బొబ్బిలియుద్ధనాటకము/తృతీయాంకము

వికీసోర్స్ నుండి

తృతీయాంకము.

స్థలకము: - రంగారాయనింగారి యాస్థాని.

[అంతట రంగారావు, వెంగళరావు, ధర్మారావు,

గుమాస్తాలు, వేగులు, పరివారంబును ప్రవేశింతురు.]

రంగారావు. - చెప్పుఁడు మాకన్నులారా, మీరు ఇంక నేమి కనిపెట్టి వచ్చితిరి?

వేగులు. - మహాప్రభో ! పాపారాయనింగారు వస్తే కనిపెట్టడానికి రాజాం దారిలో విడిసినాడు విజయరామరాజు ; తనదండంతా తనకాణ్ణే పెట్టుకొనున్నాడు. దానెంబణ్ణే హైదరుజంగుడేరా ; బూసీడేరా దానెంబణ్ణుంది. సిద్దీబిలాలున్ను కడమ గొప్పసర్దార్లున్ను దానెంబణ్ణే. మాలపిల్లికాణ్ణుంచి వరసగా కొండబోటు దాకా ఫిరంగీలబారు నిలిపినారు. దానికీ బుస్సీ డేరాకూ నడుమ మందు కొట్లు. ఊరి చుట్టూరా అడివిలాగ సిద్దీలని, ఫరంగీలని, బుడుతకీసులని, ఇంగిలీసులని, వళందులని, తురకలని, ముట్టడి నిలిపినారు. వారివారి సందుల్లో, వారివారి పడాళ్లు కుదురుకొని వున్నారు. పరాసుల దం డంతా ప్రెతివాడికిన్ని తుపాకీలు, సన్నీలు, కత్తి కఠారీ, బల్లెం బాకు ; గోలకొండ తురకదండులో ప్రెతివాడికి ఇవే గాక డాల్ తర్వార్, ఈటె ఇవిన్ని, విళ్లు ఊచలున్ను. రాజుదండులో విళ్లు ఊచలు లావు, తుపాకులు కొంచెం; బల్లెం బాకు ఈటె లావు. రాజు మన్నె సిబ్బందీని యుద్ధానికి పెట్టక చాకిరీకి పెట్టినాడు.

ప్రతీహారి. - [ప్రవేశించి] జయం జయం ఏలినవారికి. హైదరుజంగు బహద్దరు కాడినుంచి రాయబారి సర్దార్ హసేనాలిగారు వచ్చివున్నారు.

రంగ. - ధర్మారావూ. నీవు ఎదురు పోయి వారిని తోడ్కొనిరమ్ము.

ధర్మ. - చిత్తము. [అని ప్రతీహారితో నిష్క్రమించును.

రంగ. - (వేగులతో) మీరు మరలి పోయి ఇంక మే మయిన తెలిసికొని రండి.

వేగులు. - ఏలినవారియాజ్ఞ. [అని నిష్క్రమింతురు.

[అంతట హసేనాలిని తోడ్కొని ధర్మారావు ప్రవేశించును.]

ధర్మా. - వారే రంగారాయనివారు. తమరు ఇటు చెంతకు దయచేయవలయును.

హసేనాలి. - [సమీపించి] సలాము రంగారావు బహద్దరువారికి.

రంగ. - [లేచి] సలాము హసేనాలి సాహెబుగారికి. ఇట్లు కూర్చుండుఁడు. [అని కుర్చీని జూపును. మువ్వురు కూర్చుందురు. హసేనాలి. - గోలకొండ నిజాముగారి యాజ్ఞ చేత ఉత్తరసర్కారుల పేష్కస్సులు వసూలుచేయుటకు వచ్చిన సర్వాధికారి బూసీదొరగారి దివాను హైదరుజంగు బహద్దరువారు పంపగా మేము మీకడకు వారిరాయబారము తెచ్చినారము. వారి సర్దారులలో మే మొకరము. మేము వచ్చినపని హైదరుజంగు బహద్దరు వారి ధోరణిగానే వినుండు. - "మీరు గోలకొండ నిజామువారికి ఏడుసంవత్సరముల పేష్కస్సును ఎగవేసినారు. విజయనగరమురాజుగారి తాలూకాలు దోఁచుకొనుట, ఊరులు తగులఁబెట్టుట, లోనగు నేరములు ఎన్నియో చేసియున్నారు.

రంగ. - [ఆత్మగతము] హా; ఏమి ప్రయోగము ! ఎంతపని చేసినాఁడు రాజు ! [ప్రకాశము] తత్వాత, తర్వాత?

హసేనాలి. - "మఱియు, మారాకను రాజు మీకు తెలిపినను 'నౌకరులబేటికి మేము రాము' అని మమ్ము తూల నాడినారు. పైగా మేము పంపిన ఫర్మానాను సరకు గొన్నవారు కారు.

రంగ. - [ఆత్మగతము] ఆహాహా ! ప్రయోగము విషమువలె ఎట్లు ఎక్కి పోయినది ! [ప్రకాశము] మఱి ?

హసేనాలి. - "అది యెల్ల నటుండ -

(ఉత్సాహ)-

              నేము వచ్చి కాచి యుండ, నీకు లెక్క లేదోకో ?
              దీమసాన నౌభ తడిచి ధిక్కరింతువా మమున్ ?
              హాము మాని, యీక్షణాన నాఁపి దాని, నీగడిన్
              జాములోన ఖాలి సేసి, సాగు కట్టువల్వతోన్, ౩౭

ఇట్లు చేయనిపక్షమున మరల సూర్యుఁ డుదయించులోపల, మీపుట్టకోటను మట్టిలో కలిపి, మీజాతము నెల్ల రూపుమాపెదము." ఇ దయ్యా తమకు హైదరుజంగు బహద్దరువారు పంపిన రాయబారము. మేము వచ్చినపని అయినది, మఱి మేము మరలెదము.

రంగ. - అయ్యా ! మామాటయు కొంచెమువిని మరలుఁడు.

          ఆ. సత్యవంతు లెపుడు సత్యదూరులఁగూడ
              సత్యవంతు లనుచు సమ్మతింత్రు;
              సత్యదూరు లన్న సత్యవంతులఁ గూడ
              సత్యదూరు లనుచు సంశయింత్రు ౩౮

హసేనాలి. - వాస్తవము. పార్సీలోఅట్లే యొక సామెత కలదు. దానికి తెలుగు -"కల్లరి కందఱు కల్లరులే, నిజమరి కందఱు నిజమరులే."

రంగా. - వీరులరు మీరు సత్యదూరులరు కానేరరు. మఱియు వివేకులకు విస్తరమనపేక్షితము కావున సంగ్రహముగా వాక్రుడ్చెద.

హసేనాలి. - అట్లే చేయుఁడు.

రంగ. - మీరు తెచ్చినరాయబారములో అసత్యవాదము విశేషముగా నున్నది. మేము, విజయరామరాజు భూములలో అడుగుపెట్టలేదు. అతఁడు మమ్ము రూపుమాపను, మాబొబ్బిలి యేలను; దలఁచుకొన్నవాఁడై యెన్ని మాఱులైనను మాతో పోరియున్నాఁడు. మేము, ఓడనందున, మామీఁద మీహైదరుజంగుగారికడ కుట్రచేసి, మాయింటిమీఁదికి ముట్టడి తెచ్చినాఁడు. నిన్న పగలు మాయింట పెండిం డ్లయినవి. రాత్రి ఊరేఁగింపు అయినది. కంకణాలువిప్ప లేదు. ఈసమయ మెఱిఁగి మామీఁదికి ముట్టడి తెచ్చినాఁడు.

హసేనాలి. - [ఆత్మగతము] నృశంసుఁడు! [ప్రకాశము] మఱి ?

రంగ. - మమ్ము కోట వదలి పొ మ్మనుట చూడఁగా, మాజమీనును తనకు ఖరారు చేయించుకొన్నాఁ డని తలంపనై యున్నది. అది యుండుఁగాక ! ఎన్నిమాఱులో మమ్ము సఖ్యార్థ మని బేటికిరావించుకొని సంఘాతసంహారము గావింప సమకట్టినాఁడు. దానంజేసి, అతనికిని మాకును, జాబులు జవాబులు కూడ నిలిచిపోయినవి. కావున వారివలన మీరాక మాకు తెలియ దాయెను. ప్రత్యేకము మీకడనుండి మాకు జాబు రాలేదు.

హసేనాలి. - [ఆత్మగతము] అతఁడుమా ఫర్మానా వీరికి అందనీకుండ హరించినాఁడా? ఆహా! ఆ హర్కారాలదంతయు వట్టినాటకముగా నగపడుచున్నది. ఏ మాశ్చర్యము ! [ప్రకాశము] కానిండు.

రంగ. - ఈకారణముచే మేము మీబేటికి రాజమహేంద్రవరమునకు రామైతిమి. ఎప్పుడును, నౌకర్ల బేటికి మేము రా మని పలికిన వారము గాము. మా తెలుపుకొనుట ఏమనఁగా?

          క. నైజామువారి కట్నము
               హజీ లేడేండ్ల కైనయది చెల్లింతున్

       మీరాక తెలియమియే హేతు వైనను, మేము మీబేటికి రానందులకై, -

              రాజమహేంద్రవరము మొద
              లోజన్ బ్రతిమజిలి కిత్తు నొకవేయివరాల్. ౩౯

మఱియు: -

         క. శస్తము లయినవి గాఁగన్
              రస్తుల నెంతైన సరఫరా గావింతున్;
              హస్తులనున్ హయములనున్
              బిస్తీలను దోలి పంపి ప్రియ మొనరింతున్. ౪౦

         క. నౌబత్తు మేము మానము;
              నౌబత్తును మాకు ఢిల్లినాథుఁ డొసంగెన్
              ఈ బసను మేము విడి పో;
              మీ బస నిర్మించికొంటి మేము వసింపన్. ౪౧

రాయబారము వచ్చిన గొప్పవారికి, మీకు మావాస్తవస్థితి విశదపఱిచితిమి. గోలకొండనిజాముగారికి మామీఁద ఆయాసము కలుగకుండునట్లు హైదరుజంగునకు సత్పక్షా వలంబము నేర్పుట, వీరులకు మీకు ఉచితము. వినునేని ఎల్లవారికి క్షేమము. వినఁడేని మేము యుద్ధమునకు సిద్ధముగా నున్నాము. ఏది యెట్లయినను, ఈయడావిడిలో తప్పని దొక్కటికలదు; అది విజయరాముని మరణము.

హసేనాలి. - రాయనింగారు చిత్తగింప వలయి విజయరామరా జే మయిన నగును గాక, మీబొబ్బిలి మా కేల?

          ఆ. నిజము మింటి నడిమి నీరజాప్తుని భంగి
              మబ్బు *[1] డాఁచుమాత్ర మాసిపోదు;
              కల్ల పూఁతపసిఁడిగతి మెఱుం గగుఁగాక,
              యొరసి చూచినంత విరిసిపోవు. ౪౨

నన్ను తమరు ఇంతగొప్ప చేసి ఇంత విశదముగా సకలవృత్తాంతములను సెలవిచ్చితిరి. గావున, నేను మీకు కేవలము అపరిచితుఁడ నైనను మీసౌజన్యమందు పక్షపాతినై హైదరుజంగుం గూర్చిన నాయెఱుకం బురస్కరించుకొని తమకు హితైషినై చెప్పెద. హైదరుజంగు మహామూర్ఖుడు; తప్పైనను, ఒప్పైనను, పట్టినపట్టు వదలఁడు. మీరు నౌబత్తు నిలిపి జాముసేపు కోటవెలుపల నుండినం జాలును; వానిదురాగ్రహము తీఱును. నేను మీన్యాయమును మాసర్వాధికారికి బుస్సీదొరకు తెలిపి మిమ్ము మరల కోటలో ప్రవేశపెట్టెద. యుద్ధమేల ! లక్ష డెబ్బదివేలతో పిడికెఁడుమందికి ఎంతవీరులకైనను పోరాట మననేమి?

          సీ. లక్ష డెబ్బది వేల లష్కరుతోఁ బోరు
                  పిడికెఁడు మందికి బెడద గాదె?
              బెడిదంపుఁ బిడుగు లేసెడు ఘనాఘన మైనఁ
                  బెనుగాలి కెదు రెక్కి పెనఁగఁగలదె?
              ఒక్కఫిరంగికిఁ దుక్కు దుమారమై
                  మట్టిలోఁ గలియదే పుట్టకోట?
              విండ్ఁలు జువ్వలు మందుగుండ్లను గెల్చునే?
                  యౌటుబారుల కెన యౌనె దోంట్లు?

          తే. ఎరగలిం బడు మిడుతల కీడు గాఁగఁ
                  దెలిసియును గొదగొని పోయి పొలియుటయును,
              బాలవృద్ధుల సతులఁ దుపానులోని
                   పిట్టలను జేఁతయును, వెఱ్ఱిపట్టు గాదె? ౪౩
      అయ్యా,
          క. అల వచ్చినఁ దల వంపుము,
              పులి వచ్చినఁ జెట్టు నెక్కు, పోయిన దిగుమా! ౪౪

అన వినలేదా ? తుపానులో మహావృక్షములు నిట్ట నిగిడి వే రూడును, తుంగ వంగియుండి అనంతరము తల యెత్తును. మీకు, ఇపుడు, పోరాటమునకు కాలము గాదు, పెండ్లియుత్సవము లింకను ముగియలేదు.

          ఆ. రేయి గూబ వచ్చి మాయించుఁ గాకిని;
              పగలు కాకి గూబఁ బట్టి చంపు;
              కాలబలము; దీని గణుతించి పోరెడు
              వీరుఁ డెల్లయెడల విజయ మొందు. ౪౫

కాలానుకూల్యమును చూడవలయును గదా ? ఇప్పుడు ఈయవాంతరమును, ఎట్లయినను దప్పించుకొని యనంతరము గోలకొండకు తెలుపుకొని యపరాధులను దండన చేయింప వచ్చును. కనుక, నన్ను మీతమ్మునిఁగా భావించి నాప్రథమప్రణయమునకు భంగము చేయక, అతఁడు కోరిన యారెండుపనులను చేయుఁడు. క్షణముసేపు --కారి వెళ్లితి మని తలంపుఁడు. రంగ.- సాహెబుగారూ; మీరు చెప్పిన దెల్ల మాహితము గోరినమాట గాని, మఱి వేఱుగాదు. మీ రెవరో మాకు అకారణబంధువు లనుటకు సందేహము లేదు. మీయుపదేశముయొక్క సారము, మాకు దాని యాదిలోనే తెలిసినది. మీతోడి సద్గోష్ఠిని సంక్షేపింప నొల్లక మీమాటలను అంతము వినుచుంటిమి. మీరు చెప్పిన నీతిపద్యము, మాకు వెలమకులమువారికి పాఠాంతరముగా నుపదిష్టము ఎటు లన -

           క. కలి వచ్చిన నడి గట్టుము,
              పులి వచ్చిన నీఁటెఁ బొడువు, పొలియుడు నొలుమీ;
              వెలమలతోఁ బోరాడకు;
              వెలమలసిరి కాసపడకు, విస మది నీకున్. ౪౬

       హసేనాలి. - రావుగారూ ! ఇది ఖడ్గమార్గము గాని కార్యమార్గము గాదు.
       రంగ. - అగుఁగాక.

(స్రగ్ధర.)

              ప్రాణంబు ల్తీపులౌ ద్రాబల కగునయముల్
                    భాయి, మా కేల నేర్పన్?
              ప్రాణం బన్నం దృణప్రాయ మగువెలమ వీ
                    రాళికిం గూర్ప వేలా?
              నాణెం జౌకప్ప మిత్తున్, నగరు వెలువడన్,
                    నౌబతు న్మాన; హైదర్
              నాణెంబు న్దప్పెనేనిన్ , నరహరి యొసఁగున్
                    నా కిహంబో పరంబో. ౪౭

సారమింతే, సాహెబ్ సలామ్. ఎంతటి పుణ్యము చేసిననోగదా రణమరణము దొరకును? [తమ్ముని నుద్దేశించి] తమ్ముఁడా ! సాయబుగారు మనయందు అకారణమైత్త్రి వహించి, చాలసేపు మనకు సాంగత్య మొసంగినారు; నీచేతులతో స్వయముగ వారిని సత్కరింపుము.

[నౌకర్లు అత్తరు పన్నీరు చందన తాంబూలములం దెచ్చి వెంగళరావుకడ నిలుతురు.

హసేనల్లీ. - అయ్యా ! మీకు కోపము వచ్చిన వచ్చునుగాక ! నాకుఁ దోచిన మాట పలికి పోయెదను. నాకు మీ పరువు వెఱ్ఱిగా నగపడుచున్నది. మీ బీరము ఏనుఁగు తనతలను తానే మన్నుకొట్టుకొనున ట్లున్నది ! అయ్యా,

          క. మీకు శుభమేని రణమృతి,
             మీకులపాలికలు కూళ మ్లేచ్ఛులపా లై
             చీకా కగుటయు శుభమా ?
             యీ కానిమతంబు మానుమీ వెఱ్ఱిదొరా. ౪౮
                                      [వెలమదొరలు ఉగ్రముగా చూతురు.
        రం. - హసేనాలీభాయి, వేయేల ?
          క. మాకులము సతులు పుణ్య
             శ్లోకలు, తముఁ జూచు పాలసులపాలిటికిన్
             భీకర దర్వీకర దం
             ష్ట్రాకర విషవహ్ని కీల లని వినవె సఖా. ౪౯
                                       [వెంగళ్రావు సా హెబును సత్కరించును.
        రంగ. - సలాము హసేనల్లీ బహద్దరుగారికి.
        హసేనాలి. - మఱి ఇఁక నేమి చేయవచ్చును! సలాము వెఱ్ఱి జమీన్దారుగారికి.
        రంగ. - తమ్ముఁడా ! వారిని సాగనంపి రా !
        వెంగ. - అన్న గారి చిత్తము. [హేసేనాలీ వెంగళ్రావు నిష్క్రమింతురు.
        రంగ. - ఎవరోయి అక్కడ?
        ప్రతీహారి. - (ప్రవేశించి) ఏలినవారియాజ్ఞను శెలవియ్యవలెను.
        రంగ. - మాజోస్యులవారు ఈక్షణము దర్శనము ఇప్పింపవలయును.
        ప్రతీ. - ఏలినవారియాజ్ఞ. [అని నిష్క్రమించును.
        రంగ. - [సభ్యులనుగూర్చి] అయ్యా! మనమును మనమీఁద తప్పు లేకుండుటకై రాయబారము పంపవలదా?
        సభ్యులు. - అవశ్యము పంపవలయును

రంగ. - ధర్మారాయఁడా మాబావగారిని పాపయ్యను పంపవలసినపనికి నిన్ను పంపుచున్నాను. మీయక్కగారిని మాకు రాణిగా మీతండ్రిగారు వివాహము చేసినపుడు అరణముగా నీప్రాణమును నీవే ఇచ్చుకొంటివి. ఇంతకాలము మాకు దివానవై మాకు సకలవైభవములం గూర్చుటయే గాక, విజయనగరమువానిని మాజమీనువైపు కన్నెత్తి చూడకుండ చేసితివి. నీ కన్న మా పరువును, మాభాగ్యమును, కాపాడువాఁడు మఱెవ్వఁడు కలఁడు ? కావున, నీవు పరాసుదొరకడ కేఁగి, హసేనాలీతో మేము పలికిన విధమునకు వెలితి రాకుండ, నీమతివిభవముప్రకారము, కాయయో పండో, ఏర్పరించు కొని రావలయును. పైక మెంత యడిగినను, గోలకొండసర్కారునకు, అంగీకరింపుము. లంచ మడిగిన తమలపాకుతొడిమ నైనను ఒప్పుకొనకుము.

ధర్మా. - రాజేంద్రా! పాపయ్యగారు చేయవలసినపనికి నన్ను పంపితి మని తామే అనుగ్రహించితిరి గదా ; అంతకన్న వేఱు గౌరవము నాకుం గలదా ? కార్యము పండే అగునట్లు ఎంతయేని మెలఁకువతో వ్యవహరింతునుగాని, వారు తూలఁబలికిన, వెలమపోటు రుచిచూపి వచ్చెదను. అది సమ్మతమయిన నన్నుం బంపుఁడు.

రంగ. - మాకు అదే కావలసినది. కనుక నీవే వెళ్లిరావలసినది. మఱి లేచి, నూటికి సిబ్బందిని వెంటఁగొని, సంధికి పోవుటగా, తెల్లజెండాతో తెల్లతొడుగులతో, పడవాలురామయ్య సహాయుఁడుగా, పోయి రమ్ము.

ధర్మా. - ఏలినవారియాజ్ఞ. [అని నిష్క్రమించును.

[అంతట వెంగళ్రావు ప్రవేశించును.

రంగ. - తమ్ముఁడా, హసానలీ కోపముతోనే పోయినాఁడా?

వెంగ. - అన్నయ్యగారికి ఏమని మనవి చేయుదును అతని పరితాపమును ! కడపట నాచేతులు పట్టుకొని, 'అయ్యా, నౌభత్తు అయినను మాన్పుఁడు. దానిం దెలిసి మీ సౌమ్యతనే చెప్పి, మీవెఱ్ఱి చెప్పక, కోట ఖాలీ చేయవల దని జాములోపల మీకు బూసీదొరవారికడనుండి కబురు పంపఁ గడం గెద.' అని చెప్పినాఁడు.

రంగ. - నీ వేమంటివి తమ్ముఁడా?

వెంగ. - మీ రన్న మాటయే అంటిని.

రంగ. - అంతట?

వెంగ. - అంతట దీనతతో సలాము లిడి వీడుకోలు వడసినాడు.

సభ్యులు. - ఇతఁడు మిక్కిలి సౌమ్యుఁడు, మిక్కిలి సజ్జనుఁడు; తురకలలో తప్పఁ బుట్టినాఁడు. ఇతడు ముందు పోయి మనలనుగూర్చి మంచిమాట చెప్పుట మంచిదే.

రంగ. - అవును. [సభంగాంచి] ఏఁ డయ్యా మాకరణము రామయ్య?

రామయ్య. - [లేచి] అయ్యా! ఉన్నాను.

రంగ. - మేము వ్రాసినట్లుగా పాపయ్యకు జాబు వ్రాసి తెమ్ము.

రామయ్య. - ఏలినవారి చిత్తము. [అని నిష్క్రమించును.

రంగ. - [వెంగళరావు నుద్దేశించి] తమ్ముఁడా, నీకు నేను పెట్టెడుపనికి నామీఁద కోపము చేయకుము. నీ వయిన మిగిలియున్న విజయరాముని వంశమునకుఁ గానీక, మరల బొబ్బిలిని, మనవంశములోనే నిలుపుదువు. నాతోగూఁడ నీవును పోర సమసిన, నిఁక భూమిలో మన పే రెక్కడిది ? కనుక నీవు మనస్త్రీలను పరాసుల చేఁతబడి యవమానపడకుండ, వలస తీసికొని పాలకొండ మన్నెమున కేఁగుము.

[వెంగళ్రావు భ్రాంతుడై దిగులుపడి రంగారాయని చూచును.]

రంగ. - ఏమి లేవవు? ఎప్పుడును నా నోటిలోని మాట నా నోట నుండఁ గానే పని నెఱవేర్చువాఁడవు. ఇంతవరకు యుద్ధములో నెప్పుడును ముందుమొన నడపించినవాఁడవు. ఇపుడు వెనుకకు పంపినందులకు నాపై కోపమా ? సమయమట్టిదిగా నున్నది? ఈజన్మములో నంత ఈదినమున ఉందుమో ఉండమో ? ఇట్టి సమయములో నాయాజ్ఞ నెఱవేర్ప త్వరపడ వేమి ?

వెంగ. - హా ! కొజ్జాలు చేయవలసినపనియా నాకు సంభవించినది ! ఏమి యీ దైవవిలాసము !

రంగ. - హా ! ఎట్టికాలము వచ్చినది !

వెంగ. - అన్నయ్యగారూ, రాణివాసములను తరల్చి మరలి తమ దర్శనము చేసి కొనియెద. వారితో వేఱొకరిం బంపవలయును.

[అని నిష్క్రమించును.]

రామయ్య. - [ప్రవేశించి] ఇదిగో జాబు ; రెండు నకళ్లు వ్రాసి తెచ్చితిని.

రంగ. - చదువు రామయ్యా చదువు.

రామయ్య. - [చదువును]

"స్వస్తి శ్రీ బొబ్బిలి నేలు రావు గోపాలకృష్ణ రంగారావు బహద్దరువారు, మా బావగారికి, తాండ్ర పాపారాయనివారికి, కడపటి దండములు మ్రొక్కివ్రాయుట. - విజయరామరాజు రాజాము సీమలో పితూరీలు చేయించుట మిమ్ము వెంగళరాయని పెండ్లికి రానీయకుండుటకోస మని మోసపోయితిమి. అందులకు కానే కాదయ్యా. బొబ్బిలిని ఱెక్కలులేని పిట్టను జేసి చిదుగఁగొట్టుటకు, అని యెఱుఁగమైతిమి. ఇప్పుడు తెలిసినది. మఱే మున్నది బావా ! రాజు మనయింటిమీఁదికి గోలకొండ పరాసు పౌఁజును ముట్టడి దెచ్చినాఁడు. రెండు లక్షలకు కాకిమూఁక పరాసుమూఁక కమ్ముకొని యున్నది. రాత్రి దొంగప్రొద్దున దొంగతనముగా ముట్టడివేసినారు. వేగుప్రొద్దునఫిరంగి వేట్లు వేసి తెలిపినారు. గడియకో అఱగడియకో ఫిరంగివాతను బొబ్బిలిని వేసికొందురు. మేము పాపకారి పెండిండ్లు చేసితిమి. కోటలోపల చుట్టాలు వచ్చి నిండియున్నారు. స్త్రీలను కోటలో నుంచి, జగడ మాడుట సరిగాదు. మాకు కోటలోపల రస్తు లేదు. వలసలు తరలుటకు త్రోవలు లేవు. బావా, వెంగళ్రాయఁడు ఇంకను, కంకణాల చేతులతోనే యున్నాఁడు. మా కందఱకు సంఘాతమరణము సిద్ధమైన దయ్యా. పెద్దలనాఁటి బొబ్బిలికోటకు మాకు ఋణము చెల్లినది. ఇక్కడ స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు అందఱు నీ పేరు పల్కు చు, అంగలార్చు చున్నారు. నీవు వచ్చిన, మాకు ఈ సంఘాతమరణము తప్పును. ఏడేడు పదునాలుగేండ్లకును బొబ్బిలికోటను ఆ యముఁడును పట్టలేఁడు; జయము కీర్తియు క్షేమమును కలుగును. నీవు రాకున్న, రాజామునకు తరలిననాఁటి చూపులే నీకును నాకును కడసారి చూపులు సుమా ! పెండ్లికి రా వైతి వని చింతిల్లుచుంటిని. ప్రాణము గావ రావేని చెప్పవలయునా? ఈజాబు చూచిన తత్క్షణము, బావా, రాజామునకు బొబ్బిలికి సందున విజయరామరాజు దండు విడిసి యున్నాఁడు, అతని దండును విఱుగఁబొడుచుకొని కోటకు రావయ్యా. ఇన్నూటి తో వెంగళరాయని నీకు ఎదురు పంపెదను. నీకోసము దిడ్డితలుపు తీసి యుంచెదము. నీవును మిరియాలసీతన్నయు, మాలపల్లిమీఁదుగా, కొండబోటు తిరిగి, ఆదారిలో హైదరుజంగుడేరా యున్నది, ఆహైదరుజంగును విడిదిలలో నఱకి, రావలయును. ఈరాత్రి వత్తువేని, నీకును నాకును చూపు లుండును. ఇవే బావా ; నాకడసారి దండములు.-

ధాతు - ఫాల్గున - శు. 3 సోమవారము.

రంగ. - దివ్యముగా వ్రాసితివి. మేమే చెప్పిన ఇంత చక్కఁగా కుదరదు. ఇదిగో మొహరు.

[అని యుంగరము తీసి రామయ్య చేతి కిచ్చును.

[రామయ్య మొహరు వేసి, మొహరు రంగారావుచేతి కందిచ్చును.

రంగ. - ఈజాబులు పగతురచేతఁ బడకుండ పాపయ్యకు ఎట్లు చేరఁగలవు?

రామయ్య. - మహాప్రభూ, నేను వెళ్లి ఆసంవిధానము చేసెదను.

రంగ. - మంచిది పోయి అట్లే చేయుము.

[రామయ్య నిష్క్రమించును.

ప్రతీహారి. - [ప్రవేశించి,] జయము జయము ఏలినవారికి ? మహాప్రభో, జోస్యుల వారు కాశీకి వెళ్లినారు ; వారి సిషువుడు ఏలినవారి సభకు రాను భయపడి [అని వ్ఁరాతయొకటి రంగారాయని మ్రోల నిడి,] ఈరాత తన గురువుగారు ప్రశ్నవస్తే యేలినవారికి అందించమని తనచేతి కిచ్చి వెళ్లినా రని యిచ్చినాడు.

రంగ. - [కైకొని, ఇట్లు చదువుకొనును.]

       *[2]మ. అమృతాహారులసంగడి న్వలచి కాయంబూడ్చి స్వర్వాటికిన్
              గమనించున్ సకళత్రబంధుసచివాక్రందప్రయోధంబుగా
              సమదారాతి చమూ మహోదధి నగస్త్యక్రీడఁబెంపొంది రం
              గమహీనాథుఁడు ధాతుఫాల్గునవలక్షన్ దుర్యవేఁబ్రొద్దునన్. ౫౦

[ఆత్మగతము] హా ! ఇందువలననే వారు నాకుం జెప్పక యేఁగినారు. హా ! ఇట్టి వ్రాఁత బ్రహ్మవ్రాసియుండఁగా నరుఁ డేమి సేయగలఁడు ? హాహాహా ! పుట్టలోని యిసుళ్ల నన్నిటిని కిరాతుఁడు పట్టినట్లు కోటలోని మాజాలమునంతయు ఒక్క మొగిని పట్టినాఁడు, విజయరాముఁడో, యముఁడో ! ఈ జోస్యము చూడఁగా, జాబు పాపయ్యకు చేరదు, రాణివాసముల వలసయు జరుగదు, రాయబారంబును ఫలింపదు.

వెంగ. - [ప్రవేశించి] విన్నపము. తమయాజ్ఞను తెలుపఁగానే, రాణిగారికి, చాల కోపము వచ్చినది. జవాబు చెప్పుటకు వారే తమకడకు, అదె వచ్చినారు.

వేంకటలక్ష్మి. - [అపటీక్షేపముగా బ్రవేశించి] జయజయం ఏలినవారికి. దేవి గారు వచ్చియున్నారు.

[అంతట కూఁతునుం గొమరునిం దోడ్కొని రాణి ప్రవేశించును.]

రంగ. - (సంభ్రాంతుఁడై) ఏమి యిది ; స్త్రీలు ఆస్థానికి వచ్చుటా? ఎన్నఁడైన కలదా? ఇ దేమి సాహసము ! ఏమి యీదురాచారము ! మతిపోయినదా ? ఘోషా ఏ మయినది ?

[సభ్యులు మొగమొగంబులు సూచుకొని తటాలున నిష్క్రమింతురు.]

రాణి. - ఇంటికప్పు తెగఁ గాలి, నెత్తిమీఁద పడుచుండఁగా, నిఁక నేమి ఘోషా ? ఇంతకాలమునకు పూసపాటిరాజు నన్ను రచ్చ కెక్కించి, తమతో తెగువ మాట లాడించినాఁడు. ఇన్నాళ్లకు మీ కేమి వెలమబుద్ధి పోయి రాచబుద్ధి వచ్చినది ! మమ్ము నందఱను పాలకొండకు వలస పంపిన, ఆపాలకొండకు ఆణిదారుఁడు గదా ఆపూసపాటిరాజు, అతఁడు లోలోపల, దండు పంపఁడా మామీదికి అక్కడికి? సిపాయి కొక్క వెలమస్త్రీని గట్టఁడా విజయరామరాజు ? పరులచేత చచ్చుటకు మా కేమి కారణము? మీ రేమి ఏలినను, అనంతకాలము రాజ్యము లేలెదరా? యుగములు జగములు గలంత కాలము భూమి పాలించెదరా ? చచ్చిన పేరు బ్రతికిన లేదు. మీరు చావను మేము బ్రతుకను ఆలోచించితిరా? చచ్చినను మేము కోటలో చావవలయును గాని, పరులచేత మేము చావము.

రంగ. - ఈమాట మాతమ్మునిచేత చెప్పి పంప రాదా ? స్వయముగా ఏల రావలయును ?

రాణి. - ఏల యనఁగా, ఈబిడ్డలను మీయొడిలో ఉంచి వారికి మీకు కడసారి చూపు లందిచ్చుటకు తెచ్చితిని. (అని కొమారితను తండ్రి ప్రక్కను నిలిపి) రావమ్మా! సుందరమ్మా ! మీనాయనను, కడసారి చూపు చూచుకోవమ్మా. (పుత్రునింగూర్చి) నాకొండా ! మీనాయనగారియొడిలోఁ గూర్చుండుము.

[అని పుత్త్రుని రంగరాయని యొడిలో కూర్చుండఁబెట్టును.

రంగ. - రావమ్మా అమ్మా, అమ్మా రా. కడసారిచూపా యిది ? [అని కూఁతును కవుంగిలించి, ముద్దుగొని] ఇవే అమ్మా మేము నీ కిచ్చిన సారెచీరలు! (శిశువును లాలించుచు)

          ఉ. నాయన, నీదు నెన్నొసట నల్వ లిఖించెను మాకుఁ గాలకూ
              టాయిత మౌ దురంతము హఠంబునఁ ; బున్నెము లిట్టు లుండ, మా
              నాయనసాటి వౌదు వని నమ్మితి నా చిఱువూప; యౌర సీ
              పాయికొ రాచపాదలికొ బానిస వౌదువె రావువంశజా? ౫౧

బాబూ, పూసపాటిరాజునకు ఏమియూడిగము చేయుదువో తండ్రీ ! ఇందులకా నీవు బ్రతుకుట? [అని ముద్దుగొని కత్తిదూసి నఱకఁబోవును.'

సుందరమ్మ. - (కనులు మూఁతబడి) 'బాబయ్యా ; పాపయ్యా.' [అని తండ్రి కాళ్లు పట్టుకొనును.

రాణి. - (కత్తి పట్టుకొని) ఏమి ! వెలమదొర లిట్లు వెఱ్ఱిదొర లైతిరి ! ఆకూనయే గదా విజయనగరముమీఁద మీపగ తీర్చుకోవలసినవాఁడు ? ఆతనిని మాచెల్లెలు జగ్గమ్మ కడకు సామర్లకోటకు పంపఁదగును. వానివలన మరల మీవంశము, ఆ సూర్యచంద్రు లున్నంత కాలము, వర్థిల్లును; వానిని కాదు మీరు నఱకవలసినది. శత్రువులకంటఁ బడకుండ వెలమరాణులను మమ్ము నఱకవలసినది.

రంగ. - చక్కఁగా జెప్పితివి; మెడచాఁపు. [రాణి రంగారాయని పాదములకు ప్రణమిల్లి మెడ చాఁచును. రంగ. నఱక సుంకించును.

సుందరమ్మ. - [తండ్రికాళ్లను చుట్టుకొని] అయ్యో ! బాబూ ! బాబూ !

[అని అంగలార్చును. శిశువు కత్తి కడ్డముగా తల్లిమెడను కౌఁగిలించుకొనును.]

వెంగ. - ఇప్పుడేల అన్నగారూ ? ఇంకను సమయ మున్నది. అంతకు వచ్చినప్పుడు చూచుకొందము.

రంగ. - అటయిన మీరు మువ్వురు సెలవు పుచ్చుకొండు.

[రాణియు, బాలుఁడు, సుందరమ్మయు, వేంకటలక్ష్మియు నిష్క్రమింతురు.

[సభ్యులు ప్రవేశింతురు.]

రంగ. - నేను అనుకొన్నట్లే అయినది. రాణివాసములవలస జరుగదాయెను. మఱి మా వంశపరంపరగా మాదొరతనమును కాపాడుచు వచ్చిన దళవాయులారా.

[నేపథ్యమున.]

ఏలినవారు కొలువుతీరియే యున్నారా ? ఉన్నారు ప్రభో.

[అంతట ధర్మారావు, నెత్తుటం దోఁగుచుఁ బ్రవేశించును]

[అందఱు సంభ్రాంతులై కందురు.]

ధర్మారావు. - దండములు బావగారికి, దామర్ల ధర్మయ్యను తమయానతి నెఱవేర్చి వచ్చినాఁడను.

రంగ. - మేము సంధి కని తెల్లయుడుపుతో పొమ్మనఁగా నీరు ఎఱ్ఱయుడుపుతో నేల పోయితిరయ్యా.

ధర్మా. - ఇది తెల్ల దుస్తే; పరాసుల నెత్తుటిలో నెఱ్ఱ నైనది.

రంగ. - కూర్చుండుము. ఏమి? ఏ మయిన దచ్చట? వివరముగా చెప్పుము.

ధర్మా. - (కూర్చుండి) మేము గోపాలస్వామిని సేవించి, మ్రొక్కులు ముడుపులు గావించి, పోయి, బుస్సీకచ్చేరికి తెలుపుకొని చొచ్చితిమి. చొరఁగానే, విజయరామరాజు, ఆకచ్చేరిలో నున్నవాఁడు, నన్నుఁ జూచి, చివుక్కున లేచి, హైదరును కన్నుగీటి తోడ్కొనిపోయి, తనవ్రేలియుంగర మొకటి అతనివ్రేల నుంచి, చెవిలో ఏమియోచెప్పి, చేతిలో చేయు వేయించుకొని పోయినాఁడు. 'సంధి పొసఁగనీయకు' 'ఎంతమాత్రము పొసఁగనీయను' అన్న మాటలుగా, పెదవుల కదలికచేత తెలిసినది.

రంగ. - అంతట ? అంతట?

ధర్మా. - అంతట, - బూసీ కొలువులో లేఁడు. సర్దారులు ఇతరులును, ఇరువది నలుగురు ఉండిరి. హైదరు తనతావునకు అరుదెంచెను. నేను, 'సలాము' అనఁగానే, హైదరుజంగు దెబ్బదిన్న పామువలె, నామీఁదికి ఎగిరి - ఏమి నీ పాళెగానికి దివాణ మన్న లక్ష్యము లేదా? నౌబత్తు మానఁడు, కోట వదలఁడు, తాను బేటికిరాఁడు; తన నౌకరును నిన్నుఁ బంపినాఁడు, మాకడకు ? చూడు; కన్ను మూసి కన్ను తెఱచులోపల నీపాళెగానికోట ధూళిధూళిగా ఎగురఁగొట్టి, మిమ్ముల నందఱను మహమ్మాయి చేయించెద.' అని బొబ్బరించి, నౌభత్తు నిలిచిననే గాని మాకు వేఱు కార్యము వినంబడదు? అట్లనిపోయి మీవేఁటకానితో చెప్పుకో.' అన్నాఁడు.

రంగ. - అంతట?

ధర్మా. - అంతట, నేను 'మాదొరను తూలనాడెదవా!' అని కత్తి దూయఁగానే, హైదరుజంగు గడగడ వణఁకి ఖానుల వెనుకకు దాఁటినాడు. ఖానులు, 'ఇటువంటివెల మలు కాఁగానే రాజునకు లోఁగరు' అని యొకరితో నొకరు అనుకొని, గలగల పలికి, లేచిరి. కొందఱు పోయి బుస్సీని దెచ్చిరి.

రంగ. - తర్వాత ? తర్వాత ?

ధర్మా. - బుస్సీ వచ్చి - 'అయ్యా, మీ రెంతశూరులయినను దివాణమునకు వచ్చి కత్తి దూయ వచ్చునా?' అని నన్ను అడిగెను. 'నేను శ్రీ బొబ్బిలిజమీన్దారు రంగారాయనింగారి దివాన నై రాయబారము వచ్చి, ఈహైదరునోట తూలుమాట మోయించెదనా?' అని నే నడిగితిని.

సభ్యులు. - బళి ! బళి !

ధర్మా. - అంతట, బుస్సీ 'మేము ఇంతచెంతకు వచ్చియుండఁగా నైన మీజమీన్దారు స్వయముగా మాబేటికి రాక, రాయబారము పంపుట యుచితమా?' అని యడిగినాఁడు.

రంగ. - సరి. అందులకు ?

ధర్మా. - అందులకు, సత్యమున హరిశ్చంద్రుఁడు, ఔదార్య సాహసముల విక్రమార్కుఁడు, విద్యలో భోజుఁడు, ఈవిలో కర్ణుఁడు, కోపమున రుద్రుఁడు, నగు మా దొరగారు మీబేటికి మర్యాదలలో హెచ్చుతక్కువలు కలుగు నేమో యనియే రాలేదు. గాని, వేఱొండు గాదు. అట్లు వారు శంకించుట సరియే యని నా కైన మర్యాద చేతనే తమకు విశద మాయెఁ గదా? ఇపుడు వారి కేమియు మరియాద లోపము చేయమని మీరు సెలవిత్తురేని, ఈ యుత్తరక్షణములో వారిని బేటికిం దెచ్చెద. వారిని కని వారితో క్షణము భాషించినచో, వారిమైత్త్రిని మీరు వదలరు. వారిపై కుట్ర చేయు వారిని జేర్పరు.' అని జవాబు పలికితిని.

రంగ. - అంతట?

ధర్మా. - అంతట, బుస్సీ - నన్నుఁ గూర్చుండు మని, తాను గూర్చుండి, నేనుం గూర్చుండి, ఇతరులుం గూర్చుండఁగా, నన్నుం గూర్చి, - 'పోనీ ! ఆమాట కేమి ? మీ న్యాయ మెల్ల హసేనల్లీవలనఁ దెలిసినది. మీరు రాజమహేంద్రవరమునకు మాబేటికి విదేశము రామికి, కారణము తెలిసినది. మీరు కట్టనొప్పుకొన్న యగావులవలన, అందులకు సమాధాన మైనది. మా దివానుమాట తప్పించుట మాకు శక్యముగాదు. అతనిని గోలకొండ నిజాముగారు స్వయముగా నియమించినారు. అతనిసలహాప్రకారము మేము వ్యవహరించునట్లుగా, మాకు హుకుము చేసినారు. కనుక, నౌభత్తుకోటల విషయమున మీరు లోఁబడనియెడల పోరు తప్పదు. లోఁబడిన, మీకు పాలకొండసీమను బొబ్బిలికి బదులుగా మే మిచ్చెదము. అందులకు మీరు అంగీకరించిన, పోరు తప్పి, మనము భాయి భాయిగా పోవచ్చును.' అని వక్కాణించెను. అంతట 'మీతో రాయబారము వలనఁ బ్రయోజనము లేదు.' అని నేను లేవఁగా, ఖానులు గీనులు, అందఱును, కనులెఱ్ఱఁ జేసికొని, కత్తి దూసికొని, 24 గురును నన్ను పొదివిరి. హైదరు నన్ను అడ్డగింపుఁడని పండ్రెండు పహరాలకును, పహరాలో పెట్టింపుఁ డని ఖానులకును, ఆజ్ఞచేసెను.

సభ్యులు. - ఏమి యాగడము !

రంగ. - అంత ?

ధర్మా. - అంత, 'నీపహరాలో నిలిచితినేని నేను వెలమబిడ్డనఁటరా?' అని కేక వేసి, -

[పంచచామరము]

              తటాలునన్ బటాలు దూసి తన్నుఁ గాచు సామునన్
              బటాన్ మొగల్ ఘటాఘటీలు భ్రాంతులై ననుం గనన్
              బటాలు ఱెక్క, లేఁ దిమిన్, సపత్న వార్ధి దూఁటి, బల్
              హుటాహుటిన్ హుమాపయిన్ దదుక్తిఁ జెప్ప వచ్చితిన్. ౫౨

నా పరిజనములును, బవ్వున ఈఁటెలు వంచి, అడ్డ మయిన సిపాయిమందల నెల్ల తెగఁబొడిచి, కూల్చుచు దారి చేసికొని, తమ పోటు రుచిచూచినవారు చూడని వారును, దిగులుపడి నిశ్చేష్టు లై పడుచు లేచుచు తమ్ముఁ గనుచునుండ, నావలెనే అక్షతశరీరులై నావెంటనే వచ్చియున్నారు. నేను జేసినపని తప్పో ఒప్పో తమరే ప్రమాణము.

రంగ. - ధర్మారాయఁడా ? మాపరువు నిలిపితివి. శత్రువులకు వెలమపోటు రుచి చూపించి, అక్షతశరీరుఁడ వై వచ్చి మాకు కనులపండువు గావించితిని. ఇంతకన్న ఒప్పేమి యుండును ? చాలును, అలసితివి. పోయి సేదదేఱుము.

ధర్మా. - మహాప్రసాదము.

[అని నిష్క్రమించును.]

రంగ. - [సభ్యుల నందఱ నుద్దేశించి] అయ్యా, ఇంక నే మున్నది ! పోరు పొసఁగినది.

           క. ఈసమయంబునఁ బాపయ
               మాసమ్ముఖమందు నున్న, మార్కండేయున్
               బాస టయి హరుడు గాచిన
               వాసిగ, మముఁ గావఁడే యవనయమువలనన్ ! ౫౩

[ఉత్సాహ.]

              గడియలోనఁ గోట నింకఁ గాడుసేయఁ బన్నుదుర్
              గడి ఫిరంగిమోహరాలు కందకంబు చుట్టు రాన్ ;
              కొడిని దివిచి పాదుసాహి కొడిని - (కాదా)
                            విజయరాము కొడిని - గొత్తళంబుపై
              నిడెడుకొఱకు లగ్గయెక్క నిడుదు రుడుపనిచ్చెనల్. ౫౪

          ఆ. అన్నలార, కూడియాడిన చెలులార,
              విందులార, వినుఁడు విన్నపంబు: -
              ఆలుబిడ్డలందు నానగొందురు మీరు,
              తల్లిఁ దండ్రి భక్తిఁ దన్పుచుంద్రు. ౫౫

          ఆ. ఇట్టిప్రళయమందుఁ గట్టు సేయము మిమ్ము,
              మమ్ముఁగూర్చి మీరు మ్రంద నేల ?
              మీర లిపుడె పోయి వారిఁ గాచికొనుండు;
              మాకు వచ్చె మారి, మమ్ము విడదు. ౫౬

       దళవాయులు. - మహాప్రభూ ! మాకొలిచిన వేలుపా ! [మానోద్రేకముతో]

              ఎంతమాట సెలవిచ్చినారు మ మ్మేలినదొరవారు !
              ఈఁటెకొక్క మొఖాసా తింటిమి యిందఱము మేము.
              ఏలినవారి యన్నముచేత నెదిగిన దీ యొడలు;
              ఏలినవారికి దీని నియ్యక యేఁగుదుమా మేము?
              మీరు పెట్టిన దండకడెములు మేము ధరించితిమి,
              మీ చేతుల మీ రిచ్చిన దుస్తులు మేము ధరించితిమి,
              పెద్దలనాఁటి నెత్తురుకోకలు పిలిచె మమ్ము రంగ,
              పరుల నల్ల రుచిగన్న పటాలు పైకిఁ ద్రుళ్లె రంగ.
              ప్రాణము మీరు, దేహము మేము, రావు రంగరాయ;
              ప్రాణముఁ బాసిన దేహము నెవరు బసలకు రానీరు.
              బంటు వెల్మలము మేమే గామా ? యొంటర్లము గామా ?

              బంటు గంటు తెలగాలము గామా ? యొంటర్లము గామా ?
              విలయము వచ్చిన సమయమునందు వెనుకకుఁ దగ్గుదుమా ?
              చచ్చిన పేరు, బ్రతికిన లేదు, సాహసాంక రంగ.
              మీ రణభేరి మ్రోఁగినప్పుడే మీకె యెఱుక గాదా ?
              గుభేల్ ! గు భేల్ ! గుభె ! లరులకు, మాకు
                      శుభము ! శుభము ! శుభము !
              ఫణులు ! ఫణులు ! ఫణు ! లరులకు, మాకు
                      మణులు ! మణులు ! మణులు !
              భయము ! భయము ! భయ ! మరులకు, మాకు
                      జయము ! జయము ! జయము !
              మీరు పోరను మేము నిలువను మీరు తలఁచినారా ?
              మీతోడిదె మాలోక మన్నది మీరు మఱచినారా ?
              అడ్డుమాటలు సెలవు లియ్యక యాదరించి మమ్ము,
              పనిగొనవయ్యా, పనిగొనవయ్యా, ప్రభువ రంగరాయా. ౫౭

[అని ప్రాంజలు లగుదురు.]

రంగ. - దళవాయులారా ! మీ యనురాగమునకు మిక్కిలి సంతోషము. అటయిన యుద్ధమునకు సన్నద్ధుల రగుఁడు. మహావీరులారా ! మీరు ఒక్కొక్కరును పగతురతో కలయఁబడుదు రేని నూర్లను వేలను రూపుమాపఁ గలవా రగుట లోకవిదితమే ! అయినను పరాసుమూఁక, అనంతముగా నున్నది. మీచేతులకు సయితము తఱుఁగునదిగా నగపడదు. సముద్రమునకు ఏతము వేయుటగా నున్నది. పైగా మనము ముఖ్యముగా ఊఁచతోను, ఈఁటెతోను, కూల్చువారము. వారు ముఖ్యముగా గుండుతోఁ గూల్తురు. మఱి వారి పాల నున్న నల్లమందు నూరమ్మతో పోరుట కష్టము. కోటకాపున, మాటుల నుండి మనము పోరితిమా, వారిగుండు మనపైఁ బాఱదు, మనయూఁచ వారినికూల్చును. నల్లమందు మారమ్మ మనమీఁదికి రాఁజాలదు. ఫిరంగులు మోర్జాచేసి కోటను గూల్పం గడంగుదురు. మీరు ఫిరంగివాని నెల్ల ఊఁచవాత వేయుదు రేని, వారి యాపని నెఱ వేఱదు. మనము బయటి కేఁగితిమా, వారు సులువుగా కోట పట్టుదురు. అనంతరము మనము రెండునిప్పులనడుమ మాడిపోవలసినదే. కోటలో నున్న ట్లయిన, నా నియమించు సేనావిన్యాసమును నెఱ వేర్పుఁడు. ఏమి ? నాయూహ సరిగా నున్నదా? దళ. - మిక్కిలి సరిగా నున్నది.

రంగ. - ఏమి ? పడవాలు రామయ్యా ?

పడవాలురామయ్య. - కోటలో పరాసులు చొచ్చినచో, మనయాఁడువారి దుర్గతి నూహింపఁగలమా? కోటనుండి, ఎంతమాత్రము మనము వెలువడంగూడదు. ఏలినవారియానతి సర్వోత్తమముగా నున్నది.

రంగ. - బేతాళుని బురుజుమీఁద, మాజెండాను నౌభత్తును కాపాడుట, ముత్యాల పాపయ్యవంతు ; 200 మంది సిబ్బంది.

ముత్యాలపాపయ్య. - మహాప్రభూ, దండములు. మహాప్రసాదము ! ఇప్పుడు నేను ఏలినవారి నౌకరను, ఇంతవరకు ధర్మానకు మీ యుప్పు తినుచుంటిని.

రంఁగ. - హనుమంతునిబురుజు మావెంగళరాయనివంతు; 200 మంది సిబ్బంది.

వెంగ. - మహాప్రసాదము ఇప్పుడుగదా నేను యువరాజను, ఏలినవారి తమ్ముఁడను.

రంగ. - కోమటి పేట బురుజు మాబావమఱది ధర్మారావువంతు; 200 సిబ్బంది. పడవాలురామయ్య బలిజెబురుజు; 200 సిబ్బంది.

ఓడ-రామ. - మహాప్రసాదము ! న న్నేలినదొరా !

రంగ. - కడమ 1200 కాల్బలము, 250 గుఱ్ఱమును చెలికాని వెంకయ్యక్రింద సిద్ధముగా నుండవలసినది. మఱి, మీరందఱు ఇండ్లకు వెళ్లి క్షణములో మీతావులు చేరవలసినది. ఇంతలోనే పరాసులఫిరంగులు వినఁబడెనా, ఆక్షణమే మీతావులకు పోవలసినది. మా ధర్మారావుతో ఆయనవంతునకు మే మిడిన తావును చెప్పవలసినది.

దళ. - ఏలినవారియాజ్ఞ.

రంగ. - ఊరిలో వారివారి యాత్మసంరక్షణ వారువారు చేసికోవలయుననియు, మావశము తప్పిన ప్రళయము వచ్చిన దనియు, చాటింపు చేయింపవలసినది.

పడ-రామ. - ఏలినవారియాజ్ఞ.

రంగ. - వారు ముందుమిగులవలసినదేగాని, మీరెవ్వరును ముందుమిగులకుఁడు. మఱి యిఁక ఏగడియకు నెవర మే మగుదుమో గావున, మాకును మీకును ఇదియే కడపటిచూపు. [అందఱు రంగారాయనిం జూతురు.

రంగ. - మఱి మనము తడయఁజనదు.

దళ. - జయ బొబ్బిలి రంగారాయ మహావీర! [అందఱును నిష్క్రమింతురు.


_____________
  1. * పా. గ్రమ్ముమాత్ర.
  2. * ఈపద్యము మదీయము. ఏతత్ స్థానమున ప్రథమముద్రణమందుండినట్టిది, మదీయము గాదు. వే. వేం.