Jump to content

బొబ్బిలియుద్ధనాటకము/ప్రథమాంకము

వికీసోర్స్ నుండి

ప్రథమాంకము.

స్థలకము: - కోటిలింగ రాజమహేంద్రవరముల నడుమ.

[విజయరామరాజు సచివసామంతాది మహాపరివారముతో

యథానిర్దిష్టము ప్రవేశించును]

రాజు. - [స్వగతము] ఈమాఱు నాకు విజయము కలిగి నావిజయరామ నామము సార్థము కావలయును.

హర్కారాలు. - [రాజునెదుటికి చొచ్చి] ఏలినవారి హర్కారాలముమేము? మామొఱ్ఱ ఆలకించరేమి మహాప్రభో మాయేలినవాడా! ఆలాంటిచెంపపెట్లు (ఇత్యాది.)

రాజు. - [కని విని,] అప్పన్నా, ఏమి ఆదిలోనే యీ యపశకునము. ఎవరువీరు?

అప్పన్న:- [జనాంతికము] మహా ప్రభూ, వీరు ఏలినవారి యానతిచేత [తన్ను నిర్దేశించుకొనుచు] ఈనౌకరుచేత తయ్యారయిన మనవేగులు. ఇటనుండి బొబ్బిలికి ప్రకాశముగా హర్కారాలుగా తరలి, విజయనగరము దాఁటఁగానే వేగులుగామాఱి, అచటి వృత్తాంత మెల్లం గని, మరల హర్కారాలుగా, ఇట మాఱి, ప్రవేశించినారు. వీరు బుస్సీయెదుట రాయనిమీఁది మన ప్రయోగమునకు మిక్కిలి సాధనభూతు లగువారు.

రాజు. - [జనాంతికము] బళి బళీ! అప్పన్నా? నీవోయి మమ్ముఁ గొలువ నేర్చినవాఁడవు ! మంచిది, వీరియొద్దికం గనియెదఁగాక. [ప్రకాశము] ఎవరురా మీరు? ఏల మామ్రోల నిట్లు మొఱ యిడెదరు?

హర్కారాలు. - మహాప్రభూ, మేము ఏలినవారి జాబులు బొబ్బిలికి రంగారాయనింగారికి తీసుకొవెళ్లిన హర్కారాలమండి. మమ్మల్ని అక్కడ తన్ని చెంపకాయలు కొట్టి వెనకకి తగిలేసినారండి.

[రాజును అప్పన్నయు మొగమొగంబులు సూతురు.]

రాజు. - [హర్కారాల నుద్దేశించి] ఏమిరా, మీరు జాబు వారికి ఇచ్చినారా లేదా?

హర్కా. - ఏలినవారిజాబు లని చెప్పఁగానే, వారి తమ్ములు వెంగళరావుగారు పెరుక్కొని చింపి పారేశి మమ్మల్ని నోరు తెరవనీక పీక పట్టుకొని తన్ని చెంపలు వాయించి తగిలేశినారు మహాప్రభో. - "ఆలాంటిచెంపకాయలు" ఇత్యాది. రాజు. - [ఆత్మగతము] చక్కఁగానే తయ్యారు చేసినాఁడే అప్పన్న ! [ప్రకాశము] హా ! ఏమి దీమసము ! ఏమి దీమసము ! [అప్పన్నతో, జనాంతికము] మఱి పరాసులరాక అక్కడవారి కే మయిన తెలిసిన ట్లున్న దేమో కనుంగొనుము.

అప్పన్న. - [జనాంతికము] నే నప్పుడే విచారించితిని. తెలిసినజాడ లేదఁట మహాప్రభూ.

రాజు. - [స్వగతము] అది నాప్రయోగమునకు కర మనుకూలము. [అప్పన్నతో జనాంతికము] కోటలో పెండ్లిండ్లు ఎట్లున్నవో కనుఁగొంటివా ?

అప్పన్న. - [జనాంతికము] ఏఁబది పెండిండ్లు జరుగనున్న వఁట.

రాజు. - [అప్పన్నతో జనాంతికము] తాండ్రపాపయ్య బొబ్బిలికివచ్చినాఁడా?

అప్పన్న. - [జనాంతికము] పాపయ్య పితూరీలు అణఁగఁగొట్టుటకు రాజాములోనేయున్నాఁ డట.

రాజు. - [వికటముగా నటు నిటు పరిక్రమించుచు, ఆత్మగతము] బళీ, అక్కఱకు వచ్చినవి రాజాముసీమలో నాచేయించిన పితూరీలు ! పితూరీదార్లకు సాయముగా నేఁ బంచినరాణువ అక్కడ చాటున మాటున కావలసినంత యున్నది. కనుక ఆపితూరీలు రావణాసురుని తలకాయలే అగును. ఇతఁడు బొబ్బిలికి రాఁజాలఁడు. ఎట్టకేలకు వచ్చె నేని అంచెలమీఁద వచ్చి, ముడులు పడఁగానే, అంచెలమీఁదనే మరలును. [ఆలోచించి, హర్షముతో] వహవ్వా ! బుస్సీ బేటికి రంగారావు రామి నాకు దేవుఁడు ఇచ్చినవరము. నాకార్యసిద్ధికి ఇదియే బీజము. దుస్సీ హైదరులను ఇతనిపైకి ఎసకొల్పుటకై నాచేసిన సంకల్పము నెఱవేఱినది ! ఇతఁడు లేనందున నాయిచ్చవచ్చినట్లు వారికడ నితనిని కొంకులు నఱకెద. ఎంత లంచ మైనను ఇచ్చి వారిచే ఈవెలమలను రూపు మాపించి, మా యానందరాజునకు బొబ్బిలి పట్టము గట్టించుకొనియెద. [మహౌద్ధత్యముతో] నేను ఈబొబ్బిలిమీఁద

కాకుల గ్రద్దలఁ గాఱాడింపనేని కాను విజయరాముఁడ.

వీరబొబ్బిలిఁ గాల్చి పేరు మాపనేని - కాను ...

రావుపురవు నెల్ల గావు వెట్టనేని - కాను ...

నీటుఁగోట పాటి బాట సేయనేని - కాను ...

ఆముదాలు సల్లి యానందింప నేని - కాను ...

పొగతోఁట వేసి యాపొగ పీలువనేని - కాను ...

కోటను బులివేఁట కోన సేయనేని - కాను ...

ఆనందు బొబ్బిలి కభిషేకింపనేని - కాను ...

వీరబొబ్బిలి యఁట దీనిని తగులం బెట్టి నీఱుబొబ్బిలి చేసెదను. [ప్రకాశము, సర్దారుల నుద్దేశించి] మాసర్దారులారా వైరిలక్ష్మీబందీగ్రాహకులారా, మన నాయమును బొబ్బిలివారి నాయమునుం గంటిరా?

సామంత రాజులు._కనకేమి ? వారి దెప్పుడును పెడబుద్ధియే,

రాజు,—[అపవారించి అప్పన్నా, నీవు సేయేలినవారిని కొలువనేర్తువేని, ఈ హర్కారాలను ఇంతకన్నను తీండ్రముగా సిద్ధపఱుపుము. బుస్సీ హైదరుజంగులను రంగారాయఁడు మిక్కిలి తిరస్కరించినట్లుగా ఈ హర్కా_రాలచేత ఆ యిద్దఱమ్రోలను చెప్పేంపవలయును. అవసరము కనుంగొని బూసియెదుటకి వీరిని నీవు కొని రావలయును. ఈ ప్రయోగము చేత

                 క, గండారు రంగరాయని
                    గుండానం ద్రోచి నీదు కుల నామంబున్
                    బండిత, సార్థము నేయుము,
                    గుండాల కులాబ్ధి యమృతగుండా, యప్పా.

అప్పన్న.-చిత్తము మహాప్రభూ.

రాజు - [చెవిలో] ఆప్పన్నా పెండ్లిండ్లమాటును చెప్పనీయకుమా.

ఆప్పన్న.-మహాప్రభూ, అదికూడ నాకుఁ జెప్పవలయుఁనా? [హర్కా_రాలను దఱిసి] రండోయి రండి. వారు చెంపకాయలిచ్చిన మనము వారికి చెంవపం డ్లిత్తము. వా రిచ్చినవే పండవా? మఱి వారివి వారికే ఇచ్చివేయుదము రండి,

[అని వారితో నిష్క్రమించును.

రాజు.-సర్దారులారా, బూసీ డేరాకు నడుపుఁడు.

[ఆందఱును పరిక్రమింతురు.

రాజు,_ఇదె డేరాకడకు వచ్చితిమి. మంత్రిగారూ, మారాక వారికి తెలుప పలయును.

మంత్రి -చిత్తము సర్కార్ నే నరిగి తెలిపెదను. [అని నేపథ్యమున కరిగి తానును హెదరుజంగును వెలికివచ్చి రాజాతో] వీరు హైదరుజంగుబహద్దరుగారు బుస్సీగారికి దివాను. హైదరు_సలాం మహారాజావార్కి.

రాజు.-సలాము హైదర్ణంగుబహద్దరు వారికి. హైదరు. - మహారాజావారు మంతిరి సామంతుల్తోకూడా డేరా లోపల్కి రావచ్చును, బూసీదొరగారు కచేహరియై యున్నారు. (అందఱును పరిక్రమింతురు.

[అంతట బూసీ యథానిర్దిష్టముగా ప్రవేశించును.]

హైదరు._వారే బూసీ ధొరగారు.

రాజు,_సలాము బూసీగారికి; సలాము వారిసర్దారులకు

[బూసీ ప్రభృతులు లేతురు.]

బూసీ_[టోపీ యెత్తి] సలాము మహారాజాగారికి,

సర్దారులు_సలాం మహారాజాగారికి.

సామంతులు_సలాము మూసాబూసీగారికిని వారి సర్దారులకు,

బూసీప్రభృతుల-సలాము మహారాజాగారి సర్దారులకు.

[రాజుకనుసన్నను పరివారజనులు బూసీ యెదుట నజరు లుంతురు: వానిని బూసీ పరికించును.]

హైదరు_మహరాజాగారు వారి సర్దార్లు అందరూ కూర్చండవాలా.

[అందఱును కూర్చుందురు.

రాజు-[బుస్సీతో] తమ సర్దారుల నామధేయ విక్రమాదికముల వినం గుతూహలపడుచున్నాను.

బుస్సీ-మన్నె సుల్తానువారికి మన సర్ధారులను తెలుపుము హైదరుజంగు బహద్దర్.

హైదరు - [ఒక్కొక్క_రిని నిర్దేశించి చూపించుచు] వీరు సిద్దీబిలాల్, కల్బర్గీ కొట్టినవారు. వీరు మూసేపనాల్, మరాటిభూములకి హతాహతం చేసినవారు. వీరు హుసేన్‌ఖాన్, ఆర్కాటికి కొట్టినవారు. మఱి వీరంతా ఏద్పడితే అదీ కొట్టినవారు.

బూసీ-మన్నెసుల్తానుగారి సర్దారులను ఒకరొకరినిగా మేము తెలిసికోవలయును.

[రాజు మంత్రివైపు చూచును.]

మంత్రి- [ఒక్కొక్కరిని సిర్దేశించుచు] వీరు గొలగొండ యెఱ్ఱభూపతిగారు; వీరు కిమిడి నారాయణదేవుగారు? వీరు అట్రగడ్డ హరిశ్చంద్రుఁడు గారు; వీరుమాడుగుల లింగారావుగారు; వీరు వంకమీసపు భూపతిరాజుగారు;

బుస్సీ.- మఱి మనము కూడిన పని జరిగింతమా ?

రాజు,-ఈపహరాలు దాఁటి తమ దర్శనము చేసికొనునప్పటికే మా సని మోడి యెత్తుట యైనది. ఇకను మాభాగ్య మెట్లున్నదో ? మా యేలినవారు గోల కొండ పాదుషావారు మమ్ము బుస్సీదొరగారు హైదరుజంగుబహద్దరువారు యీరెండు కన్నులతో చూచుచున్నారు.

              ఆ. చల్లచూడ్కి మీరు సాఁచిన మామీఁదఁ
                  బాదుసాహి మాకు భద్ర మొసఁగు.
                  వేఁడిచూడ్కి మిారు వెట్టిన మామిాదఁ
                  బాదుసాహి మాకు భయ మొసంగు.

అ ట్లగుటంబట్టి : -

             శా. అప్రత్యక్షునిఁ బాదుషాహరి నెదన్ ధ్యానించి, మీకుం దదీ
                  య ప్రత్యక్ష పరార్ధ్య మూర్తులకు మాయర్చల్ సుతుల్ భ
                  క్షిప్రానుగ్రహకాంక్షచే ముడుపులున్ జెల్లించి, నిర్భీతి పూ
                  ర్వ ప్రాకామ్య వరంబు వేఁడెదను వీరవ్యాఘ్రలారా మిము

ఇచ్చట మాకు శుభసూచకములు కలిగిన నచ్చట మాకు శుభమే.

బుస్సీ. - మావలన నేమున్నది ? తమ భాగ్యమునకు గోలకొండ నిజా చిత్తము.

హైదరు - మేం వారి హుకుం నెరవేర్చే నౌఖర్లము. మాపని మీకీ తె వారికీకోషం.

                 పై కాము కట్టానీ పందాలకీ కర్కర్ నర్కీ కుప్పల్ కూ
                      మాపనీ నర్కీ కుప్పల్ కూల్చడం.
                 కళ్కళ్కళ్లాడేటి గ్రామాల్కి పట్ణాల్కి మల్మల్మ ల్మాడ్చెయ
                      మాపనీ మల్మల్మ ల్మాడ్చెయ్యడం.
                 కోటల్కి ఫిరంగీ యేటూలు దూటించి పాటీనేలల్ శెయ్య
                      మాపనీ పాటీనేలల్ శెయ్యడం.
                 దుర్గాలకీ పట్టి పుర్గు లేక కొట్టి గిర్గిర్గిర్ దొర్లించడం-
                      మాపనీ గిర్గిర్గిర్ దొర్లించడం.
                 లూటీల్కితీస్కెల్లి యేటేట గోల్కొండ్లో కోటెత్తుపోగొయ
                      మాపని కోటెత్తు పో గొయ్యడం.

బుస్సీ. - అది యుండుఁగాక; పాదుషాగారిచిత్తమునకు మీరే కర్తలు. వారిపేష్కను సరిగా చెల్లుచుండిన, వారిచిత్తము మీరు కోరునట్లే యుండును. అట్లు జరుగ నందున వారు మాకు పెట్టినపని యేమో హైదరుజంగు తమకు తెలుపనే తెలిపినాఁడు. మఱి తెచ్చినారా ఏడుసంవత్సరముల పైకమును?

రాజు. - తమరు అడిగినమాటకు ఉత్తరము ఇంచుకంత విస్తరముతో మనవి చేసెద. హైదరుజంగుగారు చెప్పినపని మావిషయమై తమరు పెట్టుకోవలసి యుండదు. అయినను చిత్తగింపవలయును. పింజారిదండుచేత మాదేశ మంతయు దోఁపుడు పోయినది. డెబ్బదిరెండు పాళెములలో నేమి; పండ్రెండు మన్నెములలో నేమి, ఎచ్చటను ఒక రాగిదమ్మిడీ అయినను కనులఁ జూచుటకు లేదు. దేశాంతరమునుండియేని తెప్పించి యొక మొత్తముగానో, అప్పుడు కొంత అప్పుడు కొంతగానో, చెల్లింత మన్నను -

                సీ. నాగేంద్రుఁ డేలుచున్నాఁ డొకరుండు నా
                         యండజమీను సహస్రఫణుఁడు;
                    నానాట నా పజ్జ నాప్రజ మననీఁడు,
                         వానిఁ బట్టఁగలాఁడు వసుధలేఁడు;
                    మఱి యాతఁడు వయాళి మలయు మాసీమలఁ
                         దద్విషాగ్నుల మింటఁ దగులుమంటఁ
                    బౌరులు కటకాన బ్రహ్మపురంబున
                         రాజమహేంద్రవరమునఁ గాంత్రు.

                తే. దానఁజేసి బయటికొఠీదారులకడ
                         నెట్టు వేఁడినను ఋణమ్ము పుట్ట దాయె;
                    భస్మ పటలంబు లైన పరగణాల
                         రైతు లేఁగిరి వలస లరణ్యములకు.

గోదావరికి దక్షిణమందలి చిల్లర జమీనుల కప్పము లెల్ల క్షణములో మీకు చెల్లియుండగా, పైహేతువుచేత మాసంస్థానముది ఏడుసంవత్సరములపైకము మీకు మునిఁగిపోయినది. ఇందులకై మాతో యుద్ధము పెట్టుకొందురేని, జనక్షయమే గాని పైకము రాదు. - మఱి

(మత్తకోకిల)

              మీకు లోఁగని మాసటీలను మేము కొట్టుట సేవ యౌ;
              మాకు లోఁగని వారి మీరును మట్టుపెట్టుట బీర మౌ;
              మీకుఁ జాగిన, వానిపైకము మీరుపోరి గ్రహింపుఁడీ;
              యా కరాళుఁ దొలంచి మానతు లందుఁ డందుఁడు కప్పమున్. ౯

అట్టిసాయము చేయుటకు మీరు సమకట్టరేని, కప్పము చెల్లింపుమని నిక్కచ్చి చేయుదురేనియు, తల్లిసంస్థానము నెదిరించి పోరువారము గాము గావున, మీసంస్థానమును మీకు వదలి, మేము కాశికిఁ పోఁదలంచుకొని యున్నాము మావిన్నప మిదియ. అటుపైని తమచిత్తము.

బుస్సీ. - ఏమి హైదరుజంగు ? మహారాజుగారు ఇట్లు పలుకుచున్నారు ?

హైదరు. - ఎవరు మహారాజా ఆనాగేంద్రుడు ? మన్నెసుల్తాన్ వారి తాలూకాకీ కొల్లగొట్టేవాడు, తగలబెట్టేవాడున్ను?

రాజు. - బొబ్బిలి రంగారాయఁడు.

బుస్సీ. - మీరు అతనితో సఖ్యమునకైన అతనిని దండించుటకైన, ప్రయత్నము చేసినారా ?

రాజు. - చేసితిమి, ఏడుమాఱులు మేము అతని బొబ్బిలికి పోయి యుంటిమి.

బుస్సీ. - అంతట ?

రాజు. - ఏడుమాఱులును బేటికి రాక మమ్ము బొబ్బిలినుండి విజయనగరము దాఁకను బాఱఁదోలినాడు. మేము పరారిచిత్తగించునప్పుడు, దిగంద్రొక్కి వచ్చిన వట్టిపల్లకి మాకోట దర్వాజాకడకు తన బోయీలచేతఁ బంపినాఁడు. ఒక్కొక్క మాఱును మాయేనుఁగులను, లొట్టిపిట్టలను, గుఱ్ఱాలను, అనేకములను హరించినాఁడు.

                    సీ. *[1]మామీఁద నతఁ డెంత మత్సరి యైనను,
                                 విసువక సంధికై వెండి మేము
                           మారాజబాంధవు మాన్యునిఁ బంపంగ,
                                 రాయఁ డాతనిఁ జేన రాటఁ గట్టి,

              మాదం డతనిమ్రోల మాయించి, యాతని
                    మెడఁ గోసి, కననీక మేకుఁ జొనిపి,
              దిసమొల గావించి, కసవుగోణం బిడి,
                    మోమున ఱొమ్మునఁ బొట్టమీఁద

         తే. వీఁపునం బట్టెనామాలు వెట్టి, శవము
                   నందళంబునఁ గూర్చున్న యట్లు కట్టి,
             విజయనగరంపు నడివీథి వింత లడరఁ
                   బగలె మాదేవిడీఁ జేర్పఁ బంపినాడు. ౧౦

ప్రకృతము వారి రాజాముఠాణామీఁదికి మేము దండు పంపినారము. మేము అటకు తరల నుండఁగా అచ్చటకి వారి దళవాయి తాండ్రపాపయ్య పోయినాఁ డని తెలియవచ్చినది. అంతట రాజాముదాడి మాని బొబ్బిలిమీఁదకే స్వయముగా తరల నుంటిమి. ఇంతలో మీకబురు రాఁగానే మీబేటికి వచ్చితిమి.

హైదరు. - తాండ్ర పాపయ్యకీ కోషం తమరు దాడీయెందుకీ మానినార్?

రాజు. - తాండ్రపాపయ్య పేరు విన్న, వైరుల కెల్ల సింహస్వప్నము. అతఁడు చొచ్చెనా, యెదిరిదండు పులి చొచ్చిన గొఱ్ఱెలమందయే.

       క. ఉండును రాయనినేనిన్
          భండానం దొడరువాఁడు; పాపయ్యను మా
          ర్కొండు నను వీరుఁ గానీ
          దండును గానీ సృజింప ధాతయుఁ దలఁకెన్. ౧౧

బుస్సీ. - ఏమి, మహారాజా, మీరు అతనిని పొగడువిధము చూడఁగా, మీసంస్థానమును అతనివలన బట్టుజాగీరుగా ననుభవించుచున్న ట్లున్నది గాని, గోలకొండవారిక్రింద జమీను ఏలునట్లు అగపడలేదే1

రాజు. - ఏల; త్వరలో మీకే తెలియును, చెంతకు వచ్చితిమి గదా?

హైదరు. - షరే గాని, రంగారాయడికి వేయి తల్కాయలా యేమి? ఇతనేమిరాకాశిమన్నీ డా? మన్సీ కాడా? మీ రావణాశురుడు వున్నాడే, రాముడి బీబీకి పకల్డేవు చేసినవాడు, వాడికి వాడితో గుణాకరించి, ఆవొచ్చిం దాన్కి, మల్లీ వాడితో గుణించి, చేసినాడా మీభ్రమాదేవుడు వాడ్కి?

బుస్సీ. - అతఁడు ఏల మాబేటికి రాలేదు? రాజు. - నేనును హర్కారాలచేత జాబు పంపితిని. అతఁడేమో రాలేదు. అతఁడు మిమ్మును మమ్మును సరకు సేయువాఁడు కాఁడు.

[బుస్సీయు హైదరును మొగమొగంబులు చూచుకొందురు.

బుస్సీ. - మఱి మీ హర్కారాలు వచ్చి ఏమి చెప్పినారు?

రాజు. - హర్కారాలు ఇంకను రాలేదు. వారిని అతఁడు ఖూనీ చేయించినాఁడేమో యని మాకు భయముగా నున్నది.

దౌవారికుఁడు. - (ప్రవేశించి) సలాం సర్కార్, దర్వాజాకాడ మహారాజావారి హర్కారాలు బొబ్బిలినుంచి వచ్చివున్నార్.

రాజు. - సంతోషము! సంతోషము!

హైదరు. - వహ్వా ! వహ్వా ! సమయాన్కి వచ్చినార్ ! రమ్మన్.

[దౌవారికుడు నిష్క్రమించును.

(అంతట హర్కారాలు ప్రవేశింతురు.)

హర్కా. - దండం దండం యేలినవారికి. ఆలాంటిచెంపపెట్లు మేము దప్ప మఱెవ్వరును తినివుండరు. వీరభద్రుడిచేత దక్షప్రజాపతిసమేతా తినివుండడు మహా ప్రభో.

రాజు. - మాజాబు రంగారాయనింగారి చేతికి ఇయ్యలేదా?

హర్కా. - వారి తమ్ములు వెంగళరాయనింగారు, విజయరామరాజుగారి జాబనగానే, మాచేతులలోనుంచి జాబు పెరుక్కొని, విజయనగరమువాడికి - [అనియర్థోక్తిలో] మహాప్రభో, మన్నించాల, వారినోట వొచ్చినట్లే మానోటోచ్చేసింది మహాప్రభో. [అని సాగిలబడి లేతురు.

రాజు. - అంతయు మన్ననయే, చెప్పుడు. వారినోట వచ్చినట్లే చెప్పుఁడు.

హర్కా. - 'విజయనగరం వాడికి, మాకు జాబులు జవాబులు వున్నాయా' అనీ ఆజాబు చింపేశినారు. మఱి మేము గుండెనిబ్బరం చేసుకొని 'కాదు మహాప్రభో, పరాసు లొచ్చినారు, గోలకొండవారు లక్షాడబ్భై రాణవతో బూసీదొరగారిని, హైదరుజంగుగారిని, జమాబందికి పంపించినారు. అంత లేసి మరాటి భూములు హతముచేసిన ఆదొరలు రాజమహేంద్రవరంకాడ దండుదిగివున్నారు. మహారాజులుంగారు అక్కడికి వారిబేటికి వెళ్లుతా తమరిని గూడ ఎదురుచూస్తావున్నారు. మునపటికోపాలు మఱిచి, యీసమయంలో దయచేసి రావలిశిందని తమరితో మనివి చెయ్యమన్నారు.' అనిచెప్పినాము.

బుస్సీ - హైదరు - రాజు. - తర్వాత తర్వాత? హర్కా. - తర్వాత రంగారాయనింగారు "ఏమిరా పరాసులూ, కరాసులూ, బూసులూ, పిసాసులూ, వచ్చినా రని మమ్మల్ని బెదిరిస్తా రంట్రా మీరు? ఇలాంటి బూసులకు మేము భయపడ మని చెప్పరా. ఇలాంటివి వొకటిగాదు వందలువందలు జంగుబిల్లులు మా అడవినిండా వున్నా యని చెప్పండ్రా. మరాటిభూములని కొట్టినా రంట్రా? కాదురా, బొబ్బిలిజ్వరానికి, మరాటిమొగ్గలు కషాయం పెట్టుకొన్నార్రా. వాళ్ల బేటికి మమ్మల్ని పిలవడానికి మీరాజుకూ బుద్ది లేదు, మేము వొస్తామని తలవడానికి వాళ్లకీ బుద్దిలేదు." అని కోపం చేసి పటపట పటపట పళ్లుకొఱికినారు మహాప్రభో.

హైదరు - బుస్సీ - రాజు. - [మొగమొగంబులు సూచుకొని] తర్వాత? తర్వాత?

హర్కా. - తర్వాత, మేము చేతులు జోడించుకొని 'మాయేలినవారికి ఏమి జవాబు మహాప్రభో' అని యడిగినాము. అంతట - 'మేము మీవంటి పందలం గాము, మేము గోలకొండ నిజాముగారి కెదురు వెళ్తామేగాని, వారినౌఖర్లకి, యెదురువెళ్లము, జరూ రుంటే, ఆనౌఖర్లు మాబేటికి రావొచ్చును; నిజాముగారి నౌఖర్లు గనక బేటీ యిస్తాము.' అనిమేము శెలవిచ్చినామని మీరాజుతో చెప్పుకోండి. - అన్నారు. 'మహా ప్రభో, ఏలినవారు ఆలాగ శెలవియ్యవలసిన సమయంకాదు. బేటికి వెళ్లకపోతే శానా చెరుపు వుంటుంది.' అని మేము మనివి చేసుకొన్నాము. "కబురుదెచ్చే జవాన్ గాడ్దలు మాకు బుద్దులూ సుద్దులూ చెప్తున్నారోయి." అని వారితమ్ములు వెంగళరాయనింగారు మమ్మల్ని చెంపలుగొట్టి తన్ని తగిలేశినారు, మహాప్రభో. ఆపైని యెకాయెకిని వొచ్చి యేలినవారిని ఇక్కడ కండ్లజూచినాము.

బుస్సీ. - వీరిని పొ మ్మనుఁడు.

రాజు. - పొండిరా మీరు.

హర్కా. - ఏలినవారియాజ్ఞ.

బుస్సీ. - మఱి మీపైకమునకు ఏమిచెప్పెదరు?

రాజు. - ఇఁకమీద ఎన్నటికిని వారివలన మాకు ఉపద్రవము లేకుండునట్లు చేసిననేగాని, మాకు డబ్బు పుట్టదు.

బుస్సీ. - ఏమి హైదరుజంగుబహద్దరు? మహారాజాగారు చెప్పినమాటకు ఏమి యుత్తరము ? మనము ఇప్పుడు బొబ్బిలివారిని కొట్టి బాకీ వసూలుచేసికొని పోఁగలము గాని, ఱేపటికి వారు వీరిమీఁదికి రాకుండ మన మెట్లు చేయఁగలము ?

హైదరు. - అందుకీకోషం వుపాయం యేమైనా తమరు ఆళోచించివున్నారా మహారాజా ? రాజు. - ఉపాయము సిద్ధమే; అయినను రాతిగోడలకే చెవులు గల వందురు, డేరాగుడ్డల మాట మఱి చెప్పవలయునా?

హైదరు. - అయితే యీలాగారండి. [అని రాజును అన్యులనుండి ఆవలికి తోడ్కొనిపోయి] ఇక్డ శెలవియ్యవచ్చును.

రాజు. - వినుఁడు మఱి; మీరు బొబ్బిలి కొట్టరేని మీకు బొబ్బిలిపైకము రాదు. కొట్టినను, సర్కారుపైకము సర్కారునకు దక్కును. మీకష్టము మీకు దక్కును. కావున, అట్లు గాక మీరు బొబ్బిలి కొట్టి బొబ్బిలివారికి పాలకొండమన్నెము నిచ్చి మాయన్నగారి కుమారుఁడు ఆనందగజపతికి బొబ్బిలిని పట్టము కట్టినయెడల బొబ్బిలిపైకము కూడ మేమే చెల్లించుట గాక, బుస్సీదొరకు తెలియనీక, మీకు లక్షవరహాలు కట్నము సమర్పించెదము. ఇట్లు మీరొనర్చిన, బొబ్బిలివారివలనియిడుమలు మాకుండవు; పైకము వసూ లగుటకు మీకు ఏ చింతయు నుండదు. ఈసూక్ష్మమును మీరు అవధరింప వలయును.

[హైదరు ఆలోచించుట నభినయించుచుండును.

రాజు. - [స్వగతము] రంగాలాయఁడు బ్రతికియున్నంతకాలము భూమిలో ఎంతదూరాన నున్నను మాకు రాజ్యభ్రంశంబు, ప్రాణాపాయమును, తప్పవు. ఈప్రయోగముచే రంగారావు మడియును. ఎట్లన, బొబ్బిలి వదలి పాలకొండ కేఁగ నతఁడు, ఒడంబడఁడు. దానంజేసి, పోరాటము తప్పదు. పోరాటములో పరాజ యావమానము నొల్లఁడు ; అతనికి ఈపరాసులమీఁద జయ మసాధ్యము; కావున అతనికి రణమరణము నిశ్చితము. కాన, అతఁడు బ్రతికియుండి కాలాంతరమున మమ్ము బాధించు నను భయము లేశ మయినను ఉండదు.

హైదరు. - [ఆలోచించుట నభినయించి] వహవ్వా ! వహవ్వా ! బాగాకుదిరింది. తమరు కోరినపని నేనుచేస్తాన్. నాకి లక్షవరాలకీ ఏమి జామీను?

రాజు. - మీరు మాపని నెఱవేర్చుటకు మాకేమి జామీను ?

హైదరు. - [ఒరనుండి తరవారు దూసి] ఇద్గో యీకైజారు జామీను.

                 మెచ్చీనారూ మాదీ మేహర్బాన్కీ చూచి;
                       యిచ్చీనారూ మాకీ కైజార్.
                యవ్రంటే ? గోల్కొండా యేలే పాచ్ఛాగారు,
                       యివ్రంగా మీకీ మేం చెప్నాం.
                యిల్లిద్గో పాచ్ఛాహి యిచ్చిన కైజారు,
                       హల్లా సూస్తాడూ మేం అంటాం.

                   వీరబొబ్బిలి మీకుమార్ హానందానికి
                        ఖరార్, ఖరార్, ఖరార్.
                   రాజు - [తనయుంగర మొకటి చూపి]

              సీ. డిల్లీశు నల్లా యుడీను రణస్తంభ
                        పురినుండి హస్తినాపురము దాఁకఁ
                   బఱపి, యాసుల్తాను పగిడీని గొనివచ్చి
                        పదపీఠమునఁ బెట్టి ప్రణతుఁ డైన
                   మాపూర్వునికిఁ జాహమాన హమ్మీర పృ
                        థ్వీనాయకుఁడు తనవ్రేలినుండి
                   వ్రేలఁ బెట్టిన యంగురీయకం బిది, హరి
                        యవతారములవెల్గు ; నందు నడిమి

              తే. యింద్రనీలంపు శ్రీరామ చంద్రమూర్తి
                        యెఱుఁగ, బొబ్బిలి మాకు నీ విచ్చినంత,
                   లక్షవరహాలు నీకు వైళంబుగా వి
                        రాళ మిత్తు ఖరారు, ఖరార్, ఖరారు.

హైదరు. - మరి రాండి బుస్సీధొరగారికి తయారుచేజ్దాం.

[అని ఇరువురును పోయి యథాస్థానముల కూర్చుందురు.

బుస్సీ. - ఏమి మంత్రాంగము?

హైదరు. - [బుస్సీతో అపవారించి] బొబ్బిలి కూడినట్టయితే ఈరాజాకి వర్తకులు అప్పుల్ యిస్తారంట. యేలాగయినా రంగారావుకి పైకంకోషరం కాక్పోతే మనమల్కి తుసాయించిన పొగర్ అణచడానికైనా మన్ము కొట్టవలిశిందే వుంది. అతను బేటికి రాక కారుకూతలు పలికినాడు. ఈరాజు మన్కీ లోబడి బేటికివచ్చినవాడు. ఇతనికి పెద్దరాణ్వా వుంది. పదిరొండు మన్నె గాళ్లు డబ్భైరొండు పాళెగాళ్లు ఇతని కింద లడాయిచేస్తారు. పైగా ఇతడ్కీ గొప్ప రాతికోటవుంది. ఇతణ్ని ఇక్డ పట్టినా, అంతటితో ఈపనితీరదు. ఇతనియన్నకొమారుడు ఆనందరాజు, విజయనగరంకోటలో హాయిగా వున్నాడు. అతడ్కి వేరే పట్టవాలా వుంటుంది. బొబ్బిలివారిది మట్టికోట, దానికి మట్టితో కలపడం సులువు. ఇతనితో లడాయి పెట్టుకుంటే మనకే జయం నిక్ష యంలేదు. ఈయనపైగా నిజాంగారికి, ఎక్వా మెహనత్తు చేసి ఎర్గీ వున్న జమీన్ దారుడు. ఇతనికి కొట్టడం వారికి షమ్మతం వుండదు. కన్క, ఈయన్కి మనవషంమే వుంచుకొని, ఇతడిసాయంతో బొబ్బిలికి కొట్టి, వెంటనే ఇత డియ్యవల్శిన పైకంకి వసూలుచేసికొని, శ్రీకాకుళం వెల్లడం షరి యని నాకీ తోస్తుంది. మఱి ఇటుతర్వాత రంగారావు వల్ల ఇతడికి హపాయం తప్పించడముకి ఈయన చెప్పేది వుపాయం యేమ్టి అంటే - బొబ్బిలివారికి దూరాన పాలకొండసీమ ఇచ్చి, ఈయనకి బొబ్బిలి యిస్తే బొబ్బిలిపైకం కూడా తానే చెల్లిస్తా నంటాడు. అది షరి నాకీ తోస్తుంది. మఱి యితడిషాయం లేక్పోతే మన్మూ బొబ్బిలికి ఎక్వా మందికి మనసిపాయీలకి బలీ వెయ్యవాలా వుంటుంది. అటుపైని తమది చిత్తం.

బుస్సీ. - [అపవారించి] మీరు చెప్పిన దంతయు యుక్తియుక్తముగానే యున్నది. బొబ్బిలిని కొట్టుట యేమో సిద్ధమే; కాని ఒకరి భూములఁ దీసి ఒకరి కిచ్చుటకు మన కే మధికారము?

హైదరు. - [స్వగతము] అబ్బ ! ఎక్కడికి వెల్లినా యీఫరంగివాడితో ఇదే తంటా! [ప్రకాశము] కొట్టడాన్కి యేమీ అధికారమో భూములు మార్చడాన్కి అదే అధికారం. ఆలాగ చెయ్యకపోతే గోధారికి వుత్తరం పరగణాలన్ని మన్మూ వొదులుకో వలిశిందే. ఈరాజున్ను ఆరావున్ను సఖ్యపడితే మన్మూ యెన్కాకి తరలవలిశిందే. వీరిలో వీరికి కలతపడినందుకీచేత మనకీ అడుగు మోప్డానికి హవకాశం దొర్కింది. కన్క వీరిపగలు ఉన్నలాగే వుంచి, మనపని మనం నెరవేర్చుకోవాలా. బొబ్బిలి వీరికి యిచ్చి వారికి ధూరం తరిమితే, పగలు తీరవు, పైకం చెల్లుతుంది. నిజాంగారి ఖుద్దున మన్ముఖజానా రాశి పొయ్యవచ్చును. కన్క యీమార్పుకీ మన్ము వొప్పక తప్పదని నాకీ నమ్మకం.

బుస్సీ. - మంచిది, మీరు ఈదేశమువారిని, మాకన్ఁన చక్కఁగా ఎఱిఁగినవారు; కావున మీరు చెప్పినట్లు ఒప్పుకొనియెదను.

హైదరు. - మహారాజా; మీరు చెప్పిన వుపాయాన్కి ధొరవారు వప్కొన్యారు. తమరు కూడా బొబ్బిలిమీదికి మాతో రావాల.

రాజు. - సర్వసిద్ధము. మిక్కిలి సంతోషము. బూసీదొరవారికిని మీకును మిక్కిలి కృతజ్ఞుఁడను. [ఆత్మగతము] ఆహా! యేమినాయదృష్టము! ఆహా! నాప్రక్కలోని బల్లెము ఊడినదిరా. బొబ్బిలిలో ఆవలి యెల్లుండి పగలు 50 పెండిండ్లు, రాత్రి యూరేఁగింపు. తాండ్ర పాపయ్య రాఁడు. వచ్చినప్పటికిని వెంటనే రాజామునకు పోవును. ఆరాత్రి తెల్లవాఱునప్పటికి ముట్టడి పడిన, కరముజయకరముగా నుండును. [ప్రకాశము] ఇంతకు పూర్వ మెప్పుడును మాకు జోస్యులు జయము చెప్పలేదు. ఈమాఱు అటావలి యెల్లుండి సూర్యోదయమునకు పూర్వమే బొబ్బిలివారి కెవ్వరికిం దెలియనీయక బొబ్బిలికి ముట్టడి వేయుదు మేని జయ మని మాజోస్యులు చెప్పినారు. అట్లు అతర్కితోపపతితముగా వారిమీఁద బడుటకు, మీరు వలంతులేని నేను సాయము రాఁగలను. మనకు జయమని నిశ్చయము. విలంబము చేయుదు రేని, మనకు జయము కలుగదు.

హైదరు. - ఆలాగే వెల్దాం, ఇందుకీ వోచన యెందుకి?

రాజు. - మఱి మేము విజయనగరమునకు పోము. అందఱు నొక్క మొగిని రేయుం బవలు నడువవలయును; మాతురుపులు దారి నడుపుదురు. మీరు త్వరగా ప్రయాణభేరులు కొట్టింపుఁడు. మఱి మాకు సెల వొసంగుఁడు.

బుస్సీ. - హైదరుసాహెబు, మహారాజుగారిని సాగ నంపి రమ్ము. సలాము మహారాజా. [అందఱును లేతురు. సలాములు మార్చుకొందురు. రాజు, రాజపరివారము, హైదరును, పరిక్రమింతురు.

బుస్సీ. - మనముపోయి మన పనులు చూచుకొనవచ్చును. [బుస్సీ ప్రభృతులు నిష్క్రమింతురు]

రాజు. - మీరు చాల వ్యవహారసమర్థులు. పరంగివానిని క్షణములో ఒప్పించినారు. ఈస్నేహమునకు బదులుగా, మాతాతగారికి ఢిల్లీసుల్తానుగా రిచ్చినది, రత్నాలు తాపిన యీ కైజారును, కమర్బందును, మీయొద్ద ఉండవలయును. మా ప్రక్కలోని బల్లెమును, కంటిలోని నలుసును, మీరు ఊడఁబెఱికిన వెంటనే, మేము ఒప్పుకొన్న పైకమును, పైగా మాకృతజ్ఞతను మీరే కందురు. [నేపథ్యములో 'ఓంభాయి, ఓంభాయి.' అప్పన్న లోనుగా పరివారము, రాజును కలసికొనును.

రాజు. - [వినుట నభినయించి] అప్పన్నా, ఎవరది ఆసవారి?

అప్పన్న. - సామర్లకోట నీలాద్రిరాయనింగారిది.

రాజు. - పోయి, మేమిక్కడ నున్నా మని, వారు దర్శన మిప్పించిన సంతోషించెద మని, మర్యాదగా పలికి తోడ్కొనిరా. [అప్పన్న అట్లేచేయును.

రాజు. - ఓహో; సంవత్సరకాలమునకు దర్శనము!

నీలాద్రి. - ఈదినము మాకు మహాపుణ్యదినము.

రాజు. - ఈరాక హైదరుజంగుగారి జమాబందికా ?

నీలాద్రి. - అవును. రాజు. - మేము బొబ్బిలిమీఁదికి లడాయికి వెళ్లుచున్నారము. రాయనింగారు మాతో కలసికొందురా?

నీలాద్రి. -

              క. తోడల్లునిమీఁదికి బో
                  రాడన్ రమ్మనెదవె యుచితానుచితంబుల్
                  సూడవు, ముదుకవు, పండిన
                  మేడి ఫలంబవు, సువస్త్వమిత్త్రుఁడ, వెపుడున్. ౧౪

రాజు. - నీ పాటియుచితజ్ఞత మాకు లేదందువా ? కానీ, బొబ్బిలి కొట్టి వచ్చి సామర్లకోటను దుమ్ముదుమారము చేసెదము.
నీలాద్రి. -

                 ఆయువుమీఁదను నాసలు గొంటే, నాలకింపు రాజా;
                 రాయనిమీఁదికి వెళ్లినవారికి రాక మ ఱెక్కడిది ?
                 నీటిబొట్టుకై వానకోయిల నిగిడి మొగులుఁ బొడువ;
                 మేటిపిడుగు భస్మీకరించుటే సాటి నీకు రాజా. ౧౫

రాజు. - [ఱిచ్చవడి ఆలోచించి స్వగతము] హా ! రంగారాయని శౌర్యమున నితని కెంత నమ్మకము! కానీ! ఇటు చెప్పి వంచించెదను. [మందహాసముతో, ప్రకాశము] రాయనింగారితో వేళాకోళముగా పలికితిమి. బొబ్బిలిమీఁదికి పోవుట గీవుట అంతయు వట్టిమాట సుమా!

నీలాద్రి. - కాక నిజమా? కాదని మా కప్పుడే తెలియును.

రాజు. - [హైదరుతో, అపవారించి] ఇతనికి బొబ్బిలి ముట్టడిమాట తెలియ నీకుము. ఇతఁడే ప్రస్తావించినచో మామాట వట్టివేళాకోళ మని పలుకుము. సలాము.

హైదరు. - అది కూడాను మాకీ చెప్పవాలా? సలాం. మా ఫిరంగియగాదే మేము తల్లినా మని మీకీ తెల్పుతుంది. [అని నీలాద్రిరాయనితో నిష్క్రమించును.

రాజు. - ఇతఁడిట నాకంటఁ బడుట మేలే అయినది. అప్పన్నా, మన దండును క్షణములో తరలింపుము.

అప్పన్న. - ఏలినవారి చిత్తము.

రాజు. - [పరిక్రమించుచు] అబ్బా; ఊడినట్లేరా నా ప్రక్కలోని బల్లెము! వచ్చినట్లేరా నాకంటిలోని నలుసు! అయినను ఆదిలో అపశకునము. అంతములో ఈ నీలాద్రిరాయని మాటయు అవశకునమే, కాని, అది నాప్రయోగమే. అయినను, తరలఁగానే వచ్చినది.

రాజు. - హా! [అని ఆశ్చర్యపడి] ఏమి యీ ఫిరంగి ? అవశకునములే అని సిద్ధాంతము చేయుచున్నదా ?

[నేపథ్యమున కలకలమువెంట.]

              హడ్వీ హడ్వీగానే నడ్వీ యెల్లిందీగా, నడ్వీ యెల్లూతాము మేమూ;
              హడ్వీ వూరయితుంది, వూరుహడ్వయితుంది, మేమూనిల్చీనా ఠాణా.
              పడ్వా నడ్వయితుంది, నడ్వ పడ్వయితుంది, మేమూ దాటీనా యేటా,
              పడ్వా నడ్వా రెండు పాడూవెడారీగానడ్వీ యెల్లూతామూమేమూ.

రాజు. - [చెవి యొగ్గి వినుచుండి] అప్పుడే మొగలాయీ దండు కదలినదే! అబ్బా ? ఏమి యీ తురకల దర్పము !

[నేపథ్యమున]

              గోవిందా గోవిందా మాకు గొంతు గొయ్య కయ్యా.
              రామా రామా మల్లీ యిళ్లకి రానియ్యా వయ్యా.
              కొండమీద కాట్రేడా నీకూ గండదీప మెడతాం;
              ఆలుబిడ్డలకి మాకు ఆపతి అవల నెట్టవయ్యా. ౧౭

రాజు.- అరరే ! బళీ ; అప్పన్న మాదండును గూడ తరలించినాఁడే ; ఇంక మేమును క్షణములో కదలెదము [అని నిష్క్రమించును.


__________
  1. * పా. మామైత్రి నతఁడెంత మదిరోసియున్నను

    విసువక సంధి గావింప వేడి,

    మారాజబాంధవు మాన్యుని మేమంప,