బొబ్బిలియుద్ధనాటకము/ద్వితీయాంకము
ద్వితీయాంకము.
స్థలకము: - బొబ్బిలికోట - అంత:పురము
[అంతట రాణియు పెండ్లికొమార్తులును దాసీజనమును ప్రవేశింతురు.]
రాణి. - [నిర్వర్ణించి] ఆహా! ఊరేఁగింపు మహలుదర్వాజాకడకే వచ్చినది ! ఓహో యెంతరమణీయముగా నున్నది ! [పెండ్లికొమార్తులను ఉద్దేశించి] నాబంగారు కొండలారా, మీ రందఱు కిటికీలకడ నిలిచి కనులపండువు గావించుకొనుఁడు. (చిఱునవ్వుతో) మఱి మీరు వెలమకన్యలు, ఒక్కొక్కతయు తనభర్తను మాత్రమే చూడ వలయును.
కొందఱుకన్యలు - [చిఱునవ్వుతో] వెలమకన్యలకంటికి ఇతరులఁఏల యగపడుదురు ? ఇతరులకంటికి వా రేల యగపడుదురు ? [అని అందఱును పరిక్రమించి ఊరేఁగింపు చూచుట నభినయింతురు.
రాణి. - ఓసీ ; వేంకటలక్ష్మీ, నీకు ఏలినవారు చదువులు చెప్పించి పెద్దదాసి యధికార మిచ్చినందులకు తగినట్లుగా ఈముద్దరాండ్రకు ఈయూరేఁగింపులోని విశేషములను వర్ణించి విశదపఱుపుము.
వేంకట - దేవిగారియానతి. మఱిచిత్తగింపుఁడు.
క. ఆకాశబాణము లవే
యాకాసంబునకు నెగసి, యమరుల చెంతన్
రాకేందువులుగ, బాల ది
వాకరులుగఁ, బేలి, కలయఁ బర్వెడుఁ గనుఁడీ. ౨౧
మఱియు: -
శా. ఏయే వన్నె సులోచనం బిడుదుమో యీ చుట్టుప ట్లప్పుడే
యాయావన్నెవిగాఁ గనంబడుఁ గదా ; యామాత్రమే గా కివే
స్ఫాయద్వర్ణము లౌమతాబులు ప్రకాశం బొంద నాతేజులన్
క్ష్మా యెల్లన్ స్ఫుటదృశ్యతావిభవమున్ గాంత్యుచ్ఛ్రయంబుం గనెన్.
పెండ్లికొమారితలు. - వేంకటలక్ష్మి మహాకవీశ్వరురాలుగా నున్నదే !
వేంకట. - మఱియు వినుండు: శా. ఊరేఁగింపుని కొన్ని యెట్టెదుట నచ్ఛోచ్చాంబ రాదర్శ బిం
బారూఢంబులొ, యుత్స వేక్షణముకై నాకంబె యేతెంచెనో,
నా, రంభోర్వసులన్ మహేంద్రసభ మందారంబు నింద్రాశ్వమున్
భూరిక్ష్మాధ్రము నింద్రసింధురముఁ జూపున్ బాణసంచా యిటన్.
మఱియు, -
ఉ. బంగరువన్నె పాము లురువర్ష్మము లుర్వరనుండి లేచి, త
త్సంగముఁ బాయ కే దివికిఁ జాఁగి, దిశాతతి మూయ, వాని దీ
ర్ఘాంగము లడ్డుగాఁ గడుపులం దుఱు రేకులుఁ బడ్గు పేక యై
బంగరుగాదెలో నడుగుఁబట్టినకైవడిఁ బ్రోలు గ్రా లెడిన్. ౨౪
రాణి. - సరసురాలవే వేంకటలక్ష్మీ. గద్యరూపమున నించుక మాకు శ్రవణముల నమృతముం గురియింపుము.
వేంకట. - మహాలక్ష్మియాజ్ఞ. - చదలం దేలియాడు నీ దీపపుగుమ్మ టములు కాగితంపులోనివలనం గల చిత్తరువులు బయలికి వెలుంగుచుండ, ఉత్సవ దిదృక్షు సౌవర మిథునాధిష్ఠిత విమానంబుల చందంబున నందగించుచున్నవి. సమలంకృతంబులును ఉపరి విస్తీర్ణోభయపార్శ్వలంబమాన రత్నకంబళ విరాజితంబులును వరాద్యధిష్ఠితంబులు నైన యీయేనుంగులు ఈవీథిపొడుగున మి న్నంటుచు నూరేఁగింపు నడచునొప్పిదము - మహా గిరులు సపక్షంబులు శ్రీరాయనింగారి ప్రాపున ఇంద్రుని సరకుసేయక సిద్ధవిద్యాధరాద్యధిష్టితంబులై జ్యోతిష్మత్యాది దేదీప్యమానంబులై యథేచ్చసంచార భాగ్యంబు ననుభవించుటయో నాఁ-గన్పట్టుచున్నది. [నేపథ్యమును బరికించి] మహాలక్ష్మీ, ఊరేఁగింపు మన నగరిదర్వాజాకడకే వచ్చి నిలిచియున్నది ; మేజువాణి జరుగుచున్నది.
పెండ్లికొమారితలు. - వేంకటలక్ష్మి, ఆమేజువాణిలోని పాట మాకు తెల్లము గాక యున్నది. దానిని నీవు యథోచితముగ అభినయ పూర్వకముగా ననువదించి మావీనులకు విందొనర్పుము.
వేంకట. - దొరసానులయాజ్ఞ. చిత్తగింపుడు - ఈ గేయము నాయకునిమ్రోల విరహిణీదూత్యుక్తి. [అని యిట్లు పాడును.]
[గేయము]
బిత్తరి నీమీఁదఁ జిత్తమి డిన యాతత్తఱ ము వినరా !
నాసామి, ఆ తత్తఱ ....
చిత్తజు ని కాఁక హత్తి సొలసి సోలి, మిత్తిని దలపోసెరా !
నాసామి, ఆ మిత్తిని దల ...
"వల్లభు నిమది క ల్లని యెఱుఁగక చెల్ల ! కల్ల యైతి నే!
ఓ చెల్ల ! తాఁజెల్లఁ గల్ల ...
ఇంత కాలము నేను జింతించి నవి యెల్ల గొంతమ్మ కోర్కులఁటే?
ఓ చెల్ల ! ఆ గొంతమ్మ కోర్కు ..."
సారసా క్షి యిట్లు *[1]కేరుచు నే నిన్నుఁ గోరుచు నున్నదిరా !
నాసామి, నిన్ గోరుచు ...
మత్తచ కోరాక్షి గుత్తంపు గాజులు గుత్తిగ రాలెనురా !
నాసామిగా గుత్తిగ రా ...
ఉంగ రా లు కేల ముంగాము రాలైన సింగారిఁ గందువురా;
నాసామి, ఆ సింగారిఁ గం ...
వన్నెము త్తెసరాలు సున్నమ యినయా కన్నియఁ గందురారా
నాసామి, ఆకన్నియఁ గందు ...
[పిరంగి యగాదు. స్త్రీలు హల్లకల్లోలపడుదురు. నేపథ్యమున] ఇదేమి తమ్ముఁడా ఊరిబయటినుండి యెంత విపరీతపు ఫిరంగిమ్రోతఁ వినఁబడుచున్నది!
వేంకట [ఆలకించి నిర్వర్ణించి, రాణిని ఉద్దేశించి] అమ్మా, ఏలినవారు వెంగళరావుగారితో ఇక్కడికే వచ్చుచున్నారు. [వేంకటలక్ష్మి తప్ప అందఱును నిష్క్రమింతురు.
[అంతట రంగారావును వేంగళరావు సంభ్రాంతులుగా ప్రవేశింతురు.]
రంగ. -
క. దిక్కులవియఁ బాతాళము
గ్రక్కదలఁగ గడ్డ గడ్డగా ఘూర్ణిల్లినా
యక్కుగవి సొచ్చి సరవిన్
దక్కుఁడు తక్కుఁడయిమ్రోత తడవుగ డిందెన్. ౨౬
వెంగళ. - ఇదేమో విపరీతముగా నున్నది. రంగ. - వేంకటలక్ష్మి, పన్నీరు తెమ్ము కన్నులు, కడుగుకొనవలయును.
వేంకట. - ఏలినవారియాజ్ఞ. [అని నిష్క్రమించును.
రంగ. - తమ్ముడా, ఈ డాబామీద చల్లగాలిలో కూర్చుందము.
[ఇద్దఱును ఆరోహణ మభినయించి పరిక్రమించి కూర్చుందురు.]
వేంకట. - [ప్రవేశించి] ఇదిగో పన్నీరు. [అని పన్నీటి కూజాను రంగారాయనిచేతి కిచ్చును.
రంగ. - [కయికొని, చల్లుకొని, కడిగికొని, పన్నీటిగిండిని వేంకటలక్ష్మి చేతికిచ్చి] వేంకటలక్ష్మి, నీపని నీవు చూచుకొనుము. [
వేంకట. - ఏలినవారియాజ్ఞ. [అని నిష్క్రమించును.
రంగ. - ఏమి తమ్ఁముడా, ఈరాత్రి కర్పూరములు వేసినను అత్తరువులు పోసినను, కాగడాలు మసక మసకగానే మండినవి ?
వెంగళరావు. - అన్నయ్యగారూ, నిద్రలేమిచే మనక నులు మసక లైనందున అ ట్లగపడి యుండును.
రంగ. - కాదు తమ్ముఁడా ; జ్వాలలు రాత్రి యెల్ల చీలికలు చీలికలుగానే అగపడినవి.
[నేపథ్యమున నౌభత్తు వాయింపఁబడును.]
రంగ. - ఏమి తమ్ముఁడా, నేఁడు మననౌభత్తు రోదనమువలె వినఁబడు చున్నది !
[ఫిరంగియగాదు. ఇరువురును అడిచిపాటుతో శ్రవణ మభినయింతురు.
రంగ. - (ససంభ్రమము) ఇదేమి తమ్ముఁడా! ఊరిబయటనుండి వెండియు ఇట్టి ఫిరంగిమ్రోత వినఁబడుచున్నది ! తమ్ఁముడా, ఇది -
సీ. కల్పాంత కాలంపుఁ గాఱుమొగు ళ్లెల్ల
నొక్కుమ్మడిగఁ గూడి యుఱుముటొక్కొ ?
క్షయమున విశ్వంబు గాల్చుకా లాంతకు
గళగహ్వరపు మహాగర్జయొక్కొ ?
కంబాననుండి రక్కసునిపైఁ బడు దంభ
హర్యక్షు ఘోరాట్టహాస మొక్కొ ?
బెడిదంపు బడబాగ్ని వెడఁదఫిరంగి యై
మొత్తంబుగా మ్రోత మ్రోయుటొక్కొ ?
తే. ఎత్తి వచ్చెనొ కూళరా జిట్టిహదన ?
నింతటి ఫిరంగి యాతని కేడఁ జెపుమ ?
తమ్ముఁడా, రమ్ము మనమె బేతాళబురుజు
నెక్కి కనుఁగొంద మావింత యేమొ యిపుడు. ౨౭
రా, తమ్ముఁడా, రా, బేతాళునిబురుజెక్కి ఇదేమో చూతము.
[ అని బురు జెక్కుట నభినయింతురు.
వెంగ. - ఆహా ! ప్రొద్దు పొడుచుచున్నది ! చీఁకటి చెదరుచున్నది. [నలుగడం బరికించి] అన్నయ్యగారూ, ముట్టడి ! ముట్టడి ! ఆ యేనుఁగు లేమి ! ఔరా ! ఆ గుఱ్ఱము లేమి ! అబ్బా ! ఆ ఫిరంగుల బారు లేమి ! ఎన్ని డేరాలు ! ఎన్ని డేరాలు ! ఎంత కాల్బలము ! దేవ అవధారు ?
సీ. వీరబొబ్బిలి యిదే పేరుపొందినలంక,
యీ రాణువే యకూపార మౌర !
కాల్బలంబులె యుదకంబులు, మేల్తురం
గంబులే ఘనతరంగంబు లౌర !
వాటంపుడేరాలె వట్టిమేఘంబులు,
మత్తేభములె నీరుమబ్బు లౌర !
కడిది ఫిరంగులే కాలకూటంబులు,
కైదువులే భుజంగంబు లౌర !
తే. అవలిదరి లేదు, గణుతికి హద్దు లేదు,
కనము, విన, ముట్టిముట్టడి కలల నైన !
నెవరొ ? వీ రేల వచ్చిరో ? యెఱుఁగవలయు ;
దిగుచునే యున్న దింక నల్దెసల దండు. ౨౮
రంగ. - [పరికించి] అవును తమ్ముఁడా ! ముట్టడియే ! ఇంతదండు విజయరామునికి లేదు. మఱి, మన కెవ్వరును పగవారు లేరు. వీ రెవ్వరు.
ప్రతీహారి. - [ప్రవేశించి] జయం జయం శ్రీరణరంగమల్ల బొబ్బిలిమహారాజ రంగరాయమహాప్రభువువారికి. వేగులు వచ్చినారు.
రంగ. - వేగులకు నేఁడు తెలుపుడు లేకయే, ప్రవేశము కలిగింపుము.
ప్రతీ. - ఏలినవారి ...... [అని నిష్క్రమించును.] [అంతట రోఁజుచు వేగులు ప్రవేశింతురు.]
వేగులు. - మహాప్రభో, జయం జయం యేలినవారికి. విజయరామరాజుగారు బొబ్బిలిమీదికి పరాసులని తెచ్చి ముట్టడేయించినారు. లక్షా డబ్భైవేలు గోలకొండ దండు, 24 వేలు రాజు సిబ్బంది. లోపలిపురుగు బైటికి వెళ్లడానికి, బైటిపురుగు లోపలికి రావడానికి లేదు.
రంగ. - ఇంక నే మయిన మీకు తెలియునా ?
వేగులు. - మఱేమీ తెలియదు మహాప్రభో.
రంగ. - మఱి పొండి, మీపని చూచుకొండి. [వేగులు నిష్క్రమింతురు.
రంగ. - తమ్ముఁడా, నాయెడమబుజము పట్టుకొమ్ము, ఎట్లు త్రుళ్లిపడుచున్నదో చూడు.
వెంగ. - [పట్టుకొని పరికించి] అన్నయ్యగారూ ! మన కిది శుభశకునము, విజయరాముని కైన దుశ్శకునము. కావున మనకు వీరస్వర్గ మునకు ఇది సూచకము. ఇందుకై చింతింప నేల ?
రంగ. - కాదు తమ్మయ్యా. ఇ దేమి నాగుండెలు కొట్టుధ్వని కోటతలుపును గొడ్డండ్లతో కొట్టినధ్వనివలె వినఁబడుచున్నది ! నీకు వినఁబడుట లేదా !
వెంగ. - తమరు దిగులు పడుచున్నారే అన్నయ్యగారూ !
రంగ. - హా ! ఈ సమయమున పాపయ్య లేకపోయెను గదా ? తమ్ముఁడా, అతఁడు లేమి ప్రాణము లేమియే గదా !
వెంగ. - ఏమి అన్నయ్యగారూ ! ఎన్నడు లేనిది తమరు ఈ దినము దిగులు పడుచున్నారు.
రంగ. - దిగులు గాకేమి తమ్ముఁడా ! సమయ మట్టిదిగా నున్నది నాతమ్ముఁడా ! మన మేమి -
శా. పారావారముఁ ద్రాగివైతుమొ? గిరివ్రాతంబు భక్షింతుమో ?
తారెన్ బొబ్బిలి వీడి శ్రీ యిపుడు నిర్దాక్షిణ్య చిత్తంబునన్.
అయినను దిగు లనఁగా నేమి తమ్ముఁడా !
బీరం బేదుదుమో? దురాన నరికిన్ వెన్నిత్తుమో? నమ్రుఁడౌ
వైరిం గావమొ? యెట్ట కే నొరులచే బ్రాణంబు కోల్పోదుమో. ౨౯
వాస్తవస్థితి నరసికొంట తెల్వి గాని దిగులు గాదు తమ్ముఁడా ! మఱి, మన మిక్కడ కాలహరణము చేసికొనఁ గూడదు. క్షణములో నామతీర్థము కానిచ్చి, మంత్రాలోచన సభకు రమ్ము. తమ్ముఁడా నాచేరువకు రమ్ము. [అని రాఁగా కవుంగిలించి] ఱేపు ఉందుమో, ఉండమో ? ఒకతల్లికడుపునఁ బుట్టితిమి, ఒక్కటే మనస్సుగా ఆత్మగా బ్రతికితిమి. తమ్ముఁడా, ఎన్నఁడైన నీయుత్సాహములకు భంగము చేసియుంటినా ? నావలన నీ కే మయినం గొఱఁత కలదా తమ్ముఁడా ?
వెంగ. - ఏమి యన్నయ్యగారూ ! ఇట్లు పలికెదరు ! తమవలనను నాకు భంగమా ? తమవలన నాకు కొఱంతయా ? బాలుఁడ నైన నాదుండగములను, తప్పులను మన్నింపవలయును.
రంగ. - నీవంటి తమ్ముఁడు నాకుఁ బైపుట్టువునం గలుగునా ?
వెంగ. - నేనే మెఱుఁగుదును ? ఎట కైనను తమశుశ్రూషకు రాక నేను మాత్రము వెనుకఁ దగ్గుదునా ?
రంగ. - రమ్ము తమ్ముఁడా, రమ్ము. (అని కవుంగిలించి, ముద్దుగొని) దైన్యమని తలంపకుము, వీరుల మయినను మనుష్యులమే గదా ?
[అంతట వేగులు వేగముగ ప్రవేశింతురు.]
వేగులు. - జయం జయం ఏలినవారికి ! మహాప్రభో, ఎదిరి దండులోని తల మానుసులని తెలుసుకొని వచ్చినాం, మహాప్రభో !
రంగ. - ఎవ రెవరు ?
వేగులు. - మహాప్రభో, ఒకడు విజయరామరాజు.
రంగ. - [స్వగతము] అతఁడు కూడ నొక తలమానిసి యఁట? ఈ చేఁతకు త్వరలోనే తలలేనిమానిసి అగును [ప్రకాశము] ఇతరులను చెప్పుఁడు.
వేగులు. - గోలకొండవారి యీపౌజు కంతా మొనగాడు మూసా బూసీ అనే ఫరంగిదొర. వారి ఫిరంగీకి దొర్లని కోట యీదేశంలో లేదట. హైదరుజంగు సాయెబు అతనికి దివాను. సర్దార్లు మరాటి భూములు, కల్బర్గసంస్థానము, భువనగిరిసంస్థానము కొట్టిన ఖానులంట ఇంతేనండి యిప్పటికి తెలిసింది.
రంగ. - సరే పోయి రండి.
వేగులు. - ఏలినవారియాజ్ఞ. [అని నిష్క్రమింతురు.
రంగ. - ఏడు మాఱులు ఇతనిని నేను జయించితిని. ఈ మాఱు నన్ను ఇతఁడు త్రొక్కివైచినాడు. గోలకొండవారికి నేను ఏమియు ఇతనికన్న అపరాధము చేయ లేదు. పేష్కన్సు ఇతఁడును చెల్లింపనివాఁడే గదా ? వీరు ఇతనిని మాని నన్ను ముట్టడించుట చూడఁగా, ఇతఁ డేమో కుట్రచేసి వీరిని నామీఁదికి తెచ్చినాఁ డనుట నిశ్చయము. ఈరాజు సమయము వేచి నన్ను చిదుగఁ గొట్టినాఁడు. పెండిండ్ల సమయ మిది తనకు మంచిసమయ మని ఆలోచించి, యిపుడు ముట్టడి తెచ్చినాఁడు. నిద్రలో సింగమును పట్టినట్లు నన్ను తెలియనీయక పట్టినాఁడు. ఆహా! బయట వీరు ముట్టడి వైచు చుండఁగా లోపల ఊరేఁగింపులు ఉత్సవములు చేయుచుంటిమి. హా ! దైవ మతనికి ఇప్పటికి ఇంతమాత్రము అనుకూలించినది. కానీ యుద్ధమే జరుగనీ, ఈ పరాసులు నాపోటు నొకమాటు రుచిచూతురు గాక. కానీ! వీరిసంఖ్య హె చ్చయిననేమి?
వెంగ. - అన్న గారికి విన్నపము నే నుండఁగ తమరు పూనుకోనేల? ఇప్పుడు తమసెల వైన -
వసుధ నిం డినయీ పౌఁజుచీ కటికి నేఁ బట్టపగల నయ్యెద!
ఎడలేక పెరిఁగిన యీ దండు కాటికి నెరగలి నే నయ్యెద!
చలియింప కున్న యీ సైన్యమే ఘములకు ఝంఝా వా యున నయ్యెద!
అద్దరి లేని యీ యరిసేనాం భోధికి నగస్త్య ముని నయ్యెద?
సెల వీయవలయును.
రంగ. - నీ వుండఁగా నాకేమి పని తమ్ముఁడా ? కానీ, ఆగడియ రానీ. మఱి నీవు పోయి త్వరగా రమ్ము.
వెంగ. - అన్న గారి యాజ్ఞ.
రంగ. - హా ! ఇంతకాలమునకు నాచేతికి ఆటిన సమరము పొసఁగినది. విజయరాముని గెల్చిన నేమి కీర్తి? నాపోటు ఢిల్లీగోలకొండలలో మాఱుసెలంగును గాక ! పెండ్లికి తరలు రీతిగా పోరికి తరలెద. [నిశ్వసించి] హా ! నిన్న పెండ్లిండ్లు నేఁడు మరణములు !
ఆ. కన్నెవలపుతోడి యన్ను మిన్నల వీడి
కైఁ గొనంగ వలసెఁ గైదువులను ;
బెండ్లి కంకణంబు వీరకంకణముగా
వెలమ యువలచేత విధి దవిల్చె.
ఏమి యీమానవ జన్మము !
ఆ. అంతలోన నెలయు నంతలో మ్రబ్బును;
నంతలోన వాన యంతఁ బిడుగు ;
బండి నిండి పఱచి గండిలోఁ బడినట్లు
పడియె నౌర ! పదవి బాలికలకు. ౩౧
హా కోటలో ఊరేగింపు బయట ముట్టడి !
ఆ. మధువు లాని, యాద మఱచి, మత్తాగొని,
యాటపాటలందు ననఁగి పెనఁగి,
తేఁటియాండ్రు గండ్లు గూఁటిలో సుఖముండ
బయటఁ *[2]గారుచిచ్చు ప్రబ్బి కొనియె ౩౨
ఏమి యీ దై వమాయ ?
ఆ. అకట ! నిన్నఁ బెండ్లియైన యిందరు బాల
లేమి వెలితి నోము నోమినారొ !
అంతిపురములోని హల్లకల్లోలంబుఁ
జౌరజనుల గోడుఁ బట్ట వసమె ? ౩౩
[ఆకాశమున చూపు నిలిపి] విజయరాముఁడా, ఇంతపని చేసిన నీవు నాచేత నేమి గతి పొందుదువో ? త్వరగా నామతీర్థము కానిచ్చి, - ఆహా ! ఏమి !
ఓరోరీ, నానగండా యుదురుమిడుకనీ
యూరి కెచ్పైతి వట్రా?
క్రూరా, మే ముత్సవ వ్యగ్రుల మగుటను నీ
కున్ జయం బబ్బు నఁట్రా ?
పోరా, మా కొల్చువేల్పుల్, పొడుచు కయిదువుల్
పొల్లు లై పోయె నఁట్రా ?
చోరా ? మామీఁదికిన్ ఫ్రాంసులను బదములం
జొచ్చి రేఁ దెచ్చి తఁట్రా ? ౩౪
[ద్వితీయ తృతీయాంకముల నడుమ]
విష్కంభము.
స్థలకము: - పెద్దచెఱువు నీరాట రేవు.
[కతిపయ బ్రాహ్మణులు యథోచితముగ ప్రవేశింతురు.]
వేదాంతి. - శాస్త్రులుగారూ, అవు నయ్యా, నీమాట నిజమే ! ఎంత దండు ఎంతదండు ! వీరు ఈచెఱువును ఈప్రక్కనుగూడ చుట్టవేసినయెడల ఊరికి ఇప్పటికి ఈనీళ్లు దొరకకపోవును.
శాస్త్రి. - వేదాంతిగారూ, ఈమాఱు రాజు మంచిరాజనీతిని ప్రయోగించినాఁడు. పెండ్లిసమయ మగుటచేత మనదొరలు ఎదిరి పోరనేర రని, మనయూరిమీఁదికి ఈగోలకొండసిద్దీలను పౌఁజును తెచ్చినాఁడు. [అందఱ నుద్దేశించి] అయ్యా, బ్రాహ్మణోత్తములారా, మనప్రభువునకు జయము కలుగునట్లుగా ఈసమయములో మనబ్రాహ్మణోపాయములు ఎవరికి తెలిసినవి వారు చేయరాదా ? పురుష ప్రయత్నముచే గ్రహ దోషములుకూడ తొలఁగి మేలు కలుగును గదా ?
ఆ. వ్రాఁత దైవ మండ్రు, చేఁతఁ బౌరుష మండ్రు;
వ్రాఁత ప్రబలమేని చేఁత నణఁచు ;
చేఁత ప్రబలమేని వ్రాఁత నడంచును;
గానఁ గడిఁది జతన మూనవలయు.
అయ్యా, జోస్యులుగారూ, ప్రశ్న చెప్పుఁడు.
జోస్యుఁడు. - యుద్ధప్రశ్న, శీఘ్రమే. హా ! ఈరాత్రియే యుద్ధము జరుగును.
ఇతరులు. - ఎవరికి జయము ? ఎవరికి జయము ? రాజునకా రాయనింగారికా ?
జోస్యు. - ఎవరికిని లేదు. గ్రహములు చాల గందరగోళముగా నున్నవి. [అని నిష్క్రమించును.
విద్యార్థి. - నేను రంగారాయనింగారికి జయము కలుగునట్లుగా నాపాఠములను మానుకొని సుందరకాండ పారాయణము చేసెదను. [అని నిష్క్రమించును.
కవి. - అది దినములపని. నేఁడే యుద్ధము జరిగిన నదీ కార్యకారి కానేరదు. కావున నేను రాయనింగారికి జయము కలుగునట్లుగా అమృతబీజములను, విజయరామరాజునకు కీడు కలుగునట్లుగా విషబీజములను, పెట్టి పద్యాలు చెప్పెద. [అని నిష్క్ర. మాంత్రికుఁడు. - ఈసమయములో ఆపని చేయరాదు. పొరఁబాటున విషబీజము లిందును అమృతబీజము లందును పడినయెడల కొంప మునుఁగును; ఇప్పు డే మయిన మంత్రప్రయోగము చేయవలయును.
శాస్త్రి. - మంత్రాలకు మామిడికాయలు రాలవు. ఈసమయములో ఇంద్రజాలము అక్కఱకు వచ్చును.
వేదాంతి. - శాస్త్రులుగారూ ! ఈపెండిండ్లు ఈముట్టడులు చూడఁగా లోకవృత్త మంతయు ఇంద్రజాలముగానే అగపడుచున్నది ! అయ్యా,
ఆ. సుఖము లెల్లఁ గలలు, శోకంబులును గలల్;
తా ననెడు తలంపు హానిఁ దెచ్చె;
అరయ నింద్రజాల మఖిలప్రపంచంబు,
నిత్యసత్య మాత్మ నెగడు నొకటి. ౩౬
శాస్త్రి. - అవును వాస్తవమే ! ఇట తడయఁజనదు. [అని అందఱు నిష్క్రమింతురు.
- ___________