జితసుకృతంబు లన్నియు నపహరింపఁ
జాలు, నట్లు గావున.

14


క.

మానుగ గృహి మధ్యాహ్న
స్నానముఁ జేసినది మొదలు సద్ధర్మరతిం
దా నశనము గొనునదితుద
గా నతిథికిఁ బెట్టవలయుఁ; గాదు గుడువఁగన్.

15


క.

వినుము విశేషంచియుఁ బురు
షుని భోజనవేళ నతిథి క్షుత్పీడితుఁడై
చనుదెంచి గ్రాస మడిగిన
దనముందటి యశన మైనఁ దగు నొసఁగంగన్.

16

పుష్పగంధి కథ

క.

ఈ సదృశార్ధమునకు నితి
హాస మొకటి గలదు విను నృపాగ్రేసర! పృ
థ్వీసతి ముఖతిలకంబు న
దీసంయుత మగు కళింగదేశమునందున్.

17

సీ.

పుండరీకం బను పుర మొప్పు నప్పురం
       బున కధీశ్వరుఁడు ప్రభూతయశుఁడు
సంపాతి యనురాజు సద్గుణశీలుఁ డా
       చారవంతుఁడు నిత్యసత్యధనుఁడు
చర్చింప శ్రీరామచంద్రుతో నెనవచ్చు,
       నితరుల తరముగా దతనిఁ బోల
నట్టి భూతలనాథు నర్ధాంగశోభిని
       వర్ణిత రూపలావణ్యసదన


ఆ.

చంద్రరేఖ యనఁగ జానకిఁ బోలు న
ప్పడతి వంధ్యయగుడుఁ బ్రార్థివేంద్రుఁ
డధికనిష్ఠ నభవు నర్చించి సంతాన
మడిగె నవ్విభుండు నట్ల యొసఁగె.

18


క.

పరమేశ్వరుఁ డ ట్లొసఁగిన
వరప్రసాదమునఁ జేసి వసుధాధిపశే
ఖరుఁడగు సంపాతివలనఁ
గర మొప్పఁగఁ జంద్రరేఖ గర్భిణి యయ్యెన్.

19


వ.

అంత నవమాసంబులుఁ బరిపూర్ణం బగుటయు నొక్క పుణ్యదివసంబునందు.

20


క.

విమలపయోనిధివీచీ
సముదిత యగు లక్ష్మివోలె సౌందర్యాద్యు
త్తమలక్షణలక్షిత యై
కుమారి యుదయించే దాచకోమలి కెలమిన్.

21


క.

సుతయుదయవేళ నయ్యెడు
వితతశుభాశుభము లెఱుఁగ వేఁడి ధరిత్రీ
పతి యడిగినఁ జెప్పెఁ బురో
హితుఁడు గ్రహస్థానములు నిరీక్షించి తగన్.

22


ఉ.

'ఇప్పటివేళ చూడ మనుజేశ్వర! తక్కిన గండదోషముల్
చెప్పఁగ లేవు , భావిఫలచిహ్న మొకం డటు చిత్తగింపుఁ దా!

యిప్పడతిం గరగ్రహణ మెవ్వఁడు చేసె నతండు లేఁ డగుం
దప్పదు బ్రహ్మరాక్షసుకతంబునఁ దొమ్మిదినాళ్ళనాఁటికిన్.

23


క.

అని చెప్పినఁ గర్ణద్వయ
మును జూఁడినచంద మైన మూర్చాగతుఁడై
జనవిభుఁడు కొంతతడవున
కు నొకించుక తెలిసి యెలుఁగు కుత్తుక దగులన్.

24


సీ.

కొడుకు పుట్టెడు నని కొండంత యాసలో
       నుండంగఁ దుదిఁ గూఁతు రుద్భవించె,
నది యైనఁ గన్నులయెదుర నెమ్మది నున్న
       నుల్లంబు గొండొక యూరడిల్లుఁ,
బరమేశుఁ డిదియును బట్టక పోఁ జేసె
       నట్టినందన యీఁగి యరయ నెద్ది
సంతతి లేనినాఁ డింత యెఱుంగము
       కడపట దుఃఖంబు గట్టెఁ దెచ్చి


ఆ.

యేమి చేయువాఁడ, నిమ్మహాదురవస్థ
నెట్టి భంగి నపనయించువాఁడ'
ననుచు వగవఁ దొడఁగె నారాజపుంగవుఁ
డరుల కైన నాత్మ నడలు వొడమ.

25


క.

అంతయుఁ గనుఁగొని విప్రులు
'వింత లె భూజనుల కరయ విధికృతములు, మీ
రింతటి పనికై యే లొకొ
చింతించెద రయ్య ధీరచిత్తుల రయ్యున్

26


క.

తనయోత్సవసమయం బిది
జననాయక! నీకు శోకసమయమె వగవం
బని లేదు లెమ్ము శీఘ్రం
బున నడుపుము జాతకర్మములు సకలంబున్.

27


ఉ.

ఇం కొకనాఁడు వచ్చుపని కిప్పుడు యింత దలంక నేల? మీ
వంకఁ గృపావిధేయుఁ డగువాఁ డొకపుణ్యుఁడు గల్గె నేని న

య్యంకిలి దీర్ప కున్నె' యని యందఱుఁ జెప్పినఁ జింత దక్కి యా
పంకజపట్టణాధిపుఁడు బాలకిఁ జూచి కృతార్హకృత్యుఁడై.

28


వ.

పట్టణం బలంకృతంబు సేయించి భూసురాశీర్వాదంబులతోఁ బుణ్యాహంబు
చేసి పుష్పగంధి యను [1]నామంబిడి సుఖం బుండునంత దాదులు పెనుప
శైశవవినోదంబుల ముద్దు సూపుచు నాపుష్పగంధి రూపవిలాసవిభ్రమంబుల
జిగి దళుకొత్తఁ బెరిగి చెలికత్తియలం గూడి బొమ్మపెండ్లిండ్లు సేయుచు
భాగ్యప్రదంబు లగు నోములు నోముచు మఱియు వివిధవిహారంబులు సలుపు
చుండ నిజపుత్రీలాలనలాలసుం డగు నమ్మహీనాథుండు తద్వయోరూపంబు
లకు ననురూపంబులగు విద్యావిలాసంబు లభ్యసింప నియోగించిన.

29


ఉ.

భారతి యొండె నొండె నల పార్వతిగాని తలంచి చూడ నీ
నీరజనేత్ర యొక్క ధరణీపతిపుత్రికమాత్ర గాదు వో
ధారుణి నంచు సజ్జనకదంబము మెచ్చఁగ, సాక్షిభూత యై
చేరి గురుండు చెప్ప నతిశీఘ్ర మెలర్ప గ్రహించె నేర్పునన్.

30


క.

పాటయుఁ జదువును, వ్రాతయు,
నాటయు, వాద్యంబు నాదియగు విద్యలకున్
మేటి యని పొగడఁ దగియెడు
పాటిగఁ దా నభ్యసించె బాలిక పేర్మిన్.

31


వ.

అంత నొక్కనాఁడు దనకూఁతు విద్యావిశేషంబులకు సంతోషంబు నొంది
గాఢాలింగనంబు చేపి మస్తకంబు మూర్కొనుచుం దొడపై బెట్టుకొని తన
మనంబున.

32


ఉ.

పెంపు దలిర్ప నీతరుణి పెండిలి చేసితిమేని నల్లునిం
జంపును బ్రహ్మరాక్షసుఁడు, చాలము తద్దురవస్ధ యేము మీ
క్షింపఁగ; నింక మాకుఁ బరికింపఁ దనూభవయుం దనూజుఁడున్
సొం పెసలారఁగానిదియ చు మ్మని నిశ్చితవృత్తి నుండఁగన్.

33


సీ.

బాలికజఘనంబు ప్రబలెఁ దోరంబుగ
       వెడవిల్తు నేకాంతవేది యనఁగ

నెలనాగ నూగారు నేర్పడి కడు నొప్పెఁ
       బంచబాణుని మీనుపడగ యనఁగ
ముదిత లేఁజన్నులు మొన లెత్తి బలసె నం
       గజుఁ డేలు మేటిదుర్గము లనంగఁ
గన్నియనిడువాలుఁగన్నులు మెఱుఁ గెక్కె
       నతనుని క్రొవ్వాఁడి యమ్ము లనఁగ


ఆ.

నతివనడపు మెఱసె రతిరాజుసాధన
గతు లనంగ, విమలకమలనేత్ర
పలుకు లమరె భావభవు మంత్రసారంబు
లనఁగ నాడునాఁటి కందమగుచు.

34


క.

ఆ నయనము లా నునుఁగురు
లా నగుమొగ మా మృదూక్తు లా గాంభీర్యం
బానడుపు లా విలాసము
లా నెలఁతకె యొప్పు నొరుల కలవడ వెందున్.

35


ఆ.

అంత నత్యంతరూపసత్కాంతులందుఁ
బువ్వువిల్కానిఁ బ్రోచు నా పుష్పగంధి
జవ్వనముతోన నిలఁ గల యవ్వనంబు
లెలమిఁ బొంద వసంత మి ట్లేఁగుదెంచె.

36


ఉ.

అట్టి వసంతవేళఁ గుసుమాపచయోత్సుకబుద్ధి నెమ్మదిం
బుట్టఁగఁ బుష్పగంధి తనబోఁటులు దానును బూర్ణచంద్రు తోఁ
బుట్టినయట్టి కాంతిగల ముద్దుమొగంబు నెలర్ప నందెలున్
మట్టెలు దట్టమై చెలఁగ మందగతిం జని యవ్వనంబునన్.

37


ఉ.

కంతుని పూజ సేయుదము కాంచనపుష్పచయంబు లీవు, సే
వంతులు నీవు, నీవు విరవాదులు, పొన్నలు నీవు, నీవు వా
సంతిక, లీవు గొజ్జఁగులు, చంపకమంజరు లీవు దెమ్ము, మా
వంతు సరోరుహంబు లని వావిరిఁ గోయఁదొణంగి రందఱున్.

38

వ.

ఇట్లు పుష్పాపచయాపదేశంబున నారామ లారామం బంతయుఁ దమమయంబ
కా విహరించి సరసాలాపంబులు నెఱయ మెఱయుచుండఁ గ్రమక్రమంబున.

39


ఉ.

నీరధిఁ గాలకూటము జనించినయ ట్లరుదెంచె గ్రీష్మ మీ
ధారుణిఁ, గృత్తివాసుఁ డది దాఁ గబళింపఁ గడంగుభంగి నే
పారెఁ బయోదవేళ, సుర లంతట సంతస మందినట్టు లం
భోరుహజృంభణం బమరఁ బొల్చె శరత్సమయంబు పెంపునన్.

40


క.

మడుఁగులు, బావులు, కొలకులు
వడి వెట్టిన యమృతరసము వడువున నిండా
రెడు నిర్మలజలములచేఁ
గడు రమ్యంబు లయి జగతిఁ గడుఁ బొగ డొందెన్.

41


వ.

అయ్యవసరంబున.

42


క.

సలిలవిహారక్రియలకుఁ
దలకొనుమదితోడ నృపసుతారత్నము నె
చ్చెలిపిండుతోడ నా పు
వ్విలుతుని [2]దీమంబు వోలె వెలువడి యొకచోన్.

43


చ.

చిగురుల పెంపుఁ, [3]గ్రొన్ననలవెన్నును, బువ్వులసొంపునై కడుం
బొగడఁగ నొప్పుశాఖల నభోవలయంబు నతిక్రమించి, మిం
చగు తరువాటికాతటమునందు మహాత్ములచిత్తవృత్తియ
ట్లొగిఁ గడు స్వచ్ఛమైన కొల నొక్కటి చేరి మహాముదంబునన్.

44


సీ.

తొలిఁదొలిఁ జొర నోడు చెలువలచిత్తముఁ
       దెలిపి యాటలకు మైకొలిపి కొలిపి
యోలోల యవి లీల నో ర్తోర్తుఁ దేర్కొని
       పరువడి చెయ్యీక పారి పాఱి
యాదట నితరేతరాస్యపద్మములపై
       గరయంత్రధారలు పఱపి పఱపి
వికచపద్మపరాగవిసరంబు పుచ్చి చే
       సాఁచి యొండొరులపైఁ జల్లి చల్లి

ఆ.

జలజసక్త మధుపములఁ జోఁపి చోఁపి రా
యంచపదుపుఁ బట్టఁ బొంచి పొంచి
దరులఁ జెంది చెంది ధవళాయతాక్షు ల
క్కొలన నట్లు కేలి సలిపి రంత.

45


ఉ.

మాళవనందభూపతి కుమారుఁడు సద్గుణమండనుండు నాఁ
జాలినరత్నమండనుఁడు సత్యసమన్వితుఁ డేఁగుదెంచె వా
తూలసమానయానమునఁ దోడికుమారులు దాను సింహశా
ర్దూలభయంకరాటవులఁ దూఱుచు నేర్పున డేగవేఁటకున్.

46


ఆ.

అరుగుదేరఁ దేర నారాజనందనుఁ
గూడి పాఱ లేక తోడిసఖులు
నిలిచి రంబరమున నిగుడుభానునిఁ గూడి
యరుగ లేని గ్రహచయంబు నట్ల.

47


క.

ఇవ్విధమున నందఱు దవు
దవ్వులఁ దిగఁబడఁగ నింద్రదత్తుం డనువాఁ
డవ్విధునిఁ గూడి నెయ్యము
నివ్వటిలఁగ నడచెఁ దోడునీడయ పోలెన్.

48


వ.

అప్పుడు.

49


ఆ.

డేగవేఁటయందు డెందంబు నిలిపి గో
పాలవేష ముడిగి తాలకేతు
సహితుఁడై ధరిత్రి విహరింపఁ జొచ్చిన
నందసుతునిఁ బోలె నందసుతుఁడు.

50


క.

అనుచరుఁడుఁ దాను నేక్రియ
విన విస్మయ మైనయట్టి వేఁటలతమకం
బున నిది సమ మిది విషమం
బనక చనుచుఁ గనియె నమ్మహాపుర మెదురన్.

51


చ.

కని 'యిది యేపురంబు చెలికాఁడ! మహోన్నతవప్రశాఖియై
ఘనసదనాభిశోభి యయి కంధరబంధురహర్మరమ్యమై

యొనరెడుఁ గంచియో, మధురయో మిథిలాపురమో విదర్భయో
తనరు నయోధ్యయో శ్రుతిహితంబుగఁ జెప్పుము నాకు' నావుడున్.

52


ఉ.

ఆతఁడు రత్నమండనున కాదట నిట్లని చెప్పె నప్డు 'ప్ర
ఖ్యాతిగ నీవు పేర్కొనిన యట్టివి యెద్దియుఁ గాదు సుమ్ము, సం
పాతి యనంగ నొక్కనరపాలకు ప్రో లిది, దీని పేరు వి
న్మా తగఁ బుండరీకము రమాసదనం బిది శబ్దతుల్యతన్.

53


క.

ఈ రాజు ధర్మవర్తనుఁ,
డీరాజ్యములోని ప్రజలు నిందఱు విహితా
చారైకరతులు దురితవి
దూరు లనుచు నెపుడుఁ జెప్పుదురు సత్పురుషుల్.

54


వ.

అని యింద్రదత్తుండు చెప్పుపలుకులు విని రాజసుతుండు ప్రీతిచేతస్కుం
డగుచుఁ జని చని తనచేతి డేగ నొక్క మహీరుహంబుపై నున్న విహంగంబు
నకు వైచిన.

55


ఉ.

జువ్వను మ్రోఁతతో నెదు రెఱుంగనివీఁకఁ బరాక్రమించుచో
నవ్విహగంబు తద్ఘనతరారుణదారుణనేత్రరోచులన్
నివ్వెఱఁ గంది కాల్కొనఁగ నేరక మేదినిఁ గూలెఁ గూలినం
జివ్వనఁ దేలిపోయి యొకచెట్టున వ్రాలెఁ గరంబు దవ్వులన్.

56


క.

ఆ డేగ యట్లు వ్రాలిన
వేడుక నవ్వనమునందు విలసితనీలం
గ్రీడించుబాలికాజన
చూడామణి పుష్పగంధి చూచి కండంకన్.

57


క.

పట్టెదను డేగ ననుచును
నిట్టలమునఁ జెలుల మొఱఁగి యీక్షణరోచుల్
దట్టము లై ముందట వెద
వెట్టినటులు గలయఁ బొలయఁ బెద్దయుఁ బ్రీతిన్.

58


క.

అడుగులఁ జప్పుడు కాకుం
డెడునట్లుగఁ గదియఁ బోయి డేగా! యిదె నం

జుడు గొ మ్మని యొక యెలమా
మిడిచిగు రటు చూపుచుండె మెలఁతుక యంతన్.

59


క.

అచ్చపుఁదమకంబునఁ దన
నెచ్చెలి నచ్చోన డించి నృపతితనూజుం
డచ్చెలువ లున్నతోఁటకు
వచ్చెం దన డేగ యెందు వ్రాలెనొ యనుచున్.

60


ఉ.

వచ్చి యతండు చూచెఁ జెలువంబులప్రోఁక, విలాసలక్ష్మికిం
జొచ్చినయిల్లు, సౌఖ్యములచోటు, వికాసముతానకంబు, క
న్నిచ్చల యున్కిపట్టు, కుసుమేషువికారము జన్మభూమి నా
నచ్చగుపుష్పగంధిఁ జపలాయతనేత్రఁ బయోరుహాననన్.

61


క.

ఆ తరుణీమణియును నృప
సూతి తనూవిలసనాతిశోభాసక్తం
బై తన చూడ్కి నిగుడఁ బ్ర
స్ఫీతగతిం దోఁచెఁ గుడ్యచిత్రము భంగిన్.

62


చ.

ఇరువురచూపులుం దనకు నింపగుతూపులు గాఁగఁ బేర్చి యొం
డొరువుల మర్మము ల్గలఁగ నూఱటఁ జెందని హస్తలాఘవ
స్ఫురణ మెలర్ప శంబర నిషూదనుఁ దార్చుచుఁ బింజపింజతో
నొరయ నిరంతరంబుగ మహోద్ధతుఁడై తెగి యేసె నత్తఱిన్.

63


క.

కోరుదు రొండొరుఁ గదయఁగఁ
గోరుదు రితరేతరోపగూహనసుఖముం
గోరుదు రన్యోన్యాధర
సారసుధారుచులు దనివి సనఁ గ్రోలంగన్.

64


క.

ఇ ట్ల య్యిరువురుఁ దమలో
జట్లు వడనికోర్కు లక్కజంబుగ సఖు లీ
చి ట్లెఱిఁగినఁ గార్యము తుది
నెట్లగునో యనుచు నుండ నింతటిలోనన్.

65


చ.

కనుఁగొని పుష్పగంధి చెలికత్తియ మాలిని నాఁగ నొక్కయం
గన చనుదెంచి యిద్దఱ ముఖంబులఁ దోఁచుమనోవికారముల్

తన మది నిశ్చయించి క్రియ దప్పదె యిం కిట యే నుపేక్ష చే
సిన నని యాసరోజముఖిఁ జేరి ప్రియోక్తుల గారవించుచున్.

66


ఆ.

తరుణి! మనము వచ్చి తడ వయ్యె నాటలు
చాల వమ్మ! ప్రొద్దు వ్రాలె మిగుల
నీకు నెదురు చూచు నృపసతీతిలకంబు
పాలి కరుగ నింకఁ బాడి గాదె.'

67


తే.

అనిన నయ్యింతి సిగ్గున నవనతాస్య
యయ్యె, నేమి సేయుదు నల్ల యవనినాథ
తనయుఁ డిందుఁ బ్రవేశించె ననుచుఁ దనదు
హృదయ మావయస్యకుఁ జూపునదియ పోలె.

68


వ.

మఱియు నతెతేఱవ తత్సమయసముచితోక్తులు పలుకుచుఁ గైదండ యిచ్చి
యమ్మచ్చెకంటి నచ్చోటు గదల్చి తెచ్చునప్పు డచ్చెలువుండు పచ్చవిల్తు
నచ్చవిరితూపులచే నొచ్చి వెచ్చ నూర్చుచుం గూర్చుండం బది పై పై
నివ్వటిల్లునెవ్వగల నొగిలి మూర్ఛిల్లె; నాపుష్పగంధియుం గొంతద వ్వరిగి
యరిగి మనోజాతశరస్యూతయై సోలి వ్రాలె నంత.

69


క.

అక్కట మనోజవేదనఁ
జిక్కె భవత్సఖుఁడు, వానిఁ జేకొను మనున
ట్లొక్కటఁ బలికెడు శుకములఁ
దక్కక కనుఁగొనుచు నింద్రదత్తుఁడు వచ్చెన్.

70


ఆ.

వచ్చి యతనియునికిఁ గచ్చఱఁ జూచి డెం
దమునఁ గొందలంబు దలకొనంగ
'హా కుమారతిలక! హా రత్నమండన!
యెట్లు సంభవించె నిట్టియెడరు?'

71


వ.

అని పలికి మఱియును.

72


క.

పాము గలదొ, కాదెఁ బెను
గాము గలదొ యదియుఁ గాక క్షత్రియకులజుం

డీమెయిఁ [4]బొలసిన గయికొని
యే మేనియుఁ జేయుభూత మిచ్చటఁ గలదో!

73


ఉ.

ఇయ్యవనీశనందనున కిప్పుడ యీదురవస్థ రాఁ గతం
బెయ్యది యొక్కొ? యే నితని నేక్రియఁ జేకొని తేర్తు నొక్కొ? నా
కియ్యెడ నిష్టకృత్యమున కెవ్వఁడు దోడ్చడఁ గల్గువాఁ డొకో?
దయ్యమ! యేమి చేతు నని తల్లడ మందుచుఁ జేరి యిట్లనున్.

74


క.

ధీరోదాత్తగుణోత్తర!
యో రాజకుమార! నీకు నుదితమె యి ట్లీ
దారుణతామసభావము
గూరి వృథాభేదమునకుఁ గుదురై యుండన్.'

75


చ.

అనుచు సఖుండు పల్కుటయు నంకిలి దేఱినచిత్తవృత్తితో
గను దెఱవం దలంచి యధికంబుగఁ గ్రమ్మెడుబాష్పవారితో
నెనసినఱెప్ప లెత్తుటయు, నెత్తి సుఖాసనుఁ జేసి కన్ను ల
ల్లన నఱచేత నొ త్తి వికలంబగుహారము చక్కఁ ద్రోయుచున్

76


వ.

తత్సమీపపుష్పితలతాలవాలంబున మకరందవిందు సంవాసితంబు లగు నంబు
పులు కరపుటంబులం దెచ్చి యందిచ్చి ముఖప్రక్షాళనంబు చేయించి యాతని
నవలోకించి.

77


క.

నీ కిట్టి కడిఁది దుర్దశ
రాకకుఁ గత మేమి యనిన రాజతనూజుం
'డాకర్ణింపు మిచట నొక
కోకిలశుకవాణిఁ బుష్పకోమలఁ గంటిన్.

78


సీ.

చిగురుటాకులలోని జిగిఁ గూర్చి యాబాల
       యఱకాళ్ళఁ జేతుల నలఁది రొక్కొ
పసిడితీఁగెలమీఁది ప్రభ దెచ్చి యాకాంత
       మెయిదీఁగె యంతట మేది రొక్కొ
చంద్రబింబముకాంతి సవరించి యాలేమ
       మోమున నునుపుగాఁ దోమి రొక్కొ

క్రొమ్మెఱుంగులమించు గొనివచ్చి యాయింతి
       కలికికన్నులఁ గీలుకొలిపి రొక్కొ


ఆ.

యనఁగ సవతు లేని యభినవాకారంబు
తోడఁ జెలులఁ గూడి యాడుచుండెఁ
జామ యోర్తు మరునిసామ్రాజ్యలక్ష్మియ
పోలె; దానిఁ జూచి బేలు పడితి.

79


ఉ.

ఆ మదిరాక్షి నేత్రరుచు, లా వనజాననముద్దునవ్వు, లా
భామిని మందమందమృదుభాషితరీతులు డెందమందుఁ బే
రామని యై తనర్చుటయు నంగజుచేతి నిశాతసాయక
స్తోమముభంగిఁ గెందలిరు జోంపము నా కొదవించెఁ గంపమున్.

80


ఉ.

తోఁకొనిపోయె నంత నొకతొయ్యలి యయ్యెలనాగ నప్డు పే
రాఁకలి గొన్నబెబ్బులి రయంబునఁ గృష్ణమృగార్భకంబుపై
వీఁక యెలర్పఁ బె ల్లడరివ్రేయుగతిన్ మరుఁ డుగ్రుఁడై ననుం
దాఁకిన మూర్ఛ నొందితిని దద్దయు నీవల నిప్డు తేఱితిన్.

81


క.

అని యి ట్లేర్పడఁ జెప్పిన
విని యతఁ డి ట్లనియె 'నొక్క వెలఁదికిఁగా నె
మ్మన మింత నెగులు పఱుపఁగఁ
జనునే నీయట్టి ధైర్యసంపన్నునకున్!'

82


చ.

అనవుడు 'నేమి చెప్పుదు వయస్యుఁడ! భానుఁడు తూర్పుఁగొంద యె
క్కిన మఱి యేటి చీఁకటులు! కేశవనామము జిహ్వ నుచ్చరిం
చినతుది నేటి పాపములు! చిత్తజుపుత్తడిగ్రేణి సేయున
వ్వనితకటాక్షదీధితులు వ్రాలినమీఁదట నేటి ధైర్యముల్!

83


చ.

విను మటు లుండె నా హృదయవేదన మానుప నోపు దేని నా
కనుఁగవ గెం పొనర్చు సితకంజనిభేక్షణ నాలతాంగి, దో
డ్కొని చనుదెమ్ము! తే ననువుగూడని పక్షమునందు నన్ను ర
మ్మనినను వచ్చెదం బిలువు మక్కడికార్య మెఱింగి చయ్యనన్.'

84


చ.

అనుటయు నింద్రదత్తుఁడు నరాధిపనందను నంద యుంచి 'యేఁ
జని యిటు వచ్చునంతకు విచారము నీమదిఁ జేరనీకు, మ

వ్వనితకు నీకు నిప్పుడ యవశ్యముఁ బోం దొనరింతు' నంచుఁ జ
య్యనఁ జనుదెంచె నాసరసిజానన లేఁగినచొప్పు వెంబడిన్.

85


సీ.

ఈరీతిఁ జనుదెంచి యెదురుకట్లను నొక్క
       మాధవీవనలతామంటపంబు
క్రింద నందఱుఁ గూడి కిసలయశయ్యవైఁ
       బూఁబోఁడి నునిచి కప్పురపుధూళి
యఱకాళ్ళఁ దోముచు నఖిలాంగకములందుఁ
       బాటించి చందనపంక మలఁది
పదను డించినచోటఁ బన్నీరు చల్లుచుఁ
       గదళీదళంబులఁ గదిసి విసరి


ఆ.

తరుణిమేన విరహతాప మగ్గల మైనఁ
గాము, సోముఁ, గమ్మగాలి, నళులఁ,
బికము, శుకముఁ బేరు పేరఁ బ్రార్థింపుచు
సంభ్రమించుచున్న సఖులఁ గనియె.

86


చ.

కని 'మీ రెవ్వరు? మీలతాంగి కిచట గామజ్వరం బేమిటన్
జనియించెన్? శిశిరోపచారములచే శాంతంబు గాదో కదే?
వనితారత్నములార! చెప్పుఁ డనిన వామాక్షు లా రాజనం
దనమిత్రు న్వెసఁ జేర వచ్చి విగళద్బాష్పేక్షణాంభోజలై.

87


క.

'అన్నా! యే మని చెప్పుదు
మిన్నగరమురాజుకూఁతు రీవిరహిణి యు
ద్భిన్నసరోజానన యీ
కన్నియ పే రమరుఁ బుష్పగంధి యనంగన్.

88


ఉ.

ఈ సతి కేము నెచ్చెలుల, మీ యెలదోఁటకు వచ్చి నిశ్చలో
ల్లాసవిలాసహాసము లెలర్పఁగ వేడ్కలు సల్పుచుండగా
నాసమయంబునందు నొకఁ డయ్యలరమ్ములు నిక్షుదండబా
ణాసనముం దొలంగ నిడి యంగజుఁ డొంటియ వచ్చుచాడ్పునన్.

89


మ.

మిగులం జక్కనివాఁడు కాంచనరుచిన్ మేదించిన ట్లంగకాం
తి గడుం బొల్పగువాఁడు యౌవనమదోద్రేకంబునం దద్దయుం

జిగి సొంపారెడువాఁడు మాకడకు వచ్చెన్ డేగవేఁటాడుచున్
జిగురుంబోఁడియు వానిఁ జూచి తగిలెన్ జెప్పంగ నిం కేటికిన్.

90


క.

ఆ కన్నెఱింగి యచ్చట
నీ కన్నియ నుండనీక యిట తెచ్చితి మా
రాకొమరుఁ డెందుఁ బోయెనొ
వీకున నిది మూర్ఛ పోయె విరహాతురతన్.

91


ఉ.

అప్పుడు తల్లడిల్లి గురాకులసెజ్జకుఁ దెచ్చి బాలకుం
బుప్పొడి రక్షగా నొసల బొట్టిడుచు న్మకరందబిందువుల్
చిప్పిలు పుష్పమంజరులు చెక్కుల నొత్తుచు ధౌతవస్త్రముల్
గప్పుచుఁ జందనంపుటుదకంబు పయిం జిలికించుచుండఁగన్.

92


క.

మిక్కుటమై విరహానల
మిక్కన్నియదేహ మెల్ల నెరియింపఁగఁ బూఁ
బక్కెర గల శుకతురగము
నెక్కిన వెడవింటిరౌతు కెరఁగితి మార్తిన్.

93


క.

తక్కటి మరుబలములకును
మ్రొక్కితి మే మిటను నెవ్వరును సుముఖులు గా
రెక్కడఁ జొత్తు మనఘ, నీ
వెక్కడివాఁడ? విట యెచటి కేఁగెద? వనినన్.

94


క.

'మీ పుష్పగంధినెయ్యపుఁ
జూపులకును లెప్ప మైన సుకుమారవపు
శ్శ్రీపెంపునఁ దనరినవసు
ధాపతిసుతుసఖుఁడ నింద్రదత్తాహ్వయుఁడన్.

95


చ.

అతఁడును బుష్పగంధి లలితాకృతిజాలమునంచుఁ దద్దయున్
ధృతి యెడలంగ మత్స్యముగతిన్ గడు లోఁబడి పంచబాణబా
ధితుఁ డగు టేను జూచి తగఁ దేలుచు మీ కెఱిఁగింప నేఁగుదెం
చితి నిట మీఁది కృత్య మది చెప్పఁగ నేటికి మీ రేఱుంగరే.'

96


క.

అనవుడు బనిపడి వెదకం
జనవలసిన సొమ్ము దాన చనుదెంచిన చా

డ్పున విన నబ్బె నితనిముఖ
మున నిక్కార్యంబు మూలముట్టుగ ననుచున్.

97


చ.

రయమున నేఁగి యాసతులు రాజతనూజకు నత్తెఱంగు ని
శ్చయముగఁ జెప్ప, ము న్నసమసాయకసాయకపం క్తిచేత నొ
చ్చియు నొకకొంత యూఱడిలుచిత్తముతో నటు లేచి తా నతి
ప్రియమున నింద్రదత్తుఁ బిలిపించి తదాననదర్శనంబునన్.

98


క.

రోగికి సుహృదులఁ గన్గొనఁ
గా గుణ మెట్టి దగు నట్టికైవడిఁ జేతో
రాగ మెలర్పఁగ నునికికి
నాగోతులు ప్రీతి నొంది యాతనితోడన్.

99


ఉ.

'తమ్ముఁడ! నీవు వచ్చినకతమ్మున మాహృదయమ్ములోనితా
ప మ్మొకకొంత డిందుపడి ప్రాణము నిల్చె; భవత్సఖుండు సే
మమ్మున నున్నవాఁడె? యొకమా టయిన న్మముఁ జిత్తగించునో
నెమ్మది డేగవేఁటకును నెక్కొనుచిత్తముతోఁ జరించునో?'

100


క.

అనవుడు 'నాతనివేఁటల
పని యిట యిం కేమి చెప్ప భావజుఁ డీ భా
మిలి దీమంబుగఁ జూపి య
తనిఁ గైకొని వేఁట లాడెఁ దద్దయుఁ గడిమిన్.

101


క.

అంతటఁ బోవక మరుఁ డీ
కాంతారత్నంబు నతఁడు కారణముగ ని
టైంతకుఁ దెచ్చె [5]నెఱుంగరె
కొంత విచారంబు వలదొకో మీ కైనన్.

102


క.

తొలిదొలి రోగ విదానము
దెలియక యౌషధము వేయఁ దివిరెడు వెడవె
జ్జులు వోలెఁ దొడఁగి యీ తొ
య్యలి నేమిటి కమ్మ యింత యలజడిపఱుపన్?'

103

ఉ.

నావుడు నింద్రదత్తువచనంబుల నయ్యెలనాగ లట్లకా
దే విరహజ్వరంబు కడతేఱునె యీచలిమందులందు నిం
దీవరనేత్రచందములు దేవికి ము న్నెఱిఁగింపకుండినం
బోవునె ముల్లు ముంటిఁ గొని పుచ్చక రోఁకటఁ బుచ్చవచ్చునే!

104


వ.

అని తలంచి.

105


క.

'వినవలయు నతనిరాష్ట్ర మ
తనిపట్టణ మతనితల్లిదండ్రులపే ర్లా
తనిధామ మతనిప్రియభా
మినియవిధానంబు మాకు మేలుగఁ జెపుమా'.

106


చ.

అనిన నతండు 'మాళనసమాహ్వయదేశము వానిదేశ, మా
తనినగరంబు రత్నపురి, దాని కధీశ్వరుఁ డైననందుఁ డా
తనిజనకుండు, తత్ప్రియనితంబిని యంబిక వానితల్లి, వాఁ
డనఘుఁడు రత్నమండనసమాఖ్యుఁడు పెండిలి లేదు' నావుడున్.

107


క.

ఒండొరులఁ జూచి యానన
మండలములఁ దెలివి యొలయ మాకన్నియ కా
తండు వరుం డగుఁ బరువడి
రం డని కార్యోక్తిమై మరల్చిరి వానిన్.

108


ఆ.

అంతఁ దనదుకోర్కి యబ్బినయట్ల కా
నెమ్మి నుల్లసిల్లు నృపతనూజఁ
గొంచుఁ బురికి నరుగుదెంచి రయ్యింతులు;
సనియె నతఁడు నధిపతనయుకడకు.

109


వ.

ఇటు వచ్చినయింద్రదత్తుం గాంచి రత్నమండనుండు.

110


క.

'వచ్చెం బో నా నెయ్యుఁడు
తెచ్చె నొకో మంచివార్త తే కున్నట్లే
నచ్చిఱుతనగవు మొగమున
నచ్చుపడుట కెద్దిహేతు వనవచ్చు నొకో.'

111


క.

అని మది నూహించుచు భూ
తనయాన్వేషణము చేసి తన యెదిరికి న

చ్చినకపివరునిఁ గాంచిన
యినకులజుఁడ పోలెఁ దలఁపు లీరిక లెత్తన్.

112


క.

మెలపున నెదురుగఁ జని ప్ర
స్ఖలితవచనరచన యెసఁగఁ 'గాయో పండో
కలరూపు చెప్పు' మనవుడు
ఫలియించుచు గోర్కి పాఱఁబట్టుము వగలన్

113


క.

సంపాతినృపతి సతియై
పెంపారెడుచంద్రరేఖప్రియసుత దన పే
రింపారఁ బుష్పగంధి ను
తింపన తగుఁ జుమ్ము మహిఁ దదీయగుణంబుల్.

114


సీ.

ఆ యింతి నీకు నిల్లాలు గాఁ దగుఁ జిత్త
       గింపు నామాట లంగీకరించి
యబల నీవార్త విన్నప్పుడ నిజదేహ
       జనితవియోగాగ్నిఁ బొనుఁగు పఱిచెఁ
దదనురూపంబుగాఁ దత్సఖీజనములు
       నీయూరుఁ బేరును నెమ్మి నడిగి
రడిగి యాతఁ డొడయఁ డగు మానృపాత్మజ
       కని కార్యగతి దేర నాడి నన్ను


ఆ.

మరలఁ బనిచి రేను నరుగుదెంచితి నింకఁ
జింత దక్కి, యాలతాంతగంధి
నఖిలబంధుచయము ననుమతింపఁగఁ బెండ్లి
యగుదుఁ గాక వేడ్క లగ్గలింప.'

115


క.

అని యాతనిచి త్తము బో
రన నూల్కొనఁ బల్కి నిజపురంబునకుం దో
డ్కొని చనియె నింద్రదత్తుం
డని సర్పటి చెప్పె ననిన నత్యుత్సుకుఁడై.

116


క.

భోజుఁడు మఱి యే మనియె? మ
హాజననుతచరణ! సిద్ధుఁ డతనికి మఱి యే

యోజ వినిపించె నవిరళ
మై జరిగెనె తత్కథామహాలత?' యనినన్.

117


వ.

అనుపమదివ్యతేజ! దివిజార్చితపాదసరోజ! దైత్యభం
జన! భువనైకరంజన! కృశానుశశాంకకుశేశయాప్తలో
చన! ఘనదుఃఖమోచన! ప్రసన్ననృసింహవపుర్విలాస! వే
దనగనివాస! భక్తజనతాపరితోషణ! దోషభీషణా!

118


క.

భవనీరధిబడబానల!
భవగహనాసహ్యదావపావక! దృప్య
ద్భవసామజకంఠీరవ!
భవనిబిడతమోనిరాస భాస్కరమూర్తీ!

119


వనమయూరము.

నీలజలదాపితవినిర్మలశరీరా!
తాళతరుసప్తకవిదారణవిచారా!
కాళియమహాభుజగగర్వపరిహారా!
కాలసదృశోగ్రమధుకైటభవిదారా!

120

గద్యము
ఇది వాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ
సుకవిజనవిధేయ అనంతయ నామధేయ ప్రణీతంబైన
భోజరాజీయంబను కావ్యంబునందుఁ
దృతీయాశ్వాసము

  1. నామకరణంబడి
  2. దీపంబువోలె
  3. గ్రొన్నెలల
  4. బొలిసిన
  5. నెఱుంగవె