Jump to content

బొబ్బిలియుద్ధనాటకము/ప్రవేశకము

వికీసోర్స్ నుండి

బొబ్బిలియుద్ధనాటకము.

(ప్రథమ ద్వితీయాంకముల నడుమ)

ప్రవేశకము

స్థలకము. - బొబ్బిలి రచ్చచావడి.

(పలువురు బ్రాహ్మణులును బ్రాహ్మణస్త్రీలును ప్రవేశింతురు.)

ఒక బ్రాహ్మణుఁడు. - ఒరే సుబ్బన్నా, ఈబొబ్బిలివారి భూరి సంభావనలొ నీ కేమి దొరికిందిరా?

సుబ్బన్న. - నే నింకా లెక్ఖపెట్టుకోలేదురా, రామయ్యా. దోశెడు వరహాలు పోశారు నావొడిలో.

ఒక బ్రాహ్మణి. - [శిశువు నెత్తుకొని యుండి] ఇదుగోనండోయి మీకు మొగాళ్లకి దోశెడు వరహాలు ఇయ్యడం వొక ఆశ్చర్యమా ! మావంటి యాడాళ్లకి దోశెడు దోశెడు వరహాలు ఇచ్చాడు, ఆమహరా జెవరో ధర్మారావుష, రంగారాయనింగారి మామగారుష మా కియ్యడం ఏం విన్నారు! ఈ చంటిపిల్లకి ఒకదోశెడు.

రామయ్య. - చంటిపిల్లకి కూడా దోశెడే! [అని ఆశ్చర్యపడును.

బ్రాహ్మిణి. - ఇందుకే ఆశ్చర్యమా? నాచెల్లెలికి ఒకదోశెడు వరహాలు ఇచ్చాడు. 'చూలాలండీ' అంటే - 'ఆ! అలాగా? యీగుంపులో పాపం చాలా శ్రమపడ్డది!' అని 'యిందాండి, అమ్మా, పుచ్చుకోండి, గర్భములోని శిశువుకోసం పుచ్చుకోండి;' అని బతిమాలుకొన్నట్టు కడుపులోపలిపిల్లకి ఒక దోశెడు ఇచ్చాడు మహరాజు. [తోడిస్త్రీలను ఉద్దేశించి] రండే గోపాలస్వామిగుళ్లో పడుకొందాము. [స్త్రీలు నిష్క్రమింతురు.

రామయ్య. - ఔనుగాని, యీభోజనాలచేత నాపొట్ట పగలిపోఛూ వుందిరా! [దీనస్వరమున] ఏమోయి భీమశంకరం నీప నేలా గుంది?

భీమ. - నన్నా ? తిండికి పొట్ట పగలడ మేమిషిరా నాగమ్మా? ఆకాడికి నావీపు విరగొద్దుషరా, నాపృష్ఠోష్ఠపర్యంత భోజనానికి ? అలా అంఛే తెలుసునా ? వీపుమీద గ్రుద్దితే, క్రింద మెతుకులు ప్రడాలి; మెడమీద క్రొడితే, నోట బ్రూరెలు రాలాలి. మళ్లీమనిషికి ఢ్రోకా లేకుండా వుండాలి, భోజన మంటే. ఏమంటావోయి సోమయ్యా!

సోమయ్య. - అఘోరింఛావు లేవోయి! పృష్ఠోష్ఠానికే యింత బడాయి అయితే నా నఖశిఖ పర్యంత భోజనాని కేమంఛావు? వ్రత్తితే క్రాలిగ్రోరు క్రూడ ప్రప్పూ ధ్రప్ఫళం క్రక్కాలి; ముక్కు నులిమితే వ్రీశనెయ్యి ఔత్ఖానా క్రొట్టాలి.

భీమ. - ఓయి సోమప్పా, నీనఖశిఖానికే యింత విఱ్ఱవీ గే మోయి? మా అన్న భోంచేసిం తర్వాత జుట్టు మెలేస్తే, గంగాళం ధ్రప్పళం వస్తుంది. వొంటి చమట తుడిస్తే, మణుగు నెయ్యి అవుఛుంది. పెదవి పిడిస్తే, బ్రిందెడు ప్రాయసం; నెత్తిమీద గ్రుద్దితే, రెండుముక్కులలోనుంచీ, దడదడ బూరెలు రాల్తాయి. క్షామదేవతలారా ! మీ దేం తిండిరా మా అన్న ముందర?

సుబ్బన్న. - ఒరే! ఆపంక్తిలో వాళ్లకిందిప్రీట లన్నీ ప్రగిలినవి ఎరుగుదువా? ప్రీటలు ప్రగులుఛూవుంఛే, వెదురు నేసినఇల్లంచుకుంఛే, బొంగులకణుపులు కాలి ప్రగులఛూవుంఛే, ప్రటప్రటా, ప్రటప్రటా, అని యలాగ్గా అగాదో, అలాగ్గే అయిందిరా, చవులు గింగుర మని పోయినాయిరా?

రామయ్య. - మఱి అందుకే రెండువందలమంది వడ్రంగులు ఆపెద్ధ పెద్ధ అవధాన్ల గార్లకోసరం పీటలు మరమ్మత్తు చేస్తూ వున్నారు.

సుబ్బన్న. - అది సరే గాని, ఆ శతబూరె సహస్రబూరె గాళ్ల పందిట్లో రెండువందలమందిని విస్తళ్లకాణ్ణుంచీ ఝడ్డీపట్టి మోసుకొవెళ్లి చేతులు గడిగినారు, చూశావుషరా?

సోమన్న. - ఔనురా, కోటలో రాయనింగార్లకు పెళ్లిళ్లు. మనకి యిక్కడ నేతివరదమూలంగా విస్తళ్లన్నీ యేకమై, ఒంటే బువ్వంబంతి అయిందిరా. పెద్ధపెద్ధ శాస్త్రుర్లవార్లంతా, తప్పులేదు తినమన్నారు. మేం, యెంగిలిమంగలంగా భోంచేశాం. వొకచేత్తో విస్తళ్లు కొట్టుకొపోకుండా పట్టుకొని, వొకచేత్తో భోంచేశాం. అందరం యవరి విస్తట్లో వాళ్లమే భోంచేశా మని చెప్పలేము.

[అందఱు ఆశ్చర్యపడుచునేపథ్యద్వారమువైపు చూతురు.

[అంతట ఒకబ్రాహ్మణుఁడు పొర్లుచు ప్రవేశించును.]

పొర్లు బ్రా. - [రోఁజుచుమూలుగుచు] హమ్మా ! హమ్మా !

ఇతరులు. - యేమయ్యా, దొర్లుఛావు? యేడుస్చావు?

పొర్లు బ్రా. - [రోఁజుచు] ఖ ఖ ఖడుపునొప్పి !

సుబ్బన్న. - అయ్యా, నాదగ్గిర కడుపునొప్పికి మందు వుంది. యిందా, వొక మాత్ర మింగు, మింగు, త్వరగా మింగు. [అని ఒకమాత్ర తీసి యిచ్చును.

పొర్లు బ్రా. - మా-మా-మా-త్రకి స-స-సం-దుంఛే, మఱి రెండుభూ-భూ-భూ-రెలు తిననుషయ్యా సుబ్బన్న. - ఓయి, నీయిల్లు బంగారంగానూ ! ఇదెక్కడి ఆబ ! భీమయ్యా, రామయ్యా, ఇతణ్ణి మోసుకొనివెళ్లి, మీ రిద్దఱు నిన్న యిలాంటివాణ్ణే ఒకణ్ణి వేడి వేడి అట్లు కడుపుమీద వెయ్యించి, లోపలినెయ్యి కరిగించి, కడుపు సళ్లించి, బ్రతికించాడే రాయనింగారి వైద్యుడు, అతడిదగ్గరికి పట్టండిరా; లేకపోతే, యితడిమూలంగా రాయనింగారికి బ్రహ్మహత్య వొస్తుందిరా !

రామయ్య, భీమయ్య. - ఔనురా ; [అని బ్రాహ్మణుని ఝడ్డిపట్టి మోచుకొని నిష్క్రమింతురు.

సుబ్బన్న. - [నిర్వర్ణించి] బూరెకు వరహా చొప్పున వెయ్యిన్నీ నూట పదహార్లు సంపాదించినాడే, ఓయి బాబో! ఆబకాసురుడు వెంకన్న వొస్తున్నాడు !

(అంతట వెంకన్న ప్రవేశించును.)

సుబ్బన్న. - వెంకన్నా, ఏమయ్యా, నీ వెయ్యిన్నీ నూట పదహార్లు మాకు రవంత చూపవయ్యా.

వెంకన్న. - అవి నాభోజనం మీద, కందాలు చెప్పిన కవికి, కందాలు చెప్పిన వాడే కవిగదా, అని, ఇచ్చేశా.

అందఱు. - వహవ్వా! వహవ్వా! భోజనరాజవయినావే! ఏవయ్యా, ఆకందాలు? విందాం.

వెంకన్న. - వినండి మఱి: -

         కం. వెంకన్న తిండి జూచిన,
              నంకాళమ్మకును సైత మరగుండె వడున్;
              కొంకును బూరెలు మెక్కెడు
              వెంకనకు జగములు మ్రింగు విశ్వాంతకుఁడున్ ౧౮

అందఱు. - బళి బళి~ ఇంకా మఱి;
వెంకన్న. - వినండి మఱి: -

         కం. ఊటగల యావకాయలు
              పూఁటకు డెంకాయ బొండ్లములపాటివి నూ
              ఱాఁటవు వెంకన్నకు నసి
              పాటిత దధి గండ మిశ్ర భక్తంబునకున్. ౧౯

అందఱు. - వహవ్వా! వహవ్వా! ఇంకా మఱి ; వెంకన్న. - వినండి మఱి, దీనితోసరి.

        కం. గారెలు బూరెలు వే నీ
              నోరన్ నేఁ జూడ, నర్జునుఁడు సూడంగాఁ
              బోర హరి విశ్వరూపపు
              నోరుల నక్షౌహిణులు ధణుల్ బలె వ్రాలున్. ౨

సుబ్బన్న. - వెంకన్నా, పోగొట్టుకొన్నావు గదా యింత కష్టపడి తిని సంపాదించిన 1116 ర్లున్ను.

వెంకన్న. - రేపు మళ్లీ తింఛా. రోజూ తింఛా. [అని కుడిరొ మ్మప్పళించును.

అందఱు. - ఓర్నీయిల్లు బంగారం గానూ! బకాసురుండవురా? [అని నవ్వుదురు.

[నేపథ్యమున ఘణీల్ ఘణీల్ ఘణీల్ మని ఘంటారవములు.

సుబ్బన్న. - [పరికించి] ఏం బరువు లోయి, అని ? యేనుగలు , మోసుకొని కోటవైపు వెళ్లుతూ వున్నవి?

వెంకన్న. - ఈరాత్రి వూరేగింపు కదా ! అందుకోసం బాణసంచు చెన్నపట్ణంలో చేయించి, విశాఖపట్ణం రేవునుంచిన్ని, భీమునిపట్ణం రేవునుంచిన్ని రప్పించారుష.

సుబ్బన్న. - వహవ్వా! వహవ్వా! యీయుత్సవాలు ముగిశిందాక నేను యీవూరిఖ వదలనయ్యా. రాత్రంతా మేలుకొని వూరేగింపు చూతాం. అందుకోసం యిప్పుడే గోపాలస్వామి గుళ్లోకి వెళ్లి పడుకొందాం రండి.

ఇతరులు. - అది మంచి పని. [అని అందఱును నిష్క్రమింతురు.


____________